42. నలుబది రెండవ అధ్యాయము
(ఇంద్రలోకాభిగమన పర్వము)
అర్జునుడు మాతలితో స్వర్గలోకమునకు ప్రయాణమగుట.
వైశమ్పాయన ఉవాచ
గతేషు లోకపాలేషు పార్థః శత్రునిబర్హణః ।
చింతయామాస రాజేంద్ర దేవరాజరథం ప్రతి ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
రాజేంద్రా! లోకపాలురు వెళ్ళిన తరువాత శత్రుసంహారకుడైన అర్జునుడు ఇంద్రుని రథాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. (1)
తతశ్చింతయమానస్య గుడాకేశస్య ధీమతః ।
రథో మాతలిసంయుక్తః ఆజగామ మహాప్రభః ॥ 2
బుద్ధిమంతుడైన అర్జునుడలా ఆలోచిస్తూండగానే, మాతలితోపాటుగ మహాతేజస్సు గల ఆ రథం అక్కడకు వచ్చింది. (2)
నభో వితిమిరం కుర్వన్ జలదాన్ పాటయన్నివ ।
దిశః సంపూరయన్ నాదైః మహామేఘరవోపమైః ॥ 3
ఆ రథం ఆకాశంలోని చీకటులను తొలగిస్తూ, మేఘాలను చీల్చుకొంటూ, మహామేఘాల ధ్వని వంటి గంభీరనాదంతో దిక్కులను పూరిస్తూ అక్కడకు వచ్చింది. (3)
అసయః శక్తయో భీమోః గదాశ్చోగ్రప్రదర్శనాః ।
దివ్యప్రభావాః ప్రాసాశ్చ విద్యుతశ్చ మహాప్రభాః ॥ 4
తథైవాశనయశ్చైవ చక్రయుక్తాస్తులాగుడాః ।
వాయుస్ఫోటాః సనిర్ఘాతాః మహామేఘస్వనాస్తథా ॥ 5
ఆ రథంలో ఖడ్గాలు, భయంకరాలైన శక్తులు, భీకరగదలు, దివ్యప్రభావం గల ప్రాసాలు, మిక్కిలి కాంతి గల విద్యుత్తులు, అశనులు, చక్రాలతో కూడిన ప్రస్తరగోళాలు ఉన్నాయి. అవి మహామేఘాల వలె గర్జిస్తూ, వజ్రాయుధంలా ధ్వనిస్తూ వాయువిస్ఫోటనం కలిగిస్తున్నాయి. (4,5)
తత్ర నాగా మహాకాయాః జ్వలితాస్యాః సుదారుణాః ।
సితాభ్రకూటప్రతిమాః సంహతాశ్చ తథోపలాః ॥ 6
అందులో మహాభయంకరాలైన, జ్వలించే ముఖాలతో పెద్దపెద్ద సర్పాలున్నాయి. తెల్లని మేఘల్లా ఉండి యుద్ధంలో విసరడానికి యోగ్యమైన రాళ్ళు ఉన్నాయి. (6)
దశవాజిసహస్రాణి హరీణాం వాతరంహసామ్ ।
వహంతి యం నేత్రముషం దివ్యం మాయామయం రథమ్ ॥ 7
వాయువు వంటి వేగం గల పదివేల గుర్రాలు చూపరుల కళ్ళను ఆకర్షిస్తూ దివ్యమైన, మాయామయమైన ఆ రథాన్ని మోస్తున్నాయి. (7)
తత్రాపశ్మన్మహానీలం వైజయంతం మహాప్రభమ్ ।
ధ్వజమిందీవరశ్యామం వంశమ్ కనకభూషణమ్ ॥ 8
ఆ రథం మీద మహానీలవర్ణంతో ప్రకాశిస్తున్న వైజయంతమనే ఇంద్రధ్వజాన్ని అర్జునుడు చూశాడు. అది నల్లకలువ వలె ఉంది. దాని దండం బంగారంతో అలంకరింపబడి ఉంది. (8)
తస్మిన్ రథే స్థితం సూతం తప్తహేమవిభూషితమ్ ।
దృష్ట్వా పార్థో మహాబాహుః దేవమేవాన్వతర్కయత్ ॥ 9
మహాబాహువు, కుంతీకుమారుడూ అయిన అర్జునుడు ఆ రథం మీద ఉన్న సారథిని చూశాడు. అతడు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలతో విభూషితుడై ఉన్నాడు. అతనిని చూసి పార్థుడు ఎవరో దేవుడై ఉంటాడని భావించాడు. (9)
తథా తర్కయతస్తస్య ఫాల్గునస్యాథ మాతలిః ।
సన్నతః ప్రస్థితో భూత్వా వాక్యమర్జునమబ్రవీత్ ॥ 10
ఫాల్గునుడు అలా భావిస్తూండగానే, మాతలి అర్జునుని దగ్గరకు వచ్చి, నిల్చుండి వినమ్రుడై అతనితో ఇలా అన్నాడు. (10)
మాతలిరువాచ
భో భోః శక్రాత్మజ శ్రీమాన్ శక్రస్త్వాం ద్రష్టుమిచ్ఛతి ।
ఆరోహతు భవాన్ శీఘ్రం రథమింద్రస్య సమ్మతమ్ ॥ 11
మాతలి ఇలా అన్నాడు.
ఇంద్రకుమారా! దేవేంద్రుడు నిన్ను చూడాలనుకొంటున్నాడు. ఇంద్రునికిష్టమైన ఈ రథాన్ని అధిరోహించు. (11)
ఆహ మామమరశ్రేష్ఠః పితా తవ శతక్రతుః ।
కుంతీసుతమిహ ప్రాప్తం పశ్యంతు త్రిదశాలయాః ॥ 12
ఏష శక్రః పరివృతః దేవైర్ ఋషిగణైస్తథా ।
గంధర్వైరప్సరోభిశ్చ త్వాం దిదృక్షుః ప్రతీక్షతే ॥ 13
నీ తండ్రి, దేవతాశ్రేష్ఠుడు, శతక్రతువు అయిన ఇంద్రుడు నాతో, 'కుంతీ కుమారుడైన అర్జునుని ఇక్కడకు తీసికొనిరా' అని చెప్పాడు. దేవతా, ఋషిగణాలతో గంధర్వాప్సరలతో కూడియున్న ఇంద్రుడు నిన్ను చూడగోరి ఎదురుచూస్తున్నాడు. (12,13)
అస్మాల్లోకాద్ దేవలోకం పాకశాసనశాసనాత్ ।
ఆరోహ త్వం మయా సార్ధం లబ్ధాస్త్రః పునరేష్యసి ॥ 14
ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం ఈ భూలోకం నుండి దేవలోకానికి రా! నాతోపాటు ఈ రథం ఎక్కు, దివ్యాస్త్రాలు పొంది తిరిగి రాగలవు. (14)
అర్జున ఉవాచ
మాతలే గచ్ఛ శీఘ్రం త్వమ్ ఆరోహస్వ రథోత్తమమ్ ।
రాజసూయాశ్వమేధానాం శతైరపి సుదుర్లభమ్ ॥ 15
అర్జునుడిలా అన్నాడు - మాతలీ! నివు త్వరగా వెళ్ళు. శ్రేష్ఠమైన ఆ రథాన్ని ఎక్కు, రాజసూయ, అశ్వమేధాలు వందలకొద్దీ చేసినా ఇటువంటి రథం లభించదు. (15)
పార్థివైః సుమహాభాగైః యజ్వభిర్భూరిదక్షిణైః ।
దైవతైర్వా సమారోఢుం దానవైర్వా రథోత్తమమ్ ॥ 16
భూరీదక్షిణలతో యజ్ఞాలు చేసి గొప్ప వారైన రాజులు గాని, దేవతలు గాని, దానవులు గాని శ్రేష్ఠమైన ఈ రథాన్ని ఎక్కలేదు. (16)
నాతస్తతపసా శక్యః ఏష దివ్యో మహారథః ।
ద్రష్టుం వాప్యథవా స్ప్రష్టుమ్ ఆరోఢుం కుత ఏవ చ ॥ 17
ఇక తపస్సుచే తపించనివాడు దివ్యమైన ఈ రథాన్ని చూడటానికి కాని, తాకడానికి కాని సమర్థుడు కాదు. ఇక ఎక్కడం గురించి చెప్పడమెందుకు? (17)
త్వయి ప్రతిష్ఠితే సాధో రథస్థే స్థిరవాజిని ।
పశ్చాదహమథారోక్ష్యే సుకృతీ సత్పథం యథా ॥ 18
సత్పురుషా! నీవు ఈ రథాన్ని ఎక్కి, గుర్రాలను స్థిరంగా నిలిపి ఉంచు. పుణ్యాత్ముడు సన్మార్గంలో ప్రవేశించినట్లుగా నీ వెనుక నేను ఈ రథాన్ని ఎక్కుతాను. (18)
వైశంపాయన ఉవాచ
తస్య తద్ వచనం శ్రుత్వా మాతలిః శక్రసారథిః ।
ఆరురోహ రథం శీఘ్రం హయాన్ యేయే చ రశ్మిభిః ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు.
జనమేజయా! అర్జునుని ఈ మాటలు విని ఇంద్రసారథి అయిన మాతలి శీఘ్రంగా రథం ఎక్కాడు. గుర్రాలను కళ్ళెములతో నియంత్రించాడు. (19)
తతోఽర్జునో హృష్టమనాః గంగాయామాప్లుతః శుచిః ।
జజాప జప్యం కౌంతేయః విధివత్ కురునందనః ॥ 20
ఆ తరువాత అర్జునుడు ప్రసన్నమనస్కుడై గంగా ప్రవాహంలో స్నానం చేసి, పవిత్రుడై, యథావిధిగా జపించదగిన మంత్రాన్ని జపించాడు. (20)
తతః పితౄన్ యతాన్యాయం తర్పయిత్వా యథావిధి ।
మందరం శైలరాజం తమ్ ఆప్రష్టుముపచక్రమే ॥ 21
అటుపై యథోచితంగా, యథావిధిగా పితృదేవతలకు తర్పణాలు చేసి, విశాలమైన హిమాలయాన్ని అనుమతికై ఇలా సెలవడిగాడు. (22)
సాధూనాం పుణ్యశీలానాం మునీనాం పుణ్యకర్మణామ్ ।
త్వం సదా సంశ్రయః శైల స్వర్గమార్గాభికాంక్షిణామ్ ॥ 22
గిరిరాజా! నీవు సత్పురుషులకు, పవిత్రమైన నడవడి గల మునులకు, పుణ్యకర్మలు చేసి స్వర్గమార్గాన్ని కోరుకొనే మనుష్యులకు ఎల్లపుడు ఆశ్రయమైనవాడవు. (22)
త్వత్రసాదాత్ సదా శైల బ్రాహ్మణాః క్షత్రియా విశః ।
స్వర్గం ప్రాప్తాశ్చరంతి స్మ దేవైః సహ గతవ్యథాః ॥ 23
శైలరాజా! నీ(యొక్క) అనుగ్రహం వల్ల బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎల్లపుడు స్వర్గాన్ని పొంది, బాధారహితులై దేవతలతో కలిసి సంచరిస్తారు. (23)
అద్రిరాజ మహాశైల మునిసంశ్రయ తీర్థవన్ ।
గచ్ఛామ్యామంత్రయామి త్వాం సుకమస్మ్యుషితస్త్వయి ॥ 24
అద్రిరాజా! మహాశైలా! మునిసంశ్రయా! తీర్థ విభూషితా! హిమాలయా! నీ శిఖరం మీద నేను సుఖంగా ఉన్నాను. ఇక్కడ నుండి వెళుతున్నాను. నీ అనుమతి కోరుతున్నాను. (24)
తవ సానూని కుంజాశ్చ నద్యః ప్రస్రవణాని చ 7.
తీర్థాని చ సుపుణ్యాని మయా దృష్టాన్యనేకశః ॥ 25
నీ యొక్క సానువులను, పొదలను, నదులను, వాగులను పవిత్రాలైన తీర్థాలను చాలాసార్లు నేను చూశాను. (25)
ఫలాని చ సుగంధీని భక్షితాని తతస్తతః ।
సుసుగంధాశ్చ వార్యోఘాః త్వచ్చరీరవినిఃసృతాః ॥ 26
అమృతాస్వాదనీయా మే పీతాః ప్రస్రవణోదకాః ।
మంచి సువాసన గల పళ్ళను తిన్నాను. నీ శరీరం నుండి వెలువడి పరిమళభరితాలై అమృతం వలె ఆస్వాద యోగ్యాలైన నిర్ఘరజలాలను త్రాగాను. (26 1/2)
శిశుర్యథా పితురంకే సుసుఖాం వర్తతే నగ ॥ 27
తథా తవాంకే లలితం శైలరాజ మయా ప్రభో ।
నగరాజా! ప్రభూ! శిశువు తండ్రిఒడిలో సుఖంగా ఉన్నట్లు నేను నీ పర్వత సానువుల ఒడిలో ఆనందంగా ఉన్నాను. (27 1/2)
అప్పరోగణసంకీర్ణే బ్రహ్మఘోషానునాదితే ॥ 28
సుఖమస్మ్యుషితః శైల తవ సానుషు నిత్యదా ।
శైలరాజా! అప్సరోగణాలతో నిండి, వేదఘోషలతో ప్రతిధ్వనించే నీ సానువులందు నిత్యమూ నేను సుఖంగా నివసించాను. (28 1/2)
ఏవముక్త్వార్జునః శైలమ్ ఆమంత్ర్య పరవీరహా ॥ 29
అరురోహ రథం దివ్యం ద్యోతయన్నివ భాస్కరః ।
ఈ విధంగా పలికి, శైలరాజు వద్ద సెలవు తీసికొని, శత్రునాశకుడైన అర్జునుడు సూర్యునిలా ఆ రథాన్ని ప్రకాశింపజేస్తూ అధిరోహించాడు. (29 1/2)
స తేనాదిత్యరూపేణ దివ్యేనాద్భుతకర్మణా ॥ 30
ఊర్ధ్వమాచక్రమే ధీమాన్ ప్రహృష్టః కురునందనః ।
సోఽదర్శనపథం యాతః మర్త్యానాం ధర్మచారిణామ్ ॥ 31
పరమబుద్ధిమంతుడైన అర్జునుడు ఆనందింది, అద్భుతంగా పయనిస్తూ, సూర్యునిలా ప్రకాశించే దివ్యమైన ఆ రథం మీద క్రమంగా ధర్మాత్ములైన మానవుల దృష్టిపథం నుండి పైపైకి వెళ్ళసాగాడు. (30,31)
దదర్శాద్భుతరూపాణి విమానాని సహస్రశః ।
న తత్ర సూర్యః సోమో వా ద్యోతతే న చ పావకః ॥ 32
ఆకాశమార్గంలో అతడు వేలకొద్దీ అద్భుత విమానాలను చూశాడు. అక్కడ సూర్యుడు కాని, చంద్రుడు కాని, అగ్ని కాని ప్రకాశించటం లేదు. (32)
స్వయైవ ప్రభయా తత్ర ద్యోతంతే పుణ్యలబ్ధయా ।
తారారూపాణి యానీహ దృశ్యంతే ద్యుతిమంతి వై ॥ 33
దీపవద్ విప్రకృష్టత్వాత్ తనూని సుమహాంత్యపి ।
తాని తత్ర ప్రభాస్వంతి రూపవంతి చ పాండవః ॥ 34
దదర్శ స్వేషు ధిష్ణ్యేషు దీప్తిమంతః స్వయార్చిషా ।
తత్ర రాజర్షయః సిద్ధాః వీరాశ్చ నిహతా యుధి ॥ 35
అక్కడ స్వర్గలోక నివాసులంతా తమ పుణ్యం వల్ల పొందిన కాంతితో ప్రకాశిస్తున్నారు. తారల రూపంలో ప్రకాశిస్తున్నవన్నీ పెద్దవనప్పటికీ దూరంగా ఉండడం వల్ల దీపంలా చిన్నవిగా ప్రకాశిస్తున్నాయి. వాటన్నింటిని అర్జునుడు చుశాడు. యుద్ధంలో మరణించిన వీరులు, సిద్ధులైన రాజర్షులు స్వర్గాన్ని పొంది, వారి వారి పుణ్యలబ్ధమైన తేజస్సుతో వారి వారి స్థానాల్లో ప్రకాశిస్తున్నారు. (33-35)
తపసా చ జితం స్వర్గం సంపేతుః శతసంఘశః ।
గంధర్వాణాం సహస్రాణి సూర్యజ్వలితతేజసామ్ ॥ 36
గుహ్యకానామృషీణాం చ తథైవాప్సరసాం గణాన్ ।
లోకానాత్మప్రభాన్ పశ్యన్ ఫాల్గునో విస్మయాన్వితః ॥ 37
తపస్సు చేత స్వర్గాన్ని జయించిన అనేక సమూహాలు అక్కడకు వెళ్ళాయి. సూర్యునిలా ప్రకాశిస్తున్న వేలకొద్దీ గంధర్వుల, యక్షుల, ఋషుల, అప్సరసల సమూహాలు అక్కడున్నాయి. స్వయంప్రకాశాలైన ఆ లోకాలను చూసి అర్జునుడు ఆశ్చర్యాన్ని పొందాడు. (36,37)
పప్రచ్ఛ మాతలిం ప్రీత్యా స చాప్యేనమువాచ హ ।
ఏతే సుకృతినః పార్థ స్వేషు ధిష్ణ్యేష్వవస్థితాః ॥ 38
తాన్ దృష్టవానసి విభో తారారూపాణి భుతలే ।
అపుడు అర్జునుడు వారిని గురించి మాతలిని అడిగాడు అతడు కూడ ప్రీతితో ఇలా చెప్పాడు - పార్థా! పుణ్యాత్ములైన వీరంతా వారి వారి స్థానాలలో ఉండి భూలోకంలో తారల రూపంలో కనబడుతున్నారు. (38 1/2)
తతోఽపశ్యత్ స్థితం ద్వారి శుభం వైజయినం గజమ్ ॥ 39
ఐరావతం చతుర్దంతం కైలాసమివ శృంగిణమ్ ।
స సిద్ధమార్గమాక్రమ్య కురుపాండవసత్తమః ॥ 40
వ్యరోచత యథాపూర్వం మాంధాతా పార్థివోత్తమః ।
అభిచక్రామ లోకాన్ సః రాజ్ఞాం రాజీవలోచనః ॥ 41
తరువాత అర్జునుడు స్వర్గద్వారంలో ఉన్న అందమైన జయశీలమైన గజరాజును - ఐరావతాన్ని - చూశాడు. అది నాలుగు దంతాలతో, శిఖరాలతో విరాజిల్లుతున్న కైలాసపర్వతంలా ఉంది. కురుపాండవశ్రేష్ఠుడైన అర్జునుడు, సిద్ధుల మార్గంలోకి వచ్చి పూర్వం పార్థివోత్తముడైన మాంధాతవలె ప్రకాశించాడు. అటుపై అర్జునుడు పుణ్యాత్ములైన రాజులున్న లోకాలలో తిరిగాడు. (39-41)
ఏవం స సంక్రమంస్తత్ర స్వర్గలోకే మహాయశాః ।
తతో దదర్శ శక్రస్య పురీం తామమరావతీమ్ ॥ 42
ఈ విధంగా స్వర్గంలోకంలో మహాయశస్వి అయిన అర్జునుడు తిరుగుతూ ఇంద్రుని పట్టణమైన అమరావతిని చూశాడు. (42)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి ద్విచత్వారింశోఽధ్యాయః ॥ 42 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున ఇంద్రలోకాభిగమన పర్వమను
ఉపపర్వమున అర్జునుడు ఇంద్రలోకమున కేగుట అను నలుబది రెండవ అధ్యాయము. (42)