77. డెబ్బది ఏడవ అధ్యాయము
పాండవుల ప్రతిజ్ఞలు.
వైశంపాయన ఉవాచ
తతః పరాజితాః పార్థాః వనవాసాయ దీక్షితాః ।
అజినాన్యుత్తరీయాణి జగృహుశ్చ యథాక్రమమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. పరాజితులైన పాండవులు వనవాసదీక్షను స్వీకరించి క్రమంగా అందరు మృగచర్మాలు ఉత్తరీయాలుగా స్వీకరించారు. (1)
అజినైః సంవృతాన్ దృష్ట్వా హృతరాజ్యానరిందమాన్ ।
ప్రస్థితాన్ వనవాసాయ తతో దుఃశాసనోఽబ్రవీత్ ॥ 2
రాజ్యాన్ని పోగొట్టుకొని, మృగచర్మాలు ధరించి వనవాసానికి బయలుదేరిన అరిందములైన ఆ పాండవులను చూచి దుశ్శాసనుడిలా అన్నాడు. (2)
ప్రవృత్తం ధార్తరాష్ట్రస్య చక్రం రాజ్ఞో మహాత్మనః ।
పరాజితాః పాండవేయాః విపత్తిం పరమాం గతాః ॥ 3
'మహానుభావుడైన దుర్యోధనమహారాజు తేజస్సు పెరిగి రాజ్యం ఏకచక్రాధిపత్యమయింది. పాండవులు పరాజితులై ఘోరవిపత్తి పాలయ్యారు. (3)
అద్వైవ తే సంప్రయాతాః సమైర్వర్త్మభిరస్థలైః ।
గుణజ్యేష్ఠాస్తథాశ్రేష్ఠాః శ్రేయాంసో యద్ వయం పరైః ॥ 4
ఈనాడే ఆ పాండవులు సమతలమార్గాలలో, బీళ్ళలో పయనిస్తూ అరణ్యాలకు వెళ్ళిపోయారు. మనమిప్పుడు శత్రువుల కన్న గుణానుసారంగా గొప్పవారం. ఉన్నతస్థితిలో నున్నవారం. (4)
నరకం పాతితాః పార్థాః దీర్ఘకాలమనంతకమ్ ।
సుఖాచ్చ హీనా రాజ్యాశ్చ వినష్టాః శాశ్వతీః సమాః ॥ 5
ధనేన మత్తా యే తే స్మ ధార్తరాష్ట్రాన్ ప్రహాసిషుః ।
తే నిర్జితా హృతధనాః వనమేష్యంతి పాండవాః ॥ 6
కుంతీకుమారులు సుఖాలను, రాజ్యాన్ని కోలుపోయి చిరకాలమూ అంతంలేని దుఃఖనరకంలో పడిపోయారు. ధనమదంతో ధార్తరాష్ట్రులను పరిహసిస్తున్న ఆ పాండవులు పరాజితులై ధనాన్ని కూడా కోలుపోయి అరణ్యానికి వెళ్తున్నారు. (5,6)
చిత్రాన్ సన్నాహానవముచ్య పార్థాః
వాసాంసి దివ్యాని చ భానుమంతి ।
వివాస్యంతాం రురుచర్మాణి సర్వే
యథాగ్లహం సౌబలస్యాభ్యుపేతాః ॥ 7
శకునితో చేసికొన్న ఒడంబడిక మేరకు మృగచర్మాలను ధరించి విచిత్రకవచాలను, ప్రకాశవంతాలయిన దివ్యవస్త్రాలను విసర్జించారు. (7)
న సంతి లోకేషు పుమాంస ఈదృశా
ఇత్యేవ యే భావితబుద్ధయః సదా ।
జ్ఞాస్యంతి తేఽఽత్మానమియేఽద్య పాండవాః
విపర్యయే షండతిలా ఇవాఫలాః ॥ 8
మావంటి మగవారు మూడులోకాలోనూ లేరని నిత్యమూ భావించుకొన్న పాండవులు కాలవైపరీత్యం వలన మొలకెత్తని నువ్వుల వలె నిర్వీర్యులై తమస్థితిని తాము తెలిసికొనబోతున్నారు. (8)
ఇదం హి వాసో యది వేదృశానాం
మనస్వినాం రౌరవమాహవేషు ।
అదీక్షితానామజినాని యద్వద్
బలీయసాం పశ్యత పాండవానామ్ ॥ 9
అభిమానవంతులు, బలిష్ఠులు అయిన పాండవులు యజ్ఞదీక్షితులు కారు. అయినా యాగదీక్షలో మహాత్ములు ధరించే మృగచర్మాన్ని ధరించారు. కేవలం ఆటవికులు మృగచర్మధారణ చేసినట్లుంది. (9)
మహాప్రాజ్ఞః సౌమకిర్యజ్ఞసేనః
కన్యాం పాంచాలీం పాండవేభ్యః ప్రదాయ ।
అకార్షీద్ వై సుకృతం నేహ కించిత్
క్లీబాః పార్థాః పతయో యాజ్ఞసేన్యాః ॥ 10
సోమవంశజుడు, ధీమంతుడు అయిన ద్రుపదుడు తన పుత్రిని పాంచాలిని పాండవులకివ్వటం తగిన పనికాదు. ఆమె భర్తలు నపుంసకులయ్యారు. (10)
సూక్ష్మప్రావారానజినోత్తరీయాన్
దృష్ట్వారణ్యే నిర్ధనానప్రతిష్ఠాన్ ।
కాం త్వం ప్రీతిం లప్స్యసే యాజ్ఞసేని
పతిం వృణీష్వేహ యమన్యమిచ్ఛసి ॥ 11
యాజ్ఞసేనీ! పలుచనిమేలి వస్త్రాలు ధరించవలసిన పాండవులు, జింకచర్మాన్ని ఉత్తరీయంగా వేసికొని నిర్ధనులై ప్రతిష్ఠాహీనులై అరణ్యంలో తిరుగుతుంటే నీకు ప్రీతి ఎలా కలుగుతుంది? మరెవరినైనా నీకిష్టమైనవానిని వరించు. (11)
ఏతే హి సర్వే కురవః సమేతాః
క్షాంతా దాంతాః సుద్రవిణోపపన్నాః ।
ఏషాం వృణీష్వైకతమం పతిత్వే
న త్వాం తపేత్ కాలవిపర్యయోఽయమ్ ॥ 12
ఈ కౌరవులందరూ శమదమాలు గలవారు. ధనసంపన్నులు. కలిసి ఉండేవారు. వీరిలో ఎవరినైనా భర్తగా వరించు. ఈ కాలవైపరీత్యం నిన్ను పీడించదు. (12)
యథాఫలాః షండతిలా యథా చర్మమయా మృగాః ।
తథైవ పాండవాః సర్వే యథా కాకయవా అపి ॥ 13
మొలవని నువ్వులు లాగా, తోలు మృగం లాగా, గింజలు లేని "కాకయవ ధాన్యం' పొల్లులాగా పాండవుల జన్మ నిష్ప్రయోజనమయినది. (13)
కిం పాండవాంస్తే పతితానపాస్య
మోఘః శ్రమః షండతిలానుపాస్య ।
ఏవం నృశంసః పరుషాణి పార్థాన్
అశ్రావయద్ ధృతరాష్ట్రస్య పుత్రః ॥ 14
మొలవని నువ్వులను ఆశ్రయిస్తే శ్రమ అంతా వ్యర్థం. పతితులయిన పాండవులను సేవిస్తే బ్రతుకంతా వ్యర్థం.' ఈ విధంగా దుర్మార్గుడయిన దుశ్శాసనుడు పాండవులు వినేటట్లు నీచంగా మాట్లాడాడు. (14)
తద్ వై శ్రుత్వా భీమసేనోఽత్యమర్షీ
నిర్భర్త్స్యోచ్చైః సంనిగృహ్యేవ రోషాత్ ।
ఉవాచ చైనం సహసైవోపగమ్య
సింహో యథా హైమవతః శృగాలమ్ ॥ 15
ఆ మాటలు విని భీమసేనుడు తీవ్రంగా కోపించి హిమాలయాల్లో గుహలో ఉన్న సింహం నక్క మీదికి వచ్చినట్టు దుశ్శాసనుని సమీపించి, కోపంతో అతనిని ఆపి, పెద్దగా బెదిరిస్తూ ఇలా అన్నాడు. (15)
భీమసేన ఉవాచ
క్రూర పాపజనైర్జుష్టమ్ అకృతార్థం ప్రభాషసే ।
గాంధార విద్యయా హి త్వం రాజమధ్యే వికత్థసే ॥ 16
భీమసేనుడిలా అన్నాడు.
క్రూరుడా! పాపాత్ములవలె నీవు నీచంగా మాటాడుతున్నావు. శకుని ప్రదర్శించిన మాయా విద్యాప్రభావంతో రాజమండలిలో నిన్ను నీవు ప్రశంసించుకొంటున్నావు. (16)
యథా తుదసి మర్మాణి వాక్శరైరిహ నో భృశమ్ ।
తథా స్మారయితా తేఽహం కృంతన్ మర్మాణి సంయుగే ॥ 17
మాటలబాణాలతో మా మర్మస్థానాలను పీడిస్తున్నావు. యుద్ధంలో నీ మర్మస్థానాలను బ్రద్దలు చేస్తూ నీ ఈ మాటలను నీకు గుర్తు చేస్తాను. (17)
యే చ త్వామనువర్తంతే క్రోధలోభవశానుగాః ।
గోప్తారః సానుబంధాంస్తాన్ నేతాస్మి యమసాదనమ్ ॥ 18
క్రోధానికి, లోభానికి లోనయి నీకు రక్షకులై నీ వెన్నంటి నడుస్తున్నవారిని కూడా యమసదనానికి పంపిస్తాను. (18)
వైశంపాయన ఉవాచ
ఏవం బ్రువాణమజినైర్వివాసితం
దుఃశాసనస్తం పరినృత్యతి స్మ ।
మధ్యే కురూణాం ధర్మనిబద్ధమార్గం
గౌరితి స్మాహ్వయన్ ముక్తలజ్జాః ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు. మృగచర్మాన్ని ధరించి భీమసేనుడిలా మాటాడుతుంటే కౌరవుల మధ్యలో నిలిచి దుశ్శాసనుడు సిగ్గులేకుండా "ఎద్దు! ఎద్దు!" అని భీముని పరిహరిస్తూ, పిలుస్తూ నృత్యం చేయసాగాడు. అప్పుడు ధర్మజుడు భీముని నిరోధించాడు. (19)
యేఽస్మాన్ పూర్వం ప్రనృత్యంతి ముహుర్గౌరితి గౌరితి ।
తాన్వయం ప్రతినృత్యామః పునర్గౌరితి గౌరితి ॥ (నీల)
భీమసేన ఉవాచ
నృశంస పరుషం వక్తుం శక్యం దుఃశాసన త్వయా ।
నికృత్యా హి ధనం లబ్ధ్వా కో వికత్థితుమర్హతి ॥ 20
భీమసేనుడిలా అన్నాడు. దుశ్శాసనా! మోసంతో ధనాన్ని సంపాదించి తనను తాను ప్రశంసించుకొనే నీకే ఇటువంటి క్రూర, నీచ వచనాలు పలకటం సాధ్యం. (20)
మైవ స్మ సుకృతాంల్లోకాన్ గచ్ఛేత్ పార్థో వృకోదరః ।
యది వక్షో హి తే భిత్త్వా న పిబేచ్ఛోణితాం రణే ॥ 21
పృథాకుమారుడైన ఈ వృకోదరుడు యుద్ధంలో నీ గుండెలు చీల్చి నీ నెత్తురు త్రాగకపోతే పుణ్యలోకాలను పొందలేడు. (21)
ధార్తరాష్ట్రాన్ రణే హత్వా మిషతాం సర్వధన్వినామ్ ।
శమం గంతాస్మి నచిరాత్ సత్యమేతద్ బ్రవీమి తే ॥ 22
నీకొక మాట చెప్తున్నాను. త్వరలోనే సమస్త ధనుర్ధరులు చూస్తూ ఉండగానే ధార్తరాష్ట్రులనందరినీ యుద్ధంలో చంపి శాంతి పొందుతాను. (22)
వైశంపాయన ఉవాచ
తస్య రాజా సింహగతేః సఖేలం
దుర్యోధనో భీమసేనస్య హర్షాత్ ।
గతిం స్వగత్యానుచకార మందః
నిర్గచ్ఛతాం పాండవానాం సభాయాః ॥ 23
వైశంపాయనుడిలా అన్నాడు. సభ నుండి పాండవులు నిష్ర్కమించే సమయంలొ మందమతి అయిన దుర్యోధనుడు ఆనందపరవశుడై సింహం వలె నడుస్తున్న ఆ భీమసేనుని గమనాన్ని సరదాగా తన నడకతో అనుకరించాడు. (23)
నైతావతా కృతమిత్యబ్రవీత్ తం
వృకోదరః సంనివృత్తార్ధకాయః ।
శీఘ్రం హి త్వాం నిహతం సానుబంధం
సంస్మార్యాహం ప్రతివక్ష్యామి మూఢ ॥ 24
అది చూచి తన శరీరాన్ని సగభాగం వెనుకకు త్రిప్పి "మూఢుడా! దుశ్శాసనుని నెత్తురు త్రాగటంతో నా కర్తవ్యం ముగియదు. త్వరలోనే నిన్ను సబాంధవంగా యమలోకానికి పంపి, నీవు చేస్తున్న హేళనను గుర్తుచేసి అప్పుడు బదులిస్తాని" అని అన్నాడు. (24)
ఏవం సమీక్ష్యాత్మని చావమానం
మియమ్య మన్యుం బలవాన్ స మానీ ।
రాజానుగః సంసది కౌరవాణాం
వినిష్ర్కామన్ వాక్యమువాచ భీమః ॥ 25
ఈ ప్రకారం తనకు జరుగుతున్న అవమానాన్ని చూచి బలిష్ఠుడు, అభిమానవంతుడు అయిన భీముడు కోపాన్ని నియంత్రించుకొని యుధిష్ఠిరుని వెనుక నడుస్తూ కౌరవసభలో ఇలా అన్నాడు. (25)
భీమసేన ఉవాచ
అహం దుర్యోధనం హంతా కర్ణం హంతా ధనంజయః ।
శకునిం చాక్షకితవం సహదేవో హనిష్యతి ॥ 26
భీమసేనుడిలా అన్నాడు. నేను దుర్యోధనుని చంపుతాను. అర్జునుడు కర్ణుని చంపుతాడు. ఈ జూదరిశకునిని సహదేవుడు చంపుతాడు. (26)
ఇదం చ భూయో వక్ష్యామి సభామధ్యే బృహద్ వచః ।
సత్యం దేవాః కరిష్యంతి యన్నౌ యుద్ధమ్ భవిష్యతి ॥ 27
సుయోధనమిమం పాపం హన్తాస్మి గదయా యుధి ।
శిరః పాదేన చాస్యాహమ్ అధిష్ఠాస్యామి భూతలే ॥ 28
సభామధ్యంలో మరొక పెద్దమాట అంటున్నాను. దేవతలు కూడా నా మాటను వమ్ముచేయరు. కౌరవపాండవుల మధ్య యుద్ధం జరిగినపుడు ఈ సారి దుర్యోధనుని గదతో చంపివేస్తాను. రణభూమిలో నేలపై పడద్రోసి ఈ పాపాత్ముని తలను కాలితో తన్ని నిలబడతాను. (27,28)
వాక్యశూరస్య చైవాస్య పరుషస్య దురాత్మనః ।
దుఃశాసనస్య రుధిరం పాతాస్మి మృగరాడిన ॥ 29
వాచాలుడు, దుర్మార్గుడు, క్రూరుడు అయిన ఈ దుశ్శాసనుని నెత్తుటిని సింహం వలె త్రాగుతాను. (29)
అర్జున ఉవాచ
నైవం వాచా వ్యవసితం భీమ విజ్ఞాయతే సతామ్ ।
ఇతశ్చతుర్దశే వర్షే ద్రష్టారో యద్ భవిష్యతి ॥ 30
అర్జునుడిలా అన్నాడు. భీమా! సజ్జనులు తాము చేయదలచుకొన్న దానిని మాటలతో చెప్పరు. నేటికి పదునాలుగవ సంవత్సరంలో జరుగబోయేది జనం చూస్తారు. (30)
భీమసేన ఉవాచ
దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః ।
దుఃశాసనచతుర్థానాం భూమిః పాస్యతి శోణితమ్ ॥ 31
భీమసేనుడిలా అన్నాడు. ఈ నేల దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనుల నెత్తురు త్రాగుతుంది. (31)
అర్జున ఉవాచ
అసూయితారం ద్రష్టారం ప్రవక్తారం వికత్థనమ్ ।
భీమసేన నియోగాత్ తే హంతాహం కర్ణమాహవే ॥ 32
అర్జునుడిలా అన్నాడు. మనలో తప్పులనే చూస్తూ, మన బాధలను చూచి ఆనందిస్తూ, కౌరవులకు సలహాలనిస్తూ, ప్రగల్భాలు పలుకుతున్న ఈ కర్ణుని నీ ఆజ్ఞతో రణరంగంలో చంపివేస్తాను. (32)
అర్జునః ప్రతిజానీతే భీమస్య ప్రియకామ్యయా ।
కర్ణం కర్ణానుగాంశ్చైవ రణే హంతాస్మి ప్రతిభిః ॥ 33
భీమునకు ప్రియాన్ని కల్గించాలని అర్జునుడిలా ప్రతిజ్ఞ చేస్తున్నాడు. 'కర్ణుని అతని అనుచరులను యుద్ధంలో బాణాలతో సంహరిస్తాను. (33)
యే చాన్యే ప్రతియోత్స్యంతి బుద్ధిమోహేన మాం నృపాః ।
తాంశ్చ సర్వానహం బాణైః నేతాస్మి యమసాదనమ్ ॥ 34
మతిచెడి మరెవరైనా నాకెదురునిలిచి యుద్ధం చేస్తే వారినందరినీ నా బాణాలతో యమలోకానికి పంపుతాను. (34)
చలేద్ధి హిమవాన్ స్తానాద్ నిష్ప్రభః స్యాద్ దివాకరః ।
శైత్యం సోమాత్ ప్రణశ్యేత మత్సత్యం విచలేద్ యది ॥ 35
హిమాలయం కదిలినా, సూర్యుడు తేజస్సు కోలుపోయినా, చంద్రుని చల్లదనం నశించినా నామాట తప్పదు. (35)
న ప్రదాస్యతి చేద్ రాజ్యమ్ ఇతో వర్షే చతుర్దశే ।
దుర్యోధనోఽభిసత్కృత్య సత్యమేతద్ భవిష్యతి ॥ 36
నేటికి పదునాలుగవ సంవత్సరంలో దుర్యోధనుడు మనలను సత్కరించి రాజ్యమివ్వకపోతే నేను చెప్పినట్టు జరిగి తీరుతుంది.' (36)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్తవతి పార్థే తు శ్రీమాన్ మాద్రవతీసుతః ।
ప్రగృహ్య విపులం బాహుం సహదేవః ప్రతాపవాన్ ॥ 37
సౌబలస్య వధం ప్రేప్సుః ఇదం వచనమబ్రవీత్ ।
క్రోధసంరక్తనయనః నిఃశ్వసన్నివ పన్నగః ॥ 38
వైశంపాయనుడిలా అన్నాడు. అర్జునుడిలా అనగానే అందగాడు, పరాక్రమశాలి అయిన సహదేవుడు తన విశాలబాహువులను పైకెత్తి కోపంతో కళ్లెఱ్ఱచేసి, పాములా బుసకొడుతూ శకునిని చంపదలచి ఇలా అన్నాడు. (37,38)
సహదేవ ఉవాచ
అక్షాన్ యాన్ మన్యసే మూఢ గాంధారాణాం యశోహర ।
నైతేఽక్షా నిశితా బాణాః త్వయైతే సమరే వృతాః ॥ 39
సహదేవుడిలా అన్నాడు. గాంధారుల కీర్తిని నాశనం చేస్తున్న మూఢుడా! ఇవి పాచికలని నీవనుకొంటున్నావు. కానీ ఆ రూపంలోని తీవ్రబాణాలవి. యుద్ధానికి నీ అంతట నీవే ఎన్నుకొన్నావు. (39)
యథా చైవోక్తవాన్ భీమః త్వాముద్ధిశ్య సబాంధవమ్ ।
కర్తాహం కర్మాస్తస్య కురు కార్యాణి సర్వశః ॥ 40
భీమసేనుడు నిన్నూ, నీ బంధువులనూ ఉద్దేశించి పలికిన మాటలను నేను తప్పక చేసి చూపిస్తాను. ఆత్మరక్షణకు అన్ని ఏర్పాట్లు చేసుకో. (40)
హంతాస్మి తరసా యుద్ధే త్వామేవేహ సబాంధనమ్ ।
యది స్థాస్యసి సంగ్రామే క్షత్రధర్మేణ సౌబల ॥ 41
సౌబలా! క్షాత్రధర్మాన్ని పాటించి నీవు రణరంగంలో నిలిస్తే నేను నిన్నే నీ బాంధవులతో సహా యుద్ధంలో త్వరగా చంపివేస్తాను. (41)
సహదేవవచః శ్రుత్వా నకులోఽపి విశాంపతే ।
దర్శనీయతమో నౄణామ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 42
రాజా! సహదేవుని మాటలు విని రాజులలో అందగాడైన నకులుడు కూడా ఇలా అన్నాడు. (42)
నకుల ఉవాచ
సుతేయం యజ్ఞసేనస్య ద్యూతేఽస్మిన్ ధృతరాష్ట్రజైః ।
యైర్వాచః శ్రావితా రూక్షాః స్థితైర్దుర్యోధనప్రియే ॥ 43
తాన్ ధార్తరాష్ట్రాన్ దుర్వృత్తాన్ మమూర్షూన్ కాలనోదితాన్ ।
గమయిష్యామి భూయిష్ఠాన్ అహం వైవస్వతక్షయమ్ ॥ 44
నకులుడిలా అన్నాడు.
దుర్యోధనుడి కిష్టమైన రీతిగా ప్రవర్తించాలని ధార్తరాష్ట్రులు ఈ ద్యూతసభలో యజ్ఞసేనుని పుత్రిక అయిన ద్రౌపదిని అనరాని మాటలన్నారు. దుష్ప్రవర్తనతో కాలప్రేరితులై చావగోరుతున్న వారిని అందరనూ యమలోకానికి పంపిస్తాను. (43,44)
నిదేశాద్ ధర్మరాజస్య ద్రౌపద్యాః పదవీం చరన్ ।
నిర్ధార్తరాష్ట్రాం పృథివీం కర్తాస్మి న చిరాదివ ॥ 45
ధర్మరాజు ఆదేశంతో ద్రౌపదికి ప్రియాన్ని కల్గిస్తూ త్వరలో ఈ భూమిని ధార్తరాష్ట్రరహితంగా చేస్తాను. (45)
వైశంపాయన ఉవాచ
ఏవం తే పురుషవ్యాఘ్రాః సర్వే వ్యాయతబాహవః ।
ప్రతిజ్ఞా బహుళాః కృత్వా ధృతరాష్ట్రముపాగమన్ ॥ 46
వైశంపాయనుడిలా అన్నాడు. ఈ రీతిగా పురుషసింహాలు, మహాబాహువులయిన ఆ పాండవులు చాలా ప్రతిజ్ఞలు చేసి ధృతరాష్ట్రుని సమీపించారు. (46)
ఇతి శ్రీమహాభారతే సభాసపర్వణి అనుద్యూతపర్వణి పాండవ ప్రతిజ్ఞాకరణే సప్తసప్తతితమోఽధ్యాయః ॥ 77 ॥
ఇది శ్రీమహాభారతమున సభాసపర్వమున అనుద్యూతపర్వమను ఉపపర్వమున పాండవ ప్రతిజ్ఞాకరణమను డెబ్బది యేడవ అధ్యాయమి. (77)