74. డెబ్బది నాలుగవ అధ్యాయము

బాహుక కేశినీ సంవాదము.

దమమంత్యువాచ
గచ్ఛ కేశిని జానీహి క ఏష రథవాహకః ।
ఉపవిష్టో రథోపస్థే వికృతో హ్రస్వబాహుకః ॥ 1
దమయంతి ఇలా అన్నది. కేశినీ! నీవు అచటకు వెళ్ళు. ఆ రథం ప్రక్కన పొట్టిచేతులు, వికృతరూపంతో ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆ రథసారథి ఎవరో తెలుసుకో! (1)
అభ్యేత్య కుశలం భద్రే మృదుపూర్వం సమాహితా ।
పృచ్ఛేథాః పురుషం హ్యేనం యథాతత్త్వమనిందితే ॥ 2
భద్రా! కేశినీ! ఆ పురుషుని చెంతకేగి ఏమాత్రం తొందరపాటు లేకుండా, మృదువుగా క్షేమసమాచారాలడిగి ఆతనిని గురించి తెలుసుకో! (2)
అత్ర మే మహతీ శంకా భవేదేష నలో నృపః ।
యథా చ మనసస్తుష్టిః హృదయస్య చ నిర్వృతిః ॥ 3
ఆతడే నలమహారాజని అనుమానం కలుగుతోంది. మనస్సుకు సంతోషం, హృదయానికి సుఖం కలుగుతోంది. దానితో ఆ భావం గట్టిపడుతోంది. (3)
బ్రూయాశ్చైవం కథాంతే త్వం పర్ణాదవచనం యథా ।
ప్రతివాక్యం చ సుశ్రోణి బుద్ధ్యేథాస్త్వమనిందితే ॥ 4
సుశ్రోణీ! అనిందితా! అతనితో సంభాషణ ముగిసే సమయంలో పర్ణాదుడు చెప్పిన మాటలన్నీ పలుకు. నీపలుకులకు ఆతడేమి సమాధానం చెపుతాడో తెలుసుకో! (4)
తతః సమాహితా గత్వా దూతీ బాహుకమబ్రవీత్ ।
దమయంత్యపి కల్యాణీ ప్రాసాదస్థా హ్యుపైక్షత ॥ 5
కేశిని యనే దూతి నెమ్మదిగావెళ్ళి బాహుకునితో ఇలా మాట్లాడింది. కళ్యాణి దమయంతి ప్రాసాదం పైనుండి చూస్తోంది. (5)
కేశిన్యువాచ
స్వాగతం తే మనుష్యేంద్ర కుశలం తే బ్రవీమ్యహమ్ ।
దమయంత్యా వచః సాధు నిబోధ పురుషర్షభ ॥ 6
కేశిని ఇలా పలికింది.
మానవేంద్రా! మీకు స్వాగతం. మీరుక్షేమంగా ఉన్నారు కదా! పురుషశ్రేష్ఠా! దమయంతి మాటలను వినండి. (6)
కదా వై ప్రస్థితా యూయం కిమర్థమిహ చాగతాః ।
తత్ త్వం బ్రూహి యథాన్యాయం వైదర్భీ శ్రోతుమిచ్ఛతి ॥ 7
మీరెప్పుడు బయలుదేరారు? ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు ఆ విషయం గురించి యథార్థాన్ని చెప్పండి. దమయంతి వినగోరుతున్నది. (7)
బాహుక ఉవాచ
శ్రుతః స్వయంవరో రాజ్ఞా కోసలేన మహాత్మనా ।
ద్వితీయో దమయంత్యా వై భవితా శ్వ ఇతి ద్విజాత్ ॥ 8
బాహుకుడిలా అన్నాడు. కోసలదేశాధీశుడైన ఋతుపర్ణ మహారాజు ఒక బ్రాహ్మణోత్తముని వలన దమయంతికి ద్వితీయ స్వయంవరం రేపు జరుగుతోందని విన్నాడు. (8)
శ్రుత్వైతత్ ప్రస్థితో రాజా శతయోజనయాయిభిః ।
హయైర్వాతజవైర్ముఖైః అహమస్య చ సారథిః ॥ 9
ఆ బ్రాహ్మణుని వలన ఈ విషయాన్ని విన్నవెంటనే మహారాజు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. నూరు యోజనాల దూరం, శీఘ్రంగా పయనింపగల గుర్రాలతో రథాన్ని సిద్ధం చేశాను. నేను ఆ ఋతుపర్ణుని సారథిని. (9)
కేశిన్యువాచ
అథ యోఽసౌ తృతీయో వః స కుతః కస్య వా పునః ।
త్వం చ కస్య కథం చేదం త్వయి కర్మ సమాహితమ్ ॥ 10
కేశిని ఇలా పలికింది.
మీలో ఆ మూడవవ్యక్తి ఎవనికి సంబంధించిన వాడు? ఇంతటి మహత్కార్యం నీపై ఎందుకు ఉంచబడింది? (10)
బాహుక ఉవాచ
పుణ్యశ్లోకస్య వై సూతః వార్ ష్ణేయ ఇతి విశ్రుతః ।
స నలే విద్రుతే భద్రే భాంగాసురిముపస్థితః ॥ 11
బాహుకుడిలా అన్నాడు.
భద్రా! ఆ మూడవ వ్యక్తి నలమహారాజుగారి రథసారథిగా ప్రసిద్ధి పొందిన వార్ష్ణేయుడు. నలమహారాజు రాజ్యాన్ని వదలివెళ్ళిన తర్వాత వార్ష్ణేయుడు ఋతుపర్ణమహారాజు చెంత చేరాడు. (11)
అహమప్యశ్వకుశలః సూతత్వే చ ప్రతిష్ఠితః ।
ఋతుపర్ణేన సారథ్యే భోజనే చ వృతః స్వయమ్ ॥ 12
నేను కూడ అశ్వశాస్త్ర రహస్యాలు తెలిసినవాణ్ణి. రథసారథ్యం కూడ బాగా తెలిసినవాడినే! అందుచేతనే నన్ను ఋతుపర్ణమహారాజు సారథిగా నియమించారు. అంతే కాదు. వంటవానిగ కూడ నన్నే నియమించారు. (12)
కేశిన్యువాచ
అథ జానాతి వార్ ష్ణేయః క్వ ను రాజా నలో గతః ।
కథం చ త్వయి వా తేన కథితం స్యాత్ తు బాహుక ॥ 13
కేశిని ఇలా అన్నది.
బాహుకా! నలుడెక్కడకు వెళ్ళినది వార్ష్ణేయునకు తెలుసా? ఆతడెప్పుడైన నీ కీ విషయాన్ని చెప్పే ఉండాలి! (13)
బాహుక ఉవాచ
ఇహైవ పుత్రౌ నిక్షిప్య నలస్య శుభకర్మణః ।
గతస్తతో యథాకామం నైష జానాతి నైషధమ్ ॥ 14
బాహుకుడిలా అన్నాడు.
సత్కర్మలాచరించిన నలుని పుత్రుని, పుత్రికను ఇక్కడ ఉంచిన తర్వాత వార్ష్ణేయుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. నలుని గురించి అతనికి తెలియదు. (14)
న చాన్యః పురుషః కశ్చిత్ నలం వేత్తి యశస్విని ।
గూఢశ్చరతి లోకేఽస్మిన్ నష్టరూపే మహీపతిః ॥ 15
నలుని గురించి ఇతరుల్వెరికీ కూడా తెలియదు. మహారాజు తన రూపాన్ని కోల్పోయి ఈ లోకంలో నిగూఢంగా తిరుగుతున్నాడు. (15)
ఆత్మైవ తు నలం వేద యా చాస్య తదనంతరా ।
న హి వై స్వాని లింగాని నలః శంసతి కర్హిచిత ॥ 16
ఆ పరమాత్మకే తెలియాలి నలుడు - లేదా నలుని అంతరాత్మకు తెలియాలి. తన గుర్తులేమిటో నలుడెవరికీ ఎప్పుడూ చెప్పలేదు. (16)
కేశిన్యువాచ
యోఽసావయోధ్యాం ప్రథమం గతోఽసౌ బ్రాహ్మణస్తదా ।
ఇమాని నారీవాక్యాని కథయానః పునః పునః ॥ 17
కేశిని ఇలా అన్నది.
బాహుకా! ఓ స్త్రీకి సంబంధించిన వాక్యాలను చెపుతూ, ఇంతకుముందే ఒక బ్రాహ్మణుడు అయోధ్యానగరానికి వచ్చాడు ఆ మాటలు ఇవి. (17)
క్వ ను త్వం కితవచ్ఛిత్త్వా వస్త్రార్ధం ప్రస్థితో మమ ।
ఉత్సృజ్య విపినే సుప్తామ్ అనురక్తాం ప్రియాం ప్రియ ॥ 18
ప్రియ్! నీపై అనురాగం గల ప్రేయసిని నేను, నిద్రిస్తున్న సమయాన ఒక వంచకునివలె నాచీరను సగం చింపుకొని నన్ను అరణ్యంలో విడిచి ఎక్కడకు వెళ్ళావు? (18)
సా వై యథా సమాదిష్టా తథాఽఽస్తే త్వత్ర్పతీక్షిణీ ।
దహ్యమానా దివా రాత్రౌ వస్త్రార్ధేనాభిసంవృతా ॥ 19
ఆమె నీవు ఆదేశించిన స్థితిలోనే, అదేవిధంగా నీకై ఎదురుచూస్తోంది. అహోరాత్రాలు వియోగాగ్నిచే దహింపబడుతోంది. ఇప్పటికీ ఆ సగం చీరతోనే ఉంది. (19)
తస్యా రుదంత్యాః సతతం తేన దుఃఖేన పార్థివ ।
ప్రసాదం కురు మే వీర ప్రతివాక్యం వదస్వ చ ॥ 20
పృథీపతీ! ఆ దమయంతి నీకు కల్గిన దుఃఖంచేతనే ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉంది. మహావీరా! ఆమెపై దయతో నాకు జవాబు చెప్పు. (20)
తస్యాస్తత్ ప్రియమాఖ్యానం ప్రవదస్వ మహామతే ।
తదేవ వాక్యం వైదర్భీ శ్రోతుమిచ్ఛత్యనిందితా ॥ 21
సద్బుద్ధి గల మహారాజా! ఆమెకు ప్రియమైన నలుని కథను చెప్పండి! అనిందితమైన దమయంతి ఆ మాటాలనే వినదలచింది. (21)
ఏతచ్ఛ్రుత్వా ప్రతివచః తస్య దత్తం త్వయా కిల ।
యత్ పురా తత్ పునస్త్వత్తః వైదర్భి శ్రోతుమిచ్ఛతి ॥ 22
ఇతః పూర్వం అయోధ్యకు వచ్చిన బ్రాహ్మణునికి మీరు చెప్పిన సమాధానాన్నే ఇప్పుడు మీముఖతః మరల దమయంతి వినదలచింది. (22)
బృహదశ్వ ఉవాచ
ఏవముక్తస్య కేశిన్యా నలస్య కురునందన ।
హృదయం వ్యథితం చాసీద్ అశ్రుపూర్ణే చ లోచనే ॥ 23
బృహదశ్వుడిలా అన్నాడు - ధర్మజా! కేశిని ఈ విధంగా మాట్లాడిన తర్వాత నలుని హృదయం వ్యథచెంది కళ్లు చెమ్మగిల్లాయి. (23)
స నిగృహ్యాత్మనో దుఃఖం దహ్యమానో మహీపతిః ।
బాష్పసందిగ్దయా వాచా పునరేవేదమబ్రవీత్ ॥ 24
పృథ్వీపతియైన నలుడు, వేదనచే దహింపబడుతున్నా తన దుఃఖాన్ని నిగ్రహించుకొని, బాష్పరుద్ధమైన వాక్కుతో తిరిగి ఇలా పలికాడు. (24)
బాహుక ఉవాచ
వైషమ్యమపి సంప్రాప్ర్తా గోపాయంతి కులస్త్రియః ।
ఆత్మానమాత్మనా సత్యః జితః స్వర్గో న సంశయః ॥ 25
బాహుకుడిలా అన్నాడు. కష్టాలు కలిగిన విషమస్థితిలో కూడ కులస్త్రీలు ఇతరులకు తెలియనీక తమలోనే దాచుకొంటారు. అలాంటివారు స్వర్గాన్ని జయించినట్లే! ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. (25)
రహితా భర్తృభిశ్చాపి న క్రుధ్యంతి కదాచన ।
ప్రాణాంశ్చారిత్రకవచాన్ ధారయంతి వరస్త్రియః ॥ 26
సాధ్వులైన ఉత్తమస్త్రీలు భర్తలు విడనాడిన సమయాల్లో కూడ ఎన్నడునూ కోపాన్ని పొందరు. నడివడి అనే కవచంతోనే ప్రాణాలను రక్షించుకొంటారు. (26)
విషమస్థేన మూఢేన పరిభ్రష్టసుఖేన చ ।
యత్ సా తేన పరిత్యక్తా తత్ర న క్రోద్ధుమర్హతి ॥ 27
సర్వసుఖాలను కోలుపోయి సంకట స్థితిలోనున్న ఆ భర్త భార్యను విడిచిపెట్టి ఉండవచ్చు. అతని విషయంలో కోపగించటం తగినది కాదు. (27)
ప్రాణయాత్రాం పరిప్రేప్సోః శకునైర్హృతవాససః ।
ఆధిభిర్దహ్యమానస్య శ్యామా న క్రోద్ధుమర్హతి ॥ 28
ప్రాణాలు నిలుపుకోవటానికి ప్రయత్నిస్తూ పక్షులచే వస్త్రాలు అపహరింపబడి మనోవ్యధతో ఉన్న ఆ భర్త విషయంలో భార్య కోపగించటం భావ్యం కాదు. (28)
సత్కృతాసత్కృతా వాపి పతిం దృష్ట్వా తథావిధమ్ ।
రాజ్యభ్రష్టం శ్రియా హీనం క్షుధితం వ్యసనాప్లుతమ్ ॥ 29
భర్త తనను గౌరవించినా, గౌరవించకపోయినా రాజ్యభ్రష్టుడైనా, దరిద్రుడైనా, ఆర్తుడైనా వ్యసనపరుడైనా, సరే భార్య అతనిపై కోపాన్ని చూపరాదు. (29)
ఏవం బ్రువాణస్తద్ వాక్యం నలః పరమదుర్మనాః ।
న బాష్పమశకత్ సోఢుం ప్రరురోద చ భారత ॥ 30
ధర్మజా! చెప్పలేనంత దుఃఖంతో కూడిన మనస్సుతో నలుడు ఈ విధంగా మాట్లాడుతూనే కన్నీరు ఆపుకోలేక బావురుమని ఏడ్చాడు. (30)
తతః సా కేశినీ గత్వా దమయంత్యై న్యవేదయత్ ।
తత్ సర్వం కథితం చైవ వికారం తస్య చైవ తమ్ ॥ 31
అదంతా గమనించిన కేశిని అక్కడనుంచి వెళ్ళి అతని చేష్టలతో సహా అక్కడ జరిగినదంతా దమయంతికి తెలియజేసింది. (31)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలకేశినీసంవాదే చతుఃసప్తతితమోఽధ్యాయః ॥ 74 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున నల కేశినీసంవాదమను డెబ్బది నాల్గవ అధ్యాయము. (74)