80. ఎనుబదియవ అధ్యాయము

విదుర ధృతరాష్ట్రద్రోణవచనములు.

వైశంపాయన ఉవాచ
తమాగతమథో రాజా విదురం దీర్ఘదర్శినమ్।
పాశంక ఇవ పప్రచ్ఛ ధృతరాష్ట్రోఽంబికాసుతః॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
ఆంబికేయుడైన ధృతరాష్ట్రమహారాజు తన దగ్గరకు వచ్చిన దీర్ఘదర్శి అయిన విదురుని జంకుతూ ఇలా అడిగాడు. (1)
ధృతరాష్ట్ర ఉవాచ
కథం గచ్ఛతి కౌంతేయః ధర్మపుత్రో యుధిష్ఠిరః।
భీమసేనః సవ్యసాచీ మాద్రీపుత్రౌ చ పాండవౌ॥ 2
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. ధర్మసుతుడైన యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవులు ఎలా వెళ్ళారు? (2)
ధౌమ్యశ్చైవ కథం క్షత్రః ద్రౌపదీ చ యశస్వినీ।
శ్రోతుమిచ్ఛామ్యహం సర్వం తేషాం శంస విచేష్టితమ్॥ 3
విదురా! ధౌమ్యుడు, యశస్విని అయిన ద్రుపది ఎలా వెళ్ళారు. సవిస్తరంగా చెప్పు. ఆ సమయంలో వారి చేష్టలను తెలిసికోవాలనుకొంటున్నాను చెప్పు. (3)
విదుర ఉవాచ
వస్త్రేణ సంవృత్య ముఖం కుంతీపుత్రో యుధిష్ఠిరః।
బాహూ విశాలౌ సంపశ్యన్ భీమో గచ్ఛతి పాండవః॥ 4
విదురుడిలా అన్నాడు - కౌంతేయుడైన యుధిష్ఠిరుడు ముఖాన్ని వస్త్రంతో కప్పుకొన్నాడు. భీమసేనుడు తన విశాలబాహువులను చూస్తూ వెళ్ళాడు. (4)
సికతా వపన్ సవ్యసాచీ రాజానమనుగచ్ఛతి।
మాద్రీపుత్రః సహదేవః ముఖమాలిప్య గచ్ఛతి॥ 5
అర్జునుడు ఇసుక చల్లుతూ యుధిష్ఠిరుని అనుసరించాడు. మాద్రేయుడైన సహదేవుడు తన ముఖం మీద మట్టి పూసుకొని వెళ్ళాడు. (5)
పాంసూపలిప్తసర్వాంగః నకులశ్చిత్తవిహ్వలః।
దర్శనీయతమో లోకే రాజానమనుగచ్ఛతి॥ 6
లోకంలో అందరిని మించిన అందగాడు నకులుడు ఒళ్ళంతా దుమ్ము పూసుకొంటూ వ్యాకులచిత్తుడై యుధిష్ఠిరుని అనుసరించాడు. (6)
కృష్ణా తు కేశైః ప్రచ్ఛాద్య ముఖమాయతలోచనా।
దర్శనీయా ప్రరుదతీ రాజానమనుగచ్ఛతి॥ 7
విశాలనేత్ర, సుందరి అయిన ద్రౌపది ముఖాన్ని జుట్టుతో కప్పుకొని విలపిస్తూ ధర్మరాజును అనుసరించింది. (7)
ధౌమ్యో రౌద్రాణి సామాని యామ్యాని చ విశాంపతే।
గాయన్ గచ్ఛతి మార్గేషు కుశానాదాయ పాణినా॥ 8
రాజా! ధౌమ్యుడు దర్భలను చేతబట్టి రుద్రునకు యమునకు సంబంధించిన సామవేదభాగాలను గానంచేస్తూ నడిచాడు. (8)
ధృతరాష్ట్ర ఉవాచ
వివిధానీహ రూపాణి కృత్వా గచ్ఛంతి పాండవాః।
తన్మమాచక్ష్వ విదుర కస్మాదేవం వ్రజంతి తే॥ 9
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. విదురా! పాండవులు వివిధ భంగిమలతో వెళ్ళారు గదా! నాకు వివరంగా చెప్పు. వారి చేష్టలలోని ఆంతర్యమేమిటి? (9)
విదుర ఉవాచ
నికృతస్యాపి తే పుత్రైః హృతే రాజ్యే ధనేషు చ।
న ధర్మాచ్చలతే బుద్ధిః ధర్మరాజస్య ధీమతః॥ 10
విదురుడిలా అన్నాడు. నీ కుమారులు మోసంచేసి రాజ్యాన్ని, సంపదను అపహరించినా ధీమంతుడయిన ధర్మరాజుబుద్ధి ధర్మాన్ని అతిక్రమించటం లేదు. (10)
యోఽసౌ రాజా ఘృణీ నిత్యం ధార్తరాష్ట్రేషు భారత।
నికృత్యా భ్రంశితః క్రోధాత్ నోన్మీలయతి లోచనే॥ 11
భారతా! యుధిష్ఠిరనరపాలుడు ధార్తరాష్ట్రులపై ఎప్పుడూ దయగలవాడు. అటువంటివాడు నీ కొడుకుల మోసంతో రాజ్యాన్ని కోలుపోయాడు. ఆ కోపంతో కళ్ళు విప్పటం లేదు. (11)
నాహం జనం నిర్దహేయం దృష్ట్వా ఘోరేణ చక్షుషా।
స పిధాయ ముఖం రాజా తస్మాద గచ్ఛతి పాండవః॥ 12
భయంకరమైన నా చూపుతో నిరపరాధులైన ప్రజలు మండిపోకూడదు. అనే భావంతో యుధిష్ఠిర నరపాలుడు ముఖాన్ని కప్పుకొని వెళ్తున్నాడు. (12)
యథా చ భీమో వ్రజతి తన్మే నిగదతః శృణు।
బాహ్వోర్బలే నాస్తి సమః మమేతి భరతర్షభ॥ 13
భరతర్షభా! భీముడు ఎలా వెళ్తున్నాడో చెపుతా విను - బాహుబలంతో నాకు సాటిరాగలవాడు ఎవ్వడూ లేడు అని ప్రకటిస్తున్నాడు. (13)
బాహూ విశాలే కృత్వాసౌ తేన భీమోఽపి గచ్ఛతి।
బాహూ విదర్శయన్ రాజన్ బాహుద్రవిణదర్పితః॥ 14
చికీర్షన్ కర్మ శత్రుభ్యః బాహుద్రవ్యానురూపతః।
అందువలననే తన విశాల బాహువుల వైపు చూస్తూ భీముడు వెళ్తున్నాడు. రాజా! బాహుబల గర్వంతో బాహువులను ప్రదర్శిస్తూ శత్రువులపై ప్రతీకారం చేసేందుకు బాహుబలానుసారంగా పరాక్రమించ దలచుకొన్నాడు. (14 1/2)
ప్రదిశంచ్ఛరసంపాతాన్ కుంతీపుత్రోఽర్జునస్తదా॥ 15
సికతా వపన్ సవ్యసాచీ రాజానమనుగచ్ఛతి।
అసక్తాః సికతాస్తస్య యథా సంప్రతి భారత।
అసక్తం శరవర్షాణి తథా మోక్ష్యతి శత్రుషు॥ 16
కౌంతేయుడు, సవ్యసాచి అయిన అర్జునుడు ఆ సమయంలో ఇసుక చల్లుతూ యుధిష్ఠిరుని అనుసరిస్తున్నాడు. భారతా! ఇప్పుడు తాను వెదజల్లుతున్న ఇసుకరేణువులు ఒక దానితో ఒకటి కలియకుండా నేలపై పడుతున్నట్లు శత్రువులపై ఒకటిదాని నొకటి తగుల్కొనని శరవర్షాలను కురిపించబోతున్నాడు. (15,16)
న మే కశ్చిద్ విజానీయాత్ ముఖమద్యేతి భారత ।
ముఖమాలిప్య తేనాసౌ సహదేవోఽపి గచ్ఛతి ॥ 17
భారతా! ఇప్పుడు నా ముఖాన్ని ఎవ్వరూ తెలిసికొనకూడదు అనే భావంతో సహదేవుడు తన ముఖంపై మట్టిపూసికొని వెళ్తున్నాడు. (17)
నాహం మనాంస్యాదదేయం మార్గే స్త్రీణామితి ప్రభో ।
పాండూపలిప్తసర్వాంగః నకులస్తేన గచ్ఛతి ॥ 18
రాజా! దారిలో నేను ఏ స్త్రీ మనస్సును కూడా దొంగిలించకూడదు అని భావించి నకులుడు ఒళ్ళంతా దుమ్ముకొట్టుకొని వెళ్తున్నాడు. (18)
ఏకవస్త్రా ప్రరుదతీ ముక్తకేశీ రజస్వలా ।
శోనితేనాక్తవసనా ద్రౌపదీ వాక్యమబ్రవీత్ ॥ 19
ద్రౌపది ఏకవస్త్ర, రజస్వల, జుట్టు విరబోసికొని ఉన్నది. వస్త్రంపై నెత్తుటి మరకలున్నాయి. ఆమె విలపిస్తూ ఈ విధంగా పలికింది. (19)
యత్కృతేఽహమిదం ప్రాప్తా తేషాం వర్షే చతుర్దశే ।
హతపత్యో హతసుతాః హత బంధుజనప్రియాః ॥ 20
బహుశోణితదిగ్ధాంగ్యః ముక్తకేశ్యో రజస్వలాః ।
ఏవం కృతోదకా భార్యాః ప్రవేక్ష్యంతి గజాహ్వయమ్ ॥ 21
ఎవరి అన్యాయం వలన నేడు నేనీస్థితికి వచ్చానో వారి భార్యలు కూడా నేటికి పదునాలుగవ సంవత్సరంలో భర్తలను, పుత్రులను, బంధువులను, ప్రియజనులను కోలుపోయి శరీరమంతా నెత్తుటి మరకలు దుమ్ముధూళి నిండగా జుట్టు విరబోశికొని భర్తలకు తిలోదకాలనిచ్చి హస్తినాపురిలోనికి ప్రవేశిస్తారు. (20,21)
కృత్వా తు నైరృతాన్ దర్భాన్ ధీరో ధౌమ్యః పురోహితః ।
సామాని గాయన్ యామ్యాని పురతో యాతి భారత ॥ 22
భారతా! ధీరుడైన పురోహితుడు ధౌమ్యుడు చేతిలోని దర్భలను నైరృతి వైపు చూపుతూ యమసంబంధి సామగానం చేస్తూ ముందు నడుస్తున్నాడు. (22)
హతేషు భారతేష్వాజౌ కురూణాం గురవస్తదా ।
ఏవం సామాని గాస్యన్తీత్యుక్త్వా ధౌమ్యోఽపి గచ్ఛతి ॥ 23
యుద్ధంలో కౌరవులు మరణిస్తే వారి గురువులు కూడా ఈ విధంగానే సామగానం చేస్తూ నడుస్తారు అని సుచిస్తూ ధౌమ్యుడు నడుస్తున్నాడు. (23)
హాహా గచ్ఛంతి నో నాథాః సమవేక్షధ్వ మీదృశమ్ ।
అహో ధిక్ కురువృద్ధానాం బాలానామివ చేష్టితమ్ ॥ 24
రాష్ట్రేభ్యః పాండుదాయాదాన్ లోభాన్నిర్వాసయంతి యే ।
అనాథాః స్మ వయం సర్వే వియుక్తాః పాండునందనైః ॥ 25
దుర్వినీతేషు లుబ్ధేషు కా ప్రీతిః కౌరవేషు నః ।
ఇతి పౌరాః సుదుఃఖార్తాః క్రోశంతి స్మ పునః పునః ॥ 26
మహారాజా! ఆ సమయంలో నగరవాసులు దుఃఖార్తులై మాటిమాటికి ఇలా అంటున్నారు - అయ్యో! మన ప్రభువులు వెళ్ళిపోతున్నారు. ఈ స్థితిలో చూడండి. కురువృద్ధులంతా చిన్న పిల్లలవలె ప్రవరిస్తున్నారు. ఈ కౌరవులు రాజ్యలోభంతో పాండురాజు కొడుకులను రాజ్యం నుండి వెళ్ళగొడుతున్నారు. పాండవులు లేకపోతే మనమంతా అనాథులమే. దుర్మార్గులు, లుబ్ధులు అయిన కౌరవులపై మనకు ప్రేమ ఎలా కలుగుతుంది? (24-26)
ఏవమాకారలింగైస్తే వ్యవసాయం మనోగతమ్ ।
కథయంతశ్చ కౌంతేయా వనం జగ్ముర్మనస్వినః ॥ 27
మహారాజా! ఈ ప్రకారంగా అభిమానవంతులయిన కౌంతేయులు తమ ఆకృతి, చేష్టల ద్వారా మనస్సులోని నిర్ణయాలను ప్రకటిస్తూ అరణ్యానికి వెళ్ళారు. (27)
ఏవం తేషు నరాగ్ర్యేషు నిర్యత్సు గజసాహ్వయాత్ ।
అనభ్రే విద్యుతశ్చాసన్ భూమిశ్చ సమకంపత ॥ 28
రాహురగ్రసదాదిత్యమ్ అపర్వణి విశాంపతే ।
ఉల్కా చాప్యపసవ్యేన పురం కృత్వా వ్యశీర్యత ॥ 29
ఈ ప్రకారమ్గా నరోత్తములయిన పాండవులు హస్తినాపురం నుండి వెళ్తుండగా మేఘాలు లేకుండానే మెరుపులు వచ్చాయి. భూమి కంపించింది. అమావాస్య కాకపోయినా రాహువు సూర్యుని మ్రింగాడు. నగరానికి ఎడమవైపు ఉల్క నేలగూలింది. (28,29)
ప్రత్యాహరంతి క్రవ్యాదః గృధ్రగోమాయువాయసాః ।
దేవాయతనచైత్యేషు ప్రాకారాట్టాలకేషు చ ॥ 30
గ్రద్దలు, నక్కలు, కాకులు మొదలగు మాంసాహారులయిన ప్రాణులు దేవాలయాలలో, యజ్ఞశాలలో, ప్రహరీగోడలపై, మేడలపై మాంసపుముక్కలు వదలి వెళ్తున్నాయి. (30)
ఏవమేతే మహోత్పాతాః ప్రాదురాసన్ దురాసదాః ।
భరతానామభావాయ రాజన్ దుర్మంత్రితే తవ ॥ 31
రాజా! నీ దురాలోచన ఫలితంగా ఈ రీతిగా అణచరాని అపశకునాలెన్నో పుట్టాయి. ఇవి భరతవంశవినాశనాన్ని సూచిస్తున్నాయి. (31)
వైశంపాయన ఉవాచ
ఏవం ప్రవదతోరేవ తయోస్తత్ర విశాంపతే ।
ధృతరాష్ట్రస్య రాజ్ఞశ్చ విదురస్య చ ధీమతః ॥ 32
నారదశ్చ సభామధ్యే కురూణామగ్రతః స్థితః ।
మహర్షిభిః పరివృతః రౌద్రం వాక్యమువాచ హ ॥ 33
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! ఈ ప్రకారంగా ధృతరాష్ట్రమహారాజు, ధీమంతుడైన విదురుడు మాటాడుకొనే సమయంలోనే మహర్షి పరివృతుడైన నారదుడు సభామధ్యంలో కౌరవుల ఎదుట నిలిచి భీకరంగా ఇలా అన్నాడు. (32,33)
ఇతశ్చతుర్దశే వర్షే వినక్ష్యంతీహ కౌరవాః ।
దుర్యోధనాపరాధేన భీమార్జునబలేన చ ॥ 34
నేటికి పదునాలుగవ సంవత్సరంలో దుర్యోధనుని అపరాధం వలన భీమార్జునులబలం వలన కౌరవులు నశిస్తారు. (34)
ఇత్యుక్త్వా దివమాక్రమ్య క్షిప్రమంతరధీయత ।
బ్రాహ్మీం శ్రియమ్ సువిపులాం బిభ్రద్ దేవర్షిసత్తమః ॥ 35
ఈ రీతిగా పలికి విశాలబ్రహ్మతేజస్సు గల దేవర్షిసత్తముడు నారదుడు గగనతలంపై కెగసి వెంటనే అదృశ్యమయ్యాడు. (35)
(ధృతరాష్ట్ర ఉవాచ
కిమబ్రువన్ నాగరికాః కిం వై జానపదా జనాః ।
మహ్యం తత్త్వేన చాచక్ష్వ క్షత్తః సర్వమశేషతః ॥
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. విదురా! నాగరికజనులు ఏమనుకొన్నారు? గ్రామీణులు ఏమన్నారు? సమస్తవృత్తాంతాన్నీ యథాతథంగా నాకు చెప్పు.
విదుర ఉవాచ
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా యేఽన్యే వదంత్యథ ।
తచ్ఛృణుష్వ మహారాజ వక్ష్యతే చ మయా తవ ॥
విదురుడిలా అన్నాడు - మహారాజా! బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇతరజనులు ఏమన్నారో చెపుతా విను.
హాహా గచ్ఛంతి నో నాథాః సమవేక్షధ్వమీదృశమ్ ।
ఇతి పౌరాః సుదుఃఖార్తాః శోచంతి స్మ సమంతతః ॥
దుఃఖార్తులైన పౌరులు అందరూ "అయ్యో! మన ప్రభువులు అరణ్యాలకు వెళ్తున్నారు. చూడండి. ధార్తరాష్ట్రులు ఎక్కడకు తెచ్చారో" అని దుఃఖించారు.
తదహృష్టమివాకూజం గతోత్సవమివాభవత్ ।
నగరం హాస్తినపురం సస్త్రీవృద్ధకుమారకమ్ ॥
స్త్రీ బాలవృద్ధులలో కూడిన హస్తినాపురమంతా ఆనందరహితంగా, నిశ్శబ్దంగా ఉంది. ఉత్సాహాన్ని కోలుపోయింది.
సర్వే చాసన్ నిరుత్సాహాః వ్యాధినా బాధితా యథా ॥
పార్థాన్ ప్రతి నరా నిత్యం చింతాశోక పరాయణాః ।
తత్ర తత్ర కథాం చక్రుః సమాసాద్య పరస్పరమ్ ॥
రోగగ్రస్తుల వలె అందరూ ఉత్సాహశూన్యులయ్యారు. ప్రజలు చింతాశోకపరాయణులై ఒకరితో ఒకరు కలిసి పాండవుల గురించిన విశేషాలే చెప్పుకొన్నారు.
వనం గతే ధర్మరాజే దుఃఖశోకపరాయణాః ।
బభూవుః కౌరవా వృద్ధా భృశం శోకేనపీడితాః ॥
ధర్మరాజు అరణ్యానికి వెళ్ళగానే కురువృద్ధులు కూడా శోకవ్యథకు గురి అయి దుఃఖిస్తున్నారు.
తతః పౌరజనః సర్వః శోచన్నాస్తే జనాధిపమ్ ।
కుర్వాణాశ్చ కథాస్తత్ర బ్రాహ్మణాః పార్థివం ప్రతి ॥
అప్పుడు పుఅరవాసులందరు యుధిష్ఠిరుని గురించి చింతించసాగారు. అక్కడ బ్రాహ్మణులు యుధిష్ఠిరుని గురించి ఇలా చెప్తున్నారు.
బ్రాహ్మణా ఊచుః
కథం ను రాజా ధర్మాత్మా వనే వసతి నిర్జనే ।
తస్యానుజాశ్చ తే నిత్యం కృష్ణా చ ద్రుపదాత్మజా ॥
సుఖార్హాపి చ దుఃఖార్తా కథం వసతి సా వనే ॥
బ్రాహ్మణులిలా అన్నారు. ధర్మాత్ముడైన ధర్మరాజు, ఆయన తమ్ములు నిర్జనారణ్యంలో ఎలా జీవిస్తారో? ద్రుపదుని పుత్రి ద్రౌపది సుఖాలకే తగినది. అటువంటి ఆమె దుఃఖార్తయై అరణ్యంలో ఎలా జీవిస్తుంది?
విదుర ఉవాచ
ఏవం పౌరాశ్చ విప్రాశ్చ సదారాః సహపుత్రకాః ।
స్మరంతః పాండవాన్ సర్వే బభూవుర్భృశదుఃఖితాః ॥
విదురుడిలా అన్నాడు - ఈ విధంగా నగరంలోని విప్రులు భార్యాపుత్రులతో సహా పాండవులను తలచుకొంటూ ఎంతో దుఃఖానికి లోనయ్యారు.
ఆవిద్ధా ఇవ శస్త్రేణ నాభ్యనందన్ కథంచన ।
సంభాష్యమాణా అపి తే న కంచిత్ ప్రత్యపూజయన్ ॥
ఆయుధందెబ్బ తిన్నవారి వలె వారు ఏ మాత్రమూ సుఖంగా లేరు. మాటాడుతూ కూడా ఎవ్వరికీ ఇష్టంగా సమాధానమివ్వటం లేదు.
న భుక్త్వా న శయిత్వా తే దివా వా యది వా నిశి ।
శోకోపహతవిజ్ఞానా నష్టసంజ్ఞా ఇవాభవన్ ॥
పగలయినా, రేయి అయినా వారు నిద్రాహారాల పొంత పోవటం లేదు. శోకం వారి విజ్ఞానాన్ని కప్పి వేసింది. వారంతా చైతన్యాన్ని కోలుపోయినట్లున్నారు.
యదవస్థా బభూవార్తా హ్యయోధ్యా నగరీ పురా ।
రామే వనం గతే దుఃఖాద్ హృతరాజ్యే సలక్షణే ॥
తదవస్థం బభూవార్తమ్ అద్యేదం గజసాహ్వయమ్ ।
గతే పార్థే వనం దుఃఖాత్ హృతరాజ్యే సహానుజైః ॥
రాముడు రాజ్యానికి దూరమై లక్ష్మణునితోపాటు అరణ్యానికి వెళ్ళినపుడు దుఃఖార్తితో అయోధ్యానగరం ఏ అవస్థకు లోనయిందో అదే అవస్థను ధర్మరాజు రాజ్యాన్ని కోలుపోయి తమ్ములతో పాటు అరణ్యాలకు వెళ్తుంటే ఇప్పుడు హస్తినాపురి కూడా అనుభవిస్తోంది.
వైశంపాయన ఉవాచ
విదురస్య వచః శ్రుత్వా నగరస్య గిరం చ వై ।
భూయో ముమోహ శోకాచ్చ ధృతరాష్ట్రః సబాంధవః ॥)
విదురుని మాటను నాగరికుల మాటలను విని ధృతరాష్ట్రుడు శోకంతో సబాంధవంగా మరల మూర్ఛిల్లాడు.
తతో దుర్యోధనః కర్ణః శకునిశ్చాపి సౌబలః ।
ద్రోణం ద్వీపమమన్యంత రాజ్యం చాస్మై న్యవేదయన్ ॥ 36
అప్పుడు దుర్యోధనుడు, కర్ణుడు, సుబలపుత్రుడు శకుని ద్రోణుని తమకు ఆలంబనంగా భావించి సమస్తరాజ్యాన్ని ఆయనకు సమర్పించారు. (36)
అథాబ్రవీత్ తతో ద్రోణః దుర్యోధనమమర్షణమ్ ।
దుఃశాసనం చ కర్ణం చ సర్వానేవ చ భారతాన్ ॥ 37
ఆ సమయంలో ద్రోణుడు అసహనశీలుడైన దుర్యోధనునితో, దుశ్శాసనకర్ణులతో, ఇతర భరతవంశీయులతో ఇలా అన్నాడు. (37)
అవధ్యాన్ పాండవాన్ ప్రాహుః దేవపుత్రాన్ ద్విజాతయః ।
అహం వై శరణం ప్రాప్తాన్ వర్తమానో యథాబలమ్ ॥ 38
గంతా సర్వాత్మనా భక్త్యా ధార్తరాష్ట్రాన్ సరాజకాన్ ।
నోత్సహేయం పరిత్యక్తుం దైవం హి బలవత్తరమ్ ॥ 39
పాండవులు దేవతల బిడ్డలు. వారిని చంపరాదని బ్రాహ్మణులు అంటుంటారు. నన్ను శరణుకోరిన మీవైపు నేను యథాశక్తిగా పనిచేస్తాను. సామంతరాజులతో కూడిన ఈ ధార్తరాష్ట్రులను భక్తిపూర్వకంగా పూర్తిగా అనుసరిస్తాను. వారిని వదలాలి అనిపించటం లేదు. విధి బలవత్తరం గదా! (38,39)
ధర్మతః పాండుపుత్రా వై వనం గచ్ఛంతి నిర్జితాః ।
తే చ ద్వాదశ వర్షాణి వనే వత్స్యంతి పాండవాః ॥ 40
జూదంలో ఓడిన పాండుపుత్రులు ధర్మమార్గంలోనే అరణ్యాలకు వెళ్తున్నారు. ఆ పాండవులు పండ్రెండు సంవత్సరాలు అరణ్యంలో నివసిస్తారు. (40)
చరితబ్రహ్మచర్యాశ్చ క్రోధామర్షవశానుగాః ।
వైరం నిర్యాతయిష్యంతి మహద్ దుఃఖాయ పాండవాః ॥ 41
బ్రహ్మచర్యాన్ని పాటించి, క్రోధామర్షాలకు లోనై తిరిగివచ్చిన పాండవులు శత్రుత్వానికి ప్రతీకారం తప్పక చేస్తారు. అది మనకు చాలా దుఃఖహేతువు. (41)
మయా చ భ్రంశితో రాజన్ ద్రుపదః సఖివిగ్రహే ।
పుత్రార్థమయజద్ రాజా వధాయ మమ భారత ॥ 42
రాజా! మైత్రికి సంబంధించి యుద్ధం జరిగినప్పుడు ద్రుపదుని నేను రాజ్యభ్రష్ణుని చేశాను. భారతా! ఆ ద్రుపదుడు నన్ను చంపగల కుమారుని కోసం యజ్ఞం చేశాడు. (42)
యాజోపయాజతపసా పుత్రం లేభే స పావకాత్ ।
ధృష్టద్యుమ్నం ద్రౌపదీం చ వేదీమధ్యాత్ సుమధ్యమామ్ ॥ 43
యాజోపయాజుల తపశ్శక్తి వలన ధృష్టద్యుమ్నుడనే కుమారుని, వేదిమధ్యనుండి అందమైన కుమార్తెను ద్రౌపదిని పొందాడు. (43)
ధృతద్యుమ్నస్తు పార్థానాం శ్యాలః సంబంధతో మతః ।
పాండవానాం ప్రియరతః తస్మాన్మాం భయమావిశత్ ॥ 44
ధృష్టద్యుమ్నుడు పాండవులకు బావమరిది అవుతాడు. కాబట్టి పాండవులకు ఇష్టమైన పనులే చేస్తుంటాడు. అందుకని నాకు భయం కలిగింది. (44)
జ్వాలావర్ణో దేవదత్తః ధనుష్మాన్ కవచీ శరీ ।
మర్త్యధర్మతయా తస్మాద్ అద్య మే సాధ్వసో మహాన్ ॥ 45
ధృష్టద్యుమ్నుడు అగ్నిజ్వాల వంటి రంగు గలవాడు, దేవతలు ప్రసాదించిన బిడ్డ. ఎప్పుడూ కవచాన్ని, ధనుర్బాణాలను ధరించి ఉంటాడు. మరణం మనుష్యులకు అనివార్యం కాబట్టి ధృష్టద్యుమ్నుడంటే నాకు భయం. (45)
గతో హి పక్షతాం తేషాం పార్షతః పరవీరహా ।
రథాతిరథసంఖ్యాయాం యోఽగ్రణీరర్జునో యువా ॥ 46
సృష్టప్రాణో భృశతరం తేన చేత్ సంగమో మమ ।
కిమన్యద్ దుఃఖమధికం పరమమ్ భువి కౌరవాః ॥ 47
శత్రుసంహారకుడయిన ఆ ధృష్టద్యుమ్నుడు ఇప్పుడు పాండవుల పక్షాన్ని బలపరుస్తున్నాడు. అర్జునుడు రథాతిరథులలో అగ్రగణ్యుడు, యువకుడు. ధృష్టద్యుమ్నునితో నాకు యుద్ధం తటస్థిస్తే అర్జునుడు అతనికి సహాయుడై ప్రాణాలనైనా ఇవ్వటానికి సిద్ధపడతాడు. కౌరవులారా! ఈ లోకంలో నాకు ఇంతకు మించిన దుఃఖం మరేముంటుంది. (46,47)
ధృష్టద్యుమ్నో ద్రోణమృత్యుః ఇతి విప్రథితం వచః ।
మద్వధాయ శ్రుతోఽప్యేషః లోకే చాప్యతివిశ్రుతః ॥ 48
ధృష్టద్యుమ్నుడు ద్రోణునకు మృత్యువు అని బాగాప్రసిద్ధి కెక్కినమాట. నన్ను చంపటానికే ధృష్టద్యుమ్నుడు పుట్టాడు. అయినా లోకంలో కూడా బాగా పేరు మోసినవాడు. (48)
సోఽయం నూనమనుప్రాప్తః త్వత్కృతే కాల ఉత్తమః ।
త్వరితం కురుత శ్రేయః నైతదేతావతా కృతమ్ ॥ 49
మీకు మంచిరోజులు వచ్చాయి అన్నది నిశ్చితం. ఇంతవరకు చేసినది సరిపోదు. మీ శ్రేయస్సాధనకై త్వరగా సన్నద్ధులు కండి. (49)
ముహూర్తం సుఖమేవైతత్ తాళచ్ఛాయేవ హైమనీ ।
యజధ్వం చ మహాయజ్ఞైః భోగానశ్నీత దత్త చ ॥ 50
ఇతశ్చతుర్దశే వర్షే మహత్ ప్రాప్స్యస్యథ వైశసమ్ ।
ఇప్పటి ఈ రాజ్యం చలికాలంలో తాటిచెట్టు నీడలాగా ముహూర్తకాలం మాత్రమే సుఖాన్ని ఇవ్వగలదు. మహాయజ్ఞాలు చేయండి. భోగాలననుభవించండి. ఇతరులను సుఖించనీయండి. నేటికి పదునాలుగు సంవత్సరాల తర్వాత పెద్దయుద్దం చేయవలసివస్తుంది. (50 1/2)
ద్రోణస్య వచనం శ్రుత్వా ధృతరాష్ట్రోఽబ్రవీదిదమ్ ॥ 51
ద్రోణుని మాట విని ధృతరాష్ట్రుడిలా అన్నాడు. (51)
సమ్యగాహ గురుఃక్షత్తః ఉపావర్తయ పాండవాన్ ।
యది తే న నివర్తంతే సత్కృతా యాంతు పాండవాః ।
సశస్త్రరథపాదాతాః భోగవంతశ్చ పుత్రకాః ॥ 52
విదురా! ద్రోణుడు చక్కగా చెప్పాడు. పాండవులను వెనుకకు తీసికొనిరా. వారు రావటానికి సిద్ధపడకపోతే సత్కారపూర్వకంగా వారిని పంపించు. ఆయుధధారులయిన రథికులు, సైనికులతో కూడి భోగసామగ్రితో ఆ నా కుమారులు వెళ్లేటట్టు చూడు. (52)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి అనుద్యూతపర్వణి విదుర ధృతరాష్ట్ర ద్రోణవాక్యే అశీతితమోఽధ్యాయః ॥ 80 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున అనుద్యూతపర్వమను ఉపపర్వమున విదుర ధృతరాష్ట్ర ద్రోణవాక్యమను ఎనుబదియవ అధ్యాయము (80)
(దాక్షిణాత్య అధికపాఠము 15 శ్లోకములు కలిపి మొత్తము 67 శ్లోకములు)