24. ఇరువది నాలుగవ అధ్యాయము

పాండవులు ద్వైతవనమునకు వెళ్ళుట.

వైశంపాయన ఉవాచ
తతస్తేషు ప్రయాతేషు కౌంతేయః సత్యసంగరః ।
అభ్యభాషత ధర్మాత్మా భ్రాతౄన్ సర్వాన్ యుధిష్ఠిరః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు -
జనమేజయా! ఆ కురుజాంగలదేశీయులైన జనులంతా వెళ్ళాక సత్యప్రతిజ్ఞుడు, ధర్మాత్ముడు, అయిన యుధిష్ఠిరుడు తన సోదరులందరితో ఇలా అన్నాడు. (1)
ద్వాదశేమాని వర్షాణి వస్తవ్యం నిర్జనే వనే ।
సమీక్షధ్వం మహారణ్యే దేశం బహుమృగద్విజమ్ ॥ 2
'ఈ పన్నెండు సంవత్సరాలు నిర్జనమైన వనంలో నివసించాలి. అనేక పశుపక్ష్యాదులుండే ప్రదేశాన్ని ఈ మహారణ్యంలో పరిశీలించండి. (2)
బహుపుష్పఫలం రమ్యం శివం పుణ్యజనావృతమ్ ।
యత్రేమాః శరదః సర్వాః సుఖం ప్రతివసేమహి ॥ 3
పలు పుష్ప ఫలాలు కలిగి అందమై, మంగళకరమై, పుణ్యాత్ములు గల ప్రదేశాన్ని చూడండి. ఈ పన్నెండు సంవత్సరాలు మనం అక్కడ సుఖంగా నివసించగలగాలి', అన్నాడు. (3)
ఏవముక్తే ప్రత్యువాచ ధర్మరాజం ధనంజయః ।
గురువన్మానవగురుం మానయిత్వా మనస్వినమ్ ॥ 4
అపుడు ధనంజయుడు ఉదారమనస్కుడు, మానవ గురువూ అయిన ధర్మరాజును గురుతుల్యునిగా సంభావించి, అతనితో ఇలా అన్నాడు. (4)
అర్జున ఉవాచ
భవానేవ మహర్షీణాం వృద్ధానాం పర్యుపాసితా ।
అజ్ఞాతం మానుషే లోకే భవతో నాస్తి కించన ॥ 5
అర్జునుడిలా అన్నాడు.
మహర్షులకు, వృద్ధులకు నీవే సేవింపదగినవాడవు. ఈ మానవలోకంలో నీకు తెలియనిది ఏమీ లేదు. (5)
త్వయా హ్యుపాసితా నిత్యం బ్రాహ్మణా భరతర్షభ ।
ద్వైపాయనప్రభృతయః నారదశ్చ మహాతపాః ॥ 6
భరతశ్రేష్ఠా! నీవు నిత్యం బ్రాహ్మణులను; నారదుడు, ద్వైపాయనుడు మున్నగు మహాతపస్వులను సేవిస్తావు. (6)
యః సర్వలోకద్వారాణి నిత్యం సంచరతే వశీ ।
దేవలోకాద్ బ్రహ్మలోకం గంధర్వాప్సరసామపి ॥ 7
ఇంద్రియాలను వశమందుంచుకొని దేవలోకం నుండి బ్రహ్మలోకం వరకు, సర్వలోకాలను, గంధర్వ, అప్సరల లోకాలను నిత్యం సంచరించే మహాతపస్వి అయిన నారదుని నీవు సేవిస్తావు. (7)
అనుభావాంశ్చ జానాసి బ్రాహ్మణానాం న సంశయః ।
ప్రభావాంశ్చైవ వేత్థ త్వం సర్వేషామేవ పార్థివ ॥ 8
రాజా! నీవు బ్రాహ్మణులందరి అనుభావాలను, ప్రభావాలను ఎరుగుదువు. ఇందులో సందేహం లేదు. (8)
త్వమేవ రాజన్ జానాసి శ్రేయఃకారణమేవ చ ।
యత్రేచ్ఛసి మహారాజ నివాసం తత్ర కుర్మహే ॥ 9
రాజా! శ్రేయః కారణమైన జ్ఞానాన్ని తెలిసిన వాడవు. నీవే. మహారాజా! నీవెక్కడ ఉండాలని భావిస్తే అక్కడే నివాసం ఉందాము. (9)
ఇదం ద్వైతవనం నామ సరః పుణ్యజలోచితమ్ ।
బహుపుష్పఫలం రమ్యం నానాద్విజనిషేవితమ్ ॥ 10
ఇది ద్వైతవనం. ఇందులో చక్కని సరస్సులున్నాయి. పవిత్రజలం గలిగి, ఆస్వాదయోగ్యంగా ఉన్నాయి. ఎన్నో పూలు, పళ్ళు ఇక్కడ ఉన్నాయి. అనేక పక్షులతో కూడి ఇది అందంగా ఉంటుంది. (10)
అత్రేమా ద్వాదశ సమాః విహరామేతి రోచయే ।
యది తేఽనుమతం రాజన్ కిమన్యన్మన్యతే భవాన్ ॥ 11
ఇక్కడ ఈ పన్నెండు సంవత్సరాలూ మనం నివసించగలమని నేను అభిప్రాయపడుతున్నాను. రాజా! నీకిష్టమైతే మనం ఇక్కడ ఉందాం. లేక మరొక ప్రదేశం ఉత్తమమైందిగా నీవు భావిస్తున్నావా! (11)
యుధిష్ఠిర ఉవాచ
మమాప్యేతన్మతం పార్థ త్వయా యత్ సముదాహృతమ్ ।
గచ్ఛామః పుణ్యవిఖ్యాతం మహద్ ద్వైతవనం సరః ॥ 12
అపుడు యుధిష్ఠిరుడిలా అన్నాడు - పార్థా! నీవు చెప్పినది నాకు కూడా ఇష్టమే. పుణ్యాత్ములచే ప్రసిద్ధికెక్కిన సరస్సులున్న ద్వైతవనానికే వెళ్దాము. (12)
వైశంపాయన ఉవాచ
తతస్తే ప్రయయుః సర్వే పాండవా ధర్మచారిణః ।
బ్రాహ్మణైర్బహుభిః సార్ధం పుణ్యం ద్వైతవనం సరః ॥ 13
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! అపుడు ధర్మాచారతత్పురులైన ఆ పాండవులంతా పలువురు బ్రాహ్మణులతో కూడి పవిత్రమైన ద్వైతవనానికి వెళ్లారు. (13)
బ్రాహ్మణాః సాగ్నిహోత్రాశ్చ తథైవ చ నిరగ్నయః ।
స్వాధ్యాయినో భిక్షవశ్చ తథైవ వనవాసినః ॥ 14
బహవో బ్రాహ్మణాస్తత్ర పరివవ్రుర్యుధిష్ఠిరమ్ ।
తపఃసిద్ధా మహాత్మానః శతశః సంశితవ్రతాః ॥ 15
అప్పుడు పలువురు అగ్నిహోత్రం చెసే బ్రాహ్మణులు, అగ్నిహోత్రం లేని బ్రాహ్మణులు, స్వాధ్యాయం అధ్యయనం చేసే బ్రహ్మచారులు, భిక్షువులు, వనచరులు, తపస్సిద్ధులు, మహాత్ములు, కఠోర నియమాలు పాటించే బ్రాహ్మణులు యుధిష్ఠిరుని సమీపించారు. (14,15)
తే యాత్వా పాండవాస్తత్ర బ్రాహ్మణైర్బహుభిః సహ ।
పుణ్యం ద్వైతవనం రమ్యం వివిశుర్భరతర్షభాః ॥ 16
పలువురు బ్రాహ్మణులతో బాటు పాండవులు పుణ్యమైన, రమ్యమైన ద్వైతవనానికి చేరుకొన్నారు. (16)
తమాలతాలామ్రమధూకనీప
కదంబసర్జార్జునకర్ణికారైః ।
తపాత్యయే పుష్పధరైరుపేతం
మహావనం రాష్ట్రపతిర్దదర్శ ॥ 17
రాజ్యాధిపతి అయిన యుధిష్టిరుడు తమాల, తాల, ఆమ్ర, మధూక, నీప, కదంబ, సాల, అర్జున, కర్ణికారవృక్షాలతోను గ్రీష్మఋతువు గడిచాక పూలుపూసే అనేక వృక్షాలతో కూడిన మహావనాన్ని చూశాడు. (17)
మహాద్రుమాణాం శిఖరేషు తస్థుః
మనోరమాం వాచముదీరయంతః ।
మయూరదాత్యూహచకోరసంఘాః
తస్మిన్ వనే బర్హిణకోకిలాశ్చ ॥ 18
ఆ వనంలోని పెద్దపెద్ద చెట్ల చిటారుకొమ్మల మీద నెమళ్ళు, చకోరాలు, చాతకాలు, కోకిలలు మొదలగునవి పక్షుల సమూహాలు కలకలారావాలు చేస్తూ నివసిస్తున్నాయి. (18)
కరేణుయూథైః సహ యూథపానాం
మదోత్కటానామచలప్రభాణామ్ ।
మహాంతి యూథాని మహాద్విపానాం
తస్మిన్ వనే రాష్ట్రపతిర్దదర్శ ॥ 19
ఆ వనంలో యుధిష్ఠిరుడు పర్వతాకారంలో ఉన్న మదించిన ఏనుగుల గుంపులు ఆడ ఏనుగులతో కలిసి తిరుగుతూండడం చూశాడు. (19)
మనోరమాం భోగవతీముపేత్య
పూతాత్మనాం చీరజటాధరాణామ్ ।
తస్మిన్ వనే ధర్మభృతాం నివాసే
దదర్శ సిద్ధర్షిగణాననేకాన్ ॥ 20
మనోజ్ఞమైన సరస్వతీనదిలో స్నానం చేసి పవిత్రులై నారవస్త్రాలు, జటలను ధరించి ధర్మాత్ములయిన వారి నివాసాలలో ఉన్న అనేక సిద్ధగణాలను, ఋషిగణాలను యుధిష్ఠిరుడు చూశాడు. (20)
తతః స యానాదవరుహ్య రాజా
సభ్రాతృకః సజనః కాననం తత్ ।
వివేశ ధర్మాత్మవతామ్ వరిష్ఠః
త్రివిష్టపం శక్ర ఇవామితౌజాః ॥ 21
అనంతరం సోదరులతో, జనులతోబాటు ధర్మరాజు రథం నుండి దిగి ఇంద్రుడు స్వర్గంలో ప్రవేశించినట్లుగ ఆ వనంలోకి ప్రవేశించాడు. (21)
తం సత్యసంధం సహసాబిపేతుః
దిదృక్షవశ్చారణసిద్ధసంఘాః ।
వనౌకసశ్చాపి నరేంద్రసింహం
మనస్వినం తం పరివార్య తస్థుః ॥ 22
సత్యసంధుడు మనస్వి అయిన యుధిష్ఠిరుని చూడాలని చారణసిద్ధసంఘాలు, వనంలో నివసిస్తున్న వారు త్వరగా అతనిని సమీపించి చుట్టూ నిలిచారు. (22)
స తత్ర సిద్ధానభివాద్య సర్వాన్
ప్రత్యర్చితో రాజవద్ దేవవచ్చ ।
వివేశ సర్వైః సహితో ద్విజాగ్ర్యైః
కృతాంజలిర్ధర్మభృతాం వరిష్ఠః ॥ 23
అపుడు యుధిష్ఠిరుడు సిద్ధులందరికి అభివాదమ్ చేశాడు. వారు కూడ అతడిని రాజులా, దేవునిలా పూజించారు. ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన ధర్మరాజు అంజలిబద్ధుడై బ్రాహ్మణశ్రేష్ఠులతో పాటుగ వనంలో ప్రవేశించాడు. (23)
స పుణ్యశీలః పితృవన్మహాత్మా
తపస్విభిర్ధర్మపరైరుపేత్య ।
ప్రత్యర్చితః పుష్పధరస్య మూలే
మహాద్రుమస్యోపవివేశ రాజా ॥ 24
ఆ వనంలో ఉన్న ధర్మపరులైన తపస్విజనులు పుణ్యాతుడైన ధర్మరాజును సమీపించి అతనిని తండ్రివలె గౌరవించారు. అపుడు యుధిష్ఠిరుడు బాగా పూలు పూసిన ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చున్నాడు. (24)
భీమశ్చ కృష్ణా చ ధనంజయశ్చ
యమౌ చ తే చానుచరా నరేంద్రమ్ ।
విముచ్య వాహానవశాశ్చ సర్వే
తత్రోపతస్థుర్భరతప్రబర్హాః ॥ 25
అనంతరం పరాధినదశలో ఉన్న భీమార్జున నకులసహదేవులు, ద్రౌపది, అనుచరులు రథాలు దిగి భరతశ్రేష్ఠుడైన యుధిష్ఠిరుని చెంతకు వచ్చారు. (25)
లతావతానావనతః స పాండవః
మహాద్రుమః పంచభిరేవ ధన్విభిః ।
బభౌ నివాసోపగతైర్మహాత్మభిః
మహాగిరిర్వారణయూథపైరివ ॥ 26
మహాపర్వతం గజరాజులతో శోభిల్లినట్లుగా ఆశ్రయం కోసం చేరిన ధనుర్ధరులైన ఆ పంచపాండవులతో కూడి లతాసమూహాలచే వంగిన ఆ మహావృక్షం శోభిల్లుతోంది. (26)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి ద్యైతవనప్రవేశే చతుర్వింశోఽధ్యాయః ॥ 24 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున ద్వైతవనప్రవేశమను ఇరువది నాల్గవ అధ్యాయము. (24)