47. నలువది ఏడవ అధ్యాయము
మయసభలో భంగపడిన దుర్యోధనుడు ధర్మజుని వైభవమును చూచి దుఃఖించుట.
వైశంపాయన ఉవాచ
వసన్ దుర్యోధనస్తస్యాం సభాయాం పురుషర్షభ ।
శనైర్దదర్శ తామ్ సర్వాం సభాం శకునినా సహ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - పురుషశ్రేష్ఠా! దుర్యోధనుడు శకునితో కలిసి మెల్లమెల్లగా ఆ సభనంతటినీ చూడసాగాడు. (1)
తస్యాం దివ్యానభిప్రాయాన్ దదర్శ కురునందనః ।
న దృష్టపూర్వో యే తేన నగరే నాగసాహ్వయే ॥ 2
కురునందనుడైన దుర్యోధనుడు ఆ సభలో ఇంతకుముందు హస్తినాపురంలో తాను ఎన్నడూ చూడని దివ్యమైన అభిప్రాయాలను (దృశ్యాలను) చూసి సంప్రీతిని పొందాడు. (2)
స కదాచిత్ సభామధ్యే ధార్తరాష్ట్రో మహీపతిః ।
స్ఫాటికం స్థలమాసాద్య జలమిత్యభిశంకయా ॥ 3
స్వవస్త్రోత్కర్షణం రాజా కృతవాన్ బుద్ధిమోహితః ।
దుర్మనా విముకశ్చైవ పరిచక్రామ తాం సభామ్ ॥ 4
ఒకమారు రాజైన దుర్యోధనుడు ఆ సభాభవనంలో స్ఫటికమణులు పొదిగిన స్థలాన్ని చేరుకొని, అక్కడ నీరు ఉన్నదనే సందేహంతో తన వస్త్రాన్ని పైకి పట్టుకొన్నాడు. తన బుద్ధి పొరబడినందుకు అతడు మనసులో చాలా విచారించి, అక్కడ ఉండడానికి విముఖుడై కూడ ఆ సభలోనే తిరుగసాగాడు. (3,4)
తతః స్థలే నిపతితః దుర్మనా వ్రీడితో నృపః ।
నిఃశ్వసన్ విముఖశ్చాపి పరిచక్రామ తాం సభామ్ ॥ 5
అనంతరం నేలపై పడిపోయాడు. అందుకని మనసులోనే దుఃఖిస్తూ, సిగ్గుతీ నిట్టూర్పులు విడుస్తూ అక్కడి నుండి కదిలినా ఆ సభలోనే తిరుగసాగాడు. (5)
తతః స్ఫాటికతోయాం వై స్ఫాటికాంబుజశోభితామ్ ।
వాపీం మత్వా స్థలమివ సవాసాః ప్రాపతజ్జలే ॥ 6
తరువాత స్ఫటిక మణుల వలె స్వచ్ఛమైన జలంతో, స్ఫటిక మణిమయపద్మాలతో అలరారే కొలనును చూచి స్థలం అనుకొని కట్టుబట్టలతో నీటిలో పడ్డాడు. (6)
జలే నిపతితం దృష్ట్వా భీమసేనో మహాబలః ।
జహాస జహసుశ్చైవ కింకరాశ్చ సుయోధనమ్ ॥ 7
వాసాంసి చ శుభాన్యస్మై ప్రదదూ రాజశాసనాత్ ।
తథాగతం తు తం ద్ర్రుష్ట్వా భీమసేనో మహాబలః ॥ 8
అర్జునశ్చ యమౌ చోభౌ సర్వే తే ప్రాహసంస్తదా ।
నామర్షయత్ తతస్తేషామ్ అవహాసమమర్షణః ॥ 9
నీళ్లల్లో పడిన సుయోధనుని చూసి మహాబలుడైన భీమసేనుడు నవ్వాడు. అతని పరిచారకులూ నవ్వారు. రాజుగారి ఆజ్ఞప్రకారం అతనికి పొడిబట్టలు ఇచ్చారు. ఆ స్థితిలో ఉన్న అతనిని చూచి భీమార్జునులు నకులసహదేవులు కూడా బాగా నవ్వారు. అసలే అసహనశీలుడైన దుర్యోధనుడు వారి పరిహాసాన్ని సహించలేకపోయాడు. (7-9)
ఆకారం రక్షమాణస్తు న స తాన్ సముదైక్షత ।
పునర్వసనముత్షిప్య ప్రతరిష్యన్నివ స్థలమ్ ॥ 10
సిగ్గుతో కూడిన తన ముఖకవళికలను దాచుకోవడానికి అతడు వారివైపు చూడలేదు. మరల స్థలాన్ని చూచి బట్టపైకి ఎత్తి పట్టుకొని ఈదే వానిలా నడవసాగాడు. (10)
ఆరురోహ తతః సర్వే జహసుశ్చ పునర్జనాః ।
ద్వారం తు పిహితాకారం స్ఫాటికం ప్రేక్ష్య భూమిపః ।
ప్రవిశన్నాహతే మూర్ధ్ని వ్యాఘూర్ణిత ఇవ స్థితః ॥ 11
అలా పైకి ఎక్కిన అతన్ని చూచి జనులందరూ మళ్లీ నవ్వారు. మూయబడి ఉన్న స్ఫటికమయమైన ద్వారాన్ని చూచి దుర్యోధనమహారాజు ప్రవేశించబోగా తలకు గట్టిదెబ్బ తగిలింది. దిమ్మతిరిగినట్లు నిలబడిపోయాడు. (11)
తాదృశం చ పరం ద్వారం స్ఫాటికోరుకపాటకమ్ ।
విఘట్టయన్ కరాభ్యాం తు నిష్క్రమ్యాగ్రే పపాత హ ॥ 12
అటువంటిదే స్పటికమయమైన పెద్ద కవాటం (తలుపు) కల ద్వారాన్ని రెండుచేతులతో గట్టిగా చరుస్తూ (మూసి ఉంది అనుకొని) దానిని దాటి ముందుకు పడిపోయాడు. (12)
ద్వారం వితతాకారం సమాపేదే పునశ్చ సః ।
తద్వత్తం చేతి మన్వానః ద్వారస్థానాదుపారమత్ ॥ 13
అతడు మళ్లీ ఒక వెడల్పయిన ద్వారం వద్దకు వచ్చాడు. అది కూడా అలాంటిదే అనుకొని ద్వారం వద్ద నుండే వెనుతిరిగాడు. (13)
ఏవం ప్రలంభాన్ వివిధాన్ ప్రాప్య తత్ర విశాంపతే ।
పాండవేయాభ్యనుజ్ఞాతః తతో దుర్యోధనో నృపః ॥ 14
అప్రహృష్టేన మనసా రాజసూయే మహాక్రతౌ ।
ప్రేక్ష్య తామద్భుతామృద్ధిం జగామ గజసాహ్వయమ్ ॥ 15
రాజా! ఈ రీతిగా అనేక రకాల వంచనలను పొంది దుర్యోధనమహారాజు పాండవేయుల వద్ద అనుమతి తీసికొని, రాజసూయ మహాయాగంలో వారికి లభించిన అద్భుతమైన సంపత్సమృద్ధిని చూచి అప్రసన్నమైన మనసుతో హస్తినాపురానికి బయలుదేరాడు. (14,15)
పాండవశ్రీ ప్రతప్తస్య ధ్యాయమానస్య గచ్ఛతః ।
దుర్యోధనస్య నృపతేః పాపా మతిరజాయత ॥ 16
పాండవుల సంపదకు కుతకుతలాడుతూ, దాని గురించే ఆలోచిస్తూ వెళ్తున్న దుర్యోధనమహారాజుకు పాపచింతన కలిగింది. (16)
పార్థాన్ సుమనసో దృష్ట్వా పార్థివాంశ్చ వశానుగాన్ ।
కృత్స్నం చాపి హితం లోకమ్ ఆకుమారం కురూద్వహ ॥ 17
మహిమానం పరం చాపి పాండవానాం మహాత్మనామ్ ।
దుర్యోధనో ధార్తరాష్ట్రః వివర్ణః సమపద్యత ॥ 18
నిర్మలచిత్తులయిన పాండవులను, వారికి వశులయిన రాజులను, వారికి హితం కోరే ఆబాలవృద్ధులైన సమస్తలోకాన్ని, మహాత్ములయిన పాండవుల ఉత్కృష్టమయిన మహిమను చూచి ధృతరాష్ట్రసుతుడైన దుర్యోధనుడు పాలిపోయాడు. వెలవెలబోయాడు. (17,18)
స తు గచ్ఛన్ననేకాగ్రః సభామేకోఽన్వచింతయత్ ।
శ్రియం చ తామనుపమాం ధర్మరాజస్య ధీమతః ॥ 19
దారిలో అతడు చెదరిన మనసుతో, ఒంటరిగా, బుద్ధిమంతుడయిన ఆ ధర్మరాజుయొక్క సాటిలేని సభాభవనం గూర్చి, సంపదను గూర్చి తలపోయసాగాడు. (19)
ప్రమత్తో ధృతరాష్ట్రస్య పుత్రో దుర్యోధనస్తదా ।
నాభ్యభాషత్ సుబలజం భాషమాణం పునః పునః ॥ 20
మైకం కమ్మినట్లున్న ధృతరాష్ట్రకుమారుడయిన దుర్యోధనుడు ఆ సమయంలో పదేపదే పలకరిస్తున్నా శకునితో ఏమీ మాట్లాటం లేదు. (20)
అనేకాగ్రం తు తం దృష్ట్వా శకునిః ప్రత్యభాషత ।
దుర్యోధన కుతో మూలం నిఃశ్వసన్నివ గచ్ఛసి ॥ 21
వికలమనస్కుడయిన అతనిని చూచి శకుని- "దుర్యోధనా! నిట్టూర్పులు విడుస్తూ వెడుతున్నావు. దీనికి కారణం ఏమిటి?" అని అడిగాడు. (21)
దుర్యోధన ఉవాచ
దృష్ట్వేమాం పృథివీం కృత్స్నాం యుధిష్ఠిరవశానుగామ్ ।
జితామస్త్రప్రతాపేన శ్వేతాశ్వస్య మహాత్మనః ॥ 22
తం చ యజ్ఞం తథాభూతం దృష్ట్వా పార్థస్య మాతుల ।
యథా శక్రస్య దేవేషు తథాభూతం మహాద్యుతే ॥ 23
అమర్షేణ తు సంపూర్ణః దహ్యమానో దివానిశమ్ ।
శుచిశుక్రాగమే కాలే శుష్యేత్ తోయమివాల్పకమ్ ॥ 24
దుర్యోధనుడు చెపుతున్నాడు - "మామా! గొప్పవాడయిన అర్జునుని అస్త్రప్రతాపం వలన గెలిచిన, యుధిష్ఠిరుని వశమయిన ఈ భూమినంతటినీ చూచి, దేవతలలో మిక్కిలి తేజస్వి అయిన ఇంద్రుడు చేసిన యజ్ఞం లాగే జరిగిన యుధిష్ఠిరుని యజ్ఞం చూచి, అసహనంతో రాత్రింబగళ్లు గ్రీష్మఋతువులో కొద్దిగా ఉన్న నీరు ఆవిరై పోతున్నట్లుగా పూర్తిగా దహించుకుపోతున్నాను. (22-24)
పశ్య సాత్వతముఖ్యేన శిశుపాలో నిపాతితః ।
న చ తత్ర పుమానాసీత్ కశ్చిత్ తస్య పదానుగః ॥ 25
చూడు. సాత్వతవంశీయుడయిన కృష్ణుని చేతిలో శిశుపాలుడు మరణించాడు. కాని అక్కడ దానికి ఎవరూ ప్రతీకారం తీర్చుకోలేకపోయారు. (25)
దహ్యమానా హి రాజానః పాండవోత్థేన వహ్నినా ।
క్షాంతవంతోఽపరాధం తె కో హి తత్ క్షంతుమర్హతి ॥ 26
పాండవుల నుండి పుట్టిన అగ్నిలో దగ్ధులైన రాజులు ఆ అపరాధాన్ని క్షమించారు. లేకుంటే అంత అన్యాయాన్ని ఎవరు సహించగలుగుతారు? (26)
వాసుదేవేన తత్ కర్మ యథాయుక్తం మహత్ కృతమ్ ।
సిద్ధమ్ చ పాండుపుత్రాణాం ప్రతాపేన మహాత్మనామ్ ॥ 27
ఆ మహత్కార్య వాసుదేవుడు అనుచితంగా చేశాడు. మహాత్ములైన పాండుపుత్రుల ప్రతాపం వలన అది సిద్ధించింది. (27)
తథా హి రత్నాన్యాదాయ వివిధాని నృపా నృపమ్ ।
ఉపాతిష్ఠంత కౌంతేయం వైశ్యా ఇవ కరప్రదాః ॥ 28
అవును మరి. పన్నులు చెల్లించే వైశ్యుల వలె రాజులందరూ అనేక రకాల రత్నాలను తెచ్చి రాజయిన కుంతీసుతుని సేవించారు. (28)
శ్రియం తథాఽఽగతం దృష్ట్వా జ్వలంతీమివ పాండవే ।
అమర్షవశమాపన్నః దహ్యామి న తథోచితః ॥ 29
పాండవుల వద్దకు చేరి మిరుమిట్లుగొలిపే ఆ సంపదను చూచి అసూయపడి దహించుకుపోతున్నాను. ఇలా కావటం ఉచితం కాదు. (29)
ఏవం స నిశ్చయం కృత్వా తతో వచనమబ్రవీత్ ।
పునర్గాంధారనృపతిం దహ్యమాన ఇవాగ్నినా ॥ 30
ఇలా నిశ్చయించికొని అతడు అగ్నిచేత దహింపబడుతున్నవాని వలె తిరిగి గాంధారఱాజు శకునితో ఇలా అన్నాడు. (30)
వహ్నిమేవ ప్రవేక్ష్యామి భక్షయిష్యామి వా విషమ్ ।
అపో వాపి ప్రవేక్ష్యామి న హి శక్ష్యామి జీవితమ్ ॥ 31
అగ్నిలో ప్రవేశిస్తాను. లేదా విషం తింటాను. లేదా నీటిలో మునుగుతాను. కాని బ్రతికిమాత్రమ్ ఉండలేను. (31)
కో హి నామ పుమాంల్లోకే మర్షయిష్యతి సత్త్వవాన్ ।
సపత్నానృద్ధ్యతో దృష్ట్వా హీనమాత్మానమేవ చ ॥ 32
శత్రువుల వృద్ధిని, తన హీనదశను చూచి ఓ లోకంలో ఏ బలవంతుడు సహించి ఊరుకోగలడు? (32)
సోఽహం న స్త్రీ చాప్యస్త్రీ న పుమాన్నాపుమానపి ।
యోఽహం తాం మర్షయామ్యద్య తాదృశీం శ్రియమాగతామ్ ॥ 33
శత్రువులకు సంక్రమించిన అటువంటి ఆ సంపదను సహిస్తున్న నేను స్త్రీని కాను. స్త్రీ కాకుండా పోను. పురుషుడిని కాను. పురుషుడిని కాకుండా పోను. (33)
ఈశ్వరత్వం పృథివ్యాశ్చ వసుమత్తాం చ తాదృశీమ్ ।
యజ్ఞం చ తాదృశం దృష్ట్వా మాదృశః కో న సంజ్వరేత్ ॥ 34
ఆ భూమండలాధిపత్యాన్ని, అటువంటి సంపద కలిగి ఉండడాన్ని, అటువంటి యజ్ఞాన్ని చూచి నావంటివాడు ఎవడు తపించడు? (34)
అశక్తశ్చైక ఏవాహం తామాహర్తుం నృపశ్రియమ్ ।
సహాయాంశ్చ న పశ్యామి తేన మృత్యుం విచింతయే ॥ 35
ఆ రాజలక్ష్మిని తేవడానికి నేను ఒక్కడినే అశక్తుడిని. సహాయకులు ఎవరూ కనపడడం లేదు. కనుకనే చావాలని తలపోస్తున్నాను. (35)
దైవమేవ పరం మన్యే పౌరుషం చ నిరర్థకమ్ ।
దృష్ట్వా కుంతీసుతే శుద్ధాం శ్రియం తామహతాం తథా ॥ 36
కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుని వద్ద ఉన్న ఆ అక్షయమై, విశుద్ధమైన సంపదను చూచి దైవమే గొప్పదని, పురుషప్రయత్నం నిరర్థకమని అనుకొంటున్నాను. (36)
కృతో యత్నో మయా పూర్వం వినాశే తస్య సౌబల ।
తచ్చ సర్వమతిక్రమ్య సంవృద్ధోఽప్స్వివ పంకజమ్ ॥ 37
సౌబలా! పూర్వం నేను యుధిష్ఠిరుని నాశనం కొఱకు ప్రయత్నం చేశాను. అదంతా దాటుకుని అతడు నీటిలోని తామరలా వృద్దిపొందాడు. (37)
తేన దైవం పరం మన్యే పౌరుషం చ నిరర్ధకమ్ ।
ధార్తరాష్ట్రాశ్చ హీయంతే పార్థా వర్ధంతి నిత్యశః ॥ 38
కనుకనే దైవం గొప్పదని, పౌరుషం నిరర్ధకమని అనుకొంటున్నాను. ధారతరాష్ట్రులు హాని పొందుతున్నారు. పాండవులు నిత్యమూ వృద్ధి పొందుతున్నారు. (38)
సోఽహం శ్రియం చ తాం దృష్ట్వా సభాం తాం చ తథావిథామ్ ।
రక్షిభిశ్చావహాసం తం పరితప్యే యథాగ్నినా ॥ 39
ఆ సంపదను, అటువంటి సభను, రక్షకుల యొక్క పరిహాసాన్ని చూచి నేను అగ్ని చేత దహింపబడుతున్నట్లుగా పరితపిస్తున్నాను. (39)
స మామభ్యనుజానీహి మాతులాద్య సుదుఃఖితమ్ ।
అమర్షం చ సమావిష్టం ధృతరాష్ట్రే నివేదయ ॥ 40
మామా! అసహనంతో మిక్కిలి దుఃఖితుడనైన నాకు (మరణించడానికి) అనుజ్ఞ నివ్వు. నా ఈ అవస్థను ధృతరాష్ట్రునకు నివేదించు. (40)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి దుర్యోధన సంతాపే సప్తచత్వారింశోఽధ్యాయః ॥ 47 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున దుర్యోధనసంతాపమను నలువది ఏడవ అధ్యాయము. (47)