23. ఇరువది మూడవ అధ్యాయము
ద్వైతవనమునకు వెళ్ళు పాండవులను చూచి ప్రజలు వ్యాకులపడుట.
వైశంపాయన ఉవాచ
తస్మిన్ దశార్హాధిపతౌ ప్రయాతే
యుధిష్ఠిరో భీమసేనార్జునౌ చ ।
యమౌ చ కృష్ణా చ పురోహితశ్చ
రథాన్ మహార్హాన్ పరమాశ్వయుక్తాన్ ॥ 1
ఆస్థాయ వీరాః సహితా వనాయ
ప్రతస్థిరే భూతపతిప్రకాశాః ।
హిరణ్యనిష్కాన్ వసనాని గాశ్చ
ప్రదాయ శిక్షాక్షరమంత్రవిద్బ్యః ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు - శ్రీకృష్ణుడు వెళ్ళిన తర్వాత ఈశ్వరునిలా ప్రకాశిస్తున్న, వీరులైన యుధిష్ఠిర, భీమ, అర్జున, నకుల సహదేవులు, ద్రౌపది, పురోహితుడు ధౌమ్యుడూ కలిసి మంచిగుర్రాలు పూన్చిన యోగ్యరథాలనెక్కి, వేదవేదాంగవేత్తలగు బ్రాహ్మణులకు బంగారు నాణాలను, వస్త్రాలను, గోవులను దానం చేసి, వేరొక వనానికి (ద్వైతవనానికి) బయలుదేరారు. (1,2)
ప్రేష్యాః పురో వింశతిరాత్తశస్త్రాః
ధనూంషి శస్త్రాణి శరాంశ్చ దీప్తాన్ ।
మౌర్వీశ్చ యంత్రాణి చ సాయకాంశ్చ
సర్వే సమాదాయ జఘన్యమీయుః ॥ 3
శ్రీకృష్ణునితో బాటుగ శస్త్రధారులైన ఇరవై మంది (సైనికులు) సేవకులు ధనుస్సులను, శస్త్రాలను, ప్రకాశిస్తున్న బాణాలను, నారులను, యంత్రాలను, సాయకాలను తీసికొని ముందుగా పశ్చిమదిక్కునకు (ద్వారకవైపునకు) వెళ్ళారు. (3)
తతస్తు వాసాంసి చ రాజపుత్ర్యా
ధాత్ర్యశ్చ దాస్యశ్చ విభూషణమ్ చ ।
తదింద్రసేనస్త్వరితః ప్రగృహ్య
జఘన్యమేవోపయయౌ రథేన ॥ 4
అనంతరం సారథి ఇంద్రసేనుడు రాజకుమారి సుభద్ర యొక్క వస్త్రాలను, భూషణాలను, దాదులను, దాసీలను తీసికొని తొందరగా రథం మీద పశ్చిమదిక్కునకు వెళ్లాడు. (4)
తతః కురుశ్రేష్ఠముపేత్య పౌరాః
ప్రదక్షిణం చక్రురదీనసత్త్వాః ।
తం బ్రాహ్మణాశ్చాభ్యవదన్ ప్రసన్నా
ముఖ్యాశ్చ సర్వే కురుజాంగలానామ్ ॥ 5
ఔదార్యం గల పౌరులు కురుశ్రేష్ఠుడైన యుధిష్ఠిరుని దగ్గరకు వచ్చి, అతనికి ప్రదక్షిణం చేశారు. కురుజాం గల దేశీయులైన ముఖ్యులందరూ, బ్రాహ్మణులూ ప్రసన్నులై అతడితో మాట్లాడారు. (5)
స చాపి తానభ్యవదత్ ప్రసన్నః ।
సహైవ్ తైర్ర్భాతృభిర్దర్మరాజః ।
తస్థౌ చ తత్రాధిపతిర్మహాత్మా
దృష్ట్వా జనౌఘం కురుజాంగలానామ్ ॥ 6
సోదరులతోబాటుగ ధర్మరాజు కూడ ప్రసన్నుడై వారితో మాట్లాడాడు. కురుజాంగలదేశంలోని ఆ జనసమూహాన్ని చూసి మహాత్ముడైన యుధిష్ఠిరుడు కొంతకాలం అక్కడున్నాడు. (6)
పితేవ పుత్రేషు స తేషు భావం
చక్రే కురూణామృషభో మహాత్మా ।
తే చాపి తస్మిన్ భరతప్రబర్హే
తదా బభూవుః పితరీవ పుత్రాః ॥ 7
పుత్రుల పట్ల తండ్రివలె, ఆ జనులపట్ల కురుశ్రేష్ఠుడైన ధర్మరాజు తన హృదయాన్ని విప్పి వ్యవహరించాడు. వారు కూడా తండ్రిపట్ల పుత్రుల వలె అనురక్తులై ప్రవర్తించారు. (7)
తతస్తమాసాద్య మహాజనౌఘాః
కురుప్రవీరం పరివార్య తస్థుః ।
హా నాథ హా ధర్మ ఇతి బ్రువాణాః
భీతాశ్చ సర్వేఽశ్రుముఖాశ్చ రాజన్ ॥ 8
వరః కురూణామధిపః ప్రజానాం
పితేవ పుత్రానపహాయ చాస్మాన్ ।
పౌరానిమాన్ జనపదాంశ్చ సర్వాన్
హిత్వా ప్రయాతః క్వ ను ధర్మరాజః ॥ 9
రాజా! అనంతరం అక్కడి జనసమూహమంతా కురుప్రవీరుడైన యుధిష్ఠిరుని చుట్టూ చేరి భీతులై, కన్నీటిముఖాలతో "హా నాథా! హా ధర్మరాజా!' అని ఆక్రోశిస్తూ ఈ విధంగా అడిగారు - రాజా! కురుశ్రేష్ఠుడై మమ్ములను తండ్రివలె చూసే, ఇక్కడి పౌరులను, జానపదులను అందరిని విడిచి ఎక్కడకు వెళ్తున్నాడు? (8,9)
ధిగ్ ధార్తరాష్ట్రం సునృశంసబుద్ధిం
ధిక్ సౌబలం పాపమతిం చ కర్ణమ్ ।
అనర్థమిచ్ఛంతి నరేంద్ర పాపా
యే ధర్మనిత్యస్య సతస్తవైవమ్ ॥ 10
నరేంద్రా! క్రూరబుద్ధియైన దుర్యోధనుని ధిక్కరిస్తున్నాం. సౌబలుడైన శకునిని, పాపామతియైన కర్ణుని కూడ తిరస్కరిస్తున్నాం. నిత్యమూ ధర్మతత్పరుడవైన నీకే ఈ విధంగా అనర్థాన్ని కోరుతున్న ఆ పాపాత్ములందరిని తిరస్కరిస్తున్నాం. (10)
స్వయం నివేశ్యాప్రతిమం మహాత్మా
పురం మహాదేవపురప్రకాశమ్ ।
శతక్రతుప్రస్థమమేయకర్మా
హిత్వా ప్రయాతః క్వ ను ధర్మరాజః ॥ 11
అచింత్యకర్ముడు, మహాత్ముడు అయిన ధర్మరాజు స్వయంగా అనుపమానమైన (పోలికయేలేనట్టి) ఈ ఇంద్ర ప్రస్థపురాన్ని నిర్మించి, తానే దానిని వదలి ఎక్కడకు వెళ్తున్నాడు? (11)
చకార యామప్రతిమాం మహాత్మా
సభాం మయో దేవసభాప్రకాశామ్ ।
తాం దేవగుప్తామివ దేవమాయాం
హిత్వా ప్రయాతః క్వ ను ధర్మరాజః ॥ 12
మహాత్ముడైన మయుడు దేవసభవలె ప్రకాశిమ్చే అప్రతిమమైన మయసభను నిర్మించాడు. దేవతలచే రక్షింపబడినట్లుగా నున్న దేవమాయా రూపమైన ఈ మాయాసభను వదిలి ధర్మరాజు ఎక్కడకు బయలుదేరావు? (12)
తాన్ ధర్మకామార్థవిదుత్తమౌజా
బీభత్సురుచ్చైః సహితానువాచ ।
ఆదాస్యతే వాసమిమం నిరుష్య
వనేషు రాజా ద్విషతాం యశాంసి ॥ 13
ధర్మార్థకామాలనెరింగిన, ఉత్తమ పరాక్రమవంతుడైన అర్జునుడు అచటి జనసమూహానికి ఉచ్చైఃస్వరంతో ఇలా చెప్పాడు - యుధిష్ఠిరమహారాజు ఈ వనవాస నియమాన్ని పూర్తిచేసి, శత్రువులైన ధార్తరాష్ట్రుల కీర్తిని తిరిగి లాక్కుంటాడు. (13)
ద్విజాతిముఖ్యాః సహితాః పృథక్ చ
భవద్భిరాసాద్య తపస్వినశ్చ ।
ప్రసాద్య ధర్మార్థవిదశ్చ వాచ్యా
యథార్థసిద్ధిః పరమా భవేన్నః ॥ 14
బ్రాహ్మణ శ్రేష్ఠులారా! మీరంతా కలిసి, విడివిడిగా కూడా తాపసులను, ధర్మార్థ వేత్తలను కలిసి ప్రసన్నులను చేసికొని చక్కగా కార్యసిద్ధి కలగాలని ప్రార్థించండి. (14)
ఇత్యేవముక్తే వచనేఽర్జునేన
తే బ్రాహ్మణాః సర్వవర్ణాశ్చ రాజన్ ।
ముదాభ్యనందన్ సహితాశ్చ చక్రుః
ప్రదక్షిణం ధర్మభృతాం వరిష్ఠమ్ ॥ 15
ఈ విధంగా అర్జునుడు చెప్పగానే, అక్కడి బ్రాహ్మణులు, అన్ని వర్ణాలవారూ ఆనందంతో అభినందించారు. వారంతా కలిసి ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన యుధిష్ఠిరునికి ప్రదక్షిణం చేశారు. (15)
ఆమంత్ర్య పార్థం చ వృకోదరం చ
ధనంజయం యాజ్ఞసేనీం యమౌ చ ।
ప్రతస్థిరే రాష్ట్రమపేతహర్షాః
యుధిష్ఠిరేణానుమతా యతాస్వమ్ ॥ 16
అనంతరం వారంతా యుధిష్ఠిర భీమార్జున నకుల సహదేవులను ద్రౌపదిని సెలవడిగి తమ రాష్ట్రానికి ప్రయాణమయ్యారు. (16)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి సౌభవధోపాఖ్యానే త్రయోవింశోఽధ్యాయః ॥ 23 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున ద్వైతవన ప్రవేశమను ఇరువది మూడవ అధ్యాయము. (23)