51. ఏబది ఒకటవ అధ్యాయము

శ్రీకృష్ణాదులు దుర్యోధనాదులవధకై ప్రతిజ్ఞ చేసిరని సంజయుడు ధృతరాష్ట్రునికి వినిపించుట.

వైశంపాయన ఉవాచ
తేషాం తచ్చరితం శ్రుత్వా మనుష్యాతీతమద్భుతమ్ ।
చింతాశోకపరీతాత్మా మన్యునాభిపరిప్లుతః ॥ 1
దీర్ఘముష్ణం చ నిఃశ్వస్య ధృతరాష్ట్రోఽంబికాసుతః ।
అబ్రవీత్ సంజయం సూతం ఆమంత్ర్య పురుషర్షభ ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు - పురుషశ్రేష్ఠా! జనమేజయా! అంబికాసుతుడైన ధృతరాష్ట్రుడు మనుష్యాతీతమైన ఆశ్చర్యకరమైన పాండవుల వృత్తాంతాన్ని విని, విచారంతో, దుఃఖంతో, వ్యాకులమైన మనస్సుతో, కోపంతో రగిలి, వేడి నిట్టూర్పులు విడిచి సంజయుని దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. (1,2)
న రాత్రౌ న దివా సూత శాంతిం ప్రాప్నోమి వై క్షణమ్ ।
సంచింత్య దుర్నయం ఘోరమ్ అతీతం ద్యూతజం హి తత్ ॥ 3
సంజయా! జూదం వల్ల కలిగిన ఘోరమైన అన్యాయాన్ని గురించి ఆలోచిస్తూంటే రాత్రింబవళ్ళు ఒక్కక్షణకాలం కూడా శాంతిని పొందలేకపోతున్నాను. (3)
తేషామసహ్యవీర్యాణాం శౌర్యం ధైర్యం ధృతిం పరామ్ ।
అన్యోన్యమనురాగం చ భ్రతౄణామతిమానుషమ్ ॥ 4
పాండవుల పరాక్రమం సహింపశక్యంకానిది. వారి శౌర్యం, ధైర్యం, ధృతి, ఆ సోదరుల అన్యోన్యానురాగం మానవాతీతమైనది. (4)
దేవపుత్రౌ మహాభాగౌ దేవరాజసమద్యుతీ ।
నకులః సహదేవశ్చ పాండవౌ యుద్ధదుర్మదౌ ॥ 5
అశ్వినీదేవతల కుమారులు, మహాభాగులు, దేవేంద్రునితో సమానమైన తేజస్సు కల నకులసహదేవులు యుద్ధంలో ప్రచండులు. (5)
దృఢాయుధౌ దూరపాతౌ యుద్ధే చ కృతనిశ్చయౌ ।
శీఘ్రహస్తౌ దృఢక్రోధౌ నిత్యయుక్తౌ తరస్వినౌ ॥ 6
వారు దృఢమైన ఆయుధాలు కలవారు. దూరంలో ఉన్నవారిని కూడా చంపగలరు. యుద్ధంలో కృతనిశ్చయులు. శీఘ్రంగా హస్తాలు కదల్చగలరు. దృఢమైన క్రోధం కలవారు. నిత్యం ప్రయత్నశీలులు. వేగం కలవారు. (6)
భీమార్జునౌ పురోధాయ యదా తౌ రణమూర్ధని ।
స్థాస్యేతే సింహవిక్రాంతౌ అశ్వినానివ దుఃసహౌ ॥ 7
న శేషమిహ పశ్యామి మమ సైన్యస్య సంజయ ।
తౌ హ్యప్రతిరథౌ యుద్ధే దేవపుత్రౌ మహారథౌ ॥ 8
వారిద్దరూ యుద్ధరంగంలో భీమార్జునులను ముందుంచు కొని సింహాల్లా విక్రమిస్తూంటే వారిని సహింపగలవారెవరూ మాసైన్యంలో ఉండరు. ఇక మాసైన్యంలో ఒక్కవీరుడూ మిగలడు. సంజయా! దేవపుత్రులు, మహారథులూ అయిన నకులసహదేవులకు యుద్ధంలో ఎదురు నిలిచేవారు లేరు. (7,8)
ద్రౌపద్యాస్తం పరిక్లేశం న క్షంస్యేతే త్వమర్షిణౌ ।
వృష్ణయోఽథ మహేష్వాసాః పఞ్చాలా వా మహౌజసః ॥ 9
యుధి సత్యాభిసంధేన వాసుదేవేన రక్షితాః ।
ప్రధక్ష్యంతి రణే పార్థాః పుత్రాణాం మమ వాహినీమ్ ॥ 10
ద్రౌపదికి జరిగిన ఆనాటి అవమానాన్ని వారు క్షమించలేరు. అసహనంతో నిండి ఉన్నారు. మహాధనుర్ధరులైన వృష్ణి వంశీయులూ, మహాతేజస్వులైన పాంచాలవీరులూ, యుద్ధంలో సత్యప్రతిజ్ఞ గల శ్రీకృష్ణునిచే రక్షింపబడుతున్న పాండవులూ నిశ్చయంగా యుద్ధంలో నాకుమారులను, కౌరవసేనను భస్మం చేస్తారు. (9,10)
రామకృష్ణప్రణీతానాం వృష్ణీనాం సూతనందన ।
న శక్యః సహితుం వేగః సర్వైస్తైరపి సంయుగే ॥ 11
సూతనందనా! బలరామకృష్ణులచే నడపబడుతున్న వృష్ణివంశవీరుల వేగాన్ని యుద్ధంలో కౌరవులంతా కలిసినా సహింపలేరు. (11)
తేషాం మధ్యే మహేష్వాసః భీమో భీమపరాక్రమః ।
శైక్యయా వీరఘాతిన్యా గదయా విచరిష్యతి ॥ 12
తథా గాండీవనిర్ఘోషం విస్ఫూర్జితమివాశనేః ।
గదావేగం చ భీమస్య నాలం సోఢుం నరాధిపాః ॥ 13
వారిలో మహాధనుర్ధరుడూ, భీమపరాక్రముడూ అయిన భీముడు వీరులను సంహరించే గదను ఆకాశంలో త్రిప్పుతూ యుద్ధరంగంలో సంచరిస్తాడు. భీముని గదావేగాన్ని, వజ్రాయుధంగా ఘోషించే గాండీవ ధనుష్టంకారాన్ని కౌరవసైన్యంలోని శత్రురాజులెవరూ సహింపలేరు. (12,13)
తతోఽహం సుహృదాం వాచః దుర్యోధనవశానుగః ।
స్మరణీయాః స్మరిష్యామి మయా యా న కృతాః పురా ॥ 14
ఆ సమయంలో నేను దుర్యోధనుడి అధీనంలో ఉన్నాను. మునుపు స్నేహితులు చెప్పిన మాటలు నేను వినలేదు. ఇపుడు వాటిని గుర్తుచేసికొంటున్నాను. (14)
సంజయ ఉవాచ
వ్యతిక్రమోఽయం సుమహాన్ త్వయా రాజన్నుపేక్షితః ।
సమర్థేనాపి యన్మోహాత్ పుత్రస్తు న నివారితః ॥ 15
సంజయుడిలా అన్నాడు - రాజా! నీద్వారా చాలా ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆవిషయం నీవు తెలిసి కూడా ఉపేక్షించావు. దాన్ని ఆపడానికి సమర్థుడవై కూడా పుత్రవ్యామోహం వల్ల దాన్ని నివారించలేదు. (15)
శ్రుత్వా హి నిర్జితాన్ ద్యూతే పాండవాన్ మధుసూదనః ।
త్వరితః కామ్యకే పార్థాన్ సమభావయదచ్యుతః ॥ 16
మధుసూదనుడైన కృష్ణుడు పాండవులు జూదంలో పరాజితులయ్యారని తెలిసి, కామ్యకవనంలో ఉన్నవారిని తొందరగా కలిసికొని ఊరడించాడు. (16)
ద్రుపదస్య తథా పుత్రాః ధృష్టద్యుమ్నపురోగమాః ।
విరాటో ధృష్టకేతుశ్చ కేకయాశ్చ మహారథాః ॥ 17
ద్రుపదుని పుత్రులైన ధృష్టద్యుమ్నాదులు, విరాటరాజు, ధృష్టకేతువు, మహారథులైన కేకయవీరులూ పాడవులను కలిశారు. (17)
తైశ్చ యత్ కథితం రాజన్ దృష్ట్వా పార్థాన్ పరాజితాన్ ।
చారేణ విదితం సర్వం తన్మయాఽఽవేదితం చ తే ॥ 18
రాజా! వారు పరాజితులైన పాండవులతో ఏం చెప్పారో చారుల ద్వారా నేను తెలిసికొని, అదంతా నీకు చెప్పాను కూడ. (18)
సమాగమ్య వృతస్తత్ర పాండవైర్మధుసూదనః ।
సారథ్యే ఫాల్గునస్యాజౌ తథేత్యాహ చ తాన్ హరిః ॥ 19
శ్రీకృష్ణుడు పాండవులను కలిసి, వారడిగితే యుద్ధంలో అర్జునుడికి సారథ్యం వహిస్తానని చెప్పాడు. (19)
అమర్షితో హి కృష్ణోఽపి దృష్ట్వా పార్థాంస్తథా గతాన్ ।
కృష్ణాజినోత్తరాసంగాన్ అబ్రవీచ్చ యుధిష్ఠిరమ్ ॥ 20
అటువంటి దురవస్థలో ఉండి, కృష్ణాజినాలను ధరించిన పాండవులను చూసి అసహనంతో కృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పాడు. (20)
యా సా సమృద్ధిః పార్థానామ్ ఇంద్రప్రస్థే బభూవ హ ।
రాజసూయే మయా దృష్టా నృపైరన్యైః సుదుర్లభా ॥ 21
ఇంద్రప్రస్థంలో ఉన్నపుడు పాండవుల సంపద ఎంతటిదో రాజసూయంలో నేను ప్రత్యక్షంగా చూశాను. అటువంటిది ఇతర క్షత్రియులెవరికీ లభ్యంకాదు. (21)
యత్ర సర్వాన్ మహీపాలాన్ శస్త్రతేజోభయార్దితాన్ ।
సవంగాంగాన్ సపౌండ్రోఢ్రాన్ సచోలద్రావిడాంధ్రకాన్ ॥ 22
సాగరానూపకాంశ్చైవ యే చ ప్రాంతాభివాసినః ।
సింహలాన్ బర్బరాన్ మ్లేచ్ఛాన్ యే చ లంకానివాసినః ॥ 23
పశ్చిమాని చ రాష్ట్రాణి శతశః సాగరాంతికాన్ ।
పహ్లవాన్ దరదాన్ సర్వాన్ కిరాతాన్ యవనాన్ శకాన్ ॥ 24
హారహూణాంశ్చ చీనాంశ్చ తుషారాన్ సైంధవాంస్తథా ।
జాగుడాన్ రామఠాన్ ముండాన్ స్త్రీరాజ్యమథ తంగణాన్ ॥ 25
కేకయాన్ మాలవాంశ్చైవ తథా కాశ్మీరకానపి ।
అద్రాక్షమహమాహూతాన్ యజ్ఞే తే పరివేషకాన్ ॥ 26
ఆ సమయంలో పాండవుల శస్త్రాల తేజస్సుకు భూపాలురంతా భయభ్రాంతులయ్యారు. అంగ, వంగ, పుండ్ర, ఓఢ్ర, చోల ద్రావిడ, ఆంధ్ర దేశపురాజులు, సాగరతీరవాసులు, సముద్రద్వీపవాసులు రాజసూయయాగానికి వచ్చారు. సింహల, బర్బర, మ్లేచ్ఛ, లంకానివాసులు, పశ్చిమరాష్ట్రవాసులు, సాగరతీరవాసులు, పహ్లవ, దరద, కిరాత, యవన, శక, హారహూణ, చీన, తుషార, సైంధవ, జాగుడ, రామఠ, ముండ, స్త్రీరాజ్య, తంగణ, కేకయ, మాలవ, కాశ్మీరదేశరాజులు ఆ యజ్ఞానికి ఆహ్వానింపబడ్డారు. వారందరికి ఇచ్చిన ఆతిథ్యాన్ని చూశాను. (22-26)
సా తే సమృద్ధిర్యైరాత్తా చపలా ప్రతిసారిణీ ।
ఆదాయ జీవితం తేషామ్ ఆహరిష్యామి తామహమ్ ॥ 27
చంచలమైన నీసంపదను తీసుకువెళ్ళిన వారి ప్రాణాలు తీసి ఆ సంపదను నేను మళ్ళీ తీసికొని వస్తాను. (27)
రామేణ సహ కౌరవ్య భిమార్జునయమైస్తథా ।
అక్రూరగదసాంబైశ్చ ప్రద్యుమ్నేనాహుకేన చ ॥ 28
ధృష్టద్యుమ్నేన వీరేణ శిశుపాలాత్మజేన చ ।
దుర్యోధనం రణే హత్వా సద్యః కర్ణం చ భారత ॥ 29
దుఃశాసనం సౌబలేయం యశ్చాన్యః ప్రతియోత్స్యతే ।
తతస్త్వం హాస్తినపురే భ్రాతృభిః సహితో వసన్ ॥ 30
ధార్తరాష్ట్రీం శ్రియం ప్రాప్య ప్రశాధి పృథివీమిమామ్ ।
కురునందనా! భరతకులతిలకా! బలరామ, భీమసేన, అర్జున, నకుల, సహదేవ, అక్రూర, గద, సాంబ, ప్రద్యుమ్న, ఆహుక, వీర, ధృష్టద్యుమ్న, ధృష్టకేతుప్రముఖ వీరులతో దుర్యోధన, కర్ణ, దుఃశాసన శకునులను, ఎదురువచ్చిన తక్కిన యోధులను చంపి శీఘ్రంగా నీ సంపదను నీకు తిరిగి తీసికొనివస్తాను. ఆ తరువాత నీ సోదరులతో కలిసి హస్తినాపురంలో నివసిస్తూ ధృతరాష్ట్రసంబంధమైన రాజ్యలక్ష్మిని పొంది ఈ సమస్త పృథివీమండలాన్ని శాసించు. (28-30 1/2)
అథైనమబ్రవీద్ రాజా తస్మిన్ వీరసమాగమే ॥ 31
శృణ్వత్స్వేతేషు వీరేషు ధృష్టద్యుమ్నముఖేషు చ ।
అపుడు యుధిష్ఠిరుడు ధృష్టద్యుమ్నాది వీరులంతా వింటూండగా, శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు- (31 1/2)
యుధిష్ఠిర ఉవాచ
ప్రతిగృహ్ణామి తే వాచమిమాం సత్యాం జనార్దన ॥ 32
యుధిష్ఠిరుడిలా అన్నాడు - జనార్దనా! నీ ఈ సత్యవాక్కును శిరసావహిస్తున్నాను. (32)
అమిత్రాన్ మే మహాబాహో సానుబంధాన్ హనిష్యసి ।
వర్షాత్ త్రయోదశాదూర్ధ్వం సత్యం మాం కురు కేశవ ॥ 33
ప్రతిజ్ఞాతో వనే వాసః రాజమధ్యే మయా హ్యయమ్ ।
మహాబాహూ! కేశవా! పదమూడు సంవత్సరాలు గడిచిన తర్వాత, నా శత్రువులనుఉ,వారివారి బంధువులతో పాటుగా, సంహరించు. ఆ విధంగా చేసి నా సత్యవ్రతాన్ని రక్షించు. రాజులందరి మధ్యలో నేను వనవాసప్రతిజ్ఞను చేశాను. (33 1/2)
తద ధర్మరాజవచనం ప్రతిశ్రుత్య సభాసదః ॥ 34
ధృష్టద్యుమ్నపురోగాస్తే శమయామాసురంజసా ।
కేశవం మధురైర్వాక్యైః కాలయుక్తైరమర్షితమ్ ॥ 35
ధర్మరాజు చెప్పిన ఆ మాటలు విన్న తర్వాత, ధృష్టద్యుమ్నాది సభాసదులు సమయోచిత మధురవచనాలతో అసహనంతో ఉన్న కృష్ణుని శీఘ్రంగా శాంతి పరిచారు. (34,35)
పాంచాలీం ప్రాహురక్లిష్టాం వాసుదేవస్య శృణ్వతః ।
దుర్యోధనస్తవ క్రోధాద్ దేవి త్యక్ష్యతి జీవితమ్ ॥ 36
వారంతా శ్రీకృష్ణుడు వింటూండగా క్లేశరహిత అయిన ద్రౌపదితో ఇలా అన్నారు - దేవి! దుర్యోధనుడు నీక్రోధం వల్ల తప్పక ప్రాణత్యాగం చేస్తాడు. (36)
ప్రతిజానీమహే సత్యం మా శుచో వరవర్ణిని ।
యే స్మ తేఽక్షజితాం కృష్ణే దృష్ట్వా త్వాం ప్రాహసంస్తదా ।
మాంసాని తేషాం ఖాదంతః హరిష్యంతి వృకద్విజాః ॥ 37
వరవర్ణిని! మేము నిజంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. నీవు దుఃఖించకు. కృష్ణా! (ద్రౌపదీ!) అపుడు జూదంలో ఓడిన నిన్ను చూసి నవ్వినవారి మాంసాలను తోడేళ్ళు తింటూ లాక్కువెళ్తాయి. (37)
పాస్యంతి రుధిరం తేషాం గృధ్రా గోమాయవస్తథా ।
ఉత్తమాంగాని కర్షంతః యైః కృష్టాసి సభాతలే ॥ 38
సభలో నీ జుట్టు పట్టుకొని లాక్కువచ్చిన వారి తలలను లాక్కుంటూ గ్రద్దలు, గోమాయువులు వారి రక్తాన్ని త్రాగుతాయి. (38)
తేషాం ద్రక్ష్యసి పాంచాలి గాత్రాణి పృథివీతలే ।
క్రవ్యాదైః కృష్యమాణాని భక్ష్యమాణాని చాసకృత్ ॥ 39
ద్రౌపదీ! వారి శవాలను మాంసం తినే పశుపక్ష్యాదులు మాటిమాటికీ లాక్కుంటూ పీక్కుంటూ తినడం నీవు చూస్తావు. (39)
పరిక్లిష్టాసి యైస్తత్ర యైశ్చాసి సముపేక్షితా ।
తేషాముత్కృత్తశిరసాం భూమిః పాస్యతి శోణితమ్ ॥ 40
నిన్ను క్లేశపెట్టి అవమాన పరచిన వారి తలలు తెగిపడతాయి. వారి రక్తాన్ని భూమి త్రాగుతుంది. (40)
ఏవం బహువిధా వాచః త ఊచుర్భరతర్షభ ।
సర్వే తేజస్వినః శూరాః సర్వే చాహతలక్షణాః ॥ 41
తేజస్వులూ, శూరులూ, శుభలక్షణులూ అయిన వారు ఇలా ఎన్నో విధాల మాట్లాడారు. (41)
తే ధర్మరాజేన వృతా వర్షాదూర్ధ్వం త్రయోదశాత్ ।
పురస్కృత్యోపయాస్యంతి వాసుదేవం మహారథాః ॥ 42
పదమూడు సంవత్సరాలయిన తరువాత ధర్మరాజు యుద్ధం కోరుకొంటాడు. అపుడు కృష్ణుని ముంచుంచుకొని మహారథులంతా యుద్ధానికి వెళతారు. (42)
రామశ్చ కృష్ణశ్చ ధనంజయశ్చ
ప్రద్యుమ్నసాంబౌ యుయుధానభీమౌ ।
మాద్రీసుతౌ కేకయరాజపుత్రౌ
పాంచాలపుత్రాః సహ మత్స్యరాజ్ఞా ॥ 43
ఏతాన్ సర్వాన్ లోకవీరానజేయాన్
మహాత్మనః సానుబంధాన్ ససైన్యాన్ ।
కో జీవితార్థీ సమరేఽభ్యుదీయాత్
క్రుద్ధాన్ సింహాన్ కేసరిణో యథైవ ॥ 44
బలరాముడు, కృష్ణుడు, అర్జునుడు, ప్రద్యుమ్నుడు, రాజపుత్రులు, పాంచాలురు, విరాటుడు; వీరంతా అజేయులయిన వీరులు - పైగా వీరు బంధువులతో, సైన్యంతో వస్తే బ్రతుకు మీద ఆశ ఉన్నవాడెవడయినా ఎదుర్కొంటాడా? అలా చేస్తే గర్జించే సింహం జూలు పట్టుకున్నట్లే! (43,44)
ధృతరాష్ట్ర ఉవాచ
యన్మాబ్రవీద్ విదురో ద్యూతకాలే
త్వం పాండవాన్ జేష్యసి చేన్నరేంద్ర ।
ధ్రువం కురూనామయమంతకాలో
మహాభయో భవితా శోణితౌషుః ॥ 45
ధృతరాష్ట్రుడిట్లన్నాడు. సంజయా! జూదంనాడు విదురుడు నాతో "రాజా! నీవే కనుక జూదంలో నెగ్గితే నిజంగా ఇది కౌరవులకు అంత్యకాలమే. రక్తపుటేరులు ప్రవహిస్తాయి" - అన్నాడు. (45)
మన్యే తథా తద్ భవితేతి సూత
యథా క్షత్తా ప్రాహ వచః పురా మామ్ ।
అసంశయం భవితా యుద్ధమేతద్
గతే కాలే పాండవానాం యథోక్తమ్ ॥ 46
విదురుడానాడు అన్నమాట జరిగి తీరేటట్లే ఉంది. పాండవులు చెప్పినట్లు యుద్ధం రానే వస్తుంది. నిస్సందేహం. (46)
ఇతి శ్రీ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి ధృతరాష్ట్ర విలాపే ఏకపంచాశత్తమోఽధ్యాయః ॥ 51 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున ఇంద్రలోకాభిగమపర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర విలాపమను ఏబది యొకటవ అధ్యాయము. (51)