11. పదకొండవ అధ్యాయము

(కిర్మీరవధ పర్వము)

భీమసేనుడు కిర్మీరుని చంపుట.

ధృతరాష్ట్ర ఉవాచ
కిర్మీరస్య వధం క్షత్తః శ్రోతుమిచ్ఛామి కథ్యతామ్ ।
రక్షసా భీమసేనస్య కథమాసీత్ సమాగమః ॥ 1
ధృతరాష్ట్రుడిలా అన్నాడు - విదురా! కిర్మీరుని వధను గూర్చి వినాలనుకొంటున్నాను. చెప్పు. ఆ రాక్షసునితో భీమసేనుడికి కలయిక ఎలా జరిగింది? (1)
విదుర ఉవాచ
శృణు భీమస్య కర్మేదమ్ అతిమానుషకర్మణః ।
శ్రుతపూర్వం మయా తేషాం కథాంతేషు పునః పునః ॥ 2
విదురుడిలా అన్నాడు - రాజా! మానవశక్తికి అతీతమైన పనులు చేసే భీమసేనుని భయానకమైన ఈ పనిని గురించి విను. బ్రాహ్మణులు వారి గురించి మాట్లాడుకొనే సందర్భాలలో చాలా సార్లు నేను ఈ వృత్తాంతం విన్నాను. (2)
ఇతః ప్రయాతా రాజేంద్ర పాండవా ద్యూతనిర్జితాః ।
జగ్ముస్త్రిభిరహోరాత్రైః కామ్యకం నామ తద్ వనమ్ ॥ 3
రాజేంద్రా! జూదంలో ఓడిపోయిన పాండవులు ఇక్కడి నుండి బయలుదేరి మూడురోజులలో కామ్యకవనానికి చేరుకొన్నారు. (3)
రాత్రౌ నిశీథే త్వాభీలే గతేఽర్ధసమయే నృప ।
ప్రచారే పురుషాదానాం రక్షసాం ఘోరకర్మణామ్ ॥ 4
తద్ వనం తాపసా నిత్యం గోపాశ్చ వనచారిణః ।
దూరాత్ పరిహరంతి స్మ పురుషాదభయాత్ కిల ॥ 5
రాజా! రాత్రి సగం గడిచిన తరువాత భయంకరమైన దట్టమైన చీకటిలో ఆ వనంలో నరభక్షకులూ, ఘోరకర్ములూ అయిన రాక్షసులు సంచరిస్తూ ఉంటారు, వారి భయం వల్ల తాపసులు, వనచారులైన గోపగణాలు ఆ వనానికి దూరంగా ఉంటూండేవారు. (4,5)
తేషాం ప్రవిశతాం తత్ర మార్గమావృత్య భారత ।
దీప్తాక్షం భీషణం రక్షః సోల్ముకం ప్రత్యపద్యత ॥ 6
భారతా! పాండవులు ఆ వనాన్ని ప్రవేశిస్తూండగా, వారి మార్గాన్ని ఆక్రమించుకొని మెరిసే కన్నులతో భయంకరమైన రాక్షసుడు అడ్డు నిలిచాడు. (6)
బాహూ మహాంతౌ కృత్వా తు తథాఽఽస్యం చ భయానకమ్ ।
స్థితమావృత్య పంథానం యేన యాంతి కురూద్వహాః ॥ 7
అతడు తన బాహువులను పెద్దవి చేసి, భయంకరమైన తన నోటిని పెద్దది చేసి (తన నోటిని భయంకరం చేసి), కురుశ్రేష్ఠులైన పాండవులు వెళ్తూన్న మార్గాన్ని ఆక్రమించుకొని ఉన్నాడు. (7)
స్పష్టాష్టదంష్ట్రం తామ్రాక్షం ప్రదీప్తోర్ధ్వశిరోరుహమ్ ।
సార్కరశ్మితడిచ్చక్రం సబలాకమివాంబుదమ్ ॥ 8
ఆ రాక్షసునికి ఎనిమిది కోరలు ఉన్నాయి. కళ్లు ఎర్రగా ఉన్నాయి. అతని శిరోజాలు పైకి నిక్కి, ప్రజ్జ్వలిస్తున్నట్టుగా ఉన్నాయి. సూర్యకాంతి వల్ల కలిగిన విద్యున్మండలంతో, బెగ్గురు పక్షులతో కూడిన మేఘంలా ఆ రాక్షసుడున్నాడు. (8)
సృజంతం రాక్షసీం మాయాం మహానాదనినాదితమ్ ।
ముంచంతం విపులాన్ నాదాన్ సతోయమివ తోయదమ్ ॥ 9
అతడు రాక్షసమాయను సృష్టిస్తున్నాడు. అతడు చేసే మహానాదం అంతటా ప్రతిధ్వనిస్తోంది. బిగ్గరగా గర్జించే నీటితో కూడిన నల్లని మేఘంలా ఉన్నాడతడు. (9)
తస్య నాదేన సంత్రస్తాః పక్షిణః సర్వతోదిశమ్ ।
విముక్తనాదాః సంపేతుః స్థలజా జలజైః సహ ॥ 10
అతని అరుపుతో భయపడిన నీటిపక్షులతోపాటు పక్షులన్నీ అరుచుకొంటూ అన్ని దిక్కులకూ ఎగిరిపోయాయి. (10)
సంప్రద్రుతమృగద్వీపిమహిషర్క్షసమాకులమ్ ।
తద్ వనం తస్య నాదేన సంప్రస్థితమివాభవత్ ॥ 11
పరుగిడుతున్న మృగాలు, ఏనుగులు, అడవిదున్నలు, ఎలుగుబంట్లతో నిండి ఉన్న వనమే ఆ రాక్షసుని అరుపుతో బయటకు పరుగిడుతున్నట్లుగా ఉంది. (11)
తస్యోరువాతాభిహతాః తామ్రపల్లవబాహవః ।
విదూరజాతాశ్చ లతాః సమాశ్లిష్యంతి పాదపాన్ ॥ 12
ఆ రాక్షసుడు కదలుతూంటే వచ్చే గాలి తాకిడికి ఎఱ్ఱని చిగురుటాకులనే బాహువులు కలిగిన లతలు దూరంగా విసరబడి వృక్షాలను కౌగిలించుకొంటున్నాయి. (12)
తస్మిన్ క్షణేఽథ ప్రవవౌ మారుతో భృశదారుణః ।
రజసా సంవృతం తేన నష్టజ్యోతిరభూన్నభః ॥ 13
(పాండవులు వస్తూన్న) ఆ సమయంలో మిక్కిలి దారుణమైన గాలి వీచింది. ఆ గాలికి లేచిన దుమ్ముచేత ఆకాశమంతా కప్పబడి వెలుతురు కనబడకుండా చీకటి క్రమ్మినట్లయింది (నక్షత్రాల వెలుతురు కూడా కనబడకుండా పోయింది). (13)
పంచానాం పాండుపుత్రాణామ్ అవిజ్ఞాతో మహారిపుః ।
పంచానామింద్రియాణాం తు శోకావేశ ఇవాతులః ॥ 14
అకస్మాత్తుగా ఐదు ఇంద్రియాలను చెప్పలేనంత దుఃఖం ఆవరించినట్లుగా, పంచపాండవులను మహాశత్రువైన ఆ రాక్షసుడు సమీపించాడు. కాని వారు అతనిని గుర్తించలేదు. (14)
స దృష్ట్వా పాండవాన్ దూరాత్ కృష్ణాజినసమావృతాన్ ।
ఆవృణోత్ తద్వనద్వారం మైనాక ఇవ పర్వతః ॥ 15
ఆ రాక్షసుడు కృష్ణాజినాలు ధరించిన పాండవులను దూరం నుండే చూసి మైనాక పర్వతంలా ఆ వనానికి ప్రవేశించే మార్గాన్ని ఆక్రమించాడు. (15)
తం సమాసాద్య విత్రస్తా కృష్ణా కమలలోచనా ।
అదృష్టపూర్వం సంత్రాసాద్ న్యమీలయత లోచనే ॥ 16
మునుపెన్నడూ చూడని ఆ రాక్షసుని దగ్గరగా చూసిన పద్మాక్షి ద్రౌపది భయంతో కన్నులు మూసుకొంది. (16)
దుఃశాసనకరోత్సృష్టవిప్రకీర్ణశిరోరుహా ।
పంచపర్వతమధ్యస్థా నదీవాకులతాం గతా ॥ 17
దుఃశాసనుని చేతులతో లాగబడి చెల్లాచెదరైన కేశాలతో ద్రౌపది ఐదుపర్వతాల మధ్యనున్న నదివలె పాండవుల మధ్య ఏ ప్రక్కకు పోవాలో తెలియక వ్యాకుల పాటు చెందింది. (17)
మోముహ్యమానాం తాం తత్ర జగృహుః పంచ పాండవాః ।
ఇంద్రియాణి ప్రసక్తాని విషయేషు యథా రతిమ్ ॥ 18
విషయాలపై ఆసక్తి కల పంచేంద్రియాలు అనురక్తిని తన్మయత్వాన్ని పొందినట్లుగా, ద్రౌపది మూర్ఛిల్లుతుండగా పాండవులు పట్టుకొన్నారు. (18)
అథ తాం రాక్షసీం మాయామ్ ఉత్థితాం ఘోరదర్శనామ్ ।
రక్షోఘ్నైర్వివిధైర్మంత్రైః ధౌమ్యః సమ్యక్ర్పయోజితైః ॥ 19
పశ్యతాం పాండుపుత్రాణాం నాశయామాస వీర్యవాన్ ।
స నష్టమాయోఽతిబలః క్రోధవిస్ఫారితేక్షణః ॥ 20
కామమూర్తిధరః క్రూరః కాలకల్పో వ్యదృశ్యత ।
తమువాచ తతో రాజా దీర్ఘప్రజ్ఞో యుధిష్ఠిరః ॥ 21
వెంటనే అక్కడ భయంకరమైన రాక్షసీమాయ వ్యక్తమయింది. దానిని వివిధ రక్షోఘ్నమంత్రాల చేత ధౌమ్యుడు పాండవులు చూస్తూండగా నాశనం చేశాడు. మాయ నశించగానే క్రోధం చేత ప్రజ్వలిస్తున్న నేత్రాలతో క్రూరుడైన రాక్షసుడు యమునిలా కనబడ్డాడు. అతనితో మహాప్రాజ్ఞుడైన యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు. (19-21)
కో భవాన్ కస్య వా కిం తే క్రియతాం కార్యముచ్యతామ్ ।
ప్రత్యువాచాథ తద్ రక్షః ధర్మరాజం యుధిష్ఠిరమ్ ॥ 22
'నీవెవరు? ఎవనికి సంబంధించినవాడవు? నీకు ఏం పని కావాలి? చెప్పు' అన్నాడు. అపుడు ఆ రాక్షసుడు యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు - (22)
అహం బకస్య వై భ్రాతా కిర్మీర ఇతి విశ్రుతః ।
వనేఽస్మిన్ కామ్యకే శూన్యే నివసామి గతజ్వరః ॥ 23
నేను బకాసురుని సోదరుణ్ని. నా పేరు కిర్మీరుడని ప్రసిద్ధమే. ఈ నిర్జనమైన కామ్యకవనంలో నిశ్చింతగా ఉంటున్నాను. (23)
యుధి నిర్జిత్య పురుషాన్ ఆహారం నిత్యమాచరన్ ।
కే యూయమభిసంప్రాప్తాః భక్ష్యభూతా మమాంతికమ్ ॥ 24
నేను నిత్యం ఇక్కడకు వచ్చే మనుష్యులను జయించి ఆహారంగా తీసికొంటాను. మీరెవరు? నాకు ఆహారంగా మీరే స్వయంగా నా దగ్గరకు వచ్చారు. మిమ్మల్నందర్నీ యుద్ధంలో జయించి నిశ్చింతగా భుజిస్తాను. (24)
వైశంపాయన ఉవాచ
యుధిష్ఠిరస్తు తచ్ఛ్రుత్వా వచస్తస్య దురాత్మనః ।
ఆచచక్షే తతః సర్వం గోత్రనామాది భారత ॥ 25
వైశంపాయనుడిలా అన్నాడు - భారతా! దుర్మార్గుడైన ఆ రాక్షసుని మాటలు విని, యుధిష్ఠిరుడు తమ గోత్రనామాదులన్నింటిని అతనికి ఇలా చెప్పాడు. (25)
యుధిష్ఠిర ఉవాచ
పాండవో ధర్మరాజోఽహం యది తే శ్రోత్రమాగతః ।
సహితో భ్రాతృభిః సర్వైః భీమసేనార్జునాదిభిః ॥ 26
హృతరాజ్యో వనే వాసం వస్తుం కృతమతిస్తతః ।
వనమభ్యాగతో ఘోరమ్ ఇదం తవ పరిగ్రహమ్ ॥ 27
యుధిష్ఠిరుడిలా అన్నాడు - పాండురాజు కుమారుడైన ధర్మరాజును నేను. ఇది నీ చెవిదాక వచ్చే ఉంటుంది. రాజ్యం
కోల్పోయి భీమసేనార్జునాది సోదరులతో వనవాసం చేయడానికి వచ్చాను. అందువల్ల నీనివాసమైన ఘోరమైన ఈ కామ్యకవనాన్ని ప్రవేశించాను. (26,27)
విదుర ఉవాచ
కిర్మీరస్త్వబ్రవీదేనం దిష్ట్యా దేవైరిదం మమ ।
ఉపపాదితమద్యేహ చిరకాలాన్మనోగతమ్ ॥ 28
విదురుడిలా అన్నాడు.
రాజా! అపుడు కిర్మీరుడు యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు - 'ఈ రోజు నా భాగ్యవశం వల్ల నా చిరకాల మనోరథాన్ని దేవతలు పూర్తిచేశారు'. (28)
భీమసేనవధార్థం హి నిత్యమభ్యుద్యతాయుధః ।
చరామి పృథివీం కృత్స్నాం నైనం చాసాదయామ్యహమ్ ॥ 29
నేను నిత్యం భీమసేనుని చంపటం కోసం, ఆయుధం సిద్ధంగా ఉంచుకొని ఈ భూమిపై కలయ తిరుగుతున్నాను. కాని నే నతనిని చూడలేకపోయాను. (29)
సోఽయమాసాదితో దిష్ట్యా భ్రాతృహా కాంక్షితశ్చిరమ్ ।
అనేన హి మమ భ్రాతా బకో వినిహతః ప్రియః ॥ 30
వైత్రకీయవనే రాజన్ బ్రాహ్మణచ్ఛద్మరూపిణా ।
విద్యాబలముపాశ్రిత్య న హ్యస్త్యస్యౌరసం బలమ్ ॥ 31
నా సోదరుని చంపిన ఆ భీమసేనుడు చాలాకాలానికి నా భాగ్యవశాన లభించాడు. ఇతడే నాప్రియసోదరుడైన బకుని చంపాడు. ఏకచక్రపురానికి దగ్గర్లో ఉన్న వైత్రకీయవనంలో బ్రాహ్మణునిలా కపటవేషం ధరించి విద్యాబలం సంపాదించి నా సోదరుని చంపాడు. అది ఇతని శరీరబలం కాదు. (30,31)
హిడింబశ్చ సఖా మహ్యం దయితో వనగోచరః ।
హతో దురాత్మనానేన స్వసా చాస్య హృతా పురా ॥ 32
నాకు ఇష్టుడు, వనంలో సహచరుడు, మిత్రుడూ అయిన హిడింబుని దుర్మార్గుడైన ఈ భీముడే చంపాడు. పైగా అతని సోదరిని కూడ అపహరించాడు. (32)
సోఽయమభ్యాగతో మూఢః మమేదం గహనం వనమ్ ।
ప్రచారసమయేఽస్మాకమ్ అర్ధరాత్రే స్థితే స మే ॥ 33
మూఢుడైన ఆ భీముడు నా ఈ అతిగహనమైన వనంలోకి అర్ధరాత్రి సమయంలో మేము సంచరించేటప్పుడు వచ్చాడు. (33)
అద్యాస్య యాతయిష్యామి తద్ వైరం చిరసంభృతమ్ ।
తర్పయిష్యామి చ బకం రుధిరేణాస్య భూరిణా ॥ 34
చాలకాలం నుండి పోషించుకొంటున్న ఈ వైరాన్ని ఈ రోజు తీర్చుకొంటాను. ఈతని రక్తంలో నా సోదరుడైన బకునికి పుష్కలంగా తర్పణం చేస్తాను. (34)
అద్యాహమనృణో భూత్వా భ్రాతుః సఖ్యుస్తథైవ చ ।
శాంతిం లబ్ధాస్మి పరమాం హత్వా రాక్షసకంటకమ్ ॥ 35
రాక్షసకంటకుడైన ఈ భీముడిని చంపి, ఈ రోజు నా సోదరునికి, స్నేహితునికి ఋణం తీర్చుకొని ఎంతో మనశ్శాంతిని పొందుతాను. (35)
వి॥ లబ్ధాస్మి = లప్స్యామి (నీల)
యది తేన పురా ముక్తః భీమసేనో బకేన వై ।
అద్యైనం భక్షయిష్యామి పశ్యతస్తే యుధిష్ఠిర ॥ 36
యుధిష్ఠిరా! మునుపు బకాసురుడు ఈ భీమసేనుని వదిలిపెట్టాడు. ఈ రోజు నీవు చూస్తుండగానే ఇతడిని తినేస్తాను. (36)
ఏనం హి విపులప్రాణమ్ అద్య హత్వా వృకోదరమ్ ।
సంభక్ష్య జరయిష్యామి యథాగస్త్యో మహాసురమ్ ॥ 37
అగస్త్యుడు వాతాపిని తిని అరగించుకొన్నట్లుగా, మహాకాయుడైన ఈ వృకోదరుని చంపి, తిని, జీర్ణం చేసికొంటాను. (37)
ఏవముక్తస్తు ధర్మాత్మా సత్యసంధో యుధిష్ఠిరః ।
నైతదస్తీతి సక్రోధః భర్త్సయామాస రాక్షసమ్ ॥ 38
అతడావిధంగా చెప్పగా, ధర్మాత్ముడు, సత్యసంధుడూ అయిన యుధిష్ఠిరుడు 'ఇదిజరుగదు' అని క్రోధంతో ఆ రాక్షసుని బెదిరించాడు. (38)
తతో భీమో మహాబాహుః ఆరుజ్య తరసా ద్రుమమ్ ।
దశవ్యామమథోద్విద్ధం నిష్పత్రమకరోత్ తదా ॥ 39
ఆ తర్వాత మహాబాహువైన భీముడు మిక్కిలి వేగంగా పది బారల పొడవున్న చెట్టును పెకలించి, దాని ఆకులన్నింటిని తొలగించాడు. (39)
(వ్యామము = పురుషప్రమాణౌ)
చకార సజ్యం గాండీవం వజ్రనిష్పేషగౌరవమ్ ।
నిమేషాంతరమాత్రేణ తథైవ విజయోఽర్జునః ॥ 40
అదేవిధంగా విజయుడైన అర్జునుడు ఒక్కరెప్పపాటు కాలంలో వజ్రాయుధాన్ని ముక్కలు చేసిన ఘనత గల గాండీవాన్ని నారిని సంధించి సిద్ధం చేశాడు. (40)
నివార్య భీమో జిష్ణుం తం తద్ రక్షో మేఘనిఃస్వనమ్ ।
అభిద్రుత్యాబ్రవీద్ వాక్యం తిష్ఠ తిష్ఠేతి భారత ॥ 41
భారతా! అపుడు భీముడు జయశీలుడైన అర్జునుని వారించి, మేఘంగా గర్జిస్తున్న ఆ రాక్షసుని ఎదుర్కొని 'ఆగు ఆగు' అని అన్నాడు. (41)
ఇత్యుక్త్వైనమతిక్రుద్ధః కక్ష్యాముత్పీడ్య పాండవః ।
నిష్పిష్య పాణినా పాణిం సందష్టౌష్ఠ పుటో బలీ ॥ 42
తమభ్యధావద్ వేగేన భీమో వృక్షాయుధస్తదా ।
యమదండప్రతీకాశం తతస్తం తస్య మూర్ధని ॥ 43
పాతయామాస వేగేన కులిశం మఘవానివ ।
అసంభ్రాంతం తు తద్ రక్షః సమరే ప్రత్యదృశ్యత ॥ 44
అని పలికి మిక్కిలి కోపంతో పెదవి కొరుకుతూ బలవంతుడైన భీమసేనుడు పంచి బిగించి ఆ రాక్షసుని చేతితో చేతిని పిండిచేసి విడిచాడు. (వాడు పారిపోతే) వృక్షమే ఆయుధంగా గల భీముడు వేగంగా అతని వెంట పరుగెత్తాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని విసిరినట్లుగా భీముడు యమదండంలా ఉన్న ఆ వృక్షాన్ని వేగంగా ఆ రాక్షసుని నెత్తిమీదవేశాడు. అయినప్పటికీ ఆ రాక్షసుడు యుద్ధంలో ఏమాత్రం చలించనట్లుగా కనబడ్డాడు. (42-44)
చిక్షేప చోల్ముకం దీప్తమ్ అశనిం జ్వలితామివ ।
తదుదస్తమలాతం తు భీమః ప్రహరతాం వరః ॥ 45
పదా సవ్యేన చిక్షేప తద్ రక్షః పునరావ్రజత్ ।
కిర్మీరశ్చాపి సహసా వృక్షముత్పాట్య పాండవమ్ ॥ 46
దండపాణిరివ క్రుద్ధః సమరే ప్రత్యధావత ।
తద్ వృక్షయుద్ధమభవద్ మహీరుహవినాశనమ్ ॥ 47
వాలిసుగ్రీవయోర్భాత్రోః యథా స్త్రీకాంక్షిణోః పురా ।
ఆ రాక్షసుడు మండుతున్న వజ్రాయుధంలా ఉన్న కట్టెను భీమునిపైకి విసిరాడు. దాన్ని భీముడు తన ఎడమకాలితో తన్నాడు. అది మళ్ళీ ఆ రాక్షసుని మీదికే వెళ్ళింది. అపుడు కిర్మీరుడు సాహసంతో వృక్షాన్ని పెకలించి దండపాణియైన యమునిలా క్రుద్ధుడై భీముని మీదికి పరిగెత్తాడు. పూర్వకాలంలో స్త్రీని కాంక్షించిన వాలిసుగ్రీవులకు వలె వారిరువురికి వృక్షయుద్ధం జరిగింది. (45 - 47 1/2)
శీర్షయోః పతితా వృక్షాః బిభిదుర్నైకధా తయోః ॥ 48
యథైవోత్పలపత్రాణి మత్తయోర్ద్విపయోస్తథా ।
మదించిన ఏనుగుల కుంభస్థలాలపై కలువరేకులు పడినట్లుగా వారిరువురి శిరస్సుల మీద పడిన వృక్షాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి. (48 1/2)
వి॥సం॥ మూలాని అని పాఠం. కలువపూల సమూహములు (నీల).
ముంజవజ్జర్జరీభూతాః బహవస్తత్ర పాదపాః ॥ 49
చీరాణీవ వ్యుదస్తాని రేజుస్తత్ర మహావనే ।
తద్ వృక్షయుద్ధమభవద్ ముహూర్తం భరతర్షభ ।
రాక్షసానాం చ ముఖ్యస్య నరాణాముత్తమస్య చ ॥ 50
అక్కడున్నటువంటి చాలా చెట్లు 'ముంజ'గడ్డిలా శిథిలమయ్యాయి. అవి చెల్లాచెదరైన నారచీరలు వలె ఆ మహావనంలో ప్రకాశిస్తున్నాయి. భరతశ్రేష్ఠా! రాక్షసముఖ్యుడైన కిర్మీరునికి, నరశ్రేష్ఠుడైన భీమునికి కొద్దిసేపు అలా వృక్షయుద్ధం జరిగింది. (49,50)
తతః శిలాం సముత్ క్షిప్య భీమస్య యుధి తిష్ఠతః ।
ప్రాహిణోద్ రాక్షసః క్రుద్ధః భీమశ్చ న చచాల హ ॥ 51
అనంతరం క్రుద్ధుడైన రాక్షసుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్న భీముని మీదికి పెద్దరాయిని (శిలను) ఎత్తి విసిరాడు. దానికి భీముడు చలించలేదు. (51)
తం శిలాతాడనజడం పర్యధావత రాక్షసః ।
బాహువిక్షిప్తకిరణః స్వర్భానురివ భాస్కరమ్ ॥ 52
రాహువు సూర్యకిరణాలను తనబాహువులతో నివారించి, ఆక్రమించినట్లుగా రాతిదెబ్బకు కూడా చలించకుండా ఉన్న ఆ భీముని మీదికి రాక్షసుడు పరుగెత్తాడు. (52)
తావన్యోన్యం సమాశ్లిష్య ప్రకర్షంతౌ పరస్పరమ్ ।
ఉభావపి చకాశేతే ప్రవృద్ధౌ వృషభావివ ॥ 53
వారిద్దరు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని, ఒకరి నొకరు లాక్కొంటూ బలిసిన ఆబోతుల్లా కలియబడ్డారు. (53)
తయోరాసీత్ సుతుములః సంప్రహారః సుదారుణః ।
నఖదంష్ట్రాయుధవతోః వ్యాఘ్రయోరివ దృప్తయోః ॥ 54
గోళ్లు, దంష్ట్రలు (కోరలు) ఆయుధాలుగా గల గర్వించిన పెద్దపులుల్లా వారిరువురికి భయంకర ప్రహారాలతో యుద్ధం జరిగింది. (54)
దుర్యోధననికారాచ్చ బాహువీర్యాచ్చ దర్పితః ।
కృష్ణానయనదృష్టశ్చ వ్యవర్ధత వృకోదరః ॥ 55
దుర్యోధనుని తిరస్కారం వల్ల, బాహుబలం వల్ల, ద్రౌపది ఓరకంటి చూపు వల్లను గర్వించి భీముడు విజృంభించాడు. (55)
అభిపద్య చ బాహుభ్యాం ప్రత్యగృహ్ణాదమర్షితః ।
మాతంగమివ మాతంగః ప్రభిన్నకరటాముఖమ్ ॥ 56
మదించిన ఏనుగు మదజలం కారుతున్న మరొక మదపుటేనుగును పట్టినట్లుగా అసహనంతో ఉన్న భీముడు ఆ రాక్షసుని తనబాహువులతో పట్టుకొన్నాడు. (56)
స చాప్యేనం తతో రక్షః ప్రతిజగ్రాహ వీర్యవాన్ ।
తమాక్షిపద్ భీమసేనో బలేన బలినాం వరః ॥ 57
బలవంతుడైన ఆ రాక్షసుడు కూడా భీముసేనుని పట్టుకొన్నాడు. బలవంతులలో శ్రేష్ఠుడైన భీముడు తనబలంతో అతనిని దూరంగా విసిరివేశాడు. (57)
తయోర్భుజవినిష్పేషాద్ ఉభయోర్బలినోస్తదా ।
శబ్దః సమభవద్ ఘోరః వేణుస్ఫోటసమో యుధి ॥ 58
అథైనమాక్షిప్య బలాద్ గృహ్య మధ్యే వృకోదరః ।
ధూనయామాస వేగేన వాయుశ్చండ ఇవ ద్రుమమ ॥ 59
బలవంతుడైన ఆ ఇరువురు పరస్పరం భుజాలతో గుద్దుకోవడం వల్ల వెదురు పేలిన శబ్దంలా ఘోరమైన శబ్దం వెలువడింది. ప్రచండవాయువు వేగంతో వృక్షాన్ని ఊపినట్లుగా వృకోదరుడు ఆ రాక్షసుని నడుము పట్టి పైకి లేపి గిరగిర త్రిప్పసాగాడు. (58,59)
స భీమేన పరామృష్టః దుర్బలో బలినా రణే ।
వ్యస్పందత యథాప్రాణం విచకర్ష చ పాండవమ్ ॥ 60
భీముడు బలంగా అలా పట్టుకోగా, దుర్బలుడైన రాక్షసుడు ఆ యుద్ధంలో యథాశక్తిగా భీముని పట్టుకోసాగాడు. భీముడతనిని ఇటూ అటూ త్రిప్పసాగాడు. (60)
తత ఏవం పరిశ్రాంతమ్ ఉపలక్ష్య వృకోదరః ।
యోక్త్రయామాస బాహుభ్యాం పశుం రశనయా యథా ॥ 61
అనంతరం ఆ రాక్షసుడు అలసిపోవడం గమనించిన భీముడు పశువును త్రాడుతో బంధించినట్లుగా ఆ రాక్షసుని తన చేతులతో బంధించాడు. (61)
వినదంతం మహానాదం భిన్నభేరీస్వనం బలీ ।
భ్రామయామాస సుచిరం విస్ఫురంతమచేతసమ్ ॥ 62
రకరకాల భేరీ నినాదాల వలె బిగ్గరగా అరుస్తున్న ఆ రాక్షసుని బలవంతుడైన భీముడు చాలాసేపు గిరగిరా త్రిప్పాడు. రాక్షసుడు అచేతను డయిపోయాడు. (62)
తం విషీదంతమాజ్ఞాయ రాక్షసం పాండునందనః ।
ప్రగృహ్య తరసా దోర్భ్యాం పశుమారమయారయత్ ॥ 63
మరణావస్థకు చేరిన ఆ రాక్షసుని చూసి భీముడు తన చేతులతో అతనిని పట్టుకొని పశువును మర్దించినట్లు కొట్టాడు. (63)
ఆక్రమ్య చ కటీదేశే జానునా రాక్షసాధమమ్ ।
పీడయామాస పాణిభ్యాం కంఠం తస్య వృకోదరాః ॥ 64
వృకోదరుడు అతని కటిప్రదేశం మీద కూర్చొని అతని మోకాలితో పొడిచి, కంఠాన్ని చేతులతో నొక్కాడు. (64)
అథ జర్జరసర్వాంగం వ్యావృత్తనయనోల్బణమ్ ।
భూతలే భ్రామయామాస వాక్యం చేదమువాచ హ ॥ 65
శరీరావయవాలన్నీ శిథిలమై, కనుగ్రుడ్లు తిరగబడిన ఆ రాక్షసుని నేలపై తిప్పుతూ, భీముడు ఇలా అన్నాడు. (65)
హిడింబబకయోః పాప న త్వమశ్రుప్రమార్జనమ్ ।
కరిష్యసి గతశ్చాపి యమస్య సదనం ప్రతి ॥ 66
ఓరీ పాపీ! నీవు యమసదనానికి వెళ్ళి కూడా బకహిడింబుల కన్నీటిని తుడవజాలవు. (66)
ఇత్యేవముక్త్వా పురుషప్రవీరః
తం రాక్షసం క్రోధపరీతచేతాః ।
విస్త్రస్తవస్త్రాభరణం స్ఫురంతమ్
ఉద్ర్భాంతచిత్తం వ్యసుముత్ససర్జ ॥ 67
అని పలికి వీరపురుషుడైన భీముడు క్రోధంతో ఉద్విగ్నమైన మనస్సుతో వస్త్రాభరణాలు జారి మతిభ్రమ చెంది, అసువులు బాసిన ఆ రాక్షసుని విడిచిపెట్టాడు. (67)
తస్మిన్ హతే తోయదతుల్యరూపే
కృష్ణాం పురస్కృత్య నరేంద్రపుత్రాః ।
భీమం ప్రశస్యాథ గుణైరనేకైః
హృష్టాస్తతో ద్వైతవనాయ జగ్ముః ॥ 68
మేఘంలా నల్లగా ఉన్న ఆ రాక్షసుని భీముడు చంపగానే, రాజకుమారులైన పాండవులు ద్రౌపదిని ముందుంచుకొని, భీముని అనేక గుణాలతో ప్రశంసించి ఆనందించారు. అనంతరం అక్కడ నుండి ద్వైతవనానికి వెళ్ళారు. (68)
విదుర ఉవాచ
ఏవం వినిహతః సంఖ్యే కిర్మీరో మనుజాధిప ।
భీమేన వచనాత్ తస్య ధర్మరాజస్య కౌరవ ॥ 69
రాజా! ఈ విధంగా ధర్మరాజు యొక్క మాట వల్ల భీమసేనుడు యుద్ధంలో కిర్మీరుని సంహరించాడు. (69)
తతో నిష్కంటకం కృత్వా వనం తదపరాజితః ।
ద్రౌపద్యా సహ ధర్మజః వసతిం తామువాస హ ॥ 70
అనంతరం విజయశీలుడైన ధర్మరాజు ఆ వనాన్ని నిష్కంటకంగా చేసికొని ద్రౌపదితో పాటు అక్కడే నివసించాడు. (70)
సమాశ్వాస్య చ తే సర్వే ద్రౌపదీం భరతర్షభాః ।
ప్రహృష్టమనసః ప్రీత్యా ప్రశశంసుర్వృకోదరమ్ ॥ 71
వారంతా ద్రౌపదిని ఊరడించి ఆనందించి వృకోదరుని ప్రశంసించారు. (71)
భీమబాహుబలోత్పిష్టే వినష్టే రాక్షసే తతః ।
వివిశుస్తే వనం వీరాః క్షేమం నిహతకంటకమ్ ॥ 72
భీముని బాహుబలంచేత నుగ్గునుగ్గైన ఆ రాక్షసుడు మరణించినపిదప, నిష్కంటకమైన ఆ వనాన్ని ఆ వీరులు క్షేమంగా ప్రవేశించారు. (72)
స మయా గచ్ఛతా మార్గే వినికీర్ణో భయావహః ।
వఏ మహతి దుష్టాత్మా దృష్టో భీమబలాద్ధతః ॥ 73
నేను వెళుతూ దారిలో భీముని బలం వల్ల చచ్చి, భయంకరంగా ఆ వనంలో పడి ఉన్న దుర్మార్గుడైన ఆ రాక్షసుని చూశాను. (73)
తత్రాశ్రౌషమహం చైతత్ కర్మ భీమస్య భారత ।
బ్రాహ్మణానాం కథయతాం యే తత్రాసన్ సమాగతాః ॥ 74
భారతా! అక్కడకు వచ్చిన బ్రాహ్మణులు చెప్పగా భీముడు చేసిన ఈ గొప్ప పనిని నేను విన్నాను. (74)
వైశంపాయన ఉవాచ
ఏవం వినిహతం సంఖ్యే కిర్మీరం రక్షసాం వరమ్ ।
శ్రుత్వా ధ్యానపరో రాజా నిశశ్వాసార్తవత్ తదా ॥ 75
వైశంపాయనుడిలా అన్నాడు.
ఈ విధంగా యుద్ధంలో రాక్షసశ్రేష్ఠుడైన కిర్మీరుడు చంపబడడం విని ధృతరాష్ట్రమహారాజు అదే ఆలోచనలో ఉండి దుఃఖంతో దీర్ఘంగా నిట్టూర్చాడు. (75)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కిర్మీరవధపర్వణి విదురవాక్యే ఏకాదశోఽధ్యాయః ॥ 11 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున కిర్మీరవధపర్వమను
ఉపపర్వమున విదురవాఖ్యమను పదనొకండవ అధ్యాయము. (11)