53. ఏబది మూడవ అధ్యాయము
దుర్యోధనుని యుధిష్ఠిరుని పట్టాభిషేకమును వర్ణించుట.
దుర్యోధన ఉవాచ
ఆర్యాస్తు యే వై రాజనః సత్యసంధా మహావ్రతాః ।
పర్యాప్తవిద్యా వక్తారః వేదోక్తావభౄథప్లుతాః ॥ 1
ధృతిమంతో హ్రీనిషేవా ధర్మాత్మానో యశస్వినః ।
మూర్ధాభిషిక్తాస్తే చైనం రాజానః పర్యుపాసతే ॥ 2
దక్షిణార్థం సమానీతాః రాజభిః కాంస్యదోహనాః ।
ఆరణ్యా బహుసాహస్రాః అపశ్యంస్తత్ర తత్ర గాః ॥ 3
ఆర్యులు, సత్యసంధులు, మహావ్రతులు, పండితులు, వక్తలు, వేదోక్తమైన అవభృథస్నానాలతో తడిసినవారు, ధృతిమంతులు, లజ్జాశీలులు, ధర్మాత్ములు, కీర్తిపరులు, మూర్ధాభిషిక్తులు - అయిన రాజులు యుధిష్టిరుని సేవిస్తున్నారు. దక్షిణ కొఱకు రాజులు తెచ్చిన ఆవులు - అరణ్యాలలో పెరిగినవి - ఎన్నో వేలు అక్కడక్కడా ఉండడం చూశాను. వాటి పాలు తీయడానికి కంచుపాత్రలు ఉన్నాయి. (1-3)
ఆజహ్రుస్తత్ర సత్కృత్య స్వయముద్యమ్య భారత ।
అభిషేకార్థమవ్యగ్రాః భాండముచ్చావచం నృపాః ॥ 4
బాహ్లీకో రథమాహార్షీత్ జాంబూనదవిభూషితమ్ ।
సుదక్షిణస్తు యుయుజే శ్వేతైః కాంబోజజైర్హయైః ॥ 5
భారతా! అక్కడిరాజులందరూ యుధిష్ఠిరుని అభిషేకించడానికి శాంతచిత్తులై స్వయంగా పూనుకొని సత్కారపూర్వకంగా చిన్న, పెద్ద పాత్రలు పట్టుకొని వచ్చారు. బాహ్లీకుడు బంగారంతో అలంకరింపబడిన రథం తెచ్చాడు. సుదక్షిణుడు దానికి కాంబోజదేశపు తెల్లని గుఱ్ఱాలను పూన్చాడు. (4,5)
సునీథః ప్రీతిమాంశ్చైవ హ్యనుకర్షం మహాబలః ।
ధ్వజం చేదిపతిశ్చైవమ్ అహార్షీత్ స్వయముద్యతమ్ ॥ 6
దాక్షిణాత్యః సంనహనం స్రగుష్ణీషే చ మాగధః ।
వసుదానో మహేష్వాసః గజేంద్రం షష్టిహాయనమ్ ॥ 7
మత్స్యస్త్వక్షాన్ హేమనద్ధాన్ ఏకలవ్య ఉపానహౌ ।
ఆవన్త్యస్త్వభిషేకార్థం ఆపో బహువిధాస్తథా ॥ 8
చేకితాన ఉపాసంగే ధనుః కాశ్య ఉపాహరత్ ।
అసిం చ సుత్సరుం శల్యః శైక్యం కాంచనభూషణమ్ ॥ 9
మహాబలుడైన సునీథుడు మిక్కిలి ప్రేమతో అనుకర్షను (రథాన్ని కిందికి దించడానికి ఉపయోగించే కఱ్ఱ) తగిలించాడు. చేదిరాజు కవచాన్ని ఇచ్చాడు. మగధరాజు హారాలను, శిరస్త్రాణాన్ని ఇచ్చాడు. మహాధనుర్ధరుడయిన వసుదానుడు అరవై ఏళ్ల గజరాజును సిద్ధం చేశాడు. మత్స్యరాజు బంగారు, ధనంతో నిండిన శకటాలను ఇచ్చాడు. ఏకలవ్యుడు పాదుకలు తెచ్చాడు. అవంతిరాజు అభిషేకం కోసం వివిధరకాల జలాలను సేకరించాడు. చేకితానుడు అమ్ములపొదిని, కాశీరాజు ధనుస్సును ఇచ్చారు. శల్యుడు చక్కని పిడి గల కత్తిని ఉట్టికి కట్టిన బంగారుకలశాన్ని ఇచ్చాడు. (6-9)
అభ్యషించత్ తతో ధౌమ్యః వ్యాసశ్చ సుమహాతపాః ।
నారదం చ పురస్కృత్య దేవలం చాసితం మునిమ్ ॥ 10
అనంతరమ్ ధౌమ్యుడు, మహాతపస్వి వ్యాసుడు - నారదుని, అసితుని, దేవలుని ముందుంచుకొని యుధిష్ఠిరుని అభిషేకించారు. (10)
ప్రీతిమంత ఉపాతిష్ఠన్ అభిషేకం మహర్షయః ।
జామదగ్న్యేన సహితాః తథాన్యే వేదపారగాః ॥ 11
పరశురామునితో కూడి వేదపారంగతులైన ఇతర మహర్షులు కూడా ప్రీతితో యుధిష్ఠిరుని అభిషేకించారు. (11)
అభిజగ్ముర్మహాత్మానః మంత్రవద్ భూరిదక్షిణమ్ ।
మహేంద్రమివ దేవేంద్రం దివి సప్తర్షయో యథా ॥ 12
స్వర్గంలో దేవరాజు అయిన మహేంద్రుని సప్తర్షులు సమీపించినట్లుగా మంత్రాలు చదువుతూ మహాత్ములయిన ద్విజులు భూరిదక్షిణలిచ్చే యుధిష్ఠిరుని సమీపించారు. (12)
అధారయచ్ఛత్రమస్య సాత్యకిః సత్యవిక్రమః ।
ధనంజయశ్చ వ్యజనే భీమసేనశ్చ పాండవః ॥ 13
సత్యవిక్రముడైన సాత్యకి ఛత్రాన్ని, పాండవులైన భీమధనంజయులు వ్యజనాలను పట్టుకొన్నారు. (13)
చామరే చాపి శుద్ధే ద్వే యమౌ జగృహతుస్తథా ।
ఉపాగృహ్ణాద్ యమింద్రాయ పురాకల్పే ప్రజాపతిః ॥ 14
తమస్మై శంఖమాహార్షీద్ వారుణమ్ కలశోదధిః ।
శైక్యం నిష్కసహస్రేణ సుకృతం విశ్వకర్మణా ॥ 15
తేనాభిషిక్తః కృష్ణేన తత్ర మే కశ్మలోఽభవత్ ।
నకులసహదేవులు రెండు తెల్లని చామరాలను పట్టుకొన్నారు. పూర్వం ప్రజాపతి ఇంద్రునికి ఇచ్చిన వరుణదేవతాకమైన శంఖాన్ని సముద్రుడు యుధిష్ఠిరునికి కానుకగా పంపాడు. విశ్వకర్మ వేయి బంగారు నాణేలతో ఉట్టియందు ఉంచే కలశాన్ని నిర్మించాడు. అందులోని సముద్రజలాన్ని కృష్ణుడు శంఖంతో తీసుకొని యుధిష్ఠిరుని అభిషేకించాడు. అప్పుడు నా మనసు పాడయింది. (14 -15 1/2)
గచ్ఛంతి పూర్వాదపరం సముద్రం చాపి దక్షిణమ్ ॥ 16
లోకులు జలాన్ని తేవడానికి పూర్వసముద్రం నుండి పశ్చిమసముద్రానికి వెడతారు. దక్షిణదిక్కుకు కూడా వెళ్తారు. (16)
ఉత్తరం తు న గచ్ఛంతి వినా తాత పతత్త్రిభిః ।
తత్ర స్మ దధ్ముః శతశః శంఖాన్ మంగళకారకాన్ ॥ 17
ప్రాణదంత సమాధ్మాతాః తతో రోమాణి మేఽహృషన్ ।
ప్రాపతన్ భూమిపాలాశ్చ యే తు హీనాః స్వతేజసా ॥ 18
తండ్రీ! ఉత్తర దిక్కుకు పక్షులు తప్ప వేరెవరూ వెళ్లలేరు. అక్కడ అభిషేక సమయంలో వందల కొద్దీ మంగళ కారకాలయిన శంఖాలు మ్రోగాయి. అలా మ్రోగిన ధ్వనికి నా రోమాలు నిక్కపొడుచుకొన్నాయి. తేజస్సుచేత అల్పులయిన రాజులు నేలపై పడిపోయారు. (17,18)
ధృష్టద్యుమ్నః పాండవాశ్చ సాత్యకిః కేశవోఽష్టమః ।
సత్త్వస్థా వీర్యసంపన్నాః హ్యన్యోన్యప్రియదర్శనాః ॥ 19
ధృష్టద్యుమ్నుడు, పంచపాండవులు, సాత్యకి, వీరితో పాటు, ఎనిమిదవ వాడైన శ్రీకృష్ణుడు - వీరందరూ ధైర్యంగా ఉన్నారు. వీరు వీర్యసంపన్నులు. అన్యోన్యప్రియంగా మసలుకొనేవారు. (19)
విసంజ్ఞాన్ భూమిపాన్ దృష్ట్వా మాం చ తే ప్రాహసంస్తదా ।
తతః ప్రహృష్టో బీభత్సుః ప్రాదాద్ధేమవిషాణినామ్ ॥ 20
శతాన్యనడుహాం పంచ ద్విజే ముఖ్యేషు భారత ।
న రంతిదేవో నాభాగః యౌవనాశ్వో మనుర్న చ ॥ 21
న చ రాజా పృథుర్వైన్యః న చాప్యాసీద్ భగీరథః ।
యయాతిర్నహుషో వాపి యథా రాజా యుధిష్ఠిరః ॥ 22
మూర్ఛిల్లిన రాజులను, నన్ను చూచి వారు హేళన చేశారు. అనంతరం అర్జునుడు మిక్కిలి హర్షంతో బంగారు కొమ్ములు కలిగిన ఐదు వందల ఎడ్లను ద్విజముఖ్యులకు దానం చేశాడు. తండ్రీ! రంతిదేవుడు, నాభాగుడు, మాంధాత, మనువు, వేనుని కొడుకైన పృథుమహారాజు, భగీరథుడు, యయాతి, నహుషుడు కూడా యుధిష్ఠిరుని వలె మహాసమ్రాట్టులు కారు. (20-22)
యథాతిమాత్రం కౌంతేయః శ్రియా పరమయా యుతః ।
రాజసూయమవాప్యైవం హరిశ్చంద్ర ఇవ ప్రభుః ॥ 23
అత్యధికమైన పరమసంపదతో కూడిన కౌంతేయుడు రాజసూయయాగం చేసి హరిశ్చంద్రుని వలె చక్రవర్తి అయ్యాడు. (23)
ఏతామ్ దృష్ట్వా శ్రియమ్ పార్థే హరిశ్చంద్రే యథా విభో ।
కథం తు జీవితం శ్రేయః మమ పశ్యసి భారత ॥ 24
భారతా! హరిశ్చంద్రునికి వలె యుధిష్ఠిరునికి లభించిన ఈ సంపదను చూచి నేను జీవించి ఉండడం శ్రేయస్కరమని ఎలా అనుకొంటున్నావు? (24)
అంధేనేవ యుగం నద్ధం విపర్యస్తం నరాధిప ।
కనీయాంసో వివర్ధంతే జ్యేష్ఠా హీయంత ఏవ చ ॥ 25
రాజా! గ్రుడ్డివాడివలె విధాత ఈ కాలాన్ని అస్తవ్యస్తంగా సంఘటించాడు. చిన్నలు వృద్ధిపొందుతున్నారు. పెద్దలు క్షీణిస్తున్నారు. (25)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి దుర్యోధన సంతాపే త్రిపంచాశత్తమోఽధ్యాయః ॥ 53 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున దుర్యోధన సంతాపమను ఏబది మూడవ అధ్యాయము. (53)