9. తొమ్మిదవ అధ్యాయము
ఇంద్రసురభి సంవాదమును వ్యాసుడు చెప్పుట.
ధృతరాష్ట్ర ఉవాచ
భగవాన్ నాహమప్యేతద్ రోచయే ద్యూతసంభవమ్ ।
మన్యే తద్విధినాఽఽకృష్య కారితోఽస్మీతి వై మునే ॥ 1
ధృతరాష్ట్రుడిలా అన్నాడు - పూజ్యుడా! జూదం వల్ల జరిగిన దీనిని (పాండవుల వనగమనాన్ని) నేను కూడా ఇష్టపడటం లేదు. మునివరా! విధి బలవత్తర మవడం చేత నేనీ పని చేశానని భావిస్తున్నాను. (1)
నైతద్ రొచయతే భీష్మః న ద్రోణో విదురో న చ ।
గాంధారీ నేచ్ఛతి ద్యూతం తత్ర మోహాత్ ప్రవర్తితమ్ ॥ 2
భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, గాంధారి కూడ ఈ జూదాన్ని ఇష్టపడరు. కాని దాని పట్ల మోహం వల్ల జూదం జరిగింది. (2)
పరిత్యక్తుం న శక్నోమి దుర్యోధనమచేతనమ్ ।
పుత్రస్నేహేన్ భగవన్ జానన్నపి ప్రియవ్రత ॥ 3
పూజ్యుడా! ప్రియవ్రత! దుర్యోధనుడు అవివేకి అని తెలిసినప్పటికీ పుత్రస్నేహం చేత వానిని వదలలేకపోతున్నాను. (3)
వ్యాస ఉవాచ
వైచిత్రవీర్య నృపతే సత్యమాహ యథా భవాన్ ।
దృఢం విద్మః పరం పుత్రం పరం పుత్రాన్న విద్యతే ॥ 4
వ్యాసుడిలా అన్నాడు - రాజా! విచిత్రవీర్యనందనా! నీవు చెప్పింది నిజమే. పుత్రుడు మిక్కిలి ఇష్టుడని, పుత్రుని కంటె ఇష్టమైనది వేరొకటి లేదని మాకు బాగా తెలుసు. (4)
ఇంద్రోఽప్యశ్రునిపాతేన సురభ్యా ప్రతిబోధతః ।
అన్యైః సమృద్ధైరప్యర్థైః న సుతాన్మన్యతే పరమ్ ॥ 5
సమృద్ధాలైన ఇతర పదార్థాలచే సంపన్నుడైనా పుత్రులనే (ఇష్టులుగా) గొప్పగా భావిస్తాడు. ఈ విషయాన్ని సురభి తన కన్నీటిచే ఇంద్రుడు తెలిసికొనేటట్లు చేసింది. (5)
అన్నం హ ప్రాణం శరణం హ వాసః
రూపో హిరణ్యం పశవో వివాహాః ।
సఖా హ జాయా కృపణం హ దుహితా
జ్యోతిర్హ పుత్రః పరమే వ్యోమన్ ॥ అని శ్రుతివచనం (నీల)
అత్ర తే కీర్తయిష్యామి మహదాఖ్యానముత్తమమ్ ।
సురభ్యాశ్చైవ సంవాదమ్ ఇంద్రస్య చ విశాంపతే ॥ 6
నరాధిపా! ఈ విషయంలో సురభికి, ఇంద్రునికి జరిగిన సంవాదరూపమైన ఉత్తమమైన గొప్ప ఆఖ్యానాన్ని నీకు చెప్తాను. (6)
త్రివిష్టపగతా రాజన్ సురభీ ప్రారుదత్ కిల ।
గవాం మాతా పురా తాత తామింద్రోఽన్వకృపాయత ॥ 7
రాజా! పూర్వమొకప్పుడు గోమాత సురభి స్వర్గానికి వెళ్ళి ఏడ్చిందట. నాయనా! అపుడు ఇంద్రుడు దాని పట్ల మిక్కిలి దయ చూపాడు. (7)
ఇంద్ర ఉవాచ
కిమిదం రోదషి శుభే కచ్చిత్ క్షేమం దివౌకసామ్ ।
మానుషేష్వథ వా గోషు నైతదల్పం భవిష్యతి ॥ 8
ఇంద్రుడిలా అన్నాడు - శుభరూపీ! నీవు ఏడుస్తున్నా వేమిటి? స్వర్గంలో ఉన్నవారంతా క్షేమమే కదా! మనుష్యులకు, గోవులకు కుశలమేకదా! చిన్నకారణానికి నీకింతటి విచారం కలుగదు. (8)
సురభిరువాచ
వినిపాతో న వః కశ్చిత్ దృశ్యతే త్రిదశాధిప ।
అహం తు పుత్రం శోచామి తేన రోదమి కౌశిక ॥ 9
సురభి ఇలా అంది - దేవేంద్రా! కౌశికా! మీకెటువంటి ప్రమాదం కనబడటం లేదు. నేను పుత్రుని గురించి దుఃఖిస్తున్నాను. అందుచే ఏడుస్తున్నాను. (9)
పశ్యైనం కర్షకం క్షుద్రం దుర్బలం మమ పుత్రకమ్ ।
ప్రతోదేనాభినిఘ్నంతం లాంగలేన చ పీడితమ్ ॥ 10
నీచుడైన ఈ కర్షకుని చూడు. నాగలితో బాధిస్తూ, దుర్బలుడైన నా కుమారుని కర్రతో మాటిమాటికీ కొడుతున్నాడు. (10)
నిషీదమానం సోత్కంఠం వధ్యమానం సురాధిప ।
కృపావిష్టాస్మి దేవేంద్ర మనశ్చోద్విజతే మమ ।
ఏకస్తత్ర బలోపేతః ధురముద్వహతేఽధికామ్ ॥ 11
అపరోఽప్యబలప్రాణః కృశో ధమనిసంతతః ।
కృచ్ఛ్రాదుద్వహతే భారం తం వై శోచామి వాసవ ॥ 12
వధ్యమానః ప్రతోదేన తుద్యమానః పునః పునః ।
నైవ శక్నోతి తం భారమ్ ఉద్వోఢుం పశ్య వాసవ ॥ 13
సురాధిపా! విశ్రాంతి కోరే దాన్ని ఆ కర్షకుడు కొడుతున్నాడు. దాన్ని చూస్తే జాలి కలిగింది. మనస్సు ఉద్విగ్నమైంది. అతని దగ్గరున్న రెండెడ్లలో ఒకటి బలమైంది. అది ఎక్కువ బరువు మోస్తోంది. వేరొకటి దుర్బలప్రాణం కలది. చిక్కినది. నరాలు పైకి కనబడుతున్నాయి. అది అతికష్టం మీద భారాన్ని మోస్తోంది. ఇంద్రా! నేను దాన్ని గురించే దుఃఖిస్తున్నాను. కర్రతో మాటిమాటికి అతడు కొడుతుంటే, హింసిస్తూ ఉంటే అది భారం మోయలేకపోతోంది. చూడు. (11-13)
తతోఽహం తస్య శోకార్తా విరౌమి భృశదుఃఖితా ।
అశ్రూణ్యావర్తయంతీ చ నేత్రాభ్యాం కరుణాయతీ ॥ 14
అందువల్ల నేను దాని కష్టం వల్ల మిక్కిలి దుఃఖం పొంది రెండు కళ్ళనుండి అశ్రువులను కారుస్తూ దీనంగా ఏడుస్తున్నాను. (14)
శక్ర ఉవాచ
తవ పుత్రసహస్రేషు పీడ్యమానేషు శోభనే ।
కిం కృపాయితవత్యత్ర పుత్ర ఏకత్ర హన్యతి ॥ 15
ఇంద్రుడిలా అన్నాడు - కల్యాణీ! వేలకొలది నీ పుత్రులు బాధింపబడుతూండగా నీవు ఈ ఒక్క పుత్రుని పట్లనే ఎందుకు జాలిపడుతున్నావు? (15)
సురభిరువాచ
యది పుత్రసహస్రాణి సర్వత్ర సమతైవ మే ।
దీనస్య తు సతః శక్ర పుత్రస్యాభ్యధికా కృపా ॥ 16
ఇంద్రా! నాకు వేలపుత్రులున్నా వారందరి పట్ల నాకు సమానభావమే ఉంది. కాని దీనుడైన పుత్రుని పట్ల ఎక్కువ జాలికలుగుతోంది. (16)
తదింద్రః సురభీవాక్యం నిశమ్య భృశవిస్మితః ।
జీవితేనాపి కౌరవ్య మేనేఽభ్యధికమాత్మజమ్ ॥ 17
వ్యాసుడిలా అన్నాడు - కురురాజా! సురభి యొక్క ఈ మాటలు విన్న ఇంద్రుడు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. అప్పటి నుండి అతడు పుత్రుని ప్రాణాలకంటె ఎక్కువ ప్రేమగా చూశాడు. (17)
ప్రవవర్షచ తత్రైవ సహసా తోయముల్బణమ్ ।
కర్షకస్యాచరన్ విఘ్నం భగవాన్ పాకశాసనః ॥ 17
అపుడు వెంటనే ఇంద్రుడు కర్షకుని పనికి విఘ్నాన్ని కలిగిస్తూ నీరు పొంగేటట్లు కుంభవృష్టి కురిపించాడు. (18)
తద్ యథా సురభిః ప్రాహ సమవేతాస్తు తే తథా ।
సుతేషు రాజన్ సర్వేషు హీనేష్వభ్యధికా కృపా ॥ 19
సురభి చెప్పిన విధంగానే నీకు కూడ ఏర్పడు గాక! రాజా! కౌరవపాండవులంతా నీకుమారులే అయినా వారిలో దీనస్థితిలో ఉన్నవారిపై నీకెక్కువ దయ ఉండాలి. (19)
యాదృశో మే సుతః పాండుః తాదృశో మేఽసి పుత్రక ।
విదురశ్చ మహాప్రాజ్ఞః స్నేహాదేతద్ బ్రవీమ్యహమ్ ॥ 20
కుమారా! పాండురాజు నాకెటువంటి వాడో నీవు కూడా నాకట్టివాడవే. మహాప్రాజ్ఞుడైన విదురుడు కూడ అట్టివాడే, స్నేహం వల్ల నేనిదంతా చెపుతున్నాను. (20)
చిరాయ తవ పుత్రాణాం శతమేకశ్చ భారత ।
పాండోః పంచైవలక్ష్యంతే తేఽపి మందాః సుదుఃఖితాః ॥ 21
భారతా! చాలా కాలంగా నీకు నూటొక్క కుమారులు, పాండురాజుకు ఐదుగురే ఉన్నారు. వారు కూడా అమాయకులు. మిక్కిలి దుఃఖంలో ఉన్నావారూను. (21)
కథం జీవేయురత్యంతం కథం వర్ధేయురిత్యపి ।
ఇతి దీనేషు పార్థేషు మనో మే పరితప్యతే ॥ 22
పృథాసూనులైన వారు ఎలా జీవిస్తారు? ఎలా వృద్ధి చెందుతారు? అని దీనులైన పాండవుల విషయంలో నా మనస్సు మిక్కిలి పరితపిస్తోంది. (22)
యది పార్థివ కౌరవ్యాన్ జీవమానానిహేచ్ఛసి ।
దుర్యోధనస్తవ సుతః శమం గచ్ఛతు పాండవైః ॥ 22
రాజా! కురువంశీయులంతా సుఖంగా జీవించాలని నీవు కోరుతున్నట్లయితే, నీకుమారుడైన దుర్యోధనుడు పాండవులతో కలసి శాంతంగా ఉండాలి. (23)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి సురభ్యుపాఖ్యానే నవమోఽధ్యాయః ॥ 9 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అరణ్యపర్వమను ఉపపర్వమున సురభ్యుపాఖ్యానమను తొమ్మిదవ అధ్యాయము. (9)