73. అరువది మూడవ అధ్యాయము

దమయంతి ఆలోచనము.

బృహదశ్వ ఉవాచ
తతో విదర్భాన్ సంప్రాప్తం సాయాహ్నే సత్యవిక్రమమ్ ।
ఋతుపర్ణం జనా రాజ్ఞేభీమాయ ప్రత్యవేదయన్ ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు -
సూర్యాస్తమయానికే సత్యవిక్రముడైన నలుడు ఋతుపర్ణునితో విదర్భదేశం చేరాడు. ఋతుపర్ణమహారాజు రాకను విదర్భాధిపతికి ప్రజలు తెలిపారు. (1)
స భీమవచనాద్ రాజా కుండినం ప్రావిశత్ పురమ్ ।
నాదయన్ రథఘొషేణ సర్వాః స విదిశో దిశః ॥ 2
భీమరాజు ఆహ్వానంతో దిక్కులన్నిటా రథఘోషలు ప్రతిధ్వనిస్తూ ఋతుపర్ణమహారాజు కుండిన నగరంలోనికి ప్రవేశించాడు. (2)
తతస్తం రథనిర్ఘోషం నలాశ్వాస్తత్ర శుశ్రువుః ।
శ్రుత్వా తు సమహృష్యంత పురేవ నలసన్నిధౌ ॥ 3
ఆ నగరంలోనే ఉన్న నలుని గుర్రాలు ఆ రథఘొషను విన్నాయి. విని గతంలో నలుని సాన్నిధ్యంలో పొందినంత ఆనందాన్నీ పొందాయి. (3)
దమయంతీ తు శుశ్రావ రథఘొషం నలస్య తమ్ ।
యథా మేఘస్య నదతో గంభీరం జలదాగమే ॥ 4
వర్షాకాలమందలి మేఘధ్వనుల వలె గంభీరంగా శబ్దిస్తున్న నలుని రథఘోషను దమయంతి విన్నది. (4)
పరం విస్మయమాపన్నా శ్రుత్వా నాదం మహాస్వనమ్ ।
నలేన సంగృహీతేషు పురేవ నలవాజిషు ।
సదృశం రథనిర్ఘోషం మేనే భైమీ తథా హయాః ॥ 5
ఆ మహాధ్వనిని విన్న దమయంతి పరమాశ్చర్యాన్ని పొందింది. గతంలో నలుడు తన గుర్రాలను పూన్చి నడుపుతున్నప్పుడు వచ్చిన రథఘొషతో సమానమైన ధ్వనిగా దానిని దమయంతి, అక్కడున్న గుర్రాలు కూడా భావించాయి. (5)
ప్రాసాదస్థాశ్చ శిఖినః శాలాస్థాశ్చైవ వారణాః ।
హయాశ్చ శుశ్రువుస్తస్య రథఘోషం మహీపతేః ॥ 6
నలుని రథఘోషను భవనాలపై నున్న నెమళ్ళు, గజశాలలోనున్న ఏనుగులు, అశ్వశాలలోని గుర్రాలు కూడ విన్నాయి. (6)
తచ్ర్ఛుత్వా రథనిర్ఘోషం వారణాః శిఖినస్తథా ।
ప్రణేదురున్ముఖా రాజాన్ మేఘనాద ఇవోత్సుకాః ॥ 7
ఆ రథధ్వనిని విన్న ఏనుగులు, నెమళ్ళు మేఘధ్వనులనుకొని ఉత్సాహంతో తలలు పైకెత్తి ఘీంకారాలు, క్రేంకారాలు చేశాయి. (7)
దమయంత్యువాచ
యథాసౌ రథనిర్ఘోషః పూరయన్నివ మేదినీమ్ ।
మమాహ్లాదయతే చేతః నల ఏష మహీపతిః ॥ 8
దమయంతి ఇలా అనుకొన్నది.
భుమండల మంతా నింపుతున్నట్లు ఈ రథధ్వని నా మనస్సుకెంతో సంతోషాన్ని కల్గిస్తోంది. ఆతడు నలమహారాజే. (8)
అద్య చంద్రాభవక్త్రం తం న పశ్యామి నలం యది ।
అసంఖ్యేయగుణం వీరం వినంక్ష్యామి న సంశయః ॥ 9
ఇప్పుడు నేను అమేయగుణసంపన్నుడై, వీరుడై, చంద్రుని వలె ఆహ్లాదాన్ని కల్గించే మోముగల నలుని చూడకపోతే బ్రతుకను. సందేహం లేదు. (9)
యది వై తస్య వీరస్య బాహ్వోర్నాద్యాహమంతరమ్ ।
ప్రవిశామి సుఖస్పర్శం న భవిష్యామ్యసంశయమ్ ॥ 10
వీరుడైన ఆ నలమహారాజు బాహుబంధంలో సుఖస్పర్శ ననుభవింపకపోతే నేడు నేను బ్రతుకలేను. (10)
యది మాం మేఘనిర్ఘోషః నోపగచ్ఛతి నైషధః ।
అద్య చామీకరప్రఖ్యం ప్రవేక్ష్యామి హుతాశనమ్ ॥ 11
మేఘగంభీర రథఘోష కల నలమహారాజు నన్ను చేరకపోతే, ఇప్పుడే బంగారం వలె మండుతున్న అగ్నిలో ప్రవేశిస్తాను. (11)
యది మాం సింహవిక్రాంతః మత్తవారణవిక్రమః ।
నాభిగచ్ఛతి రాజేంద్రః వినంక్ష్యామి న సంశయః ॥ 12
సింహపరాక్రమం, మదపుటేనుగువంటి నడక కల నలుడు నన్ను చేరనిచో నేను నశిస్తాను. సందేహం లేదు. (12)
న స్మరామ్యనృతం కించిత్ న స్మరామ్యపకారతామ్ ।
న చ పర్యుషితం వాక్యం స్వైరేష్వపి కదాచన ॥ 13
నేనెన్నడును అసత్యాన్ని తలంచను. అపకార భావం నాలోలేదు. చెడ్డమాటలను పరిహాసానికైనా పలుకను. (13)
ప్రభుః క్షమావాన్ వీరశ్చ దాతా చాప్యధికో నృపైః ।
రహోఽనీచానువర్తీ చ క్లీబవన్మమ నైషధః ॥ 14
నలమహారాజు, ఓర్పుకలవాడు, వీరుడు, గొప్పదాత. రహస్యంగా కూడా ఎన్నడూ నీచంగా ప్రవర్తించడు. పరస్త్రీల పట్ల నపుంసకునివలె ప్రవర్తిస్తాడు. (14)
గుణాంస్తస్య స్మరంత్యా మే తత్పరాయా దివానిశమ్ ।
హృదయం దీరత్య ఇదం శోకాత్ ప్రియవినాకృతమ్ ॥ 15
నలధ్యానతత్పరనై, నలునే స్మరించే నాకు ప్రియుని వియోగంచే కల్గిన శోకం వలన రాత్రింబవళ్లు నా హృదయం బ్రద్దలవుతోంది. (15)
ఏవం విలపమానా సా నష్టసంజ్ఞేవ భారత ।
ఆరురోహ మహద్ వేశ్మ పుణ్యశ్లోకదిదృక్షయా ॥ 16
భారతా! ఈ విధంగా ఏడుస్తూనే, దాదాపు స్పృహలేనిస్థితిలో నలమహారాజును చూడాలనే కోరికతో మేడపైకి ఎక్కింది. (16)
తతో మధ్యమకక్షాయాం దదర్శ రథమాస్థితమ్ ।
ఋతుపర్ణం మహీపాలం సహవార్ ష్ణేయబాహుకమ్ ॥ 17
అంతలో వార్ష్ణేయునితో, బాహుకునితో సహా రథంపైనున్న ఋతుపర్ణమహారాజును మేడపై గల మధ్యమకక్ష నుండి చూచింది. (17)
తతోఽవతీర్య వార్ ష్ణేయః బాహుకశ్చ రథోత్తమాత్ ।
హయాంస్తానవముచ్యాథ స్థాపయామాస వై రథమ్ ॥ 18
రథం దిగిన వార్ష్ణేయబాహుకులు, రథానికి పూన్చిన గుర్రాలను విప్పి రథాన్ని అచ్చట నిలిపారు. (18)
సోఽవతీర్య రథోపస్థాదృతుపర్ణో నరాధిపః ।
ఉపతస్థే మహారాజం భీమం భీమపరాక్రమమ్ ॥ 19
రథంలో కూర్చుని ఉన్న ఋతుపర్ణమహారాజు రథం దిగి, భీమపరాక్రమశాలియైన భీమమహారాజు సమీపానికి వచ్చాడు. (19)
తం భీమః ప్రతిజగ్రాహ పూజయా పరయా తతః ।
స తేన పూజితో రాజ్ఞా ఋతుపర్ణో నరాధిపః ॥ 20
భీమరాజు సగౌరవంగా ఎదురేగి ఋతుపర్ణమహారాజును సత్కరించాడు. ఋతుపర్ణుడు ఆయన చేసిన సత్కారాలను స్వీకరించాడు. (20)
స తత్ర కుండినే రమ్యే వసమానో మహీపతిః ।
న చ కించిత్ తదాపశ్యన్ ప్రేక్షమాణో ముహుర్ముహుః ।
స తు రాజ్ఞా సమాగమ్య విదర్భపతినా తదా ॥ 21
అకస్మాత్ సహసా ప్రాప్తం స్త్రీమంత్రం న స్మ విందతి ।
కుండిననగరాన్ని చేరిన ఋతుపర్ణమహారాజునకు అక్కడ స్వయంవర విశేషాలేమియు కన్పించలేదు. ఆపై ఋతుపర్ణుడు భీమమహారాజును కలిసినపుడు కూడ, అకస్మాత్తుగ వచ్చిన స్వయంవరవార్త ఆయనకేమీ తెలియదు. (21 1/2)
కిం కార్యం స్వాగతం తేఽస్తు రాజ్ఞా పృష్టః స భారత ॥ 22
భారత! ధర్మజా! భీమమహారాజు ఋతుపర్ణమహారాజునకు స్వాగతం పల్కి, వారికై తానేమి చేయవలెనో చెప్పమని అడిగినాడు. (22)
నాభిజజ్ఞే స నృపతిః దుహిత్రర్థే సమాగతమ్ ।
ఋతుపర్ణోఽపి రాజా స ధీమాన్ సత్యపరాక్రమః ॥ 23
భీమమహారాజునకు తనకుమార్తె యొక్క స్వయంవర నిమిత్తం ఋతుపర్ణుడు వచ్చినట్లు తెలియదు. ఋతుపర్ణమహారాజు కూడ బుద్ధిమంతుడు, పరాక్రమశాలి, సత్యవంతుడు కనుకనే దమయంతీ స్వయంవరాన్ని గురించి ప్రస్తావించలేదు. (23)
రాజానం రాజపుత్రం వా న స్మ పశ్యతి కంచన ।
నైవ స్వయంవరకథాం న చ విప్రసమాగమమ్ ॥ 24
తతో వ్యగణయద్ రాజా మనసా కోసలాధిపః ।
ఆగతోఽస్మీత్యువాచైనం భవంతమభివాదకః ॥ 25
రాజులు కానీ రాజకుమారులు కానీ కనిపించటం లేదు. స్వయంవరప్రసక్తి లేదు. విప్రసమాగమం లేదు. దానితో ఋతువర్ణుడు మనస్సులో ఏదో అనుకొని మీకు నమస్కరించటానికి వచ్చాను అని పలికాడు. (24,25)
రాజాపి చ స్మయన్ భీమః మనసా సమచింతయన్ ।
అధికం యోజనశతం తస్యాగమనకారణమ్ ॥ 26
గ్రామాన్ బహూనతిక్రమ్య నాధ్యగచ్ఛద్ యథాతథమ్ ।
అల్పకార్యం వినిర్దిష్టం తస్యాగమనకారణమ్ ॥ 27
భీమరాజు కూడా ఆశ్చర్యపడి ఆలోచించినా అన్ని యోజనాలు ప్రయాణించి, అని గ్రామాలను దాటి ఋతుపర్ణుడు రావటంలోని కారణాన్ని గ్రహించలేకపోయాడు. పైగా ఆయన చాలా చిన్న కారణాన్ని చెపుతున్నాడు. (26,27)
పశ్చాదుదర్కే జ్ఞాస్యామి కారణం యద్ భవిష్యతి ।
నైతదేవం స నృపతిః తం సత్కృత్య వ్యసర్జయత్ ॥ 28
'అసలు కారణమేదో తరువాత తెలుస్తుందిలే. ఈయన చెప్తున్నది మాత్రం అసలు కారణం కాదు' అనుకొని భీమరాజు ఋతువర్ణుని సత్కరించి పంపాడు. (28)
విశ్రామ్యతామిత్యువాచ క్లాంతోఽసీతి పునః పునః ।
స సత్కృతః ప్రహృష్టాత్మా ప్రీతః ప్రీతేన పార్థివః ॥ 29
'మీరెంతగానో అలసిపోయారు. విశ్రాంతి తీసికోండి'. అని పదేపదే అత్యంత ప్రీతితో భీమరాజు పలుకుతుంటే, ఋతుపర్ణుడు ఎంతో సంతోషపడ్డాడు. (29)
రాజప్రేష్యైరనుగతః దిష్టం వేశ్మ సమావిశత్ ।
ఋతుపర్ణే గతే రాజన్ వార్ ష్ణేయసహితే నృపే ॥ 30
బాహుకో రథమాదాయ రథశాలాముపాగమత్ ।
స మోచయిత్వా తానశ్వాన్ ఉపచర్య చ శాస్త్రతః ॥ 31
స్వయం చైతాన్ సమాశ్వాస్య రథోపస్థ ఉపావిశత్ ।
ఋతుపర్ణుడు, వార్ష్ణేయునితో కలసి, భీమరాజు నిర్దేశించిన గృహానికి వెళ్ళాడు.
బాహుకుడు రథాన్ని తీసికొని రథశాలకు వెళ్ళాడు. అక్కడ గుర్రాలను విడిచి, వాటికి చక్కగా శాస్త్రసమ్మతంగా చేయతగిన ఉపచర్యలు చేసి రథం మీదనే కూర్చున్నాడు. (30,31 1/2)
దమయంత్యపి శోకార్తా దృష్టా భాంగాసురిం నృపమ్ ॥ 32
సూతపుత్రం చ వార్ ష్ణేయం బాహుకం చ తథావిధమ్ ।
చింతయామాస వైదర్భీ కస్యైష రథనిఃస్వనః ॥ 33
శోకార్తయైన దమయంతి ఋతుపర్ణుని, సూతపుత్రుడైన వార్ష్ణేయుని, బాహుకుని చూసి, 'ఈ రథధ్వని ఎవనిదా?' అని అనుకొంది. (32,33)
నలస్యేవ మహానాసీత్ న చ పశ్యామి నైషధమ్ ।
వార్ ష్ణేయేన భవేన్నూనం విద్యా సైవోపశిక్షితా ॥ 34
తేనాద్య రథనిర్ఘోషః నలస్యేవ మహానభూత్ ।
ఆహోస్విదృతుపర్ణోఽపి యథా రాజా నలస్తథా ।
యథాయం రథనిర్ఘోషః నైషధస్యేవ లక్ష్యతే ॥ 35
ఈ మహాధ్వని నలునిదే కాని నలుడు కన్పించటం లేదు. లేక నలుని వలన వార్ష్ణేయుడా విద్య నేర్చుకొన్నాడా? అందుచేతనే రథనిర్ఘోషం నలునిరథఘొషను పోలి ఉంది. ఋతుపర్ణుడు కూడ నలుని వంటి మహారాజే! అందుచేతనే అతని రథనిర్ఘోషం నలుని రథఘోషవలె ఉందా - అని దమయంతి అనేక విధాల తర్కించుకొన్నది. (34,35)
ఏవం సా తర్కయిత్వా తు దమయంతీ విశాంపతే ।
దూతీం ప్రస్థాపయామాస నైషధాన్వేషణే శుభా ॥ 36
రాజా! దమయంతి పలువిధాల తర్కించుకొన్న తర్వాత నలుని వెదకటానికి ఒక దూతికను పంపింది. (36)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి ఋతుపర్ణస్య భీమపురప్రవేశే త్రిసప్తతితమోఽధ్యాయః ॥ 73 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున ఋతుపర్ణుని భీమపురప్రవేశమను డెబ్బది మూడవ అధ్యాయము. (73)