12. పన్నెండవ అధ్యాయము
(అర్జునాభిగమన పర్వము)
శ్రీకృష్ణాదుల ఆగమనము.
వైశంపాయన ఉవాచ
భోజాః ప్రప్రవజితాన్ శ్రుత్వా వృష్ణయశ్చాంధకైః సహ ।
పాండవాన్ దుఃఖసంతప్తాన్ సమాజగ్ముర్మహావనే ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! పాండవులు వనవాసానికి వెళ్లారని, భోజ, వృష్ణి, అంధక వీరులంతా (ఆ మహావనంలోకి వచ్చి) దుఃఖపీడితులైన పాండవులను కలుసుకొన్నారు. (1)
పాంచాలస్య చ దాయాదాః ధృష్టకేతుశ్చ చేదిపః ।
కేకయాశ్చ మహావీర్యాః భ్రాతరో లోకవిశ్రుతాః ॥ 2
వనే ద్రష్టుం యయుః పార్థాన్ క్రోధామర్షసమన్వితాః ।
గర్హయంతో ధార్తరాష్ట్రాన్ కిం కుర్మ ఇతి చాబ్రువన్ ॥ 3
పాంచాలదాయాదుడైన ధృష్టద్యుమ్నుడు, చేది రాజయిన ధృష్టకేతువు, మహాబలవంతులై లోకవిఖ్యాతులైన కేకయరాజకుమార సోదరులందరూ క్రోధంతో, అసహనంతో ధార్తరాష్ట్రులను నిందిస్తూ వనంలో పాండవులను చూడటానికి వచ్చారు. 'మేమేం చెయ్యాలి' అని అడిగారు. (2,3)
వాసుదేవం పురస్కృత్య సర్వే తే క్షత్రియర్షభాః ।
పరివార్యోపవివిశుః ధర్మరాజం యుధిష్ఠిరమ్ ।
అభివాద్య కురుశ్రేష్ఠం విషణ్ణః కేశవోఽబ్రవీత్ ॥ 4
ఆ క్షత్రియశ్రేష్ఠులంతా వాసుదేవుని ముందుంచుకొని ధర్మరాజు చుట్టూ చేరారు. శ్రీకృష్ణుడు విషాదగ్రస్తుడై కురుశ్రేష్ఠుడైన ధర్మరాజుతో ఇలా అన్నాడు. (4)
వాసుదేవ ఉవాచ
దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః ।
దుఃశాసనచతుర్థానాం భూమిః పాస్యతి శోనితమ్ ॥ 5
దుర్మార్గులైన దుర్యోధన, కర్ణ, శకుని దుఃశాసనుల యొక్క రక్తాన్ని ఈ భూమి త్రాగుతుంది. (5)
ఏతాన్ నిహత్య సమరే యే చ తస్య పదానుగాః ।
తాంశ్చ సర్వాన్ వినిర్జిత్య సహితాన్ సనరాధిపాన్ ॥ 6
తతః సర్వేఽభిషించామః ధర్మరాజం యుధిష్ఠిరమ్ ।
నికృత్యోపచరన్ వధ్య ఏష ధర్మః సనాతనః ॥ 7
యుద్ధంలో ఈ నులుగురిని చంపి, ఇంకా వీరిని అనుసరించిన రాజులందరిని, ఇతరులను జయించి ధర్మరాజును రాజ్యాభిషిక్తుని చేద్దాం. ఇతరులను మోసగించి తాను సుఖపడేవాడు చంపదగినవాడే. ఇది సనాతనమైన ధర్మమే. (6,7)
వైశంపాయన ఉవాచ
పార్థానామభిషంగేణ తథా క్రుద్ధం జనార్దనమ్ ।
అర్జునః శమయామాస దిధక్షంతమివ ప్రజాః ॥ 8
సంక్రుద్దం కేశవం దృష్ట్వా పూర్వదేహేషు ఫాల్గునః ॥ 9
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! పాండవుల అవమానం చేత కోపించి జనులందరిని భస్మం చేసేటట్లున్న జనార్దనుని అర్జునుడు శాంతింపజేశాడు. కోపించి కేశవుని చూసి, అర్జునుడు పూర్వదేహంలో మహాత్ముడైన సత్యకీర్తి యొక్క పనులను ప్రశంసింప నారంభించాడు. (8,9)
పురుషస్యాప్రమేయస్య సత్యస్యామితతేజసః ।
ప్రజాపతిపతేర్విష్ణోః లోకనాథస్య ధీమతః ॥ 10
పురుషోత్తముడు, అప్రమేయుడు, సత్యస్వరూపుడు, అమిత తేజస్వి, ప్రజాపతులకే పతి, లోకాన్నింటికి రక్షకుడు, మహాబుద్ధిమంతుడు ఐన శ్రీమహావిష్ణువును అర్జునుడు ఇలా స్తుతించాడు. (10)
అర్జున ఉవాచ
దశ వర్షసహస్రాణి యత్ర సాయంగృహో మునిః ।
వ్యచరస్త్వం పురా కృష్ణ పర్వతే గంధమాదనే ॥ 11
అర్జునుడిలా అన్నాడు - శ్రీకృష్ణా! పూర్వకాలం నీవు సాయంగృహముని రూపంలో గంధమాదనపర్వతం మీద పదివేల సంవత్సరాలు నివసించావు. (అతడే నారాయణ ఋషి) (11)
దశ వర్షసహస్రాణి దశ వర్షశతాని చ ।
పుష్కరేష్వవసః కృష్ణ త్వమపో భక్షయన్ పురా ॥ 12
కృష్ణా! పూర్వకాలం నీవు ఈ భూమిమీద పదునొకండు వేల సంవత్సరాలు కేవలం నీటిని మాత్రమే స్వీకరిస్తూ పుష్కర తీర్థాల్లో నివసించావు. (12)
ఊర్ధ్వబాహుర్విశాలాయాం బదర్యాం మధుసూదన ।
అతిష్ఠ ఏకపాదేన వాయుభక్షః శతం సమాః ॥ 13
మధుసూదనా! విశాలా నగరంలోని బదరికాశ్రమంలో ఒక్కపాదం మీద నిలబడి, బాహువులు రెండూ పైకి చాచి గాలిని భక్తిస్తూ వంద సంవత్సరాలు ఉన్నావు. (13)
అవకృష్ణోత్తరాసంగః కృశో ధమనిసంతతః ।
ఆసీః కృష్ణ సరస్వత్యాం సత్రే ద్వాదశవార్షికే ॥ 14
కృష్ణా! సరస్వతీ నదీతీరంలో పన్నెండు సంవత్సరాల సత్రయాగంలో ఉత్తరీయాన్ని కూడా విడిచిపెట్టి, శరీరంలోని నాడులు కనబడేటంతగా కృశించావు. (14)
ప్రభాసమప్యథాసాద్య తీర్థం పుణ్యజనోచితమ్ ।
తథా కృష్ణ మహాతేజాః దివ్యం వర్షసహస్రకమ్ ॥ 15
అతిష్ఠస్త్వమథైకేన పాదేన నియమస్థితః ।
లోకప్రవృత్తిహేతుస్త్వమ్ ఇతి వ్యాసో మమాబ్రవీత్ ॥ 16
కృష్ణా! పుణ్యజనులకు నివాసయోగ్యమైన ప్రభాసతీర్థంలో శౌచసంతోషాది నియమాలు పాటిస్తూ వెయ్యి దివ్య సంవత్సరాలు ఒకేపాదంతో నిలచి ఉన్నావు. లోకులను తపస్సులో ప్రవర్తింపజేయాలని నీవలా చేసినట్లు వ్యాసుడు నాకు చెప్పాడు. (15,16)
క్షేత్రజ్ఞః సర్వభూతానామ్ ఆదిరంతశ్చ కేశవ ।
నిధానం తపసాం కృష్ణ యజ్ఞస్త్వం చ సనాతనః ॥ 17
కేశవా! కృష్ణా! నీవు క్షేత్రజ్ఞుడవు. సర్వభూతాలకు ఆద్యంతాలు నీవే. తాపసులకు అధిష్ఠానం నీవు. నీవు యజ్ఞస్వరూపుడవు. సనాతనుడవు. (17)
నిహత్య నరకం భౌమమ్ ఆహృత్య మణికుండలే ।
ప్రథమోత్పతితం కృష్ణ మేధ్యమశ్వమవాసృజః ॥ 18
కృష్ణా! భూమిపుత్రుడు అహంకారి అయిన నరకుని చంపి, అదితి కుండలాలు తెచ్చి, అశ్వమేధయజ్ఞానికి అశ్వాన్ని విడిచావు. (18)
కృత్వా తత్ కర్మ లోకానామ్ ఋషభః సర్వలోకజిత్ ।
అవధీస్త్వం రణే సర్వాన్ సమేతాన్ దైత్యదానవాన్ ॥ 19
అన్నిలోకాలను జయించిన నీవు లోకేశ్వరుడవు. నీవు చేసే పనులకు అడ్డువచ్చిన దైత్యులను, దానవులను యుద్ధంలో సంహరించావు. (19)
తతః సర్వేశ్వరత్వం చ సంప్రదాయ శచీపతేః ।
మానుషేషు మహాబాహో ప్రాదుర్భూతోఽసి కేశవ ॥ 20
మహాబాహూ! కేశవా! అనంతరం శచీపతి ఇంద్రునికి స్వర్గాధిపత్యాన్ని ఇచ్చి, నీవు మనుష్యులలో జన్మించావు. (20)
స త్వం నారాయణో భూత్వా హరిరాసీః పరంతప ।
బ్రహ్మా సోమశ్చ సూర్యశ్చ ధర్మో ధాతా యమోఽనలః ॥ 21
వాయుర్వైశ్రవణో రుద్రః కాలః ఖం పృథివీ దిశః ।
అజశ్చరాచరగురుః స్రష్టా త్వం పురుషోత్తమ ॥ 22
పరంతపా! పురుషోత్తమా! నీవు నారాయణుడవు. విష్ణువుగా వ్యక్తమయినావు. బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు, ధర్మం, ధాత, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, రుద్రుడు, కాలం, ఆకాశం, పృథివి, దిక్కులు, చరాచరగురువగు సృష్టికర్త అజుడవు నీవే. (21,22)
పరాయణం దేవమూర్ధా క్రతుభిర్మధుసూదన ।
అయజో భూరితేజా వై కృష్ణ చైత్రరథే వనే ॥ 23
మధుసూదనా! శ్రీకృష్ణా! నీవు చైత్రరథవనంలో అనేక యజ్ఞాలు చేశావు. నీవు దేవతలందరికి శిరోమణివి. గొప్ప తేజస్వివి. అందరూ చేరదగిన ఉత్కృష్టస్థానం నీవే. (23)
శతం శతసహస్రాణి సువర్ణస్య జనార్దన ।
ఏకైకస్మింస్తదా యజ్ఞే పరిపూర్ణాని భాగశః ॥ 24
జనార్దనా! అపుడు నీవు చేసిన ఒక్కొక్క యజ్ఞంలో ఒక కోటి స్వర్ణముద్రికలు దక్షిణలుగా పరిపూర్ణంగా ఇచ్చావు. (24)
అదితేరపి పుత్రత్వమ్ ఏత్య యాదవనందన ।
త్వం విష్ణురితి విఖ్యాతః ఇంద్రాదవరజో విభుః ॥ 25
యదునందనా! నీవు అదితికి పుత్రునిగ జన్మించి, ఇంద్రునికి తమ్ముడవై సర్వవ్యాపకుడవై విష్ణువనే పేర విఖ్యాతుడవయ్యావు. (25)
శిశుర్భూత్వా దివం ఖం చ పృథివీం చ పరంతప ।
త్రిభిర్విక్రమణైః కృష్ణ క్రాంతవానసి తేజసా ॥ 26
పరంతపా! కృష్ణా! వామనావతారసమయంలో బాలుడవై స్వర్గలోకాన్ని, అంతరిక్షాన్ని, భూలోకాన్ని నీ తేజస్సుచే మూడు అడుగులు వేసి ఆక్రమించావు. (26)
సంప్రాప్య దివమాకాశమ్ ఆదిత్యస్యందనే స్థితః ।
అత్యరోచశ్చ భూతాత్మన్ భాస్కరం స్వేన తేజసా ॥ 27
భూతాత్మా! స్వర్గాన్ని, అంతరిక్షాన్ని చేరి, సూర్యుని రథంపై ఉండి నీ తేజస్సుచే సూర్యుని ప్రకాశింపజేశావు. (27)
ప్రాదుర్భావసహస్రేషు తేషు తేషు త్వయా విభో ।
అధర్మరుచయః కృష్ణ నిహతాః శతశోఽసురాః ॥ 28
విభో! అనేక వేల జన్మలలో ఆయా జన్మలయందు పుట్టిన అధర్మాసక్తి గల వందల మంది రాక్షసులను నీవు చంపావు. (28)
సాదితా మౌరవాః పాశాః నిసుందనరకౌ హతౌ ।
కృతః క్షేమః పునః పన్థాః పురంప్రాగ్జ్యోతిషం ప్రతి ॥ 29
కృష్ణా! నీవు మురాసురుడు వేసిన లోహమయపాశాలను త్రెంచావు. నిసుంద, నరకులను చంపావు. ప్రాగ్జ్యోతిషపురానికి క్షేమంగా ఉండే మార్గాన్ని మళ్ళీ ఏర్పరిచావు. (29)
జారుథ్యామాహుతిః క్రాథః శిశుపాలో జనైః సహ ।
జరాసంధశ్చ శైబ్యశ్చ శతధన్వా చ నిర్జితః ॥ 30
కృష్ణా! జారూథినగరంలో ఆహుతి, క్రాథుడు, అనుచర సహితుడైన శిశుపాలుడు, జరాసంధుడు, శైబ్యుడు, శతధన్వుడు అనేవాళ్లను జయించావు. (30)
తథా పర్జన్యఘోషేణ రథేనాదిత్యవర్చసా ।
అవాప్సీర్మహిషీం భోజ్యాం రణే నిర్జిత్య రుక్మిణమ్ ॥ 31
అదేవిధంగా మేఘంవలె గర్జించే, సూర్యునిలా ప్రకాశించే రథంతో యుద్ధంలో రుక్మిని జయించి భోజకన్య రుక్మిణిని పట్టమహిషిగా పొందావు. (31)
ఇంద్రద్యుమ్నో హతః కోపాద్ యవనశ్చ కసేరుమాన్ ।
హతః సౌభపతిః శాల్వః త్వయా సౌభం చ పాతితమ్ ॥ 32
కృష్ణా! నీ కోపం వల్ల ఇంద్రద్యుమ్నుడు చంపబడ్డాడు. యవన జాతీయుడగు కసేరుమంతుడు, సౌభపతి శాల్వుడు యమలోకానికి వెళ్ళారు. శాల్వుని సౌభవిమానాన్ని నీవు పడగొట్టావు. (32)
ఏవమేతే యుధి హతాః భూయశ్చాన్యాన్ శృణుష్వ హ ।
ఇరావత్యాం హతో భోజః కార్తవీర్యసమో యుధి ॥ 33
ఈవిధంగా వీరందర్నీ యుద్ధంలో చంపావు. ఇంకా ఇతరులను గురించి కూడ చెప్తాను విను. ఇరావతీ నదీతీరంలో కార్తవీర్యార్జునునితో సమానమైన భోజుని యుద్ధంలో చంపావు. (33)
గోపతిస్తాలకేతుశ్చ త్వయా వినిహతావుభౌ ।
తాం చ భోగవతీం పుణ్యామ్ ఋషికాంతాం జనార్దన ॥ 34
ద్వారకామాత్మసాత్ కృత్వా సముద్రం గమయిష్యసి ।
గోపతి, తాలకేతువులు నీ చేతిలో చచ్చారు. జనార్దణా! పవిత్రమై, ఋషులకిష్టమై, భోగధనాలు కల ద్వారకను స్వాధీనం చేసికొని, చివరకు సముద్రంలో విలీనం చేస్తావు. (34 1/2)
న క్రోధో న చ మాత్సర్యం నానృతం మధుసూచన ।
త్వయి తిష్ఠతి దాశార్హ న నృశంస్యం కుతోఽనృజు ॥ 35
ఆసీనం చైత్యమధ్యే త్వాం దీప్యమానం స్వతేజసా ।
ఆగమ్య ఋషయః సర్వేఽయాచంతాభయమచ్యుత ॥ 36
మధుసూదనా! నీలో క్రోధం లేదు. మాత్సర్యం లేదు. అసత్యం లేదు. దాశార్హా! నీలో క్రూరత్వం లేదు. కుటిలత లేదు. అచ్యుతా! మందిరమధ్యంలో స్వతేజస్సుతో ప్రకాశిస్తున్న నిన్ను చేరి ఋషులందరూ అభయాన్ని కోరుతున్నారు. (35,36)
యుగాంతే సర్వభూతాని సంక్షిప్య మధుసూదన ।
ఆత్మ నైవాత్మసాత్ కృత్వా జగదాసీః పరంతప ॥ 37
మధుసూదనా! పరంతపా! ప్రలయకాలంలో సర్వభూతాలను సంక్షేపించి స్వయంగా జగత్తును ఆత్మస్వరూపంగా చేసికొని ఉంటావు. (37)
యుగాదౌ తవ వార్ ష్ణేయ నాభిపద్మాదజాయత ।
బ్రహ్మ ఉద్భవించాడు. చరాచరగురువైన ఆ బ్రహ్మ సృష్టియే ఈ జగత్తంతా. (38)
తం హంతుముద్యతౌ ఘోరౌ దానవౌ మధుకైటభౌ ।
తయోర్వ్యతిక్రమం దృష్ట్వా క్రుద్ధస్య భవతో హరేః ॥ 39
లలాటాజ్జాతవాన్ శంభుః శూలపాణిస్త్రిలోచనః ।
ఇత్థం తావపి దేవేశౌ త్వచ్ఛరీరసముద్భవౌ ॥ 40
నీ నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మను మధుకైటభులనే భయంకరదానవులు చంపడానికి ప్రయత్నించారు. వారి దారుణాన్ని చూసి కోపించి శ్రీహరి లలాటం నుండి శూలపాణి, త్రిలోచనుడూ అయిన శివుడు ఆవిర్భవించాడు. ఈ విధంగా బ్రహ్మ, శంకరులిరువురూ నీ శరీరం నుండి ఉద్భవించినవారే. (39,40)
త్వన్నియోగకరావేతౌ ఇతి మే నారదోఽబ్రవీత్ ।
తథా నారాయణ పురా క్రతుభిర్భూరిదక్షిణైః ॥ 41
ఇష్టవాంస్త్వం మహాసత్రం కృష్ణ చైత్రరథే వనే ।
నైవం పరే నాపరే వా కరిష్యంతి కృతాని వా ॥ 42
యాని కర్మాణి దేవ త్వం బాల ఏవ మహాబలః ।
కృతవాన్ పుండరీకాక్ష బలదేవసహాయవాన్ ।
కైలాసభవనే చాపి బ్రాహ్మణైర్న్యవసః సహ ॥ 43
వారిరువురూ నీ ఆజ్ఞను పాలించేవారే అని నారదుడు నాకు చెప్పాడు. నారాయణా! కృష్ణా! పూర్వం నీవు చైత్రరథవనంలో భూరిదక్షిణలతో మహాసత్రయాగాన్ని చేశావు. ఇతరులెవరూ ఈవిధంగా మునుపు చెయ్యలేదు. మున్ముందు చేయలేరు కూడ. దేవా! పుండరీకాక్షా! బాలుడవైనా నీవు మహాబ్లవంతుడవు. నిత్యం నీకు బలదేవుడు తోడుంటాడు. బాల్యంలో నీవు చేసిన పనులు ఎవరూ చేయలేరు. మునుపెవ్వరూ చెయ్యలేదు. నీవు బ్రాహ్మణులతో పాటుగ కైలాసపర్వతంపై కూడా నివసించావు. (41-43)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా మహాత్మానమ్ ఆత్మా కృష్ణస్య పాండవః ।
తూష్ణిమాసీత్ తతః పార్థమ్ ఇత్యువాచ జనార్దనః ॥ 44
వైశంపాయనుడిలా అన్నాడు. శ్రీకృష్ణుని ఆత్మ స్వరూపాన్ని అర్జునుడు ఆ మహాత్మునితో ఈ విధంగా చెప్పి ఊరకున్నాడు. అనంతరం జనార్దనుడు పార్థునితో ఇలా అన్నాడు. (44)
మమైవ త్వం తవైవాహం యే మదీయాస్తవైవ తే ।
యస్త్వాం దేష్టి స మాం ద్వేష్టి యస్త్వామను స మామను ॥ 45
పార్థా! నీవు నావాడవు. నేను నీవాడనే. నా వాళ్లంతా నీవాళ్లే. నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషించువాడే. నిన్ను అనుసరించేవాడు నన్ననుసరించువాడే ॥ (45)
నరస్త్వమసి దుర్ధర్ష హరిర్నారాయణో హ్యహమ్ ।
కాలే లోకమిమం ప్రాప్తౌ నరనారాయణావృషీ ॥ 46
దుర్ధర్షా! నీవు నరుడవు. నేను నారాయణుడనగు శ్రీకరిని. ఈ సమయంలో నరనారాయణ ఋషులైన మన మిరువురుమూ ఈ లోకంలోకి వచ్చాము. (46)
అనన్యః పార్థ మత్తస్త్వం త్వత్తశ్చాహం తథైవ చ ।
నావయోరంతరం శక్యం వేదితుం భరతర్షభ ॥ 47
పృథాతనయా! భరతశ్రేష్ఠా! నాకంటే నీవు అన్యుడవు కావు. నీకంటె నేను ఇతరుడను కాను. మన ఇద్దరికి భేదాన్ని తెలియడం శక్యంకాదు. (47)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తే తు వచనే కేశవేన మహాత్మనా ।
తస్మిన్ వీరసమావాయే సంరబ్ధేష్వథ రాజసు ॥ 48
ధృష్టద్యుమ్నముఖైర్వీరైః భ్రాతృభిః పరివారితా ।
పాంచాలీ పుండరీకాక్షమ్ ఆసీనం భ్రాతృభిః సహ ।
అభిగమ్యాబ్రవీత్ క్రుద్ధా శరణ్యం శరణైషిణీ ॥ 49
వైశంపాయనుడిలా అన్నాడు - మహాత్ముడైన కేశవుడు ఈ విధంగా చెప్పితే, వీరులైన ఆ రాజులంతా ఆశ్చర్యపోయారు. వీరులైన ధృష్టద్యుమ్నాది సోదరులతో కూడి ఉన్న పాంచాలి క్రుద్ధురాలై, తన సోదరులతో కూర్చొని ఉన్న పుండరీకాక్షుని సమీపించి, రక్షణను కోరుతూ రక్షకుడైన శ్రీవిష్ణునితో ఇలా అంది. (48,49)
ద్రౌపద్యువాచ
పూర్వే ప్రజాభిసర్గే త్వామ్ ఆహురేకం ప్రజాపతిమ్ ।
స్రష్టారం సర్వలోకానామ్ అసితో దేవలోఽబ్రవీత్ ॥ 50
ద్రౌపది ఇలా అంది - పూర్వకాలం ప్రజాసృష్టికి ప్రారంభంలో సర్వలోకాలను సృష్టించినది నీవే నని, నీవు ప్రజాపతి వని అసిత - దేవల మహర్షి చెప్పాడు. (50)
విష్ణుస్త్వమసి దుర్ధర్ష త్వం యజ్ఞో మధుసూదన ।
యష్టా త్వమసి యష్టవ్యః జామదగ్న్యో యథాబ్రవీత్ ॥ 51
మధుసూదనా! నీవు విష్ణుడవు. నీవే యజ్ఞానివి. యజమానుడవు నీవే. యజనయోగ్యుడవూ నీవే అని పరశురాముడు చెప్పాడు. (51)
ఋషయస్త్వాం క్షమమాహుః సత్యం చ పురుషోత్తమ ।
సత్యాద్ యజ్ఞోఽసి సంభూతః కశ్యపస్త్వాం యథాబ్రవీత్ ॥ 52
పురుషోత్తమా! ఋషులు నిన్ను సహనస్వరూపుడవని, సత్య స్వరూపుడవని చెపుతున్నారు. సత్యం నుండి ఏర్పడిన యజ్ఞస్వరూపుడవు నీవని కశ్యపుడు చెప్పాడు. (52)
సాధ్యానామపి దేవానాం శివానామీశ్వరేశ్వర ।
భూతభావన భూతేశ యథా త్వాం నారదోఽబ్రవీత్ ॥ 53
భూతభావనా! భూతేశా! సాధ్యదేవతలకు, కళ్యాణకారి రుద్రులకు నీవే అధీశ్వరుడవు అని నారదుడు చెప్పాడు. (53)
బ్రహ్మశంకరశక్రాద్యైః దైవవృందైః పునః పునః ।
క్రీడసే త్వం నరవ్యాఘ్ర బాలః క్రీడనకైరివ ॥ 54
నరవ్యాఘ్రా! బాలుడు ఆటవస్తువులతో ఆడుకొన్నట్లుగా, నీవు బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు మున్నగు దేవతా సమూహాలతో మళ్ళీ మళ్ళీ ఆడుకొంటూ ఉంటావు. (54)
ద్యౌశ్చ తే శిరసా వ్యాప్తా పద్భ్యాం చ పృథివీ ప్రభో ।
జఠరం త ఇమే లోకాః పురుషోఽసి సనాతనః ॥ 55
ప్రభూ! స్వర్గలోకం నీ శిరస్సుతో నిండిపోయింది. భూమి నీ పాదాలతో నిండిపోయింది. ఈ లోకాలన్నీ నీ ఉదరస్వరూపమైనవి. నీవు సనాతనపురుషుడవు. (55)
విద్యాతపోఽభితప్తానాం తపసా భావితాత్మనామ్ ।
ఆత్మదర్శనతృప్తానామ్ ఋషీణామసి సత్తమః ॥ 56
విద్య, తపస్సుల చేత మిక్కిలి తపించినవారు, తపస్సుచే పవిత్రమైన అంతఃకరణ కలవారు, ఆత్మదర్శనం చేత తృప్తినొందినవారు అయిన మహర్షులకు నీవు పరమశ్రేష్ఠుడవు. (లక్ష్యమగు సత్స్వరూపుడవు.) (56)
రాజర్షీణాం పుణ్యకృతామ్ ఆహవేష్వనివర్తినామ్ ।
సర్వధర్మోపపన్నానాం త్వం గతిః పురుషర్షభ ।
త్వం ప్రభుస్త్వం విభుశ్చ త్వం భూతాత్మా త్వం విచేష్టసే ॥ 57
పురుషశ్రేష్ఠా! యుద్ధంలో వెనుకడుగు వేయని పుణ్యాత్ములూ, సర్వధార్మికులూ అయిన రాజర్షులకు నీవే గతి (ప్రాప్యస్థానం). నీవే ప్రభుడవు. నీవు సర్వవ్యాపకుడవు. ప్రాణులన్నింటియందు చైతన్య స్వరూపుడవై సంచరిస్తున్నావు. (57)
లోకపాలాశ్చ లోకాశ్చ నక్షత్రాణి దిశో దశ ।
నభశ్చంద్రశ్చ సూర్యశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ ॥ 58
లోకాలు, లోకపాలురు, నక్షత్రాలు, పది దిక్కులు, ఆకాశం, సూర్యచంద్రులు అన్నీ నీయందే నిలిచి ఉన్నాయి. (58)
మర్త్యతా చైవ భూతానాం అమరత్వం దివౌకసామ్ ।
త్వయి సర్వం మహాబాహో లోకకార్యం ప్రతిష్ఠితమ్ ॥ 59
మహాబాహు! భూలోకంలోని ప్రాణులకు మరణ ధర్మం, స్వర్గలోకవాసులకు అమరత్వమూ, సమస్తజగత్కార్యమూ నీయందే నిలిచి ఉన్నాయి. (59)
సా తేఽహం దుఃఖమాఖ్యాస్యే ప్రణయాన్మధుసూచన ।
ఈశస్త్వం సర్వభూతానాం యే దివ్యా యే చ మానుషాః ॥ 60
మధుసూదనా! నీ పట్ల గల ప్రీతితో నేను నా కష్టాన్ని చెప్పుకొంటున్నాను. దివ్యులైన, మనుష్యులైన సర్వప్రాణులకు నీవే ఈశ్వరుడవు. (60)
కథం ను భార్యా పార్థానాం తా కృష్ణ సఖీ విభో ।
ధృష్టద్యుమ్నస్య భగినీ సభాం కృష్యేత మాదృశీ ॥ 61
భగవంతుడా! కృష్ణా! పాండవులకు భార్య, నీకు ఇష్టురాలు, ధృష్టద్యుమ్నుని సోదరి అయిన నావటి స్త్రీ సభకు ఎలా లాగబడింది? (61)
స్త్రీధర్మిణీ వేపమానా శోణితేన సముక్షితా ।
ఏకవస్త్రా వికృష్టాస్మి దుఃఖితా కురుసంసది ॥ 62
స్త్రీ సహజమైన ఋతుకాలంళో ఉన్న రక్తంతో తడిసిన ఏకవస్త్రనై, భయంతో కంపిస్తూ, దుఃఖిస్తూన్న నేను కురుసభలోకి బలాత్కారంగా లాక్కురాబడ్డాను. (62)
రాజ్ఞాం మధ్యే సభాయాం తు రజసాతిపరిప్లుతా ।
దృష్ట్వా చ మాం ధార్తరాష్ట్రాః ప్రాహసన్ పాపచేతసః ॥ 63
రాజులందరితో నిండిన సభలో రజస్స్రావంతో తడిసిన నన్ను చూసి పాపాత్ముడైన ధార్తరాష్ట్రులు బిగ్గరగా నవ్వారు. (63)
దాసీభావేన మాం భోక్తుమ్ ఈషుస్తే మధుసూదన ।
జీవత్సు పాండుపుత్రేషు పంచాలేషు చ వృష్ణిషు ॥ 64
మధుసూదనా! పాండుపుత్రులు, పాంచాలరాజులు, వృష్ణివంశీయులు జీవించి ఉండగానే ఆ ధృతరాష్ట్రపుత్రులు దాసీభావంతో నన్ను అనుభవించాలని కోరుకొన్నారు. (64)
నన్వహం కృష్ణ భీష్మస్య ధృతరాష్ట్రస్య చోభయోః ।
స్నుషా భవామి ధర్మేణ సాహం దాసీకృతా బలాత్ ॥ 65
శ్రీకృష్ణా! నేను భీష్మ ధృతరాష్ట్రులకు ధర్మసమ్మతమైన కోడలిని. అటువంటి నన్ను బలవంతంగా దాసిని చేశారు. (65)
గర్హయే పాండవాంస్త్వేవ యుధి శ్రేష్ఠాన్ మహాబలాన్ ।
యత్ క్లిశ్యమానాం ప్రేక్షంతే ధర్మపత్నీం యశస్వినీమ్ ॥ 66
యశస్విని అయిన తమ ధర్మపత్నిని శత్రువులు బాధిస్తూండగా చూస్తూ ఊరకున్న మహాబలవంతులు, యుద్ధంలో నిపుణులూ అయిన ఈ పాండవులనే నేను నిందిస్తున్నాను. (66)
ధిగ్ బలం భీమసేనస్య ధిక్ పార్థస్య చ గాండివమ్ ।
యౌ మాం విప్రకృతాం క్షుదైః మర్షయేతాం జనార్దన ॥ 67
జనార్దనా! నీచులైన ధార్తరాష్ట్రులు నన్ను అవమానిస్తున్నా సహిస్తూ కూర్చున్న ఈ భీమసేనుని బలమూ, ఈ అర్జునుని గాండివమూ వ్యర్థమే. (67)
శాశ్వతోఽయం ధర్మపథః సద్భిరాచరితః సదా ।
యద్ భార్యాం పరిరక్షంతి భర్తారోఽల్పబలా అపి ॥ 68
తాము తక్కువ బలం కల వారైనప్పటికీ, భార్యను రక్షించడం అనేది ఎల్లప్పుడూ సత్పురుషులైన భర్తలు ఆచరించే శాశ్వతమైన ధరమార్గం. (68)
భార్యాయాం రక్ష్యమాణాయాం ప్రజా భవతి రక్షితా ।
ప్రజాయాం రక్ష్యమాణాయామ్ ఆత్మా భవతి రక్షితః ॥ 69
భార్యను రక్షిస్తే సంతానం సురక్షితంగా ఉంటుంది. సంతానాన్ని రక్షిస్తే, తాను సురక్షితంగా ఉంటాడు. (69)
ఆత్మా హి జాయతే తస్యాం తస్మాజ్జాయా భవత్యుత ।
భర్తా చ భార్యయా రక్ష్యః కథం జాయాన్మమోదరే ॥ 70
తానే (భర్తే) భార్యయందు జన్మిస్తాడు. అందుకే ఆమెను 'జాయా' అని అంటారు. భార్య కూడా భర్తను రక్షించాలి. కాకుంటే అతడు ఆమె యందు ఎలా పుడతాడు? (70)
నన్విమే శరణం ప్రాప్తం న త్యజంతి కదాచన ।
తే మాం శరణమాపన్నాం నాన్వపద్యంత పాండవాః ॥ 71
ఈ పాండవులు తమను శరణుజొచ్చిన వారినెవ్వరినీ ఎప్పుడూ కాదని విడిచిపెట్టటం లేదు. కాని శరణాగతురాలనైన నాపట్ల మాత్రం దయ చూపలేదు. (71)
పంచభిః పతిభిర్జాతాః కుమారా మే మహౌజసః ।
ఏతేషామప్యవేక్షార్థం త్రాతవ్యాస్మి జనార్దన ॥ 72
జనార్దనా! నా ఈ ఐదుగురు భర్తల వల్ల మహాతేజస్వులైన ఐదుగురు కుమారులు పుట్టారు. వారిని చూడటం కొరకైనా వీరు నన్ను రక్షించాలి. (72)
ప్రతివింధ్యో యుధిష్ఠిరాత్ సుతసోమో వృకోదరాత్ ।
అర్జునాచ్ఛ్రుతకీర్తిశ్చ శతానీకస్తు నాకులిః ॥ 73
కనిష్ఠాచ్ఛ్రుతకర్మా చ సర్వే సత్యపరాక్రమాః ।
ప్రద్నుమ్నో యాదృశః కృష్ణ తాదృశాస్తే మహారథాః ॥ 74
కృష్ణా! యుధిష్ఠిరుని వల్ల ప్రతివింధ్యుడు, వృకోదరుని వల్ల, సుతసోముడు, అర్జునుని వల్ల శ్రుతకీర్తి, నకులుని వల్ల శతానీకుడు, సహదేవుని వల్ల శ్రుతకర్మ జన్మించారు. వీరంతా సత్యపరాక్రములు - నీకు ప్రద్యుమ్నుడు ఎట్టివాడో, మహారథులైన వీరంతా కూడ అట్టివారే. (73,74)
నన్విమే ధనుషి శ్రేష్ఠాః అజేయా యుధి శాత్రవైః ।
కిసుర్థం ధార్తరాష్ట్రాణాం సహంతే దుర్బలీయసామ్ ॥ 75
వీరంతా ధనుర్విద్యలో శ్రేష్ఠులు. యుద్ధంలో శత్రువులచే జయింపశక్యంగాని వారూను. దుర్బలులైన ధార్తరాష్ట్రులను ఎందుకు సహిస్తున్నారు? (75)
అధర్మేణ హృతం రాజ్యం సర్వే దాసః కృతాస్తథా ।
సభాయాం పరికృష్టాహమ్ ఏకవస్త్రా రజస్వలా ॥ 76
వారు అధర్మంగా రాజ్యాన్ని అపహరించారు. వీరందర్నీ దాసులుగా చేసికొన్నారు. రజస్వలనై ఏకవస్త్రగా ఉన్న నన్ను సభలోకి ఈడ్చుకొని వచ్చారు. (76)
వాధిజ్యమపి యచ్ఛక్యం కర్తుమన్యేన గాండివమ్ ।
అన్యత్రార్జునభీమాభ్యాం త్వయా వా మధుసూదన ॥ 77
మధుసూదనా! అర్జునుని గాండీవాన్ని నీవు, భీమార్జునులు తప్ప, వేరొకరెవరూ కనీసం ఎక్కుపెట్టలేరుకదా! అయినా మీరు నన్ను రక్షించటం లేదు. (77)
ధిగ్ బలం భీమసేనస్య ధిక్ పార్థస్య చ పౌరుషమ్ ।
యత్ర దుర్యోధనః కృష్ణ ముహూర్తమపి జీవతి ॥ 78
కృష్ణా! ఇంకా దుర్యోధనుడు జీవించి ఉన్నాడంటే అది భీమసేనుని బలానికే అవమానం. పార్థుని పౌరుషానికే అవమానం. (78)
య ఏతానాక్షిపద్ రాష్ట్రాత్ సహ మాత్రావిహింసకాన్ ।
అధీయానాన్ పురా బాలాన్ వ్రతస్థాన్ మధుసూదన ॥ 79
మధుసూదనా! మునుపు బాల్యంలో బ్రహ్మచర్యవ్రతం పాటిస్తూ అధ్యయనం చేస్తూ ఎవరినీ హింసించని ఈ పాండవులను తల్లితో పాటుగా రాజ్యం నుండి బయటకి పంపించారు. (79)
భోజనే భీమసేనస్య పాపః ప్రాక్షేపయద్ విషమ్ ।
కాలకూటం నవం తీక్ష్ణం సంభూతం లోమహర్షణమ్ ॥ 80
పాపాత్ముడైన దుర్యోధనుసు భీమసేనుని భోజనంలో నూతనమై, తీక్ష్ణమై, రోమాంచకమైన కాలకూటవిషాన్ని ఎక్కువ పరిమాణంలో కలిపి చంపబోయారు. (80)
తజ్జీర్ణమవికారేణ సహాన్నేన జనార్దన ।
సశేషత్వాన్మహాబాహో భీమస్య పురుషోత్తమ ॥ 81
జనార్దనా! పురుషోత్తమా! మహాబాహూ! భీమసేనుడికి ఆయుర్దాయం ఉండటం వల్ల, ఆ విషాన్నం జీర్ణం చేసుకొని ఎటువంటి వికారాన్ని పొందలేదు. (81)
ప్రమాణకోట్యాం విశ్వస్తం తథా సుప్తం వృకోదరమ్ ।
బద్ధ్వైనం కృష్ణ గంగాయాం ప్రక్షిప్య పురమావ్రజత్ ॥ 82
కృష్ణా! ప్రమాణకోటి తీర్థంలో ప్రమాదరహితమనే విశ్వాసంతో నిద్రిస్తూన్న భీమసేనుని బంధించి గంగానదిలోకి విసిరి, ఈ దుర్యోధనుడు హస్తినపురానికి వెళ్ళిపోయాడు. (82)
యదా విబుద్ధః కౌంతేయః తదా సంఛిద్య బంధనమ్ ।
ఉదతిష్ఠన్మహాబాహుః భీమసేనో మహాబలః ॥ 83
ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ, మెలకువ వచ్చాక భీముడు తన బంధాలను త్రెంచుకొని బయటపడ్డాడు. (83)
ఆశీవిషైః కృష్ణసర్పైః భీమసేన మదంశయత్ ।
సర్వేష్వేవాంగదేశేషు న మమార చ శత్రుహా ॥ 84
(నిద్రిస్తున్న) భీమసేనుని సర్వావయవాల మీద ప్రాణాంతకయిన విషం గలిగిన కృష్ణసర్పాలచేత కరిపించాడు. అయినప్పటికీ శత్రుహంతకుడైన బీమసేనుడు మరణించలేదు. (84)
ప్రతిబుద్ధస్తు కౌంతేయః సర్వాన్ సర్పానపోథయత్ ।
సారథిం చాస్య దయితమ్ అపహస్తేన జఘ్నివాన్ ॥ 85
నిద్ర నుండి మేల్కొన్న భీమసేనుడు ఆ సర్పాలన్నింటిని విసిరికొట్టాడు. దుర్యోధనుడు భీమునికిష్టుడైన సారథిని కూడ తన పెడచేతితో చంపాడు. (85)
పునః సుప్తానుపాధాక్షీద్ బాలకాన్ వారణావతే ।
శయానానార్యయా సార్థం కో ను తత్ కర్తుమర్హతి ॥ 86
ఇంకా, వారణావతంలో తల్లితోపాటుగ ఈ పాండవులు నిద్రిస్తూండగా, ఆ ఇంటికి నిప్పుపెట్టారు. దుర్మార్గుడైన దుర్యోధనుడు కాక, వేరొకడెవడు ఇంతటి దుష్కృత్యాన్ని చేయగలడు? (86)
యత్రార్యా రుదతీ భీతా పాండవానిదమబ్రవీత్ ।
మహద్ వ్యసనమాపన్నా శిఖినా పరివారితా ॥ 87
ఆ సమయంలో పూజ్యురాలైన కుంతి ఏడుస్తూ పాండవులతో 'పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాం, అగ్ని ఇంటి చుట్టూ వ్యాపించింది.' అని విలపించింది. (87)
హా హతాస్మి కుతో న్వద్య భవేచ్ఛాంతిరిహానలాత్ ।
అనాథా వినశిష్యామి బాలకైః పుత్రకైః సహ ॥ 88
'అయ్యో! చచ్చాను. ఈ అగ్ని ఎలా చల్లారుతుంది? అనాథ అయిన నేను ఈ పిల్లలతో బాటుగా మరణిస్తాను' అని అనుకొంది. (88)
తత్ర భీమో మహాబాహుః వాయువేగపరాక్రమః ।
ఆర్యామాశ్వాసయామాస భ్రాతౄంశ్చాపి వృకోదరః ॥ 89
వైనతేయో యథా పక్షీ గరుత్మాన్ పతతాం వరః ।
తథైవాభిపతిష్యామి భయం వో నేహ విద్యతే ॥ 90
అపుడు వాయువేగం వంటి పరాక్రమం గల మహాబాహువైన వృకోదరుడు తన తల్లిని, సోదరులను ఊరడించాడు. 'పక్షిరాజైన గరుత్మంతునిలా నేను ఎగురుతాను. మీరు భయపడవద్దు' అన్నాడు. (89,90)
ఆర్యామంకేన వామేన రాజానం దక్షిణేన చ ।
అసంయోశ్చ యమౌ కృత్వా పృష్ఠే బీభత్సుమేవ చ ॥ 91
సహసోత్పత్య వేగేన సర్వానాదాయ వీర్యవాన్ ।
భ్రాతౄనార్యాం చ బలవాన్ మోక్షయామాస పావకాత్ ॥ 92
ఇలా చెప్పి కుంతిని ఎడమతొడమీద, ధర్మరాజును కుడితొడమీద, నకులసహదేవులను, భుజాల మీద, అర్జునుని నడ్డిమీద ఉంచుకొని తేజస్వి, బలవంతుడూ అయిన భీమసేనుడు ఒకసారిగా ఎగిరి ఆ అగ్నినుండి తల్లిని, సోదరులను రక్షించాడు. (91,92)
తే రాత్రౌ ప్రస్థితాః సర్వే సహ మాత్రా యశస్వినః ।
అభ్యగచ్ఛన్మహారణ్యే హిడింబవనమంతికాత్ ॥ 93
ఆ విధంగా అగ్నిప్రమాదం నుండి బయటపడ్డ పాండవులు తల్లితో పాటు బయలుదేరి ఆ రాత్రి మహారణ్యంలో నడుస్తూ హిడింబ వనం దగ్గరకు వెళ్ళారు. (93)
శ్రాంతాః ప్రసుప్తాస్తత్రేమే మాత్రా సహ సుదుఃఖితాః ।
సుప్తాంశ్చైనానభ్యగచ్ఛద్ హిడింబా నామ రాక్షసీ ॥ 94
అప్పటికి అలసిపోయి మిక్కిలి కష్టంలో ఉన్న పాండవులు తల్లితోపాటుగా అక్కడ నిద్రించారు. అలా నిద్రిస్తున్నవారి దగ్గరకి హిడింబ అనే రాక్షసి వచ్చింది. (94)
సా దృష్ట్వా పాండవాంస్తత్ర సుప్తాన్ మాత్రా సహ క్షితౌ ।
హృచ్ఛయేనాభిభూతాత్మా భీమసేనమకామయత్ ॥ 95
నేలపై తల్లితో పాటుగా నిద్రిస్తున్న పాండవులను చూసి, మదనపీడితయై భీమసేనుని కామించింది. (95)
భీమస్య పాదౌ కృత్వా తు స్వ ఉత్సంగే తతోఽబలా ।
పర్యమర్దత సంహృష్టా కల్యాణీ మృదుపాణినా ॥ 96
అటుపై ఆమె భీమునిపాదాలను తన ఒడిలో ఉంచుకొని ఆనందించి తను మృదువైన చేతితో పాదాలను ఒత్తింది. (96)
తామబుధ్యదమేయాత్మా బలవాన్ సత్యవిక్రమః ।
పర్యపృచ్ఛత తాం భీమః కిమిహేచ్ఛస్యనిందితే ॥ 97
ఆమె స్పర్శకు బలవంతుడు, సత్యవిక్రముడు, సాటిలేని రూపము గల భీమసేనుడు మేల్కొని 'సుందరీ! నీకిక్కడ ఏం కావాలి? అని ఆమెను అడిగాడు. (97)
ఏవముక్తా తు భీమేన రాక్షసీ కామరూపిణీ।
భీమసేనం మహాత్మానమ్ ఆహ చైవమనిందితా ॥ 98
భీముడీవిధంగా అడగ్గా, కామరూపిణి అయిన ఆ రాక్షసి మహాత్ముడైన భీమసేనునితో ఇలా అంది. (98)
పలాయధ్వమితః క్షిప్రం మమ భ్రాతైష వీర్యవాన్ ।
ఆగమిష్యతి వో హంతుం తస్మాద్ గచ్ఛత మా చిరమ్ ॥ 99
'తొందరగా ఇక్కడ నుండి పారిపొండి, నా సోదరుడు చాల బలవంతుడు. మిమ్మల్ని చంపడానికి అతడు వస్తాడు. అందువల్ల వెళ్ళండి. ఆలస్యం చేయకండి'. (99)
అథ భీమోఽభ్యువాచైనాం సాభిమానమిదం వచః ।
నోద్విజేయమహం తస్మాద్ నిహనిష్యేఽహమాగతమ్ ॥ 100
ఆ మాటలు విన్న భీముడు అభిమానపూర్వకంగా ఇలా చెప్పాడు. - 'నేను భయపడను. ఆ రాక్షసుడిక్కడకు వస్తే, నేనే అతనిని చంపుతాను'. (100)
తయోః శ్రుత్వా తు సంజల్పమ్ ఆగచ్ఛద్ రాక్షసాధమః ।
భీమరూపో మహానాదాన్ విసృజన్ భీమదర్శనః ॥ 101
వారి సంభాషణ విని, చూడ్డానికి భయంకరంగా ఉన్న ఆ రాక్షసాధముడు భయంకరమైన రూపంతో బిగ్గరగా అరుస్తూ అక్కడకి వచ్చాడు. (101)
రాక్షస ఉవాచ
కేన సార్థం కథయసి ఆనయైనం మమాంతికమ్ ।
హిడింబే భక్షయిష్యామః న చిరం కర్తుమర్హసి ॥ 102
రాక్షసుడిలా అన్నాడు - 'హిడింబా! నీవెవరితో మాట్లాడుతున్నావు? అతనిని నా దగ్గరకి తీసికొనిరా. మనం తిందాం. ఇక ఆలస్యం చేయవద్దు'. (102)
సా కృపాసంగృహీతేన హృదయేన మనస్వినీ ।
నైనమైచ్ఛత్ తదాఖ్యాతుమ్ అనుక్రోశాదనిందితా ॥ 103
మంచి మనస్సుతో ఆమె దయతో భీమునిపట్ల ప్రేమ వల్ల ఆ మాటలను చెప్పాలని భావించలేదు. (103)
స నాదాన్ వినదన్ ఘోరాన్ రాక్షసః పురుషాదకః ।
అభ్యద్రవత వేగేన భీమసేనం తదా కిల ॥ 104
అపుడు నరభక్షుకుడైన ఆ రాక్షసుడు ఘోరమైన గర్జనలు చేస్తూ వేగంగా భీమసేనుడి దగ్గరకు వచ్చాడు. (104)
తమభిద్రుత్య సంక్రుద్ధః వేగేన మహతా బలీ ।
అగృహ్ణాత్ పాణినా పాణిం భీమసేనస్య రాక్షసః ॥ 105
ఇంద్రాశనిసమస్పర్శం వజ్రసంహననం దృఢమ్ ।
సంహత్య భీమసేనాయ వ్యాక్షిపత్ సహసా కరమ్ ॥ 106
క్రుద్ధుడైన ఆ రాక్షసుడు వేగంగా వచ్చి తన ఒక చేతితో బీమసేనుడి చేతిని పట్టుకొన్నాడు. ఇంద్రుని వజ్రాయుధంతో సమంగా దృఢంగా ఉన్న భీముని పిడికిలితో ఆ రాక్షసుడు ఒక్క గుద్దు గుద్దాడు. (105,106)
గృహీతం పాణినా పాణిం భీమసేనస్య రక్షసా ।
నామృష్యత మహాబాహుః తత్రాక్రుధ్యద్ వృకోదరః ॥ 107
రాక్షసుడు తన చేతిని గట్టిగా పట్టిలాగడం భీముడు సహింపలేకపోయాడు. వృకోదరుడు క్రోధోద్రిక్తుడయ్యాడు. (107)
తదాఽఽసీత్ తుములం యుద్ధం భీమసేనహిడింబయోః ।
సర్వాస్త్రవిదుషోర్ఘోరం వృత్రవాసవయోరివ ॥ 108
అపుడు అన్ని అస్త్రశస్త్రాలలోనూ ఆరితేరిన ఆ హిడింబ భీమసేనులకు వృత్రాసురదేవేంద్రులకు వలె భయంకరమైన గొప్ప యుద్ధం జరిగింది. (108)
విక్రీడ్య సుచిరం భీమః రాక్షసేన సహానఘ ।
నిజఘాన మహావీర్యః తం తదా నిర్బలం బలీ ॥ 109
అనఘా! శ్రీకృష్ణా! మహాపరాక్రమవంతుడు, బలవంతుడూ అయిన భీముడు చాలాసేపు ఆ రాక్షసునితో రణక్రీడలాడి, చివరకు నిర్బలుడైన అతనిని సంహరించాడు. (109)
హత్వా హిడింబం భీమోఽథ ప్రస్థితో భ్రాతృభిః సహ ।
హిడింబామగ్రతః కృత్వా యస్యాం జాతో ఘటోత్కచః ॥ 110
ఈ విధంగా హిడింబుని చంపిన తర్వాత భీముడు హిడింబను స్వీకరించి, తన సోదరులతో పాటుగా అక్కడ నుండి బయలుదేరాడు. అనంతరం హిడింబకు ఘటోత్కచుడు జన్మించాడు. (110)
తతః సంప్రాద్రవన్ సర్వే సహ మాత్రా పరంతపాః ।
ఏకచక్రామభిముఖాః సంవృతాః బ్రాహ్మణవ్రజైః ॥ 111
అనంతరం శత్రుసంతాపకులైన పాండవులంతా తల్లితోపాటుగ బ్రాహ్మణసమూహాలుండే ఏకచక్రపురం వైపుకు వెళ్ళసాగారు. (111)
ప్రస్థానే వ్యాస ఏషాం చ మంత్రీ ప్రియహితే రతః ।
తతోఽగచ్ఛన్నేకచక్రాం పాండవాః సంశితవ్రతాః ॥ 112
వారు వెళ్ళేటపుడు వారి ప్రియాన్ని హితాన్నీ కోరుకొనే వ్యాసమహర్షి వారిని పరామర్శించాడు. అనంతరం పాండవులు కఠినమైన నియమాల్ని పాటిస్తూ ఏకచక్రాపురానికి వెళ్లారు. (112)
తత్రాప్యాసాదయామాసుః బకం నామ మహాబలమ్ ।
పురుషాదం ప్రతిభయం హిడింబేనైవ సమ్మితమ్ ॥ 113
అక్కడ కూడా బకుడనే పేరుగల మహాబలవంతుడు, హిడింబునితో సమానమైన భయంకరుడూ, నరభక్షకుడూ అయిన రాక్షసుని గురించి తెలుసుకొన్నారు. (113)
తం చాపి వినిహత్యోగ్రం భీమః ప్రహారతాం వరః ।
సహితో భ్రాతృభిః సర్వైః ద్రుపదస్య పురం యయౌ ॥ 114
యోధులలో శ్రేష్ఠుడైన భీముడు భయంకరుడైన ఆ రాక్షసుని చంపి సోదరులందరితో పాటు ద్రుపదుని నగరానికి వెళ్లాడు. (114)
లబ్ధాహమపి తతైవ వసతా సవ్యసాచినా ।
యథా త్వయా జితా కృష్ణ రుక్మిణీ భీష్మకాత్మజా ॥ 115
కృష్ణా! భీష్మకమహారాజు కూతురైన రుక్మిణిని నీవు జయించుకొన్నట్లుగానే అక్కడే ఉంటూన్న సవ్యసాచి అర్జునుడు నన్ను జయించుకొన్నాడు (పొందాడు. (115)
ఏవం సుయుద్ధే పార్థేన జితాహం మధుసూదన ।
స్వయంవరే మహత్ కర్మ కృత్వా న సుకరం పరైః ॥ 116
మధుసూదనా! ఈ విధంగా అర్జునుడు ఇతరులెవ్వరికీ సుకరం కాని గొప్పపని చేసి, గొప్పయుద్ధం చేసి స్వయంవరంలో నన్ను గెలుచుకొన్నాడు. (116)
ఏవం క్లేశైః సుబహుభిః క్లిశ్యమానా సుదుఃఖితా ।
నివసామ్యార్యయా హీనా కృష్ణ ధౌమ్యపురఃసరా ॥ 117
కానీ ఇపుడు కృష్ణా! ఈ విధంగా అనేక కష్టాలను అనుభవిస్తూ, దుఃఖిస్తూ పూజ్యురాలైన కుంతితోడు కూడా లేకుండా ధౌమ్యుని ముందుంచుకొని వనంలో నివసిస్తున్నాను. (117)
త ఇమే సింహవిక్రాంతాః వీర్యేణాభ్యధికాః పరైః ।
విహీనైః పరిక్లిశ్యంతీం సముపైక్షంత మాం కథమ్ ॥ 118
సింహవిక్రములై, శత్రువుల కంటె మిక్కిలి బలం కల వీరు, నీచులైన శత్రువులు నన్ను అవమానిస్తూండగా, ఉపేక్షించి ఎలా ఉన్నారు? (118)
ఏతాదృశాని దుఃఖాని సహంతీ దుర్బలీయసామ్ ।
దీర్ఘకాలం ప్రదీప్తాస్మి పాపానాం పాపకర్మణామ్ ॥ 119
పాపకర్ములై, దుర్బలులైన శత్రువుల వల్ల ఇటువంటి దుఃఖాలను సహిస్తూ, చాలకాలంగా చింతాగ్నితో రగిలిపోతున్నాను. (119)
కులే మహతి జాతాస్మి దివ్యేన విధినా కిల ।
పాండవానాం ప్రియా భార్యా స్నుషా పాండోర్మహాత్మనః ॥ 120
దివ్యమైన యజ్ఞవిధిచే గొప్పవంశంలో జన్మించిన దాన్ని కదా! పాండవులకు ప్రియమైన భార్యను పాండు మహారాజునకు కోడలను గదా! (120)
కచగ్రహమనుప్రాప్తా సాస్మి వరా సతీ ।
పంచానాం పాండుపుత్రాణాం ప్రేక్షతాం మధుసూదన ॥ 121
మధుసూదనా! కృష్ణా! అటువంటి ఉత్తమసాధ్వినయిన నన్ను పంచ పాండవులు చూస్తూండగా జుట్టుపట్టి లాగారు. (121)
ఇత్యుక్త్వా ప్రారుదత్ కృష్ణా ముఖం ప్రచ్ఛాద్య పాణినా ।
పద్మకోశప్రకాశేన మృదునా మృదుభాషిణీ ॥ 122
అని చెప్పి, మృదువుగా మాట్లాడే ద్రౌపది తామరపువ్వులా ప్రకాశించే తన చేతితో ముఖాన్ని కప్పుకొని ఏడవసాగింది. (122)
స్తనావపతితౌ పీనౌ సుజాతౌ శుభలక్షణౌ ।
అభ్యవర్షత పాంచాలీ దుఃఖజైరశ్రుబిందుభిః ॥ 123
పాంచాలరాజకుమారి ద్రౌపది సుందరాలై, శుభలక్షణాలు గల వక్షోజాలపై దుఃఖంతో కన్నీటి బిందువులను వర్షింపసాగింది. (123)
చక్షుషీ పరిమార్జంతీ నిఃశ్వసంతీ పునః పునః ।
బాష్పపూర్ణేన కంఠేన క్రుద్ధా వచనమబ్రవీత్ ॥ 124
తన కళ్ళను తుడుచుకొంటూ, మాటిమాటికీ నిట్టూరుస్తూ, క్రుద్ధురాలై దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో ఇలా మాట్లాడింది. (124)
నైవ మే పతయః సంతి న పుత్రా న చ్ బాంధవాః ।
న భ్రాతరో న చ పితా నైవ త్వం మధుసూదన ॥ 125
మధుసూదనా! (నన్ను రక్షించడం కొరకు) నా కొరకు నా భర్తలు లేరు, పుత్రులు లేరు, బంధువులూ లేరు, సోదరులూ లేరు, నా తండ్రి కూడా లేడు, నీవు కూడా లేవు. (125)
యే మాం విప్రకృతాం క్షుద్రైః ఉపేక్షధ్వం విశోకవత్ ।
న చ మే శామ్యతే దుఃఖం కర్ణో యత్ ప్రాహసత్ తదా ॥ 126
ఆ నీచులు నన్ను అవమానిస్తూంటే, ఏ మాత్రం దుఃఖం లేనివారిలా, వీళ్ళంతా నన్ను ఉపేక్షించారు. అపుడు నన్ను చూసి కర్ణుడు నవ్వాడు. దాని వల్ల కలిగిన దుఃఖం నా హృదయంలో ఇంకా శాంతించలేదు. (126)
చతుర్భిః కారణైః కృష్ణ త్వయా రక్ష్యాస్మి నిత్యశః ।
సంబంధాద్ గౌరవాత్ సఖ్యాత్ ప్రభుత్వేనైవ కేశవ ॥ 127
కృష్ణా! కేశవా! నీకు నాతో ఉన్న బంధుత్వం, నా పుట్టుకపై నీకున్న గౌరవం, నీపై నాకున్న సఖ్యభక్తి రక్షింపగల సామర్థ్యం - ఈ నాలుగు కారణాల చేత నీవు నన్నెపుడూ రక్షిస్తూ ఉన్నావు. (127)
వైశంపాయన ఉవాచ
అథ తామబ్రవీత్ కృష్ణః తస్మిన్ వీరసమాగమే ।
వైశంపాయనుడిలా అన్నాడు.
జనమేజయా! ఆ వీరుల సమూహంలో శ్రీకృష్ణుడు ఆమెతో ఇలా అన్నాడు. (127 1/2)
వాసుదేవ ఉవాచ
రోదిష్యంతి స్త్రియో హ్యేవం యేషాం క్రుద్ధాసి భావిని ।
భీభత్సుశరసంఛన్నాన్ శోణితౌఘపరిప్లుతాన్ ॥ 128
నిహతాన్ వల్లభాన్ వీక్ష్య శయానాన్ వసుధాతలే ।
యత్ సమర్థం పాండవానాం తత్ కరిష్యామి మా శుచః ॥ 129
వాసుదేవుడిలా అన్నాడు - భావినీ! నీవు ఎవరి పట్ల కోపంగా ఉన్నావో, వారంతా అర్జునుని బాణాల దెబ్బలకు నేలకొరుగుతారు. వారి స్త్రీలు రక్తపు మడుగులో చచ్చిపడి ఉన్న తమ భర్తలను చూసి ఈ విధంగానే ఏడుస్తారు. పాండవుల కొరకు చేయవలసినదంతా చేస్తాను. నీవు దుఃఖించకు. (128,129)
సత్యం తే ప్రతిజానామి రాజ్ఞాం రాజ్ఞీ భవిష్యసి ।
పతేద్ ద్యౌర్హిమవాన్ శీర్యేత్ పృథివీ శకలీభవేత్ ॥ 130
శుష్యేత్ తోయనిధిః కృష్ణే న మే మోఘం వచో భవేత్ ।
తచ్ఛ్రుత్వా ద్రౌపదీ వాక్యం ప్రతివాక్యమథాచ్యుతాత్ ॥ 131
సాచీకృతమవేక్షత్ సా పాంచాలీ మధ్యమం పతిమ్ ।
ఆబభాషే మహారాజ ద్రౌపదీమర్జునస్తదా ॥ 132
ద్రౌపదీ! నేను నీకు నిజంగా మాట ఇస్తున్నాను. నీవు ఈ రాజులకు మహారాజ్ఞివి అవుతవు. ఆకాశం క్రింద పడినా, హిమవత్పర్వతం కరిగిపోయినా, భూమి ముక్కలైనా, సముద్రాలు ఇంకిపోయినా నా మాట
వృథా కాదు. మహారాజా! తనమాటలకు సమాధానంగా కృష్ణుడు ఆ విధంగా అంటే విని, ద్రౌపది తన భర్తల మధ్యలో ఉన్న అర్జునుని వైపు ఓరకంట చూసింది. అపుడు అర్జునుడు ద్రౌపదితో ఇలా అన్నాడు. (130-132)
మా రోదీః శుభతామ్రాక్షి యదాహ మధుసూదనః ।
తథా తద్ భవితా దేవి నాన్యథా వరవర్ణిని ॥ 133
శుభంకరమగు ఎర్రని కన్నులు కల వరవర్ణినీ! ఏడవవద్దు. మధుసూదనుడు చెప్పినట్లుగానే తప్పక జరుగుతుంది. మరొకలా జరుగదు. (133)
ధృష్టద్యుమ్న ఉవాచ
అహంద్రోణం హనిష్యామి శిఖండీ తు పితామహమ్ ।
దుర్యోధనం భీమసేనః కర్ణం హంతా ధనంజయః ॥ 134
రామకృష్ణౌ వ్యపాశ్రిత్య అజేయాః స్మ రణే స్వసః ।
అపి వృత్రహణా యుద్ధే కిం పునర్ధృతరాష్ట్రజే ॥ 135
ధృష్టద్యుమ్నుడు ఇలా అన్నాడు - నేను ద్రోణుని చంపుతాను. శిఖండి భీష్మపితామహుని చంపుతాడు. భీమసేనుడు దుర్యోధనుని చంపుతాడు. అర్జునుడు కర్ణుని చంపుతాడు. సోదరీ! బలరామకృష్ణుల నాశ్రయించి, యుద్ధంలో మనం అజేయులంగా ఉంటాం. యుద్ధంలో ఇంద్రుడే మనల్ని ఓడించలేడు. ఇక దుర్యోధనుడెంత? (134,135)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్తేఽభిముఖా వీరాః వాసుదేవముపాస్థితాః ।
తేషాం మధ్యే మహాబాహుః కేశావో వాక్యమబ్రవీత్ ॥ 136
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! ధృష్టద్యుమ్నుడిలా అనగానే, పాండవీరులంతా శ్రీకృష్ణుని వైపుకి తిరిగారు. వారందరిలో ఉన్న శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. (136)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి ద్రౌపద్యాశ్వాసనే ద్వాదశోఽధ్యాయః ॥ 12 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమనమను ఉపపర్వమున
ద్రౌప్ద్యాశ్వాసనమను పన్నెండవ అధ్యాయము. (12)