51. ఏబది ఒకటవ అధ్యాయము
యుధిష్ఠిరునికి వచ్చిన కానుకలను దుర్యోధనుడు వర్ణించుట
దుర్యోధన ఉవాచ
యన్మయా పాండవేయానాం దృష్టం తచ్ఛృణు భారత ।
ఆహృతం భూమిపాలైర్హి వసుముఖ్యం తతస్తతః ॥ 1
దుర్యోధనుడు చెపుతున్నాడు - భారతా! పాండవుల యొక్క యజ్ఞానికి ఆయాదేశాల నుండి రాజులు తెచ్చిన ఉత్కృష్టమైన రత్నరాశులను నేను చూసినవి చెపుతాను. విను. (1)
నావిదం మూఢమాత్మానం దృష్ట్వాహం తదరేర్ధనమ్ ।
ఫలతో భూమితో వాపి ప్రతిపద్యస్వ భారత ॥ 2
భారతా! శత్రువు యొక్క ఆ ధనసంపదను చూచి అది ఎంత ఉంటుందో, ఎక్కడి నుండి వచ్చిందో కూడా నేను తెలుసుకోలేకపోయాను. నన్ను మూఢుడనే అనుకో. (2)
ఔర్ణాన్ బైలాన్ వార్షదంశాన్ జాతరూపపరిష్కృతాన్ ।
ప్రావారాజినముఖ్యాంశ్చ కాంబోజః ప్రదదౌ బహూన్ ॥ 3
అశ్వాంస్తిత్తిరి కల్మాషాన్ త్రిశతం శుకనాసికాన్ ।
ఉష్ట్రవామీస్త్రింశతం చ పుష్టాః పీలుశమీంగుదైః ॥ 4
కాంబోజరాజు గొఱ్ఱెల ఉన్నితో, బిలంతో నివసించే జంతువుల చర్మాలతో, పిల్లి రోమాలతో చేసి బంగారు నగిషీలు చెక్కిన వస్త్రాలను, చర్మాలను మొదలైన వానిని కానుకలుగా సమర్పించాడు. తిత్తిరిపక్షులవలె అనేక వర్ణాలు గలిగి, చిలుకలవంటి ముక్కులు గల గుఱ్ఱాలను మూడువందలు తెచ్చి యిచ్చాడు. పీలు, శమీ, ఇంగుదాలు తినడం చేత పుష్టిగా ఉన్న ఆడుఒంటెను, ఆడుగుఱ్ఱాలను ముప్పదిచొప్పున ఇచ్చాడు. (3,4)
గోవాసనా బ్రాహ్మణాశ్చ దాసనీయాశ్చ సర్వశః ।
ప్రీత్యర్థం తే మహారాజ ధర్మరాజ్ఞో మహాత్మనః ॥ 5
త్రిఖర్వం బలిమాదాయ ద్వారి తిష్ఠంతి వారితాః ।
బ్రాహ్మణా వాటధానాశ్చ గోమంతః శతసంఘశః ॥ 6
కమండలూనుపాదాయ జాతరూపమయాన్ శుభాన్ ।
ఏవం బలిం సమాదాయ ప్రవేశం లేభిరే న చ ॥ 7
మహారాజా! బ్రాహ్మణులు, గోవులను మొదలైనవానిని పోషించే వైశ్యులు, దాస్యం చేయడానికి అర్హులైన శూద్రులు అందరూ కూడా మహాత్ముడైన ధర్మరాజుయొక్క ప్రీతికొఱకు మూడు ఖర్వాల కానుకలను తెచ్చి ఆపివేయడం వలన ద్వారం బయటనే నిలుచుండిపోయారు. పొలాలు పండించే, బ్రాహ్మణులు గోవులను పోషించే వైశ్యులు వందలకొద్దీ గుంపులు గట్టి శుభప్రదాలైన బంగారు కలశాలను కానుకలుగా తెచ్చి కూడా లోపలికి ప్రవేశం పొందలేకపోయారు. (5-7)
(యశ్చ స ద్విజముఖ్యేన రాజ్ఞః శంఖో నివేదితః ।
ప్రీత్యా దత్తః కుణిందేన ధర్మరాజాయ ధీమతే ॥
బ్రాహ్మణులలో ప్రధానమైన కుణిందుడు శంఖాన్ని సమర్పించుకొన్నాడు. దానిని ఎంతో ప్రీతితో ధర్మరాజుకు ఇచ్చాడు.
తం సర్వే భ్రాతరో భ్రాత్రే దదుః శంఖం కిరీటినే ।
తం ప్రత్యగృహ్ణాద్ బీభత్సుః తోజయం హేమమాలినమ్ ॥
చితమ్ నిష్కసహస్రేణ భ్రాజమానం స్వతేజసా ।
ఆ శంఖాన్ని అన్నదమ్ములందరూ తమ సోదరుడయిన కిరీటికి ఇచ్చారు. నీటిలో పుట్టిన, బంగారు హారాలు కలిగిన, వేయి బంగారు నాణేలతో నింపబడి, స్వీయకాంతులతో ప్రకాశిస్తున్న దానిని అర్జునుడు స్వీకరించాడు.
రుచిరం దర్శనీయం చ భూషితం విశ్వకర్మణా ॥
అధారయచ్చ ధర్మశ్చ తం నమస్య పునః పునః ।
అది అందమైనది. చూచుటకు ఇంపయినది. విశ్వకర్మ రత్నాలతో అలంకరించినది. సాక్షాత్తు ధర్ముడు పదేపదే దానికి నమస్కరించి ధరించాడు.
యోఽన్నదానే నదతి స ననాదాధికం తదా ॥
ప్రణాదాద్ భూమిపాస్తస్య పేతుర్హీనాః స్వతేజసా ॥
అన్నదానం జరిగినపుడు అది తనంత తానే మ్రోగుతుంది. ఆ సమయంలో అది ఎక్కువగా నినదించింది. దాని నాదానికి రాజులు తేజస్సు కోల్పోయి పడిపోయారు.
ధృష్టద్యుమ్నః పాండవాశ్చ సాత్యకిః కేశవోఽష్టమః ।
సత్త్వస్థాః శౌర్యసంపన్నాః అన్యోన్యప్రియకారిణః ॥
కేవలం ధృష్టద్యుమ్నుడు, పంచపాండవులు, సాత్యకి, ఎనిమిదవవాడు శ్రీకృష్ణుడు మాత్రమే ధైర్యంగా నిలుచున్నారు. వారు శౌర్యసంపన్నులు. పరస్పరం ప్రియం ఆచరించేవారు.
విసంజ్ఞాన్ భూమిపాన్ దృష్ట్వా మాం చ తే ప్రాహసంస్తదా ॥
తతః ప్రహృష్టో బీభత్సుః అదదాద్ధేమశృంగిణః ।
శతాన్యనడుహాం పంచ ద్విజముఖ్యాయ భారత ॥
మూర్ఛపొందిన రాజులనూ, నన్నూ చూచి వారు అప్పుడు బిగ్గరగా పరిహసించారు. అనంతరం మిక్కిలి సంతోషంతో అర్జునుడు బంగారపు కొమ్ములు గల ఐదువందల ఎడ్లను బ్రాహ్మణోత్తమునికి ఇచ్చాడు.
సుముఖేన బలిర్ముఖ్యః ప్రేషితోఽజాతశత్రవే ।
కుణిందేన హిరణ్యం చ వాసాంసి వివిధాని చ ॥
సుముఖుడు అజాతశత్రువునకు ముఖ్యమైన కానుకలను పంపాడు. కుణిందుడు బంగారం, వస్త్రాలు అనేక రకాలైనవి ఇచ్చాడు.
కాశ్మీరరాజో మాధ్వీకం శుద్ధం చ రసవన్మధు ।
బలించ కృత్స్నమాదాయ పాండవాయాభ్యుపాహరత్ ॥
కాశ్మీరరాజు స్వచ్ఛమై, రసవంతమైన తీయని ద్రాక్ష గుత్తులను కానుకలుగా తీసుకొని వచ్చి ధర్మరాజుకు స్వయంగా ఇచ్చాడు.
యవనా హయానుపాదాయ పర్వతీయాన్ మనోజవాన్ ।
ఆసనాని మహార్హాణి కంబలాంశ్చ మహాధనాన్ ॥
నవాన్ విచిత్రాన్ సూక్ష్మాంశ్చ పరార్థ్యాన్ సుప్రదర్శనాన్ ।
అన్యచ్చ వివిధం రత్నం ద్వారి తిష్ఠంతి వారితాః ॥
యవనులు పర్వతప్రాంతాలలోని మనోవేగం కల గుఱ్ఱాలను, విలువైన ఆసనాలను; గొప్ప విలువైన నూతనమై, విచిత్రమై, సూక్ష్మమై, దర్శనీయమై, శ్రేష్ఠమైన కంబళ్లను (తివాచీలను), ఇతరాలైన అనేక రత్నాలనూ కానుకలుగా తెచ్చి వారింపబడి ద్వారం దగ్గరే నిలిచిపోయారు.
శ్రుతాయురపి కాళింగః మణిరత్నమనుత్తమమ్ ।
కళింగరాజు శ్రుతాయువు అత్యుత్తమమైన మణిని ఇచ్చాడు.
దక్షిణాత్ సాగరభ్యాశాత్ ప్రావారాంశ్చ పరః శతాన్ ॥
ఔదకాని సరత్నాని బలిం చాదాయ భారత ।
అన్యేభ్యో భూమిపాలేభ్యః పాండవాయ న్యవేదయత్ ॥
అదేకాక అతడు దక్షిణ సాగరతీరంలోని శంఖాలను, రత్నాలతోకూడిన వందకు మించిన వస్త్రాలను ఇతర రాజుల నుండి తీసుకొని కానుకలుగా తెచ్చి యుధిష్ఠిరునికి సమర్పించాడు.
దార్దురం చందనం ముఖ్యం భారాన్ షణ్ణవతిం ధ్రువమ్ ।
పాండవాయ దదౌ పాండ్యః శంఖాంస్తావత ఏవ చ ॥
పాండ్యరాజు దర్దురపర్వతం మీది చందనకాష్ఠాలను తొంబదిఆరింటిని పాండుపుత్రునకు సమర్పించాడు. అంతే సంఖ్య గల శంఖాలను కూడా ఇచ్చాడు.
చందనాగరు చానంతం ముక్తావైదూర్యచిత్రకాః ।
చోళశ్చ కేరళశ్చోభౌ దదతుః పాండవాయ వై ॥
చోళ కేరళ నరేశులు ఇద్దరూ అనంతమైన చందనం, అగరు, ముత్యాలు, వైడూర్యాలు, చిత్రకాలు పాండుపుత్రునికి ఇచ్చారు.
అశ్మకో హేమశృంగీశ్చ దోగ్ద్రీర్హేమవిభూషితాః ।
సవత్సాః కుంభదోహాశ్చ గాః సహస్రాణ్యదాద్ దశ ॥
అశ్మకమహారాజు బంగారం తాపడం చేసిన కొమ్ములు, కుండలవంటి పొదుగులు కలిగి బంగారు హారాలతో అలంకరింపబడిన పదివేల గోవులను దూడలతో సహా ఇచ్చాడు.
సైంధవానాం సహస్రాణి హయానాం పంచవింశతీమ్ ।
అదదాత్ సైంధవో రాజా హేమమాల్యైరలంకృతాన్ ॥
సింధురాజు పసిడిమాలలు అలంకరించిన సింధుదేశపు గుఱ్ఱాలను ఇరవైఅయిదువేలు ఇచ్చాడు.
సౌవీరో హస్తిభిర్యుక్తాన్ రథాంశ్చ త్రిశతావరాన్ ।
జాతరూపపరిష్కారాన్ మణిరత్నవిభూషితాన్ ॥
మధ్యందినార్కప్రతిమాన్ తేజసాప్రతిమానివ ।
బలిం చ కృత్స్నమాదాయ పాండవాయ న్యవేదయత్ ॥
సౌవీరరాజు ఏనుగులు పూన్చిన రథాలను మూడువందలకు తక్కువ కాకుండా ఇచ్చాడు. అవి బంగారు అలంకారాలతో, మణిరత్న విభూషితాలై, మధ్యందిన సూర్యునిలా, సాటిలేనిప్రకాశంతో వెలుగిందుతున్నాయి. వాటిని కానుకలుగా తెచ్చి సమర్పించాడు.
అవంతిరాజో రత్నాని వివిధాని సహస్రశః ।
హారాంగదాంశ్చ ముఖ్యాన్ వై వివిధం చ విభూషణమ్ ॥
దాసీనామయుతం చైవ బలిమాదాయ భారత ।
సభాద్వారి నరశ్రేష్ఠ దిదృక్షురవతిష్ఠతే ॥
భారతా! నరోత్తమా! అవంతిరాజు రకరకాల వేల రత్నాలను, హారాలను, భుజకీర్తులు, మొదలైన వివిధాభరణాలను, అయుత సంఖ్యగల దాసీలను కూడా కానుకగా తెచ్చి లోపలికి వెళ్లి చూడాలనే కోరికతో ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు.
దశార్ణశ్చేదిరాజశ్చ శూరసేనశ్చ వీర్యవాన్ ।
బలిం చ కృత్స్నమాదాయ పాండవాయ న్యఏదయత్ ॥
దశార్ణ, చేది దేశపురాజులు; పరాక్రమశాలి అయిన శూరసేనుడు ఎన్నోకానుకలను తీసుకొని వచ్చి పాండుపుత్రునికి సమర్పించారు.
కాశిరాజేన హృష్టేన బలీ రాజన్ నివేదితః ॥
అశీతిగోసహస్రాణి శతాన్యష్టౌ చ దంతినామ్ ।
వివిధాని చ రత్నాని కాశిరాజో బలిం దదౌ ॥
రాజా! కాశీరాజు ఎనభైవేల గోవులను, ఎనిమిది వందల ఏనుగులను, వివిధ రత్నాలను అతిసంతోషంగా కానుకలిచ్చాడు.
కృతక్షణశ్చ వైదేహః కౌసలశ్చ బృహద్బలః ।
దదతు ర్వాజిముఖ్యాంశ్చ సహస్రాణి చతుర్దశ ॥
విదేహరాజు కృతక్షణుడు, కోసలరాజు బృహద్బలుడు పద్నాలుగువేల ఉత్తమాశ్వాలను ఇచ్చారు.
శైబ్యో వసాదిభిః సార్ధం త్రిగర్తో మాళవైః సహ ।
తస్మై రత్నాని దదతుః ఏకైకో భూమిపోఽమితమ్ ॥
హారంస్తు ముక్తాన్ ముఖ్యాంశ్చ వివిధం చ విభూషణమ్ ।)
వసాద్రాజులతో కలిసి శైబ్యుడు, మాళవులతో కలిసి త్రిగర్తరాజు యుధిష్ఠిరునికి అనేక రత్నాలను కానుకలిచ్చారు. అందులో ఒక్కొక్కరాజు ప్రత్యేకంగా అంతులేని హారాలు విలువైన ముత్యాలు, వివిధాభరణాలు ఇచ్చారు.
శతం దాసీసహస్రాణాం కార్పాసికనివాసినామ్ ॥ 8
శ్యామాస్తన్వ్యో దీర్ఘకేశ్యః హేమాభరణభూషితాః ।
కార్పాసిక దేశంలో నివసించే లక్షమంది దాసీలు ఆ యజ్ఞంలో సేవలు చేశారు. వారు అందరూ నల్లనివర్ణం కలిగి, బక్కపలుచని దేహాలతో, పొడవైన జుట్టు కలిగి బంగారు ఆభరణాలు ధరించి ఉన్నారు. (8 1/2)
శూద్రా విప్రోత్తమార్హాణి రాంకవాణ్యజినాని చ ॥ 9
బలిం చ కృత్స్నమాదాయ భరుకచ్ఛనివాసినః ।
ఉపనిన్యుర్మహారాజ హయాన్ గాంధారదేశజాన్ ॥ 10
మహారాజా! భరుకచ్ఛనివాసులైన శూద్రులు ఉత్తమ బ్రాహ్మణులకు యోగ్యమైన రాంకవమృగ చర్మాలను, గాంధారదేశంలో పుట్టిన గుఱ్ఱాలను కానుకలుగా తెచ్చి సమర్పించారు. (9,10)
ఇంద్రకృష్టైర్వర్తయంతి ధాన్యైర్యే చ నదీముఖైః ।
సముద్రనిష్కుటే జాతాః పారేసింధు చ మానవాః ॥ 11
తే వై రామాః పారదాశ్చ ఆభీరాః కితవైః సహ ।
వివిధం బలిమాదాయ రత్నాని వివిధాని చ ॥ 12
అజావికం గోహిరణ్యం ఖరోష్ట్రం ఫలజం మధు ।
కంబలాన్ వివిధాంశ్చైవ ద్వారి తిష్ఠంతి వారితాః ॥13
ఇంద్రుడు కురిపించిన వానతో, నదీజలాలతో పండే ధాన్యంతో జీవనం గడుపుకొంటూ, సముద్రతీరప్రాంతంలో పుట్టి, సింధునదికి ఆవలి తీరంలో ఉండే వైరామ, పారద, ఆభీర, కితవజాతులకు చెందిన మానవులు వివిధ రత్నాలు, మేకలు, గొఱ్ఱెలు, గోవులు, బంగారం, గాడిదలు, ఒంటెలు, ఫలాల నుండి పుట్టిన తేనె, రకరకాల కంబళ్ళు-మొదలైన ఎన్నో రకాల కానుకలను తెచ్చి లోనికి రానీయకపోవడంతో ద్వారం వద్దనే నిలిచిపోయారు. (11-13)
ప్రాగ్జ్యోతిషాధిపః శూరో మ్లేచ్ఛానామధిపో బలీ ।
యవనైః సహితో రాజా భగదత్తో మహారథః ॥ 14
ఆజానేయాన్ హయాన్ శీఘ్రాన్ ఆదాయానిలరంహసః ।
బలిం చ కృత్స్నమాదాయ ద్వారి తిష్ఠతి వారితః ॥ 15
ప్రాగ్జ్యోతిషాధిపతి, మ్లేచ్ఛనాయకుడు, పరాక్రమవంతుడు, బలశాలి, మహారథి అయిన భగదత్తుడు యవనులతో కూడి వేయువేగం కలిగిన ఉత్తమజాతి అశ్వాలను, ఎన్నో కానుకలను తెచ్చి, ద్వారం వద్దనే నిలిచిపోయాడు. (14,15)
అశ్మసారమయం భాండం శుద్ధదంతత్సరూనసీన్ ।
ప్రాగ్జ్యోతిషాధిపో దత్త్వా భగదత్తోఽవ్రజత్ తదా ॥ 16
రాళ్లల్లో శ్రేష్ఠమయిన వజ్రాలతో చేయబడిన భాండాన్ని, తెల్లనిదంతపు పిడులు గల కత్తులను ఇచ్చి ప్రాగ్జ్యోతిషపురాధిపతి భగదత్తుడు ఆ సమయంలో లోపలికి వెళ్లాడు. (16)
ద్వ్యాక్షాంస్త్ర్యక్షాన్ లలాటాక్షాన్ నానాదిగ్భ్యః సమాగతాన్ ।
ఔష్ణీకానంతవాసాంశ్చ రోమకాన్ పురుషాదకాన్ ॥ 17
ఏకపాదాంశ్చ తత్రాహమ్ అపశ్యం ద్వారి వారితాన్ ।
రాజానో బలిమాదాయ నానావర్ణాననేకశః ॥ 18
కృష్ణగ్రీవాన్ మహాకాయాన్ రాసభాన్ దూరపాతినః ।
ఆజహ్రుర్దశసాహస్రాన్ వినీతాన్ దిక్షు విశ్రుతాన్ ॥ 19
నానాదిక్కుల నుండి, ద్వ్యక్ష, త్ర్యక్ష, లలాటాక్ష, ఔష్ణీక, అంతవాస, రోమక, పురుషాదక, ఏకపాద-రాజులందరూ ద్వారం వద్ద నిలబడి ఉండడం అక్కడ నేను చూశాను. ఆ రాజులందరూ తమతో నల్లని మెడలు, పెద్దశరీరాలు కలిగి ఎంతదూరమైనా వెళ్లగల రంగురంగుల కంచరగాడిదలను కానుకలుగా తెచ్చారు. అవి పదివేలున్నాయి. అన్నీ సుశిక్షితమైనవి. అన్ని దిక్కుల యందు ప్రసిద్ధికెక్కినవి. (17-19)
ప్రమాణరాగసంపన్నాన్ వంక్షుతీరసముద్భవాన్ ।
బల్యర్థం దదతస్తస్మై హిరణ్యం రజితం బహు ॥ 20
దత్త్వా ప్రవేశం ప్రాప్తాస్తే యుధిష్ఠిరనివేశనే ।
చక్కని ఒడ్డు, పొడవు, రంగు కలిగి, వంక్షునదీ తీరమందు పుట్టిన ఆ రాసభాలను యుధిష్ఠిరునికి కానుకలుగా ఇస్తూ ఆ రాజులందరూ అమితమైన వెండి బంగారాలను ఇచ్చి యుధిష్ఠిరుని యజ్ఞమండపాన్ని ప్రవేశించగలిగారు. (20 1/2)
ఇంద్రగోపకవర్ణాభాన్ శుకవర్ణాన్ మనోజవాన్ ॥ 21
తథైవేంద్రాయుధనిభాన్ సంధ్యాభ్రసదృశానపి ।
అనేకవర్ణానారణ్యాన్ గృహీత్వాశ్వాన్ మహాజవాన్ ॥ 22
జాతరూపమనర్ఘ్యం చ దదుస్తస్యైకపాదకాః ।
ఏకపాదదేశీయులైన రాజులు ఆర్ద్రపురుగుల వలె ఎఱ్ఱనై చిలుకలవలె పచ్చనై మనోవేగం గలవై ఇంద్రధనుస్సువలె వివిధవర్ణశోభితాలై సంధ్యామేఘాల వలె ఎఱ్ఱనివై, అనేక వర్ణాలు కల మహావేగవంతాలైన అడవి గుఱ్ఱాలను, ఇంకా విలువైన బంగారాన్ని సమర్పించారు. (21,22 1/2)
చీకాన్ శకాన్ తథా చౌఢ్రాన్ బర్బరాన్ వనవాసినః ॥ 23
వార్ష్ణేయాన్ హారహుణాంశ్చ కృష్ణాన్ హైమవతాంస్తథా ।
నీపానూపానధిగతాన్ వివిధాన్ ద్వారవారితాన్ ॥ 24
బల్యర్థం దదతస్తస్య నానారూపాననేకశః ।
కృష్ణగ్రీవాన్ మహాకాయాన్ రాసభాన్ శతపాతినః ।
అహార్షుర్దశసాహస్రాన్ వినీతాన్ దిక్షు విశ్రుతాన్ ॥ 25
చీన, శక, ఓఢ్ర, బర్బర, వనవాసులైన వార్షేయ, హార, హూణ, కృష్ణ, హిమవత్పర్వతప్రాంత, నీప, అనూపదేశాధిపతులైన అనేకులు ద్వారం వద్దనే నిలిచిపోయారు. వారు యుధిష్ఠిరుని యజ్ఞానికి వివిధాకారాలు కల పదివేల కంచరగాడిదలను కానుకలుగా తెచ్చారు. అవి నల్లని మెడ, పెద్ద శరీరం కలవి. వందక్రోసుల దూరం పరుగెత్తగలవి. మంచి శిక్షణ గలవి, లోకవిఖ్యాతి నందినవి. (23-25)
ప్రమాణరాగస్పర్శాఢ్యం బాహ్లీచీనసముద్భవమ్ ।
ఔర్ణం చ రాంకవం చైవ కీటజం పట్టజం తథా ॥ 26
కుటీకృతం తథైవాత్ర కమలాభం సహస్రశః ।
శ్లక్ష్ణం వస్త్రమకార్పాసమ్ ఆవికం మృదుచాజినమ్ ॥ 27
నిశితాంశ్చైవ దీర్ఘాసీన్ ఋష్టిశక్తి పరశ్వథాన్ ।
అపరాంత సముద్భూతాన్ తథైవ పరశూన్ శితాన్ ॥ 28
రసాన్ గంధాంశ్చ వివిధాన్ రత్నాని చ సహస్రశః ।
బలిం చ కృత్స్నమాదాయ ద్వారి తిష్ఠంతి వారితాః ॥ 29
శకాస్తుషారాః కంకాశ్చ రోమశాః శృంగిణో నరాః ।
తగినంత పొడవు వెడల్పులు కలిగి, తాకాలనిపించే చక్కని రంగులతో, బాహ్లీ చీన దేశాలలో తయారయినవి; ఉన్ని, రంగుమృగచర్మంతో చేసినవి; పట్టుపురుగుల నుండి వచ్చినవి; పూలగుత్తులతో, కమలాలతో సమానమైన మృదుత్వం
కలిగి, పత్తి అనేదే లేకుండా తయారయిన వేలకొద్దీ వస్త్రాలను; మృదువైన మృగచర్మాలను; వాడిగా పొడుగ్గా ఉండేకత్తులను, ఋష్టి, శక్తి పరశ్వథాయుధాలను; పశ్చిమదేశాలలో తయారయిన వాడి గొడ్డళ్లను, వివిధ రసాలను, గంధాలను, వేల రత్నాలను, కానుకలుగా తీసుకొని వచ్చిన శక, తుషార, కంక, రోమశ, శృంగి దేశాల రాజులు ద్వారం వద్దనే నిలిపి వేయబడ్డారు. (26-29 1/2)
మహాగజాన్ దూరగమాన గణితానర్బుదాన్ హయాన్ ॥ 30
శతశశ్చైవ బహుశః సువర్ణం పద్మసమ్మితమ్ ।
బలిమాదాయ వివిధం ద్వారి తిష్ఠంతి వారితాః ॥ 31
అతిదూరం ప్రయాణించగల అర్బుద సంఖ్య కల మదపుటేనుగులను, వందల అర్బుదాలగుఱ్ఱాలను; పద్మసంఖ్య కల బంగారాన్ని ఇంకా అనేక ఇతరవస్తువులను కానుకలుగా తెచ్చినవారు కూడా ద్వారం వద్దనే నిలిచిపోయారు. (30-31)
ఆసనాని మహార్హాణి యాయాని శయనాని చ ।
మణికాంచనచిత్రాణి గజదంతమయాని చ ॥ 32
కవచాని విచిత్రాణి శస్త్రాణి వివిధాని చ ।
రథాంశ్చ వివిధాకారాన్ జాతరూపపరిష్కృతాన్ ॥ 33
హయైర్వినీతైః సంపన్నాన్ వైయాఘ్రపరివారితాన్ ।
విచిత్రాంశ్చ పరిస్తోమాన్ రత్నాని వివిధాని చ ॥ 34
నారాచానర్ధనారాచాన్ శాస్త్రాణి వివిధాని చ ।
ఏతద్ దత్త్వా మహద్ ద్రవ్యం పూర్వదేశాధిపా నృపాః ।
ప్రవిష్టా యజ్ఞసదనం పాండవస్య మహాత్మనః ॥ 35
విలువైన ఆసనాలు, వాహనాలు, రత్నాలు, బంగారం తాపడం చేసిన ఏనుగుదంతపు మంచాలు, విచిత్రమైన కవచాలు, సుశిక్షతమైన గుఱ్ఱాలు పూన్చిన వివిధాకారాలు గల రథాలు, ఏనుగులమీద రథాల మీద పరిచే విచిత్రమైన కంబళ్లు, అనేక రత్నాలు, నారాచాలు, అర్ధనారాచాలు, వివిధశస్త్రాలు - ఇవన్నీ కానుకలుగా ఇచ్చి పూర్వదేశాధిపతులైన రాజులు యుధిష్ఠిరుని యజ్ఞమండపాన్ని ప్రవేశించారు. (32-35)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి దుర్యోధనసంతాపే ఏకపంచాశత్తమోఽధ్యాయః ॥ 51 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున దుర్యోధన సంతాపమను ఏబది ఒకటవ అధ్యాయము. (51)
(దాక్షిణాత్య అధికపాఠము 26 శ్లోకములు కలిపి మొత్తము 61 శ్లోకములు)