77. డెబ్బది ఏడవ అధ్యాయము

నలడు నుండి అశ్వవిద్యను గ్రహించి ఋతుపర్ణుడు అయోధ్యకు వెడలుట.

బృహదశ్వ ఉవాచ
అథ తాం వ్యుషితో రాత్రిం నలో రాజా స్వలంకృతః ।
వైదర్భా సహితః కాలే దదర్శ వసుధాధిపమ్ ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు.
రాత్రి గడిచినపిమ్మట మరునాడు నలుడు అలంకరించుకొని దమయంతీసహితుడై తగిన సమయంలో భీమరాజును సందర్శించాడు. (1)
తతోఽభివాదయామాస ప్రయతః శ్వశురం నలః ।
తతోఽను దమయంతీ చ వవందే పితరం శుభా ॥ 2
పుణ్యశ్లోకుడైన నలుడు, మామగారైన భీమరాజునకు నమస్కరించాడు. శుభలక్షణ అయిన దమయంతి కూడ తన తండ్రిగారికి నమస్కరించింది. (2)
తం భీమః ప్రతిజగ్రాహ పుత్రవత్ పరయా ముదా ।
యథార్హం పూజయిత్వా చ సమాశ్వాసయత ప్రభుః ॥ 3
నలేన సహితాం తత్ర దమయంతీం పతివ్రతామ్ ।
భీమరాజు తనపుత్రునివలె అతిసంతోషంతో ఆ నలుని అక్కునజేర్చుకొని తగినవిధంగా గౌరవించి ఊరడించాడు.
నలునితో కూడిన, పతివ్రతయైన తనపుత్రి దమయంతిని కూడ ప్రేమతో భీమరాజు అనునయించాడు. (3 1/2)
తామర్హణాం నలో రాజా ప్రతిగృహ్య యథావిధి ॥ 4
పరిచర్యాం స్వకాం తస్మై యథావత్ ప్రత్యవేదయత్ ।
తతో బభూవ నగరే సుమహాన్ హర్షజః స్వనః ॥ 5
జనస్య సంప్రహృష్టస్య నలం దృష్ట్వా తథాఽఽగతమ్ ।
నలమహారాజు, ఆ సత్కారాలను యథావిధిగా స్వీకరించి మామగారికి కృతజ్ఞతను తెలిపాడు. తిరిగివచ్చిన నలునిచూచి నగరమంతా హర్షధ్వానాలతో నిండింది. ప్రజలంతా నలమహారాజును చూచి సంతోషంతో జయజయధ్వానాలు చేశారు. (4,5 1/2)
అశోభయచ్చ నగరం పతాకాధ్వజమాలినమ్ ॥ 6
సిక్తాః సుమృష్టపుష్పాఢ్యాః రాజమార్గాః స్వలంకృతాః ।
ద్వారి ద్వారి చ పౌరాణాం పుష్పభంగః ప్రకల్పితః ॥ 7
విదర్భరాజు నగరమంతా ధ్వజాలతో పతాకాలతో అలంకరింపజేశాడు. రాజమార్గాలనన్నింటిని చక్కగా ఊడ్చి, అలికి, వాటిపై పూలనలంకరించారు. ప్రతిముంగిటా పౌరులు పూలు చల్లారు. (6,7)
అర్చితాని చ సర్వాణి దేవతాయతనాని చ ।
ఋతుపర్ణోఽసి శుశ్రావ బాహుకచ్ఛద్మినం నలమ్ ॥ 8
దమయంత్యా సమాయుక్తం జహృషే చ నరాధిపః ।
దేవాలయాలన్నింటనూ అర్చనలు జరిగాయి. ఋతుపర్ణమహారాజు బాహుకుని రూపంలోనున్నవాడు నలమహారాజే అని విన్నాడు. నలదమయంతుల సమాగమానికి ఋతుపర్ణడెంతగానో సంతోషించాడు. (8 1/2)
తమానాయ్య నలం రాజా క్షమయామాస పార్థివమ్ ॥ 9
నలమహారాజును రావిమ్చి ఋతుపర్ణుడు ఆదరించాడు. (9)
స చ తం క్షమయామాస హేతుభిర్బిద్ధిసమ్మితః ।
స సత్కృతో మహీపాలః నైషధం విస్మితాననః ॥ 10
ఉవాచ వాక్యం తత్త్వజ్ఞః నైషధం వదతాం వరః ।
బుద్ధిమంతుడైన నలుడునూ, ఋతుపర్ణుని ఆదరించాడు. సత్కృతుడైన ఋతుపర్ణమహారాజు విస్మయంతో నలుని ఉద్దేశించి ఇలా అన్నాడు. (10 1/2)
దిష్ట్యా సమేతో దారైః స్వైః భవానిత్యభ్యనందత ॥ 11
అదృష్టంతో భార్యతో కలిశావు నీవు అని నలుని ఋతుపర్ణుడు అభినందించాడు. (11)
కించిత్ తు నాపరాధం తే కృతవానస్మి నైషధ ।
అజ్ఞాతవాసే వసతః మద్గృహే వసుధాధిప ॥ 12
నిషధరాజా! అజ్ఞాతంగా నాగృహంలో ఉన్నప్పుడు నేను ఏ కొద్దిపాటి అపరాధాన్ని చేయలేదు కదా! (12)
యది వా బుద్ధిపూర్వాణి యది బుద్ధ్యాపి కానిచిత్ ।
మయా కృతాన్యకార్యాణి తాని త్వం క్షంతుమర్హసి ॥ 13
నేను బుద్ధిపూర్వకంగా కాని తెలియక కాని చేయతగని పనులు ఏవైనా చేసి ఉంటే వాటిని క్షమించు - అని ఋతుపర్ణుడు పలికాడు. (13)
నల ఉవాచ
న మేఽపరాధం కృతవాన్ త్వం స్వల్పమపి పార్థివ ।
కృతేఽపి చ న మే కోపః క్షంతవ్యం హి మయా తవ ॥ 14
నలమహారాజు ఇలా అన్నాడు.
రాజా మీరు నాకు ఏ కొంచెం అపరాధాన్ని కూడ చేయలేదు. ఒకవేళ చేసి ఉన్నా నాకు కోపం లేదు - నేను క్షమించి తీరాలి. (14)
పూర్వం హ్యపి సఖా మేఽసి సంబంధీ చ జనాధిప ।
అత ఊర్ధ్వం తు భూయస్త్వం ప్రీతిమాహర్తుమర్హసి ॥ 15
మహారాజా! చిరకాలం నుండి మీరు నాకు మిత్రులు. పైగా మనకు బంధుత్వం కూడ ఉంది.
అందువల్ల మీరు ఇకముందు కూడా మాప్రేమను పొందుటకు తగినవారు. (15)
సర్వకామైః సువిహితైః సుఖమస్మ్యుషితస్త్వయి ।
న తథా స్వగృహే రాజన్ యథా తవ గృహే సదా ॥ 16
మీగృహంలో ఉన్నప్పుడు, నాకోరికలన్నీ తీరే అవకాశం కలిగింది. మీగృహంలో జరిగినట్లుగా, నా గృహంలో కూడ జరుగలేదేమో! (16)
ఇదం చైవ హయజ్ఞానం త్వదీయం మయి తిష్ఠతి ।
తదుపాకర్తుమిచ్ఛామి మన్యసే యది పార్థివ ।
ఏవముక్త్వా దదౌ విద్యామ్ ఋతుపర్ణాయ నైషధః ॥ 17
అశ్వహృదయమనే విజ్ఞాన సంపద నాదగ్గరే ఉంది. మీరు కోరినట్లయితే ఆ అశ్వహృదయవిద్యను మీకు ఉపదేశించాలనుకొంటున్నాను అని ఋతుపర్ణునకు అశ్వహృదయవిద్యను నలమహారాజు ఉపదేశించాడు. (17)
స చ తాం ప్రతిజగ్రాహ విధిదృష్టేన కర్మణా ।
గృహీతా చాశ్వహృదయం రాజన్ భాంగాసురిర్నృపః ॥ 18
నిషధాధిపతేశ్చాపి దత్త్వాక్షహృదయం నృపః ।
సూతమన్యముపాదాయ యయౌ స్వపురమేవ హ ॥ 19
ఋతుపర్ణమహారాజు నలుని వలన అశ్వహృదయవిద్యను యథావిధిగా గ్రహించాడు. తర్వాత నలమహారాజునకు తన చెంతగల అక్షహృదయవిద్యను ఋతుపర్ణుడుపదేశించి, మరొక రథసారథిని తీసికొని అక్కడ నుండి బయలుదేరి తన నగరానికి వెళ్ళాడు. (19)
ఋతుపర్ణే గతే రాజన్ నలో రాజా విశాంపతే ।
నగరే కుండినే కాలం నాతిదీర్ఘమివావసత్ ॥ 20
ఋతుపర్ణుడు వెళ్ళిన తర్వాత నలమహారాజు కూడ కుండిన నగరంలో కొంతకాలం మాత్రమే ఉన్నాడు. (20)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి ఋతుపర్ణస్య స్వదేశగమనే సప్తసప్తతితమోఽధ్యాయః ॥ 77 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున ఋతుపర్ణుని స్వదేశగమనమను డెబ్బదియేడవ అధ్యాయము. (77)