52. ఏబది రెండవ అధ్యాయము

(నలోపాఖ్యాన పర్వము)

నలోపాఖ్యాన ప్రారంభము.

జనమేజయ ఉవాచ
అస్త్రహేతోర్గతే పార్థే శక్రలోకం మహాత్మని ।
యుధిష్ఠిరప్రభృతయః కిమకుర్వత పాండవాః ॥ 1
జనమేజయుడిలా అన్నాడు - అస్త్రాల కారణంగా, అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళిన పిమ్మట, పాండుకుమారులైన ధర్మరాజ, భీమ, అర్జున, నకుల సహదేవులు ఏం చేశారు? (1)
వైశంపాయన ఉవాచ
అస్త్రహేతోర్గతే పార్థే శక్రలోకం మహాత్మని ।
అవసన్ కృష్ణయా సార్ధం కామ్యకే భరతర్షభాః ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు.
జనమేజయా! అస్త్రాల కోసం అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళిన తర్వాత, ధర్మజప్రభృతులు, ద్రౌపదీ సహితులై కామ్యకవనంలో ఉన్నారు. (2)
తతః కదాచిదేకాంతే వివిక్త ఇవ శాద్వలే ।
దుఃఖార్తా భరతశ్రేష్ఠాః నిషేదుః సహ కృష్ణయా ॥ 3
ధనంజయం శోచమానాః సాశ్రుకంఠాః సుదుఃఖితాః ।
తద్వియోగార్దితాన్ సర్వాన్ శోకః సమభిపుప్లువే ॥ 4
ఒకనాడు ధర్మరాజాదులు, అర్జునుని ఎడబాటుకు దుఃఖార్తులై ద్రౌపదితో కలసి ఏకాంతప్రదేశంలో పచ్చికబయళ్ళపై కూర్చున్నారు. అశ్రుకంఠాలతో దుఃఖార్తులైన వారందరిని శోక మావరించింది. (3,4)
ధనంజయవియోగాచ్చ రాజ్యభ్రంశాచ్చ దుఃఖితాః ।
అథ భీమో మహాబాహుః యుధిష్ఠిరమభాషత ॥ 5
అర్జున వియోగం వల్లను, రాజ్యభ్రంశం వల్లను పాండవులు దుఃఖితులయ్యారు. ఆ సమయంలో మహాబలవంతుడైన భీముడు ధర్మరాజుతో ఇలా పలికాడు. (5)
నిదేశాత్ తే మహారాజ గతోఽసౌ భరతర్షభః ।
అర్జునః పాండుపుత్రాణాం యస్మిన్ ప్రాణాః ప్రతిష్ఠితాః ॥ 6
మహారాజా! అర్జునుడు మీ ఆదేశం వల్లనే కదా మనందరిని విడిచి వెళ్ళినది. వాడిమీదనే మనప్రాణాలన్నీ నిలుపుకొన్నాం. (6)
యస్మిన్ వినష్టే పాంచాలాః సహ పుత్రైస్తథా వయమ్ ।
సాత్యకిర్వాసుదేవశ్చ వినశ్యేయుర్న సంశయః ॥ 7
అర్జునుడే కనుక లేకుంటే, మేము, పాంచాలురు, వారిపుత్రులు, సాత్యకి, వాసుదేవుడూ నిస్సంశయంగా లేనట్లే. (7)
యోఽసౌ గచ్ఛతి ధర్మాత్మా బహూన్ క్లేశాన్ విచింతయన్ ।
భవన్నియోగాద్ బీభత్సుః తతో దుఃఖతరం ను కిమ్ ॥ 8
ధర్మాత్ముడైన అర్జునుడు, రాబోయే బాధలన్నింటిని గురించి బాగా ఆలోచించి, మీ ఆదేశం వల్లనే వెళ్ళాడు. ఇంతకంటే ఎక్కువ దుఃఖమేముంది? (8)
యస్య బాహూ సమాశ్రిత్య వయం సర్వే మహాత్మనః ।
మన్యామహే జితానాజౌ పరాన్ ప్రాప్తాం చ మేదినీమ్ ॥ 9
అర్జునుని పరాక్రమం వల్లనే, మనం శత్రువులను జయించి, రాజ్యాన్ని పొందామని అనుకొంటున్నాము. (9)
యస్య ప్రభావాన్న మయా సభామధ్యే ధనుష్మతః ।
నీతా లోకమముం సర్వే ధార్తరాష్ట్రాః ససౌబలాః ॥ 10
ధనుర్ధారియైన అర్జునుని ప్రభావం వల్లనే, సభలో నేను సౌబలునితో సహా ధృతరాష్ట్రపుత్రులందరినీ పరలోకానికి పంపలేదు. (10)
తే వయం బాహుబలినః క్రోధముత్థితమాత్మనః ।
సహామహే భవన్మూలం వాసుదేవేన పాలితాః ॥ 11
అట్టి బాహుబలసంపన్నులమైన మేము, వాసుదేవ రక్షితులమై, నీ మూలంగా మాకోపాన్ని అణచుకొన్నాము. (11)
వయం హి సహ కృష్ణేన హత్వా కర్ణముఖాన్ పరాన్ ।
స్వబాహువిజితాం కృత్స్నాం ప్రశాసేమ వసుంధరామ్ ॥ 12
కృష్ణునితో కూడి మేము కర్ణుడు మొదలైన శత్రువులను చంపి, స్వశక్తితో జయించి భూమండలాన్ని పరిపాలించేవారము. (12)
భవతో ద్యూతదోషేణ సర్వే వయముపప్లుతాః ।
అహీనపౌరుషా బాలాః బలిభిర్బలవత్తరాః ॥ 13
మీ ద్యూతదోషం చేతనే, మేమందరం, మహాబలసంపన్నులమై యుండి కూడ, బలవంతుల చేత బాలురువలె త్రోసివేయబడ్డాం. (13)
క్షాత్రం ధర్మం మహారాజ త్వమవేక్షితుమర్హసి ।
న హి ధర్మో మహారాజ క్షత్రియస్య వనాశ్రయః ॥ 14
మహారాజా! క్షాత్ర ధర్మాన్ని గురించి, ఒకింత ఆలోచించండి! క్షత్రియునకు, అరణ్యవాసం ధర్మం కాదు కదా! (14)
రాజ్యమేవ పరం ధర్మం క్షత్రియస్య విదుర్బుధాః ।
స క్షత్రధర్మవిద్ రాజా మా ధర్మ్యాన్నీనశః పథః ॥ 15
రాజ్యాన్ని పరిపాలించడమే క్షత్రియ ధర్మమని పండితులందరికీ తెలుసును. క్షత్రధర్మాన్ని తెలిసిన రాజు ఎప్పుడూ స్వధర్మమార్గాన్ని వీడరాదు. (15)
ప్రాగ్ ద్వాదశసమా రాజన్ ధార్తరాష్ట్రాన్ ససౌబలాన్ ।
నివర్త్య చ వనాత్ పార్థమ్ ఆనాయ్య చ జనార్దనమ్ ॥ 16
రాజా! పండ్రెండు సంవత్సరాలకు ముందే, అరణ్యం నుండి అర్జునుని నివారించి, కృష్ణుని కూడా రప్పించి ధార్తరాష్ట్రులను చంపుతాను. (16)
వ్యూఢానీకాన్ మహారాజ జవేనైవ మహామతే ।
ధార్తరాష్ట్రానముం లోకం గమయామి విశాంపతే ॥ 17
మహారాజా! అతిత్వరలో, ధార్తరాష్ట్రులను ససైన్యంగా పరలోకానికి పంపుతాను. (17)
సర్వానహం హనిష్యామి ధార్తరాష్ట్రాన్ ససౌబలాన్ ।
దుర్యోధనం చ కర్ణం చ యో వాన్యః ప్రతియోత్స్యతే ॥ 18
సౌబలసహితంగా ధార్తరాష్ట్రాన్ ససౌబలాన్ ।
దుర్యోధనం చ కర్ణం చ యో వాన్యః ప్రతియోత్స్యతే ॥ 18
సౌబలసహితంగా ధార్తరాష్ట్రులనందరినీ, దుర్యోధనునీ, కర్ణునీ, యుద్ధంలో ఎదురు నిలచిన వాడెవడైనా సరే చంపుతాను. (18)
మయా ప్రశమితే పశ్చాత్ త్వమేష్యసి వనాత్ పునః ।
ఏవం కృతే న తే దోషాః భవిష్యంతి విశాంపతే ॥ 19
ఈ విధంగా చేసినట్లైతే, మీకు ఎటువంటి ధర్మగ్లాని (దోషం) కలగదు. నాచేతిలో శత్రుపక్షం అంతరించి ప్రశాంతత ఏర్పడినపుడు, మీరు అరణ్యం నుండి మరలి వచ్చేవారు. (19)
యజ్ఞైశ్చ వివిధైస్తాత కృతం పాపమరిందమ ।
అవధూమ మహారాజ గచ్ఛేమ స్వర్గముత్తమమ్ ॥ 20
మహారాజా! వివిధ యజ్ఞాలచే పూర్వకృత పాపం పోగొట్టుకొని ఉత్తమమైన స్వర్గాన్ని పొందేవాళ్లం. (20)
ఏవమేతద్ భవేద్ రాజన్ యది రాజా న బాలిశః ।
అస్మాకం దీర్ఘసూత్రః స్యాద్ భవాన్ ధర్మపరాయణః ॥ 21
మహారాజా! రాజు మూర్ఖుడు కాకుండా దీర్ఘసూత్రుడయి ఉంటే అది అలాగే జరిగేది. కాని మీరు ధర్మపరాయణులు కనుక అలా జరిగే ఆస్కారం లేదు. (21)
నికృత్యా నికృతిప్రజ్ఞాః హంతవ్యా ఇతి నిశ్చయః ।
న హి నైకృతికం హత్వా నికృత్యా పాపముచ్యతే ॥ 22
మోసగిమ్చే నేర్పుకలవారిని మోసంతోనే జయించాలని నా నిశ్చయం. మోసంతో మోసగానిని చంపడం పాపం కాదుకదా! (22)
తథా భారత ధర్మేషు ధర్మజ్ఞైరిహ దృశ్యతే ।
అహోరాత్రం మహారాజ తుల్యం సంవత్సరేణ హ ॥ 23
భారతా! ఒకరోజు, ఒక సంవత్సరకాలంతో సమానమని ఈ విషయంలో ధర్మం తెలిసిన వారు భావిస్తున్నారు. (23)
వి॥ దుర్మార్గులను అంతం చేసే విషయంలో ఉపేక్షాభావం ఏమాత్రం తగదని, వెంటనే ఆ పనిని పూర్తిచేయాలని వాని భావన - ఇట వ్యక్తమవుతోంది.
తథైవ వేదవచనం శ్రూయతే నిత్యదా విభో ।
సంవత్సరో మహారాజ పూర్ణో భవతి కృచ్ఛ్రతః ॥ 24
వేదవాక్కులు కూడ, అదే విధంగా వినబడుతున్నాయి. మహారాజా! ఒక సంవత్సరకాలం, అతిక్లేశంతో పూర్తి అవుతోంది. (24)
వి॥సం॥ 'విశ్వసృజాగ్౦ సహస్రసంవత్సరమ్' అని వేదవచనం. ఇక్కడ సంవత్సరపదానికి రోజు అనే అర్థం చెప్పాలి. లేకపోతే "శతాయుర్వైపురుషః" అన్న మరో శ్రుతివచనం తప్పుతుంది. పైపెచ్చు సహస్రసంవత్సరాలు జీవించటమన్నది లోకంలో కనిపించదు. (నీల)
యది వేదాః ప్రమాణాస్తే దివసాదూర్ధ్వమచ్యుత ।
త్రయోదశ సమాః కాలః జ్ఞాయతాం పరినిష్ఠితః ॥ 25
మీకు, వేదాలే కనుక ప్రమాణాలైతే, ఒకరోజు ఒక సంవత్సరంతో తుల్యమవుతుంది. దీన్నిబట్టి పదమూడు సంవత్సరాల కాలపరిమితిని గురించి మీరు తెలుసుకోండి. (25)
కాలో దుర్యోధనం హంతుం సానుబంధమరిందమ ।
ఏకాగ్రాం పృథివీమ్ సర్వాం పురా రాజన్ కరోతి సః ॥ 26
అనుబంధం గల దుర్యోధనుని చంపటానికి ఇదే సరియైన సమయం. అతడు భుమండల మంతటిని ఒకటిగా కలుపుకొనకముందే ఈ పని జరగాలి. (26)
ద్యూతప్రియేణ రాజేంద్ర తథా తద్ భవతా కృతమ్ ।
ప్రాయేణాజ్ఞాతచర్యాయాం వయం సర్వే నిపాతితాః ॥ 27
మహారాజా! ద్యూతప్రియుడవైన నిచేతలవలననే, అది అలా జరిగింది. మనమంతా అజ్ఞాతవాసం అనే గోతిలోకి త్రోసివేయబడ్డాం. (27)
న తం దేశం ప్రపశ్యామి యత్ర సోఽస్మాన్ సుదుర్జనః ।
న విజ్ఞాస్యతి దుష్టాత్మా చారైరితి సుయోధనః ॥ 28
అధిగమ్య చ సర్వాన్ నః వనవాసమిమం తతః ।
ప్రవ్రాజయిష్యతి పునః నికృత్యాధమపూరుషః ॥ 29
వనవాసకాలం పండ్రెండ్రు సంవత్సరాలు పూర్తియైన పిమ్మట, అజ్ఞాతంగా ఒక సంవత్సర కాలం గడపాలి. దురాత్ముడైన దుర్యోధనుడు, తన గూఢచారుల ద్వారా మన ఉనికిని పసిగట్టలేని దేశమేదో నా ఆలోచనకు అందటం లేదు. అధముడైన దుర్యోధనుడు ఏ చిన్న అవకాశం దొరికినా, తిరిగి మోసంతో వనవాసానికి పంపుతాడు. (28,29)
యద్యస్మానభిగచ్ఛేత పాపః స హి కథంచన ।
అజ్ఞాతచర్యాముత్తీర్ణాన్ దృష్ట్వా చ పునరాహ్వయేత్ ॥ 30
ఏదో ఒకవిధంగా, పాపకర్ముడైన దుర్యోధనుడు మన ఉనికిని పసిగట్టక, అజ్ఞాతవాసం పూర్తి అయితే వాడు, మనలను తిరిగి జూదానికి ఆహ్వానిస్తాడు. (30)
ద్యూతేన తే మహారాజ పునర్ద్యూతమవర్తత ।
భావాంశ్చ పునరాహూతః ద్యూతే నైవాపనేష్యతి ॥ 31
మహారాజా! జూదానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి, మరల జూదమాడటానికి మిమ్మాహ్వానించి, ద్యూతక్రియతోనే మిమ్ము ఓడించి రాజ్యం నుండి బయటకు పంపిస్తాడు. (31)
స తథాక్షేషు కుశలః నిశ్చితో గతచేతనః ।
చరిష్యసి మహారాజ వనేషు వసతీః పునః ॥ 32
వాడు (ఆ దుర్యోధనుడు) పాచికలాడుటలో నేర్పరియని గత అనుభవం వలన తెలిసినదే! మహారాజా! మనం తిరిగి వనాలలో నివాసమేర్పరచుకొని కాలాన్ని గడపవలసి ఉంటుంది. (32)
యద్యస్మాన్ సుమహారాజ కృపణాన్ కర్తుమర్హసి ।
యావజ్జీవమవేక్షస్య వేదధర్మాంశ్చ కృత్స్నశః ॥ 33
మహారాజా! దైన్యస్థితిలోనే మమ్మందరినీ నిలుపదలచుకొంటే సరే! కానీ బ్రతికియున్నంతకాలం వేదధర్మాలను పూర్తిగా పరిశీలించండి. (33)
నికృత్యా నికృతిప్రజ్ఞః హంతవ్య ఇతి నిశ్చయః ।
అనుజ్ఞాతస్త్వయా గత్వా యావచ్ఛక్తి సుయోధనమ్ ॥ 34
యథైవ కక్షముత్సృష్టః దహేదనిలసారథిః ।
హనిష్యామి తథా మందమ్ అనుజానాతు మే భవాన్ ॥ 35
మోసగాడు, మోసంతోనే చంపదగినవాడు. ధర్మజ్ఞుల ఈ నిర్ణయాన్ని గుర్తెరిగి, నాకు ఆజ్ఞ ఇచ్చినట్లైతే.... పైకెగసిన దావాగ్ని ఎండిన అడవిని దహించినట్లు, సుయోధనుని చంపేస్తాను. అలా నాకు మీరు అనుజ్ఞ ఇవ్వండి. (34,35)
వైశంపాయన ఉవాచ
ఏవం బ్రువాణాం భీమం తు ధర్మరాజో యుధిష్ఠిరః ।
ఉవాచ సాంత్వయన్ రాజా మూర్ధ్న్యుపాఘ్రాయ పాండవమ్ ॥ 36
వైశంపాయనుడిలా అన్నాడు. ఈ విధంగా పలుకుతున్న భీముని ధర్మరాజు అనునయిస్తూ, తమ్ముని శిరస్సు నాఘ్రాణించి, ఇలా అన్నాడు. (36)
అసంశయం మహాబాహో హనిష్యసి సుయోధనమ్ ।
వర్షాత్ త్రయోదశాదూర్ధ్వం సహ గాండీవధన్వనా ॥ 37
మహాబాహూ! పదమూడు సంవత్సరాలు గడచిన తర్వాత అర్జున సహితుడవై నీవు, సుయోధనుని సంహరిస్తావు. సందేహం లేదు. (37)
యత్ త్వమాభాషసే పార్థ ప్రాప్తః కాల ఇతి ప్రభో ।
అవృతం నోత్సహే వక్తుం న హ్యేతన్మమ విద్యతే ॥ 38
భీమా! దుర్యోధనవధ కిది తగిన సమయమని ఎన్నోవిధాల పలికావు. అసత్యం పలకటం నాకిష్టం లేదు. అది నాకు చేతకాదు. (38)
అంతరేణాపి కౌంతేయ నికృతిం పాపనిశ్చయమ్ ।
హంతా త్వమసి దుర్ధర్ష సానుబంధం సుయోధనమ్ ॥ 39
భీమసేనా! పాపాత్ముడయిన సుయోధనుని బంధుసహితంగా నీవు మోసం లేకుండానే చంపగలవు. (39)
ఏవం బ్రువతి భీమం తు ధర్మరాజే యుధిష్ఠిరే ।
ఆజగామ మహాభాగః బృహదశ్వో మహానృషిః ॥ 40
ఈ విధంగా ధర్మరాజు భీమునితో మాట్లాడుతూ ఉండగానే మహాత్ముడైన బృహదశ్వుడనే మహర్షి అక్కడకు విచ్చేశాడు. (40)
తమభిప్రేక్ష్య ధర్మాత్మా సంప్రాప్తం ధర్మచారిణమ్ ।
శాస్త్రవన్మధుపర్కేణ పూజయామాస ధర్మరాట్ ॥ 41
ధర్మరాజు ధర్మవర్తనుడైన ఆ మహర్షిని చూచి, సగౌరవంగా మధుపర్కమిచ్చి, శాస్త్రోక్తంగా పూజ చేశాడు. (41)
మధుపర్కం: అతిథికి ఇచ్చే గౌరవపూర్వకమగు ఉపహారం. (పెరుగు, నేయి, నీరు, తేనె, పంచదార - వీటి సముదాయమే మధుపర్కం)
ఆశ్వస్తం చైనమాసీనమ్ ఉపాసీనో యుధిష్ఠిరః ।
అభిప్రేక్ష్య మహాబాహుః కృపణం బహ్వభాషత ॥ 42
సేదదీరి ఉపవిష్టుడైన బృహదశ్వమహర్షితో ధర్మరాజు అతిదీనంగా ఇలా పలికాడు. (42)
అక్షద్యూతే చ భగవన్ ధనం రాజ్యం చ మే హృతమ్ ।
ఆహూయ నికృతిప్రజ్ఞైః కితవైరక్షకోవిదైః ॥ 43
భగవన్! పాచికలాడటానికి పిలిచి, మోసగించే ప్రజ్ఞకలిగి, పాచికలాడటంలో నేర్పరులైన జూదగాండ్రు ఆటలో నన్ను పరాజితుని జేసి, నా రాజ్యాన్ని హరించారు. (43)
అనక్షజ్ఞస్య హి సతః నికృత్యా పాపనిశ్చయైః ।
భార్యా చ మే సభాం నీతా ప్రాణేభ్యోఽపి గరీయసీ ॥ 44
ఆ పాపకర్ములు - అక్షవిద్య తెలియని నన్ను మోసగించి, ప్రాణాధికురాలైన నాభార్యను కూడ సభలోనికి లాక్కువచ్చారు. (44)
పునర్ద్యూతేన మాం జిత్వా వనవాసం సుదారుణమ్ ।
ప్రావ్రాజయన్ మహారణ్యమ్ అజినైః పరివారితమ్ ॥ 45
తిరిగి జూదంలో నన్యోడించి, నారబట్టలతో అతిదారుణమైన వనవాసానికి పంపించారు. (45)
అహం వనే దుర్వసతీఃవసన్ పరమదుఃఖితః ।
అక్షద్యూతాధికారే చ గిరః శృణ్వన్ సుదారుణాః ॥ 46
ఆర్తానాం సుహృదాం వాచః ద్యూతప్రభృతి శంసతామ్ ।
అహం హృది శ్రితాః స్మృత్వా సర్వరాత్రీర్విచింతయన్ ॥ 47
చాలా దుఃఖాన్ని పొందుతున్నాం! అతిదారుణమైన మాటలను మరువలేక అరణ్యవాసంలో అనేక బాధల ననుభవిస్తున్నాం ! జూదం నాటి మాటలు, నిందావాక్యాలు వింటూ, ఆశ్రితులను మనసులో తలచుకొంటూనే దీర్ఘాలోచన చేస్తూ రాత్రులన్నీ వెళ్ళబుచ్చాం! (46,47)
యస్మింశ్చైవ సమస్తానాం ప్రాణా గాండీవధన్వని ।
వినా మహాత్మనా తేన గతసత్త్వ ఇవాభవమ్ ॥ 48
మా ప్రాణాలన్నీ ఆ అర్జునుని మీదే నిలుపుకొన్నాం. ఇపుడా అర్జునుడు లేకపోవటం వల్ల శక్తిహీనులమయినట్లు ఉన్నాం. (48)
కదా ద్రక్ష్యామి బీభత్సుం కృతాస్త్రం పునరాగతమ్ ।
ప్రియవాదినమక్షుద్రం దయాయుక్తమతంద్రితః ॥ 49
ప్రియవాది, మహనీయుడు, దయామయుడు, అయిన అర్జునుడు దివ్యాస్త్రాలు సంపాదించి తిరిగి రావటం ఉత్సాహంతో ఎప్పుడు చూస్తానో కదా! (49)
అస్తి రాజా మయా కశ్చిద్ అల్పభాగ్యతరో భువి ।
భవతా దృష్టపూర్వో వా శ్రుతపూర్వోఽపి వా క్వచిత్ ।
న మత్తో దుఃఖితతరః పుమానస్తీతి మే మతిః ॥ 50
నావంటి అదృష్టహీనుని ఇతఃపూర్వం మీరెక్కడైనా చుశారా? కనీసం విన్నారా? ప్రబలమైన దుఃఖాన్ని అనుభవిస్తున్న నావంటి పురుషుడు ఉండడనే నే ననుకొంటున్నాను. (50)
బృహదశ్వ ఉవాచ
యద్ బ్రవీషి మహారాజ న మత్తో విద్యతే క్వచిత్ ।
అల్పభాగ్యతరః కశ్చిత్ పుమానస్తీతి పాండవ ॥ 51
అత్ర తే వర్ణయిష్యామి యది శుశ్రూషసేఽనఘ ।
యస్త్వత్తో దుఃఖితతరః రాజాఽఽసీత్ పృథివీపతే ॥ 52
బృహదశ్వుడిలా అన్నాడు.
మహారాజా! ధర్మజా!
"నాకంటె అదృష్టహీనుడూ, దుఃఖితుడూ అయిన పురుషుడెక్కడైన ఎపుడైనా ఉన్నాడా?" అని మీరు ప్రశ్నించారు. మీకంటె ఎంతో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించిన మహారాజు ఒకడున్నాడు. వినాలనుకొంటే చెపుతాను. (51,52)
వైశంపాయన ఉవాచ
అథైనమబ్రవీద్ రాజా బ్రవీతు భగవానితి ।
ఇమామవస్థాం సంప్రాప్తం శ్రోతుమిచ్ఛామి పార్థివమ్ ॥ 53
వైశంపాయనుడిలా అన్నాడు.
ఇలాంటి దురవస్థను పొందిన మహారాజును గురించి వినగోరుతున్నాను. హే భగవన్! చెప్పండి! అని బృహదశ్వుని ధర్మరాజు అడిగాడు. (53)
బృహదశ్వ ఉవాచ
శృణు రాజన్నవహితః సహ భ్రాతృభిరచ్యుత ।
యస్త్వత్తో దుఃఖితతరః రాజాఽఽసీత్ పృథివీపతే ॥ 54
బృహదశ్వుడిలా అన్నాడు. మీకంటె ఎక్కువ దుఃఖాన్ని పొందిన మహారాజొకడున్నాడు. ఆతని కథను, నీవు నీసోదరసహితుడవై సావధాన చిత్తంతో విను. (54)
నిషధేషు మహీపాలః వీరసేన ఇతి శ్రుతః ।
తస్య పుత్రోఽభవన్నామ్నా నలో ధర్మార్థకోవిదః ॥ 55
నిషధదేశంలో వీరసేనుడనే ప్రసిద్ధడైన మహారాజు ఉన్నాడు. అతనికి ధర్మార్థాలు బాగా తెలిసిన 'నలుడు' అనే కుమారుడున్నాడు. (55)
స నికృత్యా జితో రాజా పుష్కరేణేతి నః శ్రుతమ్ ।
వనవాసం సుదుఃఖార్త భార్యయా న్యవసత్ సహ ॥ 56
ఆ నలమహారాజును పుష్కరుడు మోసంతో జయించాడు. తర్వాత ఆ నలుడు రాజ్యభ్రష్టుడై, దుఃఖార్తుడై భార్యతో సహా అరణ్యవాసం చేశాడు. (56)
న తస్య దాసా న రథః న భ్రాతా న చ బాంధవాః ।
వనే నివసతో రాజన్ శిష్యంతే స్మ కదాచన ॥ 57
ధర్మరాజా! అరణ్యవాసం చేస్తున్న నలునకు రథం లేదు. అన్నదమ్ములు, బంధుజనం భృత్యులు ఎవ్వరూ తోడు లేరు. (57)
భవాన్ హి సంవృతో వీరైః భాతృభిర్దేవసమ్మితైః ।
బ్రహ్మకల్పైర్ద్విజాగ్ర్యైశ్చ తస్మాన్నార్హసి శోచితుమ్ ॥ 58
ధర్మజా! ఇక్కడ నీవెంట పరాక్రమవంతులైన నీతమ్ములు, బ్రహ్మకల్పులైన ద్విజశ్రేష్ఠులూ ఉన్నారు. అందుచేత నీ వే మాత్రం దుఃఖింపవలసిన పనిలేదు. (58)
యుధిష్ఠిర ఉవాచ
విస్తరేణాహమిచ్ఛామి నలస్య సుమహాత్మనః ।
చరితం వదతాం శ్రేష్ఠ తన్మమాఖ్యాతుమర్హసి ॥ 59
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
మహాత్ముడైన నలమహారాజు చరిత్రను విపులంగా వినాలనుకొంటున్నాను. నలునికథను చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాను. (59)
ఇతి శ్రీ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి ధృతరాష్ట్ర ద్విపంచాశత్తమోఽధ్యాయః ॥ 52 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున ఏబది రెండవ అధ్యాయము. (52)