4. నాల్గవ అధ్యాయము

హితమును ఉపదేశించిన విదురునిపై ధృతరాష్ట్రుడు కుపితుడగుట.

వైశంపాయన ఉవాచ
వనం ప్రవిష్టేష్వథ పాండవేషు
ప్రజ్ఞాచక్షుస్తప్యమానోఽంబికేయః ।
ధర్మాత్మానం విదురమగాధబుద్ధిం
సుఖాసీనో వాక్యమువాచ రాజా ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
పాండవులు అరణ్యానికి వెళ్ళారు. ప్రజ్ఞాచక్షువు, అంబికానందనుడూ అయిన ధృతరాష్ట్రుడు మనస్తాపం పొందాడు. ధర్మాత్ముడై, లోతైన బుద్ధిగల విదురునితో సుఖాసీనుడై ఇలా అన్నాడు. (1)
ధృతరాష్ట్ర ఉవాచ
ప్రజ్ఞా చ తే భార్గవస్యేవ శుద్ధా
ధర్మం చ త్వం పరమం వేత్థ సూక్ష్మమ్ ।
సమశ్చ త్వం సమ్మతః కౌరవాణాం
పథ్యం చైషాం మమ చైవ బ్రవీహి ॥ 2
ధృతరాష్ట్రుడిలా అన్నాడు.
విదురా! శుక్రాచార్యుని బుద్ధివలె నీ బుద్ధి నిర్మలమైంది. నివు సుక్ష్మాతి సూక్ష్మమైన ధర్మాన్ని ఎరిగినవాడవు. నీవు అందరిపట్ల సమానదృష్టి కలవాడవు. కౌరవపాండవులిరువురికీ నీవు గౌరవింపదగినవాడవు. అందువల్ల పాండవులకూ నాకూ హితమైన దేదో నీవు చెప్పు. (2)
ఏవంగతే విదుర యదద్య కార్యం
పౌరాశ్చ మే కథమస్మాన్ భజేరన్ ।
తే చాప్యస్మాన్ నోద్ధరేయుః సమూలాః
తత్త్వం బ్రూయాః సాధుకార్యాణి వేత్సి ॥ 3
విదురా! ఇప్పటి ఈ దశలో మన కర్తవ్యమేమిటి? ఏవిధంగా (ఏ పనిచేస్తే) పౌరులు మనలను సేవిస్తారు? పాండవులు సమూలంగా మమ్మల్ని పెకలించకుండా ఉండాలంటే ఏం చేయాలి? యుక్తాయుక్త కార్యవిధానాలు నీవు బాగా తెలిసినవాడవు. అందువల్ల నా కర్తవ్యమేమిటో సరిగా చెప్పు. (3)
విదుర ఉవాచ
త్రివర్గోఽయం ధర్మమూలో నరేంద్ర
రాజ్యం చేదం ధర్మమూలం వదంతి ।
ధర్మే రాజన్ వర్తమానః స్వశక్త్యా
పుత్రాన్ సర్వాన్ పాహి పాండోఃసుతాంశ్చ ॥ 4
విదురుడిలా అన్నాడు - నరేంద్రా! ధర్మార్థకామాలనే త్రివర్గానికి ప్రధానమైనది ధర్మం. రాజ్యాన్ని ధర్మప్రధానమైందిగా చెపుతూంటారు. అందువల్ల రాజా! నీవు ధర్మామార్గంలో ఉండి యథాశక్తిగా నీ కుమారులను, పాండురాజు పుత్రులనూ అందర్నీ రక్షించు. (4)
స వై ధర్మో విప్రలబ్ధః సభాయాం
పాపాత్మభిః సౌబలేయప్రధానైః ।
ఆహూయ కుంతీసుతమక్షవత్యాం
పరాజైషీత్ సత్యసంధం సుతస్తే ॥ 5
శకుని ప్రధానంగా గల పాపాత్ముల చేత సభయందు ఆ ధర్మం విడువబడింది. నీకుమారుడు సత్యసంధుడైన కుంతీనందనుని ఆహ్వానించి జూదంలో ఓడించాడు. (5)
ఏతస్య తే దుష్ప్రణీతస్య రాజన్
శేషస్యాహం పరిపశ్యామ్యుపాయమ్ ।
యథా పుత్రస్తవ కౌరవ్య పాపాత్
ముక్తో లోకే ప్రతితిష్ఠేత సాధు ॥ 6
కురురాజా! దుష్టులచే రచింపబడిన ఈ నీ కుమారుల దుర్వ్యవహారం యొక్క శాంత్యుపాయ నేనెరుగుదును. దాని చేత నీ కుమారుడు ఈ పాపం నుండి విముక్తుడై లోకంలో మంచివాడుగా ప్రతిష్ఠను పొందుతాడు. (6)
తద్ వై సర్వం పాండుపుత్రా లభంతాం
యత్ తద్ రాజన్నభిసృష్టం త్వయాఽఽసీత్ ।
ఏష ధర్మః పరమో యత్ స్వకేన
రాజా తుష్యేన్న పరస్వేషు గృధ్యేత్ ॥ 7
అందువల్ల రాజా! నీవు పాండవులకు ఇచ్చిన రాజ్యసంపదనంతా తిరిగి వారు పొందాలి. రాజు తన సంపదచేత సంతుష్టి చెందాలి. ఇతరుల సంపదలపట్ల లోభం కూడదు. ఇది రాజుకు పరమధర్మం. (7)
యశో న నశ్యేష్ జ్ఞాతిభేదశ్చ న స్యాద్
ధర్మో న స్యాన్నైవ చైవం కృతే త్వామ్ ।
ఏతత్ కార్యం తవ సర్వప్రధానం
తేషాం తుష్టిః శకునేశ్చావమానః ॥ 8
ఇలా చేస్తే కీర్తి నశించడు. జ్ఞాతుల మధ్య భేదం కలుగదు. ధర్మం తప్పక నిలుస్తుంది. పాండవులకు సంతుష్టి కలిగించడం, శకునిని తిరస్కరించడం - అనే ఈ పని నీకు అన్నింటికంటె ప్రధానమైన కర్తవ్యం. (8)
ఏవం శేషం యది పుత్రేషు తే స్యాద్
ఏతద్ రాజంస్త్వరమాణః కురుష్వ ।
తథైవదేవం న కరోషి రాజన్
ధ్రువం కురూణాం భవితా వినాశః ॥ 9
రాజా! ఈ విధంగా చేస్తే నీ పుత్రులకు ఈ భాగ్యమైనా మిగులుతుంది. అందువల్ల నీ వీ పని తొందరగా చెయ్యి. లేని పక్షంలో కురువంశ వినాశం జరుగుతుంది. ఇది నిశ్చయం. (9)
న హి క్రుద్ధో భీమసేనోఽర్జునో వా
శేషం కుర్యాచ్ఛాత్రవాణామనీకే ।
యేషాం యోద్ధా సవ్యసాచీ కృతాస్త్రః
ధనుర్యేషాం గాండివం లోకసారమ్ ॥ 10
యేషాం భీమో బాహుశాలీ చ యోద్ధా
తేషాం లోకే కిం ను న ప్రాప్యమస్తి ।
ఉక్తం పూర్వం జాతమాత్రే సుతే తే
మయా యత్ తే హితమాసీత్ తదానీమ్ ॥ 11
కోపించిన భీమసేనుడుకాని, అర్జునుడుకాని శత్రుసేనలో ఎవర్నీ మిగల్చరు. అస్త్రవిద్యానిపుణుడు, లోక సారమయిన గాండివం ధనుస్సుగా గల సవ్యసాచి యోధగా ఉండగా, బాహుబలశాలి, భీమసేనుడు యోధగా ఉండగా పాండవులకు ఈ లోకంలో పొందలేని దేముంటుంది? దుర్యోధనుడు పుట్టినపుడే నేను నీకు హితవు చెప్పాను. (10,11)
పుత్రం త్యజేమమహితం కులస్య
హితం పరం న చ తత్ త్వం చకర్థ ।
ఇదం చ రాజన్ హితముక్తం న చేత్ త్వమ్
ఏవం కర్తా పరితప్తాసి పశ్చాత్ ॥ 12
'రాజా! కురువంశానికి అహితం చేసే ఈ పుత్రుని విడిచిపెట్టు' అని ఉత్తమమైన హితాన్ని చెప్పాను. కాని నీవు దాన్ని ఆచరించలేదు. రాజా! ఇపుడు చెప్పిన ఈ హితాన్ని కూడ నీవు ఆచరించకపోతే అనంతరం పరితాపం పొందుతావు. (12)
యద్యేతదేవమనుమంతా సుతస్తే
సంప్రీయమాణః పాండవైరేకరాజ్యమ్ ।
తాపో న తే భవితా ప్రీతియోగాద్
న చేన్నిగృహ్ణీష్వ సుతం సుఖాయ ॥ 13
నీ కుమారుడు సంతోషంగా పాండవులతో ఏకరాజ్యం చేయడానికి అంగీకరిస్తే, నీకు మున్ముందు పరితాపం కలుగదు. అందరూ ఆనందంగా ఉంటారు. నీకుమారుడు నీమాటను అంగీకరించకపోతే, కులం యొక్క సుఖం కొరకు నీవు నీ కుమారుని అదుపుచెయ్యి. (13)
దుర్యోధనం త్వహితం వై నిగృహ్య
పాండోః పుత్రం కురుష్వాధిపత్యే ।
అజాతశత్రుర్హి విముక్తరాగః
ధర్మేణేమాం పృథివీం శాస్తు రాజన్ ॥ 14
రాజా! వంశానికి అహితుడైన దుర్యోధనుని నిగ్రహించి, పాండుపుత్రుడైన ధర్మరాజును రాజ్యాధిపత్యంలో నియోగించు. అజాతశత్రువైన ధర్మారాజు రాగద్వేషాలు లేకుండా ధర్మంగా ఈ భూమిని పాలించుగాక. (14)
తతో రాజన్ పార్థివాః సర్వ ఏవ
వైశ్యా ఇవాస్మానుపతిష్ఠంతు సద్యః ।
దుర్యోధనః శకునిః సూతపుత్రః
ప్రీత్యా రాజన్ పాండుపుత్రాన్ భజంతు ॥ 15
రాజా! నీవిలాచేస్తే, భూమండలంలోని రాజులంతా వైశ్యులవలె మన కౌరవులకు బహుమానాలు తెచ్చి ఇస్తారు. దుర్యోధనుడు, శకుని, సూతపుత్రుడు కర్ణుడు ప్రీతితో పాండుపుత్రులను సేవించుదురుగాక. (15)
దుఃశాసనో యాచతు భీమసేనం
సభామధ్యే ద్రుపదస్యాత్మజాం చ ।
యుధిష్ఠిరం త్వం పరిసాంత్వయస్వ
రాజ్యే చైవం స్థాపయస్వాభిపూజ్య ॥ 16
దుఃశాసనుడు ద్రౌపదిని, భీమసేనుని సభామధ్యంలో క్షమించమని కోరాలి. నీవు యుధిష్ఠిరుని ఊరడించి, గౌరవించి రాజ్యాధిపత్యంలో ప్రతిష్ఠించు. (16)
త్వయా పృష్టః కిమహమన్యద్ వదేయమ్
ఏతత్ కృత్వా కృతకృత్యోఽసి రాజన్ ॥ 17
రాజా! హితాన్ని అడిగిన నీకు నేను మరొకటి ఏం చెప్పగలను? ఈ విధంగా చేసి నీవు కృతకృత్యుడవు కమ్ము. (17)
ధృతరాష్ట్ర ఉవాచ
ఏతద్ వాక్యం విదుర యత్ తే సభాయాం
ఇహ ప్రోక్తం పాండవాన్ ప్రాప్య మాం చ ।
హితం తేషామహితం మామకానామ్
ఏతత్ సర్వం మమ నావైతి చేతః ॥ 18
ధృతరాష్ట్రుడిలా అన్నాడు - విదురా! ఈ సభలో నీవు పాండవులను గురించి, నన్ను గురించి చెప్పిన ఈ మాటలు పాండవులకు హితంగాను, నాకుమారులకు అహితంగాను ఉన్నాయి. అందువల్ల నా మనస్సు వీటినన్నింటిని స్వికరించటం లేదు. (18)
ఇదం త్విదానీం గత ఏవ నిశ్చితం
తేషామర్థే పాండవానాం యదాత్థ ।
తేనాద్య మన్యే నాసి హితో మమేతి
కథం హి పుత్రం పాండవార్థే త్యజేయమ్ ॥ 19
ఇప్పుడు ఈ విషయం నిశ్చయమవుతోంది - నీవు పాండవుల హితాన్ని గోరి చెపుతున్నావు అని, నీకు నాకు హితాన్ని కోరేవాడవు కాదు అని నేను భావిస్తున్నాను. పాండవులకోసమై నా పుత్రుని ఎలా వదలగలను? (19)
అసంశయం తేఽపి మమైవ పుత్రాః
దుర్యోధనస్తు మమ దేహాత్ ప్రసూతః ।
స్వం వై దేహం పరహేతోస్త్యజేత
కో ను బ్రూయాత్ సమతామన్వవేక్ష్య ॥ 20
సందేహం లేదు. ఆ పాండవులు కూడా నాపుత్రులే. కాని దుర్యోధనుడు నా దేహం వల్ల జన్మించినవాడు. సమత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతరులకొరకు తన దేహాన్ని విడిచిపెట్టుమని ఎవరు చెప్తారు? (20)
స మాం జిహ్మం విదుర సర్వం బ్రవీషి
మానం చ తేఽహమధికం ధారయామి ।
యథేచ్ఛకం గచ్ఛ వా తిష్ఠ వా త్వం
సుసాంత్వ్యమానాప్యసతీ స్త్రీ జహాతి ॥ 21
విదురా! నీపట్ల నాకు ఎక్కువ గౌరవం ఉంది. కాని నీవు నాకు అంతా కుటిలమైన ఉపదేశం చేస్తున్నావు. నీవు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు లేదా ఉండవచ్చు. నీ వల్ల నాకు ప్రయోజనం లేదు. కులట అయిన స్త్రీ ఎంత అనునయించినా యజమానిని విడిచి పెడుతుంది కదా! (21)
వైశంపాయన ఉవాచ
ఏతావదుక్త్వా ధృతరాష్ట్రోఽన్వపద్యద్
అంతర్వేశ్మ సహసోత్థాయ రాజన్ ।
నేదమస్తీత్యథ విదురో భాషమాణః
సంప్రాద్రవద్ యత్ర పార్థా బభూవుః ॥ 22
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! ఇంతమాత్రమే పలికి ధృతరాష్ట్రుడు హఠాత్తుగా లేచి అంతఃపురంలోకి వెళ్ళాడు. పిమ్మట విదురుడు ఇక ఈ కురువంశం నిలవదు. అనుకొంటూ పాండవులున్నచోటికి (పరుగెత్తుకు) వెళ్ళాడు. (22)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి విదురవాక్యప్రత్యాఖ్యానే చతుర్ధోఽధ్యాయః ॥ 4 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అరణ్యపర్వమను ఉపపర్వమున విదుర వాక్య తిరస్కారమను నాల్గవ అధ్యాయము. (4)