5. అయిదవ అధ్యాయము
పాండవులు కామ్యకవనమును ప్రవేశించుట, విదురుని ఆగమనము.
వైశంపాయన ఉవాచ
పాండవాస్తు వనే వాసమ్ ఉద్దిశ్య భరతర్షభాః ।
ప్రయయుర్జాహ్నవీకూలాత్ కురుక్షేత్రం సహానుగాః ॥ 1
వైశంపాయునుడిలా అన్నాడు - రాజా! భరతవంశశ్రేష్ఠులైన పాండవులు వనవాసం చేయటానికి అనుచరులతో సహా గంగానదీతీరం నుండి కురుక్షేత్రానికి వెళ్ళారు. (1)
సరస్వతీదృషద్వత్యౌ యమునాం చ నిషేవ్య తే ।
యయుర్వనేనైవ వనం సతతం పశ్చిమాం దిశమ్ ॥ 2
వారు సరస్వతీ, దృషద్వతీ, యమునా నదులను సేవించి ఒక వనం నుండి మరొక వనం ప్రవేశిస్తూ పశ్చిమదిక్కుకు వెళ్ళారు. (2)
తతః సరస్వతీకూలే సమేషి మరుధన్వసు ।
కామ్యకం నామ దదృశుః వనం మునిజనప్రియమ్ ॥ 3
అనంతరం సరస్వతీ నదీతీరంలో మరుభూములను, వన్య ప్రదేశాలను గడచి వెళ్తూ కామ్యకమనే వనాన్ని చూశారు. అది మునిజనులతో మిక్కిలి ప్రీతి కలిగిస్తోంది. (3)
తత్ర తే న్యవసన్ వీరాః వనే బహుమృగద్విజే ।
అన్వాస్యమానా మునిభిః సాంత్వ్యమానాశ్చ భారత ॥ 4
భరతశ్రేష్ఠా! మహావీరులైన పాండవులు అనేక మృగపక్షులతో కూడిన ఆ వనంలో నివసించసాగారు. అక్కడున్న మునులతో నివసిస్తూ వారి వల్ల ఊరట పొందారు. (4)
విదురస్త్వథ పాండూనాం సదా దర్శనలాలసః ।
జగామైకరథేనైవ కామ్యకం వనమృద్ధిమత్ ॥ 5
పిమ్మట ఎల్లపుడూ పాండవులను చూడాలి అనుకొనే విదురుడు వన్యసంపదలచే సమృద్ధమైన కామ్యకవనానికి నిస్సహాయుడై రథంలో వెళ్లాడు. (5)
తతో గత్వా విదురః కామ్యకం తద్
శీఘ్రైరశ్వైర్వాహినా స్యందనేన ।
దదర్శాసీనం ధర్మాత్మానం వివిక్తే
సార్ధం ద్రౌపద్యా భాతృభిర్ర్బాహ్మణైశ్చ ॥ 6
శీఘ్రంగా పరుగెత్తే గుర్రాలు పూన్చబడిన రథమెక్కి విదురుడు కామ్యకవనం చేరాడు. అక్కడ ఒక ఏకాంత ప్రదేశంలో ద్రౌపదితో, సోదరులతో, బ్రాహ్మణులతో కూడి కూర్చొని ఉన్న ధర్మరాజును చూశాడు. (6)
తతోఽపశ్యద్ విదురం తూర్ణమారాత్
అభ్యాయాంతం సత్యసంధః స రాజా ।
అథాబ్రవీద్ భ్రాతరం భీమసేనం
కిం ను క్షత్తా వక్ష్యతి నః సమేత్య ॥ 7
అనంతరం సత్యసంధుడైన ధర్మరాజు తనదగ్గరకు త్వరగా వస్తున్న విదురుని చూసి, భీమునితో 'ఈ విదురుడు మన దగ్గరకు వచ్చి ఏం చెపుతాడో' అని అన్నాడు. (7)
కచ్చిన్నాయం వచనాత్ సౌబలస్య
సమాహ్వాతా దేవనాయోపయాతః ।
కచ్చిత్ క్షుద్రః శకునిర్నాయుధాని
జేష్యత్యస్మాన్ పునరేవాక్షవత్యామ్ ॥ 8
శకుని మాటపై ఇతడు మనల్ని మళ్ళీ జూదం కొరకు ఆహ్వానించడానికి రాలేదు కదా! నీచుడైన శకుని మళ్ళీ జూదానికి మనల్ని ఆహ్వానించి మన ఆయుధాలను జయించడు కదా! (8)
సమాహూతః కేనచిదాద్రవేతి
నాహం శక్తో భీమసేనాపయాతుమ్ ।
గాండీవే చ సంశయితే కథం ను
రాజ్యప్రాప్తి సంశయితా భవేన్నః ॥ 9
'రా' అని (యుద్ధానికి గాని జూదానికి గాని) ఎవరైనా నన్ను ఆహ్వానిస్తే భీమసేనా! నేను వెళ్ళకుండా ఉండలేను. ఈ స్థితిలో అర్జునుని గాండివం ఏదోవిధంగా ఎవరైనా హరిస్తే, మన రాజ్యప్రాప్తి సంశయాస్పదమవుతుంది. (9)
వైశంపాయన ఉవాచ
తత ఉత్థాయ విదురం పాండవేయాః
ప్రత్యగృహ్ణన్ నృపతే సర్వ ఏవ ।
తైః సత్కృతః స చ తానాజమీఢః
యథోచితం పాండుపుత్రాన్ సమేయాత్ ॥ 10
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! అనంతరం పాండవులంతా లేచి విదురునికి స్వాగతం పలికారు. వారు చేసిన యథోచిత స్వాగత సత్కారాలు పొంది, అజమీఢవంశీయుడైన విదురుడు పాండవులను సాదరంగా కలిశాడు. (10)
సమాశ్వస్తం విదురం తే నరర్షభః ।
తతోఽపృచ్ఛన్నాగమనాయహేతుమ్ ।
స చాపి తేభ్యో విస్తరతః శశంస
యథావృత్తో ధృతరాష్ట్రోఽంబికేయః ॥ 11
విదురుడు సేదతీరిన తరువాత పాండవులు అతని రాకకు కారణాన్ని అడిగారు. విదురుడు కూడా అంబికాసుతుడైన ధృతరాష్ట్రుడున్న స్థితిని గురించి విస్తరంగా వారికి చెప్పాడు. (11)
విదుర ఉవాచ
అవోచన్మాం ధృతరాష్ట్రోఽనుగుప్తమ్
అజాతశత్రో పరిగృహ్యాభిపూజ్య ।
ఏవం గతే సమతామభ్యుపేత్య
పథ్యం తేషాం మమ చైవ బ్రవీహి ॥ 12
విదురుడిలా అన్నాడు - అజాతశత్రూ! ధృతరాష్ట్రుడు నన్ను తన రక్షకునిగ భావించి, ఆహ్వానించి, సమ్మానించి 'ఈ స్థితిలో పాండవులకు, నాకు పథ్యమైనదేదో సమభావంతో చెప్పు' అని అన్నాడు. (12)
మయాప్యుక్తం యత్ క్షేమం కౌరవాణాం
హితం పథ్యం ధృతరాష్ట్రస్య చైవ ।
తద్ వై తస్మై న రుచామభ్యుపైతి
తతశ్చాహం క్షేమమన్యన్న మన్యే ॥ 13
నేను కూడా కురువంశీయులకు, ధృతరాష్ట్రునికీ హితం, పథ్యం, క్షేమం అయిన మాటను చెప్పాను. ఆ మాట అతనికి రుచించలేదు. అంతకంటె క్షేమమైనమాట వేరొకటి నాకు తోచలేదు. (13)
పరం శ్రేయః పాండవేయా మయోక్తం
న మే తచ్చ శ్రుతవానాంబికేయః ।
యథాఽతురస్యేవ హి పథ్యమన్నం
న రోచతే స్మాస్య తదుచ్యమానమ్ ॥ 14
పాండవులారా! నేను ఇరుపక్షాలవారికి మిక్కిలి శ్రేయస్కరమైన మాటను చెప్పాను. అంబికేయుడు ధృతరాష్ట్రుడు నా మాటను వినలేదు. రోగికి పథ్యమయిన అన్నం ఇష్టంకానట్లే నే చెప్పిన మాట ధృతరాష్ట్రునికి రుచించలేదు. (14)
న శ్రేయసే నీయతేఽజాతశత్రో
స్త్రీ శ్రోత్రియస్యేవ గృహే ప్రదుష్టా ।
ధ్రువం న రోచేద్ భరతర్షభస్య
పతిః కుమార్యా ఇవ షష్టివర్షః ॥ 15
ధర్మజా! శ్రోత్రియుని ఇంటిలో ఉన్నా దుష్టురాలయిన స్త్రీ సన్మార్గంలోకి తీసుకొని రావడానికి శక్యం కానట్లే ధృతరాష్ట్రుడు కూడ శక్యం కాడు. అరవై సంవత్సరాలవాడు కన్యకు భర్తగా ఇష్టం కానట్లే ధృతరాష్ట్రునికి నామాటలు రుచించవు. (15)
ధ్రువం వినాశో నృప కౌరవాణాం
న వై శ్రేయో ధృతరాష్ట్రః పరైతి ।
యథా చ పర్ణే పుష్కరస్యావసిక్తం
జలం న తిష్ఠేత్ పథ్యముక్తం తథాస్మిన్ ॥ 16
రాజా! ధృతరాష్ట్రుడు శ్రేయస్కరమైన మాటను గ్రహించటం లేదు. ఇక కౌరవుల వినాశం తప్పదు. ఇది నిశ్చయం. తామరాకు మీద పడిన నీరు దానికి అంటనట్లే ధృతరాష్ట్రునికి చెప్పిన హితం అతని మనసులో నిలవదు. (16)
తతః క్రుద్ధో ధృతరాష్ట్రోఽబ్రవీన్మాం
యస్మిన్ శ్రద్ధా భారత తత్ర యాహి ।
నాహం భూయః కామయే త్వాం సహాయం
మహీమిమాం పాలయితుం పురం వా ॥ 17
అపుడు కోపించిన ధృతరాష్ట్రుడు నాతో "నీకు ఎవరిపట్ల శ్రద్ధ ఉందో అక్కడకే వెళ్ళు. ఈ రాజ్యాన్ని కాని, ఈ నగరాన్ని కాని పాలించడానికి మళ్ళీ నిన్ను తోడుగా (సహాయకునిగా) నేను కోరను." అన్నాడు. (17)
సోఽహం త్యక్తో ధృతరాష్ట్రేణ రాజ్ఞా
ప్రశాసితుం త్వాముపయాతో నరేంద్ర ।
తద్ వై సర్వం యన్మయోక్తం సభాయాం
తద్ ధార్యతాం యత్ ప్రవక్ష్యామి భూయః ॥ 18
నరేంద్రా! అటువంటి నేను ధృతరాష్ట్రునిచే విడువబడ్డాను. నీకు ఉపదేశమివ్వడానికి వచ్చాను. సభలో నేను ధృతరాష్ట్రునికి చెప్పినదంతా మరల నీకు చెప్తాను. గ్రహించు. (18)
క్లేశైస్తీవ్రైర్యుజ్యమానః సపత్నైః
క్షమాం కుర్వన్ కాలముపాసతే యః ।
సంవర్ధయన్ స్తోకమివాగ్నిమాత్మవాన్
స వై భుంక్తే పృథివీమేక ఏవ ॥ 19
శత్రువుల వల్ల తీవ్రమైన కష్టాలు పొందుతూ, ఓర్పువహిస్తూ తగినసమయకోసం నిరీక్షించేవాడు, మనోనిగ్రహంతో ఒక్కడే సమస్తభూమండలాన్నీ అనుభవిస్తాడు. (19)
యస్యావిభక్తం వసు రాజన్ సహాయైః
తస్య దుఃఖేఽప్యంశభాజః సహాయాః ।
సహాయానామేష సంగ్రహణేఽధ్యుపాయః
సహాయాప్తౌ పృథివీప్రాప్తిమాహుః ॥ 20
రాజా! తోటివారితో కలిసి (సహాయకులతో) తన సంపదను అనుభవించే వాని దుఃఖంలో కూడా తోటివారు భాగస్వాములౌతారు. సహాయకులను సంపాదించుకోవటంలో ఇదొక ఉపాయం. సహాయకుని పొందితే పృథివిని పొందినట్లుగా చెపుతారు. (20)
సత్యం శ్రేష్ఠం పాండవ విప్రలాపం
తుల్యం చాన్నం సహ భోజ్యం సహాయైః ।
ఆత్మా చైషామగ్రతో న స్మ పూజ్యః
ఏవంవృత్తిర్వర్ధతే భూమిపాలః ॥ 21
పాండునందనా! వ్యర్థమైన మాటలు విడిచి సత్యం పలుకటం శ్రేష్ఠమైనది. సహాయకులతో బాటుగ సమానమైన అన్నం తినదగింది. వారందరి ముందు తన్ను తాను గొప్పవానిగా మాట్లాడకూడదు. ఈ విధంగా ఉండే రాజు ఎల్లపుడూ వృద్ధిని పొందుతాడు. (21)
యుధిష్ఠిర ఉవాచ
ఏవం కరిష్యామి యథాబ్రవీషి
పరాం బుద్ధిముపగమ్యాప్రమత్తః ।
యచ్చాప్యన్యద్దేశకాలోపపన్నం
తద్ వై వాచ్యం తత్ కరిష్యామి కృత్స్నమ్ ॥ 22
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ఉత్తమమైన బుద్ధిని ఆశ్రయించి, అప్రమత్తుడనై నీవు చెప్పినట్లుగా ఆచరిస్తాను. దేశకాలాలకు అనుగుణంగా ఉచితమైన దానిని కూడా చెప్పు. దానిని కూడ పూర్తిగా ఆచరిస్తాను. (22)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి విదురనిర్వాసే పంచమోఽధ్యాయః ॥ 5 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అరణ్యపర్వమను ఉపపర్వమున విదుర నిర్వాసమను అయిదవ అధ్యాయము. (5)