64. అరువది నాల్గవ అధ్యాయము

దుర్యోధనుడు విదురుని నిందించుట - విదురుడు ధుర్యోదనుని హెచ్చరించుట.

దుర్యోధన ఉవాచ
పరేషామేవ యశసా శ్లాఘసే త్వం
సదా క్షత్తః కుత్సయన్ ధార్తరాష్ట్రాన్ ।
జానిమహే విదుర యత్ ప్రియస్త్వం
బాలానివాస్మానవమన్యసే నిత్యమేవ ॥ 1
దుర్యోధనుడిలా అన్నాడు. విదురా! నీవెప్పుడూ శత్రువుల కీర్తినే ప్రశంసిస్తూ ధార్తరాష్ట్రులను నిందిస్తూనే ఉంటావు. నీవెవరిని ఇష్టపడతావో తెలుసు. మమ్ములను చిన్నపిల్లలనుగా భావించి ఎప్పుడూ అవమానిస్తుంటావు. (1)
స విజ్ఞేయః పురుషోఽన్యత్ర కామః
నిందాప్రశంసే హి తథా యునక్తి ।
జిహ్వా కథం తే హృదయం వ్యనక్తి యః
న జ్యాయసః కృతా మనసః ప్రాతికూల్యమ్ ॥ 2
శత్రువులపై మనసుపడే మనిషిని తేలికగా తెలిసికొనవచ్చు. అటువంటి వ్యక్తి ఇష్టంలేని వారిని నిందిస్తూ ఇష్టమైన వారిని ప్రశంసించటంలో లీనమై ఉంటాడు. నీ మనస్సు ఆ రీతిగా ద్వేషింపదగదు. (2)
ఉత్సంగే చ వ్యాల ఇవాహితోఽసి
మార్జారవత్ పోషకం చోపహంసి ।
భర్తృఘ్నం త్వాం న హి పాపీయ ఆహుః
తస్మాత్ క్షత్తః కిం న బిభేషి పాపాత్ ॥ 3
నీవు ఒడిలోని పామువలె మాకు అనిష్టమైనవాడవు. పిల్లివలె పోషకుని మెడపట్టి హింసించే వాడవు. స్వామిద్రోహివయినా నిన్ను పాపాత్ముడని అనటం లేదెవ్వరూ. విదురా! ఈ పాపాన్ని చూచి నీవు భయపడట లేదా? (3)
జిత్వా శత్రూన్ ఫలమాప్తం మహద్ వై
మాస్మాన్ క్షత్తః పరుషాణీహ వోచః ।
ద్విషద్భిస్త్వం సంప్రయోగాభినందీ
ముహుర్ద్వేషమ్ యాసి నః సంప్రయోగాత్ ॥ 4
విదురా! మేము శత్రువులను గెలిచి గొప్ప ఫలితాన్ని పొందాము. నీవు మమ్ములను గూర్చి పరుషంగా మాటాడవద్దు. నీవు శత్రువులతో కలిసి ఆనందంగా ఉంటావు. మాతో కలిసి ఉంటూ పదేపదే మములనే ద్వేషిస్తావు. (4)
అమిత్రతాం యాతి నరో క్షమం బ్రువన్
నిగూహతే గుహ్యమమిత్ర సంస్తవే ।
తదాశ్రితోఽపత్రప కిం ను బాధసే
యదిచ్ఛసి త్వం తదిహాభిభాషసే ॥ 5
సహించరాని మాటలు పలికేవాడు శత్రువవుతాడు. శత్రువును ప్రశంసించవలసిన సమయంలో అయినా తన అంతర్యాన్ని కప్పిపుచ్చుకొంటాడు. విదురా! నీవు ఆ మార్గాన్నే ఆశ్రయించు. మౌనాన్ని వహించు. నీ మనస్సుకు తోచినట్లుగా మాటాడుతూ మమ్ము ఇబ్బంది పెట్టవద్దు. (5)
మా నోఽవమంస్థా విద్మ మనస్తవేదం
శిక్షస్వ బుద్ధిం స్థవిరాణాం సకాశాత్ ॥
యశో రక్షస్వ విదుర సంప్రణీతం
మా వ్యాపృతః పరకార్యేషి భూస్త్వమ్ ॥ 6
విదురా! మమ్ము అవమానించవద్దు. నీ ఈ మనస్సు మాకు తెలుసు. పెద్దల దగ్గర నుండి బుద్ధి నేర్చుకో. నీ కీర్తిని నిలుపుకో. ఇతరుల పనులలో చొరబడవద్దు. (6)
అహం కర్తేతి విదుర మా చ మంస్థా
మా నో నిత్యం పరుషాణీహ వోచః ।
న త్వాం పృచ్ఛామి విదుర యద్ధితం మే
స్వస్తి క్షత్తర్మాతితిక్షూన్ క్షిణు త్వమ్ ॥ 7
విదురా! అన్నింటికీ నేనే (దుర్యోధనుడు) కర్తననుకోవద్దు. అనుక్షణమూ మమ్ము పరుషంగా మాటాడవద్దు. నాకు హితమేది? అని నిన్ను సలహా అడగటం లేదు. నీకు పుణ్యముంటుంది. నీ మాటలను సహనంతో భరిస్తున్న మాపై నీ వాగ్బాణాలను విసరవద్దు. (7)
ఏకః శాస్తా న ద్వితీయోఽస్తి శాస్తా
గర్భేశయానం పురుషం శాస్తి శాస్తా ।
తేనానుశిష్టః ప్రవణాదివాంభః
యథా నియుక్తోఽస్మి తథా భవామి ॥ 8
విశ్వానికి శాసకుడొక్కడే. రెండవ శాసకుడు లేడు. ఆ శాసకుడే గర్భస్థ శిశువును కూడా శాసిస్తాడు. నన్ను కూడా ఆయనే శాసిస్తున్నాడు. నీరు పల్లానికే ప్రవహించినట్టు ఆ శాసకుడు నియంత్రించిన రీతిగా నేను ప్రవర్తిస్తాను. (8)
భినత్తి శిరసా శైలమ్ అహిం భోజయతే చ యః ।
ధీరేవ కురుతే తస్య కార్యాణామనుశాసనమ్ ।
యో బలాదనుశాస్తీహ సోఽమిత్రం తేన విందతి ॥ 9
పరాత్పరుని బుద్ధియే జగత్తులోని సకలకార్యాలను శాసిస్తుంది. ఆయన ప్రేరణ చేతనే మనిషి కొండ నెత్తి కెత్తుకొంటున్నాడు. పాముకు పాలుపోసి పెంచుతున్నాడు. దానికి భిన్నంగా ఎవరైనా శాసించాలనుకొంటే వారితో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవటమే. (9)
మిత్రతామనువృత్తం తు సముపేక్షేత పండితః ।
ప్రదీప్య యః ప్రదీప్తాగ్నిః ప్రాక్ చిరం నాభిధావతి ।
భస్మాపి న స విందేత శిష్టం క్వచన భారత ॥ 10
ఈరీతిగా బలవంతంగా మిత్రత్వాన్ని పాటించదలచిన వానిని పండితుడు పరిత్యజించాలి. భారతా! నిప్పును మండించి ముందుగా పరువెత్తక జాగుచేస్తుంటే అటువంటి వానికి బూడిద కూడా మిగలదు. (10)
న వాసయేత్ పారవర్గ్యం ద్విషంతం
విశేషతః క్షత్తరహితం మనుష్యమ్ ।
స యత్రేచ్ఛసి విదుర తత్ర గచ్ఛ
సుసాంత్వితా హ్యసతీ స్త్రీ జహాతి ॥ 11
విదురా! శత్రుపక్షపాతియై తనను ద్వేషిస్తూ అహితాన్ని కల్గిమ్చే మనిషిని ఇంట నుంచుకొనకూడదు. కాబట్టి నీకు ఎక్కడకు వెళ్ళాలనిపిస్తే అక్కడకు వెళ్ళు. కులటను ఎంతగా అనునయించినా ఆమె భర్తను విడిచి వెళుతుంది. (11)
విదుర ఉవాచ
ఏతావతా పురుషం యే త్యజంతి
తేషాం వృత్తం సాక్షివద్ బ్రూహి రాజన్ ।
రాజ్ఞాం హి చిత్తాని పరిప్లుతాని
సాంత్వం దత్త్వా ముసలైర్ఘాతయంతి ॥ 12
విదురుడిలా అన్నాడు. రాజా! తనకు నచ్చని హితాన్ని బోధించినంతమాత్రాన హితైషులను వదిలించుకొనే వారి స్థితి ఎలా ఉంటుంది. సాక్షిమాత్రుడవై చెప్పు. రాజుల మనస్సులు ద్వేషంతో నిండి ఉంటాయి. వారు మంచిగా అనునయిస్తూనే వెనుక నుండి రోకళ్ళతో కొట్టిస్తారు. (12)
అబాలత్వం మన్యసే రాజపుత్ర
బాలోఽహమిత్యేవ సుమందబుద్ధే ।
యః సౌహృదే పురుషం స్థాపయిత్వా
పశ్చాదేనం దూషయతే స బాలః ॥ 13
రాజకుమారా! నీవు మందమతివి. నిన్ను ప్రాజ్ఞునిగా నన్ను మూర్ఖునిగా భావిస్తున్నావు. ముందు మిత్రులలో పరిగణించి వారినే అనంతరకాలంలో నిందించినవాడే మూర్ఖుడు. (13)
న శ్రేయసే నీయతే మందబుద్ధిః
స్త్రీ శ్రోత్రియస్యేవ గృహే ప్రదుష్టా ।
ధ్రువం న రోచేద్ భరతర్షభస్య
పతిః కుమార్యా ఇవ షష్టివర్షః ॥ 14
శ్రోత్రియుల ఇంటిలో దుష్ప్రవర్తన గల స్త్రీ శ్రేయోదాయకాలయిన పనులకు పనికిరానట్లు మందమతిని శ్రేయోమార్గంలో నడిపించలేము. అరువదేండ్ల ముసలివాడు పడుచుపిల్లకు నచ్చనట్లు భరతవంశపుంగవుడైన దుర్యోధనుడికి హితవచనాలు నచ్చవు. (14)
వి॥సం॥ దుర్యోధనుడికి భరతర్షభస్య అనడం ఎత్తిపొడుపు. (నీల)
అతః ప్రియం చేదనుకాంక్షసే త్వం
సర్వేషు కార్యేషు హితాహితేషు ।
స్త్రియశ్చ రాజన్ జడపంగుకాంశ్చ
పృచ్ఛ త్వం వై తాదృశాంశ్చైవ సర్వాన్ ॥ 15
రాజా! హితాహితాలయిన సర్వకార్యాలలో నీవు ప్రియవచనాలనే వినదలచుకొంటే ఆడవారినో, మందబుద్ధులనో, మతి చలించినవారినో లేక అటువంటివారినో సలహా అడుగు. (15)
లభ్యతే ఖలు పాపీయాన్ నరో ను ప్రియవాగిహ ।
అప్రియస్య హి పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ॥ 16
ఈ లోకంలో మనస్సునకు నచ్చేటట్లు మాత్రమే మాట్లాడగల పాపాత్ములు కూడా ఉంటారు. కానీ అప్రియమైనా హితాన్నీ మాటాడేవారూ, వినేవారూ కూడా అరుదే. (16)
యస్తు ధర్మపరశ్చ స్యాద్ధిత్వా భర్తుః ప్రియాప్రియే ।
అప్రియాణ్యాహ పథ్యాని తేన రాజా సహాయవాన్ ॥ 17
ధర్మపరుడై రాజు ఇష్టానిష్టాలను పరిగణించక అప్రియమయినా హితాన్ని చెప్పేవాడే రాజుకు సహాయకుడు. (17)
అవ్యాధిజం కటుజ తీక్ష్ణముష్ణం
యశోముషం పరుషం పూతిగంధిమ్ ।
సతాం పేయం యన్న పిబంత్యసంతః
మన్యుం మహారాజ పిబ ప్రశామ్య ॥ 18
మహారాజా! క్రోధం తీవ్రమై, తాపహేతువై, కీర్తినాశకమై, కఠినమై నిందింపదగినది. పరుషవాక్యాలు దానికి మూలం. క్రోధాన్ని దిగమ్రింగుకొని ప్రశాంతంగా ఉండు. (18)
వైచిత్రవీర్యస్య యశో ధనం చ
వాంఛామ్యహం సహపుత్రస్య శశ్వత్ ।
యథా తథా తేఽస్తు నమశ్చ
మమాపి చ స్వస్తి దిశంతు విప్రాః ॥ 19
నేను విచిత్రవీర్యకుమారుడయిన ధృతరాష్ట్రునకు అతని కుమారులకు ఎప్పుడు కీర్తిసంపదలు గలగాలని కోరేవాడిని. నీవు ఎలా ఉండదలచుకొంటే అలా ఉండు. నీకొక నమస్కారం. బ్రాహ్మణులు నాకు దీవెనల నిత్తురుగాక. (19)
ఆశీవిషాన్ నేత్రవిషాన్ కోపయేన్న చ పండితః ।
ఏవం తేఽహం వదామీదం ప్రయతః కురునందన ॥ 20
కురునందనా! నేను నిశ్చలమనస్కుడవై నీకు ఇది చెప్తున్నాను. పండితుడైన వాడు కోరల నుండి, కళ్ళ నుండి కూడా విషాన్ని చిమ్మగల సర్పాలను రెచ్చగొట్టకూడదు. (20)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి విదుర హితవాక్యే చతుషష్టితమోఽధ్యాయః ॥ 64 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున విదుర హితవాక్యమను అరువది నాలుగవ అధ్యాయము. (64)