70. డెబ్బదివ అధ్యాయము
దుర్యోధనుని వక్రభాషణము - భీముని ఆవేశము.
వైశంపాయన ఉవాచ
తథా తు దృష్ట్వా బహు తత్ర దేవీం
రోరూయమాణాం కురరీమివార్తామ్ ।
నోచుర్వచః సాధ్వథ వాప్యసాధు
మహీక్షితో ధార్తరాష్ట్రస్య భీతాః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. మహారాణి ద్రౌపది ఆర్తయై ఆడుగొఱ్ఱెవలె ఆక్రోశించటం చూచి కూడా దుర్యోధనునకు భయపడిన రాజులు మంచి, చెడూ ఏదీ మాటాడలేదు. (1)
దృష్ట్వా తథా పార్థివ పుత్రపౌత్రాం
స్తూష్ణీంభూతాన్ ధృతరాష్ట్రస్య పుత్రః ।
స్మయన్నివేదం వచనం బభాషే
పాంచాలరాజస్య సుతాం తదానీమ్ ॥ 2
అప్పుడు రాజు పుత్రులు, రాజపౌత్రులు అందరూ మౌనంగా ఉండటాన్ని చూచి దుర్యోధనుడు నవ్వుతూ ద్రౌపదితో ఇలా అన్నాడు. (2)
దుర్యోధన ఉవాచ
తిష్ఠత్వయం ప్రశ్న ఉదారసత్త్వే
భీమేఽర్జునే సహదేవే తథైవ ।
పత్యౌ చ తే నకులే యాజ్ఞిసేని
వదన్త్వేతే వచనం త్వత్ర్పసూతమ్ ॥ 3
దుర్యోధనుడిలా అన్నాడు. ద్రౌపదీ! ఈ నీ ప్రశ్న బలిష్ఠుడైన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు - ఈ నీ భర్తలకే వదలిపెడుతున్నాను. వీరినే నీ ప్రశ్నకు సమాధానమివ్వమను. (3)
అనీశ్వరం విబ్రువన్త్వార్యమధ్యే
యుధిష్ఠిరం తవ పాంచాలి హేతోః ।
కుర్వంతు సర్వే చానృతం ధర్మరాజం
పాంచాలి త్వం మోక్ష్యసే దాసభావాత్ ॥ 4
పాంచాలీ! నిన్ను పణంగా పెట్టే అధికారం ధర్మరాజునకు లేదని ఈ పెద్దల సమక్షంలో నీ భర్తలను చెప్పమను. ధర్మరాజు తప్పు చేశాడని చెప్పమను. అప్పుడు నీకు దాస్య విముక్తి కలిగిస్తాము. (4)
ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా
స్వయం చేదం కథయ త్వింద్రకల్పః ।
ఈశో వా తే హ్యనీశోఽథ వైష
వాక్యాదస్య క్షిప్రమేక భజస్వ ॥ 5
ధర్మారాజు మహాత్ముడు, ఇంద్రతుల్యుడు. ధర్మబద్ధుడు. నిన్ను పణంగా పెట్టడానికి తన కధికారమున్నదో లేదో తననే చెప్పమను. ఆయన మాటను బట్టియే నీవు దాసివో, కాదో వెంటనే నిర్ణయించుకొనవచ్చు. (5)
సర్వే హీమే కౌరవేయాః సభాయాం
దుఃఖాంతం వర్తమానాస్తవైన ।
న విబ్రువంత్యార్యసత్త్వా యథావత్
పతీంశ్చ తే సమవేక్ష్యాల్పభాగ్యాన్ ॥ 6
సజ్జనులయిన ఈ సభలోని కౌరవులందరూ నీ గురించియే బాధపడుతున్నారు. మందభాగ్యులయిన నీ భర్తల పరిస్థితిని గమనించి నీ ప్రశ్నకు ఉన్నదున్నట్లుగా సమాధానం చెప్పలేకున్నారు. (6)
వైశంపాయన ఉవాచ
తతః సభ్యాః కురురాజస్య తస్య
వాక్యం సర్వే ప్రశంశంసుస్తథోచ్చైః ।
చేలావేథాంశ్చాపి చక్రుర్నదంతః
హాహేత్యాసీదపి చైవార్తనాదః ॥ 7
వైశంపాయనుడిలా అన్నాడు - అప్పుడు సభ్యులంతా దుర్యోధనుని పలుకులను పెద్దగా అభినందించారు. గర్జనలు చేస్తూ ఉత్తరీయాల నూపారు. మరొకవైపు హాహాకారాలు చెలరేగాయి. (7)
శ్రుత్వా తు వాక్యం సుమనోహరం తత్
హర్షశ్చాసీత్ కౌరవాణాం సభాయామ్ ।
సర్వే చాసన్ పార్థివాః ప్రీతిమంతః
కురుశ్రేష్ఠం ధార్మికం పూజయంతః ॥ 8
దుర్యోధనుని ఆ రమణీయవచనాలను విని కౌరవసభలో ఆనందం కూడా వెల్లివిరిసింది. ఇతరరాజులు కూడా సంతసించి దుర్యోధనుని కురుశ్రేష్ఠుడనీ, ధార్మికుడనీ ఆదరించారు. (8)
యుధిష్ఠిరం చ తే సర్వే సముదైక్షంత పార్థివా ।
కిం ను వక్ష్యతి ధర్మజ్ఞ ఇతి సాచీకృతాననాః ॥ 9
ఆ రాజులందరూ ధర్మరాజు ఏం చెపుతాడో అని ముఖాలు సాచి ధర్మరాజు వైపే చూడసాగారు. (9)
కిం ను వక్ష్యతి బీభత్సుః అజితో యుధి పాండవః ।
భీమసేనో యమే చోభే భృశం కౌతూహలాన్వితాః ॥ 10
యుద్ధంలో పరాజయమెరుగని అర్జునుడూ, భీమసేనుడూ, నకుల సహదేవులు ఏమంటారో అన్న కుతూహలం సభ్యుల మనస్సులలో ఏర్పడింది. (10)
తస్మిన్నుపరతే శబ్దే భీమసేనోఽబ్రవీదిదమ్ ।
ప్రగృహ్య రుచిరం దివ్యం భుజం చందనచర్చితమ్ ॥ 11
ఆ కోలాహలం సద్దుమణగ గానే భీమసేనుడు చందనచర్చితమై, అందమైన తన దివ్యబాహువు నెత్తి ఇలా అన్నాడు. (11)
భీమసేన ఉవాచ
యద్యేష గురురస్మాకం ధర్మరాజో మహామనాః ।
న ప్రభుః స్యాత్ కులస్యాస్య న వయం మర్షయేమహి ॥ 12
భీమసేనుడిలా అన్నాడు. మహాత్ముడు, మాకు పితృసమానుడు అయిన ధర్మరాజు మా యజమాని కాకుంటే మేము ఈ కౌరవుల అత్యాచారాన్ని సహించేవారమే కాదు. (12)
ఈశో నః పుణ్యతపసాం ప్రాణానామపి చేశ్వరః ।
మన్యతేఽజితమాత్మానం యద్యేష విజితా వయమ్ ॥ 13
న హి ముచ్యేత మే జీవన్ పదా భూమిముపస్పృశన్ ।
మర్త్యధర్మా పరామృశ్య పాంచాల్యా మూర్ధజానిమాన్ ॥ 14
పశ్యధ్వం హ్యాయతౌ వృత్తౌ భుజౌ మే పరిఘావివ ।
నైతయోరంతరం ప్రాప్య ముచ్యేతాపి శతక్రతుః ॥ 15
ఈ ధర్మజుడు మా తపస్సులకు, పుణ్యాలకు, ప్రాణాలకు కూడా ప్రభువే. ద్రౌపదిని పణంగా పెట్టక ముందు తాను ఓడినట్లు ధర్మజుడు భావించకపోతే అప్పుడు మేమంతా ఓడినట్లే. నేను ఓడకున్నట్లయితే నేను బ్రతికి ఉండగానే ద్రౌపదీకేశాలను స్పృశించిన ఈ దుశ్శాసనుడు నేలపై నిలువగలిగేవాడు కాదు. నా భుజాలను చూడండి. విశాలంగా గుండ్రంగా, తలుపు గడియల వలె ఉన్నాయి. వీటిమధ్య చిక్కి ఇంద్రుడైనా విడిపించుకొనలేడు. (13-15)
ధర్మపాశాసితస్త్వేవం నాధిగచ్ఛామి సంకటమ్ ।
గౌరవేణ విరుద్ధశ్చ నిగ్రహాదర్జునస్య చ ॥ 16
నేను ధర్మానికి కట్టువడి ఉన్నాను. అన్నమీది గౌరవం నన్ను కట్టిపడవేసింది. అర్జునుడు కూడా మిన్నకున్నాడు. కాబట్టి ఈ సంకటాన్ని దాటలేకపోతున్నాను. (16)
ధర్మరాజనిసృష్టస్తు సింహః క్షుద్రమృగానివ ।
ధార్తరాష్ట్రానిమాన్ పాపాన్ నిష్పిషేయం తలాసిభిః ॥ 17
ధర్మరాజు ఆదేశిస్తే సింహం క్షుద్రమృగాలను పీడించినట్లు పాపాత్ములయిన ఈ దుర్యోధనాదులను పీడించినట్లు పాపాత్ములయిన ఈ దుర్యోధనాదులను కత్తుల వంటి నా కరతలాలతో పిప్పిచేయగలను. (17)
వైశంపాయన ఉవాచ
తమువాచ తదా భీష్మఃద్రోణో విదుర ఏవ చ ।
క్షమ్యతామిదమిత్యేవం సర్వం సంభావ్యతే త్వయి ॥ 18
వైశంపాయనుడిలా అన్నాడు. అప్పుడు భీష్మ, ద్రోణ, విదురులు "ఇదంతా క్షమించు. నీవేమైనా చేయగలవాడవే" అని భీమసేనునితో అన్నారు. (18)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి భీమవాక్యే సప్తతితమోఽధ్యాయః ॥ 70 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున భీమవాక్యమను డెబ్బదియవ అధ్యాయము. (70)