18. పదునెనిమిదవ అధ్యాయము
మూర్ఛితుడయిన ప్రద్యుమ్నుడు సారథిని నిందించుట.
వాసుదేవ ఉవాచ
శాల్వబాణార్దితే తస్మిన్ ప్రద్యుమ్నే బలినాం వరే ।
వృష్ణయో భగ్నసంకల్పాః వివ్యథుః పృతనాగతాః ॥ 1
వాసుదేవుడిలా అన్నాడు -
బలవంతులలో శ్రేష్ఠుడైన ప్రద్యుమ్నుడు శాల్వుని బాణాలచేత పీడింపబడి మూర్ఛనొందాడు. అపుడు వృష్ణిసేనలు తమ సంకల్పం భగ్నం కాగా, ఎంతో బాధపడ్డారు. (1)
హాహాకృతమభూత్ సర్వం వృష్ణ్యంధకబలం తతః ।
ప్రద్యుమ్నే మోహితే రాజన్ పరే చ ముదితా భృశమ్ ॥ 2
రాజా! వృష్ణి అంధకసైన్యమంతా హాహాకారాలు చేసింది. ప్రద్యుమ్నుడు మూర్ఛపోవడం చూసి శత్రుసేనలు మిక్కిలి ఆనందించాయి. (2)
తం తథా మోహితం దృష్ట్వా సారథిర్జవనైర్హయైః ।
రణాదపాహరత్ తూర్ణం శిక్షితో దారుకిస్తదా ॥ 3
మూర్ఛనొందిన ప్రద్యుమ్నుని చూసి శిక్షితుడైన దారుకి అనే సారథి వేగంగా పరుగెత్తే గుర్రాలతో ఉన్న రథాన్ని యుద్ధం నుండి దూరంగా తీసికొని వెళ్ళాడు. (3)
నాతిదూరాపయాతే తు రథే రథవరప్రణుత్ ।
ధనుర్గృహీత్వా యంతారం లబ్ధసంజ్ఞోఽబ్రవిదిదమ్ ॥ 4
రథం ఎక్కువదూరం వెళ్ళకుండానే రథంలో వెళుతూన్న ప్రద్యుమ్నుడు స్పృహవచ్చి ధనుస్సును చేతబట్టి సారథితో ఇలా అన్నాడు. (4)
సౌతే కిం తే వ్యవసితం కస్మాద్ యాసి పరాఙ్ముఖః ।
నైష వృష్ణిప్రవీరాణామ్ ఆహవే ధర్మ ఉచ్యతే ॥ 5
సూతపుత్రా! ఏం పనిచేశావు? యుద్ధం నుండి ఎందుకు వెనుదిరిగావు? వృష్ణివీరులకు యుద్ధంలో ఇది ధర్మంకాదు. (5)
కచ్చిత్ సౌతే న తే మోహః శాల్వం దృష్ట్వా మహాహవే ।
విషాదో వా రణం దృష్ట్వా బ్రూహి మే త్వం యథాతథమ్ ॥ 6
సూతపుత్రా! ఆ మహారణంలో శాల్వుని చూసేసరికి నీకు మోహం కలుగలేదు కదా! లేదా యుద్ధాన్ని చూసి విషాదం పొందావా! ఉన్నదున్నట్లుగా నాకు చెప్పు. (6)
సౌతిరువాచ
జానార్దనే న మే మోహః నాపి మాం భయమావిశత్ ।
అతిభారం తు తే మన్యే శాల్వం కేశవనందన ॥ 7
సారథి ఇలా అన్నాడు - కేశవనందనా! జానార్దనీ! నాకు మోహం కలుగలేదు, భయమూ కలుగలేదు. కాని ఆ శాల్వుడు నీకు చాలా భారమయ్యా డనిపించింది. (7)
సోఽపయామి శనైర్వీర బలవానేష పాపకృత్ ।
మోహితశ్చ రణే శూరః రక్ష్యః సారథినా రథీ ॥ 8
వీరవరా! అందువల్ల నేను మెల్లగా యుద్ధభూమినుండి దూరంగా తీసికొనివచ్చాను. పాపాత్ముడగు ఆ శాల్వుడు మిక్కిలి బలవంతుడు, యుద్ధరంగంలో వీరుడైన రథికుడు స్పృహ కోల్పోతే, అతనిని సారథి రక్షించాలి కదా! (8)
ఆయుష్మంస్త్వం మయా నిత్యం రక్షితవ్యస్త్వయాప్యహమ్ ।
రక్షితవ్యో రథీ నిత్యమ్ ఇతి కృత్వాపయామ్యహమ్ ॥ 9
ఆయుష్మంతుడా! నిత్యం నేను నిన్ను రక్షించాలి. నీవు నన్ను రక్షించాలి. రథికుడు ఎల్లపుడూ రక్షింపదగినవాడని నేను నిన్ను దూరంగా తీసికొనివచ్చాను. (9)
ఏకశ్చాపి మహాబాహో బహవశ్చాపి దానవాః ।
న సమం రౌక్మిణేయాహం రణే మత్వాపయామి వై ॥ 10
మహాబాహూ! యుద్ధరంగంలో నీవు ఒక్కడవున్నావు. దానవులు చాలామంది ఉన్నారు. రుక్మిణీనందనా! యుద్ధంలో ఇరుపక్షాలు సమ ఉజ్జీగా లేవని భావించి నిన్ను దూరం చేశాను. (10)
ఏవం బ్రువతి సూతే తు తదా మకరకేతుమాన్ ।
ఉవాచ సూతం కౌరవ్యం నివర్తయ రథం పునః ॥ 11
దారుకాత్మజ మైవం త్వం పునః కార్షీః కథంచన ।
వ్యపయానం రణాత్ సౌతే జీవతో మమ కర్హిచిత్ ॥ 12
కురునందనా! సారథి ఈ విధంగా చెపుతూండగా, మకరధ్వజుడైన ప్రద్యుమ్నుడు ఇలా అన్నాడు - దారుకాత్మజా! మళ్ళీ రథాన్ని యుద్ధరంగానికి మళ్లించు. ఎట్లైనాకాని, మళ్లీ ఇలా చెయ్యకు. నేను జీవించి ఉండగా, నన్ను యుద్ధం నుండి దూరంగా తీసుకొనిపోకు. (11,12)
న స వృష్ణికులే జాతః యో వై త్యజతి సంగరమ్ ।
యో వా నిపతితం హంతి తవాస్మీతి చ వాదినమ్ ॥ 13
జీవించి ఉండగా యుద్ధాన్ని విడిచిపెట్టేవాడు, నేలపైపడిన వాణ్ణి చంపేవాడు, శత్రువుకు లొంగి 'నీవాణ్ణి' అనేవాడూ వృష్ణివంశంలో పుట్టినవాడే కాడు. (13)
తథా స్త్రియం చ యో హంతి బాలం వృద్ధం తథైవ చ ।
విరథం విప్రకీర్ణం చ భగ్నశస్త్రాయుధం తథా ॥ 14
అదేవిధంగా స్త్రీని చంపేవాడు. బాల, వృద్ధులను చంపేవాడు, రథంలేనివాణ్ణి, శస్త్రాయుధాలు భగ్నమైనవాణ్ణి చంపేవాడూ వృష్ణివంశంలో పుట్టినవాడే కాడు. (14)
త్వం చ సూతకులే జాతః వినీతః సూతకర్మణి ।
ధర్మజ్ఞశ్చాపి వృష్ణీనామ్ ఆహవేష్వపి దారుకే ॥ 15
దారుకకుమారా! నీవు సూతకులంలో పుట్టినవాడవూ, సూతకర్మను బాగా నేర్చినవాడవూను. యుద్ధంలో వృష్ణివంశీయులు పాటించే ధర్మాన్ని కూడా నీవు ఎరుగుదువు. (15)
స జానంశ్చరితం కృత్స్నం వృష్ణీనాం పృతనాముఖే ।
అపయానం పునః సౌతే మైవం కార్షీః కథంచన ॥ 16
సూతనందనా! వృష్ణివీరుల చరిత్ర అంతా తెలిసిన నీవు యుద్ధంలో ఉన్నవాణ్ణి మళ్ళీ ఎపుడూ ఇలా దూరంగా తీసికొని వెళ్ళకు. (16)
అపయాతం హతం పృష్ఠే భ్రాంతం రణపలాయితమ్ ।
గదాగ్రజో దురాధర్షః కిం మాం వక్ష్యతి మాధవః ॥ 17
భ్రాంతిపడితే యుద్ధం నుండి వెనుదిరిగితే నా వెనుక భాగంలో, దెబ్బతగలడం చూసి గదాగ్రజుడూ, నాతండ్రి అయిన మాధవుడు నన్ను ఏమంటాడు? (17)
కేశవస్యాగ్రజో వాపి నీలవాసా మదోత్కటః ।
కిం వక్ష్యతి మహాబాహుః బలదేవః సమాగతః ॥ 18
నా తండ్రీ, కేశవునికి అగ్రజుడూ, నీలాంబరధారీ, మదోత్కటుడూ, మహాబాహువూ అయిన బలదేవుడు నన్ను చూసి ఏమంటాడు? (18)
కిం వక్ష్యతి శినేర్నప్తా నరసింహో మహాధనుః ।
అపయాతం రణాత్ సూత సాంబశ్చ సమితింజయః ॥ 19
సూతా! శినికి మునిమనవడు, మనుష్యులలో సింహం వంటివాడు, మహాధనుర్ధారి అయిన సాత్యకి, సమరవిజయుడయిన సాంబుడు యుద్ధం నుండి వెనుదిరిగి వచ్చిన నన్ను చూసి ఏమంటారు? (19)
చారుదేష్ణశ్చ దుర్ధర్షః తథైవ గదసారణౌ ।
అక్రూరశ్చ మహాబాహుః కిం మాం వక్ష్యతి సారథే ॥ 20
సారథీ! ఇతరులకు అతనిని అదుపుచేయటం శక్యం కాదు. అటువంటి చారుదేష్ణుడు, గదసారణులు, మహాబాహువైన అక్రూరుడు నన్ను చూసి ఏమంటారు? (20)
శూరం సంభావితం శాంతం నిత్యం పురుషమానినమ్ ।
స్త్రియశ్చ వృష్ణివీరాణాం కిం మాం వక్ష్యంతి సంహతాః ॥ 21
శూరుడనూ, గౌరవింపబడినవాడనూ, శాంతడనూ, నిత్యమూ వీరపురుషులను గౌరవించేవాడనూ అయిన నన్ను చూసి వృష్ణివీరుల భార్యలు ఏమంటారు? (21)
ప్రద్యుమ్నోఽయముపాయాతి భీతస్త్యక్త్వా మహాహవమ్ ।
ధిగేనమితి వక్ష్యంతి న తు వక్ష్యంతి సాధ్వితి ॥ 22
'ఈ ప్రద్యుమ్నుడు భయపడి యుద్ధరంగం విడిచి ఇలా వస్తున్నాడు. ఇతడు తిరస్కరింపదగినవాడు' అని అంటారు. 'బాగుంది' అని ఎవరూ అనరు. (22)
ధిగ్వాచా పరిహాసోఽపి మమ వా మద్విధస్య వా ।
మృత్యునాభ్యధికః సౌతే స త్వం మా వ్యపయాః పునః ॥ 23
నాకు కాని నావంటివారికి కాని ఇట్టి ధిక్కారవచనంతో పరిహసింపబడటం మరణం కంటే ఎక్కువ. సారథీ! అందువల్ల మళ్లీ ఎపుడూ ఇలా చేయకు. (23)
భారం హి మయి సన్న్యస్య యాతో మధునిహా హరిః ।
యజ్ఞం భారతసింహస్య న హి శక్యోఽద్య మర్షితుమ్ ॥ 24
మధుసూదనుడైన నాతండ్రి శ్రీహరి ఈ భారాన్ని నాపై ఉంచి భారతసింహమైన ధర్మరాజు చేసే యజ్ఞానికి వెళ్ళాడు. ఈ రోజు నే చేసిన అపరాధం సహింపశక్యం కానిది. (24)
కృతవర్మా మయా వీరః నిర్యాస్యన్నేవ వారితః ।
శాల్వం నివారయిష్యేఽహం తిష్ఠ త్వమితి సూతజ ॥ 25
సూతపుత్రా! శాల్వుని ఎదుర్కోవడానికి వెళ్తున్న వీరుడైన కృతవర్మను నేనే నివారించాను. 'శాల్వుని నేను అడ్డుకొంటాను నువ్వు ఉండు' అని చెప్పాను. (25)
స చ సంభావయన్ మాం వై నివృత్తో హృదికాత్మజః ।
తం సమేత్య రణం త్యక్త్వా కిం వక్ష్యామి మహారథమ్ ॥ 26
హృదికాత్మజుడైన కృతవర్మ నన్ను గౌరవించి వెనుదిరిగాడు. ఇపుడు ఇలా యుద్ధాన్ని విడిచివెళ్ళి, ఆ మహారథుడికి ఏం చెప్పగలను? (26)
ఉపయాంతం దురాధర్షం శంఖచక్రగదాధరమ్ ।
పురుషం పుండరీకాక్షం కిం వక్ష్యామి మహాభుజమ్ ॥ 27
శంఖ, చక్ర, గదాయుధాలను ధరించి, అజేయుడైన పుండరీకాక్షుడు నన్ను సమీపించినపుడు ఏం చెప్పను? (27)
సాత్యకిం బలదేవం చ యే చాన్యేఽంధకవృష్ణయః ।
మయా స్పర్ధంతి సతతం కిం ను వక్ష్యామి తానహమ్ ॥ 28
సాత్యకి, బలదేవుడు, అంధకవృష్ణివీరులూ ఎల్లపుడూ నాతో పోటీపడుతూంటారు, వాళ్ళకు నేను ఏం చెప్పగలను? (28)
త్యక్త్వా రణమియం సౌతే పృష్ఠతోఽభ్యాహతః శరైః ।
త్వయా పనీతో వివశః న జీవేయం కథంచన ॥ 29
సూతపుత్రా! యుద్ధాన్ని విడిచి, శత్రువుల బాణాలచే వీపు మీద కొట్టబడి, మూర్ఛితుడనై నీచేత దూరంగా తీసికొని రాబడిన తరువాత ఇక ఏవిధంగాను జీవించలేను. (29)
స నివర్త రథేనాశు పునర్దారుకనందన ।
న చైతదేవం కర్తవ్యమ్ అథాపత్సు కథంచన ॥ 30
దారుకనందనా! అందువల్ల శీఘ్రంగా మళ్ళీ యుద్ధరంగానికి తీసికొనివెళ్ళు. ఇకపై ఆపద సమయంలో కూడ నీవు ఈ విధంగా చేయవద్దు. (30)
న జీవితమహం సౌతే బహు మన్యే కథంచన ।
అపయాతో రణాద్ భీతః పృష్ఠతోఽభ్యాహతః శరైః ॥ 31
సూతపుత్రా! భయపడి యుద్ధం నుండి దూరంగా వెళ్ళి, వెనుకవైపు బాణాల దెబ్బలు తిని జీవించి ఉండడం ఏ విధంగానూ గొప్పదిగా భావించడం లేదు. (31)
కదాపి సూతపుత్ర త్వం జానీషే మాం భయార్దితమ్ ।
అపయాతం రణం హిత్వా యథా కాపురుషం తథా ॥ 32
సూతపుత్రా! భయపడి యుద్ధాన్ని విడిచివెళ్ళే అధమునిగా నన్నెప్పుడూ నీవు భావించవద్దు. (32)
న యుక్తం భవతా త్యక్తుం సంగ్రామం దారుకాత్మజ ।
మయి యుద్ధార్థిని భృశం స త్వం యాహి యతో రణమ్ ॥ 33
దారుకాత్మజా! నీవు యుద్ధాన్ని విడిచిపెట్టడం యుక్తం కాదు. యుద్ధాన్ని కోరుకొనే నన్ను తొందరగా యుద్ధానికి తీసికొని వెళ్ళు. (33)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి సౌభవధోపాఖ్యానే అష్టాదశోఽధ్యాయః ॥ 18 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమనమను పర్వమను ఉపపర్వమున సౌభవధోపాఖ్యానమను అను పదునెనిమిదవ అధ్యాయము. (18)