71. డెబ్బది ఒకటవ అధ్యాయము
ద్రౌపదీ వరలాభము
కర్ణ ఉవాచ
త్రయః కిలేమే హ్యధనా భవంతి
దాసః పుత్రశ్చా స్వతంత్రా చ నారీ ।
దాసస్య పత్నీ త్వధనస్య భద్రే
హీనేశ్వరా దాసధనం చ సర్వమ్ ॥ 1
కర్ణుడిలా అన్నాడు. కళ్యాణీ! ద్రౌపదీ! దాసుడు, పుత్రుడు, అస్వతంత్ర స్త్రీ - ఈ ముగ్గురు నిర్ధనులే. ఐశ్వర్యభ్రష్ఠుడయిన దాసుని భార్యమీదా, అతని సంపదలమీద ఆ దాసుని యజమానికి అధికారాలుంటాయి. (1)
ప్రవిశ్య రాజ్ఞః పరివారం భజస్వ
తత్ తే కార్యం శిష్ట మాదిశ్యతేఽత్ర ।
ఈశాస్తు సర్వే తవ రాజపుత్ర
భవంతి వై ధార్తరాష్ట్రా న పార్థాః ॥ 2
రాజకుమారీ! దుర్యోధనుని పరివారంలో చేరి వారి భార్యలకు సేవలు చేయి. ఇక నీకు మిగిలిందిదే. అందుకే ఆదేశిస్తున్నాను. ఇక నీకు సమస్తధార్తరాష్ట్రులే యజమానులు కానీ పాండవులు కారు. (2)
అన్యం వృణిష్వ పతిమాశు భావిని
యస్మాద్ దాస్యం న లభసి దేవనేన ।
అవాచ్యా వై పతిషు కామవృత్తిః
నిత్యం దాస్యే విదితం తత్ తవాస్తు ॥ 3
భామినీ! వెంటనే మరొకరిని భర్తగా ఎన్నుకో. అప్పుడు జూదం ద్వారా మరల నీవు దాసీవయ్యే పరిస్థితి రాదు. భర్తలయెడ స్వేచ్ఛగా ప్రవర్తించటం నీవంటి దానికి తప్పేమీకాదు. దాస్యంలో స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి నీకు దాస్యమే మంచిది. (3)
పరాజితో నకులో భీమసేనః
యుధిష్ఠిరః సహదేవార్జునౌ చ ।
దాసీభూతా త్వం హి వై యాజ్ఞసేని
పరాజితాస్తే పతయో నైవ సంతి ॥ 4
యాజ్ఞసేనీ! నకులుడు, భీమసేనుడు, యుధిష్ఠిరుడు, సహదేవుడు, అర్జునుడు అందరూ ఓడిపోయారు. నీవిప్పుడు దాసివి. ఓడిపోయిన ఆ పాండవులు నీ భర్తలు కారు. (4)
ప్రయోజనం జన్మని కిం న మన్యతే
పరాక్రమమ్ పౌరుషం చైవ పార్థః ।
పాంచాల్యస్య ద్రుపదస్యాత్మజామిమాం
సభామధ్యే యో వ్యదేవీద్ గ్లహేషు ॥ 5
జీవితానికి పరాక్రమమూ, పౌరుషమూ పరమార్థమని యుధిష్ఠిరుడు ఎరుగడు. అందుకే పాంచాలరాజైన ద్రుపదుని పుత్రివి - నిన్ను - పణంగా పెట్టి సభలో జూదమాడాడు. (5)
వైశంపాయన ఉవాచ
తద్ వై శ్రుత్వా భీమసేనోఽత్యమర్షీ
భృశమ్ నిశశ్వాస తదా ఽఽర్తరూపః ।
రాజానుగో ధర్మపాశానుబద్ధః
దహన్నివైనం క్రోధసంరక్తదృష్టిః ॥ 6
వైశంపాయనుడిలా అన్నాడు. కర్ణుని మాట విని భీమసేనుడు తీవ్రమైన అసహనంతో, ఆర్తితో నిట్టూర్చాడు. ధర్మపాశబద్ధుడై యుధిష్ఠిరుడే అనుసరిస్తూ కూడా కోపంతో ఎఱ్రబడిన కళ్ళతో యుధిష్ఠిరుని దహిస్తున్నట్టు చూస్తూ ఇలా పలికాడు. (6)
భీమ ఉవాచ
నాహం కుప్యే సూతపుత్రస్య రాజన్
నైష సత్యం దాసధర్మః ప్రదిష్టః ।
కిమ్ విద్విషో వై మామేవం వ్యాహరేయుః
నాదేవీస్త్వం యద్యనయా నరేంద్ర ॥ 7
భీముడిలా అన్నాడు. రాజా! సూతపుత్రుడైన కర్ణునిపై నాకు కోపం లేదు. దాసధర్మం మేరకు కర్ణుడు మాటాడాడు. మహారాజా! ద్రౌపదిని పణంగా పెట్టి నీవు జూదమాడకుండా ఉంటే మన శత్రువులు ఇప్పుడిలా మాటాడగలిగేవారా? (7)
వైశంపాయన ఉవాచ
భీమసేనవచః శ్రుత్వా రాజా దుర్యోధనస్తదా ।
యుధిష్ఠిరమువాచేదం తూష్ణీం భూతమచేతనమ్ ॥ 8
వైశంపాయనుడిలా అన్నాడు. భీమసేనుని మాటలివి దుర్యోధనరాజు మౌనంగా, అచేతనంగా ఉన్న యుధిష్టిరునితో ఇలా అన్నాడు. (8)
భీమార్జునౌ యమౌ చైవ స్థితే తే నృప శాసనే ।
ప్రశ్నం బ్రూహి చ కృష్ణాం త్వమ్ అజితాం యది మన్యసే ॥ 9
రాజా! భీమార్జునులూ, నకులసహదేవులూ నీ అనుశాసనంలోనే ఉన్నారు. ద్రౌపది ప్రశ్నకు నీవే సమాధానం చెప్పు. ఆమె ఓడిపోలేదని నీవు భావిస్తున్నావా? (9)
ఏవముక్త్వా తు కౌంతేయమ్ అపోహ్య వసనం స్వకమ్ ।
స్మయన్నవేక్ష్య పాంచాలీమ్ ఐశ్వర్యమదమోహితః ॥ 10
కదలీస్తంభసదృశం సర్వలక్షణసంయుతమ్ ।
గజహస్తప్రతీకాశం వజ్రప్రతిమగౌరవమ్ ॥ 11
అభ్యుత్స్మయిత్వా రాధేయం భీమమాధర్షయన్నివ ।
ద్రౌపద్యాఆఆ ప్రేక్షమాణాయాః సవ్యమూరుమదర్శయత్ ॥ 12
ధర్మరాజుతో ఆ మాటలు అని ఐశ్వర్యమదమత్తుడైన దుర్యోధనుడు సైగలతో కర్ణుని చూసి నవ్వుతూ, రెచ్చగొడుతూ, భీమసేనుని ఉద్రేకపరుస్తూ ద్రౌపదిని చూచి నవ్వుతూ తన వస్త్రాన్ని పైకెత్తి అరటిబోదెవలె, ఏనుగు తొండం వలె, వజ్రం వలె దృఢంగా సర్వలక్షణ లక్షితమై ఉన్న తన ఎడమతొడను ద్రౌపదికి చూపించాడు. (10-12)
భీమసేనస్తమాలోక్య నేత్రే ఉత్ఫాల్య లోహితే ।
ప్రోవాచ రాజమధ్యే తం సభాం విశ్రావయన్నివ ॥ 13
అది చూచి భీమసేనుడు ఎఱ్ఱబడ్డకన్నులను పెద్దవి చేసి రాజమధ్యంలో నిలిచి సభకు వినిపిస్తున్నట్లు ఇలా అన్నాడు. (13)
పితృభిః సహ సాలోక్యం మా స్మ గచ్ఛేద్ వృకోదరః ।
యద్యేతమూరం గదయా న భింద్యాం తే మహాహవే ॥ 14
యుద్ధంలో ఈ నీ తొడను బ్రద్దలు చేయకపోతే వృకోదరుడు పితరులతో కలిసి పుణ్యలోకాలకు దూరమవుతాడు. (14)
క్రుద్దస్య తస్య సర్వేభ్యః స్రోతోభ్యః పావకార్చిషః ।
వృక్షస్యేవ వినిశ్చేరుః కోటరేభ్యః ప్రదహ్యతః ॥ 15
ఆ సమయంలో కోపించిన ఆ భీమసేనుని రోమకూపాల నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. చెట్టు తగులబడుతుంటే తొఱ్ఱల నుండి మంట బయటకు వచ్చినట్లుగా అది ఉంది. (15)
విదుర ఉవాచ
పరం భయం పశ్యత భీమసేనాత్
తద్ బుధ్యధ్వం ధృతరాష్ట్రస్య పుత్రాః ।
దైవేరితో నూనమయం పురస్తాత్
పరోఽనయే భరతేషూదపాది ॥ 16
విదురుడిలా అన్నాడు - ధృతరాష్ట్రకుమారులారా! తెలుసుకోండి. భీమసేనుడి ద్వారా ఎంత భయంకరస్థితి ఏర్పడిందో, ప్రారబ్ధప్రేరణచేతనే భరతవంశస్థులలో ఇంత అన్యాయం పుట్టింది. (16)
అతిద్యూతం కృతమిదం ధార్తరాష్ట్రాః
యస్మాత్ స్త్రియం వివదధ్వం సభాయామ్ ।
యోగక్షేమౌ నశ్యతో వః సమగ్రౌ
పాపాన్ మంత్రాన్ కురవో మంత్రయంతి ॥ 17
ధృతరాష్ట్రసుతులారా! హద్దుల నతిక్రమించి జూదమాడారు. స్త్రీని సభకు తెచ్చి వివాదాన్ని సృష్టించారు. మీ యోగక్షేమాలు పూర్తిగా నశించాయి. కౌరవులు పాపిష్ఠమైన మంత్రాంగం చేస్తున్నారని అందరికీ అర్థమైంది. (17)
ఇమం ధర్మం కురవో జానతాశు
ధ్వస్తే ధర్మే పరిషత్ సంప్రదుష్యేత్ ।
ఇమాం చేత్ పూర్వం కితవోఽగ్లహిష్యత్
ఈశోఽభవిష్యదపరాజితాత్మా ॥ 18
కౌరవులారా! ధర్మమాహాత్మ్యాన్ని త్వరగా గ్రహించండి. ధర్మం నశిస్తే సభమొత్తం దుష్టమవుతుంది. జూదమాడుతున్న ధర్మరాజు తానోడకముందే ద్రౌపదిని పణంగా పెట్టి ఉంటే అప్పుడు అలా చేసే అధికారముండేది. (18)
స్వప్నే యథైతద్ విజితం ధనం స్యా
దేవం మన్యే యస్య దీవ్యత్యనీశః ।
గాంధారరాజస్య వచో నిశమ్య
ధర్మాదస్మాత్ కురవో మాపయాత ॥ 19
అధికారం లేనివాడు పణమ్గా పెట్టిన ధనాన్ని గెలిచినా, ఓడినా అది కలలోని గెలుపు ఓటముల వంటిదే. కౌరవులారా! మీరు గాంధారరాజైన శకుని మాటలు విని ధర్మానికి దూరం కావద్దు. (19)
దుర్యోధన ఉవాచ
భీమస్య వాక్యే తద్వదేవార్జునస్య
స్థితోఽహం వై యమయోశ్చైవ మేవ ।
యుధిష్ఠిరం తే ప్రవదంత్వనీశమ్
అథో దాస్యాన్మోక్ష్యసే యాజ్ఞసేని ॥ 20
దుర్యోధనుడిలా అన్నాడు. యాజ్ఞసేనీ! నేను భీమార్జున నకులసహదేవుల మాటను మన్నించాలనుకొంటున్నాను. వీరంతా నిన్ను పణంగా పెట్టడానికి ధర్మరాజుకు అధికారం లేదని చెపితే దాస్యం నుండి నీకు విముక్తి కలిగిస్తాను. (20)
అర్జున ఉవాచ
ఈశో రాజా పూర్వమాసీద్ గ్లహే నః
కుంతీసుతో ధర్మరాజో మహాత్మా ।
ఈశస్త్వయం కస్య పరాజితాత్మా
తజ్జానీధ్వం కురవః సర్వ ఏవ ॥ 21
అర్జునుడిలా అన్నాడు. కౌంతేయుడు, మహాత్ముడైన ధర్మరాజు మమ్ము పణంగా పెట్టినపుడు తాను స్వతంత్రుడే కానీ తానే ఓడిపోయిన తర్వాత మరెవరిమీదా తనకు అధికారముండదు. కౌరవులందరూ అది గ్రహించాలి. (21)
వైశంపాయన ఉవాచ
తతో రాజ్ఞో ధృతరాష్ట్రస్య గేహే
గోమాయు రుచ్చైర్వ్యాహరదగ్నిహోత్రే ।
తం రాసభాః ప్రత్యభాషంత రాజన్
సమంతతః పక్షిణశ్చైవ రౌద్రాః ॥ 22
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! జనమేజయా! ఆ తరువాత ధృతరాష్ట్రమహారాజు అగ్నిశాలలో ఒక నక్క పెద్దగా ఊళ పెట్టసాగింది. దానికి సమాధానమన్నట్లు అన్నివైపుల నుండీ గాడిదలు ఓండ్రపెట్టాయి. భయంకర పక్షులు రొదపెట్టసాగాయి. (22)
తం వై శబ్దం విదురస్తత్త్వవేదీ
శుశ్రావ ఘోరం సుబలాత్మజా చ ।
భీష్మో ద్రోణో గౌతమశ్చాపి విద్వాన్
స్వస్తి స్వస్తీత్యపి చైవాహురుచ్చైః ॥ 23
ఆ ఘోరశబ్దాలను తత్త్వవేత్త అయిన విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు, పండితుడయిన కృపాచార్యుడు విన్నారు. వెంటనే 'స్వస్తి స్వస్తి' అని పెద్దగా శుభకామన చేశారు. (23)
తతో గాంధారీ విదురశ్చాపి విద్వాన్
తముత్పాతం ఘోరమాలక్ష్య రాజ్ఞే ।
నివేదయామాసతురార్తవత్ తదా
తతో రాజా వాక్యమిదం బభాషే ॥ 24
ఆ తరువాత గాంధారి, పండితుడైన విదురుడు పెద్దకీడును శంకించి దీనంగా ఆ విషయాన్ని ధృతరాష్ట్రునకు నివేదించారు. అప్పుడు ధృతరాష్ట్రమహారాజు ఇలా అన్నాడు. (24)
ధృతరాష్ట్ర ఉవాచ
హతోఽసి దుర్యోధన మందబుద్ధే
యస్త్వం సభాయాం కురుపుంగవానామ్ ।
స్త్రియం సమాభాషసి దుర్వినీత
విశేషతో ద్రౌపదీం ధర్మపత్నీమ్ ॥ 25
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. మందమతీ! దుర్యోధనా! నీవు మరణించినట్లే. దుర్వినీతా! కురుశ్రేష్ఠులున్న ఈ సభలో స్త్రీని విశేషించి పాండవధర్మపత్నిని పిలిపించి దుర్భాషలు ఆడుతున్నావు. (25)
ఏవముక్త్వా ధృతరాష్ట్రో మనీషీ
హితాన్వేషీ బాంధవానామపాయాత్ ।
కృష్ణాం పాంచాలీమబ్రవీత్ సాంత్వపూర్వం
విమృశ్యైతత్ ప్రజ్ఞయా తత్వబుద్ధిః ॥ 26
ఈ విధంగా పలికి మనీషి, తత్త్వమతి అయిన ధృతరాష్ట్రుడు బాంధవుల వినాశాన్ని తప్పించి వారికి హితాన్ని కల్పించదలచి, పరిస్థితిని ఆకళింపు చేసికొని అనునయ పూర్వకంగా పాంచాలితో ఇలా అన్నాడు. (26)
ధృతరాష్ట్ర ఉవాచ
వరం వృణీష్వ పాంచాలి మత్తో యదభివాంఛసి ।
వధూనాం హి విశిష్టా మే త్వం ధర్మపరమా సతీ ॥ 27
ధృతరాష్ట్రుడిలా పలికాడు - పాంచాలీ! నీవు నాకోడళ్ళలో సర్వోన్నతవు. ధర్మపరాయణవు. నీకు ఇష్టమయిన వరం కోరుకో. (27)
ద్రౌపద్యువాచ
దదాసి చేద్ వరం మహ్యం వృణోమి భరతర్షభ ।
సర్వధర్మానుగః శ్రీమాన్ అదాసోఽస్తు యుధిష్ఠిరః ॥ 28
మనస్వినమజానం నః మైవం బ్రూయుః కుమారకాః ।
ఏషవై దాసపుత్రో హి ప్రతివింధ్యం మమాత్మజమ్ ॥ 29
ద్రౌపది ఇలా అడిగింది. భరతర్షభా! నాకు వరమిచ్చే టట్లయితే సర్వధర్మాచరనశీలి అయిన యుధిష్ఠిరుని దాస్యవిముక్తిని కోరుతున్నాను. దీనితో నా కుమారుడు, మనస్వి అయిన ప్రతివింధ్యుని తెలిసీతెలియని పిల్లలు దాసపుత్రుడని పిలవరు. (28,29)
రాజపుత్రః పురా భూత్వా యథా నాన్యః పుమాన్ క్వచిత్ ।
రాజభిర్లాలితస్యాస్య న యుక్తా దాసపుత్రతా ॥ 30
ఒకప్పుడు రాజకుమారుడై తర్వాత దాసపుత్రుడయిన వాడు మరెవ్వడూ లేడు. రాజులచే లాలింపబడిన నా కుమారుడు దాసపుత్రుడవటం తగదు. (30)
ధృతరాష్ట్ర ఉవాచ
ఏవం భవతు కళ్యాణి యథా త్వమభిభాషసే ।
ద్వితీయం తే వరం భద్రే దదాని వరయస్వ హ ।
మనో హి మే వితరతి నైకం త్వం వరమర్హసి ॥ 31
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. కళ్యాణీ! నీవడిగినట్లే జరుగుతుంది. నీకు మరొక వరమిస్తున్నాను. కోరుకో. నా మనస్సు మరొక వరమివ్వమంటోంది. ఒకే వరానికి నీవు తగినదానవు కాదు. (31)
ద్రౌపద్యువాచ
సరథే సదనుష్కౌ చ భీమసేన ధనంజయౌ ।
యయౌ చ వరయే రాజన్ అదాసాన్ స్వవశానహమ్ ॥ 32
ద్రౌపది ఇలా అన్నది. రాజా! నీవశమై ఉన్న భీమార్జున నకులసహదేవులకు రథధనుస్సులతో బాటు దాస్యవిముక్తిని కోరుతున్నాను. (32)
ధృతరాష్ట్ర ఉవాచ
తథాస్తుతే మహాభాగే యథా త్వం నందినీచ్ఛసి ।
తృతీయా వరయాస్మత్తః నాసి ద్వాభ్యాం సునత్కృతా ।
త్వం హి సర్వ స్నుషాణాం మే శ్రేయసీ ధర్మచారిణి ॥ 33
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. మహాభాగా! నీవు వంశానికి ఆనందాన్ని కల్గించే దానవు. నీవు కోరినట్లే జరుగుతుంది. మూడవవరం కోరుకో. నా కోడళ్లు అందరిలో శ్రేష్ఠవు నీవు. ధర్మవర్తినివి. రెండు వరాలే ఇవ్వటం నీకు పూర్ణసత్కారం కాదు. (33)
ద్రౌపద్యువాచ
లోభో ధర్మస్య నాశాయ భగవన్ నాహముత్సహే ।
అనర్హా వరమాదాతుం తృతీయం రాజసత్తమ ॥ 34
ద్రౌపది ఇలా అన్నది. ప్రభూ! లోభం ధర్మాన్ని నశింప జేస్తుంది. నాకిక వరాలపై ఆసక్తి లేదు. రాజశ్రేష్ఠా! మూడవ వరానికి నేను తగినదానను కాను. (34)
ఏకమాహుర్వైశ్యవరం ద్వౌతు క్షత్రస్త్రియా వరౌ ।
త్రయస్తు రాజ్ఞో రాజేంద్ర బ్రాహ్మణస్య శతం వరాః ॥ 35
రాజేంద్రా! వైశ్యులకు ఒక్క వరం, క్షత్రియకాంతకు రెండువరాలు, క్షత్రియునకు మూడు వరాలు, బ్రాహ్మణునకు వందవరాలు అని పెద్దలంటారు. (35)
పాపీయాంస ఇమే భూత్వా సంతీర్ణాః పతయో మమ ।
వేత్స్యంతి చైవ భద్రాణి రాజన్ పుణ్యేన కర్మణా ॥ 36
రాజా! నా భర్తలు దాస్యాన్ని పొంది విపత్తిలో పడ్డారు. ఇప్పుడు దాని నుండి బయటపడ్డారు. ఇకపై పుణ్యకర్మలతో శుభాలను పొందగలరు. (36)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి ద్రౌపదీవరలాభే ఏకసప్తతితమోఽధ్యాయః ॥ 71 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున ద్రౌపదీవరలాభమను డెబ్బది ఒకటవ అధ్యాయము. (71)