37. ముప్పది ఏడవ అధ్యాయము

శిశుపాలుడు ధర్మజ శ్రీకృష్ణులను ఉపాలంభించుట.

శిశుపాల ఉవాచ
నాయమర్హతి వార్ష్ణేయః తిష్ఠత్స్వహ మహాత్మసు ।
మహీపతిషు కౌరవ్య రాజవత్ పార్థివార్హణమ్ ॥ 1
శిశుపాలుడిలా అన్నాడు - కౌరవ్యా! మహాత్ములైన భూపాలురిక్కడ ఉండగా వృష్ణివంశీయుడైన శ్రీకృష్ణుడు రాజువలె రాజగౌరవానికి అర్హుడు కాడు. (1)
నాయం యుక్తః సమాచారః పాండవేషు మహాత్మసు ।
యత్ కామాత్ పుండరీకాక్షం పాండువార్చితవానసి ॥ 2
బాలా యూయం న జానధ్వం ధర్మః సూక్ష్మో హి పాండవాః ।
అయం చ స్మృత్యతిక్రాంతః హ్యాపగేయోఽల్పదర్శనః ॥ 3
పాండుకుమారా! నీవు స్వార్థం వల్ల పుండరీకాక్షుని పూజించావు. మహాత్ములైన పాండవులకు ఇటువంటి ఆచరణ యుక్తం కాదు. పాండవులారా! మీరు బాలురు. ధర్మం సూక్ష్మమైంది. దాన్ని మీరెరుగరు. ఈ గాంగేయుడు జ్ఞాపకశక్తి నశించిన వృద్ధుడు. సూక్ష్మదృష్టి లోపించినవాడు. (2,3)
త్వాదృశో ధర్మయుక్తో హి కుర్వాణః ప్రియకామ్యయా ।
భవత్యభ్యధికం భీష్మ లోకేష్వవమతః సతామ్ ॥ 4
భీష్మా! నీవంటి ధర్మాత్ముడు ఎవరికో ప్రియం చేయగోరితే సత్పురుషుల మధ్యలో మిక్కిలి అవమానాన్ని పొందగలడు. (4)
కథం హ్యారాజా దాశార్హః మధ్యే సర్వమహీక్షితామ్ ।
అర్హణామర్హతి తథా యథా యుష్మాభిరర్చితః ॥ 5
ఈ భూపాలురందరి మధ్యలో రాజుకాని యదువంశీయుడైన ఈ కృష్ణుడు మీరు పూజించిన విధంగా రాజగౌరవానికి ఎలా అర్హుడౌతాడు? (5)
అథ వా మన్యసే కృష్ణం స్థవిరం కురుపుంగన ।
వసుదేవే స్థితే వృద్ధే కథమర్హతి తత్సుతః ॥ 6
కురుశ్రేష్ఠా! నీవు కృష్ణుని వృద్ధునిగా భావించినట్లయితే, వసుదేవుడుండగా, కృష్ణుడు వృద్ధుడెలా అవుతాడు ? (6)
అథ వా వాసుదేవోఽపి ప్రియకామోఽనువృత్తవాన్ ।
ద్రుపదే తిష్ఠతి కథమ్ మాధవోఽర్హతి పూజనమ్ ॥ 7
ఆచార్యం మన్యసే కృష్ణమ్ అథ వా కురునందన ।
ద్రోణే తిష్ఠతి వార్ష్ణేయం కస్మాదర్చితవానసి ॥ 8
అలాకాక, వాసుదేవుడు నీకు ప్రియమైతే, నిన్ను అనుసరించే మిత్రుడని నీవు భావిస్తే, అంతకంటె ముఖ్యుడైన ద్రుపదుడుండగా కృష్ణుడెలా పూజార్హుడౌతాడు?
కురునందనా! అలాకాక, కృష్ణుని ఆచార్యునిగా భావించినట్లయితే, ద్రోణాచార్యుడుండగా కృష్ణుని ఎలా అర్చించావు? (7,8)
ఋత్విజం మన్యసే కృష్ణమ్ అథ వా కురునందన ।
ద్వైపాయనే స్థితే వృద్ధే కథం కృష్ణోఽర్చితస్త్వయా ॥ 9
కురునందనా! కృష్ణుని ఋత్విజునిగా భావిస్తే వృద్ధుడైన వేదవ్యాసుడుండగా, నీవు కృష్ణుని ఎలా పూజించావు? (9)
భీష్మే శాంతనవే రాజన్ స్థితే పురుషసత్తమే ।
స్వచ్ఛందమృత్యుకే రాజన్ కథం కృష్ణోఽర్చితస్త్వయా ॥ 10
అశ్వత్థామ్ని స్థితే వీరే సర్వశాస్త్రవిశారదే ।
కథం కృష్ణస్త్వయా రాజన్ అర్చితః కురునందనః ॥ 11
రాజా! పురుషసత్తముడై, స్వచ్ఛందమరణం గల భీష్ముడుండగా నీవు కృష్ణుని ఎలా పూజించావు? కురునందనా! సర్వశాస్త్ర విశారదుడూ, వీరుడూ అశ్వత్థామ ఉండగా నీవు కృష్ణుని ఎలా పూజించావు? (10,11)
దుర్యోధనే చ రాజేంద్రే స్థితే పురుషసత్తమే ।
కృపే చ భారతాచార్యే కథం కృష్ణస్త్వయార్చితః ॥ 12
ద్రుమం కింపురుషాచార్యమ్ అతిక్రమ్య తథార్చితః ।
భీష్మకే చైవ దుర్ధర్షే పాండువత్ కృతలక్షణే ॥ 13
నృపే చ రుక్మిణి శ్రేష్ఠే ఏకలవ్యే తథైవ చ ।
శల్యే మద్రాధిపే చైవ కథం కృష్ణస్త్వయార్చితః ॥ 14
పురుషశ్రేష్ఠుడూ, రాజేంద్రుడూ అయిన దుర్యోధనుడుండగా, భరతవంశానికి ఆచార్యుడైన కృపుడూ ఉండగా కృష్ణుని ఎలా అర్చించావు? కింపురుషులకు ఆచార్యుడైన ద్రుముడుండగా కృష్ణుని ఎలా అర్చించావు? పాండురాజుతో సమానుడై జయింపశక్యం కాని రాజోచితలక్షణాలు గల భీష్మకుడుండగా; రాజైన రుక్మి, వీరశ్రేష్ఠుడైన ఏకలవ్యుడు, మద్రదేశాధిపుడైన శల్యుడు ఉండగా కృష్ణుని ఎలా అర్చించావు? (12-14)
అయం చ సర్వరాజ్ఞాం వై బలశ్లాఘీ మహాబలః ।
జామదగ్న్యస్య దయితః శిష్యో విప్రస్య భారత ॥ 15
యేనాత్మబలమాశ్రిత్య రాజానో యుధి నిర్జితాః ।
తం చ కర్ణమతిక్రమ్య కథం కృష్ణస్త్వయార్చితః ॥ 16
భారతా! రాజులందరిలో బలవంతుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడయిన పరశురాముని ప్రియశిష్యుడు, తనబలంతో యుద్ధంలో చాలామంది రాజులను జయించినవాడూ అయిన కర్ణుని అతిక్రమించి, ఈ కృష్ణుని ఎలా అర్చించావు? (15,16)
నైవర్త్విగ్ నైవ చాచార్యః న రాజా మధుసూదనః ।
అర్చితశ్చ కురుశ్రేష్ఠ కిమన్యత్ర్పియకామ్యయా ॥ 17
కురుశ్రేష్ఠా! మధుసూదనుడగు శ్రీకృష్ణుడు ఋత్విక్కు కాదు. ఆచార్యుడు కాదు. రాజూ కాదు. కాని నీవు ఏ ప్రియాన్ని కోరి అతనిని పూజించావు? (17)
అథ వాభ్యర్చనీయోఽయం యుష్మాకం మధుసూదనః ।
కిం రాజభిరిహానీతైః అవమానాయ భారత ॥ 18
భారతా! అయినా మీకు మధుసూదనుడు పూజింపదగినవాడే అయితే, రాజులను ఇక్కడకు ఆహ్వానించి అవమానించడమెందుకు? (18)
వయం తు న భయాదస్య కౌంతేయస్య మహాత్మనః ।
ప్రయచ్ఛామః కరాన్ సర్వే న లోభాన్న చ సాంత్వనాత్ ॥ 19
మహాత్ముడైన కుంతీకుమారుడైన యుధిష్ఠిరునికి మేము భయం వల్ల గాని, లోభం వల్ల గాని, సాంత్వనం వల్ల గాని పన్ను చెల్లించటం లేదు. (19)
అస్య ధర్మప్రవృత్తస్య పార్థివత్వం చికీర్షతః ।
కరానస్మై ప్రయచ్ఛామః సోఽయమస్మాన్ న మన్యతే ॥ 20
ధర్మప్రవృత్తి కల్గి, పార్థివునిగా పరిపాలన చేయగోరుతున్న ఇతనికి మేము పన్నులను చెల్లిస్తున్నాం. కాని అతడు మమ్మల్ని అలా గౌరవించటం లేదు. (20)
కిమన్యదవమానాదిః యదేనం రాజసంసది ।
అప్రాప్తలక్షణం కృష్ణమ్ అర్ఘ్యేణార్చితవానసి ॥ 21
ఈ రాజసభలో రాజలక్షణాలే లేని ఈ కృష్ణుని అర్ఘ్యంతో పూజించావు. ఇంతకంటె అవమానం ఇంకేముంటుంది? (21)
ఆకస్మాద్ ధర్మపుత్రస్య ధర్మాత్మేతి యశో గతమ్ ।
కో హి ధర్మచ్యుతే పూజామ్ ఏవం యుక్తాం నియోజయేత్ ॥ 22
అకారణంగా ధర్మరాజుకు ధర్మాత్ముడనే కీర్తి కలిగింది. కాకుంటే ధర్మచ్యుతుడైన కృష్ణునికి ఇటువంటి రాజార్హమైన గౌరవాన్ని ధర్మాత్ముడెవడు చేస్తాడు? (22)
యోఽయం వృష్ణికులే జాతః రాజానం హతవాన్ పురా ।
జరాసంధం మహాత్మానమ్ అన్యాయేన దురాత్మవాన్ ॥ 23
వృష్ణివంశీయుడై దురాత్ముడగు ఈ కృష్ణుడు మునుపు మహాత్ముడైన జరాసంధుని అన్యాయంగా చంపాడు. (23)
అద్య ధర్మాత్మతా చైవ వ్యపకృష్ణా యుధిష్ఠిరాత్ ।
దర్శితం కృపణత్వం చ కృష్ణేఽర్ఘ్యస్య నివేదనాత్ ॥ 24
ఈ యుధిష్ఠిరుడి నుండి ధర్మాత్మత దూరం చేయబడింది. కృష్ణునికి అర్ఘ్యాన్ని ఇవ్వడం ద్వారా తన కార్పణ్యాన్ని చూపెట్టాడు ధర్మరాజు. (24)
యది భీతాశ్చ కౌంతేయాః కృపణాశ్చ తపస్వినః ।
నను త్వయాపి బోద్ధవ్యం యాం పూజాం మాధవార్హసి ॥ 25
శిశుపాలుడు కృష్ణునికేసి తిరిగి ఇలా అన్నాడు - మాధవా! కుంతీకుమారులు భయపడినవారు, కృపణులు, దీనులూను.
నీవు ఎటువంటి పూజకు అర్హుడవో నీవైనా వారికి తెలియజెప్పవలసింది. (25)
అథ వా కృపణైరేతామ్ ఉపనీతాం జనార్దన ।
పూజామనర్హః కస్మాత్ త్వమభ్యనుజ్ఞాతవానపి ॥ 26
జనార్దనా! లేదా, కృపణులైన వారు తీసుకువచ్చిన (పూజను) గౌరవాన్ని అనర్హుడైన నీవు మాత్రం ఎలా అంగీకరించావు? (26)
అయుక్తామాత్మనః పూజాం త్వం పునర్బహు మన్యసే ।
హవిషః ప్రాప్య నిష్యందం ప్రాశితా శ్వేవ నిర్జనే ॥ 27
నీకు యోగ్యం కాని గౌరవాన్ని నీవు పొంది చాల గొప్పగా భావించుకొంటున్నావు కాబోలు! జనంలేని చోట కుక్క హవిస్సును ఆస్వాదించినట్లుగా ఉంది నీపని. (27)
న త్వయం పార్థివేంద్రాణామ్ అపమానః ప్రయుజ్యతే ।
త్వామేవ కురవో వ్యక్తం ప్రలంభంతే జనార్దన ॥ 28
జనార్దనా! నిన్నిలా గౌరవించడమ్ రాజేంద్రులకు ఏమీ అవమానం కాదు. కానీ కురువంశీయులైన పాండవులు నిన్నే స్పష్టంగా నిందిస్తున్నారు. (28)
క్లీబే దారక్రియా యాదృక్ అంధే వా రూపదర్శనమ్ ।
అరాజ్ఞో రాజవత్ పూజా తథా తే మధుసూదన ॥ 29
మధుసూదనా! నపుంసకుడికి వివాహం చేయడం ఎలాంటిదో, గుడ్డివాడికి రూపాన్ని చూపడం ఎటువంటిదో, రాజుకాని వాడికి రాజోచితమైన పూజ చేయడం కూడ అలాంటిదే. (29)
దృష్టో యుధిష్ఠిరో రాజా దృష్వా భీష్మశ్చ యాదృశః ।
వాసుదేవోఽప్యయం దృష్టః సర్వమేతద్ యథాతథమ్ ॥ 30
రాజైన యుధిష్ఠిరుడెటువంటివాడో చూశాను. భీష్ముడు ఎటువంటివాడో కూడ చూశాను. ఈ వాసుదేవుడెటువంటివాడో కూడా చూశాను. వాస్తవానికి వీరంతా ఇటువంటివారే. (30)
ఇత్యుక్త్వా శిశుపాలస్తాన్ ఉత్థాయ పరమాసనాత్ ।
నిర్యయౌ సదసస్తస్మాత్ సహితో రాజభిస్తదా ॥ 31
అని పలికి శిశుపాలుడు ఉన్నతాసనాల నుండి కొంతమంది రాజులతో పాటు లేచి సభాభవనం నుండి బయటకు వెళ్ళాడు. (31)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి అర్ఘాభిహరణపర్వణి శిశుపాలక్రోధే సప్తత్రింశోఽధ్యాయః ॥ 37 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున అర్ఘాభిహరణపర్వమను ఉపపర్వమున శిశుపాలక్రోధమను ముప్పది ఏడవ అధ్యాయము. (37)