17. పదునేడవ అధ్యాయము

ప్రద్యుమ్న శాల్వుల ఘోరయుద్ధము.

వాసుదేవ ఉవాచ
ఏవముక్త్వా రౌక్మిణేయః యాదవాన్ భరతర్షభ ।
దంశితైర్హభిర్యుక్తం రథమాస్థాయ కాంచనమ్ ॥ 1
ఉచ్ఛ్రిత్య మకరం కేతుం వ్యాత్తాననమివాంతకమ్ ।
ఉత్పతద్భిరివాకాశం తైర్హయైరన్వయాత్ పరాన్ ॥ 2
విక్షిపన్ నాదయంశ్చాపి ధనుః శ్రేష్ఠమ్ మహాబలః ।
తూణఖడ్గధరః శూరః బద్ధగోధాంగులిత్రవాన్ ॥ 3
వాసుదేవుడిలా అన్నాడు -
భరతశ్రేష్ఠా! రుక్మిణీనందనుడు ప్రద్యుమ్నుడు యాదవులతో ఈ విధంగా చెప్పి, గుర్రాలు పూన్చిన స్వర్ణమయరథాన్ని ఎక్కి, మకరచిహ్నం గల జెండానెగురవేసి, నోరుతెరుచుకున్న మృత్యువులా, ఆకాశంలోకి ఎగురుతున్నట్లుగా ఉన్న ఆ గుర్రాలతో శత్రువులను ఆక్రమించాడు. మహాబలుడు, శూరుడు అయిన ప్రద్యుమ్నుడు బాణాలను, ఖడ్గాన్ని ధరించి, శ్రేష్ఠమైన ధనుస్సును తీసికొని దానిని ధ్వనింపజేస్తూ అటుఇటూ తిప్పుతూ, రక్షణకవచాన్ని ధరించి ముందుకు వెళ్ళాడు. (1-3)
స విద్యుచ్ఛురితం చాపం విహరన్ వై తలాత్ తలమ్ ।
మోహయామాస దైతేయాన్ సర్వాన్ సౌభనివాసినః ॥ 4
అతడు విద్యుత్తులా మెరిసే తన ధనుస్సును ఒకచేతి నుండి వేరొకచేతికి మారుస్తూ, సౌభవిమానవాసులైన రాక్షసులందరినీ భ్రాంతిపరిచాడు. (4)
తస్య విక్షిపతశ్చాపం సందధానస్య చాసకృత్ ।
నాంతరం దదృశే కశ్చిద్ నిఘ్నతః శాత్రవాన్ రణే ॥ 5
అతడు యుద్ధంలో ధనుస్సుకి బాణం సంధించి, విడిచిపెడుతూ శత్రువులను చంపుతూంటే, ఆ పనుల మధ్య మధ్య ఏమాత్రమూ అంతరం కనబడటం లేదు. (5)
ముఖస్య వర్ణో న వికల్పతేఽస్య
చేలుశ్చ గాత్రాణి న చాపి తస్య ।
సింహోన్నతం చాప్యభిగర్జతోఽస్య
శుశ్రావ లోకోఽద్భుతవీర్యమగ్ర్యమ్ ॥ 6
అతని ముఖంలోని చాయ ఏమాత్రం మారలేదు. అతని శరీరం ఏమాత్రం చలించలేదు. అంతటా గర్జిస్తూన్న అతని అద్భుత పరాక్రమాన్ని సూచించే సింహం వంటి ఉన్నతమైన నాదాన్ని లోకమంతా విన్నది. (6)
జలేచరః కాంచనయష్టిసంస్థః
వ్యాత్తాననః సర్వతిమిప్రమాథీ ।
విత్రాసయన్ రాజతి వాహముఖ్యే
శాల్వస్య సేనాప్రముఖే ధ్వజాగ్ర్యః ॥ 7
శాల్వుని యొక్క ప్రధానసేన మధ్యలో ప్రధానరథంపై అగ్రభాగాన బంగారు కర్రపైనున్న ధ్వజంపై నోరతెరచుకొని ఉన్న మకరం శత్రుసేనను భయపెడుతూ ప్రకాశిస్తూన్నది. (7)
తతస్తూర్ణం వినిష్పత్య ప్రద్యుమ్నః శత్రుకర్షణః ।
శాల్వమేవాభిదుద్రావ విధిత్సుః కలహం నృప ॥ 8
రాజా! తరువాత శత్రుఘాతకుడైన ప్రద్యుమ్నుడు శీఘ్రంగా శాల్వునితో యుద్ధం చేయాలనే కోరికతో అతనికి ఎదురుగా వెళ్ళాడు. (8)
అభియానం తు వీరేణ ప్రద్యుమ్నేన మహారణే ।
నామర్షయత సంక్రుద్ధః శాల్వః కురుకులోద్వహ ॥ 9
ఆ మహారణంలో వీరుడైన ప్రద్యుమ్నుని ఆక్రమణాన్ని శాల్వుడు క్రుద్ధుడై సహించలేక పోయాడు. (9)
స రోషమదమత్తో వై కామగాదవరుహ్య చ ।
ప్రద్యుమ్నం యోధయామాస శాల్వః పరపురంజయః ॥ 10
శత్రుపురాన్ని జయించాలని శాల్వుడు రోషగర్వోన్మత్తుడై కామగమనం గల విమానం నుండి క్రిందకి దిగి ప్రద్యుమ్నునితో యుద్ధం చేశాడు. (10)
తయోః సుతుములం యుద్ధం శాల్వవృష్ణిప్రవీరయోః ।
సమేతా దదృశుర్లోకాః బలివాసవయోరివ ॥ 11
శాల్వునికి వృష్ణివంశవీరుడైన ప్రద్యుమ్నునికి భయంకరమైన యుద్ధం జరిగింది. బలి - దేవేంద్రులకు వలె జరుగుతున్న ఆ యుద్ధాన్ని జనులంతా ఏకమై చూశారు. (11)
తస్య మాయామయో వీర రథో హేమపరిష్కృతః ।
సపతాకః సధ్వజశ్చ సానుకర్షః సతూణవాన్ ॥ 12
వీరా! అతని యొక్క రథం స్వర్ణమయం, మాయా మయమూ. ఆ రథానికి కూడా పతాకం, ధ్వజం, అనుకర్షం తూణమూ ఉన్నాయి. (12)
స తం రథవరం శ్రీమాన్ సమారుహ్య కిల ప్రభో ।
ముమోచ బాణాన్ కౌరవ్య ప్రద్యుమ్నాయ మహాబలః ॥ 13
ప్రభూ! కురునందనా! అటువంటి శ్రేష్ఠమైన రథాన్ని ఎక్కి, మహాబలుడైన శాల్వుడు ప్రద్యుమ్నునిపై బాణాలను వేశాడు. (13)
తతో బాణమయం వర్షం వ్యసృజత్ తరసా రణే ।
ప్రద్యుమ్నే భుజవేగేన శాల్వం సమ్మోహయన్నివ ॥ 14
తరువాత ప్రద్యుమ్నుడు రణంలో తన భుజవేగంతో శాల్వునిపై సమ్మోహపరిచినట్లుగా బాణవర్షాన్ని కురిపించాడు. (14)
స తైరభిహతః సంఖ్యే నామర్షయత సౌభరాట్ ।
శరాన్ దీప్తాగ్నిసంకాశాన్ ముమోచ తనయే మమ ॥ 15
ఆ సౌభపతి శాల్వుడు యుద్ధంలో ప్రద్యుమ్నుని బాణాలచే దెబ్బతిని సహించలేక నాకుమారునిపై మండుతున్న అగ్నిలా ప్రకాశించే బాణాలు ప్రయోగించాడు. (15)
తమాపతంతం బాణౌఘం స చిచ్ఛేద మహాబలః ।
తతశ్చాన్యాన్ శరాన్ దీప్తాన్ ప్రచిక్షేప సుతే మమ ॥ 16
తనమీద పడుతున్న బాణసమూహాన్ని ప్రద్యుమ్నుడు ఛేదించాడు. శాల్వుడు మళ్ళీ నాకుమారుడిపై జ్వలిస్తూన్న బాణాలను ప్రయోగించాడు. (16)
స శాల్వబాణై రాజేంద్ర విద్ధో రుక్మిణినందనః ।
ముమోచ బాణం త్వరితః మర్మభేదినమాహవే ॥ 17
రాజేంద్రా! శాల్వుని బాణాలచే దెబ్బతిన్న రుక్మిణీ నందనుడు త్వరగా యుద్ధంలో మర్మభేదియైన బాణాన్ని శాల్వునిపై వేశాడు. (17)
తస్య వర్మ విభిద్యాశు స బాణో మత్సుతేరితః ।
వివ్యాధ హృదయం పత్రీ స ముమోహ పపాత చ ॥ 18
నాకుమారుడు వేసిన బాణం శాల్వుని కవచాన్ని చేధించి, శీఘ్రంగా అతని హృదయాన్ని తాకింది (కొట్టింది). అతడు స్పృహ కోల్పోయి నేలపై పడ్డాడు. (18)
తస్మిన్ నిపతితే వీరే శాల్వరాజే విచేతసి ।
సంప్రాద్రవన్ దానవేంద్రాః దారయంతో వసుంధరామ్ ॥ 19
వీరుడైన ఆ శాల్వరాజు అచేతనంగా నేలపై పడగా దానవ వీరులంతా భూమిని చీల్చుకొని పాతాళానికి పారిపోయారు. (19)
హాహాకృతమభూత్ సైన్యం శాల్వస్య పృథివీపతే ।
నష్టసంజ్ఞే నిపతితే తదా సౌభపతౌ నృపే ॥ 20
పృథివీపతీ! సౌభపతి శాల్వుడు అచేతనంగా పడిపోగా, అతని సైన్యమంతా హాహాకారాలు చేసింది. (20)
తత ఉత్థాయ కౌరవ్య ప్రతిలభ్య చ చేతనామ్ ।
ముమోచ బాణాన్ సహసా ప్రద్యుమ్నాయ మహాబలః ॥ 21
కురునందనా! తరువాత మహాబలుడైన శాల్వుడు చైతన్యాన్ని పొంది, హఠాత్తుగాలేచి ప్రద్యుమ్నునిపై బాణాలను విడిచాడు. (21)
తైః స విద్ధో మహాబాహుః ప్రద్యుమ్నః సమరే స్థితః ।
జత్రుదేశే భృశం వీరః వ్యవాసీదద్ రథే తదా ॥ 22
శాల్వుని బాణాలచే ప్రద్యుమ్నుడు యుద్ధంలో స్థిరంగా ఉండి, కంఠమూలభాగంలో దెబ్బతిని రథం మీద మూర్ఛపోయాడు. (22)
తం స విద్ధ్వా మహారాజ శాల్వో రుక్మిణినందనమ్ ।
ననాద సింహనాదం వై నాదేనాపూరయన్ మహీమ్ ॥ 23
ఆ విధంగా శాల్వుడు రుక్మిణీనందనుని దెబ్బతీసి, సింహనాదం చేశాడు. ఆ నాదం భూమండలమంతా వ్యాపించింది. (23)
తతో మోహం సమాపన్నే తనయే మమ భారత ।
ముమోచ బాణాంస్త్వరితః పునరన్యాన్ దురాసదాన్ ॥ 24
భరతశ్రేష్ఠా! ఆ విధంగా నాకొడుకు మూర్ఛపోగా, అతనిపై మళ్ళీ శాల్వుడు ఎదిరింపశక్యంగాని బాణాలను విడిచిపెట్టాడు. (24)
స తైరభిహతో బాణైః బహుభిస్తేన మోహితః ।
నిశ్చేష్టః కౌరవశ్రేష్ఠ ప్రద్యుమ్నోఽభూద్ రణాజిరే ॥ 25
కౌరవశ్రేష్ఠా! ఆ బాణాలచే కొట్టబడిన ప్రద్యుమ్నుడు మూర్ఛితుడై, నిశ్చేష్టుడై ఆ యుద్ధరంగంలో పడిపోయాడు. (25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి సౌభవధోపాఖ్యానే సప్తదశోఽధ్యాయః ॥ 17 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున సౌభవధోపాఖ్యానమను అను పదునేడవ అధ్యాయము. (17)