67. అరువది ఏడవ అధ్యాయము
ద్రౌపదిని సభలోనికి ఈడ్పించుట.
వైశంపాయన ఉవాచ
ధిగస్తుక్షత్తారమితి బ్రువాణః
దర్పేణ మత్తో ధృతరాష్ట్రస్య పుత్రః ।
అవైక్షత ప్రాతికామీం సభాయామ్
ఉవాచ చైనం పరమార్యమధ్యే ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - గర్వోన్మత్తుడైన దుర్యోధనుడు విదురుని ధిక్కరించి ప్రాతికామివైపు చూచి శ్రేష్ఠులయిన సభాసదుల మధ్య ఇలా అన్నాడు. (1)
దుర్యోధన ఉవాచ
ప్రాతికామిన్ ద్రౌపదీమానయస్వ
న తే భయం విద్యతే పాండవేభ్యః ।
క్షత్తా హ్యయం వివదత్యేవ
న చాస్మాకం వృద్ధికామః సదైవ ॥ 2
దుర్యోధనుడిలా అన్నాడు - ప్రాతికామీ! ద్రౌపదిని తీసికొనిరా! పాండవులను గురించి భయపడనవసరం లేదు. విదురుడు పిరికివాడు. ఎప్పుడూ ఈ రీతిగానే మాటాడుతుంటాడు. మన వృద్ధిని ఎన్నడూ కోరడు. (2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః ప్రాతికామీ స సూతః
ప్రాయాచ్ఛీఘ్రం రాజవచో నిశమ్య ।
ప్రవిశ్య చ శ్వెవ హి సింహగోష్టం
సమాసదన్మహిషీం పాండవానామ్ ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు. దుర్యోధనుడు ఆ విధంగా పలుకగానే రాజాజ్ఞను శిరసావహించి ప్రాతికామి వెంటనే వెళ్ళాడు. సింహపుగుహలోనికి కుక్క ప్రవేశించినట్లు రాజభవనంలో ప్రవేశించి ద్రౌపది దగ్గరకు చేరాడు. (3)
ప్రాతికామ్యువాచ
యుధిష్ఠిరో ద్యూతమదేన మత్తః
దుర్యోధనో ద్రౌపది త్వామజైషీత్ ।
సా త్వమ్ ప్రపద్యస్వ ధృతరాష్ట్రస్య వేశ్మ
నయామి త్వాం కర్మణే యజ్ఞాసేని ॥ 4
ప్రాతికామి ఇలా అన్నాడు.
ద్రౌపదీ! యుధిష్ఠిరుడు ద్యూతోన్మాదానికి లోనయ్యాడు. దుర్యోధనుడు నిన్ను గెలుచుకొన్నాడు. యాజ్ఞసేనీ! ఇప్పుడు నీవు ధృతరాష్ట్రుని భవనానికి రావాలి. నిన్ను దాసీ పనికి అక్కడకు తీసికొని వెళతాను. (4)
ద్రౌపద్యువాచ
కథం త్వేవం వదసి ప్రాతికామిన్
కోహి దీవ్యేద్ భార్యయా రాజపుత్రః ।
మూఢో రాజా ద్యూతమదేన మత్తః
హ్యభూన్నాన్యత్ కైతవమస్య కించిత్ ॥ 5
ద్రౌపది ఇలా అన్నది. ప్రాతికామీ! ఏమిటిలా అంటున్నావు. రాజకుమారుడు ఎవడయినా భార్యను పందెం పెట్టి జూదమాడుతాడా? ఆ రాజు మూర్ఖుడై జూదతో పిచ్చివాడయ్యాడా? పందెం పెట్టడానికి మరేదీ దొరకలేదా? (5)
ప్రాతికామ్యువాచ
యదా నాభూత్ కైతవమన్యదస్య
తదాదేవీత్ పాండవో ఽజాతశత్రుః ।
న్యస్తాః పూర్వం భ్రాతరస్తేన రాజ్ఞా
స్వయం చాత్మా త్వమథో రాజపుత్రి ॥ 6
ప్రతికామి ఇలా అన్నాడు. రాజకుమారి! జూదంలో పందెంగా పెట్టడానికి మరేదీ లేనిసమయంలో అజాతశత్రుడయిన యుధిష్ఠిరుడు ఈ విధంగా జూదమాడాడు. ఆ యుధిష్ఠిరుడు ముందు తమ్ములను, తరువాత తనను, చివరిగా నిన్ను కోలుపోయడు. (6)
ద్రౌపద్యువాచ
గచ్ఛ త్వం కితవం గత్వా సభాయాం పృచ్ఛ సూతజ ।
కిం ను పూర్వం పరాజైషీః ఆత్మానమథవా ను మామ్ ॥ 7
ద్రౌపది ఇలా అన్నది. సూతకుమారా! వెళ్ళు. జూదగాడైన ఆ మహారాజును సభలో ఈ విధంగా అడుగు - ముందు నిన్ను ఓడిపోయావా! లేక నన్ను ఓడిపోయావా? (7)
ఏతద్ జ్ఞాత్వా సమాగచ్ఛ తతో మాం నయ సూతజ ।
జ్ఞాత్వా చికీర్షితమహం రాజ్ఞో యాస్యామి దుఃఖితా ॥ 8
సూతకుమారా! ఆ విషయం తెలిసికొనిరా! తరువాత నన్ను తీసికొని వెళ్ళవచ్చు. ఇది తెలిసిన తర్వాతనే దుఃఖితనయిన నేను సభకు వెళ్తాను. (8)
వైశంపాయన ఉవాచ
సభాం గత్వా స చోవాచ ద్రౌపద్యాస్తద్ వచస్తదా ।
యుధిష్ఠిరం నరేంద్రాణాం మధ్యే స్థితమిదం వచః ॥ 9
కస్యేశో నః పరాజైషీః ఇతి త్వామహ ద్రౌపదీ ।
కిం న పూర్వం పరాజైషీః ఆత్మాన మథవాపి మామ్ ॥ 10
వైశంపాయనుడిలా అన్నాడు. ప్రాతికామి సభలో ప్రవేశించి రాజుల సమక్షంలో నున్న యుధిష్ఠిరునకు ద్రౌపదిమాటను ఇలా వినిపించాడు - ఏ వస్తువులపై ఆధిపత్యం కలిగి నీవు నన్ను ఓడిపోయావు. ముందు నిన్ను ఓడిపోయావా? లేదా నన్నే ముందు ఓడిపోయావా? అని ద్రౌపది అంటోంది. (9,10)
యుధిష్ఠిరస్తు నిశ్చేతాః గతసత్త్వ ఇవాభవత్ ।
న తమ్ సూతం ప్రత్యువాచ వచనం సాధ్వసాధు వా ॥ 11
యుధిష్ఠిరుడు నిశ్చేష్టుడయ్యాడు. ప్రాణాలు పోయినట్లయింది. మంచో - చెడో ఏ సమాధానమూ చెప్పలేకపోయాడు ప్రాతికామికి. (11)
దుర్యోధన ఉవాచ
ఇహైవాగత్య పాంచాలీ ప్రశ్నమేనం ప్రభాషతామ్ ।
ఇహైవ సర్వే శృణ్వంతు తస్యాశ్చైతస్య యద్ వచః ॥ 12
దుర్యోధనుడిలా అన్నాడు. ద్రౌపదిని ఇక్కడకే వచ్చి ఈ ప్రశ్నను అడగమను. ఆమె ప్రశ్ననూ, యుధిష్ఠిరుని సమాధానాన్ని ఇక్కడే అందరూ వింటారు. (12)
వైశంపాయన ఉవాచ
స గత్వా రాజభవనం దుర్యోధనవశానుగః ।
ఉవాచ ద్రౌపదీం సూతః ప్రాతికామీ వ్యథాన్వితః ॥ 13
వైశంపాయనుడిలా అన్నాడు. ప్రాతికామి దుర్యోధనునకు లోబడిన వాడు కాబట్టి బాధపడుతూ రాజభవనానికి వెళ్ళి ద్రౌపదితో ఇలా పలికాడు. (13)
సభ్యాస్త్వమీ రాజపుత్ర్యాహ్వయంతి
మన్యే ప్రాప్తః సంక్షయః కౌరవాణామ్ ।
న వై సమృద్ధిం పాలయతే లఘీయాన్
యస్త్వాం సభాం నేష్యంతి రాజపుత్రి ॥ 14
ప్రాతికామి ఇలా అన్నాడు. రాజకుమారీ! ఈ సభ్యులు నిన్ను సభలోనికి పిలుస్తున్నారు. కౌరవులకు వినాశకాల మేర్పడిందని నేను భావిస్తున్నాను. నిన్ను సభలోనికి పిలిపించి పతనమైన ఆ సుయోధనుడు తన ఐశ్వర్యాన్ని రక్షించుకొనలేడు. (14)
ద్రౌపద్యువాచ
ఏవం నూనం వ్యదధాత్ సంవిధాతా
స్పర్శావుభౌ స్పృశతో వృద్ధబాలౌ ।
ధర్మం త్వేకం పరమం ప్రాహ లోకే
స నః శమం ధాస్యతి గోప్యమానః ॥ 15
ద్రౌపది ఇలా అన్నది. సూతపుత్రా! విధి ఈ విధంగా నిర్ణయించాడు. పెద్దవారికైనా చిన్నవారికైనా సుఖదుఃఖాలు తప్పవు. ధర్మమొక్కటే లోకంలో గొప్పది. మనం దానిని రక్షిస్తే అది మనకు శాంతిని ఇస్తుంది. (15)
సోఽయం ధర్మో మాత్యగాత్ కౌరవాన్ వై
సభ్యాన్ గత్వా పృచ్ఛ ధర్మ్యం వచో మే ।
తే మాం బ్రూయుర్నిశ్చితం తత్ కరిష్యే
ధర్మాత్మానో నీతిమంతో వరిష్ఠాః ॥ 16
ఈ ధర్మాన్ని నేను అతిక్రమించను. కాబట్టి నీవు కౌరవసభలోనికి వెళ్ళి ధర్మబద్ధమయిన నా మాటను అడుగు. నేనేం చేయాలో వారే నిర్ణయించి చెపుతారు. ఆ మేరకు నేను పాటిస్తాను. ధర్మాత్ములు, నీతిమంతులు అయిన ఆ పెద్దలు చెప్పినట్లు చేస్తా. (16)
శ్రుత్వా సూతస్తద్వచో యాజ్ఞసేన్యాః
సభాం గత్వా ప్రాహ వాక్యం తదానీమ్ ।
అధోముఖాస్తే న చ కించి దూచుః
నిర్బంధం తం ధార్తరాష్ట్రస్య బుద్ ధ్వా ॥ 17
ద్రౌపది మాట విని సూతుడు సభకు వెళ్ళి అక్కడ ఆమె మాటను వినిపించాడు. దుర్యోధనుని మొండిపట్టును గ్రహించిన ఆ పెద్దలు ఏమీ అనలేదు. తలవాల్చి కూర్చున్నారు. (17)
యుధిష్ఠిరస్తు తచ్ర్ఛుత్వా దుర్యోధనచికీర్షితమ్ ।
ద్రౌపద్యాః సమ్మతం దూతం ప్రాహిణోద్ భరతర్షభ ॥ 18
ఏకవస్త్రా త్వధీనీవీ రోదమానా రజస్వలా ।
సభామాగమ్య పాంచాలి శ్వశురస్యాగ్రతో భవ ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు. భరతర్షభా! దుర్యోధనుడు చేయవలసిన పనిని విని ధర్మరాజు ద్రౌపదికి నచ్చిన ఒక దూతను ఆమె దగ్గరకు పంపాడు. 'పాంచాలీ! నీవు ఏకవస్త్రవు, రజస్వలవు, నీవి క్రిందకు వస్త్రాన్ని ధరించి ఉన్నదానవు అయిననూ, ఏడుస్తూ సభలోనికి వచ్చి, మామగారి ఎదుట నిలు.' (18,19)
అథ త్వామాగతాం దృష్ట్వా రాజపుత్రీం సభాం తదా ।
సభ్యాః సర్వే వినిందేరన్ మనోభిర్ధృతరాష్ట్రజమ్ ॥ 20
నీవు వస్తే ఆ రీతిగా సభలోనికి రావలసి వచ్చిన రాజకుమారిని నిన్నుచూచి సభ్యులంతా దుర్యోధనుని గట్టిగా నిందిస్తారు - అని చెప్పి పంపాడు. (20)
స గత్వా త్వరితం దూతః కృష్ణాయా భవనం నృప ।
న్యవేదయన్మతం ధీమాన్ ధర్మరాజస్య నిశ్చితమ్ ॥ 21
రాజా! బుద్ధిమంతుడైన ఆ సూతుడు వెంటనే ద్రౌపది భవనానికి పోయి ధర్మరాజు నిశ్చయాన్ని ఆమెకు నివేదించాడు. (21)
పాండవాశ్చ మహాత్మానః దీవా దుఃఖసమన్వితాః ।
సత్యేనాతిపరీతాంగాః నోదీక్షంతే స్మ కించన ॥ 22
మహాత్ములయిన పాండవులు దీనులై దుఃఖిస్తూ సత్యబద్ధులై ఉన్నారు. దేనిని గమనించటం లేదు. (22)
తతస్త్వేషామ్ ముఖమాలోక్య రాజా
దుర్యోధనః సూతమువాచ హృష్టః ।
ఇహైవైతామానయ ప్రాతికామిన్
ప్రత్యక్షమస్యాః కురవో బ్రువంతు ॥ 23
పాండవుల దీనవదనాలను చూచి పరమానంద పడిన దుర్యోధనుడు "ప్రాతికామీ! ఆ ద్రౌపదిని ఇక్కడకే తీసికొనిరా! ఆమె ఎదుటే కౌరవులు సమాధానం చెప్తారు" అని ఆదేశించాడు. (23)
తతః సూతస్తస్యవశనుగామీ
భీతశ్చ కోపాద్ ద్రుపదాత్మజాయాః ।
విహాయ మానం పునరేవ సభ్యాన్
ఉవాచ కృష్ణాం కిమహం బ్రవీమి ॥ 24
ఆపై దుర్యోధనవశవర్తి అయిన సూతుడు ద్రౌపది కోపానికి భయపడి తన మానావమానాలను పరిగణించక "ద్రౌపదితో ఏం చెప్పమంటారు" అని మరల సభ్యులను అడిగాడు. (24)
దుర్యోధన ఉవాచ
దుఃశాసనైష మమ సూతపుత్రః
వృకోదరాదుద్విజతేఽల్పచేతాః ।
స్వయం ప్రగృహ్యానయ యాజ్ఞసేనీం
కిం తే కరిష్యంత్యవశాః సపత్నాః ॥ 25
దుర్యోధనుడిలా అన్నాడు. దుశ్శాసనా! నా సేవకుడైన సూతపుత్రుడు మందమతి. భీముని చూచి భయపడుతున్నాడు. నీవే వెళ్ళి ద్రౌపదిని తీసికొనిరా. పరాధీనులయిన పాండవులు నిన్నేం చేయగలరు. (25)
తతః సముత్థాయ స రాజపుత్రః
శ్రుత్వా భ్రాతుః శాసనం రక్తదృష్టిః ।
ప్రవిశ్య తద్ వేశ్మ మహారథానామ్
ఇత్యబ్రవీద్ ద్రౌపదీం రాజపుత్రీమ్ ॥ 26
అప్పుడు సోదరుని శాసనాన్ని విని దుశ్శాసనుడు లేచి కన్నెఱ్ఱ చేసి మహారథులయిన ఆ పాండవుల భవనంలో ప్రవేశించి రాజకుమారి అయిన ద్రౌపదితో ఇలా అన్నాడు. (26)
ఏహ్యేహి పాంచాలి జితాసి కృష్ణే
దుర్యోధనం పశ్య విముక్తలజ్జా ।
కురూన్ భజస్వాయతపత్రనేత్రే
ధర్మేణ లబ్ధాసి సభాం పరైహి ॥ 27
పాంచాలీ! రా! రా! జూదంలో నిన్ను గెలిచికొన్నాం. కృష్ణా! సిగ్గు విడిచి దుర్యోధనుని చూడు. విశాలనేత్రా! కౌరవులను సేవించు. ధర్మబుద్ధితో నిన్ను పొందాం. సభలోకి రా. (27)
తతః సముత్థాయ సుదుర్మనాః
సా వివర్నమామృజ్య ముఖం కరేణ ।
ఆర్తా ప్రదుద్రావ యతః స్త్రియస్తాః
వృద్ధస్య రాజ్ఞః కురుపుంగవస్య ॥ 28
ఆ మాట విని దుఃఖించిన ద్రౌపది లేచి వివర్ణమైన ముఖాన్ని చేతితో తుడుచుకొని ఆర్తయై, వృద్ధుడైన ధృతరాష్ట్రుని అంతఃపురకాంతలున్న వైపునకు పరువెత్తింది. (28)
తతో జవేనాభిససార రోషాద్
దుఃశాసనస్తామభిగర్జమానః ।
దీర్గేషు నీలేష్వథ చోర్మిమత్సు
జగ్రాహ కేశేషు నరేంద్రపత్నీమ్ ॥ 29
అప్పుడు దుశ్శాసనుడు కూడా రోషంతో గర్జిస్తూ వేగంగా ఆమెను వెంబడించాడు. నల్లగా ఉంగరాలు తిరిగి ఉన్న ఆ ద్రౌపది దీర్ఘకేశాలను పట్టుకొన్నాడు. (29)
యే రాజాసూయావభృథే జలేన
మహాక్రతౌ మంత్రపూతేన సిక్తాః ।
తే పాండవానాం పరిభూయ వీర్యం
బలాత్ ప్రమృష్టా ధృతరాష్ట్రజేన ॥ 30
రాజసూయమనే మహాక్రతువులో అవభృథస్నానంతో మంత్రపవిత్రమైన నీటితో తడిసిన ఆ ద్రౌపది కురులు పాండవ పరాక్రమాన్ని పరిహసించి దుశ్శాసనునిచే బలాత్కారంగా లాగబడ్డాయి. (30)
స తాం పరాకృష్య సభాసమీప
మానీయ కృష్ణామతిదీర్ఘకేశీమ్ ।
దుఃశాసనో నాథవతీమనాథవత్
చకర్ష వాయుః కదలీమివార్తామ్ ॥ 31
దీర్ఘకేశి అయిన ఆ ద్రౌపదిని దుశ్శాసనుడు అంతమంది భర్తలున్నా అనాథను వలె లాగుకొని పోయాడు. అప్పుడు ఆమె ఆర్తురాలు. పెనుగాలి అరటిని ఊపివేసినట్లు దుశ్శాసనుడు ఆమెను లాగాడు. (31)
సా కృష్యమాణా నమితాంగయష్టిః
శనైరువాచాథ రజస్వలాస్మి ।
ఏకం చ వాసో మమ మందబుద్ధే
సభాం నేతుం నార్హసి మామనార్య ॥ 32
ఆ విధంగా లాగబడుతున్న ద్రౌపది శరీరాన్ని కుదింపజేసికొని మెల్లగా "నేను రజస్వలను. ఏకవస్త్రను. బుద్ధిహీనుడా! దుర్మార్గుడా! నన్ను సభలోనికి కొనిపోకూడదు" అని అన్నది. (32)
తతోఽబ్రవీత్ తాం ప్రసభం నిగృహ్య
కేశేషు కృష్ణేషు తదా స కృష్ణామ్ ।
కృష్ణం చ జిష్ణుం చ హరిం నరం చ
త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేనీ ॥ 33
అప్పుడు ఆ దుశ్శాసనుడు ఆమె జుట్టును మరీ గట్టిగా పట్టి ఏదో అనసాగాడు. ఆ యాజ్ఞసేని రక్షణకై జిష్ణువు, పాపహర్త, నరరూపుడు అయిన కృష్ణుని పిలుస్తూ ఆక్రోశించింది. (33)
దుఃశాసన ఉవాచ
రజస్వలా వా భవ యాజ్ఞసేని
ఏకాంబరా వాప్యథవా వివస్త్రా ।
ద్యూతే జితా చాసి కృతాసి దాసీ
దాసేషు వాసశ్చ యథోపజోషమ్ ॥ 34
దుశ్శాసనుడిలా అన్నాడు - యాజ్ఞసేనీ। నీవు రజస్వలవు కావచ్చు. ఏకవస్త్రవు కావచ్చు. వివస్త్రవయినా కావచ్చు. జూదంలో నిన్ను గెలిచికొన్నాం. దాసివయ్యావు. కాబట్టి మా ఇష్టప్రకారం దాసుల మధ్యనే నివసించాలి. (34)
వైశంపాయన ఉవాచ
ప్రకీర్ణకేశీ పతితార్ధవస్త్రా
దుఃశాసనేన వ్యవధూయమానా ।
హ్రీమత్యమర్షేన చ దహ్యమానా
శనైరిదం వాక్యమువాచ కృష్ణా ॥ 35
వైశంపాయనుడిలా అన్నాడు - ద్రౌపది చెదరిన కురులు, జారిన వస్త్రంతో, సిగ్గుతో, అసహనంతో మండిపోతూ ఉంది. దుశ్శాసనుడు ఈడ్చుతూ ఉంటే ద్రౌపది మెల్లగా ఇలా అన్నది. (35)
ద్రౌపద్యువాచ
ఇమే సభాయాముపనీతశాస్త్రాః
క్రియావంతః సర్వ ఏవేంద్రకల్పాః ।
గురుస్థానా గురవశ్చైవ సర్వే
తేషామగ్రే నోత్సహే స్థాతుమేవమ్ ॥ 36
ద్రౌపది ఇలా అన్నది. ఈ సభలోని వారంతా శాస్త్రవేత్తలు, కర్మిష్ఠులు, ఇంద్రతుల్యులు, గురుస్థానీయులు, గురువులు కూడా. వారి మధ్య ఈ విధంగా నిలవటం నాకు తగినది కాదు. (36)
నృశంసకర్మన్ త్వమనార్యవృత్త
మా మా వివస్త్రాం కురు మా వికర్షీః ।
న మర్షయేయుస్తవ రాజపుత్రాః
సేంద్రాశ్చ దేవా యది తే సహాయాః ॥ 37
క్రూరకర్ముడా! దురాచారుడా! నన్ను లాగవద్దు. వివస్త్రను చేయవద్దు. ఇంద్రునితో పాటు దేవతలందరూ మీకు సహాయంగా నిలిచినా సరే పాండవులు నిన్ను సహించరు. (37)
ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా
ధర్మశ్చ సూక్ష్మో నిపుణోపలక్ష్యః ।
వాచాపి భర్తుః పరమాణుమాత్ర
మిచ్ఛామి దోషం న గుణాన్ విసృజ్య ॥ 38
మహాత్ముడైన ధర్మజుడు ధర్మమందే నిలిచేవాడు. ధర్మం సూక్ష్మమైనది. నిపుణులు మాత్రమే దానిని గ్రహింపగలుగుతారు. నేను నా భర్తలోని గుణాలను కాదని పరమాణురూపమైన దోషాన్ని కూడా చెప్పదలచుకోలేదు. (38)
ఇదం త్వకార్యం కురువీరమధ్యే
రజస్వలామ్ యత్ పరికర్షసే మామ్ ।
న చాపి కశ్చిత్ కురుతేఽత్ర కుత్సా
ధ్రువం తవేదం మతమభ్యుపేతాః ॥ 39
ఈ కురువీరుల మధ్య రజస్వలనయిన నన్ను ఈ తీరున లాగాం తగనిపని. ఇక్కడ ఒక్కడు కూడా నీవు చేస్తున్న పనిని నిందించటం లేదు. వీరంతా నీ అభిప్రాయంతోనే ఉన్నారనటం నిశ్చయం. (39)
ధిగస్తు నష్టః ఖలు భారతానాం
ధర్మస్తథా క్షత్రవిదాం చ వృత్తమ్ ।
యత్ర హ్యతీతాం కురుధర్మవేలాం
ప్రేక్ష్యంతి సర్వే కురవః సభాయామ్ ॥ 40
ఛీ! భరతవంశరాజుల ధర్మం క్షత్రియధర్మవేత్తలయిన ఈ మహానుభావుల నడవడీ రెండూ చెడ్డాయి. అందుకే కౌరవులు ధర్మాన్ని అతిక్రమిస్తున్న సభలోని కురువంశస్థులంతా ప్రేక్షకులయ్యారు. (40)
ద్రోణస్య భీష్మస్య చ నాస్తి సత్త్వం
క్షత్తుస్తథైవాస్య మహాత్మనోఽపి ।
రాజ్ఞస్తథా హీమమధర్మముగ్రం
న లక్షయంతే కురువృద్ధముఖ్యాః ॥ 41
ద్రోణ భీష్మ విదురులలోనూ, మహానుభావుడైన ఈ ధృతరాష్ట్రమహారాజులోనూ శక్తి ఉడిగిపోయింది. కురువంశ వృద్ధులలో ప్రధానమైన వారందరూ ఈ దుర్యోధనుని తీవ్రమైన అధర్మవర్తనపై దృష్టి సారించటం లేదు. (41)
(ఇమం ప్రశ్నమిమే బ్రూత సర్వ ఏవ సభాసదః ।
జితాం వ్యాప్యజితాం వా మాం మన్యధ్వే సర్వభుమిపాః ॥)
ఈ నాప్రశ్నకు సభాసదులందరూ సమాధానమివ్వండి. సమస్తరాజులారా! ధర్మానుసారంగా నన్ను గెలుచుకొన్నారా? లేదా?
తథా బ్రువంతీ కరుణం సుమధ్యమా
భర్తౄన్ కటాక్షైః కుపితానపశ్యత్ ।
సా పాండవాన్ కోపపరీతదేహాన్
సందీపయామాస కటాక్షపాతైః ॥ 42
వైశంపాయనుడిలా అన్నాడు. ద్రౌపది ఆ రీతిగా దీనంగా మాటాడుతూ కుపితులై ఉన్న తన భర్తల్ను కనుకొనలతో చూచింది. ఆ చూపులతో ఆమె అసలే కోపంతో మండిపోయే శరీరాలు గల ఆ పాండవుల కోపాన్ని మరింత పెంచింది. (42)
హృతేన రాజ్యేన తథా ధనేన
రత్నైశ్చ ముఖ్యైర్న తథా బభూవ ।
యథా త్రపాకోపసమీరితేన
కృష్ణా కటాక్షేణ బభూవ దుఃఖమ్ ॥ 43
సిగ్గు, కోపం నిండిన ద్రౌపది చూపుతో పాండవులకు కలిగిన బాధ రాజ్యాన్నీ, ధనాన్నీ, గొప్పగొప్ప రత్నాలనూ కోలుపోయినప్పుడు కూడా కలగలేదు. (43)
దుఃశాసనశ్చాపి సమీక్ష్య కృష్ణామ్
అవేక్షమాణాం కృపణాన్ పతీంస్తాన్ ।
ఆధూయ వేగేన విసంజ్ఞకల్పామ్
ఉవాచ దాసీతి హసన్ సశబ్దమ్ ॥ 44
దీనులయిన తన భర్తలను చూస్తున్న ద్రౌపదిని గమనించి దుశ్శాసనుడు ఆమెను వేగంగా లాగి "దాసి" అని పెద్దగా నవ్వుతూ అరిచాడు. ఆ సమయంలో ద్రౌపది అచేతనమైనట్లు ఉంది. (44)
కర్ణస్తు తద్వాక్యమతీవ హృష్టః
సంపూజయామాస హసన్ సశబ్దమ్ ।
గాంధారరాజః సుబలస్య పుత్ర
స్తథైవ దుఃశాసనమభ్యనందత్ ॥ 45
కర్ణుడు పరమానందంతో బిగ్గరగా నవ్వుతూ దుశ్శాసనుని మాటను సమర్థించాడు. గాంధారరాజైన శకుని కూడ దుశ్శాసనుని అభినందించాడు. (45)
సభ్యాస్తు యే తత్ర బభూవురన్యే
తాభ్యామృతే ధార్తరాష్ట్రేణ చైవ ।
తేషామభూద్ దుఃఖమతీవ కృష్ణాం
దృష్ట్వా సభాయాం పరికృష్యమాణమ్ ॥ 46
కర్ణుడు, శకుని, దుర్యోధనుడు తప్ప మిగిలిన సభ్యులంతా సభలో ఊడ్వబడుతున్న ఆ ద్రౌపదిని చూచి ఎంతో దుఃఖించారు. (46)
భీష్మ ఉవాచ
న ధర్మసౌక్ష్మ్యాత్ సుభగే వివేక్తుం
శక్నోమి తే ప్రశ్నమిమం యథావత్ ।
అస్వామ్యశక్తః పణితుం పరస్వం
స్త్రియాశ్చ భర్తుర్వశతాం సమీక్ష్య ॥ 47
భీష్ముడిలా అన్నాడు. సౌభాగ్యవతీ! ధర్మం సూక్ష్మమైనది. కాబట్టి నీ ప్రశ్నను స్పష్టంగా విచారించలేను. తనది కాని దానిని పందెంగా ఎవడూ పెట్టలేదు. స్త్రీ ఎప్పుడూ భర్తతోటిదే. ఇవన్నీ ఆలోచించకుండా ఏమీ చెప్పలేను. (47)
త్యజేత సర్వాం పృథివీం సమృద్ధాం
యుధిష్ఠిరో ధర్మమథో న జహ్యాత్ ।
ఉక్తం జితోఽస్మీతి చ పాండవేన
తస్మాన్న శక్నోమి వివేక్తుమేతత్ ॥ 48
ధర్మరాజు సమృద్ధమైన భూమినంతా అయినా వదలుకొంటాడు, కానీ ధర్మాన్నీ విడువడు. అటువంటి ధర్మరాజే 'ఓడిపోయాను' అని అంగీకరించాడు. కాబట్టి నీ ప్రశ్నను గూర్చి విచారించలేను. (48)
ద్యూతేఽద్వితీయః శకునిర్నరేషు
కుంతీసుతస్తేన నిసృష్టకామః ।
న మన్యతే తాం నికృతిం యుధిష్ఠిర
స్తస్మాన్న తే ప్రశ్నమిమం బ్రవీమి ॥ 49
మనవులలో ద్యూతవిద్యలో సాటిలేని వాడు శకుని. ఆ శకుని యుధిష్ఠిరుని రెచ్చగొట్టి నిన్ను పణంగా పెట్టాడు. శకుని మోసాన్ని ధర్మజుడు గ్రహించలేదు. కాబట్టి నేను నీ ప్రశ్నను గుర్చి చెప్పలేను. (49)
ద్రౌపద్యువాచ
ఆహూయ రాజా కుశాలైరనార్యైః
దుష్టాత్మభిర్నైకృతికైః సభాయామ్ ।
ద్యూతప్రియైర్నాతికృతప్రయత్నః
కస్మాదయం నామ నిసృష్టకామః ॥ 50
ద్రౌపది ఇలా అన్నది. జూదంలో నిపుణులు, అనార్యులు, దుష్టాత్ములు, వంచకులు, ద్యూతప్రియులయిన వారు యుధిష్ఠిరుని సభకు పిలిపించి జూదమాడారు. ధర్మరాజుకు జూదంలో పెద్దగా అభ్యాసం లేదు. అటువంటి ఆయన మనస్సులో జూదమాడాలన్న కోరిక ఎందుకు కల్గించారు? (50)
అశుద్ధభావైర్నికృతిప్రవృత్తైః
అబుధ్యమానః కురుపాండవాగ్ర్యః ।
సంభూయ సర్వైశ్చ జితోఽపి యస్మాత్
పశ్చాదయం కైతవమభ్యుపేతః ॥ 51
అపవిత్రమనస్కులు, వంచకులు అందరు చేరి అమాయకుడైన ధర్మరాజును ముందుగా జూదంలో గెలుచుకొన్నారు. ఆ తర్వాత నన్ను పందెంగా పెట్టడానికి అంగీకరింపజేశారు. (51)
తిష్ఠంతి చేమే కురవః సభాయామ్
ఈశాః సుతానాం చ తథా స్నుషాణామ్ ।
సమూక్ష్య సర్వే మమ చాపి వాక్యం
విబ్రూత మే ప్రశ్న మిమం యథావాత్ ॥ 52
సభలో నున్న కురువంశస్థులందరూ కొడుకులు, కోడళ్ళూ గలవారే. మీరంతా చక్కగా నా వాక్యాన్ని ఆలోచించి నా ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పండి. (52)
(న సా సభా యత్ర న సంతి వృద్ధా
న తే వృద్ధాయే న వదమ్తి ధర్మమ్ ।
నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి
న తత్ సత్యం యచ్ఛలేనానువిద్ధమ్ ॥)
పెహ్డ్దలు లేని సభ సభయేకాదు. ధర్మం చెప్పని పెద్దలు పెద్దలే కాదు. సత్యహీనమయిన ధర్మం ధర్మం కాదు. కపటత్వంతో కూడిన సత్యం సత్యమే కాదు.
వైశంపాయన ఉవాచ
తథా బ్రువంతీం కరుణం రుదంతీమ్
అవేక్షమాణాం కృపణాన్ పతీంస్తాన్ ।
దుఃశాసనః పరుషాణ్యప్రియాణి
వాక్యాన్యువాచామధురాణి చైవ ॥ 53
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ రీతిగా దీనంగా మాటాడుతూ ఏడుస్తూ దీనులయిన భర్తలను చూస్తున్న ద్రౌపదితో దుశ్శాసనుడు పరుషంగా, అప్రియంగా, కఠినంగా ఎన్నో మాటలన్నాడు. (53)
తాం కృష్యమాణాం చ రజస్వలాం చ
స్రస్తోత్తరీయామతదర్హమాణామ్ ।
వృకోదరః ప్రేక్ష్య యుధిష్ఠిరం చ
చకార కోపం పరమార్తరూపః ॥ 54
ద్రౌపది రజస్వల. ఆమె ఉత్తరీయమ్ జారి ఉన్నది. తగని రీతిగా దుశ్శాసనుడు ఆమెను ఈడుస్తున్నాడు. అది చూచి భీమసేనుడు ధర్మరాజువైపు కూడా చూచి నిస్సహాయస్థితిలో తీవ్రకోపాన్ని ప్రదర్శించాడు. (54)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి ద్రౌపదీప్రశ్నే సప్తషష్టితమోఽధ్యాయః ॥ 67 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున ద్రౌపదీప్రశ్నమను అరువది యేడవ అధ్యాయము. (67)