6. ఆరవ అధ్యాయము

ధృతరాష్ట్రుడు సంజయుని పంపి వనము నుండి విదురుని రప్పించుట, క్షమింపుమని అతనిని ప్రార్థించుట.

వైశంపాయన ఉవాచ
గతే తు విదురే రాజన్ ఆశ్రమం పాండవాన్ ప్రతి ।
ధృతరాష్ట్రో మహాప్రాజ్ఞః పర్యతప్యత భారత ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! విదురుడు పాండవుల దగ్గరక్య్ ఆశ్రమానికి వెళ్లేసరికి, మహాప్రాజ్ఞుడైన ధృతరాష్ట్రుడు మిక్కిలి పశ్చాత్తాపం పొందాడు. (1)
విదురస్య ప్రభావం చ సంధివిగ్రహకారితమ్ ।
వివృద్దిం చ పరాం మత్వా పాండవానాం భవిష్యతి ॥ 2
విదురుని సంధి విగ్రహాది నీతిజ్ఞతను, ప్రభావాన్ని తలచుకొని అతని వల్ల పాండవులకు మిక్కిలి అభివృద్ధి కలుగుతుందని భావించాడు. (2)
స సభాద్వారమాగమ్య విదురస్మారమోహితః ।
సమక్షం పార్థివేంద్రాణాం పపాతావిష్టచేతనః ॥ 3
విదురుని స్మరిస్తూ మోహితుడైన ధృతరాష్ట్రుడు సభాద్వారం వద్దకు వచ్చి అక్కడి రాజులందరూ చూస్తుండగా స్పృహతప్పి నేలపై పడిపోయాడు. (3)
వి॥సం॥ విదురస్మారమోహితః = స్మరుడంటే కాముడు. ఆ కామాన్ని ఎవరైనా లేదా ఏదైనా అరికట్టే ప్రయత్నం చేస్తే పుట్టే ద్వేషమే స్మారం. (ప్రస్తుతం ఆ స్థానంలో విదురుడున్నాడు.) కాబట్టి విదురద్వేషం వలన తాను నశిస్తాడని ధృతరాష్ట్రుని ఆలోచన. దానితో మోహాన్ని పొందాడు. (నీల)
స తు లబ్ధ్వా పునః సంజ్ఞాం సముత్థాయ మహీతలాత్ ।
సమీపోపస్థితం రాజా సంజయం వాక్యమబ్రవీత్ ॥ 4
భ్రాతా మమ సుహృచ్చైవ సాక్షాద్ ధర్మ ఇవాపరః ।
తస్య స్మృత్యాద్య సుభృశం హృదయం దీర్యతీవ మే ॥ 5
'విదురుడు నా సోదరుడు, మిత్రుడూను. అపరధర్మస్వరూపుడు. అతని స్మరణ చేత ఈ రోజు నా హృదయం మిక్కిలి బ్రద్దలయిపోతున్నట్లుగా ఉంది. (5)
తమానయస్వ ధర్మజ్ఞం మమ భ్రాతరమాశు వై ।
ఇతి బ్రువన్ స నృపతిః కృపణం పర్యదేవయత్ ॥ 6
ఆ ధర్మజుడైన నా సోదరుని శీఘ్రంగా తీసికొనిరా' అని అంటూ ధృతరాష్ట్రుడు దీనంగా రోదించాడు. (6)
పశ్చాత్తాపాభిసంతప్తః విదురస్మారమోహితః ।
భ్రాతృస్నేహాదిదం రాజా సంజయం వాక్యమబ్రవీత్ ॥ 7
పశ్చాత్తాపంచేత సంతాప పడి విదురుని స్మరణం వల్ల మోహితుడైన రాజు సోదరుని పట్ల గల ప్రేమతో సంజయునితో ఇలా అన్నాడు - (7)
గచ్ఛ సంజయ జానీహి భ్రాతరం విదురం మమ ।
యది జీవతి రోషేణ మయా పాపేన నిర్ధుతః ॥ 8
సంజయా! వెళ్లు. నా సోదరుడైన విదురుని గురించి తెలిసికో. పాపాత్ముడనైన నేను కోపంతో వెళ్లగొట్టాను. అతడు జీవించి ఉన్నాడో? లేదో? (8)
న హి తేన మమ భ్రాత్రా సుసూక్ష్మమపి కించన ।
వ్యలీకం కృతపూర్వం వై ప్రాజ్ఞేనామితబుద్ధినా ॥ 9
ప్రాజ్ఞుడు, అపరిమితబుద్ధికలవాడూ అయిన నా సోదరుడు మిక్కిలి సూక్ష్మమైన చిన్న తప్పుకూడ మునుపెప్పుడూ చేయలేదు. (9)
స వ్యలీకం పరం ప్రాప్తః మత్తః పరమబుద్ధిమాన్ ।
త్యక్ష్యామి జీవితం ప్రాజ్ఞతం గచ్ఛానయ సంజయ ॥ 10
ప్రాజ్ఞా! నా వల్ల బుద్ధిమంతుడైన విదురునిపట్ల పెద్ద అపరాధం జరిగిపోయింది. నీవు వెళ్లి అతనిని తీసికొనిరా. లేకుంటే నేను ప్రాణాలు విడుస్తాను. (10)
తస్య తద్ వచనం శ్రుత్వా రాజ్ఞస్తమనుమాన్య చ ।
సంజయో బాఢమిత్యుక్త్వా ప్రాద్రవత్ కామ్యకం ప్రతి ॥ 11
సోఽచిరేణ సమాసాద్య తద్ వనం యత్ర పాండవాః ।
రౌరవాజినసంవీతం దదర్శాథ యుధిష్ఠిరమ్ ॥ 12
విదురేణ సహాసీనం బ్రాహ్మణైశ్చ సహస్రశః ।
భ్రాతృభిశ్చాభిసంగుప్తం దేవైరివ పురందరమ్ ॥ 13
రాజు యొక్క ఆ మాటలు విని, అతనిని ఆదరించి, సంజయుడు 'అట్ల్' అని కామ్యకవనానికి వెళ్లాడు. అతడు శీఘ్రంగా కామ్యకవనం చేరి అక్కడ పాండవులను చూశాడు. విదురునితో, వేలకొద్దీ బ్రాహ్మణులతో, సోదరులతో, దేవతలతో కలిసి ఉన్న ఇంద్రునిలా మృగచర్మం ధరించిన యుధిష్ఠిరుని చూశాడు. (11-13)
యుధిష్ఠిరముపాగమ్య పూజయామాస సంజయః ।
భీమార్జునయమాశ్చాపి తద్యుక్తం ప్రతిపేదిరే ॥ 14
సంజయుడు యుధిష్ఠిరుని సమీపించి పూజించాడు. భీమార్జున నకుల సహదేవులు కూడ సంజయుని యథోచితంగా సత్కరించారు. (14)
రాజ్ఞా పృష్టః స కుశలం సుఖాసీనశ్చ సంజయః ।
శశంసాగమనే హేతుమ్ ఇదం చైవాబ్రవీద్ వచః ॥ 15
యుధిష్ఠిరుడు అతనిని కుశలప్రశ్నలడిగాడు. సంజయుడు సుఖాసీనుడై తన రాకకు కారణాన్ని చెప్పి, ఈ విధంగా పలికాడు. (15)
సంజయ ఉవాచ
రాజా స్మరతి తే క్షత్తః ధృతరాష్ట్రోఽంబికాసుతః ।
తం పశ్య గత్వా త్వం క్షిప్రం సంజీవయ చ పార్థివమ్ ॥ 16
సంజయుడిలా అన్నాడు - విదురమహాశయా! అంబికాసుతుడైన ధృతరాష్ట్రమహారాజు నిన్ను స్మరిస్తున్నాడు. నీవు శీఘ్రంగా వెళ్ళి ఆయనను చూడు. రాజును బ్రతికించు. (16)
సోఽనుమాన్య నరశేష్ఠాన్ పాండవాన్ కురునందనాన్ ।
నియోగాద్ రాజసింహస్య గంతుమర్హసి సత్తమ ॥ 17
సత్పురుషశ్రేష్ఠా! నరశ్రేష్ఠులు, కురునందనులు అయిన పాండవుల అనుమతి తీసికొని రాజసింహుడైన ధృతరాష్ట్రుని శాసనం ప్రకారం వెళ్లవలసి ఉంది. (17)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు విదురః ధీమాన్ స్వజనవల్లభః ।
యుధిష్ఠిరస్యానుమతే పునరాయాద్ గజాహ్వయమ్ ॥ 18
తమబ్రవీన్మహాతేజాః ధృతరాష్ట్రోఽంబికాసుతః ।
దిష్ట్యా ప్రాప్తోఽసి ధర్మజ్ఞ దిష్ట్యా స్మరసి మేఽనఘ ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు - సంజయుడిలా చెప్పగా, ధీశాలి, స్వజనవల్లభుడు అయిన విదురుడు యుధిష్ఠిరుని అనుమతి గైకొని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. మహాతేజస్వి,
అంబికాసుతుడూ అయిన ధృతరాష్ట్రుడు అతనితో 'ధర్మజ్ఞా! నాభాగ్యవశం చేత నిన్ను పొందాను. నా భాగ్యవశం చేత నన్ను గుర్తుంచుకొన్నావు' అని అన్నాడు. (18,19)
అద్య రాత్రౌ దివా చాహం త్వత్కృతే భరతర్షభ ।
ప్రజాగరే ప్రపశ్యామి విచిత్రం దేహమాత్మనః ॥ 20
భరతశ్రేష్ఠా! నీ కోసం రాత్రి పగలు జాగరణం చేసిన కారణంగా నా శరీరంలోని విచిత్రస్థితిని ఈ రోజు నేను చూస్తున్నాను. (20)
సోఽంకమానీయ విదురం మూర్ధన్యాఘ్రాయ చైవ హ ।
క్షమ్యాతామితి చోవాచ యదుక్తోఽసి మయానఘ ॥ 21
అనిపలికి ధృతరాష్ట్రుడు విదురుని తన ఒడిలో కూర్చోపెట్టుకొని, శిరస్సు ఆఘ్రాణించి,'అనఘా! నేను నీపట్ల పలికిన అప్రియ వచనాలకు నన్ను క్షమించు' అని అన్నాడు. (21)
విదుర ఉవాచ
క్షాంతమేవ మయా రాజన్ గురుర్మే పరమో భవాన్ ।
ఏషోఽహమాగతః శీఘ్రం త్వద్దర్శనపరాయణః ॥ 22
భవంతి హి నరవ్యాఘ్ర పురుషా ధర్మచేతసః ।
దీనాభిపాతినో రాజన్ నాత్ర కార్యా విచారణా ॥ 23
అపుడు విదురుడిలా అన్నాడు.
రాజా! నేను మునుపే క్షమించాను. నీవు నాకు పరమగురుడవు. అందుకే నిన్ను చూడాలనే తాత్పర్యంతో నేను శీఘ్రంగా వచ్చాను. నరశ్రేష్ఠా! ధర్మాత్ములైనవారు దీనుల పట్ల పక్షపాతంతో ఉంటారు. ఈ విషయంలో విచారింపవలసిన పనిలేదు. (22,23)
పాండోః సుతా యాదృశా మే తాదృశాస్తవ భారత ।
దీనా ఇతీవ మే బుద్ధిః అభిపన్నాద్య తాన్ ప్రతి ॥ 24
నాకు పాండుకుమారులెటువంటివారో, నీ కుమారులు కూడా అటువంటివారే. కాని పాండవులు దీనులుగా ఉన్నారు. కావున నా బుద్ధి వారిపట్ల ప్రసరించింది. (24)
వైశంపాయన ఉవాచ
అన్యోన్యమనునీయైవం భ్రాతరై ద్వౌ మహాద్యుతీ ।
విదురో ధృత రాష్ట్రశ్చ లేభాతే పరమాం ముదమ్ ॥ 25
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! ఈ విధంగా మహాతేజోవంతులైన ఆ సోదరులిరువురూ ఒకరినొకరు అనునయించుకొన్నారు. చివరకు విదురధృతరాష్ట్రులు మిక్కిలి ఆనందాన్ని పొందారు. (25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి విదురప్రత్యాగమనే షష్ఠోఽధ్యాయః ॥ 6 ॥
శ్రీ మహాభారతమున వనపర్వమున అరణ్యపర్వమను ఉపపర్వమున విదుర ప్రత్యాగమన మను ఆరవ అధ్యాయము. (6)