55. ఏబది అయిదవ అధ్యాయము

నలుడు అంతఃపురములోని దమయంతికి దేవతల సందేశము చెప్పుట.

బృహదశ్వ ఉవాచ
తేభ్యః ప్రతిజ్ఞాయ నలః కరిష్య ఇతి భారత ।
అథైతాన్ పరిపప్రచ్ఛ కృతాంజలిరుపస్థితః ॥ 1
కే వై భవంతః కశ్చాసౌ యస్యాహం దూత ఈప్సితః ।
కిం చ తద్ వో మయా కార్యం కథయధ్వం యథాతథమ్ ॥ 2
బృహదశ్వుడిలా అన్నాడు.
భారతా! అలాగే చేస్తానని నలుడు చెప్పాడు. తర్వాత నలమహారాజు వారికి నమస్కరించి ఇలా ప్రశ్నించాడు.
మీరెవరు? ఎవరి యొద్దకు నేను దూతగా వెళ్ళాలి? మీకోరిక ఏమి/ నేనేమి చేయాలి? ఉన్నదున్నట్లు విషయాన్ని చెప్పండి. (2)
ఏవముక్తో నైషధేన మఘవానభ్యబాషత ।
అమరాన్ వై నిబోధాస్మాన్ దమయంత్యర్థమాగతాన్ ॥ 3
నలుని మాటలు విన్నాక, దేవేంద్రుడిలా అన్నాడు. మేము అమరులమని తెలిసికో! దమయంతి కొఱకు వచ్చాం. (3)
అహమింద్రోఽయమగ్నిశ్చ తథైవాయమపాంసతిః ।
శరీరాంతకరో నౄణాం యమోఽయమపి పార్థివ ॥ 4
మహారాజా! నేను ఇంద్రుడను. ఇతడు అగ్ని, ఇతడు వరుణుడు, ఇతడు మానవులకు మృత్యువును కలిగించే యముడు. (4)
త్వం వై సమాగతానస్మాన్ దమయంత్యై నివేదయ ।
లోకపాలా మహేంద్రాద్యాః సమాయాంతి దిదృక్షవః ॥ 5
లోకపాలకుడైన ఇంద్రాగ్నియమవరుణులు నిన్ను చూడాలనే కోరికలో స్వయంవరానికి వచ్చారని, మమ్ముగూర్చి దమయంతికి నీవు చెప్పాలి! (5)
ప్రాప్తుమిచ్ఛంతి దేవాస్త్వాం శక్రోఽగ్నిర్వరుణో యమః ।
తేషామన్యతమం దేవం పతిత్వే వరయస్వ హ ॥ 6
ఇంద్రాగ్నియమవరుణులు నిన్ను పొందాలని కోరుతున్నారు. వారిలో ఒకరిని భర్తగా వరింపుమని కూడా చెప్పాలి. (6)
ఏవముక్తః స శక్రేణ నలః ప్రాంజలిరబ్రవీత్ ।
ఏకార్థం సముపేతం మాం న ప్రేషయితుమర్హథ ॥ 7
ఇంద్రుడీవిధంగా చెప్పిన పిదప, నలుడు రెండుచేతులు జోడించి - "ఒకే ప్రయోజనాన్ని ఆశించివచ్చిన నన్ను దూతగా పంపటం తగదు" - అని పలికాడు. (7)
కథం తు జాతసంకల్పః స్త్రియముత్సృజతే పుమాన్ ।
పరార్థమీదృశం వక్తుం తత్ క్షమంతు మహేశ్వరాః ॥ 8
ఒక స్త్రీని పొందాలి అని మనసు పడి పురుషుడు ఆ స్త్రీని విడిచిపెడతాడా? ఇతరుల కొఱకు ఈ విధమైన దౌత్యం తగునా? దేవతలు మీరు, ఈ విషయంలో నన్ను క్షమించాలి. (8)
దేవా ఊచుః
కరిష్య ఇతి సంశ్రుత్య పూర్వమస్మాసు నైషధ ।
న కరిష్యసి కస్మాత్ త్వం వ్రజ నైషధ మా చిరమ్ ॥ 9
దేవతలు ఇలా అన్నారు.
నిషధరాజా! ఇతఃపూర్వం మా విషయంలో దూతగా వెళ్లటానికి అంగీకరించావు. ఇపుడే కారణం వల్ల చేయనంటున్నావు? వెంటనే వెళ్లాలి. (9)
బృహదశ్వ ఉవాచ
ఏవముక్తః స దేవైస్తైః నైషధః పునరబ్రవీత్ ।
సురక్షితాని వేశ్మాని ప్రవేష్టుం కథముత్సహే ॥ 10
బృహదశ్వుడిలా అన్నాడు.
వారీవిధంగా అంటే నలుడు మళ్లీ ఇలా పలికాడు. భటులచే గట్టిభద్రత ఏర్పాటు చేసిన భవనాలలోనికి ప్రవేశించటానికి నేనెలా ఉత్సాహం చూపుతాను? (10)
ప్రవేక్ష్యసీతి తం శక్రః పునరేవాభ్యభాషత ।
జగామ స తథేత్యుక్త్వా దమయంత్యా నివేశనమ్ ॥ 11
"నీవు ప్రవేశింపగల"వని - ఇంద్రుడు, నలునితో తిరిగి చెప్పాడు. నలుడు అలాగే నని పలికి, దమయంతి అంతఃపురానికి వెళ్ళాడు. (11)
దదర్శ తత్ర వైదర్భీం సఖీగణసమావృతామ్ ।
దేదీప్యమానాం వపుషా శ్రియా చ వరవర్ణినీమ్ ॥ 12
అచ్చట రూపసంపదతో ప్రకాశించే పద్మనీజాతికి చెందిన దమయంతిని చూశాడు. అప్డుఆ విదర్భరాజతనయ దమయంతి, చెలికత్తెలతో కూడి యున్నది. (12)
అతీవ సుకుమారాంగీం తనుమధ్యాం సులోచనామ్ ।
ఆక్షిపంతీమివ ప్రభాం శశినః స్వేన తేజసా ॥ 13
అతిసుకుమారశరీరమూ, సన్నని నడుమూ, మంచి కన్నులూ కల దమయంతి, తన కాంతితో చంద్రుని కాంతిని పరిహసిస్తున్నట్లు ఉంది. (13)
తస్య దృష్ట్యైవ వవృధే కామస్తాం చారుహాసినీమ్ ।
సత్యం చికీర్షమాణస్తు ధారయామాస హృచ్ఛయమ్ ॥ 14
చిరునవ్వులు చిందించే దమయంతిని చూడగానే నలుని కోరిక విజృంభించింది. మనసులోని మన్మథుని ఎట్లో భరించాడు. (14)
తతస్తా నైషధం దృష్ట్వా సంభ్రాంతాః పరమాంగనాః ।
ఆసనేభ్యః సముత్పేతుః తేజసా తస్య ధర్షితాః ॥ 15
అంతఃపుర స్త్రీలు నలుని చూచి, తొట్రుపడి, అతని తేజస్సుకు ఆశ్చర్యపడి తమ తమ ఆసనాల నుండి లేచారు. (15)
ప్రశశంసుశ్చ సుప్రీతాః నలం తా విస్మయాన్వితాః ।
న చైనమభ్యభాషంత మనోభిస్త్వభ్యపూజయన్ ॥ 16
అంతఃపుర కాంతలంతా నలుని చూచి ఆశ్చర్యచకితలై సంతోషంతో ప్రశంసించారు. నలునితో సంభాషించలేకపోయారు కాని మనస్సులతో మాత్రం గౌరవించారు. (16)
అహో రూప మహో కాంతిః అహో ధైర్యం మహాత్మనః ।
కోఽయ దేవోఽథవా యక్షో గంధర్వో వా భవిష్యతి ॥ 17
ఏమి, ఈ నలుని అపురూపసౌందర్యం! ఏమి ఈతనితేజస్సు! ఏమి ఈతని ధైర్యం! ఈతడెవడు? దేవతా పురుషుడో? యక్షుడో? లేక గంధర్వుడో? అయి ఉంటాడు. (17)
న తాస్తం శక్నువంతి స్మ వ్యాహర్తుమపి కించన ।
తేజసా ధర్షితాస్తస్య లజ్జావత్యో వరాంగనాః ॥ 18
అంతఃపుర కాంతలు నలుని తేజస్సుకు బెదరి, సిగ్గుపడి, ఏమీ మాట్లాడలేకపోయారు. (18)
అథైవం స్మయమానం తు స్మితపూర్వాభిభాషిణీ ।
దమయంతీ నలం వీరమ్ అభ్యభాషత విస్మితా ॥ 19
చిరునగవు చిందిస్తూ ముందుగా పలుకరించే స్వభావం గల దమయంతి ఆశ్చర్యాన్ని పొంది, వీరుడైన నలునితో ఇలా అంది. (19)
కస్త్వం సర్వానవద్యాంగ మమ హృచ్ఛయవర్ధన ।
ప్రాప్తోఽస్యమరవద్ వీర జ్ఞాతుమిచ్ఛామి తేఽనఘ ॥ 20
కథమాగమనం చేహ కథం చాసి న లక్షితః ।
సురక్షితం హి మే వేశ్మ రాజా చైవోగ్రశాసనః ॥ 21
ఏవముక్తస్తు వైదర్భ్యా నలస్తాం ప్రత్యువాచ హ ।
సుందరాంగా! నాలోని కోరికలను వృద్ధిపొందిస్తున్న నీవు ఎవరవు?
అమరుని వలె అంతఃపురం చేరావు. వీరుడా! నీవెవరో తెలిసికోవాలని ఉంది! ఇక్కడకు ఎలా వచ్చావు? ఎవరికీ కనిపించకుండా ఎలా ఉన్నావు? రాజు ఉగ్రశాసనుడు! రాజభటులచే సంరక్షింపబడే ఈ అంతఃపురంలోకి నీవెలా ప్రవేశింపగలిగావు?
దమయంతి ఈ పశ్నలకు నలుడీవిధంగా సమాధానం చెప్పాడు. (20,21)
నల ఉవాచ
నలం మాం విద్ధి కల్యాణి దేవదూతమిహాగతమ్ ॥ 22
దేవాస్త్వాం ప్రాప్తుమిచ్ఛంతి శక్రోఽగ్నిర్వరుణో యమః ।
తేషామన్యతమం దేవం పతిం వరయ శోభనే ॥ 23
కళ్యాణీ! నాపేరు నలుడు. దేవతల దూతగా నేనిచటకు వచ్చాను. దేవతలైన ఇంద్రాగ్నియమవరుణులు నిన్ను పొందటానికి ఉబలాటపడుతున్నారు.
శుభాంగీ! ఆ దేవతలలో ఒకరిని నీపతిగా వరించు. (22,23)
తేషామేవ ప్రభావేణ ప్రవిష్టోఽహమలక్షితః ।
ప్రవిశంతం న మాం కశ్చిద్ అపశ్యన్నాప్యవారయత్ ॥ 24
ఆ దేవతల ప్రభావం చేతనే నీ అంతఃపురంలోకి ఎవరికి కనిపించకుండా ప్రవేశింపగలిగాను. నన్ను ఎవరూ అడ్డుపెట్టలేదు. (24)
ఏతదర్థమహం భద్రే ప్రేషితః సురసత్తమైః ।
ఏతచ్ఛ్రుత్వా శుభే బుద్ధిం ప్రకురుష్వ యథేచ్ఛసి ॥ 25
కళ్యాణీ! ఈపనికై దేవతలు నన్ను ఇక్కడికి పంపారు. నేను చెప్పినది విని, నీబుద్ధికి తోచినట్లు చెయ్యి. (25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలస్య దేవదౌత్యే పంచపంచాశత్తమోఽధ్యాయః ॥ 55 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున నలుని దేవదౌత్యమను ఏబది అయిదవ అధ్యాయము. (55)