8. ఎనిమిదవ అధ్యాయము

ధృతరాష్ట్రునికి వ్యాసుని హితోపదేశము.

వ్యాస ఉవాచ
ధృతరాష్ట్ర మహాప్రాజ్ఞ నిబోధ వచనం మమ ।
వక్ష్యామి త్వాం కౌరవాణాం సర్వేషాం హితముత్తమమ్ ॥ 1
వ్యాసుడిలా అన్నాడు - మహాప్రాజ్ఞా! ధృతరాష్ట్రా! నా మాట విని అర్థం చేసుకో. కౌరవులందరికి హితమై, ఉత్తమమైన మాటను నీకు చెప్తాను. (1)
న మే ప్రియం మహాబాహో యద్ గతాః పాండవా వనమ్ ।
నికృత్యా నికృతాశ్చైవ దుర్యోధనపురోగమైః ॥ 2
మహాబాహూ! పాండవులు వనానికి వెళ్ళడం నా కిష్టం లేదు. దుర్యోధనుడు మున్నగువారు మోసంతో వారిని ఓడించారు. (2)
తే స్మరంతః పరిక్లేశాన్ వర్షే పూర్ణే త్రయోదశే ।
విమోక్ష్యంతి విషం క్రుద్ధాః కౌరవేయేషు భారత ॥ 3
భారతా! పదమూడుసంవత్సరాలు పూర్తి కాగానే వారు తామనుభవించిన కష్టాలను తలుచుకొంటూ క్రుద్ధులై కౌరవులపై విషాన్ని కక్కుతారు. (3)
తదయం కిం ను పాపాత్మా తవ పుత్ర సుమందధీః ।
పాండవాన్ నిత్యసంక్రుద్ధః రాజ్యహేతోర్జిఘాంసతి ॥ 4
ఈ విషయం తెలిసినా పాపాత్ముడు మందబుద్ధి అయిన నీకుమారుడు ఎల్లపుడూ క్రుద్ధుడై రాజ్యం కారణంగా పాండవులను చంపాలని చూస్తున్నాడెందుకు? (4)
వార్యతాం సాధ్యయం మూఢః శమం గచ్ఛతు తే సుతః ।
వనస్థాంస్తానయం హంతుమ్ ఇచ్ఛన్ ప్రాణాన్ విమోక్ష్యతి ॥ 5
ఈ మూఢుని నివారించు. నీ కుమారుడు శాంతించుగాక. వనంలో ఉన్న వారిని చంపాలనుకొని ఇతడు తన ప్రాణాలను విడుస్తాడు. (5)
యథా హి విదురః ప్రాజ్ఞః యథా భీష్మో యథా వయమ్ ।
యథా కృపశ్చ ద్రోణశ్చ తథా సాధుర్భవానపి ॥ 6
ప్రాజ్ఞుడైన విదురుడెటువంటివాడో, భీష్ముడెటువంటివాడో నేనెటువంటివాడినో, కృపుడు, ద్రోణుడు ఎటువంటివారో అటువంటివాడవే నీవు కూడా. (6)
విగ్రహో హి మహాప్రాజ్ఞ స్వజనేన విగర్హితః ।
అధర్మ్యమయశస్యం చ మా రాజన్ ప్రతిపద్యతామ్ ॥ 7
మహాప్రాజ్ఞా! స్వజనులతో (యుద్ధం) కలహం మిక్కిలిగా నిందింపబడింది. అది అధర్మం. అప్రతిష్ఠాకరం కూడ. రాజా! నీవు దాన్ని అంగీకరించకు. (7)
సమీక్షా యాదృశీ హ్యస్య పాండవాన్ ప్రతి భారత ।
ఉపేక్ష్యమాణా సా రాజన్ మహాంతమనయం స్పృశేత్ ॥ 8
భరతశ్రేష్ఠా! పాండవులను గురించి ఈ దుర్యోధనుని ఆలోచనను ఉపేక్షిస్తే అది పెద్ద అత్యాచారానికి దారితీస్తుంది. (8)
అథవాయం సుమందాత్మా వనం గచ్ఛతు తే సుతః ।
పాండవైః సహితో రాజన్ ఏక ఏవాసహాయవాన్ ॥ 9
లేదా మందబుద్ధి అయిన నీకుమారుడు దుర్యోధనుడొక్కడూ తోడెవరూ లేకుండా వనానికి వెళ్ళి, పాండవులతో పాటుగా (ఉండాలి) ఉండుగాక. (9)
తతః సంసర్గజః స్నేహః పుత్రస్య తవ పాండవైః ।
యది స్యాత్ కృతకార్యోఽద్య భవేస్త్వం మనుజేశ్వర ॥ 10
మనుజేశ్వరా! వారి సంసర్గం వల్ల నీ కుమారునికి వారి పట్ల స్నేహం కలిగితే, ఈ రోజే నీవు కృతార్థుడవైనట్లు. (10)
అథవా జాయమానస్య యచ్ఛీలమనుజాయతే ।
శ్రూయతే తన్మహారాజ నామృతస్యాపసర్పతి ॥ 11
కథం వా మన్యతే భీష్మః ద్రోణోఽథ విదురోఽపి వా ।
భవాన్ వాత్ర క్షమం కార్యం పురా వోఽర్థోఽభివర్ధతే ॥ 12
మహారాజా! పుట్టుకతో పాటుగా ఒకనికి ఏర్పడిన స్వభావం చనిపోకముందు తొలగదు. ఈ విషయంలో భీష్ముడు, ద్రోణుడు, విదురుడు నీవూ ఏమనుకొంటున్నారు? ఇపుడు చేయదగిన పనిని ముందు చెయ్యాలి. లేకపోతే మీ ప్రయోజనం నశిస్తుంది. (11,12)
వి॥ (పుట్టుకతో వచ్చిన బుద్ధి పుల్లలతో కాని పోదని తెలుగుసామెత)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి వ్యాసవాక్యే అష్టమోఽధ్యాయః ॥ 8 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అరణ్యపర్వమను ఉపపర్వమున వ్యాసవాక్యమను ఎనిమిదవ అధ్యాయము. (8)