46. నలువది ఆరవ అధ్యాయము

(ద్యూతపర్వము)

వ్యాసుని భవిష్యవాణి - యుధిష్ఠిరుని ప్రతిజ్ఞ.

వైశంపాయన ఉవాచ
సమాప్తే రాజసూయే తు క్రతుశ్రేష్ఠే సుదుర్లభే ।
శిష్యైః పరివృతో వ్యాసః పురస్తాత్ సమపద్యత ॥ 1
అతిదుర్లభమై, యజ్ఞాలలో శ్రేష్ఠమయిన రాజసూయయాగం పూర్తి అయిన పిదప వ్యాసమహర్షి శిష్యులతో కలిసి ధర్మజుని వద్దకు వచ్చాడు. (1)
సోఽభ్యయాదాసవాత్ తూర్ణమ్ భ్రాతృభిః పరివారితః ।
పాద్యేనాసనదానేన పితామహమపూజయత్ ॥ 2
అతడు వెంటనే ఆసనం నుండి లేచి తమ్ములతో కలిసి ఎదురేగి పాద్యం, ఆసనం సమర్పించి తాతగారిని పూజించాడు. (2)
వి॥సం॥ ఈ అధ్యాయం తెలుగు భారతంలో లేదు. పిపియస్ శాస్త్రి ప్రతిలో కూడ ఉంది. కాని వ్యాఖ్యాతలలో దేవబోధుడు వ్యాఖ్యానించలేదు.
అథోపవిశ్య భగవాన్ కాంచనే పరమాసనే ।
ఆస్యతామితి చోవాచ ధర్మరాజం యుధిష్ఠిరమ్ ॥ 3
ఆ పూజ్యుడు ఉత్కృష్టమయిన స్వర్ణసింహాసనం మీద ఆసీనుడయి, యుధిష్ఠిరుని కూర్చోమని చెప్పాడు. (3)
అథోపవిష్ణం రాజానం భ్రాతృభిః పరివారితమ్ ।
ఉవాచ భగవాన్ వ్యాసః తత్తద్వాక్యవిశారదః ॥ 4
తరువాత తమ్ములతో కలిసి కూర్చున్న రాజును ఉద్దేశించి మాటలలో నేర్పరి అయిన వ్యాసభగవానుడు ఇలా అన్నాడు. (4)
దిష్ట్యా వర్ధసి కౌంతేయ సామ్రాజ్యమ్ ప్రాప్య దుర్లభమ్ ।
వర్ధితాః కురవః సర్వే త్వయా కురుకులోద్వహ ॥ 5
కౌంతేయా! దుర్లభమయిన సామ్రాజ్యాన్ని పొంది అదృష్టం కొద్దీ వృద్ధిపొందుతున్నావు. కురుకులోద్ధారకా! కౌరవులందరినీ నీవు వృద్ధి పొందిస్తున్నావు. (5)
ఆపృచ్ఛే త్వాం గమిష్యామి పూజితోఽస్మి విశాంపతే ।
ఏవముక్తః స కృష్ణేన ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 6
అభివాద్యోపసంగృహ్య పితామహమథాబ్రవీత్ ।
"రాజా! నీవు నన్ను పూజించావు. ఇక నేను వెడతాను. నీ అనుమతిని కోరుతున్నాను" అని పల్కిన వ్యాసమహర్షికి నమస్కరించి పాదాలు పట్టుకొని ధర్మరాజు తాతగారితో ఇలా అన్నాడు. (6 1/2)
యుధిష్ఠిర ఉవాచ
సంశయో ద్విపదామ్ శ్రేష్ట మమోత్పన్నః సుదుర్లభః ॥ 7
తస్య నాన్యోఽస్తి వక్తావై త్వామృతే ద్విజపుంగవ ।
పురుషోత్తమా! నాకు గొప్ప సంశయం ఒకటి కలిగింది. ద్విజశ్రేష్ఠా! నీవు తప్ప దానికి సమాధానం చెప్పగలవారు వేరెవరూ లేరు. (7 1/2)
ఉత్పాతాంస్త్రివిధాన్ ప్రాహ నారదో భగవానృషిః ॥ 8
దివ్యాంశ్చైవాంతరిక్షాంశ్చ పార్థివాంశ్చ పితామహ ।
అపి చైద్యస్య పతవాన్ ఛన్నమౌత్పాతికం మహత్ ॥ 9
పితామహా! ఉత్పాతాలు దివ్యాలని (పిడుగుపాటు మొదలైనవి); ఆంతరిక్షాలని (ధూమకేతువు మొదలైనవి); పార్థివాలని (భూకంపాదులు) మూడు రకాలుగా ఉంటాయని నారదభగవానులవారు చెప్పారు. శిశుపాలుని మరణంతో ఆ ఉత్పాతాలు ఏమయినా శాంతించాయా? (8,9)
వైశంపాయన ఉవాచ
రాజ్ఞస్తు వచనం శ్రుత్వా పరాశరసుతః ప్రభుః ।
కృష్ణద్వైపాయనో వ్యాసః ఇదం వచనమబ్రవీత్ ॥ 10
వైశంపాయనుడు అన్నాడు - ధర్మరాజు మాట విని పరాశరసుతుడు, కృష్ణద్వైపాయనుడు అయిన వ్యాసుడు ఇలా అన్నాడు. (10)
త్రయోదశ సమా రాజన్ ఉత్పాతానాం ఫలం మహత్ ।
సర్వక్షత్రవినాశాయ భవిష్యతి విశాంపతే ॥ 11
రాజా! మహోత్పాతాల ఫలితం పదమూడేళ్లు ఉంటుంది. సర్వక్షత్రియ నాశనం జరుగుతుంది. (11)
త్వామేకమ్ కారణం కృత్వా కాలేన భరతర్షభ ।
సమేతం పార్థివం క్షత్రం క్షయం యాస్యతి భారత ।
దుర్యోధనాపరాధేన భీమార్జునబలేన చ ॥ 12
భరతశ్రేష్ఠా! సమయం కాగానే నీవు కారణంగా, దుర్యోధనుని అపరాధం వలన, భీమార్జునుల పరాక్రమం ద్వారా భూమిమీది రాజులందరూ కలసి పరస్పర యుద్ధంతో నాశనం అవుతారు. (12)
స్వప్నే ద్రక్ష్యసి రాజేంద్ర క్షపాంతే త్వం వృషధ్వజమ్ ।
నీలకంఠం భవం స్థాణుం కపాలిం త్రిపురాంతకమ్ ॥ 13
ఉగ్రం రుద్రమ్ పశుపతిం మహాదేవముమాపతిమ్ ।
హరం శర్వం వృషం శూలం పినాకిం కృత్తివాససమ్ ॥ 14
రాజేంద్రా! తెల్లవారు జామున స్వప్నంలో నీవు వృషభధ్వజుడు, నీలకంఠుడు, భవుడు, స్థాణుడు, కపాలి, త్రిపురాంతకుడు, ఉగ్రుడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఉమాపతి, హరుడు, శర్వుడు, వృషుడు, శూలి; పినాకి, చర్మవసనుడు అయిన శివుని చూస్తావు. (13,14)
కైలాసకూటప్రతిమం వృషణేఽవస్థితమ్ శివమ్ ।
నిరీక్షమాణం సతతం పితృరాజాశ్రితాం దిశమ్ ॥ 15
కైలాసశిఖరంలా వెలుగొందే వృషభారూఢుడైన ఆ శివుడు పితృదేవతలకు ఆశ్రయమైన దిక్కును (దక్షిన దిక్కును) ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. (15)
ఏవమీదృశకం స్వప్నం ద్రక్ష్యసి త్వం విశాంపతే ।
మా తత్కృతే హ్యనుధ్యాహి కాలో హి దురతిక్రమః ॥ 16
రాజా! ఈవిధమైన స్వప్నాన్ని నీవు చూస్తావు. దాని గురించి నీవు చింతించకు. కాలం దాటరానిది. (16)
స్వస్తి తేఽస్తు గమిష్యామి కైలాసం పర్వతమ్ ప్రతి ।
అప్రమత్తః స్థితో దాంతః పృథివీం పరిపాలయ ॥ 17
నీకు శుబమగుగాక! నేను కైలాసానికి వెడుతున్నాను. నీవు ఇంద్రియనిగ్రహం కలిగి, అప్రమత్తంగా ఉంటూ భూమిని పాలించు. (17)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా స భగవాన్ కైలాసం పర్వతం యయౌ ।
కృష్ణద్వైపాయనో వ్యాసః సహశిష్యైః శ్రుతానుగైః ॥ 18
వైశంపాయనుడు అంటున్నాడు - ఇలా అని ఆ పూజ్యుడు కృష్ణద్వైపాయనుడు వేదాచారులైన శిష్యులతో సహితంగా కైలాసపర్వతానికి వెళ్లాడు. (18)
గతే పితామహే రాజా చింతాశోకసమన్వితః ।
నిఃశ్వసన్నుష్ణమసకృత్ తమేవార్థం విచింతయమ్ ॥ 19
కథం తు దైవం శక్యేత పౌరుషేన ప్రబాధితుమ్ ।
అవశ్యమేవ భవితా యదుక్తం పరమర్షిణా ॥ 20
తాతగారు వెళ్లిపోయాక ధర్మరాజు పదేపదే వేడి నిట్టూర్పులు విడుస్తూ - దానిగురిమ్చే "పౌరుషంతో దైవాన్ని అడ్డుకోవడం ఎలా శక్యం అవుతుంది? మహర్షి చెప్పినది తప్పకుండా జరుగుతుంది" అని అనుకోసాగాడు. (19,20)
తతోఽబ్రవీన్మహాతేజాః సర్వాన్ భ్రాతౄన్ యుధిష్ఠిరః ।
శ్రుతమ్ వై పురుషవ్యాఘ్రాః యన్మాం ద్వైపాయనీఽబ్రవీత్ ॥ 21
తదా తద్వచనం శ్రుత్వా మరణే నిశ్చితా మతిః ।
సర్వక్షత్రస్య నిధనే యద్యహం హేతురీప్సితః ॥ 22
కాలేన నిర్మితస్తాత కో మమార్థోఽస్తి జీవతః ।
ఏవం బ్రువంతం రాజానం ఫాల్గునః ప్రత్యభాషత ॥ 23
మహాతేజస్వి అయిన యుధిష్ఠిరుడు తన తమ్ములందరితో అప్పుడిలా అన్నాడు - "పురుషసింహాల్లారా! వ్యాసమహర్షి నాతో చెప్పినది మీరు విన్నారు కదా! అప్పుడు ఆయన అన్నమాట విని నాకు నిశ్చయంగా మరణించాలనిపించింది. ఎందుకంటే సర్వక్షత్రవినాశనానికి విధి నన్నే కారణంగా చేయదలచుకుంటే, నేను జీవించి ఉండడం వలన ప్రయోజనమేమిటి?" ఇలా అంటున్న రాజును ఉద్దేశించి అర్జునుడు ఇలా చెప్పసాగాడు. (21-23)
మా రాజన్ కశ్మలం ఘోరం ప్రవిశో బుద్ధినాశనమ్ ।
సంప్రధార్య మహారాజయత్ క్షేమం తత్ సమాచార ॥ 24
రాజా! పాపభూయిష్ఠమైన, ఘోరమైన మోహాన్ని పొందకు. ధైర్యం వహించి ఏది మేలో అది ఆచరించు. (24)
తతోఽబ్రవీత్ సత్యధృతిః బ్రాతౄన్ సర్వాన్ యుధిష్ఠిరః ।
ద్వైపాయనస్య వచనం హ్యేవం సమనుచింతయన్ ॥ 25
సత్యధృతి అయిన యుధిష్ఠిరుడు ద్వైపాయనుని మాటల్నే తలచుకొంటూ తమ్ముళ్లందరితో ఇలా అన్నాడు. (25)
అద్య ప్రభృతి భద్రమ్ వః ప్రతిజ్ఞాం మే నిబోధత ।
త్రయోదశ సమాస్తాత కో మమార్ధోఽస్మి జీవతః ॥ 26
'మీకందరికీ క్షేమమ్ కలుగుగాక. నాయనలారా! బ్రతికి ఉన్నా, పదమూడేళ్లు నా వలన ఏ ప్రయోజనం ఉంటుంది? కనుక నేటి నుండి నేను చేసే ప్రతిజ్ఞ వినండి. (26)
న ప్రవక్ష్యామి పరుషం భ్రాతౄనన్యాంశ్చ పార్థివాన్ ।
స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్ష్యే తత్ సముదాహరన్ ॥ 27
సోదరులనుగాని, ఇతరరాజులను గాని పరుషంగా మాట్లాడను. జ్ఞాతుల ఆజ్ఞను పాటిస్తూ వారు అడిగినవన్నీ ఇవ్వడంలో నిమగ్నమవుతాను. (27)
ఏవం మే వర్తమానస్య స్వసుతేష్వితరేషు చ ।
భేదో న భవితా లోకే భేదమూలో హి విగ్రహః ॥ 28
ఇలా ప్రవర్తిస్తున్న నాకు నాకుమారుల పట్ల, ఇతరుల పట్ల భేదభావం రాకుండుగాక! లోకంలో విరోధానికి భేదమే మూలం కదా! (28)
విగ్రహం దూరతో రక్షన్ ప్రియాణ్యేవ సమాచరన్ ।
వాచ్యతాం న గమిష్యామి లోకేషు మనుజర్షభాః ॥ 29
నరశ్రేష్ఠులారా! వైరభావాన్ని దూరంగా ఉంచుతూ, అందరికీ ప్రియాన్నే ఆచరిస్తూ ఉంటే నాకు లోకంలో నింద కలుగదు. (29)
భ్రాతుర్జ్యేష్ఠస్య వచనం పాండవాః సంనిశమ్య తత్ ।
తమేవ సమవర్తంత ధర్మరాజహితే రతాః ॥ 30
తమ అన్నగారిమాట విని పాండవులందరూ, అతనికి మేలు చేయడంలో తత్పరులై, అతనినే అనుసరించసాగారు.' (30)
సంసత్సు సమయం కృత్వా ధర్మరాడ్ భ్రాతృభిః సహ ।
పితృస్తర్ప్య యథాన్యాయం దేవతాశ్చ విశాంపతే ॥ 31
రాజా! తమ్ముళ్లతో కలిసి ధర్మరాజు సభలో ఇలా ప్రతిజ్ఞ చేసి దేవతలకు, పితరులకు యథావిధిగా తర్పణాలు చేశాడు. (31)
కృతమంగళ కళ్యాణః భ్రాతృభిః పరివారితః ।
గతేషు క్షత్రియేంద్రేషు సర్వేషు భరతర్షభ ॥ 32
యుధిష్ఠిరః సహామాత్యః ప్రవివేశ పురోత్తమమ్ ।
దుర్యోధనో మహారజ శకునిశ్చాపి సౌబలః ।
సభాయాం రమణీయాయాం తత్రైవాస్తే నరాధిప ॥ 33
భరతశ్రేష్ఠా! రాజులందరూ వెళ్లిపోయిన పిదప, శోభాకరమైన మంగళకార్యాలు పూర్తిచేసుకొని తమ్ముళ్లందరూ కూడా రాగా, మంత్రులతో కలిసి యుధిష్ఠిరుడు నగరంలో ప్రవేశించాడు. మహారాజా! దుర్యోధనుడు, సుబలసుతుడైన శకుని ఇద్దరూ రమణీయమైన ఆ సభలోనే ఉండిపోయారు. (32,33)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి యుధిష్ఠిరసమయే షట్ఽచత్వారింశోఽధ్యాయః ॥ 46 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరసమయము అను నలువది ఆరవ అధ్యాయము. (46)