60. అరువదియవ అధ్యాయము

ద్యూతప్రారంభము.

వైశంపాయన ఉవాచ
ఉపోహ్యమానే ద్యూతే తు రాజానః సర్వ ఏవ తే ।
ధృతరాష్ట్రం పురస్కృత్య వివిశుస్తాం సభాం తతః ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - జూదం ఆరంభమ్ కాగానే రాజులందరూ ధృతరాష్ట్రుని ముందు ఉంచుకొని సభలో ప్రవేశించారు. (1)
భీష్మో ద్రోణః కృపశ్చైవ విదురశ్చ మహామతిః ।
నాతిప్రీతేన మనసా తేఽన్వవర్తంత భారత ॥ 2
భారతా! భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, మహామతి అయిన విదురుడు అసంతుష్టమైన మనసుతోనే ధృతరాష్ట్రుని అనుసరించారు. (2)
తే ద్వంద్వశః పృథక్ చైవ సింహగ్రీవా మహౌజసః ।
సింహాసనాని భూరీణి విచిత్రాణి చ భేజిరే ॥ 3
సింహసమానులు, మహాతేజస్వులు అయిన ఆ రాజులు ఇద్దరిద్దరు చొప్పున, ఒక్కొక్కరు చొప్పున బహుసంఖ్యాకమైన విచిత్రాలైన ఆసనాలను అధిష్ఠించారు. (3)
శుశుభే సా సభా రాజన్ రాజభిస్తైః సమాగతైః ।
దేవైరివ మహాభాగైః సమవేతైస్త్రివిష్టపమ్ ॥ 4
రాజా! మహాభాగులైన దేవతలు ఒక్కచోట కూడితే స్వర్గం ఎలా ఉంటుందో అలాగే వచ్చిన రాజులందరితో ఆ సభ ప్రకాశించింది. (4)
సర్వే వేదవిదః శూరాః సర్వే భాస్వరమూర్తయః ।
ప్రావర్తత మహారాజ సుహృద్ ద్యూతమనంతరమ్ ॥ 5
మహారాజా! వారందరూ వేదవేత్తలు. శూరులు. అందరూ ప్రకాశవంతమైన శరీరాలు కలవారు. అనంతరం సుహృద్ద్యూతం ఆరంభం అయింది. (5)
యుధిష్ఠిర ఉవాచ
అయం బహుధనో రాజన్ సాగరావర్తసంభవః ।
మణిర్హారోత్తరః శ్రీమాన్ కనకోత్తమభూషణః ॥ 6
యుధిష్ఠిరుడు అంటున్నాడు - రాజా! ఇదిగో! బహుమూల్యమైన, సాగరావర్తసంభవమైన మణిని పొదిగిన, బంగారుమయమైన ఆభరణం. ఇది శ్రేష్ఠమైన శోభాయుతమైన హారం. (6)
ఏతద్ రాజన్ మమ ధనం ప్రతిపాణోఽస్తి కస్తవ ।
యేన మాం త్వం మహారాజ ధనేన ప్రతిదీవ్యసే ॥ 7
రాజా! ఇదే నేను ఒడ్డిన ధనం. ప్రతిపణంగా నీవేమి ఒడ్డుతున్నావు? మహారాజా! ఏధనంతో నీవు నాతో జూదమాడాలనుకొంటున్నావు? (7)
దుర్యోధన ఉవాచ
సంతి మే మణయశ్చైవ ధనాని సుబహూని చ ।
మత్సరశ్చ న మేఽర్థేషు జయస్వైనం దురోదరమ్ ॥ 8
దుర్యోధనుడు చెపుతున్నాడు - నావద్ద మణులు, ధనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సంపదల పట్ల నాకు లోభం లేదు. ఈ జూదాన్ని నీవు గెలుచుకో. (8)
వైశంపాయన ఉవాచ
తతో జగ్రాహ శకునిః తానక్షానక్షతత్త్వవిత్ ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 9
వైశంపాయనుడు చెపుతున్నాడు - అనంతరం అక్షతత్త్వవేత్త అయిన శకుని ఆ పాచికలను తీసుకొన్నాడు. 'ఓడిపోయావులే' అని శకుని యుధిష్ఠిరునితో అన్నాడు. (9)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి ద్యూతారంభే షష్టితమోఽధ్యాయః ॥ 60॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున ద్యూతారంభము అను అరువదియవ అధ్యాయము. (60)