80. ఎనుబదియవ అధ్యాయము

(తీర్థయాత్రా పర్వము)

అర్జునుని గురించి పాండవుల చింత.

జనమేజయ ఉవాచ
భగవన్ కామ్యకాత్ పార్థే గతే మే ప్రపితామహే ।
పాండవాః కిమకుర్వంస్తే తమృతే సవ్యసాచినమ్ ॥ 1
జనమేజయుడు అడిగాడు. పూజ్యుడా! నాపితామహుడు అర్జునుడు కామ్యకవనాన్ని విడచి తీర్థయాత్రలకు పోయిన తరువాత మిగిలిన పాండవులు ఏమి చేశారు? (1)
వి॥సం॥ యజ్ఞదానాదులు చేసే శక్తి లేనప్పుడు తీర్థయాత్రలు చేయటమే కర్తవ్యం -
ద్వావిమౌ గ్రసతే భూమిః సర్పోబిలశయానివ ।
రాజానం చావిరోద్ధారం దరిద్రం చాప్రవాసినమ్ ॥
(పాము కలుగులోని జంతువులను మ్రింగినట్లు భూమి యుద్ధం చేయని రాజును, యాత్రలు చేయని దరిద్రుని మ్రింగివేస్తుంది.) (నీల)
స హి తేషాం మహేష్వాసః గతిరాసీదనీకజిత్ ।
ఆదిత్యానాం యథా విష్ణు తథైవ ప్రతిభాతి మే ॥ 2
ఎన్నో సేనలపై గెలిచిన అర్జునుడే వారికి దిక్కు. అదితిపుత్రులలో విష్ణువు వంటివాడు పాండవులలో అర్జునుడు. (2)
తేనేంద్రసమవీర్యేణ సంగ్రామేష్వనివర్తినా ।
వినాభూతా వనే వీరాః కథమాసన్ పితామహాః ॥ 3
యుద్ధాలలో వెనుకంజవేయని, ఇంద్రసమ పరాక్రమం గల అర్జునుని సహాయంలేని మిగతా పాండవులు వనాల్లో ఎలా నివసించారు? (3)
వైశంపాయన ఉవాచ
గతే తు పాండవే తాత కామ్యకాత్ సత్యవిక్రమే ।
బభూవః పాండవేయాస్తే దుఃఖశోకపరాయణాః ॥ 4
తండ్రీ! సత్యపరాక్రముడైన అర్జునుడు కామ్యకవనం విడచిపోయాక మిగిలిన పాండవులు దుఃఖంలో మునిగిపోయారు. (4)
ఆక్షిప్తసూత్రా మణయః ఛిన్నపక్షా ఇవ ద్విజాః ।
అప్రీతమనసః సర్వే బభూవురథ పాండవాః ॥ 5
త్రాడు తెగిన మణులవలె, రెక్కలు తెగిన పక్షులవలె మిగిలిన పాండవులు అంతా అసంతుష్టులై ఉన్నారు. (5)
వనం తు తదభూత్ తేన హీనమక్లిష్టకర్మణా ।
కుబేరేణ యథా హీనం వనం చైత్రరథం తథా ॥ 6
సుకరంగా కార్యం చేసే అర్జునుడు లేకపోవడంతో ఆ వనం కుబేరుడు లేని చైత్రరథమే అయింది. (6)
తమృతే తే నరవ్యాఘ్రాః పాండవా జనమేజయ ।
ముదమప్రాప్నువంతో వై కామ్యకే న్యవసంస్తదా ॥ 7
జనమేజయా! అర్జునుని విడచి నరశ్రేష్ఠులైన పాండవులు సంతోషరహితులై కామ్యకవనంలో నివసించారు. (7)
బ్రాహ్మణార్థే పరాక్రాంతాః శుద్ధైర్బాణైర్మహారథాః ।
నిఘ్నంతో భరతశ్రేష్ఠ మేధ్యాన్ బహువిధాన్ మృగాన్ ॥ 8
మహారథులైన ఆ పాండవులు పరిశుద్ధబాణాలతో బ్రాహ్మణులకోసం క్రూరమృగాల్ని సంహరించసాగారు. (8)
నిత్యం హి పురుషవ్యాఘ్రాః వన్యాహారమరిందమాః ।
ఉపాకృత్య ఉపాహృత్య బ్రాహ్మణేభ్యో న్యవేదయన్ ॥ 9
నరశ్రేష్ఠులు, శత్రునాశకులు అయిన వారు నిత్యం బ్రాహ్మణుల కొరకు కందమూలఫలాలను తెచ్చి సమర్పించేవారు. (9)
సర్వే సన్న్యవసంస్తత్ర సోత్కంఠాః పురుషర్షభాః ।
అహృష్టమనసః సర్వే గతే రాజన్ ధనంజయే ॥ 10
జనమేజయా! ధనంజయుడు వెళ్లిన పిమ్మట ఆ శ్రేష్ఠులు ఖిన్నమనస్కులై అర్జునుని కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నారు. (10)
విశేషతస్తు పాంచాలీ స్మరంతీ మధ్యమం పతిమ్ ।
ఉద్విగ్నం పాండవశ్రేష్ఠమ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 11
ప్రత్యేకించి పాంచాలి అర్జునుని తలచుకొంటూ, దుఃఖిస్తూ ఉన్న యుధిష్ఠిరునితో ఇలా పలికింది. (11)
యోఽర్జునేనార్జునస్తుల్యః ద్విబాహుర్బహుబాహునా ।
తమృతే పాండవశ్రేష్ఠ వనం న ప్రతిభాతి మే ॥ 12
రెండు చేతులు గల అర్జునుడు వేయిచేతులు గల కార్తవీర్యార్జునునితో సమానుడు. అతడు లేని ఈ వనం నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు. (12)
శూన్యామివ ప్రపశ్యామి తత్ర తత్ర మహీమిమామ్ ।
బహ్వాశ్చర్యమిదం చాపి వనం కుసుమితద్రుమమ్ ॥ 13
న తథా రమణీయం వై తమృతే సవ్యసాచినమ్ ।
నీలాంబుదసమప్రఖ్యం మత్తమాతంగగామినమ్ ॥ 14
తమృతే పుండరీకాక్షం కాంయకం నాతిభాతి మే ।
యస్య వా ధనుషో ఘోషః శ్రూయతే చాశనిస్వనః ।
న లభే శర్మ వై రాజన్ స్మరంతీ సవ్యసాచినమ్ ॥ 15
నా దృష్టి ప్రసరించినంత మేర ఈవనం పుష్పించిన చెట్ట్లు కలదైనా శూన్యంగా తోస్తోంది. పద్మాల వంటి నేత్రాలు గల అర్జునుడు ఏనుగువలె వలె, నీలమేఘం వలె నడుస్తూ ఉండకపోవడంతో ఈ వనం రమణీయంగా కనపడటం లేదు. రాజా! అర్జునుని ధనుష్టంకారం పిడుగుపాటువలె భయం కలిగించేది. అతడు లేకపోతే నాకు కొంచెమైనా సుఖంలేదు. (13-15)
తథా లాలప్యమానాం తాం నిశమ్య పరవీరహా ।
భీమసేనో మహారాజ ద్రౌపదీమిదమబ్రవీత్ ॥ 16
ఈవిధంగా దుఃఖించే ద్రౌపదిని చూచి శత్రుతాపనుడయిన భీమసేనుడు ఇలా అన్నాడు. (16)
భీమ ఉవాచ
మనః ప్రీతికరం భద్రే యద్ బ్రవీషి సుమధ్యమే ।
తన్మే ప్రీణాతి హృదయమ్ అమృతప్రాశనోపమమ్ ॥ 17
సుందరీ! నీమాటలు ఎంతో ప్రీతికరంగా ఉన్నాయి. నీ పలుకులు నాకు అమృతపానం చేసినంత తృప్తినిచ్చాయి. (17)
యస్య దీర్ఘౌ సమౌ పీనౌ భుజౌ పరిఘసన్నిభౌ ।
మౌర్వీకృతకిణౌ వృత్తౌ ఖడ్గాయుధధనుర్ధరౌ ॥ 18
నిష్కాంగదకృతాపీడౌ పంచశీర్షావివోరగౌ ।
తమృతే పురుషవ్యాఘ్రం నష్టసూర్యమివాంబరమ్ ॥ 19
అర్జునుని చేతులు దీర్ఘాలు, సమానాలు, బలిసినవి, ఘడియల వంటివి, వింటినారి మచ్చలు, బంగారు భుజకీర్తులు కలిగి, గోళాకారం కలవై, ఐదు తలల సర్పంవలె ఉంటాయి. అతడు మనమధ్యలేకపోవటం చేత సూర్యుడు లేని ఆకాశం వలె మనం కాంతి విహీనులం అయినాము. (18,19)
యమాశ్రిత్య మహాబాహుం పాంచాలాః కురవస్తథా ।
సురాణామపి మత్తానాం పృతనాసు న బిభ్యతి ॥ 20
యస్య బాహూ సమాశ్రిత్య వయం సర్వే మహాత్మనః ।
మన్యామహే జితానాజౌ పరాన్ ప్రాప్తాం చ మేదినీమ్ ॥ 21
తమృతే ఫాల్గునం వీరం న లభే కామ్యకే ధృతిమ్ ।
పశ్యామి చ దిశః సర్వాః తిమిరేణావృతా ఇవ ।
అర్జునుని పరాక్రమం వల్లనే పాంచాల, కురుసేనలు దేవసేనలను కూడా ఎదుర్కొనటానికి భయపడవు. అతని బాహుబలంచే మనం శత్రువులను జయించి రాజ్యాన్ని సుస్థిరంగా భావించాం. అతడు లేక మనం ఈ వనంలో ధైర్యాన్ని కోల్పోయాం. నాకు దిక్కులన్నీ అంధకారంలో మునిగినట్లు తోస్తోంది. (20,21 1/2)
తతోఽబ్రవీత్ సాశ్రుకంఠః నకులః పాండునందనః ॥ 22
భీమసేనుని మాటలు విన్న నకులుడు గద్గదస్వరంతో ఇలా పలికాడు. (22)
నకుల ఉవాచ
యస్మిన్ దివ్యాని కర్మాణి కథయంతి రణాజిరే ।
దేవా అపి యుధాం శ్రేష్ఠం తమృతే కా రతిర్వనే ॥ 23
నకులుడు అన్నాడు -
యుద్ధభూమిలో దేవతలంతా అతని దివ్యకర్మలను ప్రశంసిస్తారు. ఆ అర్జునుడు లేకపోతే మనకు ప్రసన్నత ఎలా కలుగుతుంది? (23)
ఉదీచీం యో దిశం గత్వా జిత్వా యుధి మహాబలాన్ ।
గంధర్వముఖ్యాన్ శతశః హయాన్ లేభే మహాద్యుతిః ॥ 24
అర్జునుడు ఉత్తరదిక్కుకు దిగ్విజయానికై పోయి బలశాలులైన గంధర్వులను ఓడించి వందలకొద్దీ గుఱ్ఱాలను మనసేనలో చేర్చాడు. (24)
రాజ్ఞే తిత్తిరికల్మాషాన్ శ్రీమతోఽనిలరంహసః ।
ప్రాదాద్ భ్రాత్రే ప్రియః ప్రేమ్ణా రాజసూయే మహాక్రతౌ ॥ 25
రాజసూయయాగంలో ప్రేమతో తన ప్రియసోదరుడైన ధర్మరాజునకు తిత్తిరి పక్షుల రంగు గల వేగవంతమైన గుఱ్ఱాలను కానుకగా ఇచ్చాడు. (25)
తమృతే భీమధన్వానం భీమాదవరజం వనే ।
కామయే కామ్యకే వాసం నేదానీమమరోపయమ్ ॥ 26
భీముని తమ్ముడూ, భయంకరమైన విలుకాడు, అయిన అర్జునుడు లేకుండా ఈ వనంలో నివసించాలనిపించటం లేదు. (26)
సహదేవ ఉవాచ
యో ధనాని చ కన్యాశ్చ యుధి జిత్వా మహారథః ।
ఆజహార పురా రాజ్ఞే రాజసూయే మహాక్రతౌ ॥ 27
యః సమేతాన్ మృధే జిత్వా యాదవానమితద్యుతిః ।
సుభద్రామాజహారైక వాసుదేవస్య సమ్మతే ॥ 28
సహదేవుడు ఇలా పలికాడు - కన్యాధనాలను యుద్ధంలో గెలిచి రాజసూయయాగంలో ధర్మజునకు కానుకగా ఇచ్చిన మహారథుడు, అర్జునుడు, వాసుదేవుని అంగీకారంతో, యుద్ధవాంఛతో ఎదిరించిన యాద్వులను జయించి సుభద్రను వశం చేసికొన్నాడు. (27,28)
తస్య జిష్ణోర్బృసీం దృష్ట్వా శూన్యామివ నివేశనే ।
హృదయం మే మహారాజ న శామ్యతి కదాచన ॥ 29
వనాదస్మాద్ వివాసం తు రోచయేఽహమరిందమ ।
న హి నస్తమృతే వీరం రమణీయమిదం వనమ్ ॥ 30
మహారాజా! విజయశీలి అయిన అర్జునుని దర్భాసనాన్ని కుటీరంలో చూచి నాహృదయం శాంతిని పొందటంలేదు. శత్రుతాపనుడా! నేనీ వనం నుంచి వేరొకవనానికి వెళ్లాలనుకొంటున్నాను. అర్జునుడు లేకపోతే ఈ వనం సుందరంగా లేదు. (29,30)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి అర్జునానుశోచనే అశీతితమోఽధ్యాయః ॥ 80 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున అర్జునాను శోచనమను ఎనుబదియవ అధ్యాయము. (80)