68. అరువది ఎనిమిదవ అధ్యాయము
భీమమహారాజు పంపిన బ్రాహ్మణుడు చేదిరాజుయొక్క భవనమున దమయంతిని చూచుట.
బృహదశ్వ ఉవాచ
హృతరాజ్యే నలే భీమః సభార్యే చ వనం గతే ।
ద్విజాన్ ప్రస్థాపయామాస నలదర్శనకాంక్షయా ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు.
రాజ్యభ్రష్టుడైన నలుడు దమయంతితో అరణ్యానికి వెళ్ళిన తర్వాత నలుని చూడాలనే కోరికతో భీమరాజు కొందరు బ్రాహ్మణులను నలుని జాడ తెలిసికోవటం కోసం నియమించాడు. (1)
సందిదేశ చ తాన్ భీమః వసు దత్త్వా చ పుష్కలమ్ ।
మృగయధ్వం నలం చైవ దమయంతీం చ మే సుతామ్ ॥ 2
భీమరాజు ఆ బ్రాహ్మణులకు పుష్కలంగా ధనమిచ్చి నలదమయంతులను వెదుకమని ఆదేశించాడు. (2)
అస్మిన్ కర్మణి సంపన్నే విజ్ఞాతే నిషధాధిపే ।
గవాం సహస్రం దాస్యామి యో వస్తావానయిష్యతి ॥ 3
ఈపనిలో మీరు కృతార్థులై వారి జాడతెలిసికొని వారిని తీసికొనివచ్చినట్లయితే వేయి ఆవులను ఇస్తానన్నాడు. (3)
అగ్రహారాంశ్చ దాస్యామి గ్రామం నగరసమ్మితమ్ ।
న చేచ్ఛక్యావిహానేతుం దమయంతీ నలోఽపి వా ॥ 4
జ్ఞాతమాత్రేఽపి దాస్యామి గవాం దశశతం ధనమ్ ।
అగ్రహారాలను ఇస్తానన్నాడు. నగరంతో సమానమైన గ్రామాన్ని ఇస్తానన్నాడు. వారినిక్కడకు తీసుకొని రాలేకపోయినా తెలుసుకొన్నా చాలు గోవులను ఇస్తానన్నాడు. (4)
ఇత్యుక్తాస్తే యయుర్హృష్టాః బ్రాహ్మణాః సర్వతో దిశమ్ ॥ 5
పురరాష్ట్రాణి చిన్వంతః నైషధం సహ భార్యయా ।
ఈవిధంగా చెప్పి భీమరాజు బ్రాహ్మణులను అన్నిదిక్కులకు పంపాడు. వారు అన్నిదిక్కులకు వెళ్ళి నలదమయంతుల కోసం పట్టణాలను, రాష్ట్రాల్ను తిరుగుతూ వెదకుతున్నారు. (5 1/2)
నైవ క్వాపి ప్రపశ్యంతి నలం వా భీమపుత్రికామ్ ॥ 6
తతశ్చేదిపురీం రమ్యాం సుదేవో నామ వై ద్విజః ।
విచిన్వానోఽథ వైదర్భీమ్ అపశ్యద్ రాజవేశ్మని ॥ 7
ఎక్కడా నలుడు గాని దమయంతి గాని కనిపించలేదు. వారిలో సుదేవుడనే బ్రాహ్మణుడు చేదిపురాన్ని చేరి అచట రాజగృహంలో ఉన్న దమయంతిని చూశాడు. (6,7)
పుణ్యహవాచనే రాజ్ఞః సునందాసహితాం స్థితామ్ ।
మందం ప్రఖ్యాయమానేన రూపేణాప్రతిమేవ తామ్ ॥ 8
నిబద్ధాం ధూమజాలేన ప్రభామివ విభావసోః ।
తాం సమీక్ష్య విశాలాక్షీమ్ అధికం మలినాం కృశామ్ ।
తర్కయామాస భైమీతి కారణైరుపపాదయన్ ॥ 9
చేదిరాజైన సుబాహుని పుణ్యాహవాచనంలో సునందతో కలసియున్న ఆమెను చూశాడు. కొద్దికొద్దిగా ప్రకటితమవుతున్న రూపసంపదతో మేఘాలతో కప్పబడిన సూర్యకాంతిలా ఉంది. కృశించి కాంతి తగ్గి మలినంగా ఉన్నది. విశాలమైన కనులు మొదలగున కారణాలను బట్టి దమయంతియే అయి ఉంటుందని ఊహచేశాడు. (8,9)
సుదేవ ఉవాచ
యథేయం మే పురా దృష్టా తథారూపేయమంగనా ।
కృతార్థోఽస్మ్యద్య దృష్ట్వేమాం లోకకాంతామివ శ్రియమ్ ॥ 10
సుదేవుడిలా అన్నాడు. ఈమెరూపాన్ని చూస్తే పూర్వం నేను చూచిన రూపం గానే తోస్తోంది. లక్ష్మీదేవి వలె ఉన్న ఈమెను చూసి కృతార్థుడనయ్యాను. (10)
పూర్నచంద్రనిభాం శ్యామాం చారువృత్తపమోధరామ్ ।
కుర్వంతీం ప్రభయా దేవీమ్ సర్వా వితిమిరా దిశః ॥ 11
పున్నమిచంద్రుని వంటి ముఖం, శ్యామవర్ణం, అందమైన స్తనాలూ కల ఈమె తన కాంతితో దిక్కులను వెలుగజేస్తోంది. (11)
చారుపద్మవిశాలాక్షీం మన్మథస్య రతీమివ ।
ఇష్టాం సమస్తలోకస్య పూర్ణచంద్రప్రభామివ ॥ 12
అందమైన పద్మాలవంటి విశాలనేత్రాలు కల్గిన ఈమె మన్మథునకు రతీదేవిలా సమస్తలోకానికి పూర్ణచంద్రుని కాంతివలె ఇష్టమై కన్పిస్తోంది. (12)
విదర్భసరసస్తస్మాద్ దైవదోషాదివోద్ధతామ్ ।
మలపంకానులుప్తాంగీం మృణాలీమివ చోద్ధృతామ్ ॥ 13
పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తనిశాకరామ్ ।
పతిశోకాకులాం దీనాం శుష్కస్త్రోతాం నదీమివ ॥ 14
విదర్భ అనే సరోవరం నుండి అదృష్టహీనత వల్ల పైకి తీయబడిన పద్మముఖిని చూశాడు. బురదతో మలినమై పైకి తీయబడిన తామరకాడవలెనున్న ఆమెను దర్శించాడు. ఆమె రాహువు మ్రింగిన చంద్రుడున్న పున్నమిరాత్రివలె ఉంది. ఎండిపోయిన నదివలె ఉంది. భర్తృశోకంతో వ్యాకులమనస్కయైనట్లు ఉంది. (13,14)
విధ్వస్తపర్ణకమలాం విత్రాసితవిహంగమామ్ ।
హాస్తిహస్తపరామృష్టాం వ్యాకులామివ పద్మినీమ్ ॥ 15
ఏనుగు తొండాల తాకిడికి రాలిపోయిన రేకులు గల కమలాలు, భయపడిన పక్షులూ కల్గి వ్యాకులమైన సరోవరంలా ఉన్నది. (15)
సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భగృహోచితామ్ ।
దహ్యమానామివార్కేణ మృణాలీమివ చోద్ధృతామ్ ॥ 16
సుకుమారియై అవయవసౌష్ఠవం కలిగి రత్నస్థగితగృహాలలో నివసింపతగినట్లుంది. సరోవరం నుండి పైకి తీయబడి ఎండకు వాడిన తామరతూడులా ఉంది. (16)
రుపౌదార్యగుణోపేతాం మమ్డనార్హామమండితామ్ ।
చంద్రలేఖామివ నవాం వ్యోమ్ని నీలాభ్రసంవృతామ్ ॥ 17
మంచిరూపం, ఔదార్యాదిగుణాలు కలిగి ఉంది. అలంకారాలకు యోగ్యురాలయినా అలంకరించుకోలేదు. ఆకాశంలో నీలిమేఘాల నడుమ శుక్లపక్షవిదియనాటి చంద్రలేఖవలె ఉన్నది. (17)
కామభోగైః ప్రియైర్హీనాం హీనాం బంధుజనేన చ ।
దేహం సంధారయంతీం హి భర్తృదర్శనకాంక్షయా ॥ 18
ఇష్టమైన కామభోగాలు బంధువులూ లేక, భర్తను చూడాలనే కోరికతో మాత్రమే దేహాన్ని ధరించి ఉన్నది. (18)
భర్తా నామ పరం నార్యాః భూషణం భూషణైర్వినా ।
ఏషా హి రహితా తేన శోభమానా న శోభతే ॥ 19
ఆభరణాలు లేకపోయినా స్త్రీకి భర్తయే శ్రేష్ఠమైన భూషణం. శోభకలదైనా ఇప్పుడు పతిలేక ఈమె శోభించటం లేదు. (19)
దుష్కరం కురుతేఽత్యంతం హీనో యదనయా నలః ।
ధారయత్యాత్మనో దేహం న శోకేనాపి సిదతి ॥ 20
ఈమె లేని నలుడు జీవించియున్నాడన్నా శోకంతో శిథిలం కావటం లేదన్నా అది నలుడు చేస్తున్న దుష్కరకార్యమే. (20)
ఇమామసితకేశాంతాం శతపత్రాయతేక్షణామ్ ।
సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యథతే మనః ॥ 21
నల్లని కురులూ, కమలాలవంటి నేత్రాలూ గల ఈమె సుఖాల ననుభవించటానికి తగినదైనా దుఃఖాల ననుభవిస్తోంది. ఈ పరిస్థితి చూచి నాకు కూడా బాధ కలుగుతోంది. (21)
కదా ను ఖలు దుఃఖస్య పారం యాస్యతి వై శుభా ।
భర్తుః సమాగమాత్ సాధ్వీ రోహిణీ శశినో యథా ॥ 22
ఈమె దుఃఖం ఎపుడు తీరిపోతుందో! సాధ్వియైన ఈమె భర్తతో కలిసి చంద్రునితో రోహిణివలె ఎపుడు ఉంటుందో! (22)
అస్యా నూనం పునర్లాభాత్ నైషధః ప్రీతిమేష్యతి ।
రాజా రాజ్యపరిభ్రష్టః పునర్లబ్ధ్వా చ మేదినీమ్ ॥ 23
రాజ్యభ్రష్టుడైన నలమహారాజు ఈమెను తిరిగిపొందటం వలన, తనరాజ్యాన్ని కూడ తిరిగి పొంది సంతోషాన్ని పొందగలడు. (23)
తుల్యశీలవయోయుక్తాం తుల్యాభిజనసంవృతామ్ ।
నైషధోఽర్హతి వైదర్భీం తం చేయమసితేక్షణా ॥ 24
తనతో సమానైన శీలం, వయస్సు, వంశం గల దమయంతిని పొందటానికి తగినవాడు నలుడు. నలునకు తగినది ఈ దమయంతి. (24)
యుక్తం తస్యాప్రమేయస్య వీర్యసత్త్వవతో మయా ।
సమాశ్వాసయితుం భార్యాం పతిదర్శనలాలసామ్ ॥ 25
అప్రమేయుడు, పరాక్రమసంపన్నుడైన నలుని భార్య అయిన దమయంతి పతిని చూడాలనే కోరికతో ఉన్నది. ఈమెను ఊరడించటం ప్రస్తుతం నేను చేయతగినపని. (25)
అహమాశ్వాసయామ్యేనాం పూర్ణచంద్రనిభాననామ్ ।
అదృష్టపూర్వాం దుఃఖస్య దుఃఖార్తాం ధ్యానతత్పరామ్ ॥ 26
ఇతఃపూర్వం దుఃఖం ఎరుగనిది. ఇపుడు దుఃఖార్తయై భర్తృధ్యానతత్పరయై ఉంది. పూర్ణచంద్రముఖి అయిన దమయంతిని నేనిప్పుడు ఊరడిస్తాను. (26)
బృహదశ్వ ఉవాచ
ఏవం విమృశ్య వివిధైః కారణైర్లక్షణైశ్చ తామ్ ।
ఉపాగమ్య తతో భైమీం సుదేవో బ్రాహ్మణోఽబ్రవీత్ ॥ 27
అహం సుదేవో వైదర్భి భ్రాతుస్తే దయితః సఖా ।
భీమస్య వచనాద్ రాజ్ఞః తామన్వేష్టుమిహాగతః ॥ 28
బృహదశ్వుడిలా అన్నాడు. వివిధకారణాలచేత, లక్షణాలచేతను ఈవిధంగా ఆలోచించిన సుదేవుడు దమయంతి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు.
దమయంతీ! నేను సుదేవుడనే బ్రాహ్మణుడను. మీ అన్నగాఱి మిత్రుడను. మీతండ్రిగారైన భీమరాజుయొక్క ఆదేశంపై నిన్ను వెదకటానికి ఇలా వచ్చానని చెప్ఫాడు. (27,28)
కుశలీ తే పితా రాజ్ఞి జననీ భ్రాతరశ్చ తే ।
ఆయుష్మంతౌ కుశలినౌ తత్రస్థౌ దారకౌ చ తౌ ॥ 29
నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు క్షేమంగా ఉన్నారు. వారియొద్దనున్న ఆయుష్మంతులైన నీపుత్రుడు, పుత్రిక కూడా క్షేమంగానే ఉన్నారు. (29)
త్వత్కృతే బంధువర్గాశ్చ గతసత్త్వా ఇవాసతే ।
అన్వేష్టారో బ్రాహ్మణాశ్చ భ్రమంతి శతశో మహీమ్ ॥ 30
నీగురించి బంధువర్గమంతా శక్తిహీనులవలె ఉన్నారు. చాలా మంది బ్రాహ్మణులు నీకోసం వెదుకుతూ దేశాలన్నీ తిరుగుతున్నారు. (30)
బృహదశ్వ ఉవాచ
అభిజ్ఞాయ సుదేవం తం దమయంతీ యుధిష్ఠిర ।
పర్యపృచ్ఛత తాన్ సర్వాన్ క్రమేణ సుహృదఃస్వకాన్ ॥ 31
బృహదశ్వుడిలా అన్నాడు. ధర్మరాజా! దమయంతి సుదేవుని గుర్తించింది. క్రమంగా తనవారిగురించి, మిత్రులందరి గురించి సుదేవుని అడిగింది. (31)
రురోద చ భృశం రాజన్ వైదర్భీ శోకకర్శితా ।
దృష్ట్వా సుదేవం సహసా భ్రాతురిష్టం ద్విజోత్తమమ్ ॥ 32
రుదతీం తామథో దృష్ట్వా సునందా శోకకర్శితా ।
సుదేవేన సహైకాంతే కథయంతీం చ భారత ॥ 33
ధర్మరాజా! దమయంతి తన అన్నగారికి ఇష్టుడైన సుదేవుని చూసి ఏడ్చింది. ఏకాంతప్రదేశంలో సుదేవునితో జరిగిన విషయాన్నంతా వివరించి చెపుతూ, ఏడుస్తూన్న సైరంధ్రిని చూచి సునంద శోకసంతప్తురాలైంది. (32,33)
జనిత్ర్యై కథయామాస సైరంధ్రీ రోదితీతి చ ।
బ్రాహ్మణేన సహాగమ్య తాం వేద యది మన్యసే ॥ 34
సైరంధ్రి బ్రాహ్మణుని చెంత రోదిస్తున్న విషయాన్నంతా సునంద తనతల్లికి చెప్పింది. విషయాన్ని తెలిసికోవాలని ఉంటే వచ్చి ఆమెని గురించి తెలుసుకోమన్నది. (34)
అథ చేదిపతేర్మాతా రాజ్ఞశ్చాంతఃపురాత్ తదా ।
జగామ యత్ర సా బాలా బ్రాహ్మణేన సహాభవత్ ॥ 35
సునంద చెప్పిందంతా విన్న తర్వాత రాజమాత అంతఃపురాన్నుండి బ్రాహ్మణునితోబాటు సైరంధ్రి ఉన్న ప్రదేశానికి వచ్చింది. (35)
తతః సుదేవమానాయ్య రాజమాతా విశాంపతే ।
పప్రచ్ఛ భార్యా కస్యేయం సుతా వా కస్య భావినీ ॥ 36
కథం చ నష్టా జ్ఞాతిభ్యః భర్తుర్వా వామలోచనా ।
త్వయా చ విదితా విప్ర కథమేవంగతా సతీ ॥ 37
తరువాత రాజమాత సుదేవుని పిలిపించి ఇలా అడిగింది. ఈమె ఎవనిభార్య? ఎవనికుమార్తె? ఏవిధంగా ఈమె జ్ఞాతుల వల్ల, భర్తవల్ల నష్టాన్ని పొందింది? ఈ స్థితిని పొందటం ఎలా జరిగింది? మీకు తెలుసా? (36,37)
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం త్వత్తః సర్వమశేషతః ।
తత్త్వేన హి మమాచక్ష్వ పృచ్ఛంత్యా దేవరూపిణీమ్ ॥ 38
మీవలన ఈమెను గురించిన విషయాన్నంతా సమగ్రంగా వినాలని కోరుతున్నాను. దివ్యరూపం గల ఈమె గురించి యథార్థాన్ని చెప్పండి. (38)
ఏవముక్తస్తయా రాజన్ సుదేవో ద్విజసత్తమః ।
సుఖోపవిష్ట ఆచష్ట దమయంత్యా యథాతథమ్ ॥ 39
రాజమాత సుదేవునితో ఈవిధంగా చెప్పిన తర్వాత, బ్రాహ్మణోత్తముడైన సుదేవుడు సుఖంగా కూర్చుని దమయంతిని గురించి జరిగింది జరిగినట్లుగా చెప్పాడు. (39)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి దమయంతీసుదేవసంవాదే అష్టషష్టితమోఽధ్యాయః ॥ 68 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున దమయంతీసంవాదే అరువది ఎనిమిదవ అధ్యాయము. (68)