66. అరువది అరవ అధ్యాయము
విదురుడు దుర్యోధనుని మందలించుట.
దుర్యోధన ఉవాచ
ఏహి క్షత్రర్దౌపదీమానయస్వ ప్రియాం
భార్యాం సమ్మతాం పాండవానామ్ ।
సమ్మార్జతాం వేశ్మ పరైతు
శీఘ్రం తత్రాస్తు దాసీభిరపుణ్యశీలా ॥ 1
దుర్యోధనుడిలా అన్నాడు. విదురా రా! పాండవుల మనస్సుకు నచ్చిన ప్రియసతి ద్రౌపదిని ఇక్కడకు తీసికొనిరా.
ఆ పాపాత్మురాలు వెంటనే ఇక్కడకు రావాలి. అంతఃపురాన్ని శుభ్రం చేయాలి. ఆమె అక్కడ దాసీలతోపాటు ఉండాలి. (1)
విదుర ఉవాచ
దుర్విభాషం భాషితం త్వాదృశేన న
మంద సంబుధ్యసి పాశబద్ధః ।
ప్రపాతే త్వం లంబమానో న వేత్సి
వ్యాఘ్రాన్ మృగః కోపయసేఽతి వేలమ్ ॥ 2
విదురుడిలా అన్నాడు. మూర్ఖుడా! నీవంటివాడే ఇటువంటి మాటలనగలడు. కాలపాశానికి చిక్కి ఎరుకలేక ప్రవర్తిస్తున్నావు. లోయలోనికి జారి వ్రేలాడుతున్నావు నీవు. కానీ అది నీకు తెలియటం లేదు. జింక పులులను రెచ్చగొట్టినట్లు నీవు నడుస్తున్నావు. (2)
ఆశీవిషాస్తే శిరసి పూర్ణకోపా మహావిషాః ।
మా కోపిష్ఠాః సుమందాత్మన్ మా గమస్త్వం యమక్షయమ్ ॥ 3
బుద్ధిహీనుడా! నీ తలమీద మహావిషసర్పాలు ఉన్నాయి. కోపంతో నిండినవాటికి మరీ కోపాన్ని తెప్పించవద్దు. యమలోకానికి వెళ్ళే ప్రయత్నాలు వద్దు. (3)
న హి దాసీత్వమాపన్నా కృష్ణా భవితుమర్హతి ।
అనీశేన హి రాజ్ఞైషా పణే న్యస్తేతి మే మతిః ॥ 4
ద్రౌపది దాసి కాదగదు. యుధిష్ఠిరుడు ముందు తనను ఓడి ఆపై అస్వతంత్రుడై ద్రౌపదిని పణంగా పెట్టాడని నేను భావిస్తున్నాను. (4)
అయం ధత్తే వేణురివాత్మఘాతీ
ఫలం రాజా ధృతరాష్ట్రస్య పుత్రః ।
ద్యూతం హి వైరాయ మహాభయాయ
మత్తో న బుధ్యత్యయమంతకాలమ్ ॥ 5
వెదురు తన వినాశనం కొరకే ఫలాన్ని ధరించినట్లు ఈ దుర్యోధనుడు మహాభయంకరమైన వైరం కోసమే జూదాన్ని స్వీకరించాడు. మదించిన ఈ సుయోధనుడు పోగాలాన్ని గ్రహించలేకున్నాడు. (5)
నారుంతుదః స్యాన్న నృశంసవాదీ
న హీనతః పరమభ్యాదదీత ।
యయాస్య వాచా పర ఉద్విజేత
న వదేదుషతీం పాపలోక్యామ్ ॥ 6
మాటలతో ఎవ్వరినీ గాయపరచకూడదు. ఎవ్వరితో కఠినంగా మాటాడకూడదు. నీచకృత్యాలతో శత్రువును వశం చేసికొనకూడదు. ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించే మాటలు పలుకతగదు. అది నరకలోకానికి దారితీస్తుంది. (6)
సముచ్చరంత్యతివాదాశ్చ వక్ర్తాద్
యైరాహతః శోచతి రాత్ర్యహాని ।
పరస్య నామర్మసు తే పతంతి
తాన్ పండితో నావసృజేత్ పరేషు ॥ 7
నోటి నుండి వాగ్బాణాలు వెలువడితే అవి తాకిన మనిషి రేబవళ్ళు దుఃఖానికి లోనవుతాడు. ఇతరులకు మర్మచ్ఛేదకాలయిన మాటలను పండితులు ఇతరులపై ప్రయోగింపకూడదు. (7)
అజోహి శస్త్రమగిలత్ కిలైకః
శస్త్రే విపన్నే శిరసాస్య భూమౌ ।
నికృంతనం స్వస్య కంఠస్య ఘోరం
తద్వద్ వైరం మా కృథాః పాండుపుత్రైః ॥ 8
ఒక మేక ఒక బాణాన్ని మ్రింగిందట. అది మ్రింగుడు పడకపోతే సర్కి తలను నేలకేసి కొటుకొన్నదట. దానితో ఆ బాణం దాని కంఠాన్నే తెగకోసిందట. పాండుపుత్రులతో వైరం అటువంటిదే. దాన్ని కొనితెచ్చుకొనవద్దు. (8)
న కించిదిత్థం ప్రవదంతి పార్థాః
వనేచరం వా గృహమేధినం వా ।
తపస్వినం వా పరిపూర్ణవిద్యం
భషంతి హైవం శ్వనరాః సదైవ ॥ 9
పాండవులు వనచరులతో కానీ, గృహస్థులతో కానీ, మహర్షులతో కానీ, పండితులతో కానీ ఎప్పుడూ ఈ రీతిగా మాటాడరు. కుక్కబుద్ధిగలవారే ఈ విధంగా మొరుగుతుంటారు. (9)
ద్వారం సుఘోరం నరకస్య జిహ్మం
న బుధ్యత ధృతరాష్ట్రస్య పుత్రః ।
తమన్వేతారో బహవః కురూణాం
ద్యూతోదయే సహ దుఃశాసనేన ॥ 10
దుర్యోధనుడికి అత్యంతభయంకరమై వక్రంగా ఉండే నరకద్వారాన్ని గురించి తెలియదు. దుశ్శాసనునితోపాటు కౌరవులలో చాలామంది ఈ ద్యూతక్రీడలో దుర్యోధనుని అనుసరిస్తున్నారు. (10)
మజ్జంత్యలాబూని శిలాః ప్లవన్తే
ముహ్యన్తి నావోఽంభసి శశ్వదేవ ।
ముఢో రాజా ధృతరాష్ట్రస్య పుత్రః
న మే వాచః పథ్యరూపాః శృణోతి ॥ 11
సొరకాయలు నీటిలో మునగవచ్చు. రాళ్ళు నీటిపై తేలవచ్చు. నౌకలను శాశ్వతంగా నీట ముంచవచ్చు. కానీ మూర్ఖుడైన ఈ సుయోధానరాజు హితకరాలైన నా మాటలు మాత్రం వినడు. (11)
అంతో నూనం భవితాయం కురూణాం
సుదారుణః సర్వహరో వినాశః ।
వాచః కావ్యాః సుహృదాం పథ్యరూపాః
నశ్రూయంతే వర్ధతే లోభ ఏవ ॥ 12
ఈ సుయోధనుడు నిశ్చయంగా కురువంశవినాశకుడు అవుతాడు. సర్వనాశనమూ ఇతని ద్వారానే జరుగుతుంది. వీడు మిత్రుల మాటలను అవి ఎంత మంచివైనా వినడు. లోభమే ఇతనిలో పెరుగుతోంది. (12)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి విదురవాక్యే షట్ షష్టితమోఽధ్యాయః ॥ 66 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున విదురవాక్యమను అరువది యారవ అధ్యాయము. (66)