43. నలువది మూడవ అధ్యాయము

అర్జునుడు దేవేంద్రుని దర్శించుట, ఇంద్రుడు అతనిని స్వాగతించుట.

వైశంపాయన ఉవాచ
దదర్శ న పురీం రమ్యాం సిద్ధచారణసేవితామ్ ।
సర్వర్తుకుసుమైః పుణ్యైః పాదపైరుపశోభితామ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
జనమేజయా! సిద్ధచారణులచే సేవింపబడుతూ, అన్ని ఋతువులలో వికసించే పూలతో, పవిత్రవృక్షాలతో శోభిల్లుతున్న అందమైన ఆ అమరావతీ పట్టణాన్ని అర్జునుడు చూశాడు. (1)
తత్ర సౌగంధికానాం చ పుష్పాణాం పుణ్యగంధినామ్ ।
ఉద్వీజ్యమానో మిశ్రేణ వాయునా పుణ్యగంధినా ॥ 2
అక్కడ పవిత్రమైన పరిమళం కలిగిన సౌగంధిక కుసుమాల సౌరభాన్ని తీసికొనివచ్చే వాయువు యొక్క వీవనలతో అతడు ఆనందించాడు. (2)
నందనం చ వనం దివ్యమ్ అప్సరోగణసేవితమ్ ।
దదర్శ దివ్యకుసుమైః ఆహ్వయద్భిరివ ద్రుమైః ॥ 3
దివ్య కుసుమాలతో ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్న వృక్షాలతో శోభిస్తూ అప్సరోగణాలచే సేవింపబడుతూన్న దివ్యమైన నందనవనాన్ని అర్జునుడు చూశాడు. (3)
నాతప్తతపసా శక్యః ద్రష్టుం నానాహితాగ్నినా ।
స లోకః పుణ్యకర్తౄణాం నాపి యుద్ధే పరాఙ్ముఖైః ॥ 4
తపస్సుచేయనివారు, ఆహితాగ్నులు కాని వారు, యుద్ధంలో వెన్ను చూపినవారు ఆ పుణ్యలోకాన్ని చూడలేరు. (4)
నాయజ్వభిర్నావ్రతికైః న వేదశ్రుతివర్జితైః ।
నానాప్లుతాంగైస్తీర్థేషు యజ్ఞదానబహిష్కృతైః ॥ 5
యజ్ఞాలు చేయనివారు, వ్రతాలను చేయనివారు, వేదశాస్త్రాల అధ్యయనం చేయనివారు, తీర్థాలలో స్నానం చేయనివారు, యజ్ఞదానాలను చేయనివారు స్వర్గలోకాన్ని చూడలేరు. (5)
నాపి యజ్ఞహనైః క్షుద్రైః ద్రష్టుం శక్యః కథంచన ।
పానపర్గురుతల్పైశ్చ మాంసాదైర్వా దురాత్మభిః ॥ 6
యజ్ఞాలను పాడుచేసే నీచులు, మద్యపానం చేసేవారు, గురుతల్పగతులూ, మాంసాహారులూ, దురాత్ములు పుణ్యాత్ముల లోకమైన స్వర్గాన్ని చూడలేరు. (6)
వి॥సం॥ 1) ద్రవ్యమూ, దేవతలు యజ్ఞస్వరూపం. కాబట్టి యజ్ఞం దక్షిణాహీనమయినా, దేవతా స్వరూపజ్ఞానహీనమయినా అది కేవలం పశుహింస మాత్రమే అవుతుంది. ఆ పని చేసేవారు యజ్ఞహనులు.
2) 'దేవాన్ పితౄన్ సమభ్యర్చ్యఖాదన్ మాంసం న దోషభాక్' (దేవతలను, పితరులను అర్చించి మాంసం తింటే దోషం లేదు) అను స్మృతివాక్యాన్ని బట్టి దేవతా పిత్రర్చన లేకుండ మాంసభక్షణ చేసేవాడు దురాత్ముడు (నీల)
స తద్ దివ్యం వనం పశ్యన్ దివ్య గీతనినాదితమ్ ।
ప్రవివేశ మహాబాహుః శక్రస్య దయితాం పురీమ్ ॥ 7
అన్నివైపులా దివ్యసంగీతనాదంతో ప్రతిధ్వనిస్తున్న ఆ దివ్యమైన నందనవనాన్ని చూస్తూ మహాబాహువైన అర్జునుడు ఇంద్రునికి ప్రీతిపాత్రమైన అమరావతీపురంలోకి ప్రవేశించాడు. (7)
తత్ర దేవవిమానాని కామగాని సహస్రశః ।
సంస్థితాన్యభియాతాని దదర్శాయుతశస్తదా ॥ 8
సంస్తూయమానో గంధర్వైః అప్సరోభిశ్చ పాండవః ।
పుష్పగంధవహైః పుణ్యైః వాయుభిశ్చానువీజితః ॥ 9
అక్కడ స్వేచ్ఛాగమనం గల దేవతల విమానాలు వేలకోలదీ ఉన్నాయి. కొన్ని వేలవిమానాలు స్థిరంగా నిలిచి ఉన్నాయి.
కొన్నివేల విమానాలు అటూఇటూ తిరుగుతూ ఉన్నాయి. వాటన్నింటినీ అర్జునుడు చూశాడు. గంధర్వులు, అప్సరలు అతనిని స్తుతించారు. పూలసుగంధాలతో నిండిన పవిత్రాలైన వాయువులు మెల్లగా వీస్తున్నాయి. (8,9)
తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః ।
హృష్టాః సంపూజయామాసుః పార్థమక్లిష్టకారిణమ్ ॥ 10
తరువాత గంధర్వ సిద్ధ మహర్షులతో కూడి దేవతలు ఆనందించి అనాయాసంగా కర్మాచరణం చేసే పార్థుని పూజించారు. (10)
ఆశ్వీర్వాదైః స్తూయమానః దివ్యవాదిత్రనిఃస్వనైః ।
ప్రతిపేదే మహాబాహుః శంఖదుందుభినాదితమ్ ॥ 11
నక్షత్రమార్గం విపులం సురవీథీతి విశ్రుతమ్ ।
ఇంద్రాజ్ఞయా యయౌ పార్థః స్తూయమానః సమంతతః ॥ 12
వారి ఆశీర్వాదాలచే ప్ర్శంసింపబడిన అర్జునుడు సురవీధి అనే పేరుతో ప్రసిద్ధిచెందిన విశాలమైన నక్షత్ర మార్గంలో ప్రవేశించాడు. దివ్య వాద్యధ్వనులను, శంఖదుందుభుల ధ్వనులను వింటూ, ఇంద్రుని ఆజ్ఞనే అంతటా ప్రశంసలందుకొంటూ ఆ మార్గంలో వెళ్ళాడు. (11,12)
తత్ర సాధ్యాస్తథా విశ్వే మరుతోఽథాశ్వినౌ తథా ।
ఆదిత్యా వసవో రుద్రాః తథా బ్రహ్మర్షయోఽపి చ ॥ 13
రాజర్షయశ్చ బహవః దిలీపప్రముఖా నృపాః ।
తుంబురుర్నారదశ్చైవ గంధర్వౌ చ హాహాహుహూః ॥ 14
అక్కడ సాధ్యులు, విశ్వేదేవతలు, మరుద్గణాలు, అశ్వినీకూమారులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, పరిశుద్ధులైన బ్రహ్మర్షులు, రాజర్షులు, దిలీపాది రాజులు, తుంబురుడు, నారదుడు హాహా హూహూ గంధర్వులూ ఉన్నారు. (13,14)
తాన్ సర్వాన్ సమాగమ్య విధివత్ కురునందనః ।
తతోఽపశ్యద్ దేవరాజం శతక్రతుమరిందమః ॥ 15
శత్రుదమనుడైన అర్జునుడు విధి పుర్వకంగా వారినందరిని కలుసుకొని, ఆ తరువాత శతక్రతువగు దేవేంద్రుని దర్శించాడు. (15)
తతః పార్థో మహాబాహుః అవతీర్య రథోత్తమాత్ ।
దదర్శ సాక్షాద్ దేవేశం పితరం పాకశాసనమ్ ॥ 16
పార్థుడు శ్రేష్ఠమైన ఆ రథం నుండి దిగి తన తండ్రి, పాకశాసనుడూ అయిన దేవేంద్రుని సాక్షాత్తుగా దర్శించాడు. (16)
పాండురేణాతపత్రేణ హేమదండేన చారుణా ।
దివ్యగంధాధివాసేన వ్యజనేన విధూయతా ॥ 17
దేవేంద్రుని శిరస్సుపై అందమైన బంగారుదండంతో తెల్లనిగొడుగు శోభిల్లుతూ ఉంది. అతనికి ఇరువైపులా దివ్యసుగంధాలతో కూడిన విసరుకర్రలు వీస్తూ ఉన్నాయి. (17)
విశ్వావసుప్రభృతిభిః గంధర్వైః స్తుతివందనైః ।
స్తూయమానం ద్విజాగ్ర్యైశ్చ ఋగ్యజుఃసామసంభవైః ॥ 18
విశ్వావసువు మున్నగు గంధర్వులు అతనిని ప్రశంసాపూర్వకంగా అభివాదాలతో స్తుతిస్తున్నారు. శ్రేష్ఠులైన బ్రహ్మర్షులు ఋగ్యజుస్సామవేదాలలోని మంత్రాలతో ఇంద్రుని స్తుతిస్తున్నారు. (18)
తతోఽభిగమ్య కౌంతేయః శిరసాభ్యగమద్ బలీ ।
స చైవం వృత్తపీనాభ్యాం బాహుభ్యాం ప్రత్యగృహ్ణత ॥ 19
ఆ తరువాత బలవంతుడైన అర్జునుడు దేవేంద్రుని సమీపించి అతని పాదాలకు శిరస్సుతో అభివాదం చేశాడు. దేవేంద్రుడు బలిసిన గుండ్రని బాహువులతో అతనిని హృదయానికి హత్తుకొన్నాడు. (19)
తతః శక్రాసనే పుణ్యే దేవర్షిగణసేవితే ।
శక్రః పాణౌ గృహీత్వైనమ్ ఉపావేశయదంతికే ॥ 20
అనంతరం ఇంద్రుడు అర్జునుడి చేయి పట్టుకొని దేవర్షి గణాలచే సేవింపబడే పవిత్రమైన తన సింహాసనం మీద తనకు దగ్గరగా కూర్చుండ బెట్టుకొన్నాడు. (20)
మూర్థ్నిచైనముపాఘ్రాయ దేవేంద్రః పరవీరహా ।
అంకమారోపయామాస ప్రశ్రయావనతం తదా ॥ 21
శత్రువీరులను సంహరించే దేవేంద్రుడు వినయంతో తలవంచుకొన్న అర్జునుని శిరస్సును ఆఘ్రాణించి, తన ఒడిలో కూర్చుండబెట్టుకొన్నాడు. (21)
సహస్రాక్షనియోగాత్ సః పార్థః శక్రాసనం గతః ।
అధ్యక్రామదమేయాత్మా ద్వితీయ ఇవ వాసవః ॥ 22
సహస్రాక్షుని ఆదేశానుసారం ఇంద్రసింహాసనం మీద కూర్చున్న అర్జునుడు రెండవ ఇంద్రునిలా ప్రకాశిస్తున్నాడు. (22)
తతః ప్రేమ్ణా వృతశత్రుః అర్జునస్య శుభం ముఖమ్ ।
పస్పర్శ పుణ్యగంధేన కరేణ పరిసాంత్వయన్ ॥ 23
ఆ తరువాత వృతశత్రువు ఇంద్రుడు పుణ్యమగు పరిమళం గల తన చేతితో ప్రేమగా సాంత్వనపరుస్తూ అర్జునుని శుభమైన ముఖాన్ని స్పృశించాడు. (23)
ప్రమార్జమానః శనకైః బాహూ చాస్యాయతౌ శుభౌ ।
జ్యాశరక్షేపకఠినౌ స్తంభావివ హిరణ్మయౌ ॥ 24
వింటినారి బాణాల రాపిడిచే కఠినాలై బంగారుస్తంభాలులా దీర్ఘాలై అందమైన అర్జునుని భుజాలను ఇంద్రుడు మెల్లగా తన చేతితో రాయసాగాడు. (24)
వజ్రగ్రహణచిహ్నేన కరేణ పరిసాంత్వయన్ ।
ముహుర్మహుర్వజ్రధరః బాహూ చాస్ఫోటయచ్ఛనైఆః ॥ 25
వజ్రాయుధాన్ని పట్టుకోవడం చేత మచ్చపడిన కుడి చేతితో ఇంద్రుడు అర్జునుని బాహువులను మెల్లగా మాటిమాటికి సాంత్వనంగా స్పృశించాడు. (25)
స్మయన్నివ గుడాకేశం ప్రేక్షమాణః సహస్రదృక్ ।
మర్షేణోత్ఫుల్లనయనో న చాతృప్యత వృత్రహా ॥ 26
వేయికన్నులు గల ఇంద్రుడు ఆనందంతో వికసించిన కన్నులతో నిద్రను జయించిన అర్జునుని గర్వంగా చూసుకొన్నాడు. వేయికళ్లతో చూసినా అతనికి తృప్తి కలగలేదు. (26)
ఏకాసనోపవిష్టౌ తౌ శోబయాంచక్రతుః సభామ్ ।
సూర్యాచంద్రమసౌ వ్యోమ చతుర్దశ్యామివోదితౌ ॥ 27
చతుర్దశిరోజున ఉదయించిన సూర్యచంద్రులు ఆకాశానికి శోభ కలిగించినట్లుగా, ఒకే ఆసనంలో కూర్చున్న అర్జున దేవేంద్రులు ఆ దేవసభకు శోభను కలిగించారు. (27)
తత్ర స్మ గాథా గాయంతి సామ్నా పరమవల్గునా ।
గంధర్వాస్తుంబురుశ్రేష్ఠాః కుశలా గీతసామసు ॥ 28
ఆ సమయంలో సామగానంలో కుశలులైన తుంబురుడు మున్నగు గంధర్వశ్రేష్ఠులు అత్యంత మధురస్వనంతో సామలతో గాథలు గానం చేశారు. (28)
ఘృతాచీ మేనకా రంభా పూర్వచిత్తిః స్వయంప్రభా ।
ఉర్వశీ మిశ్రకేశీ చ దండగౌరీ వరూథినీ ॥ 29
గోపాలీ సహజన్యా చ కుంభయోనిః ప్రజాగరా ।
చిత్రసేనా చిత్రలేఖా సహా చ మధురస్వరా ॥ 30
ఏతాశ్చాన్యాశ్చ ననృతుః తత్ర తత్ర సహస్రశః ।
చిత్తప్రసాదనే యుక్తాః సిద్ధానాం పద్మలోచనాః ॥ 31
మహాకటితటశ్రోణ్యః కంపమానైః పయోధరైః ।
కటాక్షహావమాధుర్యైః చేతోబుద్ధిమనోహరైః ॥ 32
ఘృతాచి, మేనక, రంభ, పూర్వచిత్తి, స్వయంప్రభ, ఊర్వశి, మిశ్రకేశి, దండగౌరి, వరూధిని, గోపాలి, సహజన్య, కుంభయోని, ప్రజాగర, చిత్రసేన, చిత్రలేఖ, సహ, మధురస్వర మున్నగు వేలకొలది అప్సరలు అక్కడ నృత్యం చేశారు. పద్మలోచనలు అయిన అప్సరలు సిద్ధుల మనస్సులను ప్రసన్నం చేసికోవడంలో లగ్నమయ్యారు. వారు విశాలమైన కటినితంబాలతో, కంపించే పయోధరాలతో, కటాక్ష, హావ, భావాలతో మనోబుధ్ధులను ఆకర్షిస్తూ నర్తించారు. (29-32)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి ఇంద్రసభాదర్శనే త్రిచత్వారింశోఽధ్యాయః ॥ 43 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున ఇంద్రలోకాభిగమన పర్వమను ఉపపర్వమున ఇంద్రాసభాదర్శనమను నలుబది మూడవ అధ్యాయము. (43)