61. అరువది ఒకటవ అధ్యాయము

యుధిష్ఠిరుడు ప్రతిపందెమును ఓడిపోవుట.

యుధిష్ఠిర ఉవాచ
మత్తః కైతవకేనైవ యజ్జితోఽస్మి దురోదరే ।
శకునే హంత దీవ్యామః గ్లహమానాః పరస్పరమ్ ॥ 1
యూధిష్ఠిరుడు అంటున్నాడు - శకునీ! జూదంలో నన్ను మోసంతో జయించానని గర్విస్తున్నావు. పాచికలు తీసుకొని పరస్పరమ్ మళ్లీ పందెం వేద్దాం. (1)
సంతి నిష్కసహస్రస్య భాండిన్యో భరితాః శుభాః ।
కోశో హిరణ్యమక్షయ్యం జాతరూపమనేకశః ।
ఏతద్ రాజన్ మమ ధనం తేన దీవ్యామ్యహం త్వయా ॥ 2
రాజా! వేయి నిష్కాలతో నిండి ఉన్న చక్కని భాండాలు ఉన్నాయి. కోశం ఉంది. అక్షయమైన హిరణ్యం ఉంది. అనేకరకాలైన బంగారం ఉంది. ఇదీ నా ధనం. దీనిని ఒడ్డి నీతో జూదం ఆడతాను. (2)
వైశంపాయన ఉవాచ
కౌరవాణాం కులకరం జ్యేష్ఠం పాండవమచ్యుతమ్ ।
ఇత్యుక్తః శకునిః ప్రాహ జితమిత్యేవ తం నృపమ్ ॥ 3
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఇలా అన్న కౌరవకులోద్ధారకుడు, మర్యాదలనుండి దిగజారనివాడు, జ్యేష్ఠుడు అయిన ఆ యుధిష్ఠిరునితో శకుని "ఇదిగో. ఈ పందెం కూడా నేను గెలిచాను" అన్నాడు. (3)
యుధిష్ఠిర ఉవాచ
అయం సహస్రసమితః వైయాఘ్రః సుప్రతిష్టితః ।
సుచక్రోపస్కరః శ్రీమాన్ కింకిణీజాలమండితః ॥ 4
సంహ్రాదనో రాజరథః య ఇహాస్మానుపావహత్ ।
జైత్రో రథవరః పుణ్యః మేఘసాగరనిఃస్వనః ॥
అష్టౌ యం కురరచ్ఛాయాః సదశ్వా రాష్ట్రసమ్మతాః ॥ 5
వహంతి నైషామ్ ముచ్యేత పదాద్ భూమిముపస్పృశన్ ।
ఏతద్ రాజన్ ధనమ్ మహ్యం తేన దీవ్యామ్యహం త్వయా ॥ 6
యుధిష్ఠిరుడు అంటున్నాడు - ఇక్కడికి మమ్మల్ని మోసితెచ్చిన ఈ రాజరథం ఆహ్లాదకరమైనది. జైత్రమనే పేరు గల రథశ్రేష్ఠం. ఇది వేయి రథాలతో సమానమైనది. పులిచర్మంతో కప్పబడి, అతి దృఢంగా ఉన్నది. చక్కని చక్రాలతో ఇతరసామగ్రితో అలంకరింపబడినది. శోభాకరమైన ఇది చిరుమువ్వలతో అలరారుతోంది. పుణ్యమయమైన ఇది కదులుతున్నప్పుడు మేఘం వలె, సాగరం వలె ఘోషిస్తోంది. కురరపక్షుల వంటి వర్ణం కలిగి దేశమంతటా ప్రసిద్ధికెక్కిన ఎనిమిది మేలు జాతి గుఱ్ఱాలు ఈ రథాన్ని వహిస్తున్నాయి. నేలను తాకుతూ ఉన్నప్పుడు వీటి పాదాల నుండి ఏదీ తప్పించుకోలేదు. రాజా! ఇది నా సొత్తు. దీనిని పణంగా పెట్టి నీతో జూదం ఆడతాను. (4-6)
వైశంపాయన ఉవాచ
ఏవం శ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 7
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఇది విని మోసాన్ని ఆశ్రయించి పాచికలు వేస్తున్న శకుని యుధిష్ఠిరునితో "ఇదిగో ఓడిపోయావు" అన్నాడు. (7)
యుధిష్ఠిర ఉవాచ
శతం దాసీసహస్రాణి తరుణ్యో హేమభద్రికాః ।
కంబుకేయూరధారిణ్యః నిష్కకంఠ్యః స్వలంకృతాః ॥ 8
మహార్హ మాల్యాభరణాః సువస్త్రాశ్చందనోక్షితాః ।
మణీన్ హేమ చ బిభ్రత్యః చతుఃషష్టివిశరదాః ॥ 9
అనుసేవాం చరంతీమాః కుశలా నృత్యసామసు ।
స్నాతకానామమాత్యానాం రాజ్ఞాం చ మమ శాసనాత్ ।
ఏతద్ రాజన్ మమ ధనమ్ తేన దీవ్యామ్యహం త్వయా ॥ 10
యుధిష్ఠిరుడు అంటున్నాడు - తరుణవయసులో ఉన్న లక్షమంది దాసీలున్నారు. వారు మంగళకరమైన బంగారు ఆభరణాలు ధరించి ఉన్నారు. చేతులకు శంఖాల గాజులు, భుజాలకు కేయూరాలు, మెడలో నిష్కహారాలు ధరించారు. ఇంకా ఎన్నో మంచి అలంకారాలు, మిక్కిలి విలువైన హారాభరణాలు, ధరించి ఉన్నారు. మంచి వస్త్రాలను కట్టుకొని చందనలేపనమ్ చేసుకొన్నారు. రత్నాలు, బంగారం ధరించారు. చతుష్షష్టికళలఓ నేర్పరులు. సంగీత నృత్యాలలో ఆరితేరినవారు. నా ఆదేశానుసారం స్నాతకులకు, మంత్రులకు, రాజులకు వెన్నంటి ఉండి సేవలు చేస్తారు. ఇది నా ధనం. దీనిని ఒడ్డి నీతో జూదమాడుతాను. (8-10)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 11
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఇది విని మోసాన్ని ఆశ్రయించి పాచికలు వేస్తున్న శకుని యుధిష్ఠిరునితో "ఇదిగో ఓడిపోయావు" అన్నాడు. (11)
యుధిష్ఠిర ఉవాచ
ఏతావంతి చ దాసానాం సహస్రాణ్యుత సంతి మే ।
ప్రదక్షిణానులోమాశ్చ ప్రావారవసనాః సదా ॥ 12
యుధిష్ఠిరుడు అంటున్నాడు - దాసీల వలెనే నా వద్ద లక్షమంది దాసులు ఉన్నారు. వారు కార్యనైపుణ్యం కలవారు. అనుకూలురు. ఎల్లప్పుడూ ఉత్తరీయాలు ధరించి ఉంటారు. (12)
ప్రాజ్ఞా మేధావినో దాంతాః యువానో మృష్టకుండలాః ।
పాత్రీహస్తా దివారాత్రమ్ అతిథీన్ భోజయంత్యుత ।
ఏతద్ రాజన్ మమ ధనం తేన దీవ్యామ్యహం త్వయా ॥ 13
వారు ప్రాజ్ఞులు, మేధావులు, సంయమనం కలవారు, యువకులు, ప్రకాశించే కుండలాలు ధరించినవారు. వారు పాత్రహస్తులై రాత్రింబవళ్లు అతిథులకు భోజనం వడ్డిస్తూ ఉంటారు. ఇది నా వద్ద ఉన్నధనం. దీనిని ఒడ్డి నీతో జూదం ఆడుతాను. (13)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 14
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఇది విని మోసాన్ని ఆశ్రయించి పాచికలు వేస్తున్న శకుని యుధిష్ఠిరునితో "ఇదిగో ఓడిపోయావు" అన్నాడు. (14)
యుధిష్ఠిర ఉవాచ
సహస్రసంఖ్యా నాగా మే మత్తాస్తిష్ఠంతి సౌబల ।
హేమకక్షాః కృతాపీడాః పద్మినో హేమమాలినః ॥ 15
యుధిష్ఠిరుడు అంటున్నాడు - సౌబలా! నావద్ద వేయిమదపుటేనుగులు ఉన్నాయి. అవి బంగారు గొలుసులతో బంధింపబడి ఉంటాయి. పద్మచిహ్నాలు కలిగి, బంగారు హారాలతో, ఆభరణాలతో అలంకరింపబడి ఉంటాయి. (15)
సుదాంతాః రాజవహనాః సర్వశబ్దక్షమా యుధి ।
ఈషాదన్తా మహాకాయాః సర్వే చాష్టకరేణవః ॥ 16
అవన్నీ చక్కగా వశమై ఉంటాయి. రాజుల సవారీకోసం ఉపయోగపడతాయి. యుద్ధాలలో అన్ని రకాల శబ్దాలను సహించగలవు. పొడవైన దంతాలతో, విశాలమైన శరీరాలతో ఒప్పుతూ ఉంటాయి. అన్నీ కూడా ఒక్కొక్కటి ఎనిమిది ఆడ ఏనుగులతో కూడి ఉంటాయి. (16)
సర్వే చ పురభేత్తారః నవమేఘనిభా గజాః ।
ఏతద్ రాజన్ మమ ధనం తేన దీవ్యామ్యహం త్వయా ॥ 17
అన్ని ఏనుగులూ కూడా నగరాలను నాశనం చేయగలవు. నూతనమేఘాలతో సమానమైన కాంతి గలవి. ఇదంతా నాకున్న ధనం. దీనిని ఒడ్డి నీతో జూదం ఆడుతాను. (17)
వైశంపాయన ఉవాచ
ఇత్యేవం వాదినం పార్థం ప్రహసన్నివ సౌబలః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 18
వైశంపాయనుడు చెపుతున్నాడు - కుంతీతనయుడు ఇలా చెప్పగానే సౌబలుడు నవ్వుతూ యుధిష్ఠిరునితో "ఇదిగో ఓడిపోయావు" అన్నాడు. (18)
యుధిష్ఠిర ఉవాచ
రథాస్తావంత ఏవేమే హేమదండాః పతాకినః ।
హయైర్వినీతైః సంపన్నా రథిభిశ్చిత్రయోధిభిః ॥ 19
ఏకైకో హ్యత్ర లభతే సహస్రపరమాం భృతిమ్ ।
యుధ్యతోఽయుధ్యతో వాపి వేతనమ్ మాసకాలికమ్ ।
ఏతద్ రాజన్ మమ ధనం తేన దీవ్యామ్యహం త్వయా ॥ 20
యుధిష్ఠిరుడు అంటున్నాడు - ఈ రథాలు కూడా అంతే సంఖ్యకలవి. ఈ వేయి రథాలు బంగారు కొయ్యలతో, పతాకాలతో కూడి ఉన్నాయి. సుశిక్షితమైన గుఱ్ఱాలు పూన్చబడినాయి. చిత్రవిచిత్రంగా యుద్ధం చేసే యోధులయిన రథికులతో కూడి ఉన్నాయి. వారికి ఒక్కొక్కరికి వేయిసువర్ననాణెములు వేతనంగా లభిస్తాయి. వారు యుద్ధం చేస్తున్నా, చేయకున్నా ప్రతినెలకు వేతనం పొందుతారు. ఇది నా ధనం. దీనిని ఒడ్డి నీతో జూదపాడుతాను. (19,20)
వైశంపాయన ఉవాచ
ఇత్యేవముక్తే వచనే కృతవైరో దురాత్మవాన్ ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 21
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఇలా యుధిష్ఠిరుడు చెప్పగానే వైరంపూనిన ఆ దుర్మార్గుడు శకుని - "ఇదిగో ఓడిపోయావు" అన్నాడు. (21)
యుధిష్టిర ఉవాచ
అశ్వాంస్తిత్తిరికల్మాషాన్ గంధర్వాన్ హేమమాలినః ।
దదౌ చిత్రరథస్తుష్టః యాంస్తాన్ గాండీవధన్వనే ॥ 22
యుద్ధే జితః పరాభూతః ప్రీతిపూర్వమరిందమః ।
ఏతద్ రాజన్ మమ ధనం తేన దీవ్యామ్యహం త్వయా ॥ 23
యుధిష్ఠిరుడు అంటున్నాడు - తిత్తిరిపక్షుల వలె చిత్రమైన వర్ణాలు కల, బంగారుహారాలు కల గంధర్వాశ్వాలు నా వద్ద ఉన్నాయి. శత్రుదమనుడైన చిత్రరథుడు యుద్ధంలో ఓడి పరాభూతుడై, ప్రీతిపూర్వకంగా, తృప్తి చెంది వాటిని గాంఢీవధనుస్సు ధరించిన అర్జునునకు ఇచ్చాడు. ఇది నా ధనం. ఇవి ఒడ్డి నీతో జూదమాడుతాను. (22,23)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 24
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఇది విని వంచననే ఆశ్రయించి పాచికలాడే శకుని యుధిష్ఠిరునితో "ఇదిగో ఓడిపోయావు" అన్నాడు. (24)
యుధిష్ఠిర ఉవాచ
రథానాం శకటానాం చ శ్రేష్ఠానాం చాయుతాని మే ।
యుక్తాన్యేవ హి తిష్ఠంతి వాహైరుచ్చావచై స్తథా ॥ 25
యుధిష్ఠిరుడు అంటున్నాడు - నా వద్ద పదివేల శ్రేష్ఠమైన రథాలు, బండ్లు - నానావిధాలయిన గుర్రాలు పూన్చినవి ఉన్నాయి. (25)
ఏవం వర్ణస్య వర్ణస్య సముచ్చయ సహస్రశః ।
యథా సముదితా వీరాః సర్వే వీరపరాక్రమాః ॥ 26
అలాగే ఒక్కొక్క వర్ణానికి వేలకొద్దీ ఎంపిక చేయబడిన యోధులు నావద్ద ఉన్నారు. వారంతా వీరోచితపరాక్రమంతో కూడిన మహాశూరులు. (26)
క్షీరం పిబంతస్తిష్ఠంతి భుంజానాః శాలితండులాన్ ।
షష్టిస్తాని సహస్రాణి సర్వే విపులవక్షసః ।
ఏతద్ రాజన్ మమ ధనం తేన దీవ్యామ్యహం త్వయా ॥ 27
వారిసంఖ్య అరవై వేలు. వారంతా పాలు త్రాగుతారు. శ్రేష్ఠమైన శాలిధాన్యాన్ని భుజిస్తారు. విశాలమైన వక్షఃస్థలాలు కలవారు. ఇది నావద్ద ఉన్న ధనం. దీనిని పణంగా పెట్టి నీతో జూదపాడుతాను. (27)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవస్థితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 28
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఇది విని మోసాన్ని ఆశ్రయించి పాచికలు వేస్తున్న శకుని యుధిష్ఠిరునితో "ఇదిగో ఓడిపోయావు" అన్నాడు. (28)
యుధిష్ఠిర ఉవాచ
తామ్రలోహైః పరివృతాః నిధయో యే చతుఃశతా ।
పంచద్రౌణిక ఏకైకః సువర్ణస్యాహ తస్య వై ॥ 29
జాతరూపస్య ముఖ్యస్య అనర్ఘే యస్య భారత ।
ఏతద్ రాజన్ మమ ధనం తేన దీవ్యామ్యహం త్వయా ॥ 30
యుధిష్ఠిరుడు అంటున్నాడు - నాలుగు వందల రాగిలోహపాత్రల నిండా ఒక్కొక్కదానిలో ఐదు ద్రోణుల చొప్పున శుద్ధమైన బంగారం ఉన్న నిధులు నా వద్ద ఉన్నాయి. అది పుటం పెట్టబడిన, విలువకట్టలేని స్వచ్ఛమైన బంగారం. భారతా! దానిని ఒడ్డి నీతో జూదం ఆడుతాను. (29,30)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 31
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఇది విని మోసాన్ని ఆశ్రయించి పాచికలు వేస్తున్న శకుని యుధిష్ఠిరునితో "ఇదిగో ఓడిపోయావు" అన్నాడు. (31)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి దేవనే ఏకషష్టితమోఽధ్యాయః ॥ 61॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున జూదమాడుట అను అరువది ఒకటవ అధ్యాయము. (61)