54. ఏబది నాలుగవ అధ్యాయము
దిక్పాలురు దమయంతీ స్వయంవరమునకు వచ్చుట.
బృహదశ్వ ఉవాచ
దమయంతీ తు తచ్ఛ్రుత్వా వచో హంసస్య భారత ।
తతః ప్రభృతి న స్వస్థా నలం ప్రతి బభూవ సా ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు. ధర్మజా! నలుని గురించి హంస చెప్పిన మాటలను విన్న నాటి నుండి దమయంతి, అతని గురించే చింతిస్తూ అస్వస్థతపాలైంది. (1)
తతశ్చింతాపరా దీనా వివర్ణవదనా కృశా ।
బభూవ దమయంతీ తు నిఃశ్వాసపరమా తదా ॥ 2
దమయంతి నలమహారాజు గురించే ఆలోచిస్తూ దీనురాలైంది. అంతేకాదు, కృశించి వివర్ణవదనంతో నిట్టూర్పులపాలైంది. (2)
ఊర్ధ్వదృష్టిర్ధ్యానపరా బభూవోన్మత్తదర్శనా ।
పాండువర్ణా క్షణేనాథ హృచ్ఛయావిష్టచేతనా ॥ 3
ఎపుడూ పైకే చూస్తూ, నలమహారాజునే తలచుకొంటూ, పిచ్చిదానివలె కనిపిస్తూ ఉంది. శరీరమంతా పాలిపోయి వివర్ణమైంది. మన్మథావేశం మనసును ఆవరించింది. (3)
న శయ్యాసనభోగేషు రతిం విందతి కర్హిచిత్ ।
న నక్తం న దివా శేతే హాహేతి రుదతీ పునః ॥ 4
సరిగ్గా పడుకోవటం లేదు. ఒకచోట కూర్చోదు. భోగాలను అనుభవించే విషయంలో ఏ మాత్రమూ ఆసక్తి చూపటం లేదు. రాత్రి కాని పగలు కాని నిద్రించటం లేదు. హాహాకారాలతో వెక్కివెక్కి ఏడుస్తోంది. (4)
తామస్వస్థాం తదాకారాం సఖ్యస్తా జజ్ఞురింగితైః ।
తతో విదర్భపతయే దమయంత్యాః సఖీజనః ॥ 5
న్యవేదయత్ తామస్వస్థాం దమయంతీం నరేశ్వరీ ।
తచ్ర్ఛుత్వా నృపతిర్భీమః దమయంతీం సఖీగణాత్ ॥ 6
చింతయామాస తత్ కార్యం సుమహత్ స్వాం సుతాం ప్రతి ।
కిమిర్థం దుహితా మేఽద్య నాతిస్వస్థేవ లక్ష్యతే ॥ 7
దమయంతి ఆకృతిని బట్టి ఆమెను పరిశీలించి, అస్వస్థతకు కారణాన్ని చెలికెత్తెలు బాగా గమనించారు. వెనువెంటనే, విదర్భదేశాధిపతియైన భీమమహారాజునకు దమయంతి అస్వస్థతకు గల కారణాన్ని, ఆమె సఖులు విన్నవించారు. దమయంతి సఖులవలన ఆమె నలుని ప్రేమిస్తున్న విషయాన్ని తెలిసికొన్నాడు భీమమహారాజు. తన కుమార్తె స్వస్థత పొందటానికి చేయవలడిన పనిని గురించి భావించాడు. (5-7)
స సమీక్ష్య మహీపాలః స్వాం సుతాం ప్రాప్తయౌవనామ్ ।
అపశ్యదాత్మనా కార్యం దమయంత్యాః స్వయంవరమ్ ॥ 8
యుక్తవయస్కయైన తన కుమార్తె విషయం సమీక్షించి విదర్భరాజు, దమయంతికి స్వయంవరం ప్రకటించటమే కర్తవ్యమని భావించాడు. (8)
స సన్నిమంత్రయామాస మహీపాలాన్ విశాంపతిః ।
ఏషోఽనుభూయతాం వీరాః స్వయంవర ఇతి ప్రభో ॥ 9
వీరులైన వారంతా దమయంతికి జరుగబోయే స్వయంవరానికి విచ్చేసి, ఆ స్వయంవరసందర్శనానుభూతిని పొందవచ్చునని సకలరాజలోకాన్ని భీమరాజు ఆహ్వానించాడు. (9)
శ్రుత్వా తు పార్థివాః సర్వే దమయంత్యాః స్వయంవరమ్ ।
అభిజగ్ముస్తతో భీమం రాజానో భీమశాసనాత్ ॥ 10
హస్త్వశ్వరథఘోషేణ పూరయంతో వసుంధరామ్ ।
విచిత్రమాల్యాభరణైః బలైర్దృశ్యైః స్వలంకృతైః ॥ 11
దమయంతీ స్వయంవరవృత్తాంతాన్ని విన్న రాజులందరూ, విచిత్రాలైన దండలు, చూడముచ్చటైన ఆభరణాలు ధరించి, చక్కగా అలంకరింపబడిన తమతమ రథ, అశ్వగజబలాలతో విదర్భకు బయలుదేరారు.
భీమశాసనాన్ని శిరోధార్యంగా భావించి బయలుదేరిన రాజలోకం యొక్క గజాశ్వరథఘోషణలు భూమండలమంతా వ్యాపించాయి.
తేషాం భీమో మహాబాహుః పార్థివానాం మహాత్మనామ్ ।
యథార్హమకరోత్ పూజాం తేఽవసంస్తత్ర పూజితాః ॥ 12
స్వయంవరానికి విచ్చేసిన మహారాజులంతా భీమరాజుచే తగిన సత్కారాలు పొంది, విదర్భనగరంలో విడిది చేశారు. (12)
ఏతస్మిన్నేవ కాలే తు సురాణామృషిసత్తమౌ ।
అటమానౌ మహాత్మానౌ ఇంద్రలోకమితో గతౌ ॥ 13
నారదః పర్వతశ్చైవ మహాప్రాజ్ఞౌ మహావ్రతౌ ।
దేవరాజస్య భవనం వివిశాతే సుపూజితౌ ॥ 14
ఈ సమయంలోనే మహాప్రాజ్ఞులు, మహావ్రతులు, దేవర్షులూ అయిన నారదపర్వతులు లోకసంచారం చేస్తూ, స్వర్గలోకానికి వచ్చిమ్ స్వాగతం పొంది, ఇంద్రభవనంలో ప్రవేశించారు. (13,14)
తావర్చయిత్వా మఘవా తతః కుశలమవ్యయమ్ ।
పప్రచ్ఛానామయం చాపి తయోః సర్వగతం విభుః ॥ 15
నారదపర్వతులను గౌరవించిన ఇంద్రుడు, వారల ఆరోగ్యం, క్షేమ సమాచారాలను గురించి అడిగి తెలిసికొన్నాడు. (15)
నారద ఉవాచ
ఆవయోః కుశలం దేవ సర్వత్రగతమీశ్వర ।
లోకే చ మఘవన్ కృత్స్నే నృపాః కుశలినో విభో ॥ 16
నారదుడిలా అన్నాడు.
దేవేంద్రా! మాఇరువురకు అన్నివిషయాల్లోను కుశలమే! మహేంద్రా! భూలోకంలో రాజులంతా క్షేమంగా ఉన్నారు. (16)
బృహదశ్వ ఉవాచ
నారదస్య వచః శ్రుత్వా పప్రచ్ఛ బలవృత్రహా ।
ధర్మజ్ఞాః పృథివీపాలాః త్యక్తజీవితయోధినః ॥ 17
శస్త్రేణ నిధనం కాలే యే గచ్ఛంత్యపరాఙ్ ముఖాః ।
అయం లోకోఽక్షయస్తేషాం యథైవ మమ కామధుక్ ॥ 18
బృహదశ్వుడిలా అన్నాడు.
నారదమహర్షి మాటలు విని, ఇంద్రుడీవిధంగా ప్రశ్నించాడు.
యుద్ధం చేస్తూ మరణించిన ధర్మజ్ఞులైన రాజులు, శస్త్రంచే మరణం సంభవించినపుడు పరాఙ్ముఖులు కాని వారు, నావలె శాశ్వతంగా ఈ లోకంలో నివసిస్తారు. (17,18)
క్వ ను తే క్షత్రియాః శూరా న హి పశ్యామి తానహమ్ ।
ఆగచ్ఛతో మహీపాలాన్ దయితానతిథీన్ మమ ॥ 19
ఏవముక్తస్తు శక్రేణ నారదః ప్రత్యభాషత ।
అలాంటి పరాక్రమం కల్గిన క్షత్రియులెక్కడున్నారో నాకు కన్పించటం లేదు. ఇష్టులై అతిథులుగా వచ్చే రాజులలో అట్టి శూరులు కనిపించుట లేదు.
ఈ విధంగా పల్కిన ఇంద్రునితో, నారదుడీ విధంగా సమాధానమిచ్చాడు. (19 1/2)
నారద ఉవాచ
శృణు మే మఘవన్ యేన న దృశ్యంతే మహీక్షితః ॥ 20
విదర్భరాజ్ఞో దుహితా దమయంతీతి విశ్రుతా ।
రూపేణ సమతిక్రాంతా పృథివ్యాం సర్వయోషితః ॥ 21
నారదుడిలా అన్నాడు -
శూరులైన మహారాజులెవ్వరూ కనిపించకుండా ఉండటానికి కారణం నేను చెప్తాను విను.
విదర్భదేశాధీశుడైన భీమరాజునకు దమయంతి అనే కుమార్తె ఉన్నది. భూమండలంలో గల స్త్రీలందరినీ, దమయంతి తన రూపసంపదచే మించిపోయింది. (20,21)
తస్యాః స్వయంవరః శక్ర భవితా న చిరాదివ ।
తత్ర గచ్ఛంతి రాజానః రాజపుత్రాశ్చ సర్వశః ॥ 22
మహేంద్రా! ఆ దమయంతీస్వయంవరం త్వరలో జరగబోతోంది. మహారాజులు, రాజపుత్రులు అందరూ అచటకు వెళ్లుతున్నారు. (22)
తాం రత్నభూతాం లోకస్య ప్రార్థయంతో మహీక్షితః ।
కాంక్షంతి స్మ విశేషేణ బలవృత్రనిఘాదన ॥ 23
ప్రపంచానికే రత్నంలాంటి ఆ దమయంతిని మహారాజులంతా తమ్ము వరించాలని కోరుతున్నారు. (23)
ఏతస్మిన్ కథ్యమానే తు లోకపాలాశ్చ సాగ్నికాః ।
ఆజగ్ముర్దేవరాజస్య సమీపమమరోత్తమాః ॥ 24
ఈ విషయాన్ని నారదమహర్షి చెప్పే సమయంలో అమరశ్రేష్ఠులైన లోకపాలురు అగ్నిదేవునితో కలసి, అచ్చటకు వచ్చారు. (24)
తతస్తే శుశ్రువుః సర్వే నారదస్య వచో మహత్ ।
శ్రుత్వైవ చాబ్రువన్ హృష్టాః గచ్ఛామో వయమప్యుత ॥ 25
వారూ నారదుని మాటలు విన్నారు. ఆ గొప్ప విషయాన్ని విన్నవెంటనే, సంతోషంతో, మనం కూడ ఆ స్వయంవరానికి వెడదామన్నారు. (25)
తతః సర్వే మహారాజ సగణాః సహవాహనాః ।
విదర్భానభిజగ్ముస్తే యతః సర్వే మహీక్షితః ॥ 26
మహారాజా! ధర్మజా! వెంటనే దిక్పాలురైన ఇంద్రాగ్ని యమవరుణులు దమయంతీ స్వయంవరానికి, విదర్భకు పయనమయ్యారు. (26)
నలోఽపి రాజా కౌంతేయ శ్రుత్వా రాజ్ఞాం సమాగమమ్ ।
అభ్యగచ్ఛదదీనాత్మా దమయంతీమనువ్రతః ॥ 27
మహారాజులెందరో స్వయంవరానికి వచ్చారని విని ఆత్మధైర్యంతో, దమయంతిని పొందాలని నలమహారాజు కూడ, బయలుదేరాడు. (27)
అథ దేవాః పథి నలం దదృశుర్భూతలే స్థితమ్ ।
సాక్షాదివ స్థితం మూర్త్యా మన్మథం రూపసంపదా ॥ 28
భుతలానికి చేరుతున్న ఇంద్రాగ్నియమవరుణులు మార్గమధ్యంలోనే, రూపసంపదచే మన్మధునివలె నున్న నలమహారాజును పై నుండి చూశారు. (28)
తం దృష్ట్వా లోకపాలాస్తే భ్రాజమానం యథా రవిమ్ ।
తస్థుర్విగతసంకల్పాః విస్మితా రూపసంపదా ॥ 29
ఆ నలమహారాజును చూసిన లోకపాలురు, సూర్యునివలె ప్రకాశించే అతని సర్వావయవ సౌందర్యానికి ఆశ్చర్యపడి, విగతసంకల్పులై నిలిచారు. (29)
తతోఽంతరిక్షే విష్టభ్య విమానాని దివౌకసః ।
అబ్రువన్ నైషధం రాజన్ అవతీర్య నభస్తలాత్ ॥ 30
అపుడు లోకపాలురు తమ విమానాలన్ అంతరిక్షంలోనే ఆపి, భూతలానికి దిగివచ్చి, నలునితో ఇలా పలికారు. (30)
భోభో నిషధరాజేంద్ర నల సత్యవ్రతో భవాన్ ।
అస్మాకం కురు సాహాయ్యం దూతో భవ నరోత్తమ ॥ 31
నిషధరాజేంద్రా! నలమహారాజా! నీవు సత్యవ్రతుడవు! మానవశ్రేష్ఠుడవైన నీవు మాకు దూతవై సహాయం చేయాలి. (31)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి ఇంద్రనారదసంవాదే చతుష్పంచాశత్తమోఽధ్యాయః ॥ 54 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున ఇంద్రనారద సంవాదమను ఏబది నాల్గవ అధ్యాయము. (54)