81. ఎనుబది ఒకటవ అధ్యాయము

యుధిష్ఠిరుని వద్దకు నారదుడు వచ్చి తీర్థయాత్రా ఫలము గురించి తెలుపుట.

వైశంపాయన ఉవాచ
ధనంజయోత్సుకానాం తు భ్రాతౄణాం కృష్ణయా సహ ।
శ్రుత్వా వాక్యాని విమనాః ధర్మరాజోఽప్యజాయత ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు -
ధనంజయునికై తపించే సోదరులను, ద్రౌపదిని చూచి వారి మాటలు విని ధర్మరాజు కూడా మిక్కిలి విమనస్కుడయ్యాడు. (1)
అథాపశ్యన్మహాత్మానం దేవర్షిం తత్ర నారదమ్ ।
దీప్యమానం శ్రియా బ్రాహ్మ్య హుతార్చిషమివానలమ్ ॥ 2
ఇంతలో నారదుడు అక్కడకు వచ్చాడు. అతడు నేయిపోస్తే వెలిగిప్యే అగ్నివలె బ్రాహ్మతేజంతో ప్రకాశిస్తున్నాడు. (2)
తమాగతమభిప్రేక్ష్య భ్రాతృభిః సహ ధర్మరాట్ ।
ప్రత్యుత్థాయ యథాన్యాయం పూజాం చక్రే మహాత్మనే ॥ 3
వచ్చిన నారదుని చూసి ధర్మరాజు అతనికి సోదరులతో గూడి తగిన సత్కారాలను చేశాడు. (3)
స తైః పరివృతః శ్రీమాన్ భ్రాతృభిః కురుసత్తమః ।
విబభావతిదీప్తౌజాః దేవైరివ శతక్రతుః ॥ 4
సోదరులతో కలిసి శ్రీమంతుడైన యుధిష్ఠిరుడు సమస్త దేవతలతో గూడిన ఇంద్రునివలె ప్రకాశించాడు. (4)
యథా చ వేదాన్ సావిత్రీ యాజ్ఞసేనీ తథా పతీన్ ।
న జహౌ ధర్మతః పార్థాన్ మేరుమర్కప్రభా యథా ॥ 5
వేదాలను గాయత్రి వీడనట్లు, మేరుపర్వతాన్ని సూర్యుడు వీడనట్లు యాజ్ఞసేని అయిన ద్రౌపది ధర్మబద్ధమైన తనభర్తలను విడువలేదు. (5)
ప్రతిగృహ్య చ తాం పూజాం నారదో భగవానృషిః ।
ఆశ్వాసయద్ ధర్మసుతం యుక్తరూపమివానఘ ॥ 6
అనఘా! ఆ పూజను గ్రహించి నారదుడు ధర్మజుని తగినవిధంగా ఓదార్చాడు. (6)
ఉవాచ చ మహాత్మానం ధర్మరాజం యుధిష్ఠిరమ్ ।
బ్రూహి ధర్మభృతాం శ్రేష్ఠ కేనార్థః కిం దదాని తే ॥ 7
తరువాత మహాత్ముడైన యుధిష్ఠిరునితో నారదుడు ఇలా పలికాడు. 'ధర్మాత్ములలో శ్రేష్ఠుడా! ఇప్పుడు నీకేది కావాలి? నేను నీకేది ఇమ్మంటావు?' (7)
అథ ధర్మసుతో రాజా ప్రణమ్య భ్రాతృభిః సహ ।
ఉవాచ ప్రాంజలిర్భూత్వా నారదం దేవసమ్మితమ్ ॥ 8
పిమ్మట ధర్మసుతుడు సోదరులతో కలిసి దేవసమానుడైన నారదునికి నమస్కరించి, అంజలించి ఇలా అన్నాడు. (8)
త్వయి తుష్టే మహాభాగ సర్వలోకాభిపూజితే ।
కృతమిత్యేవ మన్యేఽహం ప్రసాదాత్ తవ సువ్రత ॥ 9
'సువ్రతా! నారదమహర్షీ! సమస్తలోకపూజలు అందుకొనే మీరు సంతుష్టులయితే మీదయచే నాకు అన్నీ సంప్రాప్తించినట్లే అని భావిస్తాను. (9)
యది త్వహమనుగ్రాహ్యః భ్రాతృభిః సహితోఽనఘ ।
సందేహం మే మునిశ్రేష్ఠ తత్త్వతశ్ఛేత్తుమర్హసి ॥ 10
సోదరసహితుడవైన నన్ను మీరు అనుగ్రహించాలి అనుకొంటే నాసందేహాన్ని తీర్చండి. (10)
ప్రదక్షిణాం యః కురుతే పృథివీం తీర్థతత్పరః ।
కిం ఫలం తస్య కార్ త్స్న్యేన తద్భవాన్ వక్తుమర్హతి ॥ 11
తీర్థయాత్రలయందు ఆసక్తి కల్గి భూప్రదక్షిణం చేసే వానికి ఎలాంటి ఫలితం వస్తుందో మీరు చెప్పండి.' (11)
నారద ఉవాచ
శృణు రాజన్నవహితః యథా భీష్మేణ ధీమతా ।
పులస్త్యస్య సకాశాద్ వై సర్వమేతదుపశ్రుతమ్ ॥ 12
నారదుడు పలికాడు. సావధానుడవై విను. బుద్ధిమతుడైన భీష్ముడు పులస్త్యమహర్షి నుంచి ఏమి విన్నాడో అది అంతా నీకు వినిపిస్తాను. (12)
పురా భాగీరథీతీరే భీష్మో ధర్మభృతాం వరః ।
పిత్ర్యం వ్రతం సమాస్థాయ న్యవసన్మునిభిః సహ ॥ 13
శుభే దేశే తథా రాజన్ పుణ్యే దేవర్షిసేవితే ।
గంగాద్వారే మహాభాగ దేవగంధర్వసేవితే ॥ 14
పూర్వం గంగాతీరంలో ధర్మశీలుడయిన భీష్ముడు పితృవ్రతం పూని మునులతో నివసించాడు.
చాలాకాలం నాటి మాట. దేవతలు, గంధర్వులు సేవించే గంగాద్వారంలో (హరిద్వారం) భీష్ముడు శ్రాద్ధతర్పణాలు చేయ సంకల్పించి మహర్షులతో కూడి ఉన్నాడు. (13,14)
స పితౄంస్తర్పయామాస దేవాంశ్చ పరమద్యుతిః ।
ఋషీంశ్చ తర్పయామాస విధిదృష్టేన కర్మణా ॥ 15
తేజస్వియైన భీష్ముడు శాస్త్రానుసారం దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు చేశాడు. (15)
కస్యచిత్ త్వథ కాలస్య జపన్నేవ మహాయశాః ।
దదర్శాద్భుతసంకాశం పులస్త్యమృషిసత్తమమ్ ॥ 16
తరువాత కొంతకాలానికి కీర్తిమంతుడయిన భీష్ముడు జపం చేసికొంటూ, తనవద్దకు వచ్చిన తేజశ్శాలి, మునిశ్రేష్ఠుడు అయిన పులస్త్యుని చూశాడు. (16)
స తం దృష్ట్వోగ్రతపసం దీప్యమానమివ శ్రియా ।
ప్రహర్షమతులం లేభే విస్మయం పరమం యయౌ ॥ 17
ఆ తపశ్శాలి పులస్త్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. అది చూచిన భీష్ముడు సాటిలేని ప్రసన్నతను, ఆశ్చర్యాన్ని పొందాడు. (17)
ఉపస్థితం మహాభాగం పూజయామాస భారత ।
భీష్మో ధర్మభృతాం శ్రేష్ఠః విధిదృష్టేన కర్మణా ॥ 18
వచ్చిన పులస్త్యమహర్షిని శాస్త్రోక్తవిధితో భీష్ముడు పూజించాడు. (18)
శిరసా చార్ఘ్యమాదాయ శుచిః ప్రయతమానసః ।
నామ సంకీర్తయామాస తస్మిన బ్రహ్మర్షిసత్తమే ॥ 19
పవిత్రత, ఏకాగ్రచిత్తం గల పులస్త్యునికి సమర్పించిన అర్ఘ్యోదకాన్ని శిరసున దాల్చి భీష్ముడు తనపేరును ఇలా పరిచయం చేసుకొన్నాడు. (19)
భీష్మోఽహమస్మి భద్రం తే దాసోఽస్మి తవ సువ్రత ।
తవ సందర్శనాదేవ ముక్తోఽహం సర్వకిల్బిషైః ॥ 20
సువ్రతా! నేను భీష్ముడు అనేవాడను. మిదాసుడను. మీకు భద్రమగుగాక. మీ దర్శనభాగ్యంచే నాపాపాలన్నీ పోయాయి. (20)
ఏవముక్త్వా మహారాజ భీష్మో ధర్మభృతాం వరః ।
వాగ్యతః ప్రాంజలిర్భూత్వా తూష్ణీమాసీద్ యుధిష్ఠిర ॥ 21
ధనుర్దారులలో శ్రేష్ఠుడైన భీష్ముడు నియమ, స్వాధ్యాయ, వేదోక్త కర్మలచే చిక్కి ఉన్నాడు. అతనిని చూచి పులస్త్యుడు మిక్కిలి ప్రసన్నుడు అయ్యాడు. (22)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి పార్థనారదసంవాదే ఏకాశీతితమోఽధ్యాయః ॥ 81 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున పార్థనారదసంవాదమను ఎనుబది ఒకటవ అధ్యాయము. (81)