41. నలుబది యొకటవ అధ్యాయము

అర్జునునికి దిక్పాలకులు దివ్యాస్త్రముల నిచ్చుట, స్వర్గమునకు వెళ్ళుమని ఇంద్రుడు ఆదేశించుట.

వైశంపాయన ఉవాచ
తస్య సంపశ్యతస్త్వేవ పినాకీ వృషభధ్వజః ।
జగామాదర్శనం భానుః లోకస్యేవాస్తమీయువాన్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - భువనభాస్కరుడైన సూర్యుడు అస్తమించినట్లుగా, అర్జునుడు చూస్తూండగా, వృషభధ్వజుడైన పినాకపాణి - శివుడు - అదృశ్యమయ్యాడు. (1)
తతోఽర్జునః పరం చక్రే విస్మయం పరవీరహా ।
మయా సాక్షాన్మహాదేవః దృష్ట ఇత్యేవ భారత ॥ 2
భారతా! అటుపై అర్జునుడు 'నేను సాక్షత్తుగా మహాదేవుని చూశాను' అని మిక్కిలి ఆశ్చర్యాన్ని పొందాడు. (2)
ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యన్మయా త్ర్యంబకో హరః ।
పినాకీ వరదో రూపీ దృష్టః స్వృష్టశ్చ పాణినా ॥ 3
త్రినేత్రుడు, పినాకపాణి, వరదుడు అయిన హరుని శరీరాకృతిలో నేను చూశాను. అతనిని చేతితో తాకాను కూడా! నేను ధన్యుడను. నన్నతడు అనుగ్రహించాడు. (3)
కృతార్థం చావగచ్ఛామి పరమాత్మానమాహవే ।
శత్రూంశ్చ విజితాన్ సర్వాన్ నిర్వృత్తం చ ప్రయోజనమ్ ॥ 4
నేడు నేను మిక్కిలి కృతార్థుడనైనట్లుగా భావిస్తూన్నాను. యుద్ధంలో శత్రువులందరిని జయించినట్లే భావిస్తున్నాను. నా అభీష్టమైన ప్రయోజనం నెరవేరింది. (4)
ఇత్యేవం చింతయానస్య పార్థస్యామితతేజసః ।
తతో వైఢూర్యవర్ణాభః భాసయన్ సర్వతో దిశః ।
యాదోగణవృతః శ్రీమాన్ ఆజగామ జలేశ్వరః ॥ 5
ఈ విధంగా ఆలోచిస్తున్న అమితపరాక్రమవంతుడైన పార్థుని దగ్గరకి వైడూర్యవర్ణంలో ప్రకాశిస్తున్న జలాధిదైవమయిన, వరుణుడు దిక్కులన్నింటిని ప్రకాశింపజేస్తూ జలజంతువులతో సహా వచ్చాడు. (5)
నాగైర్నదైర్నదీభిశ్చ దైత్యైః సాధ్యైశ్చ దైవతైః ।
వరుణో యాదసాం భర్తా వశీ తం దేశమాగమత్ ॥ 6
నాగాలతో, నద, నదీదేవతలతో, దైత్యులతో, సాధ్య దైవతాలతో కూడి జలజంతువుల అధిపతి, జితేంద్రియుడు అయిన వరుణుడు ఆ ప్రదేశానికి వచ్చాడు. (6)
అథ జాంబూనదవపుః విమానేన మహార్చిషా ।
కుబేరః సమనుప్రాప్తః యక్షైరనుగతః ప్రభుః ॥ 7
తరువాత బంగారుమేనిచాయ గల మహాతేజస్వి కుబేరుడు, విమానంలో అక్కడకు వచ్చాడు. యక్షులందరూ కూడ తమ ప్రభువును అనుసరించి వచ్చారు. (7)
విద్యోతయన్నివాకాశమ్ అద్భుతోపమదర్శనః ।
ధనానామీశ్వరః శ్రీమాన్ అర్జునం ద్రష్టుమాగతః ॥ 8
తన తేజస్సు చేత ఆకాశాన్ని ప్రకాశింపజేస్తూ, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న పరమసుందరుడు, శ్రీమంతుడు, ధనాధ్యక్షుడు అయిన కుబేరుడు అర్జునుని చూడటానికి వచ్చాడు. (8)
తథా లోకాంతకృచ్ఛ్రీమాన్ యమః సాక్షాత్ ప్రతాపవాన్ ।
మర్త్యమూర్తిధరైః సార్ధం పితృభిర్లోకభావనైః ॥ 9
అదే విధంగా లోకాలను అంతం చేసేవాడు, శ్రీమంతుడు, ప్రతాపవంతుడు, అయిన యముడు సాక్షాత్తుగా అర్జునుని చూడటానికి వచ్చాడు. అతనితో పాటుగ మానవశరీర ధారులై విశ్వభావనులైన పితృదేవతలు కూడా వచ్చారు. (9)
దండపాణిరచింత్యాత్మా సర్వభూతవినాశకృత్ ।
వైవస్వతో ధర్మరాజః విమానేనావభాసయన్ ॥ 10
త్రీన్ లోకాన్ గుహ్యకాంశ్చైవ గంధర్వాంశ్చ సపన్నగాన్ ।
ద్వితీయ ఇవ మార్తండః యుగాంతే సముపస్థితే ॥ 11
ప్రాణులన్నింటి వినాశం కలిగిమ్చే అచింత్యాత్ముడు, సూర్యపుత్రుడైన యమధర్మరాజు దండం దాల్చి, తేజోవంతమైన విమానంతో మూడులోకాలను, గుహ్యక, గాంధర్వ, నాగులను ప్రకాశింపజేస్తూ వచ్చాడు. ప్రళయకాలంలో కనబడే రెండవ సూర్యునిలా అతడు ప్రకాశిస్తున్నాడు. (11,12)
తే భానుమంతి చిత్రాణి శిఖరాణి మహాగిరేః ।
సమాస్థాయార్జునం తత్ర దదృశుస్తపసాన్వితమ్ ॥ 12
వారంతా (వరుణాది దేవతలంతా) విచిత్రంగా ప్రకాశించే మహాపర్వతం యొక్క శిఖరాల మీదికి వచ్చి, తపస్వి అయిన అర్జునుని చూశారు. (12)
తతో ముహూర్తాద్ భగవాన్ ఇరావతశిరోగతః ।
ఆజాగామ సహేంద్రాణ్యా శక్రః సురగణైర్వృతః ॥ 13
ఆ తరువాత ఒక ముహూర్తకాలంలో ఇంద్రాణితో కలిసి ఐరావతాన్ని ఎక్కి ఇంద్రుడు అక్కడకు వచ్చాడు. దేవగణాలన్నీ ఆయనను అనుసరించాయి. (13)
పాండురేణాతపత్రేణ ధ్రియమాణేన మూర్ధని ।
శుశుభే తారకారాజః సితమభ్రమివ స్థితః ॥ 14
సంస్తూయమానో గంధర్వైః ఋషిభిశ్చ తపోధనైః ।
శృంగం గిరేః సమాసాద్య తస్థౌ సూర్య ఇవోదితః ॥ 15
ఆ ఇంద్రుడు శిరస్సుపై తెల్లని ఛత్రాన్ని ధరించి తెల్లని మేఘాన్ని కప్పుకొన్న చంద్రునిలా శోభిల్లుతున్నాడు. గంధర్వుల చేత, తపోధనులైన ఋషులచేత స్తుతింపబడుతూ ఆ పర్వతశిఖరానికి చేరిన ఇంద్రుడు ఉదయించిన సూర్యునిలా ఉన్నాడు. (14,15)
అథ మేఘస్వనో ధీమాన్ వ్యాజహార శుభాం గిరమ్ ।
యమః పరమధర్మజ్ఞః దక్షిణాం దిశమాస్థితః ॥ 16
తర్వాత మేఘం వంటి గంభీరస్వనంతో పరమధర్మజ్ఞుడైన యముడు దక్షిణదిక్కున ఉండి శుభంగా ఇలా పలికాడు. (16)
అర్జునార్జున పశ్యాస్మాన్ లోకపాలాన్ సమాగతాన్ ।
దృష్టిం తే వితరామోఽద్య భవానర్హతి దర్శనమ్ ॥ 17
పూర్వర్షిరమితాత్మా త్వం నరో నామ మహాబలః ।
నియోగాద్ బ్రహ్మణస్తాత మర్త్యతాం సముపాగతః ॥ 18
అర్జునా! ఇక్కడకు వచ్చిన లోకపాలురమైన మమ్మల్ని చూడు. ఇపుడు నీకు దివ్యదృష్టి నిస్తున్నాము. మమ్ములను చూడటానికి నీవు అర్హుడవు. నీవు పూర్వకాలంలో నరుడనే మహాబలుడైన మహర్షివి. నాయనా! బ్రహ్మనియోగం వల్లనే మానవజన్మను పొందావు. (17,18)
త్వయా చ వసుసంభూతః మహావీర్యః పితామహః ।
భీష్మః పరమధర్మాత్మా సంసాధ్యశ్చ రణేఽనఘ ॥ 19
క్షత్రం చాగ్నిసమస్పర్శం భారద్వాజేన రక్షితమ్ ।
దానవాశ్చ మహావీర్యాః యే మనుష్యత్వమాగతాః ॥ 20
నివాతకవచాశ్చైవ దానవాః కురునందన ।
పితుర్మమాంశో దేవస్య సర్వలోకప్రతాపినః ॥ 21
కర్ణశ్చ సుమహావీర్యః త్వయా వధ్యో ధనంజయ ।
అనఘా! వసువుల అంశతో పుట్టిన మహాపరాక్రమవంతుడు, మిక్కిలి ధార్మికుడు అయిన భీష్మపితామహుని నీవు యుద్ధంలో జయుస్తావు. కురునందనా! భరద్వాజ కుమారుడైన ద్రోణునిచే రక్షింపబడుతూ అగ్నివలె భయంకరమైన క్షత్రియసముదాయాన్ని కూడా జయిస్తావు. మనుష్యరూపంలో ఉన్న మహాపరాక్రమవంతులైన దానవులను, నివాతకవచులనే దైత్యులను నీవు జయిస్తావు. ధనంజయా! సవలోకానికి ఉష్ణాన్ని ఇచ్చే సూర్యభగవానుని అంశతో జన్మించిన మహా పరాక్రమవంతుడైన కర్ణుని కూడా నీవు చంపుతావు. (19-21 1/2)
అంశాశ్చ క్షితిసంప్రాప్తాః దేవదానవరక్షసామ్ ॥ 22
త్వయా నిపాతితా యుద్ధే స్వకర్మఫలనిర్జితామ్ ।
గతిం ప్రాప్స్యంతి కౌంతేయ యథాస్వమరికర్షణ ॥ 23
కుంతీనందనా! శత్రుసంహారకా! దేవ, దానవ, రాక్షసుల అంశలతో భూమిపై చాల మంది జన్మించారు. వారంతా యుద్ధంలో నీ చేతిలో మరణిస్తారు. అలా వారంతా స్వకర్మ ఫలాన్ని బట్టి యథోచితమైన గతిని పొందుతారు. (22,23)
అక్షయా తవ కీర్తిశ్చ లోకే స్థాస్యతి ఫాల్గున ।
త్వయా సాక్షా న్మహాదేవః తోషితో హి మహానృధే ॥ 24
ఫాల్గునా! ఈ లోకంలో నీకీర్తి శాశ్వతంగా నిలుస్తుంది. నీవు ఈ మహాసంగ్రామంలో సాక్షాత్తూ ఆ మహాదేవుడినే సంతోషపెట్టావు. (24)
లఘ్వీ వసుమతీ చాపి కర్తవ్యా విష్ణునా సహ ।
గృహాణాస్త్రం మహాబాహో దండమప్రతివారణమ్ ।
అనేనాస్త్రేణ సుమహత్ త్వం హి కర్మ కరిష్యసి ॥ 25
మహాబాహూ! శ్రీమహావిష్ణువుతో కుడి నీవు ఈ భూభారాన్ని తగ్గించాలి. అందువలల్ అడ్డులేని ఈ నా దండాస్త్రాన్ని స్వీకరించు. ఈ అస్త్రంతో నీవు చాలా గొప్ప కార్యం సాధిస్తావు. (25)
వైశంపాయన ఉవాచ
ప్రతిజగ్రాహ తత్ పార్థః విధివత్ కురునందనః ।
సమంత్రం సోపచారం చ సమోక్షవినివర్తనమ్ ॥ 26
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! కురునందనుడు, కుంతీసుతుడూ అయిన అర్జునుడు విధిపూర్వకంగా మంత్ర, ఉపచార, ప్రయోగ, ఉపసంహారాలతో ఆ అస్త్రాన్ని గ్రహించాడు. (26)
తతో జలధరశ్యామః వరుణో యాదసాం పతిః ।
పశ్చిమాం దిశమాస్థాయ గిరముచ్చారయన్ ప్రభుః ॥ 27
తరువాత జలచరాల అధిపతి, నీలమేఘశ్యాముడూ, సమర్థుడూ అయిన వరుణుడు పశ్చిమదిక్కున నిలచి ఈ విధంగా చెప్పాడు - (27)
పార్థ క్షత్రియముఖ్యస్త్వం క్షత్రధర్మే వ్యవస్థితః ।
పశ్య మాం పృథుతామ్రాక్ష వరుణోఽస్మి జలేశ్వరః ॥ 28
పార్థా! నివు క్షత్రియులలో ముఖ్యుడవు. క్షత్రధర్మంలో ఉన్నవాడిని. విశాలమైన ఎర్రని కన్నులు కలవాడా? నావైపు చూడు. నేను జలాధిపతిని, వరుణుడను. (28)
మయా సముద్యతాన్పాశాన్ వారుణాననివారితాన్ ।
ప్రతిగృహ్ణీష్వ కౌంతేయ సరహస్యనివర్తనమ్ ॥ 29
కుంతీకుమారా! నేనిస్తున్న ఈ వారుణపాశాలను రహస్యోవసంహార సహితంగా తీసికో. వీటినెవరూ ఎదుర్కొనలేరు. (29)
ఏభిస్తదా మయా వీర సంగ్రామే తారకామయే ।
దైతేయానాం సహస్రాణి సంయతాని మహాత్మనామ్ ॥ 30
వీరా! ఈ పాశాలతో నేను తారకామయ సంగ్రామంలో వేలకొలది మహాకాయులైన దైత్యులను బంధించాను. (30)
తస్మాదిమాన్ మహాసత్త్వ మత్ర్పసాదసముత్థితాన్ ।
గృహాణ న హి తే ముచ్యేద్ అంతకోఽప్యాతతాయినః ॥ 31
మహాబలా! నా అనుగ్రహం వల్ల లభించిన ఈ పాశాలను తీసుకో. వీటిచేత బంధింపబడితే, యముడు కూడా నీ చేతిలో నుండి విడిపించుకోలేడు. (31)
అనేన త్వం యదాస్త్రేణ సంగ్రామే విచరిష్యసి ।
తదా నిఃక్షత్రియా భూమిః భవిష్యతి న సంశయః ॥ 32
నీవు ఈ అస్త్రంతో సంగ్రామంలో సంచరిస్తూంటే ఈ భూమి మీద క్షత్రియడెవడూ మిగలడు. ఇందులో సందేహం లేదు. (32)
వైశంపాయన ఉవాచ
తతః కైలాసనిలయో ధనాధ్యక్షోఽభ్యభాషత ।
దత్తేష్వస్త్రేషు దివ్యేషు వరుణేన యమేన చ ॥ 33
ప్రీతోఽహమసి తే ప్రాజ్ఞ పాండవేయ మహాబల ।
త్వయా సహ సమాగమ్య అజితేన తథైవ చ ॥ 34
వైశంపాయనుడిలా అన్నాడు.
తరువాత కైలాస నివాసి, ధనాధ్యక్షుడు అయిన కుబేరుడు ఇలా అన్నాడు - ప్రాజ్ఞా! పాండునందనా! మహాబలా! యముడు, వరుణుడు, దివ్యాస్త్రాలు ఇస్తుంటే నేను చాలా ఆనందించాను. అజేయుడవైన నిన్ను కలవడం వల్ల నేను మిక్కిలి ప్రసన్నుడ నయ్యాను. (33,34)
సవ్యసాచిన్ మహాబాహో పూర్వదేవ సనాతన ।
సహాస్మాభిర్భవ్న్ శ్రాంతః పురాకల్పేషు నిత్యశః ॥ 35
దర్శనాత్ తే త్విదం దివ్యం ప్రదిశామి నరర్షభ ।
అమనుష్యాన్ మహాబాహో దుర్జయానపి జేష్యసి ॥ 36
సవ్యసాచీ! మహాబాహూ! పురాతన దేవా! సనాతనపురుషా! పూర్వకల్పాలలో నీవు నిత్యం మాతోపాటు తపస్సు చేసి శ్రాంతుడ వయ్యావు. నరశ్రేష్ఠా! మహాబాహూ! ఇపుడు నిన్నుచూసి నీకొక దివ్యాస్త్రాన్ని ఇస్తున్నాను. దీనితో జయింపశక్యంగాని మానవేతరులను కూడా జయిస్తావు. (35,36)
మత్తశ్చైవ భవానాశు గృహ్ణాత్వస్త్రమనుత్తమమ్ ।
అనేన త్వమనీకాని ధార్తరాష్ట్రస్య ధక్ష్యసి ॥ 37
నీవు శీఘ్రంగా నానుండి శ్రేష్ఠమైన ఈ దివ్యాస్త్రాన్ని తీసికో. దీనితో నీవు ధార్తరాష్ట్రసేనలను భస్మం చేస్తావు. (37)
తదిదం ప్రతిగృహ్ణీష్వ అంతర్ధానం ప్రియం మమ ।
ఓజస్తేజోద్యుతికరం ప్రస్వాపనమరాతినుత్ ॥ 38
నా ఈ ప్రియమైన అంతర్ధానమనే అస్త్రాన్ని స్వీకరించు. ఇది బలాన్ని, పరాక్రమాన్ని, కాంతిని ఇస్తుంది. శత్రువులను నిద్రావివశులను చేస్తుంది. నాశనం చేస్తుంది. (38)
మహాత్మనా శంకరేణ త్రిపురం నిహతం యదా ।
తదైతదస్త్రం నిర్ముక్తం యేన దగ్ధా మహాసురాః ॥ 39
మహాత్ముడైన శంకరుడు త్రిపురాసురుని చంపిన సమయంలో ఈ అస్త్రం ప్రయోగింపబడింది. దీనిచే మహాసురులెంతో మంది చంపబడ్డారు. (39)
త్వదర్థముద్యతం చేదం మయా సత్యపరాక్రమ ।
త్వమర్హో ధారణే చాస్య మేరుప్రతిమగౌరవ ॥ 40
సత్యపరాక్రమా! మేరు సమానమైన గౌరవం కలవాడా! పార్థా! నీకోసం నేనీ అస్త్రాన్ని తీసికొని వచ్చాను. నీవు దీన్ని ధరించడానికి యోగ్యుడవు. (40)
తతోఽర్జునో మహాబాహుః విధివత్ కురునందనః ।
కౌబేరమధిజగ్రాహ దివ్యమస్త్రం మహాబలః ॥ 41
మహాబలుడు అయిన అర్జునుడు కుబేరుని నుండి అంతర్ధానమనే అస్త్రాన్ని యథావిధిగా గ్రహించాడు. (41)
తతోఽబ్రవీత్ దేవరాజః పార్థమక్లిష్టకారిణమ్ ।
సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచా మేఘదుందుభినిఃస్వనః ॥ 42
ఆపై దేవేంద్రుడు సుకరంగా కార్యనిర్వహణం చేసే అర్జునునితో సాంత్వనపూర్వకంగా, మేఘదుందుభుల వంటి గంభీరస్వరంతో, తీయగా ఇలా పలికాడు. (42)
కుంతీమాతర్మహాబాహో త్వమీశానః పురాతనః ।
పరాం సిద్ధిమనుప్రాప్తః సాక్షాద్ దేవగతిం గతః ॥ 43
మహాబాహూ! కుంతీకుమారా! నీవు పురాతన శాసకుడవు. ఉత్తమసిద్ధిని పొందినవాడవు. సాక్షాత్తుగా దేవగతిని పొందినవాడవు. (43)
దేవకార్యం తు సుమహత్ త్వయా కార్యమరిందమ ।
ఆరోఢవ్యస్త్వయా స్వర్గః సజ్జీభవ మహాద్యుతే ॥ 44
శత్రుదమనా! నీవు ఒక గొప్ప దేవకార్యాన్ని చెయ్యాలి. మహాద్యుతీ! సిద్ధంగా ఉండు. నీవు స్వర్గలోకానికి వెళ్ళాలి. (44)
రథో మాతలిసంయుక్తః ఆగంతా త్వత్కృతే మహీమ్ ।
తత్ర తేఽహం ప్రదాస్యామి దివ్యాన్యస్త్రాణి కౌరవ ॥ 45
నీకోసం మాతలితో కూడిన రథం భూమిమీదికి వస్తోంది. కురునందనా! అక్కడ నీకు నేను దివ్యాస్త్రాలను ఇస్తాను. (45)
తాన్ దృష్ట్వా లోకపాలాంస్తు సమేతాన్ గిరిమూర్ధని ।
జగామ విస్మయం ధీమాన్ కుంతీపుత్రో ధనంజయః ॥ 46
ఆ పర్వతశిఖరం మీదకు కలసివచ్చిన లోకపాలురను చూసి బుద్ధిమంతుడైన ధనంజయుడు మిక్కిలి ఆశ్చర్యాన్ని పొందాడు. (46)
తతోఽర్జునో మహాతేజాః లోకపాలాన్ సమాగతాన్ ।
పూజయామాస విధివద్ వాగ్భిరద్భిః ఫలైరపి ॥ 47
అనంతరం అర్జునుడు తన చెంతకు వచ్చిన మహాతేజస్వులైన ఆ లోకపాలురను యథావిధిగా వాక్కులతో, జలాలతో, ఫలాలతో పూజించాడు. (47)
తతః ప్రతియయుర్దేవాః ప్రతిమాన్య ధనంజయమ్ ।
యథాగతేన విబుధాః సర్వే కామమనోజవాః ॥ 48
ఆ తరువాత దేవతలందరూ ధనంజయుని తిరిగి గౌరవించి, స్వేచ్ఛగా వచ్చిన విధంగానే మనోవేగంతో వెళ్ళారు. (48)
తతోఽర్జునో ముదం లేభే లబ్ధాస్త్రః పురుషర్షభః ।
కృతార్థమథ చాత్మానం స మేనే పూర్ణమానసమ్ ॥ 49
దేవతల వల్ల దివ్యాస్త్రాలు పొంది నరశ్రేష్ఠుడైన అర్జునుడు ఆనందించాడు, తాను పూర్ణమనోరథుడు, కృతార్థుడు అయినట్లు భావించాడు. (49)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కైరాతపర్వణి దేవప్రస్థానే ఏకచత్వారింశోఽధ్యాయః ॥ 41 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున కైరాతపర్వమను
ఉపపర్వమున దేవప్రస్థానమను నలుబది ఒకటవ అధ్యాయము. (41)