63. అరువది రెండవ అధ్యాయము
విదురుడు జూదమును వ్యతిరేకించుట.
విదుర ఉవాచ
ద్యూతం మూలం కలహస్యాభ్యుపైతి
మిథో భేదం మహతే దారుణాయ ।
యదా స్థితోఽయం ధృతరాష్ట్రస్య పుత్రః
దుర్యోధనః సృజతే వైరముగ్రమ్ ॥ 1
విదురుడిలా అన్నాడు - జూదం కలహాలకు మూలం. కడకు అభిప్రాయభేదాలు వచ్చి చాలా దారుణంగా పరిణమిస్తుంది. ధృతరాష్ట్రకుమారుడయిన దుర్యోధనుడు ఆ జూదాన్ని ఆశ్రయించి భీకరశత్రుత్వాన్ని సృష్టిస్తున్నాడు. (1)
ప్రాతిపేయాః శాంతనవాః భైమసేనాః సబాహ్లికాః ।
దుర్యోధనాపరాధేన కృచ్ఛం ప్రాప్స్యంతి సర్వశః ॥ 2
దుర్యోధనును అపరాధం వలన ప్రతీప, శంతను, భీమసేన, బాహ్లీక వంశస్థులు అన్నివిధాలా కష్టాలు పడబోతున్నారు. (2)
దుర్యోధనో మదేనైషః క్షేమం రాష్ట్రాదపోహతి ।
విషాణం గౌరివమదాత్ స్వయమారుజతేఽఽత్మనః ॥ 3
మదించిన ఆబోతు తన కొమ్మును తానే విరుచుకొన్నట్లు మదించిన ఈ దుర్యోధనుడు రాజ్యం నుండి సంక్షేమాన్ని దూరం చేస్తున్నాడు. (3)
యశ్చిత్తమన్వేతి పరస్య రాజన్
వీరః కవిః స్వామవమన్య దృష్టిమ్ ।
నావం సముద్రే ఇవ బాలనేత్రా
మారుహ్య ఘోరే వ్యసనే నిమజ్జేత్ ॥ 4
రాజా! వీరుడా, పండితుడా అయిన మనిషి తన ఆలోచనలను కాదని పరులచిత్తాన్ని అనుసరించి ప్రవర్తిస్తే సముద్రంలో మూర్ఖనవికుడు నడిపే పడవలో ఎక్కిన మనిషి వలె భయంకరకష్టాలలో మునిగిపోతాడు. (4)
దుర్యోధనో గ్లహతే పాండవేన
ప్రియాయసే త్వం జయతీతి తచ్చ ।
అతినర్మా జాయతే సంప్రహారః
యతో వినాశః సముపైతి పుంసామ్ ॥ 5
దుర్యోధనుడు యుధిష్ఠిరునితో పందెం పెట్టి జూదమాడుతున్నాడు. ఆ దుర్యోధనుడు గెలిచినట్టే భావించి నీవు ముచ్చటపడుతున్నావు. హద్దులు మీరిన వినోదంతో ఈ జూదం యుద్ధంగా మారబోతుంది. దీనివల్ల ఎందరో మనుష్యులు నశించిపోతారు. (5)
ఆకర్షస్తేఽవాక్ఫలః సుప్రణీతః
హృదు ప్రౌఢో మంత్రపదః సమాధిః ।
యుధిష్ఠిరేన కలహస్తవాయ
మచింతితోఽనభిమతః స్వబంధునా ॥ 6
ఈ జూదం అధఃపతనానికి దారితీస్తుంది. కాని (శకుని) దీనిని గొప్పగా భావించి ఏర్పాటు చేయించావు. మీరు రహస్యంగా మంత్రాంగం నెరిసి దీనిని స్థిరపరిచారు. అయితే యుధిష్ఠిరునితోడి ఈ జూదం నీ అభిప్రాయానికి విరుద్ధంగా కలహరూపంగా పరిణమిస్తోంది. (6)
ప్రాతిపేయాః శాంతనవాః శృణుధ్వం
కావ్యాం వాచం సంసది కౌరవాణాం ।
వైశ్వానరం ప్రజ్వలితం సుఘోరం
మా యాస్యధ్వం మందమనుప్రపన్నాః ॥ 7
ప్రతీపశంతను వంశస్థులారా! కౌరవసభలో నేనాడిన మాటలను వినండి. ఇది విద్వాంసులు కూడా సమ్మతించేది. మీరంతా ఈ మూర్ఖదుర్యోధనును అనుసరిస్తూ వైరంతో మండిపడే అగ్నిలోనికి దూకకండి. (7)
యదా మన్యుం పాండవోఽజాతశత్రుః
న సంయచ్ఛేదక్షమదాభిభూతః ।
వృకోదరః సవ్యసాచీ యమౌ చ
కోఽత్ర ద్వీపః స్యాత్ తుములే వస్తదానీమ్ ॥ 8
జూదం మత్తులో మైమరచి ఉన్న అజాతశత్రువయిన యుధిష్ఠిరుడు తనకోపాన్ని నియంత్రించుకొనకపోతే, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా కోపంతో చెలరేగితే జరగబోయే యుద్ధంలో విపత్సముద్రంలో మునిగిపోయిన మీకు ఆశ్రయమిచ్చేవాడెవడు? (8)
మహారాజ ప్రభవస్త్వం ధనానాం
పురాద్యూతాన్మనసా యావదిచ్ఛేః ।
బహువిత్తాన్ పాండవాంశ్చేజ్జయస్త్వం
కింతే తత్ స్యాద్ వసు విందేహ పార్థాన్ ॥ 9
మహారాజా! జూదమాడకపోయినా నీవు కోరుకొన్నంత ధనాన్ని పొందగలవు. బహుసంపన్నులైన పాండవులను జూదంలో ఓడించినంత మాత్రాన నీకు ఒరిగేదేముంది? పాండవులు ధనస్వరూపులు. వారిని సొంతం చేసికో. (9)
జానీమహే దేవితం సౌబలస్య
వేద ద్యూతే నికృతిం పర్వతీయః ।
యతః ప్రాప్తః శకునిస్తత్ర యాతు
మా యూయుధో భారత పాండవేయాన్ ॥ 10
శకుని ద్యూతవిద్య ఏమిటో మనకు తెలుసు. ఆ పర్వతరాజుకు కపటద్యూతమే తెలుసు. శకునిని వచ్చిన చోటికే పంపివేయి. భారతా! కౌరవపాండవుల మధ్య యుద్ధాన్ని కల్పించకు. (10)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి విదురవాక్యే త్రిషష్టితమోఽధ్యాయః ॥ 63 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున విదురవాక్యమను అరువది మూడవ అధ్యాయము. (63)