84. ఎనుబది నాలుగవ అధ్యాయము
వివిధ తీర్థాల మహిమ.
పులస్త్య ఉవాచ
తతో గచ్ఛేన్మహారాజ ధర్మతీర్థమనుత్తమమ్ ।
యత్ర ధర్మో మహాభాగః తప్తవానుత్తమం తపః ॥ 1
పులస్త్యుడిలా అన్నాడు. పిమ్మట ధర్మతీర్థానికి చేరాలి. అక్కడ ధర్ముడనే తపస్వి గొప్ప తపస్సు చేశాడు. (1)
తేన తీర్థం కృతం పుణ్యం స్వేన నామ్నా చ విశ్రుతమ్ ।
తత్ర స్నాత్వా నరో రాజన్ ధర్మశీలః సమాహితః ॥ 2
ఆసప్తమం కులం చైవ పునీతే నాత్ర సంశయః ।
రాజా! ఆయన పేరుతో ఆ పుణ్యతీర్థం ప్రసిద్ధికెక్కింది. అక్కడ స్నానం చేసి, ఇంద్రియనిగ్రహం కలిగి ఉంటే ఏడుతరాల వరకు తనవంశాన్ని పవిత్రం చేస్తాడు. (2 1/2)
తతో గచ్ఛేత రాజేంద్ర జ్ఞానపావనముత్తమమ్ ॥ 3
అగ్నిష్టోమమవాప్నోతి మునిలోకం చ గచ్ఛతి ।
అక్కడి నుంచి జ్ఞానపావన తీర్థానికి పోవాలి. అక్కడికి చేరడంత్ యాత్రికుడు అగ్నిష్టోమఫలాన్ని పొంది, మునిలోకాన్ని చేరతాడు. (3 1/2)
సౌగంధికవనం రాజన్ తతో గచ్ఛేత మానవః ॥ 4
తరువాత మానవుడు సౌగంధికవనగమనం చెయ్యాలి. (4)
తత్ర బ్రహ్మాదయో దేవాః ఋషయశ్చ తపోధనాః ।
సిద్ధచారణగంధర్వాః కిన్నరాశ్చ మహోరగాః ॥ 5
అక్కడ బ్రహ్మాదిదేవతలు, తపోధనులైన ఋషులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు నివసిస్తారు. (5)
తద్ వనం ప్రవిశన్నేవ సర్వపాపైః ప్రముచ్యతే ।
తతశ్చాపి సరిచ్ర్ఛేష్ఠా నదీనాముత్తమా నదీ ॥ 6
ప్లక్షాద్దేవీ స్రుతా రాజన్ మహాపుణ్యా సరస్వతీ ।
తత్రాభిషేకం కుర్వీత వల్మీకాన్నిఃసృతే జలే ॥ 7
రాజా! ఆ వనంలో ప్రవేశిస్తే చాలు అన్నిపాపాలు పోతాయి. నదులలో శ్రేష్ఠం అయిన సరస్వతీ నది అది పుట్టిన ప్రదేశం. అక్కడ జువ్విచెట్టు నుండి ఆ నది స్రవిస్తుంది. ఆ ప్రదేశంలో పుట్ట నుంచి వచ్చే నీటిలో స్నానం చెయ్యాలి. (6,7)
అర్చయిత్వా పితౄన్ దేవాన్ అశ్వమేధఫలం లభేత్ ।
ఈశానాధ్యుషితం నామ తత్ర తీర్థం సుదుర్లభమ్ ॥ 8
ఆ తీర్థంలో పితరులను, దేవతలను అర్చించి మానవుడు అశ్వమేధఫలాన్ని సాధిస్తాడు. అక్కడి ఈశానాధ్యుషితం అనే తీర్థం మానవులకు దుర్లభం. (8)
షట్సు శమ్యానిపాతేషు వల్మీకాదితి నిశ్చయః ।
కపిలానాం సహస్రం చ వాజిమేధం చ విందతి ॥ 9
తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర దృష్టమేతత్ పురాతనైః ।
నరశ్రేష్ఠా! అక్కడ కనిపించే పుట్టనుండి శమ్యానిపాతాలనే ఆరుతీర్థాలు ఏర్పడ్డాయి. అందులో స్నానమాచరించినయాత్రికుడు అశ్వమేధఫలాన్ని, వేయి కపిలగోవులను దానం చేసిన ఫలాన్ని అందుకొంటాడు. ఇది ప్రాచీనుల దర్శనం. (9 1/2)
సుగందాం శతకుంభాం చ పంచయజ్ఞాం చ భారత ॥ 10
అభిగమ్య నరశ్రేష్ఠ స్వర్గలోకే మహీయతే ।
సుగంధ, శతకుంభ, పంచయజ్ఞ అనే మూడు తీర్థాల్లో మునిగినవాడు స్వర్గాన స్థిరవాసం పొందుతాడు. (10 1/2)
త్రిశూలఖాతం తత్రైవ తీర్థమాసాద్య భారత ॥ 11
తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః ।
గాణపత్యం చ లభతే దేహం త్యక్త్వా న సంశయః ॥ 12
అక్కడ ప్రసిద్ధం త్రిశూలఖాతతీర్థం. అందు మునిగి దేవ, పితరులను ఆరాధిస్తే దేహత్యాగానంతరం గణపతి పదాన్ని పొందటం తథ్యం. (11,12)
తతో గచ్ఛేత రాజేంద్ర దేవ్యాః స్థానం సుదుర్లభమ్ ।
శాకంభరీతి విఖ్యాతా త్రిషు లోకేషు విశ్రుతా ॥ 13
ఆ ప్రదేశం నుంచి దుర్లభమయిన శాకంభరీతీర్థానికి పోవాలి. అక్కడ దేవి ప్రతిష్ఠితమై ఉంది. ఇది ముల్లోకాల్లో ప్రసిద్ధం. (13)
దివ్యం వర్షసహస్రం హి శాకేన కిల సువ్రతా ।
ఆహారం సా కృతవతీ మాసి మాసి నరాధిప ॥ 14
ఋషయోఽభ్యాగతాస్తత్ర దేవ్యా భక్త్యా తపోధనాః ।
ఆతిథ్యం చ కృతం తేషాం శాకేన కిల భారత ॥ 15
ఒక్కొక్క దేవతావర్ష ప్రమాణం ప్రకారం ఒక్కొక్క నెలకు శాకాహారాని గ్రహించి దేవి భక్తితో తపస్సు చేసింది. ఆమె భక్తి ప్రపత్తులను గుర్తించిన ఋషులు అక్కడికి రాగా వారందరికీ శాకంతో అతిథిసత్కార మాచరించింది. (14,15)
తతః శాకంభరీత్యేవ నామ తస్యాః ప్రతిష్ఠితమ్ ।
శాకంభరీం సమాసాద్య బ్రహ్మచారీ సమాహితః ॥ 16
త్రిరాత్రముషితః శాకం భక్షయిత్వా నరః శుచిః ।
శాకాహారస్య యత్ కించిద్ వర్షైర్ద్వాదశభిః కృతమ్ ॥ 17
తత్ ఫలం తస్య భవతి దేవ్యాశ్ఛందేన భారత ।
భారతా! అది మొదలు ఆ తీర్థం శాకంభరీతీర్థం అయింది. శాకంభరీతీర్థానికి చేరి మనుజుడు బ్రహ్మచర్యం, ఏకాగ్రచిత్తం పాటించి మూడురాత్రులు శాకభక్షణం చేస్తే పన్నెండు సంవత్సరాలు శాకాహారవ్రతాన్ని ఆచరించిన ఫలం మూడు రోజులలోనే సొంతం అవుతుంది. దీనికి దేవి అనుగ్రహమే కారణం. (16,17 1/2)
తతో గచ్ఛేత్ సువర్ణాఖ్యం త్రిషు లోకేషు విశ్రుతమ్ ॥ 18
తత్ర విష్ణుః ప్రసాదార్థం రుద్రమారాధయత్ పురా ।
వరాంశ్చ సుబహూన్ లేభే దైవతేషి సుదుర్లభాన్ ॥ 19
అనంతరం ముల్లోకాల్లో ప్రసిద్ధం అయిన సువర్ణక్షేత్రానికి చేరుకోవాలి. పూర్వకాలం భక్తితో విష్ణువు అక్కడ రుద్రుని ఆరాధించి దేవతలకు దుర్లభాలయిన వరాలను పొందాడు. (18,19)
ఉక్తశ్చ త్రిపురఘ్నేన పరితుష్టేన భారత ।
అపి చ త్వం ప్రియతరః లోకే కృష్ణ భవిష్యసి ॥ 20
త్వమ్మఖం చ జగత్ సర్వం భవిష్యతి న సంశయః ।
తత్రాభిగమ్య రాజేంద్ర పూజయిత్వా వృషధ్వజమ్ ॥ 21
అశ్వమేధమవాప్నోతి గాణపత్యం చ విందతి ।
ధూమావతీం తతో గచ్ఛేత్ త్రిరాత్రోపోషితో నరః ॥ 22
మనసా ప్రార్థితాన్ కామాన్ లభతే నాత్ర సంశయః ।
ఆ సమయాన సంతుష్టుడై శివుడు విష్ణువుతో ఇలా అన్నాడు - శ్రీకృష్ణా! నీవు లోకంలో అందరికి నాకంటె ప్రియతముడవు అవుతావు. ప్రపంచంలో నీవే ప్రధానుడవు కాగలవు. సందేహం లేదు. ఈ తీర్థంలో శంకరుని అర్చిస్తే అశ్వమేధఫలం, గణాధిపత్యం దక్కుతుంది. పిమ్మట ధూమావతీతీర్థానికి పోఇ మూడు రాత్రులు ఉపవాసదీక్ష చేస్తే మనస్సుల్ ప్రార్థించిన కోరికలన్నీ తీరుతాయి. ఇది సత్యం. (20-22 1/2)
దేవ్యాస్తు దక్షిణార్ధేన రథావర్తో నరాధిప ॥ 23
తత్రారోహేత ధర్మజ్ఞ శ్రద్ధధానో జితేంద్రియః ।
మహాదేవప్రసాదాద్ధి గచ్ఛేత పరమాం గతిమ్ ॥ 24
రాజా! దేవికి దక్షిణంగా రతావర్తతీర్థం ఉంది. తీర్థయాత్ర అక్కడకు కొనసాగించి జితేంద్రియుడై ఉంటే శివుని అనుగ్రహంతో ఉత్తమగతులను పొందుతాడు. (23,24)
ప్రదక్షిణముపావృత్య గచ్ఛేత భరతర్షభ ।
ధారాం నామ మహాప్రాజ్ఞః సర్వపాపప్రమోచనీమ్ ॥ 25
భరతర్షభా! తరువాత మహాప్రాజ్ఞుడు ప్రదక్షిణం చేసి ధారాతీర్థానికి చేరితే పాపాలన్నీ తొలగిపోతాయి. (25)
తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర న శోచతి నరాధిప ।
రాజా! ఇక్కడ స్నానం చేసిన వానికి దుఃఖమే కలుగదు. (25 1/2)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ నమస్కృత్య మహాగిరిమ్ ॥ 26
స్వర్గద్వారేణ యత్ తుల్యం గంగాద్వారం న సంశయః ।
తత్రాభిషేకం కుర్వీత కోటితీర్థే సమాహితః ॥ 27
ఆ ప్రదేశాన్నుంచి మహాగిరియైన హిమాలయానికి నమస్కరించి హరిద్వారయాత్ర సాగించిన యాత్రికుడు స్వర్గయాత్ర చేసినట్లే. అక్కడ స్నానం చేస్తే కోటితీర్థాలలో స్నానం ఆచరించినట్లే. (26,27)
పుండరీకమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్ ।
ఉష్యైకాం రజనీం తత్ర గోసహస్రఫలం లభేత్ ॥ 28
ఈవిధంగ్ ఆచరించిన మానవుడు పుండరీకయాగఫలాన్ని పొంది వంశోద్ధరణం చేస్తాడు. ఆ తీర్థాన ఒకరాత్రి వసించి వేయి గోవుల దానఫలాన్ని పొందుతాడు. (28)
సప్తగంగే త్రిగంగే చ శక్రావర్తే చ తర్పయన్ ।
దేవాన్ పితౄంశ్చ విధివత్ పుణ్యే లోకే మహీయతే ॥ 29
సప్తగంగ, త్రిగంగ, శక్రావర్త తీర్థాల్లో మునిగి నియమంతో విధిగా పితరులను, దేవతలను అర్చిస్తే పుణ్యలోకాలను చేరతాడు. (29)
తతః కనఖలే స్నాత్వా త్రిరాత్రోపోషితో నరః ।
అశ్వమేధమవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి ॥ 30
అనంతరం ఖనకల తీర్థాన మునిగి మూడురాత్రులు ఉపవాసం చేసిన నరుడు ముందు అశ్వమేధఫలాన్ని, క్రమంగా స్వర్గాన్ని అందుకొంటాడు. (30)
కపిలావటం తతో గచ్ఛేత్ తీర్థసేవీ నరాధిప ।
ఉపోష్య రజనీం తత్ర గోసహస్రఫలం లభేత్ ॥ 31
రాజా! తీర్థయాత్రను సాగిస్తూ కపిలావట తీర్థానికి చేరాలి. అక్కడ ఒక్క రాత్రి నివాసంతో గోసహస్ర దానఫలానికి అర్హుడు అవుతాడు. (31)
నాగరాజస్య రాజేంద్ర కపిలస్య మహాత్మనః ।
తీర్థం కురువరశ్రేష్ఠ సర్వలోకేషు విశ్రుతమ్ ॥ 32
రాజేంద్రా! అక్కడే నాగరాజైన కపిలుని తీర్థం ఉంది. అది ముల్లోకాల్లో సుప్రసిద్ధం. (32)
తత్రాభిషేకం కుర్వీత నాగతీర్థే నరాధిప ।
కపిలానాం సహస్రస్య ఫలం విందతి మానవః ॥ 33
రాజా! నాగతీర్థాన స్నానం చేసిన యాత్రికుడు వేయి కపిలగోవులను దానం చేసిన ఫలాన్ని అనుభవిస్తాడు. (33)
తతో లలితకం గచ్ఛేత్ శాంతనోస్తీర్థముత్తమమ్ ।
తత్ర స్నాత్వా నరో రాజన్ న దుర్గతిమవాప్నుయాత్ ॥ 34
రాజా! అక్కడ నుంచి శాంతనునామంతో ప్రసిద్ధం అయిన లలితక తీర్థానికి సాగాలి. ఆ తీర్థాన స్నానం చేసినవాడు ఎన్నడూ దుర్గతిని పొందడు. (34)
గంగాయమునయోర్మధ్యే స్నాతి యః సంగమే నరః ।
దశాశ్వమేధానాప్నోతి కులం చైవ సముద్ధరేత్ ॥ 35
గంగాయమునల సంగమతీర్థం ప్రయాగలో మునిగితే పది అశ్వమేధయాగాల ఫలం వస్తుంది. వంశాన్ని తరింపచేసుకొంటాడు. (35)
తతో గచ్ఛేత రాజేంద్ర సుగంధాం లోకవిశ్రుతామ్ ।
సర్వపాపవిశుద్ధాత్మా బ్రహ్మలోకే మహీయతే ॥ 36
ఆ ప్రదేశం నుంచి లోకప్రసిద్ధమైన సుగంధ తీర్థం చేరి, పాపాలన్నీ పోగొట్టుకొని బ్రహ్మలోకాన్ని చేరుకొంటాడు. (36)
రుద్రావర్తం తతో గచ్ఛేత్ తీర్థసేవీ నరాధిప ।
తత్ర స్నాత్వా నరో రాజన్ స్వర్గలోకం చ గచ్ఛతి ॥ 37
రాజా! తీర్థయాత్రికుడు రుద్రావర్తాన్ని చేరి మునుకలాడితే స్వర్గలోకాన్ని సాధిస్తాడు. (37)
గంగాయాశ్చ నరశ్రేష్ఠ సరస్వత్యాశ్చ సంగమే ।
స్నాత్వాశ్వమేధం ప్రాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి ॥ 38
నరోత్తమా! గంగాసరస్వతీసంగమతీర్థంలో స్నానమాచరించి అశ్వమేధఫలాన్ని ముందుగా పొంది, పిదప స్వర్గాన్ని చేరతాడు. (38)
భద్రకర్ణేశ్వరం గత్వా దేవమర్చ్య యథావిధి ।
న దుర్గతిమవాప్నోతి నాకపృష్ఠే చ పూజ్యతే ॥ 39
ఆ తీర్థం నుంచి భద్రకర్ణేశ్వరుని వద్దకు పోయి యథావిధిగా పూజ సల్పితే దుర్గతులను పొందక స్వర్గంలో పూజింపబడతాడు. (39)
తతః కుంజామ్రకం గచ్ఛేత్ తీర్థసేవీ నరాధిప ।
గోసహస్రమవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి ॥ 40
రాజా! తరువాత కుంజామ్రకతీర్థం చేరి, స్నానం చేసి, గోసహస్రం దానంచేసిన ఫలాన్ని, స్వర్గాన్నీ పొందుతాడు. (40)
అరుంధతీవటం గచ్ఛేత్ తీర్థసేవీ నరాధిప ।
సాముద్రకముపస్పృశ్య బ్ర్రహ్మచారీ సమాహితః ॥ 41
అశ్వమేధమవాప్నోతి త్రిరాత్రేణోషితో నరః ।
గోసహస్రఫలం విద్యాత్ కులం చైవ సముద్ధరేత్ ॥ 42
అరుంధతీవటానికి పోయి సాముద్రక తీర్థస్నానం ఆచరిస్తే మూడురాత్రులు బ్రహ్మచర్యం, ఏకాగ్రచిత్తం అనుసరిస్తే అశ్వమేధ ఫలాన్ని, వేయిగోవుల దానఫలాన్ని, వంశోద్ధరణాన్ని సాధించుకొంటాడు. (41,42)
బ్రహ్మావర్తం తతో గచ్ఛేద్ బ్రహ్మచారీ సమాహితః ।
అశ్వమేధమవాప్నోతి సోమలోకం చ గచ్ఛతి ॥ 43
ఆ తీర్థం నుంచి బ్రహ్మావర్తతీర్థానికి యాత్ర కొనసాగించి బ్రహ్మచర్యం, ఏకాగ్రత పాటిస్తే అశ్వమేధఫలాన్ని పొంది చంద్రలోకాన్ని చేరుతాడు. (43)
యమునాప్రభవం గత్వా సముపస్పృశ్య యామునమ్ ।
అశ్వమేధఫలం లబ్ధ్వా స్వర్గలోకే మహీయతే ॥ 44
యమునా ప్రభవ ప్రదేశానికి చేరి యమునాతీర్థాన స్నానం చేస్తే అశ్వమేధఫలాన్ని సాధించి స్వర్గంలో స్థిరంగా ఉంటాడు. (44)
దర్వీసంక్రమణం ప్రాప్య తీర్థం త్రైలోక్యపూజితమ్ ।
అశ్వమేధమవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి ॥ 45
త్రిలోకప్రసిద్ధమయిన దర్వీ సంక్రమణ తీర్థాన్ని చేరితేనే అశ్వమేధ ఫలాన్ని, స్వర్గనివాసాన్ని సాధిస్తాడు. (45)
సింధోశ్చ ప్రభవం గత్వా సిద్ధగంధర్వసేవితమ్ ।
తత్రోష్య రజనీః పంచ విందేద్ బహుసువర్ణకమ్ ॥ 46
సిద్ధగంధర్వసేవితమైన సింధునది పుట్టిన ప్రదేశంలో ఐదు రోజులు ఉపవాసం చేస్తే బంగారు రాశిని ఫలంగా అందుకొంటాడు. (46)
అథ వేదీం సమాసాద్య నరః పరమదుర్గమామ్ ।
అశ్వమేధమవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి ॥ 47
తరువాత చొరశక్యంగాని వేదీతీర్థసేవనం చెయ్యాలి. దానివలన అశ్వమేధ యాగాచర్ణఫలాన్ని ముందుపొంది స్వర్గఫలాన్ని కూడ అనుభవిస్తాడు. (47)
ఋషికుల్యాం సమాసాద్య వాసిష్ఠం చైవ భారత ।
వాసిష్ఠీం సమతిక్రమ్య సర్వే వర్ణా ద్విజాతయః ॥ 48
భారతా! ఋషికుల్య తీర్థాన్ని, వాసిష్ఠతీర్థాన్ని సేవిస్తే, స్నానం ఆచరిస్తే వాసిష్ఠాన్ని దాటిన వారంతా ద్విజులు (బ్రాహ్మణులు) అవుతారు. (48)
ఋషికుల్యాం సమాసాద్య నరః స్నాత్వా వికల్మషః ।
దేవాన్ పితౄంశ్చార్చయిత్వా ఋషిలోకం ప్రపద్యతే ॥ 49
ఋషికుల్యలో స్నానం చేస్తే పాపదూరుడై పితరులను, దేవతలను అర్చించి ఋషిలోకాన్ని చేరి సుఖిస్తాడు. (49)
యది తత్ర వసేన్మాసం శాకాహారో నరాధిప ।
భృగుతుంగం సమాసాద్య వాజిమేధఫలం లభేత్ ॥ 50
రాజా! భృగుతుంగతీర్థాన శాకాహారియై ఒకనెలపాటు నివాసం ఉంటే అశ్వమేధఫలం పొందుతాడు. (50)
గత్వా వీరప్రమోక్షం చ సర్వపాపైః ప్రముచ్యతే ।
కృత్తికామఘయోశ్చైవ తీర్థమసాద్య భారత ॥ 51
అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలమాప్నోతి మానవః ।
తత్ర సంధ్యాం సమాసాద్య విద్యాతీర్థమనుత్తమమ్ ॥ 52
ఉపస్పృశ్య చ వై విద్యాం యత్ర తత్రోపపద్యతే ।
మహాశ్రమే వసేద్ రాత్రిం సర్వపాపప్రమోచనే ॥ 53
ఏకకాలం నిరాహారః లోకానావసతే శుభాన్ ।
భారతా! వీరమోక్షక్షేత్రానికి పోయినంతనే పాపాలు తొలగిపోతాయి. కృత్తికా, మఘా తీర్థాలను చేరిన మానవుడు అగ్నిష్టోమాతిరాత్రయాగాల ఫలాన్ని పొందుతాడు. ప్రాతః సంధ్యలో విద్యాతీర్థాన స్నానం ఆచరిస్తే ఏవిద్యనైనా ఎక్కడైనా పొందగలడు. పాపాలను తొలగించగల మహాశ్రమ తీర్థంలో ఒక్కసారి ఉపవాసం చేసి ఒకరాత్రి నివసిస్తే శుభలోకాలను చేరుకోగలడు. (51-53 1/2)
షష్ఠకాలోపవాసేన మాసముష్య మహాలయే ॥ 54
సర్వపాపవిశుద్ధాత్మా విందేద్ బహుసువర్ణకమ్ ।
దశాపరాన్ దశ పూర్వాన్ నరానుద్ధరతే కులమ్ ॥ 55
ప్రతిరోజూ ఆరవసమయం ప్రదోషం వరకు ఉపవాసంతో నెలరోజులు మహాలయ తీర్థంలో నివసిస్తే అన్ని పాపాలు తొలగి బహుసువర్ణ రాశిని పొందుతాడు. పదితరాలు ముందు, పది తరాలు వెనుక ఉద్ధరిస్తాడు. (54,55)
అథ వేతసికాం గత్వా పితామహనిషేవితామ్ ।
అశ్వమేధమవాప్నోతి గచ్ఛేదౌశనసీం గతిమ్ ॥ 56
పిమ్మట బ్రహ్మచే సేవింపబడిన వేతసిక తీర్థానికి పోయినవాడు అశ్వమేధ ఫలాన్ని, శుక్రలోకాన్ని వశపరచుకొంటాడు. (56)
అథ సుందరికాతీర్థం ప్రాప్య సిద్ధనిషేవితమ్ ।
రూపస్య భాగీ భవతి దృష్టమేతత్ పురాతనైః ॥ 57
సిద్ధసేవితమైన సుందరికాతీర్థానికి చేరిన మనుజుడు రూపవంతుడు అవుతాడు అని ప్రాచీన ఋషులు చెప్పారు. (57)
తతో వై బ్రాహ్మణీం గత్వా బ్రహ్మచారీ జితేంద్రియః ।
పద్మవర్ణేన యానేన బ్రహ్మలోకం ప్రపద్యతే ॥ 58
బ్రహ్మచారి, జితేంద్రియుడు అయి బ్రాహ్మణీతీర్థానికి పోయిన యాత్రికుడు కమలకాంతి గల విమానంలో బ్రహ్మలోకానికి చేరి సుఖిస్తాడు. (58)
తతస్తు నైమిషం గచ్ఛేత్ పుణ్యం సిద్ధనిషేవితమ్ ।
తత్ర నిత్యం నివసతి బ్రహ్మా దేవగణైః సహ ॥ 59
తరువాత సిద్ధ గంధర్వసేవితమైన నైమిశానికి పోవాలి. అక్కడ దేవతలు, బ్రహ్మ కలిసి నిత్యమూ నివాసం ఉంటారు. (59)
నైమిషం మృగయానస్య పాపస్యార్ధం ప్రణశ్యతి ।
ప్రవిష్టమాత్రస్తు నరః సర్వపాపైః ప్రముచ్యతే ॥ 60
నైమిశక్షేత్రాన్ని వెదకుతూ నరుడు సగం పాపం పోగొట్టుకొని, అందులో ప్రవేశించి సర్వపాపరాశి నుంచి విముక్తుడు అవుతాడు. (60)
తత్ర మాసం వసేద్ ధీరః నైమిషే తీర్థతత్పరః ।
పృథివ్యాం యాని తీర్థాని తాని తీర్థాని నైమిషే ॥ 61
ధీరుడైన యాత్రికుడు తీర్థసేవనాసక్తి కలిగి ఒకనెల నైమిశ క్షేత్రాన నివసించాలి. భూమిపై ఎన్నితీర్థాలు ఉన్నాయో అవన్నీ నైమిశాన ఉన్నాయి. (61)
కృతాభిషేకస్తత్రైవ నియతో నియతాశనః ।
గవాం మేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి భారత ॥ 62
నైమిశా తీర్థాన మితాహారి, జితేంద్రియుడు అయి స్నానాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగాచరా ఫలాన్ని అందుకొంటాడు. (62)
పునాత్యాసప్తమం చైవ కులం భరతసత్తమ ।
యస్త్యజేన్నైమిషే ప్రాణాన్ ఉపవాసపరాయణః ॥ 63
స మోదేత్ సర్వలోకేషు ఏవమాహుర్మనీషిణః ।
నిత్యం మేధ్యం చ పుణ్యం చ నైమిషం నృపసత్తమ ॥ 64
భరతసత్తమా! తన కులపురుషులను ఏడు తరాలపాటు ఉద్ధరించి ఉపవాసదీక్షతో నైమిశంలో ప్రాణాలు విడిస్తే అన్నిలోకాల్లో ఆనందాన్ని అనుభవిస్తాడని విద్వాంసులు చెప్పారు. నైమిశతీర్థం నిత్యం, పవిత్రం, పుణ్యజనకం కూడ. (63,64)
గంగోద్భేదం సమాసాద్య త్రిరాత్రోపోషితో నరః ।
వాజపేయమవాప్నోతి బ్రహ్మభూతో భవేత్ సదా ॥ 65
గంగోద్భేదంలో తీర్థమాడి మూడురాత్రులు ఉపవాసదీక్ష చేస్తే వాజపేయ యాగఫలాన్ని అనుభవించి బ్రహ్మభూతుడు అవుతాడు. (65)
సరస్వతీం సమాసాద్య తర్పయేత్ పితృదేవతాః ।
సారస్వతేషు లోకేషు మోదతే నాత్ర సంశయః ॥ 66
సరస్వతీ తీర్థాన్ని ఆశ్రయించి, స్నాన పరిశుద్ధుడై పితరులను, దేవతలను అర్చిస్తే యాత్రికుడు సారస్వత లోకాలకు పోతాడు ఇది యథార్థం. (66)
తతశ్చ బాహుదాం గచ్ఛేద్ బ్రహ్మచారీ సమాహితః ।
తత్రోష్య రజనీమేకాం స్వర్గలోకే మహీయతే ॥ 67
దేవసత్రస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి కౌరవ ।
కౌరవా! పిమ్మట బాహుదా తీర్థాన్ని చేరి జితేంద్రియుడై ఒక రాత్రి ఉంటే స్వర్గలోకాన్ని చేరతాడు. దేవతల సత్ర యాగఫలాన్ని సొంతం చేసుకొంటాడు. (67 1/2)
తతః క్షీరవతీం గచ్ఛేత్ పుణ్యాం పుణ్యతరైర్వృతామ్ ॥ 68
పితృదేవార్చనపరః వాజపేయమవాప్నుయాత్ ।
పుణ్యాత్ములు ఆశ్రయించిన క్షీరవతీ తీర్థాన స్నానమాచరించి దేవతలను, పితరులను పూజించినవాడు వాజపేయఫలితాన్ని పొందుతాడు. (68 1/2)
విమలాశోకమాసాద్య బ్రహ్మచారీ సమాహితః ॥ 69
తత్రోష్య రజనీమేకాం స్వర్గలోకే మహీయతే ।
విమలాశోక తీర్థసేవనం చేసి బ్రహ్మచర్యంతో, ఏకాగ్రచిత్తంతో ఒకరాత్రి గడిపితే స్వర్గలోకంలో స్థిరంగా ఉంటాడు. (69 1/2)
గోప్రతారం తతో గచ్ఛేత్ సరయ్వాస్తీర్థముత్తమమ్ ॥ 70
యత్ర రామో గతః స్వర్గం సబృత్యబలవాహనః ।
స చ వీరో మహారాజ తస్య తీర్థస్య తేజసా ॥ 71
మహారాజా! ఆ ప్రదేశం సరయూనదీ తీర్థాల్లో ఉత్తమం అయిన గోప్రతారం చేరుకోవాలి. అక్కడే శ్రీరామచంద్రుడు తనబలగంతో, సేవకులతో, వాహనాలతో స్వర్గం చేరి తన నిత్యనివాసంలో తీర్థప్రభావంతో ప్రకాశిస్తున్నాడు. (70,71)
రామస్య చ ప్రసాదేన వ్యవసాయాచ్చ భారత ।
తస్మింస్తీర్థే నరః స్నాత్వా గోప్రతారే నరాధిప ॥ 72
సర్వపాపవిశుద్ధాత్మా స్వర్గలోకే మహీయతే ।
రాజా! సరయూ తీర్థశ్రేష్ఠమైన గోప్రతారం చేరి, స్నానమాచరిస్తే శ్రీరాముని అనుగ్రహం వలన తన ప్రయత్నం వలన సర్వపాపవిముక్తుడై స్వర్గంలో పూజింపబడతాడు. (72 1/2)
రామతీర్థే నరః స్నాత్వా గోమత్యాం కురునందన ॥ 73
అశ్వమేధమవాప్నోతి పునాతి చ కులం నరః ।
కురునందనా! గోమతీ తీరంలోని శ్రీరామతీర్థంలో స్నానం చేసిన యాత్రికుడు అశ్వమేధఫలం, వంశోద్ధరణం పొందుతాడు. (73 1/2)
శతసాహస్రకం తీర్థం తత్రైవ భరతర్షభ ॥ 74
తత్రోపస్పర్శనం కృత్వా నియతో నియతాశనః ।
గోసహస్రఫలం పుణ్యం ప్రాప్నోతి భరతర్షభ ॥ 75
భరతర్షభా! అక్కడే శతసాహస్రక తీర్థం ఉంది. అందులో స్నానం చేసి మితాహారి, జితేంద్రియుడు అయి ఉంటే సహస్ర గోదానపుణ్యం పొందుతాడు. (74,75)
తతో గచ్ఛేత రాజేంద్ర భర్తృస్థానమనుత్తమమ్ ।
అశ్వమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః ॥ 76
రాజేంద్రా! తరువాత ప్రసిద్ధమైన భర్తృస్థానతీర్థాన్ని సేవించాలి. అక్కడకి చేరడంతో అశ్వమేధయాగఫలం వస్తుంది. (76)
కోటితీర్థే నరః స్నాత్వా అర్చయిత్వా గుహం నృప ।
గోసహస్రఫలం విద్యాత్ తేజస్వీ చ భవేన్నరః ॥ 77
రాజా! కోటితీర్థంలో జలంలో మునిగి కార్తికేయుని పూజిస్తే సహస్రగోదాన పలం పొంది, తేజోవంతుడు అయితీరుతాడు. (77)
తతో వారాణసీం గత్వా అర్చయిత్వా వృషధ్వజమ్ ।
కపిలాహ్రదే నరః స్నాత్వా రాజసూయమవాప్నుయాత్ ॥ 78
పిమ్మట కాశీతీర్థాన శంకరుని అర్చించి కపిలాహ్రదతీర్థంలో నీటమునిగి రాజసూయ యజ్ఞాచరణఫలాన్ని పొందుతాడు. (78)
అవిముక్తం సమాసాద్య తీర్థసేవీ కురూద్వహ ।
దర్శనాద్ దేవదేవస్య ముచ్యతే బ్రహ్మహత్యయా ॥ 79
ప్రాణానుత్సృజ్య తత్రైవ మోక్షం ప్రాప్నోతి మానవః ।
కురూద్వహా! తీర్థయాత్రికుడు అవిముక్త తీర్థాన దేవదేవుడైన శివుని దర్శనంతోనే బ్రహ్మహత్యా పాతకాన్నైనా పోగొట్టుకోగలడు. అక్కడ ప్రాణాలను విడిచిన నరుడు ముక్తిని పొందుతాడు. (79 1/2)
మార్కండేయస్య రాజేంద్ర తీర్థమాసాద్య దుర్లభమ్ ॥ 80
గోమతీగంగయోశ్చైవ సంగమే లోకవిశ్రుతే ।
అగ్నిష్టోమమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్ ॥ 81
రాజేంద్రా! గోమతీ గంగా సంగమంలో ప్రసిద్ధిని పొందిన మార్కండేయతీర్థం ఉంది. ఆ తీర్థసేవనం చేస్తే అగ్నిష్టోమ యాగఫలాన్ని కైవసమ్ చేసుకొని వంశోద్ధరణం చేస్తాడు. (80,81)
తతో గయాం సమాసాద్య బ్రహ్మచారీ సమాహితః ।
అశ్వమేధమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్ ॥ 82
అక్కడి నుంచి గయకు పోయి జితేంద్రియుడై ఉంటే అశ్వమేధయాగఫలాన్ని, వంశోద్ధరణను పొందుతాడు. (82)
తత్రాక్షయవటో నామ త్రిషు లోకేషు విశ్రుతః ।
తత్ర దత్తం పితృభ్యస్తు భవత్యక్షయముచ్యతే ॥ 83
అక్కడ ప్రసిద్ధమైన అక్షయవట తీర్థం ఉంది. అక్కడ పితరులకిచ్చే ద్రవ్యాలు అక్షయాలు అవుతాయి. (83)
మహానద్యాముపస్పృశ్య తర్పయేత్ పితృదేవతాః ।
అక్షయాన్ ప్రాప్నుయాల్లోకాన్ కులం చైవ సముద్ధరేత్ ॥ 84
మహానదిలో మునిగి పితరులకు తర్పణాలిస్తే అక్షయలోకాన్ని పొందడమే కాక వంశాన్ని ఉద్ధరిస్తాడు. (84)
తత్ బ్రహ్మసరో గత్వా ధర్మారణ్యోపశోభితమ్ ।
బ్రహ్మలోకమవాప్నోతి ప్రభాతమేవ శర్వరీమ్ ॥ 85
తరువాత ధర్మారణ్యంచే ప్రకాశించే బ్రహ్మసరోవరానికి యాత్ర సాగించి ఒకరాత్రి అంతా నివసిస్తే బ్రహ్మలోకాన్ని తప్పక చేరతాడు. (85)
బ్రహ్మణా తత్ర సరసి యూపశ్రేష్ఠః సముచ్ఛ్రితః ।
యూపం ప్రదక్షిణం కృత్వా వాజపేయఫలం లభేత్ ॥ 86
బ్రహ్మ ఆ సరస్సులో ఒక గొప్ప స్తంభాన్ని పాతించాడు. ఆ స్తంభానికి ప్రదక్షిణ గావించిన నరుడు వాజపేయ యాగఫలాన్ని పొందుతాడు. (86)
తతో గచ్ఛేత రాజేంద్ర ధేనుకం లోకవిశ్రుతమ్ ।
ఏకరాత్రోషితో రాజన్ ప్రయచ్ఛేత్ తిలధేనుకామ్ ॥ 87
సర్వపాపవిశుద్ధాత్మా సోమలోకం వ్రజేద్ ధ్రువమ్ ।
రాజేంద్రా! అక్కడి నుంచి ప్రసిద్ధమైన ధేనుక తీర్థం చేరాలి. ఒక రాత్రి ఆ ప్రదేశంలో ఉపవాసం చేసి తిలగోవుని దానం చేస్తే పాపాలన్నీ తొలగి నిశ్చయంగా సోమలోకం ప్రవేశిస్తాడు. (87 1/2)
తత్ర చిహ్నం మహద్ రాజన్ అద్యాపి సుమహద్ భృశమ్ ॥ 88
కపిలాయాః సవత్సాయాః చరంత్యాః పర్వతే కృతమ్ ।
సవత్సాయాః పదాని స్మ దృశ్యంతేఽద్యాపి భారత ॥ 89
భారతా! అక్కడ దూడతో కూడి పర్వతం మీద చరించే కపిల గోవు పాదచిహ్నాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. (88,89)
తేషూపస్పృశ్య రాజేంద్ర పదేషు నృపసత్తమ ।
యత్ కించిదశుభం కర్మ తత్ ప్రణశ్యతి భారత ॥ 90
రాజేంద్రా! ఆ పాదచిహ్నాలను తాకితే అశుభకర్మఫలాలన్నీ నశిస్తాయి. (90)
తతో గృధ్రవటం గచ్చేత్ స్థానం దేవస్య ధీమతః ।
స్నాయీత భస్మనా తత్ర అభిగమ్య వృషధ్వజమ్ ॥ 91
పిమ్మట మహాదేవుని గృధవట తీర్థాన్ని ఆశ్రయించి, శంకరుని సమీపానికి పోయి, అక్కడ విభూతితో స్నానం చేయాలి. (91)
బ్రాహ్మణేన భవేచ్చీర్ణం వ్రతం ద్వాదశవార్షికమ్ ।
ఇతరేషాం తు వర్ణానాం సర్వపాపం ప్రణశ్యతి ॥ 92
బ్రాహ్మణుడు అక్కడకు చేరితే పన్నెండు సంవత్సరాలు వ్రతపాలన చేసినట్లు అవుతుంది. ఇతర వర్ణాల పాపమంతా పోతుంది. (92)
ఉద్యంతం చ తతో గచ్ఛేత్ పర్వతం గీతనాదితమ్ ।
సావిత్ర్యాస్తు పదం తత్ర దృశ్యతే భరతర్షభ ॥ 93
భరతర్షభా! అనంతరం సంగీతధ్వని మ్రోగే ఉదయపర్వతానికి పోతే సావిత్రి చరణాల గుర్తులు గల ప్రదేశాలు కనిపిస్తాయి. (93)
తత్ర సంధ్యాముపాసీత బ్రాహ్మణః సంశితవ్రతః ।
తేన హ్యుపాస్తా భవతి సంధ్యా ద్వాదశవార్షికీ ॥ 94
ఉత్తమవ్రతపాలన చేసే బ్రాహ్మణుడు అక్కడ సంధ్యోపాసన చేయడం ద్వారా పన్నెండు సంవత్సరాల సంధ్యోపాసనాఫలాన్ని గ్రహిస్తాడు. (94)
యోనిద్వారం చ తత్రైవ విశ్రుతం భరతర్షభ ।
తత్రాభిగమ్య ముచ్యేత పురుషో యోనిసంకటాత్ ॥ 95
ఆ ప్రదేశంలో యోనిద్వారతీర్థం ఉంది. అక్కడకు చేరితే యోని ద్వార సంకటాన్ని తిరిగి పురుషుడు పొందడు. (95)
కృష్ణశుక్లావుభౌ పక్షౌ గయాయాం యో వసేన్నరః ।
పునాత్యాసప్తమం రాజన్ కులం నాస్త్యత్ర సంశయః ॥ 96
రాజా! గయాతీర్థంలో కృష్ణశుక్లపక్షాలు రెంటియందు ఉంటే ఏడుతరాలు పవిత్రం చేసుకొంటాడు అనే మాట సత్యం. (96)
ఏష్టవ్యా బహవః పుత్రాః యద్యేకోఽపి గయాం వ్రజేత్ ।
యజేత వాశ్వమేధేన నీలం వా వృషముత్సృజేత్ ॥ 97
చాలా మంది పుత్రులను కనాలి. వారిలో ఒక్కడైనా గయాతీర్థానికి వెడతాడు. అశ్వమేధం చేస్తాడు, లేదా వృషోత్సర్జన మాచరిస్తాడు. (97)
తతః ఫల్గుం వ్రజేద్ రాజన్ తీర్థసేవీ నరాధిప ।
అశ్వమేధమవాప్నోతి సిద్ధిం చ మహతీం వ్రజేత్ ॥ 98
రాజా! మానవుడు ఫల్గుతీర్థానికి పోతే అశ్వమేధయాగ ఫలం పొంది, గొప్ప సిద్ధిని పొందుతాడు. (98)
తతో గచ్చేత రాజేంద్ర ధర్మప్రస్థం సమాహితః ।
తత్ర ధర్మో మహారాజ నిత్యమాస్తే యుధిష్ఠిర ॥ 99
మహారాజా! ఏకాగ్రచిత్తుడై మనుజుడు ధర్మప్రస్థ యాత్రను చెయ్యాలి. అక్కడ యమధర్మరాజు నిత్యం నివాసం ఉంటాడు. (99)
తత్ర కూపోదకం కృత్వా తేన స్నాతః శుచిస్తథా ।
పితౄన్ దేవాంస్తు సంతర్ప్య ముక్తపాపో దివం వ్రజేత్ ॥ 100
ఆ తీర్థంలో కూపజలంతో స్నానం చేసి పితరులను, దేవతలను పూజిస్తే, తర్పణం చేస్తే పాపాలు పోయి స్వర్గలోకం చేరతాడు. (100)
మతంగస్యాశ్రమస్తత్ర మహర్షేర్భావితాత్మనః ।
తం ప్రవిశ్యాశ్రమం శ్రీమత్ శ్రమశోకవినాశనమ్ ॥ 101
గవామయనయజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః ।
ధర్మం తత్రాభిసంస్పృశ్య వాజిమేధమవాప్నుయాత్ ॥ 102
అక్కడ ఆత్మజ్ఞానియైన మతంగమహర్షి ఆశ్రమం ఉంది. శ్రమను, శోకాన్ని నాశనం చేసే ఆ ఆశ్రమంలో ప్రవేశమాత్రంతో గవాయన యజ్ఞఫలం వస్తుంది. అక్కడ ధర్మరాజదర్శనం చేసిన నరుడు అశ్వమేధఫలాన్ని పొందుతాడు. (101,102)
తతో గచ్ఛేత రాజేంద్ర బ్రహ్మస్థానమనుత్తమమ్ ।
తత్రాభిగమ్య రాజేంద్ర బ్రహ్మాణం పురుషర్షభ ॥ 103
రాజసూయాశ్వమేధాభ్యాం ఫలం విందతి మానవః ।
రాజేంద్రా! అనంతరం సాటిలేని బ్రహ్మస్థానాన్ని చేరాలి. అక్కడ నెలకొన్న బ్రహ్మను చేరడంతో రాజసూయాశ్వమేధయాగఫలాలు పొందుతాడు. (103 1/2)
తతో రాజగృహం గచ్చేత్ తీర్థసేవీ నరాధిప ॥ 104
ఉపస్పృశ్య తతస్తత్ర కక్షీవానివ మోదతే ।
యక్షిణ్యా నైత్యకం తత్ర ప్రాశ్నీత పురుషః శుచిః ॥ 105
యక్షిణ్యాస్తు ప్రసాదేన ముచ్యతే బ్రహ్మహత్యయా ।
రాజా! తీర్థయాత్రికుడు అక్కడ నుండి రాజగృహానికి పోవాలి. అక్కడ స్నానం చేసి కక్షీవంతునితో సమానం అవుతాడు. ఆ తీర్థాన పవిత్రుడై యక్షిణీదేవి నైవేద్యం తినాలి. ఆ యక్షిణి అనుగ్రహ కారణంగా బ్రహ్మహత్యాపాతకానికి దూరం కాగలడు. (104, 105 1/2)
మణినాగం తతో గత్వా గోసహస్రఫలం లభేత్ ॥ 106
మణినాగ తీర్థానికి పోయి గోసహస్ర దానఫలం అందుకొంటాడు. (106)
తైర్థికం భుంజతే యస్తు మణినాగస్య భారత ।
దష్టస్యాశీవిషేణాపి న తస్య క్రమతే విషమ్ ॥ 107
తత్రోష్య రజనీమేకాం గోసహస్రఫలం లభేత్ ।
మణినాగ తీర్థప్రసాదం (నైవేద్యం, చరణామృతం) సేవిస్తే పాము కరిచినా విషం ఎక్కని స్థితి కలుగుతుంది. అక్కడ ఒక్కరాత్రి నివసిస్తే వేయిగోవుల దానఫలం వస్తుంది. (107)
తతో గచ్ఛేత బ్రహ్మర్షేః గౌతమస్య వనం ప్రియమ్ ॥ 108
అహల్యాయా హ్రదే స్నాత్యా వ్రజేత పరమాం గతిమ్ ।
అభిగమ్యాశ్రమం రాజన్ విందతే శ్రియమాత్మనః ॥ 109
రాజా! ఆ ప్రదేశం నుంచి బ్రహ్మర్షియైన గౌతమునికి ప్రియమైన వనానికి వెళ్ళాలి. అహల్యాహ్రదంలో స్నానం చేస్తే పరమగతులు లభిస్తాయి. గౌతమాశ్రమానికి పోయిన మనుజుడు ఆత్మసంపదను పొందుతాడు. (108,109)
తత్రోదపానం ధర్మజ్ఞ త్రిషు లోకేషు విశ్రుతమ్ ।
తత్రాభిషేకం కృత్వా తు వాజిమేధమవాప్నుయాత్ ॥ 110
ధర్మజ్ఞా! ముల్లోకాల్లో ప్రసిద్ధం అయిన ఉదపానం అనే ఒకనూయి ఉంది. దానిలో స్నానం చేస్తే అశ్వమేధయాగఫలాన్ని దక్కించుకొంటాడు. (110)
జనకస్య తు రాజర్షేః కూపస్త్రిదశపూజితః ।
తత్రాభిషేకం కృత్వా తు విష్ణులోకమవాప్నుయాత్ ॥ 111
అక్కడే రాజర్షి అయిన జనకుని నూయి కూడ ఉంది. దాన్ని దేవతలు సేవిస్తారు. అక్కడ స్నానం చేస్తే యాత్రికుడు విష్ణులోకానికి పోతాడు. (111)
తతో వినశనం గచ్ఛేత్ సర్వపాపప్రమోచనమ్ ।
వాజపేయమవాప్నోతి వాజపేయయాగాచరణఫలాన్నీ, సోమలోకాన్నీ పొందుతాడు. (112)
గండకీం తు సమాసాద్య సర్వతీర్థజలోద్భవామ్ ।
వాజపేయమవాప్నోతి సూర్యలోకం చ గచ్ఛతి ॥ 113
గండకీనది అన్ని తీర్థాల సంయోగంగా ఏర్పడింది. అక్కడ స్నానం చేసిన తీర్థసేవకుడు వాజపేయఫలాన్ని, సూర్యలోకాన్ని పొందుతాడు. (113)
తతో విశల్యామాసాద్య నదీం త్రైలోక్యవిశ్రుతామ్ ।
అగ్నిష్టోమమవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి ॥ 114
త్రిలోకప్రసిద్ధిని పొందిన విశల్యానదీ తటాన్ని చేరి స్నానం చేస్తే అగ్నిష్టోమఫలాన్ని, స్వర్గాన్ని పొంది సుఖిస్తాడు. (114)
తతోఽధివంగం ధర్మజ్ఞ సమావిశ్య తపోవనమ్ ।
గుహ్యకేషు మహారాజ మోదతే నాత్ర సంశయః ॥ 115
మహారాజా! ఆ ప్రదేశం నుంచి వంగదేశంలోని తపోవనంలో ప్రవేశిస్తే మరణానంతరం గుహ్యకుల లోకాన్ని చేరి శాశ్వతానందాన్ని అనుభవిస్తాడు. (115)
కంపనాం తు సమాసాద్య నదీం సిద్ధనిషేవితామ్ ।
పుండరీకమవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి ॥ 116
సిద్ధనిషేవితమైన కంపనానదీతీరం ఆశ్రయిస్తే పుండరీకయాగఫలం, స్వర్గఫలం పొందుతాడు. (116)
అథ మాహేశ్వరీం ధారాం సమాసాద్య ధరాధిప ।
అశ్వమేధమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్ ॥ 117
రాజా! తరువాత మహేశ్వరధారకు యాత్ర కొనసాగించి అశ్వమేధ యాగఫలాన్ని, కులోద్ధరణాన్ని సాధిస్తాడు. (117)
దివౌకసామ్ పుష్కరిణీం సమాసాద్య నరాధిప ।
న దుర్గతిమవాప్నోతి వాజిమేధం చ విందతి ॥ 118
రాజా! దేవపుష్కరిణీ తీర్థానికి పోయిన మనుజుడు ఎన్నడూ దుర్గతులను పొందక అశ్వమేధయాగఫలాన్ని పొందుతాడు. (118)
అథ సోమపదం గచ్ఛేద్ బ్రహ్మచారీ సమాహితః ।
మాహేశ్వరపదే స్నాత్వా వాజిమేధఫలం లభేత్ ॥ 119
బ్రహ్మచర్యం, జితేంద్రియత్వం పాటిస్తూ సోమపదతీర్థానికి పోయి అక్కడ ఉన్న మహేశ్వరపదతీర్థంలో స్నానమాచరిస్తే అశ్వమేధఫలాన్ని అందుకొంటాడు. (119)
తత్ర కోటిస్తు తీర్థానాం విశ్రుతా భరతర్షభ ।
కూర్మరూపేణ రాజేంద్ర హ్యసురేణ దురాత్మనా ॥ 120
మ్రియమాణా హృతా రాజన్ విష్ణునా ప్రభవిష్ణునా ।
తత్రాభిషేకం కుర్వీత తీర్థకోట్యాం యుధిష్ఠిర ॥ 121
పుండరీకమవాప్నోతి విష్ణులోకం చ గచ్ఛతి ।
రాజేంద్రా! ఆ ప్రదేశంలో ప్రఖ్యాతం అయిన తీర్థాల కోటి ఉంది. అది కూర్మరూపుడైన ఒక రాక్షసునిచే అపహరింపయత్నం చేయబడింది. శ్రీమహావిష్ణువు ఆ ప్రయత్నాన్ని నిరోధించి ఆ తీర్థాల్ని తిరిగి పైకి తీశాడు. తీర్థకోటిలో మునిగిన యాత్రికుడు పుండరీకయాగ ఫలాన్ని, పిమ్మట విష్ణులోకాన్ని చేరుకొంటాడు. (120 121 1/2)
తతో గచ్ఛేత రాజేంద్ర స్థానం నారాయణస్య చ ॥ 122
సదా సన్నిహితో యత్ర విష్ణుర్వసతి భారత ।
యత్ర బ్రహ్మాదయో దేవాః ఋషయశ్చ తపోధనాః ॥ 123
ఆదిత్యా వసవో రుద్రాః జనార్దనముపాసతే ।
శాలగ్రామ ఇతి ఖ్యాతః విష్ణురద్భుతకర్మకః ॥ 124
రాజేంద్రా! పిమ్మట నారాయణ స్థానాన్ని చేరాలి. అది విష్ణువు నివాసస్థానం. బ్రహ్మాదిదేవతలు, తపోధనులైన ఋషులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు అక్కడ జనార్దనుని ఉపాసిస్తారు. ఆ క్షేత్రంలో విష్ణువు సాలగ్రామనామంతో ప్రసిద్ధుడు. (122-124)
అభిగమ్య త్రిలోకేశాం వరదం విష్ణుమవ్యయమ్ ।
అశ్వమేధమవాప్నోతి విష్ణులోకం చ గచ్ఛతి ॥ 125
మూడులోకాలకు ప్రభువు, వరదాయకుడు, వినాశరహితుడు అయిన విష్ణువు సమీపానికి చేరి అశ్వమేధయాగఫలాన్ని, విష్ణులోకాన్ని పొందుతాడు. (125)
తత్రోదపానం ధర్మజ్ఞ సర్వపాపప్రమోచనమ్ ।
సముద్రాస్తత్ర చత్వారః కూపే సన్నిహితాః సదా ॥ 126
ధర్మజ్ఞా! సర్వపాపాల్ని పోగొట్టగల ఉదపానం అనే నుయ్యి అక్కడ ఉంది. నాలుగు సముద్రాలు ఆ కూపంలో సన్నిహితాలై ఉన్నాయి. (126)
తత్రోపస్పృశ్య రాజేంద్ర న దుర్గతిమవాప్నుయాత్ ।
అభిగమ్య మహాదేవం వరదం రుద్రమవ్యయమ్ ॥ 127
విరాజతి యథా సోమః మేఘైర్ముక్తో నరాధిప ।
జాతిస్మరముపస్పృశ్య శుచిః ప్రయతమానసః ॥ 128
ఆ ఉదపానంలో స్నానమాచరించినవాడు దుర్గతిని పొందడు. వరప్రదాయకుడు అవినాశి అయిన మహాదేవుని అర్చించి తీర్థయాత్రికుడు మేఘావరణం తొలగిన చంద్రునివలె ప్రకాశిస్తాడు. ఆ ప్రదేశంలో జాతిస్మరతీర్థం ఉంది. అందులో స్నానం చేసిన మానవునికి శరీరశుద్ధి, మనశ్శుద్ధి ప్రాప్తిస్తుంది. (127,128)
జాతిస్మరత్వమాప్నోతి స్నాత్వా తత్ర న సంశయః ।
మాహేశ్వరపురం గత్వా అర్చయిత్వా వృషధ్వజమ్ ॥ 129
ఈప్సితాన్ లభతే కామాన్ ఉపవాసాన్న సంశయః ।
తతస్తు వామనం గత్వా సర్వపాపప్రమోచనమ్ ॥ 130
అభిగమ్య హరిం దేవం న దుర్గతిమవాప్నుయాత్ ।
కుశికస్యాశ్రమమ్ గచ్ఛేత్ సర్వపాపప్రమోచనమ్ ॥ 131
ఆ తీర్థసేవనం చేత మనుజునికి పూర్వజన్మస్పృతి కలుగుతుంది. ఇది నిస్సందేహం. మాహేశ్వరపురం చేరి వృషధ్వజుని పూజిస్తే, ఉపవాసం చేస్తే మనోరథాలన్నీ తీరుతాయి. అటుపైన పాపాలను తొలగించగల వామనతీర్థానికి చేరి శ్రీహరిని దర్శిస్తే మనుజునికి దుర్గతులు కలుగవు. క్రమంగా పాపాలనన్నింటిని ఛేదించే కుశికుని ఆశ్రమం చేరాలి. (129-131)
కౌశికీం తత్ర గచ్ఛేత మహాపాపప్రణాశినీమ్ ।
రాజసూయస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః ॥ 132
పెద్దపెద్ద పాపాలను నాశింపచేసే కౌశికీనదీ తీర్థాన్ని ఆపై సేవించి, స్నానం ఆచరిస్తే రాజసూయయాగాన్ని చేసిన ఫలాన్ని సాధిస్తాడు. (132)
తతో గచ్ఛేత రాజేంద్ర చంపకారణ్యముత్తమమ్ ।
తత్రోష్య రజనీమేకాం గోసహస్రఫలం లభేత్ ॥ 133
అనంతరం ఉత్తమమైన చంపకారణ్యానికి యాత్ర సాగించాలి. ఆ ప్రదేశాన ఒకరాత్రి ఉపవాసం చేస్తే గోసహస్రదానఫలం అందుకొంటాడు. (133)
అథ జ్యేష్ఠిలమాసాద్య తీర్థం పరమదుర్లభమ్ ।
తత్రోష్య రజనీమేకాం గోసహస్రఫలం లభేత్ ॥ 134
పరమదుర్లభం జ్యేష్ఠిలతీర్థం. దాన్ని ఆశ్రయించి, ఒకరాత్రి ఉపవాసం ఉండి, వేయిగోవుల దానఫలం దక్కించుకొంటాడు. (134)
తత్ర విశ్వేశ్వరం దృష్ట్వా దేవ్యా సహ మహాద్యుతిమ్ ।
మిత్రావరుణయోర్లోకాన్ ఆప్నోతి పురుషర్షభ ॥ 135
త్రిరాత్రోపోషితస్తత్ర అగ్నిష్టోమఫలం లభేత్ ।
నరశ్రేష్ఠా! ఆ తీర్థంలో పార్వతీదేవితో కూడిన విశ్వేశ్వరుని దర్శించి మిత్రావరుణ లోకాలను చేరతాడు. మూడు రాత్రులు నిరాహారంతో ఉండి అగ్నిహోత్రఫలం పొందుతాడు. (135 1/2)
కన్యాసంవేద్యమాసాద్య నియతో నియతాశనః ॥ 136
మనోః ప్రజాపతేర్లోకాన్ ఆప్నోతి పురుషర్షభ ।
కన్యాయాం యే ప్రయచ్ఛంతి దానమణ్వపి భారత ॥ 137
తదక్షయ్యామితి ప్రాహుః ఋషయః సంశితవ్రతాః ।
నరోత్తమా! పిమ్మట ఉపవాసదీక్షతో, జితేంద్రియుడై కన్యాసంవేద్య తీర్థయాత్రచేసి ప్రజాపతి మనువుల లోకాన్ని చేరతాడు. కన్యాతీర్థంలో చేసిన చిన్నదానం అయినా శ్రేష్ఠం అని అక్షయం అని తపశ్శాలుల ఆశయం. (136,137 1/2)
నిశ్చీరాం చ సమాసాద్య త్రిషు లోకేషు విశ్రుతామ్ ॥ 138
అశ్వమేధమవాప్నోతి విష్ణులోకం చ గచ్ఛతి ।
యే తు దానం ప్రయచ్ఛంతి నిశ్చీరాసంగమే నరాః ॥ 139
తే యాంతి నరశార్దూల శక్రలోకమనామయమ్ ।
తత్రాశ్రమో వసిష్ఠస్య త్రిషు లోకేషు విశ్రుతః ॥ 140
నిశ్చీరానదీ తీర్థాన్ని చేరి, స్నానం చేస్తే అశ్వమేధఫలాన్ని పొంది పిమ్మట విష్ణులోకాన్ని చేరుకొంటాడు. నరులు నిశ్చీరాసంగమంలో దానం చేస్తే రోగశోకాలు లేని ఇంద్రలోకాన్ని చేరుతారు. అక్కడ త్రిలోకప్రసిద్ధమైన వసిష్ఠాశ్రమం ఉంది. (138-140)
తత్రాభిషేకం కుర్వాణః వాజపేయమవాప్నుయాత్ ।
దేవకూటం సమాసాద్య బ్రహ్మర్షిగణసేవితమ్ ॥ 141
అశ్వమేధమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్ ।
వసిష్ఠ తీర్థంలో స్నానం చేస్తే వాజపేయ యాగఫలాన్ని పొందుతాడు. బ్రహ్మర్షి గణసేవితమైన దేవకూటం చేరి అశ్వమేధయాగఫలాన్ని పొంది, వంశోద్ధరణం చేసుకొంటాడు. (141)
తతో గచ్ఛేత రాజేంద్ర కౌశికస్య మునేర్ర్హదమ్ ॥ 142
యత్ర సిద్ధిం పరాం ప్రాప్తః విశ్వామిత్రోఽథ కౌశికః ।
తత్ర మాసం వసేద్ వీర కౌశిక్యాం భరతర్షభ ॥ 143
రాజేంద్రా! తరువాత కౌశికుని కుండంలో స్నానమ్ చేసి కుశికనందనుని వలె ఉత్తమగతులను సాధిస్తాడు. ఆ కౌశికీ తీర్థంలో నెలరోజులు నివసించాలి. (142,143)
అశ్వమేధస్య యత్ పుణ్యం తన్మాసేనాధిగచ్ఛతి ।
సర్వతీర్థవరే చైవ యో వసేత మహాహ్రదే ॥ 144
న దుర్గతిమవాప్నోతి విందేద్ బహు సువర్ణకమ్ ।
అశ్వమేధయాగఫలాన్ని నెలరోజుల్లోనే పొందుతాడు. కౌశికీతీర్థంలో స్నానం చేస్తే దుర్గతులు పొందడు. చాల బంగారాన్ని గ్రహిస్తాడు. ( 144 1/2)
కుమారమభిగమ్యాథ వీరాశ్రమనివాసినమ్ ॥ 145
అశ్వమేధమవాప్నోతి నరో నాస్త్యత్ర సంశయః ।
యాత్రికుడు వీరాశ్రమనివాసియైన కుమారస్వామిని పూజించి అశ్వమేధఫలాన్ని పొందటంలో సందేహం లేదు. ( 145 1/2)
అగ్నిధారాం సమాసాద్య త్రిషు లోకేషు విశ్రుతామ్ ॥ 146
తత్రాభిషేకం కుర్వాణః హ్యగ్నిష్టోమమవాప్నుయాత్ ।
అటుపైన ప్రసిద్ధమైన అగ్నిధారను ఆశ్రయించి స్నానం చేస్తే యాత్రికునికి అగ్నిష్టోమ యాగాచరణఫలం వస్తుంది. (146 1/2)
అధిగమ్య మహాదేవం వరదం విష్ణుమవ్యయమ్ ॥ 147
వరప్రదానశీలి, దేవదేవుడు, అవ్యయుడు అయిన విష్ణువు సమిపానికి చేరి పూజించాలి. (147)
పితామహసరో గత్వా శైలరాజసమీపతః ।
తత్రాభిషేకం కుర్వాణః హ్యగ్నిష్టోమవాప్నుయాత్ ॥ 148
హిమాలయసమీపాన ఉన్న పితామహ సరోవరాన్ని చేరి స్నానం చేస్తే అగ్నిష్టోమయాగాచరణ ఫలం దక్కుతుంది. (148)
పితామహస్య సరసః ప్రస్రుతా లోకపావనీ ।
కుమారధారా తత్రైవ త్రిషు లోకేషు విశ్రుతా ॥ 149
పితామహసరోవరం నుంచి స్రవిస్తూ లోకాలను పవిత్రం చేయగల కుమారధార అనే తీర్థం మూడులోకాల్లో ప్రసిద్ధం. (149)
యత్ర స్నాత్వా కృతార్థోఽస్మీత్యాత్మానమవగచ్ఛతి ।
షష్ఠకాలోపవాసేన ముచ్యతే బ్రహ్మహత్యయా ॥ 150
అక్కడ స్నానం చేసిన మానవుడు తనను తాను కృతార్థునిగా తలుస్తాడు. అక్కడే ఉండి రోజులో ఆరవవేళ వరకూ ఉపవాసం చేస్తే బ్రహ్మహత్యాపాతకం చేసినా పోతుంది. (150)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ తీర్థసేవనతత్పరః ।
శిఖరం వై మహాదేవ్యాః గౌర్యాస్త్రైలోక్యవిశ్రుతమ్ ॥ 151
ధర్మజ్ఞా! తీర్థసేవనాసక్తి కలవాడై మహాదేవి గౌరీశిఖరాన్ని చేరుకోవాలి. అది చాలా ప్రసిద్ధం. (151)
సమారుహ్య నరశ్రేష్ఠ స్తనకుండేషు సంవిశేత్ ।
స్తనకుండముపస్పృశ్య వాజపేయఫలం లభేత్ ॥ 152
నరోత్తమా! ఆ శిఖరం పైకి ఎక్కి స్తనకుండాల్లో స్నానం చేయాలి. స్తనకుండాన స్నానం చేస్తే వాజపేయయాగఫలాన్ని గ్రహిస్తాడు. (152)
తత్రాభిషేకం కుర్వాణః పితృదేవార్చనే రతః ।
హయమేధమవాప్నోతి శక్రలోకం చ గచ్ఛతి ॥ 153
ఆ తీర్థంలో స్నానం చేసి పితరులను, దేవతలను పూజిస్తే మానవుడు అశ్వమేధయాగఫలాన్ని పొంది ఇంద్రలోక పూజితుడు అవుతాడు. (153)
తామ్రారుణం సమాసాద్య బ్రహ్మచారీ సమాహితః ।
అశ్వమేధమవాప్నోతి బ్రహ్మలోకం చ గచ్ఛతి ॥ 154
బ్రహ్మచర్యం, ఏకాగ్రచిత్తం కలిగి తామ్రారుణ తీర్థయాత్ర చేస్తే అశ్వమేధఫలాన్ని పొంది, క్రమంగా బ్రహ్మలోకాన్ని చేరతాడు. (154)
నందిన్యాం చ సమాసాద్య కూపం దేవనిషేవితమ్ ।
నరమేధస్య యత్ పుణ్యం తదాప్నోతి నరాధిప ॥ 155
రాజా! నందినీతీర్థంలో దేవసేవితమైన నుయ్యి ఉంది. అక్కడకు పోయి స్నానం చేస్తే నరమేధఫలాన్ని సాధిస్తాడు. (155)
కాలికాసంగమే స్నాత్వా కౌశిక్యరుణయోర్గతః ।
త్రిరాత్రోపోషితో రాజన్ సర్వపాపైః ప్రముచ్యతే ॥ 156
రాజా! కౌశికీ, అరుణానదుల సంగమంలో కాలికాసంగమంలో స్నానం చేసి మూడురాత్రులు ఉపవాసం చేస్తే అన్నిపాపాల నుంచి విముక్తుడు అవుతాడు. (156)
ఉర్వశీతీర్థమాసాద్య తతః సోమాశ్రమం బుధః ।
కుంభకర్ణాశ్రమం గత్వా పూజ్యతే భువి మానవః ॥ 157
తరువాత ఉర్వశీతీర్థం, సోమాశ్రమం, కుంభకర్ణాశ్రమం యాత్ర సాగించి మానవుడు భూతలంపై గౌరవాన్ని పొందుతాడు. (157)
కోకాముఖముపస్పృశ్య బ్రహ్మచారీ యతవ్రతః ।
జాతిస్మరత్వమాప్నోతి దృష్టమేతత్ పురాతనైః ॥ 158
కోకాముఖతీర్థాన స్నాతుడై బ్రహ్మచర్యం, ఇంద్రియనిగ్రహం వహిమ్చితే పూర్వజన్మస్పృతి పొందునను పురాతనుల అనుభవం. (158)
ప్రాఙ్నదీం చ సమాసాద్య కృతాత్మా భవతి ద్విజః ।
సర్వపాపవిశుద్ధాత్మా శక్రలోకం చ గచ్ఛతి ॥ 159
ప్రాఙ్నదీతీర్థాన్ని చేరడంతో ద్విజుడు కృతార్థతను పొందుతాడు. వాడు అన్ని పాపాల నుంచి శుద్ధుడై ఇంద్రలోకాన్ని చేరతాడు. (159)
ఋషభద్వీపమాసాద్య మేధ్యం క్రౌంచనిఘాదనమ్ ।
సరస్వత్యాముపస్పృశ్య విమానస్థో విరాజతే ॥ 160
తీర్థయాత్రికుడు పవిత్రం అయిన ఋషభద్వీపం, క్రౌంచనిఘాదన తీర్థాలకు పోయి సరస్వతీ తీర్థాన స్నానం చేస్తే విమానంపై ప్రకాశిస్తూ ఉంటాడు. (160)
ఔద్దాలకం మహారాజ తీర్థం మునినిషేవితమ్ ।
తత్రాభిషేక కృత్వా వై సర్వపాపైః ప్రముచ్యతే ॥ 161
మునిసేవితమైన ఔద్దాలకతీర్థం సేవించి స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి. (161)
ధర్మతీర్థం సమాసాద్య పుణ్యం బ్రహ్మర్షిసేవితమ్ ।
వాజపేయమవాప్నోతి విమానస్థశ్చ పూజ్యతే ॥ 162
బ్రహ్మర్షిసేవితం, పుణ్యప్రదం అయిన ధర్మతీర్థానికి పోయి వాజపేయ యాగాచరణ ఫలాన్ని పొంది, విమానంపై ఉండి పూజను పొందుతాడు. (162)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి పులస్త్యతీర్థయాత్రాయాం చతురశీతితమోఽధ్యాయః ॥ 84 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున పులస్త్యతీర్థయాత్ర అను ఎనుబది నాలుగవ అధ్యాయము. (84)