67. అరువది ఏడవ అధ్యాయము
నలుడు ఋతుపర్ణుని కడ అశ్వాధ్యక్షుడగుట.
బృహదశ్వ ఉవాచ
తస్మిన్నంతర్హితే నాగే ప్రయయౌ నైషధో నలః ।
ఋతుపర్ణస్య నగరం ప్రావిశద్ దశమేఽహని ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు -
కర్కోటకుడు అంతర్హితుడైన తర్వాత నలుడు బయలుదేరాడు. పదవరోజుకు ఋతుపర్ణమహారాజు యొక్క నగరానికి చేరాడు. (1)
స రాజానముపాతిష్ఠద్ బాహుకోఽహమితి బ్రువన్ ।
అశ్వానాం వాహనే యుక్తః పృథివ్యాం నాస్తి మత్సమః ॥ 2
ఋతుపర్ణమహారాజును కలసి తనపేరు బాహుకుడని అశ్వశ్రేష్ఠతను నిర్ణయించటంలో తనకు సాటి ఈ భూమి మీద మరెవ్వరూ లేరనీ చెప్పుకొన్నాడు. (2)
అర్థకృచ్ఛ్రేషు చైవాహం ప్రష్టవ్యో నైపుణేషు చ ।
అన్నసంస్కారమపి చ జానామ్యన్యైర్విశేషతః ॥ 3
కష్టసమయాల్లోను నిపుణ విషయాల్లోనూ నన్ను అడిగితే సాయం చేయగలను. పాకశాస్త్రవిషయాలు కూడ ఇతరుల కంటే విశేషంగా తెలిసినవాణ్ణి. (3)
యాని శిల్పాని లోకేఽస్మిన్ యచ్చైవాన్యత్ సుదుష్కరమ్ ।
సర్వం యతిష్యే తత్ కర్తుమ్ ఋతుపర్ణ భరస్య మామ్ ॥ 4
మహారాజా! నన్ను పోషించు. లోకంలో దుష్కరమైన శిల్పాదికళల్ని సైతం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. (4)
ఋతుపర్ణ ఉవాచ
వస బాహుక భద్రం తే సర్వమేతత్ కరిష్యసి ।
శీఘ్రయానే సదా బుద్ధిః ధ్రియతే మే విశేషతః ॥ 5
ఋతుపర్ణుడిలా అన్నాడు.
బాహుకా! నివు నాదగ్గరే ఉండి నీవన్నవన్నీ చేయి. ముఖ్యంగా నా మనసులో శీఘ్రయానరహస్యాన్ని తెలిసికొనాలనే ఆలోచన ఉంది. (5)
స త్వమాతిష్ఠ యోగం తం యేన శీఘ్రా హయా మమ ।
భవేయురశ్వాధ్యక్షోఽసి వేతనం తే శతం శతమ్ ॥ 6
నాగుర్రాలను వేగంగా నడిచేటట్లు, బలం కలిగేటట్లు చేయి. ఆ విధంగా నీవు చేయగల్గినట్లయితే నీవు అశ్వాధ్యక్షుడవు అవుతావు. నీకు వేతనం నూరునూర్లు (పదివేలు). (6)
త్వాముపస్థాస్యతశ్చైవ నిత్యం వార్ ష్ణేయజీవలౌ ।
ఏతాభ్యాం రంస్యసే సార్ధం వస వై మయి బాహుక ॥ 7
బాహుకా! వార్ష్ణేయుడు, జీవలుడు అనే అశ్వరక్షకులిద్దరూ నిన్ను సేవిస్తుంటారు. వారిరువురితో కలసి సంతోషంగా నా ఆశ్రయంలో ఉండు. (7)
బృహదశ్వ ఉవాచ
ఏవముక్తో నలస్తేన న్యవసత్ తత్ర పూజితః ।
ఋతుపర్ణస్య నగరే సహవార్ ష్ణేయజీవలః ॥ 8
బృహదశ్వుడిలా అన్నాడు.
ఋతుపర్ణమహారాజు నలుణ్ణి ఈ విధంగా గౌరవించాడు. నలుడు ఋతుపర్ణుని నగరంలోనే వార్ష్ణేయజీవలులతో అశ్వాధ్యక్షుడుగా ఉన్నాడు. (8)
స వై తత్రావసద్ రాజా వైదర్భీమనుచింతయన్ ।
సాయం సాయం సదా చేమం శ్లోకమేకం జగాద హ ॥ 9
నలుడు దమయంతిని నిత్యం తలచుకొంటూనే ఋతుపర్ణుని నగరంలో ఉన్నాడు. ప్రతిరోజు సాయంసమయంలో ఒక శ్లోకాన్ని చదువుకొనేవాడు. (9)
క్వ ను సా క్షుత్పిపాసార్తా శ్రాంతా శేతే తపస్వినీ ।
స్మరంతీ తస్య మందస్య కం వా సాద్యోపతిష్ఠతి ॥ 10
ఆకలిదప్పికలతో బాధపడుతూ ఆమె ఎక్కడ ఉన్నదో? ఆ తపస్విని అలసిపోయి ఎచటపరున్నదో? ఈ మందభాగ్యుని తలచుకొంటూ ఇప్పుడు ఎవని ఆశ్రయంలో ఉన్నదో! (10)
ఏవం బ్రువంతం రాజానం నిశాయాం జీవలోఽబ్రవీత్ ।
కామేనాం శోచసే నిత్యం శ్రోతుమిచ్ఛామి బాహుక ॥ 11
రాత్రిపూట ఇలా అనుకొంటున్న నలుని చూసి జీవలుడు అడిగాడు. బాహుకా! ఏ స్త్రీని గురించి తలచుకొంటున్నావు? నీవు నీబాధను గురించి చెపితే వింటాను. (11)
ఆయుష్మన్ కస్య వా నారీ యామేవమనుశోచసి ।
తమువాచ నలో రాజా మందప్రజ్ఞస్య కస్యచిత్ ॥ 12
ఆసీద్ బహుమతా నారీ తస్యా దృఢతరం వచః ।
స వై కేనచిదర్థేన తయా మందో వ్యయుజ్యత ॥ 13
బాహుకా!
నీవు ఏ స్త్రీ గురించి దుఃఖిస్తున్నావు? ఆమె ఎవనికి సంబంధించిన స్త్రీ? - అని అడిగాడు.
నలుడిలా అన్నాడు.
ఆమె ఒక బుద్ధిహీనుని భార్య. అందరికీ ఇష్టురాలు. ఆమె మాట దృఢతరమైంది. ఏదో ఒక కారణంచే ఆ మందబుద్ధి ఆమె నుండి విడిచిపోయాడు. (12,13)
విప్రయుక్తః స మందాత్మా భ్రమత్యసుఖపీడితః ।
దహ్యమానః స శోకేన దివారాత్రమతంద్రితః ॥ 14
ఆమెచే విడువబడిన ఆ మందబుద్ధి దుఃఖంతో శోకసంతప్తుడై రాత్రింబగళ్ళు నిద్రకూడ లేకుండా తిరుగుతున్నాడు. (14)
నిశాకాలే స్మరంస్తస్యాః శ్లోకమేకం స్మ గాయతి ।
స విభ్రమన్ మహీం సర్వాం క్వచిదాసాద్య కించన ॥ 15
వసత్యనర్హస్తద్ దుఃఖం భూయ ఏవానుసంస్మరన్ ।
రాత్రివేళలో ఆమెను తలచుకొని ఒక శ్లోకాన్ని పాడుతున్నాడు. భూమండలం అంతా తిరుగుతూ ఎప్పుడో ఎక్కడో చేరి అతడామెని తలచుకొని ఈ శ్లోకం చదివాడు - అతడు పాపం! వియోగ దుఃఖాన్ని పొందదగనివాడు. (15 1/2)
సా తు తం పురుషం నారీ కృచ్ఛ్రేఽప్యనుగతా వనే ॥ 16
త్యక్తా తేనాల్పపుణ్యేన దుష్కరం యది జీవతి ।
ఏకా బాలానభిజ్ఞా చ మార్గాణామతథోచితా ॥ 17
ఆమె కష్టసమయాల్లో అతనితో అరణ్యాల్లో కూడా అనుసరించింది. అల్పపుణ్యుడైన అతనిచే విడువబడింది. ఒంటరిది. లోకం పోకడ తెలియనిది. అడవిదారులలో తిరగటం ఎరుగనిది. అంతటి కష్టం ఆమెకు తగదు. (16,17)
క్షుత్పిపాసాపరీతాంగే దుష్కరం యది జీవతి ।
శ్వాపదాచరితే నిత్యం వనే మహతి దారుణే ॥ 18
త్యక్తా తేనాల్పభాగ్యేన మందప్రజ్ఞేన మారిష ।
ఇత్యేవం నైషధో రాజా దమయంతీమనుస్మరన్ ॥
అజ్ఞాతవాసం న్యవసద్ రాజ్ఞస్తస్య నివేశన్ ॥ 19
ఆకలి దప్పులతో క్రూరమృగాలుండే అడవిలో తిరుగుతూ ఆమె జీవించడం కష్టం.
మందబుద్ధి, మందభాగ్యుడైన అతనిచే విడువబడింది - అని ఏదో సమాధానం చెప్పి ఋతుపర్ణమహారాజు భవనమందే అజ్ఞాతంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. (18,19)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలవిలాపే సప్తషష్టితమోఽధ్యాయః ॥ 67 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున నలవిలాపమను అరువది ఏడవ అధ్యాయము. (67)