76. డెబ్బది ఆరవ అధ్యాయము

అనుద్యూతమున ధర్మరాజు ఓడిపోవుట.

వైశంపాయన ఉవాచ
తతో వ్యధ్వగతం పార్థః ప్రాతికామీ యుధిష్ఠిరమ్ ।
ఉవాచ వచనాద్ రాజ్ఞః ధృతరాష్ట్రస్య ధీమతః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
తరువాత చాలా దూరం వెళ్ళిపోయిన యుధిష్ఠిరుని ధీమంతుడైన ధృతరాష్ట్రమహారాజు ఆదేశం మేరకు ప్రాతికామి సమీపించి ఇలా అన్నాడు. (1)
ఉపాస్తీర్ణా సభా రాజన్ అక్షానుప్త్వా యుధిష్ఠిర ।
ఏహి పాండవ దీవ్యేతి పితా త్వాఽఽహేతి భారత ॥ 2
రాజా! యుధిష్ఠిరా! సభ మరల సమాయత్తమై ఉన్నది. తమకై నిరీక్షిస్తోంది. తమ తండ్రి ధృతరాష్ట్రుడు తమను మరలి వచ్చి జూదమాడమని ఆదేశిస్తున్నాడు. (2)
యుధిష్ఠిర ఉవాచ
ధాతుర్నియోగాద్ భూతాని ప్రాప్నువంతి శుభాశుభమ్ ।
న నివృత్తిస్తయోరస్తి దేవితవ్యం పునర్యది ॥ 3
యుధిష్ఠిరుడిలా అన్నాడు. ప్రాణులు విధిప్రేరణ ననుసరించి శుభాశుభాలను పొందుతున్నారు. వాటిని తప్పించే అవకాశం లేదు. మరల నేను ఆడవలసిన విధి ఉన్నట్లుంది. (3)
అక్షద్యూతే సమాహ్వానం నియోగాత్ స్థవిరస్య చ ।
జానన్నపి క్షయకరం నాతిక్రమితుముత్సహే ॥ 4
వృద్ధుడైన ధృతరాష్ట్రమహారాజు ఆదేశాన్ని అనుసరించి జూదానికి మరల ఆహ్వానించటం వంశవినాశకరం. అది తెలిసి కూడా అతిక్రమించలేకపోతున్నాను. (4)
వైశంపాయన ఉవాచ
అసంభవవే హేమమయస్య జంతోః
తథాపి రామో లులుభే మృగాయ ।
ప్రాయః సమాసన్నపరాభవానాం
ధియో విపర్యస్తతరా భవంతి ॥ 5
వైశంపాయనుడిలా అన్నాడు.
బంగారు జంతువు అసంభవమని తెలిసి కూడా రాముడు బంగారు లేడి కోసం వెంటపడ్డాడు. పతనమో, పరాభవమో సంభవించనున్నప్పుడు ఎవని బుద్ధి అయినా విపరీతంగా ఆలోచిస్తుంది. (5)
ఇతి బ్రువన్ నివవృతే భ్రాతృభిః సహ పాండవః ।
జానంశ్చ శకునేర్మాయాం పార్థో ద్యూతమియాత్ పునః ॥ 6
ఆ రీతిగా పలుకుతూ యుధిష్ఠిరుడు సోదరులతో సహా వెనుదిరిగాడు. శకుని మాయ తెలిసి కూడా మరల జూదమాడటానికి వెళ్ళాడు. (6)
వివిశుస్తే సభాం తాం తు పునరేవమహారథాః ।
వ్యథయంతి స్మ చేతాంసి సుహృదాం భరతర్షభాః ॥ 7
యథోపజోషమాసీనాః పునర్ద్యూతప్రవృత్తయే ।
సర్వలోక వినాశాయ దేవనోపనిపీడితాః ॥ 8
భరతశ్రేష్ఠులైన ఆ మహారథులు మరల సభలోనికి ప్రవేశించారు. అది చూచి మిత్రుల మనస్సులు కలతపడ్డాయి. ప్రారబ్ధానికి వశులయిన కుంతీ కుమారులు సర్వలోక వినాశ హేతువైన జూదం ఆడటానికి సుఖంగా అక్కడ కూర్చున్నారు. (8)
శకుని రువాచ
అముంచత్ స్థవిరో యద్ వః ధనం పూజితమేవ తత్ ।
మహాధనం గ్లహం త్వేనం శృణు భో భరతర్షభ ॥ 9
శకుని ఇలా అన్నాడు. భరతర్షభా! వృద్ధుడైన ధృతరాష్ట్ర మహారాజు మీ ధనమంతా మీకు తిరిగి ఇచ్చి మంచిపని చేశాడు. జూదానికి ఒక్కటే పందెం పెడదాం. విను. (9)
వయం వా ద్వాదశాబ్దాని యుష్మాభిర్ద్యూతనిర్జితాః ।
ప్రవిశేమ మహారణ్యం రౌరవాజినవాససః ॥ 10
మీరు జూదంలో గెలిస్తే మేము పండ్రెండు సంవత్సరాలు మృగచర్మాలను ధరించి అరణ్యవాసం చేస్తాము. (10)
త్రయోదశం చ సజనే అజ్ఞాతాః పరివత్సరమ్ ।
జ్ఞాతాశ్చ పునరన్యాని వనే వర్షాణి ద్వాదశ ॥ 11
పదమూడవ సంవత్సరం మనుష్యుల మధ్యనే ఉంటూ అజ్ఞాతంగా గడుపుతాం. అజ్ఞాతవాసం భంగమయితే మరల పండ్రెండు సంవత్సరాలు అరణ్యంలో గడుపుతాం. (11)
అస్మాభిర్నిర్జితా యూయం వనే ద్వాదశవత్సరాన్ ।
వసధ్యం కృష్ణయా సార్ధమ్ అజినైః ప్రతివాసితాః ॥ 12
మేము మిమ్ము ఓడిస్తే ద్రౌపదితో పాటు మీరు పండ్రెండు సంవత్సరాలు మృగచర్మధారులై అరణ్యవాసం చేయండి. (12)
త్రయోదశం చ సజనే అజ్ఞాతాః పరివత్సరమ్ ।
జ్ఞాతాశ్చ పునరన్యాని వనే వర్షాణి ద్వాదశ ॥ 13
పదమూడవ సంవత్సరం మనుష్యుల మధ్యనే అజ్ఞాతంగా గడపండి. అజ్ఞాతవాసం భంగపడితే మరల పండ్రెండు సంవత్సరాలు అరణ్యంలో గడపండి. (13)
త్రయోదశే చ నిర్వృత్తే పునరేవ యథోచితమ్ ।
స్వరాజ్యం ప్రతిపత్తవ్యమ్ ఇతరైరథ వేతరైః ॥ 14
పదమూడవ సంవత్సరం కూడా ముగిస్తే మీరైనా, మేమైనా యథోచితంగా స్వరాజ్యాన్ని మరల పొందవచ్చు. (14)
అనేన వ్యవసాయేన సహాస్మాభిర్యుధిష్ఠిర ।
అక్షానుప్త్వా పునర్ద్యూతమ్ ఏహి దీవ్యస్వ భారత ॥ 15
భారతా! యుధిష్ఠిరా! ఈ నిర్ణయంతో రా! మరల పాచికలు వేసి మాతో జూదమాడు. (15)
అథ సభ్యాః సభామధ్యే సముచ్ర్ఛితకరాస్తదా ।
ఊచురుద్విగ్నమనసః సంవేగాత్ సర్వ ఏవ హి ॥ 16
అది విని సభ్యులందరూ సభలో తమ చేతులు పైకెత్తి ఉద్విగ్నచిత్తులై కలవరపాటుతో ఇలా అన్నారు. (16)
సభ్యా ఊచుః
అహోధిగ్ బాంధవా నైనం బోధయంతి మహద్ భయమ్ ।
బుద్ధ్యా బుద్ధ్యేన్న వా బుద్ధ్యేద్ అయం వై భరతర్షభః ॥ 17
సభ్యులిలా అన్నారు. అయ్యో! బంధువులైనా యుధిష్ఠిరునకు తన మీదికి వస్తున్న ప్రమాదాన్ని తెలియజేయటం లేదు. ఈ భరతశ్రేష్ఠునకు స్వబుద్ధితో ఈ విషయం అర్థమవుతున్నదో లేదో! (17)
వైశంపాయన ఉవాచ
జనప్రవాదాన్ సుబహూన్ శృణ్వన్నపి నరాధిపః ।
హ్రియా చ ధర్మసంయోగాత్ పార్థో ద్యూతమియాత్ పునః ॥ 18
వైశంపాయనుడిలా అన్నాడు.
లోకులు అనుకొంటున్న మాటలను వింటూ కూడా యుధిష్ఠిరనరాధిపుడు మొగమాటమి వలన, ధృతరాష్ట్ర వచనపాలన మను ధర్మదృష్టివలనా మరలా జూదానికి సిద్ధపడ్డాడు. (18)
జానన్నపి మహాబుద్ధిః పునర్ద్యూతమవర్తయత్ ।
అప్యాసన్నో వినాశః స్యాత్ కురూణామితి చింతయన్ ॥ 19
మహాబుద్ధి గల యుధిష్ఠిరుడు అంతా తెలిసి కూడా 'కురుకుల వినాశం సమీపించింది' అని ఆలోచిస్తూ జూదానికి సమాయత్తమయ్యాడు. (19)
యుధిష్ఠిర ఉవాచ
కథమ్ వై మద్విధో రాజా స్వధర్మమనుపాలయన్ ।
ఆహూతో వినివర్తేఽహం దీవ్యామి శకునే త్వయా ॥ 20
యుధిష్ఠిరుడిలా అన్నాడు. శకునీ! స్వధర్మపరిపాలనలో ఆసక్తి గల నావంటి రాజు జూదానికి పిలవబడి మరలిపోతాడా! నీతో నేను ఆడుతున్నాను. (20)
(వైశంపాయన ఉవాచ
ఏవం దైవబలావిష్టః ధర్మరాజో యుధిష్ఠిరః ।
భీష్మద్రోణైర్వార్యమాణః విదురేణ చ ధీమతా ॥
యుయుత్సునా కృపేణాథ సంజయేన చ భారత ।
గాంధార్యా పృథయా చైవ భీమార్జునయమైస్తథా ॥
వికర్ణేన చ వీరేణ ద్రౌపద్యా ద్రౌణినా తథా ।
సోమదత్తేన చ తతా బాహ్లీకేన చ ధీమతా ॥
వార్యమాణోఽపి సతతం న చ రాజా నియచ్ఛతి ।)
వైశంపాయనుడిలా అన్నాడు.
భారతా! యుధిష్ఠిరుడు ప్రారభ్ధానికి లోనయ్యాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, యుయుత్సువు, కృపుడు, సంజయుడు, గాంధారి, పృథ, భీమార్జున నకుల సహదేవులు, వికర్ణుడు, ద్రౌపది, అశ్వత్థామ, సోమదత్తుడు, బాహ్లీకుడు వారిస్తున్నా ఆ ధర్మరాజు జూదం నుండి మరల లేదు.
శకునిరువాచ
గవాశ్వం బహుధేనుకమ్ అపర్యంతమజావికమ్ ।
గజాః కోశో హిరణ్యం చ దాసీదాసాశ్చ సర్వశః ॥ 21
శకుని ఇలా అన్నాడు - మా దగ్గర గోవులు, గుఱ్ఱాలు, ఆవులు, మేకలు, గొఱ్ఱెలు, ఏనుగులు, డబ్బు, బంగారం, దాసదాసీజనులు అన్నీ ఉన్నాయి. (21)
ఏష నో గ్లహ ఏవైకః వనవాసాయ పాండవాః ।
యూయం వయం వా విజితా వసేమ వనమాశ్రితాః ॥ 22
అయినా పాండవులారా! వనవాసమొక్కటే మా పందెం. మీరైనా మేమైనా ఓడిపోతే అరణ్యాలలో నివసించాలి. (22)
త్రయోదశం చ వై వర్షమ్ అజ్ఞాతాః సజనే తథా ।
అనేన వ్యవసాయేన దీవ్యామ పురుషర్షభాః ॥ 23
పురుషోత్తములారా! పదమూడవ సంవత్సరాన్ని జనుల మధ్యనే అజ్ఞాతంగా గడపాలి. ఈ నిర్ణయంతో జూదమాడుదాం. (23)
సముత్షేపేణ చైకేన వనవాసాయ భారత ।
ప్రతిజగ్రాహ తమ్ పార్థః గ్లహం జగ్రాహ సౌబలః ।
జితమిత్యేవ శకునిః యుధిష్ఠిరమభాషత ॥ 24
భారతా! వనవాసాన్ని పందెంగా పెట్టి ఒక్కమారు పాచికలు విసరగానే ఆట ముగుస్తుంది. ఆ నియమాన్ని యుధిష్ఠిరుడు అంగీకరించాడు. ఆ తరువాత శకుని పాచికను చేతబట్టి విసిరి 'నేనే గెలిచాను' అని యుధిష్ఠిరునితో అన్నాడు. (24)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి అనుద్యూతపర్వణి పునర్యుధిష్ఠిరపరాభవే షట్సప్తతితమోఽధ్యాయః ॥ 76 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున అనుద్యూతపర్వమను ఉపపర్వమున పునర్యుధిష్ఠిరపరాభవమను డెబ్బది యారవ అధ్యాయము. (76)
(దాక్షిణాత్య అధికపాఠము 3 1/2 శ్లోకాలు కలిపి మొత్తము 27 1/2 శ్లోకాలు)