27. ఇరువది ఏడవ అధ్యాయము
ద్రౌపది తన క్రోధమును యుధిష్ఠిరునికి తెలుపుట.
వైశంపాయన ఉవాచ
తతో వనగతాః పార్థాః సాయాహ్నే సహ కృష్ణయా ।
ఉపవిష్టాః కథాశ్చక్రుః దుఃఖశోకపరాయణాః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - అనంతరం ఒక సాయంకాల సమయంఓ ద్రౌపదితో పాటుగ దుఃఖశోకపరాయణులైన పాండవులు కూర్చుండి మాట్లాడుకొంటూ ఉన్నారు. (1)
ప్రియా చ దర్శనీయా చ పండితా చ పతివ్రతా ।
అథ కృష్ణా ధర్మరాజమ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 2
పాండవుల ప్రియురాలు, దర్శనీయురాలు (సౌందర్యవతి), పండితురాలు, పతివ్రత అయిన ద్రౌపది ధర్మరాజుతో ఈ విధంగా మాటలాడింది. (2)
న నూనం తస్య పాపస్య దుఃఖమస్మాసు కించన ।
విద్యతే ధార్తరాష్ట్రస్య నృశంసస్య దురాత్మనః ॥ 3
ద్రౌపది ఇలా పలికింది - రాజా! క్రూరుడు, దుర్మార్గుడు, పాపి అయిన దుర్యోధనుడికి మనపట్ల కొంచెం కూడా విచారం లేదు అని భావిస్తున్నాను. (3)
యస్త్వాం రాజన్ మయా సార్ధమ్ అజినైః ప్రతివాసితమ్ ।
వనం ప్రస్థాప్య దుష్టాత్మా నాన్వతప్యత దుర్మతిః ॥ 4
దుర్బుద్ధి అయిన ఆ దుర్యోధనుడు నాతోబాటు నిన్ను కేవలం కట్టుకొన్న వస్త్రాలతో వనానికి పంపి, ఏమాత్రం పశ్చాత్తాపం పడటం లేదు. (4)
ఆయసం హృదయం నూనం తస్య దుష్కృతకర్మణః ।
యస్త్వాం ధర్మపరం శ్రేష్ఠం రూక్షాణ్యశ్రావయత్ తదా ॥ 5
శ్రేష్ఠుడవు. ధర్మపరుడవూ అయిన నిన్ను గురించి అపుడు కఠినమైన మాటలాడి దుష్కర్మలు చేసే దుర్యోధనుడిది ఇనుము వంటి కఠిన హృదయం (5)
సుఖోచితమదుఃఖార్హం దురాత్మా ససుహృద్గణః ।
ఈదృశం దుఃఖమానీయ మోదతే పాపపూరుషః ॥ 6
సుఖాలనుభవించడానికి యోగ్యుడవైన నీకు ఇటువంటి కష్టాన్ని కల్గించి, దుర్మార్గుడు, పాపి అయిన ఆ దుర్యోధనుడు తన స్నేహితులతోపాటు ఆనందిస్తున్నాడు. (6)
చతుర్ణామేవ పాపానామ్ అస్రం న పతితం తదా ।
త్వయి భారత నిష్క్రాంతే వనాయాజినవాససి ॥ 7
భరతశ్రేష్ఠా! నారబట్టలు కట్టుకొని నీవు వనవాసానికి బయలుదేరినపుడు కేవలం నలుగురు పాపాత్ముల నేత్రాల నుండి మాత్రమే అశ్రువులు రాలేదు. (7)
దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః ।
దుర్భ్రాతుస్తస్య చోగ్రస్య రాజన్ దుఃశాసనస్య చ ॥ 8
రాజా! దుర్యోధనుడు, కర్ణుడు, దుర్మార్గుడైన శకుని, ఉగ్రస్వభావుడు, దుష్టసోదరుడూ అయిన దుఃశాసనుడు అనే ఈ నలుగురు పాపాత్ముల కళ్ళ నుండి అశ్రువులు రాల లేదు. (8)
ఇతరేషాం తు సర్వేషాం కురుణాం కురుసత్తమ ।
దుఃఖేనాభిపరీతానాం నేత్రేభ్యః ప్రాపతజ్జలమ్ ॥ 9
కురుసత్త్మా! తక్కిన కురువంశీయులందరు దుఃఖంతో వ్యాకులపడ్డారు. వారినేత్రాల నుండి అశ్రువిందువులు రాలాయి. (9)
ఇదం చ శయనం దృష్ట్వా యచ్చాసీత్ తే పురాతనమ్ ।
శోచామి త్వాం మహారాజ దుఃఖానర్హం సుఖోచితమ్ ॥ 10
మహారాజా! ఇపుడు నీవు నిదురించే శయ్యను చూస్తే, మునుపు నీ రాజోచితమైన శయ్య గుర్తుకువచ్చి, నీ గురిమ్చే దుఃఖిస్తున్నాను. నీవు కష్టాలు పడదగిన వాడవు కాదు. సుఖాలనుభవింపదగినవాడవు. (10)
దాంతం యచ్చ సభామధ్య ఆసనం రత్నభూషిత్మ్ ।
దృష్ట్వా కుశవృషీం చేమాం శోకో మాం ప్రదహత్యయమ్ ॥ 11
సభామధ్యంలో ఏనుగుదంతాలతో నిర్మితమయిన రత్నసింహాసనం చూసిన నేను దర్భలతో చేయబడిన ఈ ఆసనాన్ని చూస్తే, దుఃఖం నా హృదయాన్ని దహించేస్తుంది. (11)
యదపశ్యం సభాయాం త్వాం రాజభిః పరివారితమ్ ।
తచ్చ రాజన్నపశ్యంత్యాః కా శాంతిర్హృదయస్య మే ॥ 12
రాజా! మునుపు ఇంద్రప్రస్థంలో సభలో రాజులందరితో కూడి ఉన్న నిన్ను చూశాను. ఆ స్థితిలో ఇక్కడ నిన్ను చూడలేని నా హృదయానికి శాంతి లేదు. (12)
యాత్వాహం చందనాదిగ్ధమ్ అపశ్యం సూర్యవర్చసమ్ ।
సా త్వాం పంకమలాదిగ్ధం దృష్ట్వా ముహ్యామి భారత ॥ 13
భారతా! మునుపు సూర్యుని వంటి తేజస్సుతో, మంచిగంధం పూయబడిన నిన్ను చూసే నాకు ఇపుడు బురద, ధూళి అంటిన నిన్ను చూస్తే ఎంతో దుఃఖం కలుగుతోంది. (13)
యా త్వాహం కౌశికైర్వస్రైః శుభై రాచ్ఛాదితం పురా ।
దృష్టవత్యస్మి రాజేంద్ర సా త్వాం పశ్యామి చీరిణమ్ ॥ 14
రాజేంద్రా! మునుపు స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న పట్టువస్త్రాలను ధరించిన నిన్ను చూశాను. ఇపుడిలా నారబట్టలు కట్టుకొన్న నిన్ను చూడవలసివచ్చింది. (14)
యచ్చ తద్రుక్మపాత్రీభిః బ్రాహ్మణేభ్యః సహస్రశః ।
హ్రియతే తే గృహాదన్నం సంస్కృతం సార్వకామికమ్ ॥ 15
అపుడు మన ఇంటి నుండి వేలకొలది బ్రాహ్మణులకు రుచికరమైన పలువంటకాలతో బంగారు పాత్రలతో అన్నం తీసికొనివెళ్ళేవారు. (15)
యతీనామగృహాణాం తే తథైవ గృహమేధినామ్ ।
దీయతే భోజనం రాజన్ అతీవగుణవత్ ప్రభో ॥ 16
రాజా! ప్రభూ! యతులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు మిక్కిలి రుచికరమైన భోజనం అపుడు పెట్టబడేది. (16)
సత్కృతాని సహస్రాణి సర్వకామైః పురా గృహే ।
సర్వకామైః సువిహితైః యదపూజయథా ద్విజాన్ ॥ 17
మునుపు రాజభవనంలో బంగారుపాత్రలు అన్ని విధాన ఇష్టాలైన వంటకాలతో నిండి ఉండేవి. ప్రతిదినమూ బ్రాహ్మణులను వారివారి ఇష్టాలకు అనుగుణంగా సత్కరించేవాడివి. (17)
తచ్చ రాజన్నపశ్యంత్యాః కా శాంతిర్హృదయస్య మే ।
యత్ తే భ్రాతౄన్ మహారాజ యువానో మృష్టకుండలాః ॥ 18
అభోజయంత మిష్టాన్నైః సూదాః పరమసంస్కృతైః ।
సర్వాంస్తానద్య పశ్యామి వనే వన్యేన జీవినః ॥ 19
ఆ వైభవమంతా ఇపుడు చూడలేని నా హృదయానికి శాంతి ఎక్కడిది? మహారాజా! అందమైన కుండలాలు చెవులకు ధరించిన, యువకులైన నో సోదరులు, రుచికరాలైన వంటకాలతో భుజించేవారు. అట్టివారు ఇపుడు వన్యాలైన కందమూలఫలాలతో జీవించడం నేను చూస్తున్నాను. ఇక నా హృదయానికి శాంతి ఎక్కడిది? (18,19)
అదుఃఖార్హాన్ మనుష్యేంద్ర నోపశామ్యతి మే మనః ।
భీమసేనమియం చాపి దుఃఖితం వనవాసినమ్ ॥ 20
ధ్యాయతః కిం న మన్యుస్తే ప్రాప్తే కాలే వివర్ధతే ।
భీమసేనం హి కర్మాణి స్వయం కుర్వాణమచ్యుతమ్ ॥ 21
సుఖార్హం దుఃఖితం దృష్ట్వా కస్మాన్మన్యుర్న వర్ధతే ।
మనుష్యేంద్రా! దుఃఖాలనుభవించడానికి యోగ్యులు కాని నీ సోదరులను చూస్తూంటే నా మనస్సు శాంతించడం లేదు. ఈ వనవాసకష్టాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తూన్న ఈ భీమసేనుని గురించి తలచుకొంటూన్న సమయంలో నీకు శత్రువుల పట్ల కోపం కలగటం లేదా! యుద్ధంలో వెన్ను చూపనివీరుడు
ఈనాడు స్వయంగా పనులన్నీ చేస్తున్నాడు. సుఖభోగాలకు అర్హుడు, దుఃఖం అనుభవిస్తున్నాడు. భీమసేనుణ్ణి చూస్తే నీకు క్రోధం ఎందుకు రావటంలేదు? (20,21 1/2)
సత్కృతం వివిధైర్యానైః వస్త్రైరుచ్చావచైస్తథా ॥ 22
తం తే వనగతం దృష్ట్వా కస్మాన్మన్యుర్న వర్ధతే ।
వివిధాలైన వాహనాల చేత, ఉన్నతాలైన పలువస్త్రాల చేత సత్కారాలు పొందిన భీమసేనుడు వనంలో కష్టాలనుభవిస్తూంటే నీకు కోపం ఎందుకు రావటం లేదు? (22 1/2)
అయం కురూన్ రణే సర్వాన్ హంతుముత్సహతే ప్రభుః ॥ 23
త్వత్ర్పతిజ్ఞాం ప్రతీక్షంస్తు సహతేఽయం వృకోదరః ।
శక్తిశాలి అయిన భీమసేనుడు యుద్ధంలో కౌరవులందరినీ చంపడానికి ఉత్సాహపడుతున్నాడు. కాని నీ ప్రతిజ్ఞాపూర్తికై నిరీక్షిస్తూ శత్రువుల అపరాధాన్ని సహిస్తున్నాడు. (23 1/2)
యోఽర్జునేనార్జునస్తుల్యః ద్విబాహుర్బహుబాహునా ॥ 24
శరావమర్దే శీఘ్రత్వాత్ కాలాంతకయమోపమః ।
యస్య శస్త్రప్రతాపేన ప్రణతాః సర్వపార్థివాః ॥ 25
యజ్ఞే తవ మహారాజ బ్రాహ్మణానుపతస్థిరే ।
తమిమం పురుషవ్యాఘ్రం పూజితం దేవదానవైః ॥ 26
ధ్యాయంతమర్జునం దృష్ట్వా కస్మాద్ రాజన్ న కుప్యసి ।
మహారాజా! నీ సోదరుడు అర్జునుడు రెండుబాహువులే ఉన్నా, అనేక బాహువులు కల కార్తవీర్యార్జునునితో సమానుడు. బాణాలతో హింసించడం లో వేగం కలవాడవటం వల్ల కాలాంతక యములతో పోలినవాడు. అతని శస్త్రాల ప్రతాపం చేత రాజులందరూ శిరసులు వంచారు. వారంతా నీయజ్ఞంలో బ్రాహ్మణులను సేవించడానికి వచ్చారు. అటువంటి పురుషసింహుడు, దేవదానవులచే పూజింపబడిన అర్జునుని తలచుకొంటూంటే నీకు శత్రువులపై కోపం ఎందుకు కలగడం లేదు? (24-26 1/2)
దృష్ట్వా వనగతం పార్థమ్ అదుఃఖార్హం సుఖోచితమ్ ॥ 27
న చ తే వర్ధతే మన్యుః తేన ముహ్యామి భారత ।
భారతా! దుఃఖించడానికి యోగ్యుడు కాని అర్జునుడు వనంలో కష్టాలు పడుతూంటే చూసి, నీకు కోపం రావటం లేదు. అందుచేత నేను బాధపడుతున్నాను. (27 1/2)
యో దేవాంశ్చ మనుష్యాంశ్చ సర్పాంశ్చైకరథోఽజయత్ ॥ 28
తం తే వనగతం దృష్ట్వా కస్మాన్మన్యుర్న వర్ధతే ।
ఒకే ఒక రథంతో దేవతలను, మనుష్యులను, నాగులను జయించిన అర్జునుడు వనవాసం చేస్తూంటే చూసిన నీకు కోపం ఎందుకు రావటంలేదు? (28 1/2)
యో యానైరద్బూతాకారైః హయైర్నాగైశ్చ సంవృతః ॥ 29
ప్రసహ్య విత్తాన్యాదత్త పార్థివేభ్యః పరంతప ।
క్షిపత్యేకేన వేగేన పంచబాణశతాని యః ॥ 30
తం తే వనగతం దృష్ట్వా కస్మాన్మన్యుర్న వర్ధతే ।
పరాజితులైన రాజుల నుండి అద్భుతాకారం గల గుర్రాలు, ఏనుగులు, సంపదలు తీసికొని వచ్చినవాడు; ఒకేవేగంతో ఐదువందల బాణాలను వేయగలవాడు అయిన అర్జునుడు వనవాసం చేస్తూంటే చూసిన నీకు కోపం ఎందుకు రావటం లేదు? (29, 30 1/2)
శ్యామం బృహంతం తరుణం చర్మిణాముత్తమం రణే ॥ 31
నకులం తే వనే దృష్వా కస్మాన్మన్యుర్న వర్ధతే ।
యుద్ధంలో ఖడ్గమూ, డాలు ధరించి యుద్ధంచేసే వీరశ్రేష్ఠుడు నకులుడు వనంలో ఉండడం చూసిన నీకు క్రోధం ఎందుకు రావటం లేదు? (31 1/2)
దర్శనీయం చ శూరం చ మాద్రీపుత్రం యుధిష్ఠిర ॥ 32
సహదేవం వనే దృష్ట్వా కస్మాత్ క్షమసి పార్థివ ।
యుధిష్ఠిరా! చూడచక్కనివాడు, శూరుడు, మాద్రిపుత్రుడూ అయిన సహదేవుని ఈ స్థితిలో చూసిన నీవు శత్రువులను ఇంకా ఎందుకు క్షమిస్తున్నావు? (32 1/2)
నకులం సహదేవం చ దృష్ట్వా తే దుఃఖితావుభౌ ॥ 33
అదుఃఖార్హౌ మనుష్యేంద్ర కస్మాన్మన్యుర్న వర్ధతే ।
మనుష్యేంద్రా! కష్టాలనుభవించడానికి తగనివారై కూడా, దుఃఖిస్తున్న నకులసహదేవులను చూసి నీకు క్రోధం ఎందుకు రావటం లేదు? (33 1/2)
ద్రుపదస్య కులే జాతాం స్నుషాం పాండోర్మహాత్మనః ॥ 34
ధృష్టద్యుమ్నస్య భగినీం వీరపత్నీమనువ్రతామ్ ।
మాం వై వనగతాం దృష్ట్వా కస్మాత్ క్షమసి పార్థివ ॥ 35
పార్థివా! ద్రుపదుని వంశంలో పుట్టి, మహాత్ముడైన పాండురాజునకు కోడలనై, ధృష్టద్యుమ్నుని సోదరినై, వీరపత్నిని పతివ్రతను అయిన నన్ను వనవాసం చేస్తూండగా చూసి, నీవు శత్రువులను ఎందుకు క్షమిస్తున్నావు? (34,35)
నూనం చ తవ వై నాస్తి మన్యుర్భరతసత్తమ ।
యత్ తే భ్రాతౄంశ్చ మాం చైవ దృష్ట్వా న వ్యథతే మనః ॥ 36
భరతసత్తమా! ఇది నిశ్చయం. నీహృదయంలో శత్రువుల పట్ల కోపం లేదు. నీ సోదరులనూ, నన్నూ ఈ స్థితిలో చూసినా నీ మనస్సు బాధపడటం లేదు. (36)
న నిర్మన్యుః క్షత్రియోఽస్తి లోకే నిర్వచనం స్మృతమ్ ।
తదద్య త్వయి పశ్యామి క్షత్రియే విపరీతవత్ ॥ 37
ఈ లోకంలో కోపంలేని క్షత్రియుడు లేడు. నాశనం చేసేవాడు క్షత్రియుడని నిర్వచనం. కాని క్షత్రియుడవైన నీ విషయంలో ఆ నిర్వచనం విపరీతమైనట్లుగా కనబడుతోంది. (37)
యో న దర్శయతే తేజః క్షత్రియః కాల ఆగతే ।
సర్వభూతాని తం పార్థ సదా పరిభవంత్యుత ॥ 38
పృథానందనా! సమయం వచ్చినపుడు పరాక్రమాన్ని చూపనివానిపట్ల అన్నిప్రాణులూ తిరస్కారాన్ని చూపుతాయి. (38)
తత్ త్వయా న క్షమా కార్యా శత్రూన్ ప్రతి కథంచన ।
తేనసైవ హి తే శక్యా నిహంతుం నాత్ర సంశయః ॥ 39
మహారాజా! అందువల్ల నీవు ఏవిధంగా కూడా శత్రువులను క్షమించకూడదు. పరాక్రమంతోనే వారు చంపశక్యం అవుతారు. ఇందులో సందేహం లేదు. (39)
తథైవ యః క్షమాకాలే క్షత్రియో నోపశామ్యతి ।
అప్రియం సర్వభూతానాం సోఽముత్రేహ చ నశ్యతి ॥ 40
అదేవిధంగా సహనం వహించవలసిన సమయంలో శాంతిని పొందని క్షత్రియుడు కూడా ప్రాణులందరికి అప్రియుడే అవుతాడు. అతడు ఇహపరలోకాలలో నశిస్తాడు. (40)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి ద్రౌపదీపరితాపవాక్యే సప్తవింశోఽధ్యాయః ॥ 27 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున ద్రౌపదీ పరితాపవాక్యమను ఇరువది ఏడవ అధ్యాయము. (27)