50. ఏబదియవ అధ్యాయము

అరణ్యమున పాండవుల ఆహారము.

జనమేజయ ఉవాచ
యదిదం శోచితం రాజ్ఞా ధృతరాష్ట్రేణ వై మునే ।
ప్రవ్రాజ్య పాండవాన్ వీరాన్ సర్వమేతన్నిరర్థకమ్ ॥ 1
జనమేజయుడిలా అన్నాడు.
మునివరా! వీరులైన పాండవులను అరణ్యానికి పంపించి, ధృతరాష్ట్రుడీవిధంగా దుఃఖించడం వ్యర్థం. (1)
కథం చ రాజాపుత్రం తమ్ ఉపేక్షేతాల్పచేతసమ్ ।
దుర్యోధనం పాండుపుత్రాన్ కోపయానం మహారథాన్ ॥ 2
మహారథులైన పాండుపుత్రులకు కోపం కలిగించిన, మంద బుద్ధి ఐన తనపుత్రుడు దుర్యోధనుని ధృతరాష్ట్రుడు ఏవిధంగా ఉపేక్షించగలడు? (2)
కిమాసీత్ పాండుపుత్రాణాం వనే భోజనేముచ్యతామ్ ।
వానేయమథవా కృష్ణమ్ ఏతదాఖ్యాతు నో భవాన్ ॥ 3
విప్రవరా! అడవిలో పాండవులకు ఆహారంగా ఏం లభించింది? వారు అడవిలోని ఫలమూలాలు తిన్నారా! లేక భూమిని దున్ని ఆహారం పండించుకొని తిన్నారా! నాకు వివరంగా చెప్పు. (3)
వైశంపాయన ఉవాచ
వానేయాంశ్చ మృగాంశ్చైవ శుద్ధైర్బాణైర్నిపాతితాన్ ।
బ్రాహ్మణానాం నివేద్యాగ్రమ్ అభుంజన్ పురుషర్షభాః ॥ 4
వైశంపాయనుడిలా అన్నాడు - పురుషశ్రేష్ఠులైన పాండవులు వన్యాలైన ఫలమూలాలను, స్వచ్ఛమైన బాణాలతో పడగొట్టిన మృగాలను ముందుగా బ్రాహ్మణులకు నివేదిమ్చి తింటున్నారు. (4)
తాంస్తు శూరాన్ మహేష్వాసాన్ తదా నివసతో వనే ।
అన్వయుర్ర్బాహ్మణా రాజన్ సాగ్నయోఽనగ్నయస్తథా ॥ 5
రాజా! వనంలో నివసిస్తున్న మహాధన్వులూ, శూరులైన పాండవులను అక్కడి బ్రాహ్మణులంతా అనుసరించారు. (5)
వి॥సం॥ సాగ్నయః = అగ్నిహోత్రాలతో కూడినవారు.
అనగ్నయః = అగ్నిహోత్రాలు లేనివారు.
బ్రాహ్మణానాం సహస్రాణి స్నాతకానాం మహాత్మనామ్ ।
దశ మోక్షవిదాం తత్ర యాన్ బిభర్తి యుధిష్ఠిరః ॥ 6
అక్కడ యుధిష్ఠిరుడు మహాత్ములు, స్నాతకులు, మోక్షవేత్తలూ అయిన పదివేలమంది బ్రాహ్మణులను రక్షించి, పొషిస్తున్నాడు. (6)
రురూన్ కృష్ణమృగాంశ్చైవ మేధ్యాంశ్చాన్యాన్ వనేచరాన్ ।
బాణైరున్మథ్య వివిధైః బ్రాహ్మణేభ్యో న్యవేదయత్ ॥ 7
రురుమృగాలను, కృష్ణమృగాలను, పవిత్రాలైన మృగాలను బాణాలతో చంపి వాటిచర్మాలను పాండవులు బ్రాహ్మణులకు ఆసనాదులకై ఇస్తున్నారు. (7)
న తత్ర కశ్చిద్ దుర్వర్ణః వ్యాధితో వాపి దృశ్యతే ।
కృశో వా దుర్బలో వాపి దీనో భీతోఽపి వా పునః ॥ 8
అక్కడున్న బ్రాహ్మణులలో ఒక్కడికి కూడ శరీరవర్ణం మారలేదు. ఒక్కడు కూడా వ్యాధిగ్రస్తుడు కాలేదు. ఒక్కడూ కృశించలేదు. దుర్బలుడు కాలేదు. ఒక్కడూ దీనుడు లేడు. భయపడినవాడెవడూ లేడు. (8)
పుత్రానివ ప్రియాన్ భ్రాతౄన్ జ్ఞాతీనివ సహోదరాన్ ।
పుషోష కౌరవశ్రేష్ఠః ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 9
కురుశ్రేష్ఠుడు, యుధిష్ఠిరుడు అయినా ధర్మరాజు తనసోదరులను ప్రియపుత్రులుగా, జ్ఞాతులను సోదరులుగా పోషిస్తున్నాడు. (9)
పతీంశ్చ ద్రౌపదీ సర్వాన్ ద్విజాతీంశ్చ యశస్వినీ ।
మాతృవద్ భోజయిత్వాగ్రే శిష్టమాహారయత్ తదా ॥ 10
యశస్విని అయిన ద్రౌపది ముందుగా భర్తలకు, సమస్త బ్రాహ్మణులకు తల్లివలె భోజనం పెట్టి, తర్వాత మిగిలినది ఆమె తింటుంది. (10)
ప్రాచీం రాజా దక్షిణాం భీమసేనో
యమౌ ప్రతీచీమథ వాప్యుదీచీమ్ ।
ధనుర్ధరాణాం సహితో మృగాణాం
క్షయం చక్రుర్నిత్యమేవోపగమ్య ॥ 11
యుధిష్ఠిరుడు తూర్పున, భీమసేనుడు దక్షిణాన, నకులసహదేవులు పశ్చిమోత్తరాలయందు తక్కిన ధనుర్ధారులతో కూడి నిత్యమూ హింసకజంతువులను సంహరిస్తున్నారు. (11)
తథా తేషాం వసతాం కామ్యకే వై
విహీనానామర్జునేనోత్సుకానామ్ ।
పంచైవ వర్షాణి తథా వ్యతీయుః
అధీయతాం జపతాం జుహ్వతాం చ ॥ 12
ఈవిధంగా కామ్యకవనంలో అర్జునుడు లేకుండా పాండవులు అతని కొరకు ఉత్కంఠితులై ఐదు సంవత్సరాలు స్వాధ్యాయ, జప, హోమాలతో కాలం గడిపారు. (12)
ఇతి శ్రీ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి పార్థాహారకథనే పంచాశత్తమోఽధ్యాయః ॥ 50 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున ఇంద్రలోకాభిగమపర్వమను ఉపపర్వమున పార్థాహారకథనమను ఏబదియవ అధ్యాయము. (50)