79. డెబ్బది తొమ్మిదవ అధ్యాయము

కుంతీ ద్రౌపదుల సంభాషణము.

వైశంపాయన ఉవాచ
తస్మిన్ సంప్రస్థితే కృష్ణా పృథాం ప్రాప్య యశస్వినీమ్ ।
అపృచ్ఛద్ భృశదుఃఖార్తా యాశ్చాన్యాస్తత్ర యోషితః ॥ 1
యథార్హం వందనాశ్లేషాన్ కృత్వా గంతుమియేష సా ।
తతో నినాదః సుమహాన్ పాండవాంతఃపురేఽభవత్ ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. యుధిష్ఠిరుడు బయలుదేరగానే ద్రౌపది యశస్విని అయిన కుంతిని సమీపించి దుఃఖిస్తూ వనవాసానికి సెలవు తీసికొన్నది. అక్కడున్న ఇతర స్త్రీలకు కూడా తగినరీతిగా నమస్కరించి, దగ్గరకు తీసికొని వనానికి వెళ్ళదలచుకొన్నట్టు చెప్పింది. అప్పుడు పాండవుల అంతఃపురంలో ఆర్తనాదాలు బయలుదేరాయి. (1,2)
కుంతీ చ భృశసంతప్తా ద్రౌపదీం ప్రేక్ష్య గచ్ఛతీమ్ ।
శోకవిహ్వలయా వాచా కృచ్ర్ఛాద్ వచనమబ్రవీత్ ॥ 3
బయలుదేరిన ద్రౌపదిని చూచి కుంతి తీవ్రంగా కలతపడుతూ శోకగద్గదమయిన కంఠంతో ఎట్టకేలకు ఇలా అన్నది. (3)
వత్సే శోకో న తే కార్యః ప్రాప్యేదం వ్యసనం మహత్ ।
స్త్రీధర్మాణామభిజ్ఞాసి శీలాచారవతీ తథా ॥ 4
అమ్మా! ఈ విధంగా పెద్దకష్టం కలిగిందని నీవు శోకించవద్దు. నీవు స్త్రీ ధర్మాల నెరిగినదానవు. శీలాచారాలు గలదానవు. (4)
న త్వాం సందేష్టుమర్హామి భర్తౄన్ ప్రతి శుచిస్మితే ।
సాధ్వీగుణసమాపన్నా భూషితం తే కులద్వయమ్ ॥ 5
శుచిస్మితా! భర్తల విషయంలో నీ కర్తవ్యాన్ని నీకు చెప్పగల అర్హత నాకు లేదు. నీవు సాధ్వివి. సద్గుణ సంపన్నవు. పుట్టినింటికీ, మెట్టినింటికీ శోభ నిచ్చినదానవు. (5)
సభాగ్యాః కురవశ్చేమే యే న దగ్ధాస్త్వయానఘే ।
అరిష్టం వ్రజ పంథానం మదనుధ్యానబృంహితా ॥ 6
అనఘా! ఈ కౌరవులు అదృష్టవంతులు. నీ క్రోధాగ్నిలో దగ్ధమైపోలేదు. వెళ్ళు. నీ మార్గానికి ఏ ఆటంకాలు కలుగవు. నా సంకల్పం వల్ల మీకు అభ్యుదయం కలుగుతుంది. (6)
భావిన్యర్థే హి సత్త్ర్సీణాం వైకృతం నోపజాయతే ।
గురుధర్మాభిగుప్తా చ శ్రేయః క్షిప్రమవాప్స్యసి ॥ 7
విధిననుసరించి జరిగిన సంగతుల వలన ఉత్తమ స్త్రీ కలతపడదు. నీ ధర్మాచరణమే నిన్ను రక్షిస్తుంది. త్వరలోనే శ్రేయస్సు నందుకొనగలవు. (7)
సహదేవశ్చ మే పుత్రః సదావేక్ష్య వనే వసన్ ।
యథేదం వ్యసనం ప్రాప్య నాయం సీదేన్మహామతిః ॥ 8
నా కుమారుడు - సహదేవుని అరణ్యవాసంలో ఎప్పుడూ కనిపెట్టి ఉండు. ధీమంతుడైన ఈ సహదేవుడు ఈ మహాపదలో చిక్కి దుఃఖించకూడదు. (8)
తథేత్యుక్త్వా తు సా దేవీ స్రవన్నేత్రజలావిలా ।
శోణితాక్తైకవసనా ముక్తకేశీ వినిర్యయౌ ॥ 9
కుంతిమాటలు విని కళ్ళలో నీళ్ళు నింపుకొని ద్రౌపది 'అలాగే' అన్నది. అప్పుడామె ఒకే వస్త్రాన్ని ధరించి ఉంది. అది కూడా దుమ్ముకొట్టుకొని ఉన్నది. జుట్టు విరబోసికొని ఉంది. ఆ స్థితిలో ద్రౌపది నిష్క్రమించింది. (9)
తాం క్రోశంతీమ్ పృథా దుఃఖాద్ అనువవ్రాజ గచ్ఛతీమ్ ।
అథాపశ్యత్ సుతాన్ సర్వాన్ హృతాభరణవాసనః ॥ 10
ఆక్రోశిస్తూ వెళ్తున్న ఆ ద్రౌపదిని కుంతి అనుసరించి వచ్చింది. అప్పుడు ఆభరణాలు, విలువయిన వస్త్రాలు కోల్పోయి ఉన్న తన కొడుకుల నందరినీ చూచింది. (10)
రురుచర్మావృతతనూన హ్రియా కించిదవాఙ్ముఖాన్ ।
పరైః పరీతాన్ సంహృష్టైః సుహృద్భిశ్చానుశోచితాన్ ॥ 11
పాండవులు జింకచర్మాలు ధరించి సిగ్గుతో ముఖాలు దించుకొని ఉన్నారు. చుట్టూ ఉన్న శత్రువులు పరమానందంగా ఉన్నారు. మిత్రులందరూ వారికై శోకిస్తున్నారు. (11)
తదవస్థాన్ సుతాన్ సర్వాన్ ఉపసృత్యాతివత్సలా ।
స్వజమానావదచ్ఛోకాత్ తత్తద్ విలపతీ బహు ॥ 12
ఆ స్థితిలో నున్న తన కొడుకులనందరినీ సమీపించి ఎంతో వాత్సల్యభావంతో వారిని దగ్గరకు తీసికొని కుంతి శోకంతో విలపిస్తూ ఇలా అన్నది. (12)
కుంత్యువాచ
కథం సద్ధర్మచారిత్రాన్ వృత్తస్థితివిభూషితాన్ ।
అక్షుద్రాన్ దృఢభక్తాంశ్చ దైవతేజ్యాపరాన్ సదా ॥ 13
వ్యసనం వః సమభ్యాగాత్ కోఽయం విధివిపర్యయః ।
కస్యాపధ్యానజం చేదం ధియా పశ్యామి నైవ తత్ ॥ 14
కుంతి ఇలా అన్నది.
మీరు సద్ధర్మాన్ని పాటించేవారు. మీ సత్ప్రవర్తనమే మీకు ఆభరణం. మీరు ఉన్నతులు, దృఢభక్తులు. దేవతారాధనతత్పరులు. అటువంటి మీకు గొప్ప విపత్తు కలిగింది. ఏమిటీ విధివిపర్యయం. ఎవరి అనిష్టసంకల్పం, క్రోధం వలన మీకు ఈ స్థితి వచ్చింది? ఎంత ఆలోచించినా తెలియటం లేదు. (13,14)
స్యాత్ తు మద్భాగ్యదోషోఽయం యాహం యుష్మానజీజనమ్ ।
దుఃఖాయాసభుజోఽత్యర్థం యుక్తానప్యుత్తమైర్గుణైః ॥ 15
ఇది నాదోషమే కావచ్చు. ఉత్తమగుణాలు కలిగి ఉన్నా తీవ్ర దుఃఖాన్ని, కష్టాలను అనుభవింపజేయటానికే నేను మిమ్ముకన్నాను. (15)
కథం వత్స్యథ దుర్గేషు వనేబుద్ధివినాకృతాః ।
వీర్యసత్త్వబలోత్సాహ తేజోభిరకృశాః కృశాః ॥ 16
సంపదలను కోలుపోయి దుర్గమారణ్యాలలో ఎలా జీవిస్తారు? వీర్యం, ధైర్యం, బలం, ఉత్సాహం, తేజస్సు అన్నీ ఉన్నా మీరు బలహీనులయ్యారు. (16)
యద్యేతదేవమజ్ఞాస్యం వనే వాసో హి వో ధ్రువమ్ ।
శతశృంగాన్మృతే పాండౌ నాగమిష్యం గజాహ్వయమ్ ॥ 17
మీకీవిధంగా వనవాసమేర్పడుతుందని తెలిసి ఉంటే మీ తండ్రి మరణించిన తరువాత శతశృంగం నుండి హస్తినాపురానికి వచ్చి ఉండే దాననే కాదు. (17)
ధన్యం వః పితరం మన్యే తపోమేధాన్వితం తథా ।
యః పుత్రాధిమసంప్రాప్య స్వర్గేచ్ఛామకరోత్ ప్రియామ్ ॥ 18
తపస్సు, మేధ కలిగిన మీ తండ్రి ధన్యుడనుకొంటున్నాను. అందుకే పుత్రశోకానికి గురి కాకుండా ఆ రీతిగా స్వర్గలోకగమనాన్ని ప్రియంగా భావించాడు. (18)
ధన్యాం చాతీంద్రియజ్ఞానామ్ ఇమాం ప్రాప్తాం పరాం గతిమ్ ।
మన్యే తు మాద్రీం ధర్మజ్ఞాం కళ్యాణీం సర్వథైవ తు ॥ 19
రత్యా మత్యా చ గత్యా చ యయాహమభిసంధితా ।
జీవితప్రియతాం మహ్యం ధిఙ్మాం సంక్లేశభాగినీమ్ ॥ 20
ఇదేవిధంగా అతీంద్రియజ్ఞానసంపన్నయై పరమగతిని పొందిన ఆ కళ్యాణి మాద్రి కూడా సర్వవిధాలుగా ధన్యురాలనే భావిస్తున్నాను. ఆమె తన అనురాగం, బుద్ధి, నడవడి - ఈ మూడింటితో నన్ను జయించింది. నాకు జీవితంపై ఆశ కలిగించింది. అందువలననే ఈ తీవ్రక్లేశాన్ని అనుభవించవలసి వస్తోంది. (19,20)
పుత్రకానవిహాస్యే వః కృచ్ఛ్రలబ్ధాన్ ప్రియాన్ సతః।
సాహం యాస్యామి హి వనం హా కృష్ణే కిం జహాసి మామ్॥ 21
బిడ్డలారా! మీరు మంచివారు. నాకిష్టమైన వారు. నాకు లేక లేక పుట్టినవారు. మిమ్ములను విడిచి ఉండలేను. నేను కూడా అరణ్యానికి వస్తాను. ద్రౌపదీ! నన్ను విడిచి వెళ్తున్నావా? (21)
అంతవత్యసుధర్మేఽస్మిన్ ధాత్రా కిం ను ప్రమాదతః।
మమాంతో నైవ విహితేనాయుర్న జహాతి మామ్॥ 22
ప్రాణధారణ శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు జీవితం ముగియవలసిందే. కానీ బ్రహ్మదేవుడు ఏ పొరపాటు చేశాడో ఏమో! నాకు త్వరగా ముగింపును ఏర్పాటు చేయలేదు. ఆయుష్షు నన్ను విడిచిపెట్టడం లేదు. (22)
హా కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి సంకర్షణానుజ।
కస్మాన్న త్రాయసే దుఃఖాత్ మాం చేమాంశ్చ నరోత్తమాన్॥ 23
హా కృష్ణా! ద్వారకావాసీ! ఉపేంద్రా! ఎక్కడున్నావు? ఈ దుఃఖంలోనుండి నన్ను, నరోత్తములయిన వీరినీ ఎందుకు కాపాడవు? (23)
అనాదినిధనం యే త్వామ్ అనుధ్యాయంతి వై నరాః।
తాంస్త్వం పాసీత్యయం వాదః స గతో వ్యర్థతాం కథమ్॥ 24
నీవు ఆది, అంతం లేనివాడ వని నిన్ను ధ్యానించే నరులను నీవు రక్షిస్తా వనీ అంటుంటారు. అది ఎలా వ్యర్థమయింది? (24)
ఇమే సద్ధర్మమాహాత్మ్య యశోవీర్యానువర్తినః।
నార్హంతి వ్యసనం భోక్తుం నన్వేషాం క్రియతాం దయా॥ 25
సద్ధర్మాన్ని పాటిస్తూ మహాత్ముల శీలస్వభావాలను అనుసరిస్తూ కీర్తిపరాక్రమాలను సేవించే ఈ నా కుమారులు కష్టాల ననుభవింపదగినవారు కాదు. వీరిపై దయ చూపు. (25)
సేయం నీత్యర్థవిజ్ఞేషు భీష్మద్రోణకృపాదిషు।
స్థితేషు కులనాథేషు కథమాపదుపాగతా॥ 26
ఈ వంశానికి సంరక్షకులై నీతి, అర్థశాస్త్ర వేత్తలయిన భీష్మద్రోణ కృపాచార్యాదులు జీవించి ఉండగానే మాకీ విపత్తు ఎలా వచ్చింది? (26)
హా పాండో హా మహారాజ క్వాసి కం సముపేక్షసే।
పుత్రాన్ వివాస్యతః సాధూన్ అరిభిర్ద్యూతనిర్జితాన్॥ 27
హా! పాండుమహారాజా! ఎక్కడున్నావు? ఎందుకు ఉపేక్షిస్తున్నావు? నీ సత్పుత్రులను శత్రువులు జూదంలో ఓడించి వనవాసాన్ని కల్పిస్తుంటే ఎందుకు ఊరుకున్నావు? (27)
సహదేవ నివర్తస్వ నను త్వమసి మే ప్రియః।
శరీరాదపి మాద్రేయ మా మా త్యాక్షీః కుపుత్రవత్॥ 28
సహదేవా! వెనుకకు మరలిరా! మాద్రేయా! నాకు నాశరీరం కన్న నీవంటేనే ఇష్టం. చెడ్డకొడుకువలె నన్ను వీడిపోవద్దు. (28)
వ్రజంతు భ్రాతరస్తేఽమీ యది సత్యాభిసంధినః।
మత్పరిత్రాణజం ధర్మమ్ ఇహైవ త్వమవాప్నుహి॥ 29
సత్యాభిసంధులయిన నీ సోదరులందరు వెళ్ళితే వెళ్ళనీ! నా ప్రాణాలను రక్షించటమనే ధర్మాన్ని నీవు పాటించు. (29)
వైశంపాయన ఉవాచ
ఏవం విలపతీం కుంతీమ్ అభివాద్య ప్రణమ్య చ।
పాండవా విగతానందా వనాయైవ ప్రవవ్రజుః॥ 30
వైశంపాయనుడిలా అన్నాడు. కుంతి ఇలా విలపిస్తుంటే పాండవులు ఆమెకు అభివాదనాలు తెలిపి నమస్కరించి ఆనందానికి దూరమై వనానికే బయలుదేరారు. (30)
విదురశ్చాపి తామార్తాం కుంతీమాశ్వాస్య హేతుభిః।
ప్రావేశయద్ గృహం క్షత్తా స్వయమార్తతరః శనైః॥ 31
విదురుడు విలపిస్తున్న కుంతిని అప్పటికి తగిన కారణాలతో ఓదార్చి తానుకూడా మెల్లగా ఏడుస్తూనే కుంతిని ఇంటికి తీసికొనిపోయాడు. (31)
(తతః సంప్రస్థితే తత్ర ధర్మరాజే తదా నృపే।
జనాః సమస్తాస్తం ద్రష్టుం సమారురుహురాతురాః॥
తతః ప్రాసాదవర్యాణి విమానశిఖరాణి చ।
గోపురాణి చ సర్వాణి వృక్షానన్యాంశ్చ సర్వశః॥
అధిరుహ్య జనః శ్రీమాన్ ఉదాసీనో వ్యలోకయత్।
ధర్మరాజు బయలుదేరగా అక్కడి ప్రజలందరూ ధర్మరాజును చూడాలన్న తహతహతో మేడలను, విమానశిఖరాలను, అన్ని గోపురాలను, చెట్లను ఎక్కారు. అందరూ ఉదాసీనులై ధర్మరాజును చూచారు.
న హి రథ్యాస్తతః శక్యా గంతుం బహుజనాకులాః॥
ఆరుహ్య తే స్మ తాన్యత్ర దీనాః పశ్యంతి పాండవమ్।
అక్కడి మార్గాలు జనసమూహాలతో నిండి కదలటానికి కూడా వీలులేకపోయింది. అందుకు ప్రజలు అలా పైకెక్కి దీనంగా ధర్మరాజును చూడసాగారు.
పదాతిం వర్జితచ్ఛత్రం చేలభూషణవర్జితమ్॥
నల్కలాజిన సంవీతం పార్థం దృష్ట్వా జనస్తదా।
ఊచుర్బహువిధా వాచః భృశోపహతచేతసః॥
ధర్మరాజు గొడుగులేకుండా పాదచారియై వెళ్తున్నాడు. రాజోచిత వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ లేవు. నారచీరలను, మృగచర్మాన్ని ధరించి ఉన్నాడు. అటువంటి ధర్మరాజును చూచి ప్రజలు గాయపడిన మనస్సులతో రకరకాలుగా మాటాడసాగారు.
జనా ఊచుః
యం యాంతమనుయాతి స్మ చతురంగబలం మహత్।
తమేవం కృష్ణయా సార్ధమ్ అనుయాంతి స్మ పాండవాః॥
చత్వారో భ్రాతరశ్చైవ పురోధశ్చ విశాంపతిమ్।
ప్రజలిలా అన్నారు. గతంలో ధర్మరాజు వెళుతుంటే చతురంగబలాలతో కూడిన పెద్దసేన అనుసరించేది. ఇప్పుడు ఆ ధర్మరాజును ఆయన సోదరులు నలుగురు ద్రౌపది, పురోహితుడు మాత్రమే అనుసరిస్తున్నారు.
యా న శక్యా పురా ద్రష్టుం భూతైరాకాశగైరపి॥
తామద్య కృష్ణాం పశ్యంతి రాజమార్గగతా జనాః।
ఇంతకుముందు ఖేచరులయిన ప్రాణులకు కూడా ద్రౌపదిని చూడటం సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రాజమార్గంలోని జనులందరూ చూస్తున్నారు.
అంగరాగోచితాం కృష్ణాం రక్తచందనసేవినీమ్॥
వర్షముష్ణం చ శీతం చ నేష్యత్యాశు వివర్ణతామ్।
ద్రౌపది అంగరాగాలను ధరించేది. రక్తచందనాన్ని పూసుకొనేది. ఇప్పుడు వాన, ఎండ, చలి ఆమె శరీరచ్ఛాయను మలినపరుస్తాయి.
అద్య నూనం పృథా దేవీ సత్త్వమావిశ్య భాషతే॥
పుత్రాన్ స్నుషాం చ దేవీ తు ద్రష్టుమద్యాథ నార్హతి॥
నిజంగా కుంతిదేవి ఈరోజు ఎంతో ధైర్యాన్ని తెచ్చుకొని కొడుకులతో, కోడలితో మాటాడుతోంది. లేకపోతే ఈ స్థితిలో వారిని కనీసం చూడనైనా చూడలేదు.
నిర్గుణస్యాపి పుత్రస్య కథం స్యాద్ దుఃఖదర్శనమ్।
కిం పునర్యస్య లోకోఽయం జితో వృత్తేన కేవలమ్॥
కొడుకు గుణహీనుడైనా కష్టాల్లో ఉంటే చూడలేము. అటువంటిది తన నడవడితో లోకాన్నే జయించగల వారి కష్టాలను తల్లి ఎలా చూడగలుగుతుంది?
ఆనృశంస్యమనుక్రోశః ధృతిః శీలం దమః శమః।
పాండవం శోభయంత్యేతే షడ్గుణాః పురుషోత్తమమ్॥
తస్మాత్ తస్యాపఘాతేన ప్రజాః పరమపీడితాః।
పురుషోత్తముడైన ధర్మరాజునకు మార్దవం, దయ, ధైర్యం, శీలం, ఇంద్రియనిగ్రహం, మనోనిగ్రహం-అనే ఈ ఆరుగుణాలు శోభావహాలు అటువంటి ధర్మరాజు దెబ్బతినటంతో ప్రజలు చాలా దుఃఖిస్తున్నారు.
ఔదకానీవ సత్త్వాని గ్రీష్మే సలిలసంక్షయాత్।
పీడయా పీడితం సర్వం జగత్ తస్య జగత్పతేః।
మూలస్యైనోపఘాతేన వృక్షః పుష్పఫలోపగః॥
వేసవిలో నీరు ఎండిపోయినందువలన జలజంతువులు బాధపడినట్లు వేరి నరికివేసినందున ఫలపుష్పాలతో కూడిన చెట్టు ఎండిపోయినట్లు ఆ ధర్మరాజు బాధవలన ప్రజలంతా బాధపడుతున్నారు.
మూలం హ్యేష మనుష్యాణాం ధర్మరాజో మహాద్యుతిః।
పుష్పం ఫలం చ పత్రం చ శాఖాస్తస్యేతరే జనాః॥
తే భ్రాతర ఇవ క్షిప్తం సపుత్రాః సహ బాంధవాః।
గచ్ఛంతమనుగచ్ఛామః యేన గచ్ఛతి పాండవః॥
కాంతిమంతుడైన ధర్మరాజు మనుష్యులకు మూలం. ఇతరులందరూ పుష్పాలు, ఫలాలు, ఆకులు, కొమ్మలు. ఈరోజు మనం బిడ్డలు, బంధువులతో సహా ఆ నలుగురు పాండవులవలె ధర్మరాజు నడిచే బాటలో ఆయన ననుసరించి వెళదాం.
ఉద్యానాని పరిత్యజ్య క్షేత్రాణి చ గృహాణి చ।
ఏక దుఃఖసుఖాః పార్థమ్ అనుయామ సుధార్మికమ్॥
ఉద్యానాలను పొలాలను, ఇళ్ళను వదలి ఆయన సుఖదుఃఖాలను మనవిగా భావిస్తూ ఆ ధార్మికుని అనుసరిద్దాం.
సముద్ధృతనిధానాని పరిధ్వస్తాజిరాణి చ।
ఉపాత్తధనధాన్యాని హృతసారాణి సర్వశః॥
రజసాప్యవకీర్ణాని పరిత్యక్తాని దైవతైః।
మూషకైః పరిధావద్భిః ఉద్బిలైరావృతాని చ॥
అపేతోదకధూమాని హీనసమ్మార్జనాని చ।
ప్రణష్టబలికర్మేజ్యామంత్రహోమజపాని చ॥
దుష్కాలేనేవ భగ్నాని భిన్నభాజనవంతి చ।
అస్మత్త్యక్తాని వేశ్మాని సౌబలః ప్రతిపద్యతామ్॥
మన ఇళ్ళలో ఉన్న నిధులను త్రవ్వి తీసుకుందాం. ముంగిళ్ళను త్రవ్వేద్దాం. ధనధాన్యాలన్నీ వెంట తీసుకొని పోదాం. అవసరమైన సామగ్రిని కొనిపోదాం. ఇళ్ళన్నీ దుమ్ముకొట్టుకొంటాయి. దేవతలు కూడా వెళ్ళిపోతారు. ఎలుకలు కలుగుల నుండి బయటకు వచ్చి పరుగులు పెడతాయి. నిప్పుమండదు. నీళ్ళుండవు. చిమ్మటం కూడా జరుగదు. బలికర్మలు, యాగాలు, మంత్రపాఠాలు, హోమాలు, జపాలు ఏవీ ఉండవు. కాలం కలిసిరాక ఇళ్ళన్నీ కూలిపోతాయి. పగిలిన పాత్రలు చెల్లాచెదరుగా పడతాయి. ఆ ఇళ్ళను మనం వదలి వెళ్ళిన తర్వాత శకునినే తీసికొననీ.
వనం నగరమద్యాస్తు యత్ర గచ్ఛంతి పాండవాః।
అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనమ్॥
పాండవులు వెళ్ళిన అరణ్యమే నగరమవుతుంది. మనం విడిచిన నగరమే అరణ్యమవుతుంది.
బిలాని దంష్ట్రిణః సర్వే వనాని మృగపక్షిణః।
త్యజన్త్వస్మద్భయాద్ భీతాః గజాః సింహా వనాన్యపి॥
అరణ్యంలో మనలను చూచి భయపడి పాములు పుట్టలు వదలి పారిపోతాయి. మృగాలు, పక్షులు, ఏనుగులు, సింహాలు అరణ్యాన్ని వీడి దూరంగా పోతాయి.
అనాక్రాంతం ప్రపద్యంతు సేవ్యమానం త్యజంతు చ।
తృణమాషఫలాదానాం దేశాం స్త్యక్త్వా మృగద్విజాః॥
వయం పార్థైర్వనే సమ్యక్ సహవత్స్యామ నిర్వృతాః॥
ఆకులు, అన్నం, పండ్లు మొదలుగునవి తినే వాళ్ళం మనం. మన పోకతో అరణ్యంలోని జంతువులు, పక్షులు అక్కడనుండి పారిపోవాలి. మనమున్నచోటును వీడి అవి మనం లేని తావులకు వెళ్ళాలి. అరణ్యంలో పాండవులతో కలిసి ఆనందంగా జీవిద్దాం.
వైశంపాయన ఉవాచ
ఇత్యేవం వివిధా వాచః నానాజనసమీరితాః।
శుశ్రావ పార్థః శ్రుత్వా చ న విచక్రేఽస్య మానసమ్॥
వైశంపాయనుడిలా అన్నాడు. ఈ ప్రకారంగా అనేకులు అనేకవిధాలుగా అంటున్న మాటలను ధర్మరాజు విన్నాడు. అయినా ఆయన మనస్సు చలించలేదు.
తతః ప్రాసాదసంస్తాస్తు సమంతాద్ వై గృహే గృహే।
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చైవ యోషితః।
తతః ప్రాసాదజాలానామ్ ఉత్పాటుఆవరణాని చ।
దదృశుః పాండవాన్ దీనాన్ రౌరవాజినవాససః॥
కృష్ణాం త్వదృష్టపూర్వాం తాం వ్రజంతీం పద్భిరేవ చ।
ఏకవస్త్రాం రుదంతీం తాం ముక్తకేశీం రజస్వలామ్॥
దృష్ట్వా తదా స్త్రియః సర్వా వివర్ణవదనా భృశమ్।
విలుప్య బహుధా మోహాద్ దుఃఖశోకేన పీడితాః॥
హాహా ధిగ్ ధిగ్ ధిగిత్యుక్త్వా నేత్రైరశ్రూణ్యవర్తయన్।)
అప్పుడు అన్ని దిక్కులా అంతఃపురాలలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల స్త్రీలు తమ తమ భవనాల పరదాలను ఎత్తి దీనులయిన పాండవులను చూడసాగారు. పాండవులందరూ మృగచర్మాలు ధరించి ఉన్నారు. వారితోపాటు నడిచివెళ్తున్న ద్రౌపదిని కూడా చూచారు. అంతకు ఆ ద్రౌపది ఏకవస్త్ర, రజస్వల, జుట్టువిరబోసికొని విలపిస్తోంది. ఆ స్థితిలో ఆమెను చూచి ఆ స్త్రీలు వివర్ణవదనలయ్యారు. దుఃఖశోకపీడితులై మోహావేశంతో ఎంతో విలపించి "ఛీ ఛీ" అనుకొంటూ కంటతడిపెట్టారు.
ధార్తరాష్ట్రస్త్రియస్తాశ్చ నిఖిలేనోపలభ్య తత్।
గమనం పరికర్షం చ కృష్ణయా ద్యూతమండలే॥ 32
రురుదుః సుస్వనం సర్వా వినిందంత్యః కురూన్ భృశమ్।
దద్యుశ్చ సుచిరం కాలం కరాసక్తముఖాంబుజాః॥ 33
ధార్తరాష్ట్రుల పత్నులు కూడా ద్రౌపది ద్యూతసభకు వెళ్ళటాన్ని అక్కడ ఆమె వస్త్రాన్ని లాగటాన్ని తెలిసికొని స్పష్టంగా తెలిసేటట్లు ఏడ్చారు. కౌరవులను బాగా నిందించారు. చేతిలో ముఖాల నుంచుకొని ఎంతోసేపు చింతాక్రాంతులయ్యారు. (32,33)
రాజా చ ధృతరాష్ట్రస్తు పుత్రాణామనయం తదా।
ధ్యాయన్నుద్విగ్నహృదయః న శాంతిమధిజగ్మివాన్॥ 34
అప్పుడు ధృతరాష్ట్రమహారాజు కూడా తన కుమారుల అవినీతిని చూచి మనస్సు కలతపడి దానిని గురించియే ఆలోచిస్తూ అశాంతికి లోనయ్యాడు. (34)
స చింతయన్ననేకాగ్రః శోకవ్యాకులచేతనః।
క్షత్తుః సంప్రేషయామాస శీఘ్రమాగమ్యతామితి॥ 35
ఆయన మనస్సు ఈ విధంగా పరిభ్రమించసాగింది. మనస్సు శోకంతో కకావికలమైంది. దానితో "వెంటనే రమ్మ" ని విదురునకు కబురు చేశాడు. (35)
తతో జగామ విదురః ధృతరాష్ట్రవివేశనమ్।
తం పర్యపృచ్ఛత్ సంవిగ్నః ధృతరాష్ట్రో జనాధిపః॥ 36
అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుని మందిరానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు ఉద్విగ్నుడై విదురుని ఇలా అడిగాడు. (36)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి అనుద్యూతపర్వణి ద్రౌపదీకుంతీసంవాదే ఏకోనాశీతితమోఽధ్యాయః॥ 79 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున అనుద్యూతపర్వమను
ఉపపర్వమున ద్రౌపదీకుంతీ సంవాదమును డెబ్బది తొమ్మిదవ అధ్యాయము. (79)
(దాక్షిణాత్య అధికపాఠము 29శ్లోకాలు కలిపి మొత్తం 65 శ్లోకాలు)