78. డెబ్బది ఎనిమిదవ అధ్యాయము
పుష్కరుని ఓడించి నలుడు నిజనగరమున ప్రవేశించుట.
బృహదశ్వ ఉవాచ
స మాసముష్య కౌంతేయ భీమమామంత్ర్య నైషధః ।
పురాదల్పపరీవారః జగామ నిషధాన్ ప్రతి ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు.
నలుడు ఒక నెల గడిపి భీమరాజు సెలవు తీసికొని కుండినపురం నుండి అల్పపరివారంతో నిషధకు వెళ్ళాడు. (1)
రథేనైకేన శుభ్రేణ దంతిభిః పరిషోడశైః ।
పంచాశద్భిర్హయైశ్చైవ షట్శతైశ్చ పదాతిభిః ॥ 2
ఒకరథం, పదునారు ఏనుగులు, ఏబది గుర్రాలు, ఆరువందల మంది పదాతిదళం మాత్రమే తీసికొని బయలుదేరాడు. (2)
స కంపయన్నివ మహీం త్వరమాణో మహీపతిః ।
ప్రవివేశాథ సంరబ్ధః తరసైవ మహామనాః ॥ 3
గొప్పమనసు గల ఆ మహారాజు భూమిని కంపింప చేస్తున్నంత ఉత్సాహంతో అతిశీఘ్రంగా నగరాన్ని ప్రవేశించాడు. (3)
తతః పుష్కరమాసాద్య వీరసేనసుతో నలః ।
ఉవాచ దీవ్యావ పునః బహువిత్తం మయార్జితమ్ ॥ 4
దమయంతీ చ యచ్చాన్యత్ మమ కించన విద్యతే ।
ఏష వై మమ సన్న్యాసః తవ రాజ్యం తు పుష్కర ॥ 5
పునః ప్రవర్తతాం ద్యూతమ్ ఇతి మే నిశ్చితా మతిః ।
ఏకపాణేన భద్రం తే ప్రాణయోశ్చ పణావహే ॥ 6
వీరసేనుని కుమారుడైన నలుడు, పుష్కరుని చెంతకు వచ్చి తిరిగి జూదమాడుదామంటూ ఇలా అన్నాడు.
నేను చాలా ధనం సంపాదించాను. దమయంతి ఉంది. ఇంకా నా దగ్గర ఏమున్నా అదంతా నా పందెం పుష్కరా! రాజ్యం నీ పందెం. మళ్ళీ జూదమాడాలి. ఇది నా నిర్ణయం. లేదా ఇద్దరమూ ప్రాణాలచే ఒకే పందెంగా పెడదాం. నీకు మేలు జరుగుతుంది. (4-6)
జిత్వా పరస్వమాహృత్య రాజ్యం వా యది వా వసు ।
ప్రతిపాణః ప్రదాతవ్యః పరమో ధర్మ ఉచ్యతే ॥ 7
జయాన్ని పొంది, ఇతరుల సొత్తును గాని, రాజ్యాన్ని గాని తీసికొన్నప్పుడు, ఎదుటి వానికి పందెం వేయటానికి అవకాశాన్ని ఇవ్వాలి. ఇది పరామధర్మంగా చెప్పబడుతోంది. (7)
న చేద్ వాంఛసి త్వ ద్యూతం యుద్ధద్యూతం ప్రవర్తతామ్ ।
ద్వైరథేనాస్తు వై శాంతిః తవ వా మమ వా నృప ॥ 8
పుష్కరా! నీవు జూదాన్ని ఆడటానికి ఇష్టపడకపోతే యుద్ధమనే జూదాన్ని ఆడుదాం! అది కూడ మన ఇరువురకు మధ్యనే జరగాలి. అపుడే నీకు గాని, నాకు గాని శాంతి కలుగుతుంది. (8)
వంశభోజ్యమిదం రాజ్యం అర్థితవ్యం యథా తథా ।
యేన కేనాప్యుపాయేన వృద్ధానామితి శాసనమ్ ॥ 9
ఈ రాజ్యం వంశపారంపర్యంగా అనుభవింపతగింది. అట్టి రాజ్యాన్ని ఏదో ఒక ఉపాయంతో పొందాలనేది పెద్దలశాసనం. (9)
ద్వయో రేకతరే బుద్ధిః క్రియతామద్య పుష్కర ।
కైతవేనాక్షవత్యాం తు యుద్ధే వా నామ్యతాం ధనుః ॥ 10
పుష్కరుడా! పాచికలతో జూదానికి గాని, ధనస్సును వంచి యుద్ధానికి గాని సిద్ధం కమ్ము! (10)
నైషధేనైవముక్తస్తు పుష్కరః ప్రహసన్నివ ।
ధ్రువమాత్మజయమ్ మత్వా ప్రత్యాహ పృథివీపతిమ్ ॥ 11
నలుడీ విధంగా పలుకగా పుష్కరుడు జయము తనదేనని భావించి పరిహసించి, నలరాజుతో ఇలా పలికాడు. (11)
దిష్ట్యా త్వయార్జితం విత్తం ప్రతిపాణాయ నైషధ ।
దిష్ట్యా చ దుష్కృతం కర్మ దమయంత్యాః క్షయం గతమ్ ॥ 12
నైషథా! మళ్ళీ పందెం వేయటానికి తగిన ధనం సంపాదించావు. అది నీఅదృష్టం. అదృష్ట కారణంతోనే దమయంతి కష్టాలు కూడా తీరిపోయాయి. (12)
దిష్ట్యా చ ధ్రియసే రాజన్ సదారోఽద్య మహాభుజ ।
ధనేనానేన వై భైమీ జితేన సమలంకృతా ॥ 13
మాముపస్థాస్యతి వ్యక్తం దివి శక్రమివాప్సరాః ।
నిత్యశో హి స్మరామి త్వాం ప్రతీక్షేఽపి చ నైషధ ॥ 14
నలమహారాజా! మహాభుజా! నీ అదృష్టం కొద్ది దమయంతిలో కలిసి బ్రతికి ఉన్నావు. నీ ధనాన్నంతా నేను గెలిస్తే దమయంతి అలంకరించుకొని స్వర్గంలో అచ్చరలు ఇంద్రుని సేవించినట్టు సేవిస్తుంది. రోజూ నిన్ను తలచుకొంటూ నీకై చూస్తున్నాను. (13,14)
దేవనేన మమ ప్రీతిః న భవత్యసుహృద్గణైః ।
జిత్వా త్వద్య వరారోహం దమయంతీమనిందితామ్ ॥ 15
కృతకృత్యో భవిష్యామి సా హి మే నిత్యశో హృది ।
శత్రువులతో జూదమాడితే నాకు తృప్తి కలగటం లేదు. ఇపుడు నేను నిన్ను జయించి, దమయంతిని స్వీకరిస్తాను. సర్వదా ఆమెయే నా హృదయమందున్నది. ఆమెయే నాకు దక్కితే నేను కృతకృత్యుణ్ణి కాగలను. (15 1/2)
శ్రుత్వా తు తస్య తా వాచః బహ్వబద్ధప్రలాపినః ॥ 16
ఇయేష స శిరశ్ఛేత్తుం ఖడ్గేన కుపితో నలః ।
స్మయంస్తు రోషతామ్రాక్షః తమువాచ నలో నృపః ॥ 17
పుష్కరుని అసత్యప్రలాపాలు విన్న నలునకు అతని శిరస్సును నరికేయాలన్నంత కోపం వచ్చింది. కోపంతో కనులు ఎర్రబడిన నలుడు పుష్కరునితో ఇలా అన్నాడు. (16,17)
పణావః కిం వ్యాహరసే జితో న వ్యాహరిష్యసి ।
తతః ప్రావర్తత ద్యూతం పుష్కరస్య నలస్య చ ॥ 18
ఏకపాణేన వీరేణ నలేన స పరాజితః ।
స రత్నకోశనిచయైః ప్రాణేన పణితోఽపి చ ॥ 19
ఏమి మాట్లాడుతున్నావు? ఓడిపోయిన తర్వాత నీవు మాట్లాడలేవు!
అటుపిమ్మట నలునకు పుష్కరునకు జూదం ప్రారంభమైంది. మొదటి పందెంతోనే వీరుడైన నలునిచే పుష్కరుడు పరాజయం పొందాడు. పుష్కరుడు ఓడిపోవటంతో సమస్తరత్న ధనాగారాలతో సహా ప్రాణం సయితం పందెం పెట్టిన పుష్కరుడు నలునిచేతిలో ఓడిపోయాడు. (18,19)
జిత్వా చ పుష్కరం రాజా ప్రహసన్నిదమబ్రవీత్ ।
మమ సర్వమిదం రాజ్యం అవ్యగ్రం హతకంటకమ్ ॥ 20
వైదర్భీ న త్వయా శక్యా రాజాపసద వీక్షితుమ్ ।
తస్యాస్త్వం సపరీవారః మూఢ దాసత్వమాగతః ॥ 21
పుష్కరుని జయించిన నలమహారాజు పరిహాసంతో ఇలా పలికాడు. 'నిష్కంకటమైన ఈ రాజ్యమంతా నాది. నీవిక దమయంతిని చూడలేవు.
మూఢుడా! సపరివారంగా నీవిపుడు దమయంతికి దాసుడవయ్యావు. (20,21)
న త్వయా తత్ కృతం కర్మ యేనాహం విజితః పురా ।
కలినా తత కృతం కర్మ త్వం చ మూఢ న బుధ్యసే ॥ 22
పూర్వం నీవు నన్ను జయించావన్నది నీపనికాదు. మూర్ఖుడా! అది కలిపురుషకృతమని నీవెరుగవు. (22)
నాహం పరకృతం దోషం త్వయ్యాధాస్యే కథంచన ।
యథాసుఖం వై జీవ త్వం ప్రాణానవసృజామి తే ॥ 23
పుష్కరా! ఇతరులు చేసిన తప్పును నేను నీపై వేయను. నిన్ను ప్రాణాలతో విడచిపెడుతున్నాను. నీవు సుఖంగా జీవించు! (23)
తథైవ సర్వసంభారం స్వమంశం వితరామి తే ।
తథైవ చ మమ ప్రీతిః త్వయి వీర న సంశయః ॥ 24
నా సంపదలో నీకు కూడ కొంతభాగం ఇస్తున్నాను.
వీరుడా! నీపై నాకు ప్రేమ ఉంది. ఈ విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. (24)
సౌహార్దం చాపి మే త్వత్తః న కదాచిత్ ప్రహాస్యతి ।
పుష్కర త్వం హి మే భ్రాతా సంజీవ శరదః శతమ్ ॥ 25
నేను సహృదయత కలవాడను. కనుక నిన్ను ఎప్పుడూ పరిహాసించను. పుష్కరా! నీవు నాఖు సోదరుడవు. సుఖంగా నూరేళ్ళు జీవించు.' (25)
ఏవం నలః సాంత్వయిత్వా భ్రాతరం సత్యవిక్రమః ।
స్వపురం ప్రేషయామాస పరిష్వజ్య పునః పునః ॥ 26
సత్యపరాక్రమశాలియైన నలమహారాజు సోదరుడైన పుష్కరుని ఆ ప్రకారంగా అనునయించి అనేక పర్యాయాలు ఆలింగనం చేసికొని తనపురానికి పంపాడు. (26)
సాంత్వితో నైషధేనైనం పుష్కరః ప్రత్యువాచ తమ్ ।
పుణ్యశ్లోకం తదా రాజన్ అభివాద్య కృతాంజలిః ॥ 27
కీర్తిరస్తు తవాక్షయ్యా జీవ వర్షశతం సుఖీ ।
యో మే వితరసి ప్రాణాన్ అధిష్ఠానం చ పార్థివ ॥ 28
నలమహారాజుచే ఈ విధంగా అనునయింపబడిన పుష్కరుడు పుణ్యశ్లోకుడైన నలచక్రవర్తికి నమస్కరించి ఇలా పలికాడు. 'మహారాజా! నాకు ప్రాణదానం చేసి' నిలువ నీడ చూపిన నీవు తరుగని సత్కీర్తితో నూరేండ్లు సుఖసంతోషాలతో జీవించు. (27,28)
స తథా సత్కృతో రాజ్ఞా మాసముష్య తదా నృప ।
ప్రయయౌ పుష్కరో హృష్టః స్వపురం స్వజనావృతః ॥ 29
తర్వాత నలునిచే సత్కరింపబడిన పుష్కరుడు అచట ఒక నెల రోజుల నుండి సంతుష్టుడై తనవారితో కూడి తన నగరానికి వెళ్ళాడు. (29)
మహత్యా సేనయా సార్ధం వినీతైః పరిచారకైః ।
భ్రాజమాన ఇవాదిత్యః వపుషా పురుషర్షభ ॥ 30
ధర్మజా! అపుడు నలమహారాజు గొప్పసైన్యంతోను విశ్వాసపాత్రులైన పరిచారకులతోను సూర్యుని వలె దేహకాంతితో ప్రకాశించాడు. (30)
ప్రస్థాస్య పుష్కరం రాజా విత్తవంతమనామయమ్ ।
ప్రవివేశ పురం శ్రీమాన్ అత్యర్థముపశోభితామ్ ॥ 31
ధనంతో పుష్కర రాజా విత్తవంతమనామయమ్ ।
ప్రవివేశ పురం శ్రీమాన్ అత్యర్థముపశోభితామ్ ॥ 31
ధనంతో కుశలంగా పుష్కరుని పంపిన పిమ్మట శ్రీమంతుడైన నలమహారాజు అత్యంతశోభాయమానమైన తన నగరాన్ని ప్రవేశించాడు. (31)
ప్రవిశ్య సాంత్వయామాస పౌరాంశ్చ నిషధాధిపః ।
పౌరా జానపదాశ్చాపి సంప్రహృష్టతనూరుహాః ॥ 32
నలమహారాజు నగరప్రవేశం చేసి తనపుర ప్రజలందరిని ఊరడింపజేశాడు. పౌరులు, జానపదులు పట్టరాని సంతోషంతో పులకితశరీరులయ్యారు. (32)
ఊచుః ప్రాంజలయః సర్వే సామాత్యప్రముఖా జనాః ।
అద్య స్మ నిర్వృతా రాజన్ పురే జనపదేఽపి చ ।
ఉపాసితుం పునః ప్రాప్తాః దేవా ఇవ శతక్రతుమ్ ॥ 33
మంత్రిప్రముఖులూ, ప్రజలూ అంజలి ఘటించి ఇలా పలికారు. 'మహారాజా! దేవతలు ఇంద్రుని సేవించినట్లు' మేమంతా మిమ్ము సేవించుకొనటానికి మీరు తిరిగి వచ్చారు. పట్టణవాసులు, జనపదవాసులు కూడ ఇప్పుడు కదా చాలా సంతోషంతో ఉన్నారు. (33)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి పుష్కరపరాభవపూర్వకం రాజ్యప్రత్యానయనే అష్టసప్తతితమోఽధ్యాయః ॥ 78 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున పుష్కరపరాభవపూర్వక రాజ్యప్రత్యానయనమను డెబ్బది ఎనిమిదవ అధ్యాయము. (78)