13. పదమూడవ అధ్యాయము.
ద్యూతసమయమున తాను రాకపోవుటకు శ్రీకృష్ణుడు కారణము చెప్పుట.
వాసుదేవ ఉవాచ
నైతత్ కృచ్ఛ్రమనుప్రాప్తః భవాన్ స్యాద్ వసుధాధిప ।
యద్యహం ద్వారకాయాం స్యాం రాజన్ సంనిహతః పురా ॥ 1
వాసుదేవుడు ఇలా అన్నాడు - రాజా! నేను నీకు దగ్గరలో ద్వారకలోనే ఉండి ఉంటే నీవింత కష్టం పొంది ఉండే వాడివికాదు. (1)
ఆగచ్ఛేయమహం ద్యూతం అనాహుతోఽపి కౌరవైః ।
ఆంబికేయేన దుర్ధర్ష రాజ్ఞా దుర్యోధనేన చ ।
వారయేయమహం ద్యూతం బహూన్ దోషాన్ ప్రదర్శయన్ ॥ 2
కౌరవులు, ధృతరాష్ట్రుడు, రాజైన దుర్యోధనుడు నన్ను పిలవకున్నా, నేను వచ్చి ఉండేవాడిని. జూదం వల్ల కలిగే దోషాల్ని చూపించి, ఆ జూదాన్ని ఆపేవాడిని. (2)
భీష్మద్రోణా సమానాయ్య కృపం బాహ్లీకమేవ చ ।
వైచిత్రవీర్యం రాజానమ్ అలం ద్యూతేన కౌరవ ॥ 3
పుత్రాణాం తవ రాజేంద్ర త్వన్నిమిత్తమితి ప్రభో ।
తత్రాచక్షమహం దోషాన్ యైర్భవాన్ వ్యతిరోపితః ॥ 4
రాజా! నేను మీకోసం భీష్మ, ద్రోణ, కృప, బాహ్లీక, ధృతరాష్ట్రులను రప్పించి 'రాజేంద్రా! నీపుత్రులు జూదం ఆడరాదు' అని చెప్పేవాణ్ణి. జూదం వల్ల కలిగే అనర్థాలను చెప్పేవాణ్ణి. ఆ జూదం కారణంగానే మీరు రాజ్యహీనులయ్యారు. (3,4)
వీరసేనసుతో యైస్తు రాజ్యాత్ ప్రభంశితః పురా ।
ఆతర్కితవినాశశ్చ దేవనేన విశాంపతే ॥ 5
ఆ ద్యూత దోషాల వల్లనే పూర్వకాలంలో వీరసేనపుత్రుడైన నలమహారాజు రాజ్యభ్రష్టుడయ్యాడు. నరేశ్వరా! ఈ జూదం కారణంగా ఊహించని వినాశం కలుగుతుంది. (5)
సాతత్యం చ ప్రసంగస్య వర్ణయేయం యథాతథమ్ ॥ 6
అందువల్ల ఆ జూదప్రసంగాన్ని గురించి, సాతత్యదోషం గురించి ఉన్నదున్నట్లుగా వర్ణిస్తాను. (6)
స్త్రియోఽక్షా మృగయా పానమేతత్ కామసముత్థితమ్ ।
దుఃఖం చతుష్టయం ప్రోక్తం యైర్నరో భ్రశ్యతే శ్రియః ॥ 7
తత్ర సర్వత్ర వక్తవ్యం మన్యంతే శాస్త్రకోవిదాః ॥
విశేషతశ్చ వక్తవ్యం ద్యూతే పశ్యంతి తద్విదః ॥ 8
స్త్రీల పట్ల కాంక్ష, జూదం, వేట, మద్యపానం ఈ నాలుగూ కామం వల్ల కలిగిన దుఃఖాలుగా చెప్పబడ్డాయి. ఈ నాలుగింటి వల్ల మానవుడు ఐశ్వర్యభ్రష్టుడౌతాడు. శాస్త్రకోవిదులు అన్ని చోట్ల ఈ నాల్గింటిని నిందింపదగినవిగా పేర్కొన్నారు. ద్యూతదోషాన్ని తెలిసినవారు ఆ నాల్గింటిలో జూదాన్ని మిక్కిలి నిందింపదగిందిగా పేర్కొన్నారు. (7,8)
ఏకాహాద్ ద్రవ్యనాశోఽత్ర ధ్రువం వ్యసనమేవ చ ।
అభుక్తనాశశ్చార్థానాం వాక్పారుష్యం చ కేవలమ్ ॥ 9
ఏతచ్చాన్యచ్చ కౌరవ్య ప్రసంగికటుకోదయమ్ ।
ద్యూతే బ్రూయాం మహాబాహో సమాసాద్యాంబికాసుతమ్ ॥ 10
కురునందనా! జూదం వల్ల ఒక్క రోజులో సమస్తధనమూ నశిస్తుంది. అది నిశ్చయంగా దుఃఖానికి దారి తీస్తుంది. భోగాలు అనుభవించకుండానే సంపదలు నశిస్తాయి. వాక్పారుష్యం కలుగుతుంది. జూదప్రసంగమాత్రం చేతనే కాఠిన్యం పుడుతుంది. నాటి జూదసభలో ధృతరాష్ట్రునితో జూదం వల్ల కలిగే ఈ దోషాలన్నింటినీ చెప్పేవాడిని. (9,10)
ఏవముక్తో యది మయా గృహ్ణీయాద్ వచనం మమ ।
అనామయం స్యాద్ ధర్మశ్చ కురూణాం కురువర్ధన ॥ 11
కురువర్ధనా! నా ఈ మాటలను వారు గ్రహించినట్లయితే కురువంశీయులందరికీ శాంతి, ధర్మం, సంరక్షణ జరిగి ఉండేది. (11)
న చేత్ స మమ రాజేంద్ర గృహ్ణీయాన్మధురం వచః ।
పథ్యం చ భరతశ్రేష్ఠ నిగృహ్ణీయాం బలేన తమ్ ॥ 12
రాజేంద్రా! భరతశ్రేష్ఠా! మధురమై, హితమైన నా మాటను వారు గౌరవించకపోతే, వానిని బలంతో నిగ్రహించి ఉండేవాడిని. (12)
అథైనమపనీతేన సుహృదో నామ దుర్హృదః ।
సభాసదోఽనువర్తేరన్ తాంశ్చ హన్యాం దురోదరాన్ ॥ 13
ఒకవేళ అక్కడ స్నేహితుల పేరుతో ఉన్న శత్రువులు అన్యాయానికి ఆశ్రయమిచ్చే ఆ ధృతరాష్ట్రునితో పాటే ఉంటే, ఆ సభాసదులైన జూదురులందరినీ వధించి ఉండేవాడిని. (13)
అసాన్నిధ్యం తు కౌరవ్య మమానర్తేష్వభూత్ తదా ।
యేనేదం వ్యసనం ప్రాప్తాః భవంతో ద్యూతకారితమ్ ॥ 14
కురుశ్రేష్ఠా! నేను అపుడు ఆ నర్తదేశమ్లోనే లేను. అందువల్ల మీకు ఈ జూదం వల్ల ఇటువంటి కష్టం కలిగింది. (14)
సోఽహమేత్య కురుశ్రేష్ఠ ద్వారకాం పాండునందన ।
అశ్రౌషం త్వాం వ్యసనినం యుయుధానాద్ యథాతథమ్ ॥ 15
పాండునందనా! నేను ద్వారకకు తిరిగి వచ్చాక సాత్యకి వల్ల నీకు కల్గిన కష్టాన్ని గురించి యథాతథంగా విన్నాను. (15)
శ్రుత్వైవ చాహం రాజేంద్ర పరమోద్విగ్నమానసః ।
తూర్ణమభ్యాగతోఽస్మి త్వాం ద్రష్టుకామో విశాంపతే ॥ 16
అహో కృచ్ఛ్రమనుప్రాప్తాః సర్వే స్మ భరతర్షభ ।
సోఽహం త్వాం వ్యసనే మగ్నం పశ్యమి సహ సోదరైః ॥ 17
భరతశ్రేష్ఠా! అయ్యో! మనమంతా ఎంతటికష్టంలో పడ్డాం! సోదరులతో పాటుగా కష్టంలో మునిగి ఉన్న నిన్ను నేను చూస్తూ ఉన్నాను. (17)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి వాసుదేవవాక్యే త్రయోదశోఽధ్యాయః ॥ 13 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున వాసుదేవవాక్యమను పదమూడవ అధ్యాయము. (13)