66. అరువది ఆరవ అధ్యాయము

నలుడు కర్కోటకుని రక్షించుట.

బృహదశ్వ ఉవాచ
ఉత్సృజ్య దమయంతీం తు నలో రాజా విశాంపతే ।
దదర్శ దావం దహ్యంతం మహాంతం గహనే వనే ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు -
ధర్మరాజా! దమయంతిని విడిచివెళ్ళిన తర్వాత నలుడు అరణ్యంలో ఒకచోట పెనుమంటలతో విజృంభించే కారుచిచ్చును చూశాడు. (1)
తత్ర శుశ్రావ శబ్దం వై మధ్యే భూతస్య కస్యచిత్ ।
అభిధావ నలేత్యుచ్చైః పుణ్యశ్లోకేతి చాసకృత్ ॥ 2
మా భైరితి నలశ్చోక్త్వా మధ్యమగ్నేః ప్రవిశ్య తమ్ ।
దదర్శ నాగరాజానం శయానం కుండలీకృతమ్ ॥ 3
ఆ మంటలో నుండి ఓ ప్రాణియొక్క అరుపు విన్నాడు. నలుడు 'భయపడవద్దు' అని పలుకుతూనే మంటల మధ్యలోకి దూకి చుట్టచుట్టుకొనియున్న నాగరాజును చూశాడు. (2,3)
స నాగః ప్రాంజలిర్భూత్వా వేపమానో నలం తదా ।
ఉవాచ మాం విద్ధి రాజన్ నాగం కర్కోటకం నృప ॥ 4
మయా ప్రలబ్ధో బ్రహ్మర్షిః నారదః సుమహాతపాః ।
తేన మన్యుపరీతేన శప్తోఽస్మి మనుజాధిప ॥ 5
తిష్ఠ త్వం స్థావర ఇవ యావదేవ నలః క్వచిత్ ।
ఇతో నేతా హి తత్ర త్వం శాపాన్మోక్ష్యసి మత్కృతాత్ ॥ 6
అపుడా నాగరాజు వణికిపోతూ నలునకు చేతులు జోడించి ఇలా అన్నాడు -
"మహారాజా! నేను నాగరాజైన కర్కోటకుడిని. మహాతపస్వియైన బ్రహ్మర్షి నారదుని నేను కాటువేశాను.
ఆయన నాపై కోపించి కదలకుండా పడియుండు" మని శపించాడు. ఈ శాపం నలుడు నీ చెంతకు వచ్చేవరకు ఉంటుందని చెప్పాడు. నీదర్శనం నన్ను శాపం నుండి విముక్తిని గావింపగలదు. నన్నిట నుండి బయటకు తీసుకుపో. (4-6)
తస్య శాపాన్న శక్తోఽస్మి పదాద్ విచలితుం పదమ్ ।
ఉపదేక్ష్యామి తే శ్రేయః త్రాతుమర్హతి మాం భవాన్ ॥ 7
నారదమహర్షి శాపం వల్ల ఒక్క అడుగు కూడా కదలలేకపోతున్నాను. నీవే నన్ను రక్షింపతగినవాడవు. నీకు శ్రేయస్సును ఉపదేశిస్తాను. (7)
సఖా చ తే భవిష్యామి మత్సమో నాస్తి పన్నగః ।
లఘుశ్చ తే భవిష్యామి శీఘ్రమాదాయ గచ్ఛ మామ్ ॥ 8
నాతోసమానమైన నాగరాజు మరొక్కడు లేడు. నేను నీకు మిత్రుడను అవుతాను. నేను చాలా తేలికగా అవుతాను. నన్ను శీఘ్రంగా తీసికొని వెళ్ళు." (8)
ఏవముక్త్వా స నాగేంద్రః బభువాంగుష్ఠమాత్రకః ।
తం గృహీత్వా నలః ప్రాయాద్ దేశం దావవివర్జితమ్ ॥ 9
కర్కోటకుడు ఇలా అని వెంటనే బొటనవ్రేలంత అయ్యాడు. నలుడు కర్కోటకుని తీసికొని కార్చిచ్చులేని ప్రదేశానికి చేరాడు. (9)
ఆకాశదేశమాసాద్య విముక్తం కృష్ణవర్త్మనా ।
ఉత్ర్సష్టుకామం తం నాగః పునః కర్కోటకోఽబ్రవీత్ ॥ 10
అగ్నిహోత్రునిచే విముక్తుడైన కర్కోటకుని మరొక తావునకు చేర్చి విడిచిపెట్టాలని తలచేలోపే కర్కోటకుడు నలునితో ఇలా అన్నాడు. (10)
పదాని గణయన్ గచ్ఛ స్వాని నైషధ కానిచిత్ ।
తత్ర తేఽహం మహాబాహో శ్రేయో ధాస్యామి యత్ పరమ్ ॥ 11
'నలమహారాజా! మీరు మీ అడుగులను లెక్కిస్తూ కొన్ని అడుగులు వెళ్ళండి. అక్కడ నేను మీకు గొప్పమేలు చేస్తాను.' (11)
తతః సఙ్ఖ్యాతుమారబ్ధమ్ అదశద్ దశమే పదే ।
తస్య దష్టస్య తద్ రూపం క్షిప్రమంతరధీయత ॥ 12
నలుడు కర్కోటకుడు చెప్పినట్లుగానే లెక్కించుకొంటూ పదవ అడుగు వేస్తుండగానే కర్కోటకుడు నలుని కాటువేశాడు. వెంటనే నలుని రూపం మారిపోయింది. (12)
స దృష్ట్వా విస్మితస్తస్థౌ ఆత్మానం వికృతం నలః ।
స్వరూపధారిణం నాగం దదర్శ స మహీపతిః ॥ 13
నలుడు తన వికృతరూపాన్ని చూసుకొని ఆశ్చర్యపోతూనే స్వస్వరూపాన్ని ధరించిన కర్కోటకుని చూశాడు. (13)
తతః కర్కోటకో నాగః సాంత్వయణ్ నలమబ్రవీత్ ।
మయా తేఽంతర్హితం రూపం న త్వాం విదుర్జనా ఇతి ॥ 14
కర్కోటకుడు నలుని ఓదారుస్తూనే 'నిన్ను జనులెవ్వరూ తెలిసికోకుండా ఉండటానికే నేను నీ రూపాన్నిలా మార్చివేశా'నన్నాడు. (14)
యత్కృతే చాసి నికృతః దుఃఖేన మహతా నల ।
విషేణ స మదీయేన త్వయి దుఃఖం నివత్స్యతి ॥ 15
విషేణ సంవృతైర్గాతైః యావత్ త్వాం న విమోక్ష్యతి ।
తావత్ త్వయి మహారాజ దుఃఖం వై స నివత్స్యతి ॥ 16
'నలమహారాజా! నావిషంచే నీశరీరంలో కల్గినమార్పు ఉన్నంతవరకూ నీవు దుఃఖంతోనే ఉంటావు. నీకు దుఃఖాలు తీరే మంచిరోజులు వచ్చినపుడు నీ వికృతరూపం మారుతుంది. (15,16)
అనాగా యేన నికృతః త్వమనర్హో జనాధిప ।
క్రోధాదసూయయిత్వా తం రక్షా మే భవతః కృతా ॥ 17
ఏ తప్పు చేయని నీవు ఎవనిచేత వంచితుడవైనావో వ్ని కోపాసూయలకు నీవు అర్హుడవు కావు. అట్టివాని నుండి రక్షణమే నా వల్ల నీకు జరిగింది. (17)
న తే భయం నరవ్యాఘ్ర దంష్ట్రిభ్యః శత్రుతోఽపి వా ।
బ్రహ్మవిద్భ్యశ్చ భవితా మత్ర్పసాదాన్నరాధిప ॥ 18
నరోత్తమా! నా అనుగ్రహం వల్ల ఇటుపై నీకు పాముల వల్ల, శత్రువుల వల్ల, బ్రహ్మవేత్తల వల్ల కూడా భయముండదు. (18)
రాజన్ విషనిమిత్తా చ న తే పీడా భవిష్యతి ।
సంగ్రామేఘ చ రాజేంద్ర శశ్వజ్జయమవాప్స్యసి ॥ 19
విషం నిమిత్తంగా నీకు ఏబాధా ఉండదు. యుద్ధాలలో ఎల్లప్పుడూ విజయాన్నే పొందగలవు. (19)
గచ్ఛ రాజన్నితః సూతః బాహుకోఽహమితి బ్రువన్ ।
సమీపమ్ఱుతుపర్ణస్య స హి చైవాక్షనైపుణః ॥ 20
రాజా! ఇకపై నీవు బాహుకుడనే పేరుతో వ్యహరించు. రథసారథిగా అక్షవిద్యానిపుణుడైన ఋతుపర్ణమహారాజు సమీపానికి వెళ్ళు - అని చెప్పాడు. (20)
అయోధ్యం నగరీం రమ్యామ్ అద్య వై నిషధేశ్వర ।
స తేఽక్షహృదయం దాతా రాజాశ్వహృదయేన వై ॥ 21
ఇక్ష్వాకుకులజః శ్రీమాన్ మిత్రం చైవ భవిష్యతి ।
భవిష్యసి యదాక్షజ్ఞః శ్రేయసా యోక్ష్యసే తదా ॥ 22
నలమహారాజా! నీవు వెంటనే అయోధ్యానగరానికి వెళ్ళు. ఋతుపర్ణమహారాజు నీవలన అశ్వహృదయాన్ని గ్రహించి, నీకు అక్షహృదయాన్ని అనుగ్రహిస్తాడు.
ఇక్ష్వాకువంశజుడైన ఋతుపర్ణుడు నీకు మిత్రుడవుతాడు. అక్షహృదయాన్ని తెలిసికోవటం వలన మున్ముందు నీకు ఎంతో మేలు కలుగుతుంది. (21,22)
సమమేష్యడి దారైస్వం మా స్మ శోకే మనః కృథాః ।
రాజ్యేన తనయాభ్యాం చ సత్యమేతద్ బ్రవీమి తే ॥ 23
రాజా! నీవేమాత్రం దుఃఖపడకు. భార్యతో బిడ్డలతో సహా నీవు రాజ్యాన్ని పొందుతావు. ఇది సత్యం. (23)
స్వం రూపం చ యదా ద్రష్టుమ్ ఇచ్చేథాస్త్వం నరాధిప ।
సంస్మర్తవ్యస్తదా తేఽహం వాసశ్చేదం నివాసయేః ॥ 24
మహారాజా! నీవు నీ సహజరూపాన్ని చూడదలచుకొంటే నీవు నన్ను స్మరించి ఈ వస్త్రాన్ని కప్పుకో! (24)
అనేన వాససా చ్ఛన్నః స్వం రూపం ప్రతిపత్స్యసే ।
ఇత్యుక్త్వా ప్రదదౌ తస్మై దివ్యం వాసోయుగం తదా ॥ 25
ఈ వస్త్రాన్ని నీవు కప్పుకొన్నవెంటనే నీ రూపాన్ని నీవు పొందుతావు - అని చెప్పి కర్కోటకుడు నలునకు దివ్యవస్త్రద్వయాన్ని ఇచ్చాడు. (25)
ఏవం నలం చ సందిశ్య వాసో దత్త్వా చ కౌరవ ।
నాగరాజస్తతో రాజన్ తత్రైవాంతరధీయత ॥ 26
ధర్మజా! ఈవిధంగా కర్కోటకుడు నలునకు చెప్పి, దివ్యవస్త్రం ఇచ్చి, అక్కడే అంతర్ధానమయ్యాడు. (26)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలకర్కోటకసవాదే షట్షష్టితమోఽధ్యాయః ॥ 66 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున నలకర్కోటక సంవాదమను అరువది ఆరవ అధ్యాయము. (66)