56. ఏబది ఆరవ అధ్యాయము
దమయంతి సందేశము.
బృహదశ్వ ఉవాచ
సా నమస్కృత్య దేవేభ్యః ప్రహస్య నలమబ్రవీత్ ।
ప్రణయస్వ యథాశ్రద్ధం రాజన్ కిం కరవాణి తే ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు.
ఆమె (దమయంతి) దేవతలకు శ్రద్ధగా నమస్కరించి, నలుని చూచి చిరునగవుతో ఇలా పలికింది.
మహారాజా! నన్ను వివాహమాడుము. నీకై నే నేమి చేయగలను. (1)
అహం చైవ హి యచ్చాన్యద్ మమాస్తి వసు కించన ।
తత్ సర్వం తవ విశ్రబ్ధం కురు ప్రణయమీశ్వర ॥ 2
నేనైతే నీవే నా సర్వస్వమని భావిస్తున్నాను. ఈ విషయం నీకు బాగా తెలుసు. ప్రభూ! నన్ను ప్రేమించు. (2)
సంసానాం వచనం యత్ తు తన్మాం దహతి పార్థివ ।
త్వత్కృతే హి మయా వీర రాజానః సన్నిపాతితాః ॥ 3
మహారాజా! హంస చెప్పిన మాటలే నన్ను దహిస్తున్నాయి. నీకొఱకే కదా, ఈ రాజులందరు నాచేత ఇచటకు రావింపబడినారు. (3)
యది త్వం భజమానాం మాం ప్రత్యాఖ్యాస్యసి మానద ।
విషమగ్నిం జలం రజ్జుమ్ ఆస్థాస్యే తవ కారణాత్ ॥ 4
నిన్నే ఆరాధించే, నన్ను గూర్చి మరోవిధంగా నీవు చెప్పితే, నీ కారణంగానే మరణించటానికి విష, అగ్ని, జల, రజ్జువుల నేర్పాటు చేసికొంటాను. (4)
ఏవముక్తస్తు వైదర్భ్యా నలస్తాం ప్రత్యువాచ హ ।
తిష్ఠత్సు లోకపాలేషు కథం మానుషమిచ్ఛసి ॥ 5
దమయంతి ఆ విధంగా చెప్పిన తర్వాత, నలుడిలా పలికాడు. లోకాలను పరిపాలించే దేవతలే నిన్ను కోరుతూ ఉంటే నీవు మానవమాత్రుడనైన నన్నెట్లు కోరుతావు? (5)
యేషామహం లోకకృతామ్ ఈశ్వరాణాం మహాత్మనామ్ ।
న పాదరజసా తుల్యః మనస్తే తేషు వర్తతామ్ ॥ 6
మహాత్ములు, లోకపాలకులైన వారి పాదధూళితో సాటిరానివాడను నేను. నీమనస్సు వారిపైనే ప్రవర్తించుగాక! (6)
విప్రియం హ్యాచరన్ మర్త్యః దేవానాం మృత్యుమృచ్ఛతి ।
త్రాహి మామనవద్యాంగి వరయస్వ సురోత్తమాన్ ॥ 7
దేవతలకు ఇష్టంగాని పనిచేసిన మానవుడు, మృత్యువును కోరుకొన్నట్లే! సుందరాంగీ! నన్ను రక్షించు. సురశ్రేష్ఠులైన వారిని వరించు. (7)
విరజాంసి చ వాసాంసి దివ్యాశ్చిత్రాః స్రజస్తథా ।
భూషణాని తు ముఖ్యాని దేవాన్ ప్రాప్య తు భుంక్ష్వ వై ॥ 8
నీవు దేవతలను పొంది, ధూళి సోకని వస్త్రాలు చిత్రాలైన దివ్యమాలికలు, దివ్యాభరణాలూ ధరించి స్వర్గసౌఖ్యాలనుభవించు. (8)
య ఇమాం పృథివీం కృత్స్నాం సంక్షిప్య గ్రసతే పునః ।
హుతాశమీశం దేవానాం కా తం న వరయేత్ పతిమ్ ॥ 9
ఈ భూమండలాన్నంతనూ కుంచించి మ్రింగగలడు అగ్నిదేవుడు . దేవతలలో ప్రముఖుడైన అగ్నిదేవుని పతిగా వరింపని వారెవరుంటారు? (9)
యస్య దండభయాత్ సర్వే భూతగ్రామాః సమాగతాః ।
ధర్మమేవానురుధ్యంతి కా తం న వరయేత్ పతిమ్ ॥ 10
ఎవని దండన భయం వల్ల సమస్త భూతసమూహాలూ కలసి ధర్మాన్నే ఆచరిస్తున్నాయో, అలాంటి యమధర్మరాజును భర్తగా ఎవ్వతె వరింపదు? (10)
ధర్మాత్మానం మహాత్మానం దైత్యదానవమర్దనమ్ ।
మహేంద్రం సర్వదేవానాం కా తం న వరయేత్ పతిమ్ ॥ 11
ధర్మాత్ముడు, మహాత్ముడు, దైత్యులను దానవులను అణచివేయగలిగిన దేవతా ప్రభువైన మహేంద్రుని పతిగా ఏ స్త్రీ వరింపదు? (11)
క్రియతామవిశంకేన మనసా యది మన్యసే ।
వరుణం లోకాపాలానాం సుహృద్వాక్యమిదం శృణు ॥ 12
లోకపాలకులలో వరుణునిపై నీకు మనస్సున్నచో నిస్సందేహంగా ఆతనినే వరించు. ఇది మిత్రవాక్యం. నామాట విను. (12)
నైషధేనైవముక్తా సా దమయంతీ వచోఽబ్రవీత్ ।
సమాప్లుతాభ్యాం నేత్రాభ్యాం శోకజేనాథ వారిణా ॥ 13
నలుడీ విధంగా చెప్పిన పిమ్మట, దమయంతి శోకంతో సజలనయనాలతో ఇలా పలికింది. (13)
దేవేభ్యోఽహం నమస్కృత్య సర్వేభ్యః పృథివీపతే ।
వృణే త్వామేవ భర్తారం సత్యమేతద్ బ్రవీమి తే ॥ 14
దేవతలందరికీ నమస్కరించి నీ కీ సత్యాన్ని చెపుతున్నాను. నేను నిన్నే భర్తగా, సమస్తభూపాలుర ఎదుట వరిస్తాను. (14)
తామువాచ తతో రాజా వేపమానాం కృతాంజలిమ్ ।
దౌత్యేనాగత్య కల్యాణి తథా భద్రే విధీయతామ్ ॥ 15
కృతాంజలియై, వణుకుతూ ఉన్న దమయంతితో నలుడిలా అన్నాడు. కళ్యాణీ! దూతగా వచ్చిన నాకు, ఏది క్షేమమో నీవే నిర్దేశించు. (15)
కథం హ్యహం ప్రతిశ్రుత్య దేవతానాం విశేషతః ।
పరార్థే యత్నమారభ్య కథం స్వార్థమిహోత్సహే ॥ 16
దేవతలకు, నీవు చెప్పిన విషయాన్ని నేనిలా వినిపించగలను! వారి కొరకై ప్రయత్న మారంభించిన నేను స్వార్థానికి ఎలా ఉత్సహిస్తాను? (16)
ఏష ధర్మో యది స్వార్థః మమాపి భవితా తతః ।
ఏవం స్వార్థం కరిష్యామి తథా భద్రే విధీయతామ్ ॥ 17
నా యొక్క స్వార్థం కూడ ధర్మమే అయితే, ఆవిధంగానే చేయగలను!
నాకు ఏది క్షేమమైతే దాన్నే విధించు. (17)
తతో బాష్పాకులాం వాచం దమయంతీ శుచిస్మితా ।
ప్రత్యాహరంతీ శనకైః నలం రాజానమబ్రవీత్ ॥ 18
అంత దమయంతి చిరునవ్వుతో, కన్నీటితో ఆకులమైన మాటను, నలమహారాజుతో ఇలా పల్కింది. (19)
ఉపాయోఽయం మయా దృష్టః నిరపాయో నరేశ్వర ।
యేన దోషో న భవితా తవ రాజన్ కథంచన ॥ 19
మహారాజా! ఏవిధంగా చూసినా మీపట్ల దోషాలులేని, నిరపాయమైన ఒక మంచి ఉపాయం నాకు కన్పించింది. (19)
త్వం చైవ హి నరశ్రేష్ఠ దేవాశ్చేంద్రపురోగమాః ।
అయాంతు సహితాః సర్వే మమ యత్ర స్వయంవరః ॥ 20
ఇంద్రాది దేవతలును, నీవును అందరును కలసియే, నా స్వయంవరం జరిగే ప్రదేశానికి రండి! (20)
తతోఽహ లోకపాలానాం సన్నిధౌ త్వాం నరేశ్వర ।
వరయిష్యే నరవ్యాఘ్ర నైవం దోషో భవిష్యతి ॥ 21
మనుజేశ్వరా! స్వయంవరంలోనే, లోకపాలురసన్నిధిలోనే పురుషశ్రేష్ఠుడవైన నిన్ను వరిస్తాను. ఈవిధంగా వరిస్తే ఏ దోషమూ ఉండదు. (21)
ఏవముక్తస్తు వైదర్భ్యా నలో రాజా విశాంపతే ।
ఆజగామ పునస్తత్ర యత్ర దేవాః సమాగతాః ॥ 22
ఈవిధంగా దమయంతి చెప్పినవెంటనే నలమహారాజు లోకపాలురవద్దకు తిరిగి వచ్చాడు. (22)
తమపశ్యంస్తథాఽఽయాంతం లోకపాలా మహేశ్వరాః ।
దృష్ట్వా చైనం తతోఽపృచ్ఛన్ వృత్తాంతం సర్వమేవ తమ్ ॥ 23
తిరిగివచ్చిన నలుని చూసి, జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పవలసినదిగా లోకపాలురు అడిగారు. (23)
కచ్చిద్ దృష్టా త్వయా రాజన్ దమయంతీ శుచిస్మితా ।
కిమబ్రవీచ్చ నః సర్వాన్ వద భూమిపతేఽనఘ ॥ 24
నలమహారాజా! శుచిస్మితయగు దమయంతిని చూశావా? ఆమె మా సందేశానికి ఏమని సమాధానం చెప్పింది? పుణ్యాత్మా! అంతా వినిపించు. (24)
నల ఉవాచ
భవిద్భిరహమాదిష్టః దమయంత్యా నివేశనమ్ ।
ప్రవిష్టః సుమహాకక్షం దండిభిః స్థవిరైర్వృతమ్ ॥ 25
నలుడిలా అన్నాడు.
మీ ఆదేశం ప్రకారం వృద్ధరక్షక భటులచే పరివృతమైన దమయంతి అంతఃపురమందిరాన్ని ప్రవేశించాను. (25)
ప్రవిశంతం చ మాం తత్ర న కశ్చిద్ దృష్టవాన్ నరః ।
ఋతే తాం పార్థివసుతాం భవతామేవ తేజసా ॥ 26
మీ ప్రభావం వల్ల దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించే నేను, నరులెవ్వరికీ కనిపించలేదు. మీ ప్రభావంతో దమయంతికి మాత్రమే కనిపించాను. (26)
సఖ్యశ్చాస్యా మయా దృష్టాః తాభిశ్చాప్యుపలక్షితః ।
విస్మితాశ్చాభవన్ సర్వాః దృష్ట్వా మాం విబుధేశ్వరాః ॥ 27
అంతఃపురంలో ప్రవేశించిన తర్వాత చెలికత్తెలు నాకు కనిపించారు. అచటనున్న దమయంతి, ఆమె చెలికత్తెలు నన్ను చూచి ఆశ్చర్యచకితలయ్యారు. (27)
వర్ణ్యమానేషు చ మయా బవత్సు రుచిరాననా ।
మామేవ గతసంకల్పా వృణీతే సా సురోత్తమాః ॥ 28
సురశ్రేష్ఠులారా! నేను మీగురించి సవిస్తరంగా వర్ణించి చెప్పినప్పటికీ, దమయంతి మాత్రం నన్నే వరిస్తోంది. (28)
అబ్రవీచ్చైవ మాం బాలా ఆయాంతు సహితాః సురాః ।
త్వయా సహ నరవ్యాఘ్ర మమ యత్ర స్వయంవరః ॥ 29
"పురుషశ్రేష్ఠుడవైన నీవూ, దేవతలూ కలసియే స్వయంవరం జరిగే ప్రదేశానికి రమ్మ"ని, దమయంతి నాతో చెప్పింది. (29)
తేషామహం సన్నిధౌ త్వాం వరయిష్యామి నైషధ ।
ఏవం తవ మహాబాహో దోషో న భవితేతి హ ॥ 30
ఆ దేవతలసన్నిధిలోనే, నిన్ను నేను వరిస్తానని పల్కింది. పైగా ఈవిధంగా వరిస్తే నీపై దోష మేమాత్రం ఉండదనికూడ నాతో చెప్పింది. (30)
ఏతావదేవ విబుధ యథావృత్తముపాహృతమ్ ।
మయా శేషే ప్రమాణం తు భవంతస్త్రిదశేశ్వరాః ॥ 31
దేవతలారా! దమయంతి చెప్పిన విషయాన్ని యథాతథంగా మీకు చెప్పాను. ఇకముందు జరుగబోయే దానికి, త్రిదశులైన మీరే ప్రమాణం. (31)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలకర్తృకదేవదౌత్యే షట్పంచాశత్తమోఽధ్యాయః ॥ 56 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానమను ఉపపర్వమున నలకర్తృకమైన దేవదౌత్యమను ఏబది యారవ అధ్యాయము. (56)