26. ఇరువది ఆరవ అధ్యాయము
బకదాల్భ్యుడు యుధిష్ఠిరునికి బ్రాహ్మణ ప్రభావమును చెప్పుట.
వైశంపాయన ఉవాచ
వసత్సు వై ద్వైతవనే పాండవేషు మహాత్మసు ।
అనుకీర్ణం మహారణ్యం బ్రాహ్మణైః సమపద్యత ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! ఆద్వైతవనంలో మహాత్ములైన పాండవులు నివసిస్తూండగా, ఆ మహారణ్యమంతా బ్రాహ్మణులతో నిండిపోయింది. (1)
ఈర్యమాణేన సతతం బ్రహ్మఘోషేణ సర్వశః ।
బ్రహ్మలోకసమం పుణ్యమ్ ఆసీద్ ద్వైతవనం సరః ॥ 2
ఎల్లపుడూ ఉచ్చరింపబడే వేదఘోషచేత సరోవరాలతో కూడి ఉన్న ఆ ద్వైతవనం అన్నివైపులా బ్రహ్మలోకంతో సమానంగా పవిత్రమై విరాజిల్లింది. (2)
యజుషామృచాం సామ్నాం చ గద్యానాం చైవ సర్వశః ।
ఆసీదుచ్చార్యమాణానాం నిఃస్వనో హృదయంగమః ॥ 3
అక్కడ అంతటా ఋగ్యజుస్సామ వేదాలనూ, గద్య భాగాలను పఠిస్తున్నారు. వాటి ధ్వని హృదయంగమంగా (మనోహరంగా) ఉంది. (3)
జ్యాగోషశ్చైవ పార్థానాం బ్రహ్మఘోషశ్చ ధీమతామ్ ।
సంసృష్టం బ్రహ్మణా క్షత్రం భూయ ఏవ వ్యరోచత ॥ 4
క్షత్రియుల వింటినారిధ్వని, పండితులైన బ్రాహ్మణుల వేదఘోష కలిసి క్షత్రతేజమ్ బ్రహ్మతేజంతో (సంసృష్టి) మరల పెనవేసుకొన్నట్లుగా అందంగా ప్రకాశించింది. (4)
అథాబ్రవీద్ బకో దాల్భ్యః ధర్మరాజం యుధిష్ఠిరమ్ ।
సంధ్యాం కౌంతేయమాసీనమ్ ఋషిభిః పరివారితమ్ ॥ 5
తరువాత ఒకరోజున సంధ్యాసమయంలో ఋషులతో పరివృతుడై ఉన్న కుంతీకుమారుడైన యుధిష్ఠిరుని సమీపించి, దల్భుని కుమారుడైన బకమహర్షి ఇలా చెప్పాడు. (5)
పశ్య ద్వైతవనే పార్థ బ్రాహ్మణానాం తపస్వినామ్ ।
హోమవేలాం కురుశ్రేష్ఠ సంప్రజ్వలితపావకామ్ ॥ 6
కురుశ్రేష్ఠా! కుంతీకుమారా! ఈ ద్వైతవనంలో తపస్వులైన బ్రాహ్మణుల హోమ సమయంలో ప్రజ్వరిల్లుతున్న అగ్ని ఎంత అందంగా ఉందో చూడు. (6)
చరంతి ధర్మం పుణ్యేఽస్మిన్ త్వయా గుప్తా ధృతవ్రతాః ।
భృగవోఽంగిరసశ్చైవ వాశిష్ఠాః కాశ్యపైః సహ ॥ 7
ఆగస్త్యాశ్చ మహాభాగాః ఆత్రేయాశ్చోత్తమవ్రతాః ।
సర్వస్య జగతః శ్రేష్ఠాః బ్రాహ్మణాః సంగతాస్త్వయా ॥ 8
పవిత్రమైన వనంలో నీచే రక్షింపబడుతూ వ్రతనియమం పాటిస్తూ బ్రాహ్మణులు ధర్మాన్ని ఆచరిస్తున్నారు. భృగువంశీయులు, అంగిరసులు, వసిష్ఠవంశీయులు, కశ్యపవంశీయులు, అగస్త్యవంశీయులు, మహాభాగులైన అత్రివంశీయులు, ఉత్తమవ్రతులై జగత్తంతటికి శ్రేష్ఠులైన బ్రాహ్మణులు వచ్చి నిన్ను కలుస్తున్నారు. (7,8)
ఇదం తు వచనం పార్థ శృణుష్వ గదతో మమ ।
భ్రాతృభిః సహ కౌంతేయ యత్ త్వాం వక్ష్యామి కౌరవ ॥ 9
కుంతీనందనా! కురుశ్రేష్ఠా! సోదరులతో ఉన్న నీవు నేను చెప్పే మాట విను. (9)
బ్రహ్మక్షత్రేణ సంసృష్టం క్షత్రం చ బ్రహ్మణా సహ ।
ఉదీర్ణే దహతః శత్రూన్ వనానీవాగ్నిమారుతౌ ॥ 10
బ్రాహ్మణులు క్షత్రియులతో, క్షత్రియులు బ్రాహ్మణులతో కలిసి ప్రబలులై గాలి, అగ్ని కలిసి వనాలను దహించినట్లుగా శత్రువులను దహిస్తారు. (10)
నా బ్రాహ్మణస్తాత చిరం బుభూషేద్
ఇచ్ఛన్నిమం లోకమముం చ జేతుమ్ ।
వినీతధర్మార్థమపేతమోహం
లబ్ధ్వా ద్విజం నుదతి నృపః సపత్నాన్ ॥ 11
నాయనా! ఇహలోక పరలోకాలను జయించాలనుకొనే రాజు బ్రాహ్మణుడు లేకుండగా ఎక్కువకాలం ఉండలేడు. ధర్మార్థాలను బాగా తెలిసి, మోహం లేని బ్రాహ్మణుని పొంది రాజు శత్రువులను నాశనం చేస్తాడు. (11)
చరన్ నైఃశ్రేయసం ధర్మం ప్రజాపాలనకారితమ్ ।
నాధ్యగచ్ఛద్ బలిర్లోకే తీర్థమన్యత్ర వై ద్విజాత్ ॥ 12
బలిచక్రవర్తి ప్రజాపాలనకై ఏర్పరచిన ధర్మాన్ని ఆచరిస్తూ నిఃశ్రేయసధర్మాన్ని లోకంలో బ్రాహ్మణుడి నుండి తప్ప వేరొకనివల్ల పొందలేదు. (12)
అనూనమాసీదసురస్య కామః
వైరోచనేః శ్రీరపి చాక్షయాఽఽసీత్ ।
లబ్ధ్వా మహీం బ్రాహ్మణసంప్రయోగాత్
తేష్వాచరన్ దుష్టమథో వ్యనశ్యత్ ॥ 13
బ్రాహ్మణునితో కలవడం వల్ల విరోచనుని కుమారుడైన బలి రాజ్యాన్ని పొంది, అక్షయమైన ఐశ్వర్యాన్ని పొంది, అనవసరాలైన కామోపభోగాలన్నింటిని పొందాడు. అతడే బ్రాహ్మణుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించి నశించాడు. (13)
నా బ్రాహ్మణం భూమిరియం సభూతిః ।
వర్ణం ద్వితీయం భజతే చిరాయ ।
సముద్రనేమిర్నమతే తు తస్మై
యం బ్రాహ్మణః శాస్తి నయైర్వినీతమ్ ॥ 14
బ్రాహ్మణసహయోగంలేని క్షత్రియుడు ఐశ్వర్య పూర్ణమైన ఈ భూమిని ఎక్కువకాలం సేవించలేడు. బ్రాహ్మణుని ఉపదేశాలు పొందిన నీతిజ్ఞుడైన క్షత్రియునకు సముద్ర పర్యంతమయిన భూమి శిరస్సు వంచుతుంది. (14)
కుంజరస్యేవ సంగ్రామే పరిగృహ్యాంకుశగ్రహమ్ ।
బ్రాహ్మణైర్విప్రహీణస్య క్షత్రస్య క్షీయతే బలమ్ ॥ 15
యుద్ధంలో ఏనుగునకు మావటీని దూరం చేస్తే దాని బలం క్షీణించినట్లుగా, బ్రాహ్మణుల తోడ్పాటు లేని క్షత్రియుని బలం క్షీణిస్తుంది. (15)
బ్రాహ్మణ్యనుపమా దృష్టిః క్షాత్రమప్రతిమం బలమ్ ।
తౌ యదా చరతః సార్ధం తదా లోకః ప్రసీదతి ॥ 16
బ్రాహ్మణుని విచారశక్తి (దృష్టి) (జ్ఞానం) పోలికలేనంతటిది. క్షత్రియునిది అప్రతిమమైన బలం, వారిద్దరూ కలిసి నడిస్తే సమస్తలోకం సుఖంగా ఉంటుంది. (16)
యథా హి సుమహానగ్నిః కక్షం దహతి సానిలః ।
తథా దహతి రాజన్యః బ్రాహ్మణేన సమం రిపుమ్ ॥ 17
వాయువుతో కూడిన అగ్ని మహారణ్యాన్ని దహిస్తుంది. అదే విధంగా బ్రాహ్మణునితో కూడిన క్షత్రియుడు శత్రువును దహిస్తాడు. (17)
బ్రాహ్మణేష్వేవ మేధావీ బుద్ధిపర్యేషణం చరేత్ ।
అలబ్ధస్య చ లాభాయ లబ్ధస్య పరివృద్ధయే ॥ 18
బుద్ధిమంతుడైనవాడు అలబ్ధమైనదాన్ని పొందటానికి, పొందినదాన్ని వృద్ధి చేసికోవడానికి బ్రాహ్మణుల ఆలోచనలోనే సంచరించాలి. (18)
అలబ్ధలాభాయ చ లబ్ధవృద్ధయే
యథార్హతీర్థ ప్రతిపాదనాయ ।
యశస్వినం వేదవిదం విపశ్చితం
బహుశ్రుతం బ్రాహ్మణమేవ వాసయ ॥ 19
రాజా! అప్రాప్తమైనదాన్ని పొందడానికి, పొందిన దాన్ని వృద్ధి చేసికోవడానికి యథాయోగ్యంగా ఉపాయాన్ని చెప్పడానికి నీవు యశస్వి, వేదవేత్త, పండితుడు, బహుశ్రుతుడు అయిన బ్రాహ్మణునే నివసింపనియ్యి. (పోషించు) (19)
బ్రాహ్మణేషూత్తమా వృత్తిః తవ నిత్యం యుధిష్ఠిర ।
తేన తే సర్వలోకేషు దీప్యతే ప్రథితం యశః ॥ 20
యుధిష్ఠిరా! బ్రాహ్మణుల పట్ల నీహృదయభావం ఎల్లపుడూ ఉత్తమమైనది. అందుచేత ప్రశస్తమైన నీకీర్తి అన్నిలోకాలలోనూ ప్రకాశిస్తున్నది. (20)
వైశంపాయన ఉవాచ
తతస్తే బ్రాహ్మణాః సర్వే బకం దాల్భ్యమపూజయన్ ।
యుధిష్ఠిరే స్తూయమానే భూయః సుమనసోఽభవన్ ॥ 21
వైశంపాయనుడిలా అన్నాడు - అటు తరువాత యుధిష్ఠిరుడు ఆ విధంగా స్తుతింపబడుచుండగా, అక్కడి బ్రాహ్మణులంతా దల్భకుమారుడైన బకుని పూజించారు. (21)
ద్వైపాయనో నారదశ్చ జామదగ్న్యః పృథుశ్రవాః ।
ఇంద్రద్యుమ్నో భాలుకిశ్చ కృతచేతాః సహస్రపాత్ ॥ 22
కర్ణశ్రవాశ్చ ముంజశ్చ లవణాశ్వశ్చ కాశ్యపః ।
హరీతః స్థూణకర్ణశ్చ అగ్నివేశ్యోఽథ శౌనకః ॥ 23
కృతవాక్ చ సువాక్ చైవ బృహదశ్వో విభావసుః ।
ఊర్ధ్వరేతో వృషామిత్రః సుహోత్రో హోత్రవాహనః ॥ 24
ఏతే చాన్యే చ బహవః బ్రాహ్మణాః సంశితవ్రతాః ।
అజాతశత్రుమానర్చుః పురందరమివర్షయః ॥ 25
వ్యాసుడు, నారదుడు, పరశురాముడు, పృథుశ్రవసుడు, ఇంద్రద్యుమ్నుడు, భాలుకి, కృతచేతసుడు, సహస్రపాత్తు, కర్ణశ్రవసుడు, ముంజుడు, లవణాశ్వుడు, కాశ్యపుడు, హరీతుడు, స్థూణకర్ణుడు, అగ్నివేశ్యుడు, శౌనకుడు, కృతవాక్కు, సువాక్కు, బృహదశ్వుడు, విభావసువు, ఊర్ధ్వరేతుడు, వృషామిత్రుడు, సుహాత్రుడు, హోత్రవాహనుడు, మొదలగువారు, ఇంకా కఠోరనియమాలు గల బ్రాహ్మణులూ మహర్షులూ దేవేంద్రుని అర్చించినట్లుగా అజాతశత్రువయిన ధర్మరాజును అర్చించారు. (22-25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి ద్వైతవనప్రవేశే షడ్వింశోఽధ్యాయః ॥ 26 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున ద్వైతవన ప్రవేశమను ఇరువది ఆరవ అధ్యాయము. (26)